
ముంబైలోని విద్యావిహార్ సోమయ్య విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ సివిలేజనల్ స్టడీస్ ఉంది. ప్రసిద్ధ భాషావేత్త ప్రొ.గణేష్ దెవీ దానికి డైరక్టరుగా, డీన్ గా పనిచేస్తున్నారు. ఆయన ప్రపంచ సాహిత్యం నుంచి, ముఖ్యంగా, ప్రపంచ విజ్ఞానానికి చెందిన 28 పుస్తకాలు ఎంపికచేసి వాటిని మరాఠీలోకి అనువదించే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టారు. నిన్నా, మొన్నా దానికిసంబంధించి అనువాదకులతో ఒక వర్క్ షాపు నిర్వహించారు.
ఆ వర్క్ షాపులో ప్రారంభసదస్సుని క్లాసికల్ లాంగ్వేజెస్ గురించిన చర్చకి కేటాయించారు. ఇప్పుడు భారతదేశ భాషల్లో క్లాసికల్ స్టేటస్ అందిన భాషలు పదకొండుకి చేరాయి. వాటిల్లో అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాళీ, ప్రాకృతాలకి గత ఏడాది క్లాసికల్ ప్రతిపత్తి లభించింది. అప్పటికే సంస్కృతం, తమిళం, కన్నడం, తెలుగు, ఒడియా భాషలు క్లాసికల్ భాషలుగా గుర్తింపు పొందాయి కాబట్టి, ఆయా భాషలనుంచి ప్రతినిధుల్ని పిలిచి తమ భాషల చరిత్ర, ప్రస్తుత స్థితి, ఎదురుకుంటున్న సమస్యలు మొదలైనవాటి గురించి మాట్లాడించడం ఆ ప్రారంభ సదస్సు ఉద్దేశ్యం. ఆ ప్రణాళికలో భాగంగా తెలుగు భాషకి ప్రతినిధిగా నాకు ఆహ్వానం లభించింది.
శనివారం పొద్దున్న డా.గణేష్ దెవీ ఆధ్వర్యంలో జరిగిన ఆ సదస్సులో మరాఠీ, కన్నడ, ఒరియా, పాళీ భాషావేత్తలతో పాటు తెలుగు గురించి నేను కూడా మాట్లాడేను. ఆయా సాహిత్యాల గురించీ, సాహిత్య చరిత్రల గురించీ ఎంతో కొంత తెలిసి ఉన్నప్పటికీ, ఇలా ఆ భాషావేత్తల ద్వారా వినడం కొంత అంతర్దృష్టిని కలిగించింది. ముఖ్యంగా ప్రతి ఒక్క భాషావేత్తా తన భాష చరిత్ర చెప్తున్నప్పుడూ, తాము ప్రస్తుతం ఎదురుకుంటున్న సమస్యల గురించి చెప్తున్నప్పుడూ, మనం తెలుగు నేలమీద ఎదుర్కుంటున్న ప్రశ్నలు ఇప్పుడు ప్రధాన భారతీయ భాషలన్నీ ఏదో ఒక రూపంలో ఎదుర్కుంటూనే కుంటూనే ఉన్నాయని అర్థమయింది. ఉదాహరణకి ఇక్కడ తెలుగు అని అంటున్నప్పుడల్లా, తీరాంధ్రప్రాంతపు తెలుగునే గుర్తింపు పొందుతూ, ఆ సాహిత్యమే ప్రధాన భాషా సాహిత్యంగా చలామణి అవుతోందని, తాము అప్రధానీకరణకు లోనవుతున్నమనీ తెలంగాణా సాహిత్యకారులు చేస్తున్న వాదన లాంటిదే ఒడియా భాష పట్ల సంబల్ పురీ ప్రాంత ప్రజలు చేస్తూ ఉన్నారనీ, విశ్వవిద్యాలయాలు రూపొందిస్తున్న కన్నడ నిఘంటువుల్లో పుస్తకభాషకి ఉన్న ప్రాధాన్యత మాండలికాలకు ఉండటంలేదనీ నిన్న విన్నాను. అలాగే మాతృభాషని కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నవారిని దళితులూ, వెనకబడిన వర్గాల వారూ ప్రశ్నించడం కూడా దాదాపుగా భారతదేశమంతా ఒక్కలానే ఉంది. మాతృభాషని కాపాడాలనేవాళ్ళు తమ పిల్లల్ని ఇంగ్లిషు మీడియంలో చదివించుకుని తీరా వెనకబడ్డ వర్గాలు ఇంగ్లిషుమీడియంలో చదువుకోడానికి ముందుకురాగానే వారికి అడ్డుపడటం సముచితం కాదనీ, భాషల్ని కాపాడే బరువు తాము మాత్రమే ఎందుకు మొయ్యాలని ఆ సమూహాలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తున్నవారు, ఇంతదాకా అణగారి ఇప్పుడే వెలుగులోకి ప్రవేశిస్తున్న వర్గాలవారు, తెలుగునేలమీదనే కాదు, కన్నడ, ఒరియా, మరాఠీ ప్రాంతాల్లో కూడా కనబడుతున్నారని అర్థమయ్యింది . ప్రతి చోటా ఒక ప్రధాన భాష స్థానిక గిరిజనభాషల్ని పక్కకు నెట్టేస్తూ ఉన్న వైనం ఆంధ్ర, తెలంగాణాల్లోనే కాదు, ఆశ్చర్యంగా ఒరిస్సాలో కూడా కనబడుతున్నది. ఒడియాలో మొదటి నవల పందొమ్మిదో శతాబ్దంలోనే వచ్చి ఉండగా, గిరిజనుల మీద మొదటి నవల 1947 లోనే వచ్చి ఉండగా, మొదటి దళిత నవల మాత్రం ఇరవై ఒకటవ శతాబ్దానికిగానీ రాలేదని విన్నాను. అలానే రాష్ట్రజనాభాలో దాదాపు నాలుగో వంతు గిరిజనులు ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా ఒరిస్సాలో ఒక్క గిరిజనుడు కూడా తన గిరిజన మాతృభాషలోగాని, కనీసం ఒడియాలోగాని ఒక్క రచన కూడా వెలువరించలేదంటే వినడానికే బాధగా ఉంది. ఇక అన్నిటికన్నా నేను జీర్ణించుకోలేకపోయిన విషయం ఒకటుంది. అందరికన్నా ముందు ప్రసంగించిన మరాఠీ భాషావేత్త, పొరుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ భాషల్ని ప్రేమించినట్టుగా మహారాష్ట్రులు మరాఠీని ప్రేమించడంలేదంటూ, అలా తమ భాషలంటే ప్రాణం పెట్టే ప్రజల్లో తెలుగుభాషనీ, తెలుగువాళ్ళనీ కూడా లెక్కేసాడు! అంటే ఏమిటట? ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి భాషావేత్తా పొరుగురాష్ట్రాల్లో పరిస్థితి తమ కన్నా మెరుగని అనుకుంటున్నాడన్నమాట!
నా కన్నా ముందు మరాఠీ, ఒడియా, కన్నడ వక్తలు మాట్లాడినందువల్ల నేను చెప్పదలుచుకున్న విషయాలకి ఒక పూర్వరంగం సిద్ధంగా ఉందనిపించింది. ఎందుకంటే భారతీయ దేశభాషలు కొన్ని శతాబ్దాలు అటూ ఇటూగా ఒకే రకమైన ప్రయాణం చేస్తూ వచ్చేయనీ, ఇప్పుడు, ఈ ఆధునికానంతర యుగంలో ఈ భాషలన్నీ ఒక్కలాంటి సమస్యల్నే ఎదుర్కుంటున్నాయనీ వారి ప్రసంగాలు విన్నాక మరింత బాగా అర్థమయింది.
భారతీయ దేశభాషలు సా.శ.6-10 శతాబ్దాల మధ్య ప్రజల భాషలుగా వికసిస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో బారతదేశంలో ఏ ప్రాంతాన్ని పాలించే రాజవంశమూ కూడా ఆ ప్రాంతానికి స్థానికులే కాకపోవడంతో, వారు ప్రజామోదాన్ని చూరగొనే క్రమంలో, స్థానిక భాషల్ని పట్టించుకోవలసిన అవసరం తప్పలేదు. తెలుగునే తీసుకుంటే చాళుక్యులు స్థానికులు కారు. కాని దేశభాషల్ని ప్రోత్సహించవలసిన అవసరం గుర్తుపట్టినవాళ్ళు. అందుకని సా.శ పదోశతాబ్దందాకా తెలుగు మొదట్లో శాసనభాషగా ఆదరణ పొందింది. ఆ తర్వాత వెయ్యేళ్ళ పాటు అది కావ్యభాషగా ఎదిగింది. కానీ తెలుగుతో పాటే పుట్టిన తక్కిన ద్రావిడ-గిరిజన భాషలు శాసనభాషలుగా కూడా మారలేకపోయాయి. కాబట్టి వాటికి కావ్యభాషలుగా వికసించగలిగే చారిత్రిక అవకాశం దొరకలేదు. దాదాపుగా తమిళం, పాళీ తప్ప తక్కిన భారతీయ దేశభాషలన్నీ గత వెయ్యేళ్ళల్లో కావ్యభాషలుగా అత్యున్నత వికాసాన్ని చవిచూసాయి. ఆధునిక యుగం మొదలయ్యాక, అంటే 19-20 శతాబ్దాల్లో వాటిల్లో వచనరచన వికసించేక, కవిత్వం మాత్రమే కాక, ఇతర సాహిత్యప్రక్రియలు కూడా వికసించేయి. అయితే వాటన్నిటికీ వార్తాపత్రికలు ప్రధాన వాహికలుగా ఉంటూ వచ్చినందువల్ల, ఆధునికయుగంలో దేశభాషలు సమాచార, ప్రసార భాషలుగా రూపుదిద్దుకున్నాయి అని చెప్పవచ్చు. అలా సమాచార భాషలుగా రూపొందుతున్నప్పుడు దేశభాషలు గ్రాంథిక భాషలకీ, వ్యావహారిక భాషలకీ మధ్య ఒక ప్రామాణిక భాషను సృష్టించుకుంటూ వచ్చేయి. గత శతాబ్దంలో పాఠశాల విద్య పెద్ద ఎత్తున విస్తరించాక, ఆ ప్రామాణిక భాషాస్వరూపాలే బోధనాభాషలుగా కూడా మారాయి.
కాని ఈ పాతికేళ్ళుగా పరిస్థితి మారింది. ఇప్పుడు తెలుగుతో సహా ప్రధాన భారతీయ భాషలన్నీ గొప్ప సంక్షోభానికి లోనవుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రామాణిక భాషలు సమకాలిక ఉద్యోగ, ఉపాధి అవసరాలకు తగ్గట్టుగా ఎదిగినవి కావు. పందొమ్మిదో శతాబ్దిలో పాఠశాలల్లో బోధించవలసిన భాష గురించి వాదోపవాదాలు నడిచినప్పుడు ఈస్టిండియా కంపెనీకి మెకాలే ఒక ప్రతిపాదన చేసాడు. అదేమంటే తొలితరం భారతీయ విద్యార్థుల్ని ఇంగ్లిషు చదువులో నిష్ణాతుల్ని చేయగలిగితే, ఆ తర్వాత వారు తమ దేశభాషల్లో ఆ విజ్ఞానాన్ని విస్తరింపచేసుకుంటారు అని. కాని ఆ తొలితరంతో సహా, ఇప్పటిదాకా ఏ ఒక్క తరమూ కూడా తాము ఇంగ్లిషు ద్వారా నేర్చుకున్న సైన్సునీ, టెక్నాలజీని, సామాజిక శాస్త్రాలనీ దేశభాషల్లోకి తిరిగి అందించే బాధ్యత తలకెత్తుకోలేదు. దాంతో కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఆర్ట్స్ మాత్రమే ఉన్నతవిద్యగా కొనసాగినంతకాలం పెద్ద సమస్యగా అనిపించకపోయినా, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇతర టెక్నలాజికల్ కోర్సులు మొదలవగానే ఈ భాషలేవీ ఈ తరహా ఉన్నత విద్యకు సరిపోయేవి కావనే మెలకువ కలిగింది. ఈలోగా, ప్రపంచమంతా సంభవించిన కంప్యూటర్ విప్లవం వల్ల, డిజిటల్ సాంకేతిక పరికరాల వల్ల, ఇంగ్లిషు గ్లోబల్ భాషగా ఎదిగిపోయాక, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తమ పిల్లలకి ఇంగ్లిషు విద్యనే కోరుకోడం మొదలుపెట్టారు. దేశభాషా మాధ్యమాల్లో చదువు పట్ల మొత్తం సమాజానికే ఒక తృణీకారభావన ఏర్పడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కాబట్టి ఇప్పుడు తెలుగుతో సహా, ప్రధాన భారతీయ భాషలన్నీ ఒక సంధియుగంలో అడుగుపెట్టాయి. నా దృష్టిలో దేశభాషల చరిత్రలో ఇది నాలుగవ దశ. మొదటిదశ శాసన భాషా దశ, రెండో దశ కావ్యభాషాదశ, మూడవదశ సమాచార, ప్రసారమాధ్యమ దశ అని అనుకుంటే ఈ మూడవ దశలో ఇప్పుడు ఈ భాషల అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. అంటే దాని అర్థం ఈ భాషలు మరణిస్తాయని కాదు. ఇంతమంది భాషావ్యవహర్తలు ఉండగా, రాజకీయాలు, సమాచారప్రసార సాధనాలు, ఫిల్మ్, టెలివిజన్ వంటివి దేశభాషల్లో నడుస్తుండగా ఏ దేశభాషకీ మరణించే ప్రమాదం ఉందని ఎవ్వరూ అనలేరు. కాని అవి మరణిస్తున్నాయి కూడా.
మరణిస్తుంటాయంటే ఏ అర్థంలో? వాటిని రాజ్యమూ, ప్రభుత్వాలూ ఇంకెతమాత్రం పాలనాభాషలుగా, కావ్యభాషలుగా ఆదరించడం లేదు. ఇప్పుడు బోధనాభాషలుగా కూడా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలకు ఆవల నడుస్తున్న పాఠశాలల్లో అవి ఇప్పటికే మరణించేయి. ప్రజల దృష్టిలో ఈ దేశభాషలేవీ కూడా విలువైన భాషలు కావు. అలాగని ప్రజలు వీటిని ఆదరించడంలేదని కాదు. కాని ప్రజలు తమ మాతృభాషల నుంచి ఆశిస్తున్న అవసరాలు మారిపోయాయి. ఉదాహరణకి మన పత్రికలభాష చూడండి. ఇప్పుడు దాదాపుగా అన్ని పత్రికలూ కూడా ఒక గాసిప్ టోన్ ని అందిపుచ్చుకున్నాయి. కనీసం ముప్ఫై ఏళ్ళ కిందటిదాకా కూడా పత్రికల భాషలో ఒక గంభీర స్వరం, ఒక చైతన్యస్ఫోరక లక్షణం ఉండేవి. కాని ఇప్పుడు పత్రికలు పొలిటికల్ గాసిప్ కి కరపత్రాలుగా మారిపోయేయి. సైన్సూ, టెక్నాలజీ, సాంఘికశాస్త్రాలు వదిలిపెట్టండి, కనీసం సాహిత్యానికి కూడా పత్రికల్లో చోటులేదు. ఇక రాజకీయ భాష పూర్తిగా hate speech గా మారిపోయింది. సినిమాలూ, టెలివిజన్, రేడియో ఛానెళ్ళల్లో వినిపించే తెలుగుని ఇంగ్లిషు పదజాలం అధికశాతం ఆక్రమించడం ఒక సమస్యకాగా, దానికన్నా కూడా ఆ భాష ఒక వినోదకరాకభాషగా మారిపోవడం ఎక్కువ ఆందోళన కలిగించే విషయం. అందుకనే ఫిల్మ్, టివి, రేడియోల్లో ఒక సైన్సు గురించి గాని, సాహిత్యంగురించి గాని, సాంఘికశాస్త్రాల గురించి గాని చర్చలేకపోవడం ఆశ్చర్యమనిపించదు.
ఇదంతా ఏమి చెప్తోంది? దేశభాషలు తమ ప్రయాణంలో నాలుగవ దశలో అడుగుపెడుతున్నాయనీ, ఈ దశలో ప్రజలు ఈ భాషల్ని పొలిటికల్ గాసిప్ కీ, ఎంటర్ టెయిన్ మెంట్ కీ మాత్రమే వాడుకోడం మొదలుపెట్టారనే కదా. దీన్ని మనం surface level use అని అనుకుంటే, ఇంతకన్నా ఒక్క అంగుళం కూడా deeper engagement కి ఈ భాషల్ని వాడుకోడానికి ప్రజలు సిద్ధంగాలేరు. సాహిత్యాన్నే తీసుకోండి. ప్రజలు ఇంకా ఎక్కడేనా ఒకటీ అరా పుస్తకాలు కొంటే అవి పల్ప్ ఫిక్షన్ కి చెందినవే అయి ఉంటున్నాయి తప్ప, తాత్త్విక, భావనాత్మక, చింతనాత్మక సాహిత్యం కానే కాదు.
కాబట్టి మొన్న నా ప్రసంగం మొదలుపెడుతూనే నేను స్పష్టంగా చెప్పేసాను. నాకు నా భాషని క్లాసికల్ భాషగా గుర్తించారని సంతోషమేమీ లేదు. నిజానికి అది నా గతానికి గుర్తింపు. మహోన్నతులైన నా పూర్వకవిరచయితల నిరుపమాన కృషికి లభించిన గుర్తింపు అది. అది నా తండ్రితాతల ఘనత. అందులో నేను చేసింది ఏమీ లేదు. కాని నేను కోరుకునేది నా భాష క్లాసికల్ భాషగా కాదు, గ్లోబల్ భాషగా మారాలని. ఎందుకంటే అది నా భవిష్యత్తుకి సంబంధించిన కల. నా పిల్లల, పిల్లల పిల్లల భావిజీవితసంస్కృతికి సంబంధించిన కల.
ఇప్పుడు భారతీయ భాషలు ఆలోచించవలసింది, అన్నిటికన్నా ముందు తాము గ్లోబల్ భాషలుగా మారడమెలా అన్నదాని గురించి. ప్రొ.దెవీ తో సహా అక్కడున్న పండితుల ఆలోచన అంత దూరం లేదు. వాళ్ళు ప్రధాన భారతీయ భాషలకీ, మాండలికాలకీ మధ్య సయోధ్య కుదర్చడమెలా అన్నదాని గురించి ఆలోచిస్తున్నారు. ఒక భాషని రెండు రకాలుగా వాడుకునేటప్పుడు ఆ భాషని diglossia అని అంటారు. ఉదాహరణకి తెలుగులో గ్రాంథికం, వ్యావహారికం అని ఉన్నాయి. బెంగాలీలో చలిత్ భాష, సాధుభాష అని ఉన్నాయి. ప్రొ.దెవీ అనేదేమంటే కొన్ని భాషలు నిర్మాణరీత్యానే diglossic అని. ఉదాహరణకి జర్మన్, ఇంగ్లిషు. కాని రష్యన్ భాష ఎప్పటికీ డయాగ్లాసిక్ కాలేదంటాడు ఆయన. భారతీయ భాషల్లో కన్నడం ఎక్కువ డయాగ్లాసిక్ కాగా ఒడియా కి ఆ లక్షణం చాలా తక్కువ అంటాడు. అలా ఒక భాష రెండు విధాలుగా వినియోగంలోకి వస్తున్నప్పుడు పుస్తకభాష ప్రామాణిక భాషగా మారి, మాండలికాలు అప్రధానీకరణకు గురవుతాయనేది ఆయన చెప్తున్నది. కానీ భారతీయ భాషల్ని అర్థం చేసుకోడానికి ఈ విభజన ఏమంత ఉపకరించదు. ఆయన లెక్కలోనే అతి తక్కువ డయాగ్లాసిక్ అయినప్పటికీ, ఒడియా సంబల్ పురీనీ, గిరిజన భాషల్నీ పక్కకునెట్టేస్తూనే ఉందనికదా అంతసేపు ఆ ఒడియా పండితుడు చెప్తూ ఉన్నది.
నేను భావించేదంటే ‘ప్రధాన’ భాషకీ, మాండలికాలకీ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఏకకాలంలో రెండు రకాల ఉద్యమాలు నడవాలి. ఒకటి, మాండలికాల్లోంచి ( ప్రాంతీయ, వర్గ, వర్ణ, జాతి మాండలికాలన్నిటిలోనూ కూడా) విస్తృతంగా సాహిత్యం రావడం. రెండోది ‘ప్రధాన భాష’ ని కేవలం సాహిత్యానికే కాక, సాహిత్యేతర ప్రయోజనాలకోసం కూడా వాడుకోవడం. ఉదాహరణకి అనువాదాలు. మనమొక మరాఠీ దళిత రచనను తెలుగులోకి అనువదించాలనుకుమన్నామనుకోండి. అప్పుడు తప్పనిసరిగా, ప్రధాన భాష పక్కకు జరిగి వృత్తి, వర్ణ సంబంధ పదజాలానికి చోటునివ్వాల్సి ఉంటుంది. కేవలం వృత్తి రచయితలు మాత్రమే కాక, సమాజంలోని వివిధ పార్శ్వాలకూ, సమూహాలకూ చెందినవారు కూడా తమ అనుభవాల్ని గ్రంథస్థం చేయడం మొదలుపెట్టారనుకోండి. అప్పుడు కూడా ప్రధాన భాష పక్కకు జరిగి మాండలికాలు ముందుకు రాకతప్పదు. ఒకసారి మాండలికాలు బలపడటం మొదలవగానే భాషాకోశం విస్తృతమవుతుంది. భాషల మధ్య అంతరం తగ్గుతుంది.
ఇదంతా భాషల్లో అంతర్గతంగా జరగవలసిన పరివర్తన. కానీ ఒక భాష గ్లోబల్ భాషగా మారాలంటే మనం చేపట్టవలసిన ప్రయత్నాలు వేరే ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు సెంటర్ ఫర్ సివిలేజనల్ స్టడీస్ ప్రపంచ విజ్ఞానానికీ, సాహిత్యానికీ చెందిన క్లాసిక్స్ ని ఎంపికచేసి మరాథీలోకి అనువదించే పనికి పూనుకుటున్నది. కాని తెలుగులో పీకాక్ క్లాసిక్స్ తరఫున గాంధీగారు, అలకనంద తరఫున అశోక్ కుమార్ గారూ, ‘పొరుగునుంచి తెలుగులోకి’ సిరీస్ కింద డా.రఘురామరాజు గారు ఇరవయ్యేళ్ళ కిందటే తెలుగులో ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. తెలుగుని క్లాసికల్ భాషగా గుర్తించింది 2008 లో. కాని అప్పటికి అయిదేళ్ళ కిందటనే తెలుగుని ఒక తత్త్వశాస్త్రభాషగా రూపొందించే ప్రయత్నంలో భాగంగా నేను ‘సత్యాన్వేషణ’ పుస్తకం తీసుకొచ్చాను. అక్కడితో ఆగకుండా ప్లేటో, కాంట్, మార్కస్ అరీలియస్, బషొ, ఒకాకురో కకుజొ, వాల్ట్ విట్మన్ మొదలైనవారి రచనల్ని తెలుగులోకి అనువదించాను. నేను ఈ ప్రసంగం చేస్తున్న రోజునే ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ ‘వికసించిన విద్యుత్తేజం’ అనే పుస్తకాన్ని వెలువరించాను. కేవలం ప్రపంచాన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తే చాలదు, భారతదేశాన్ని కూడా తెలుగువాళ్ళకి పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటిదాకా గాంధి, టాగోర్, కలాం, కబీర్, బసవన్న, తమిళ ఆళ్వారు, నాయనార్ల సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకొచ్చాను. ఇప్పుడు తుకారాంని తెలుగులోకి తీసుకురావడం మొదలుపెట్టాను.
మొన్నటి ప్రసంగంలో ఈ విషయాలన్నీ వివరించేను. ఒక భాషను గ్లోబల్ భాషగా మార్చడమంటే, అన్నిటికన్నా ముందు వేరే భాషా వ్యవహర్తలు తాము నేర్చుకోడానికి ఉత్సాహం చూపించే భాషగా తెలుగుని అభివృద్ధిపరచడం. అందుకు చేయవలసిన పనులేమిటో వివరిస్తో 2018లోనే నేనొక వ్యాసం రాసాను. దాన్నిక్కడ చూడవచ్చు.
ఈరోజుకి కూడా అవే అంశాలు అంతే ముఖ్యంగా ఉన్నాయి.
మనం భాషని బతికించుకోవడంటే, దాన్ని గంభీర జీవితప్రయోజనాలకు వాడుకోదగ్గ భాషగా మార్చుకోవడం. పదకొండో శతాబ్దిలో నన్నయ చేసిందీ, ఇరవయ్యవ శతాబ్దిలో గురజాడ చేసిందీ అదే. ఇప్పుడు మళ్ళా అటువంటి చారిత్రిక బాధ్యత మనముందున్నది. ఈ అవకాశానికి మనం మేలుకోకపోతే తెలుగు భాష కేవలం కమేడియన్ల భాషగానూ, సోషల్ మీడియాలో ట్రోలర్ల భాషగానూ (అక్షరదోషాలూ, వాక్యదోషాలూ, ఆలోచనాదోషాలన్నిటితో సహా) మిగిలిపోయే ప్రమాదముంది. ఈ ప్రమాదం ఇప్పటికే తెలుగుభాషను చాలావరకూ కబళించేసింది. మనం మేలుకోకపోతే మన పిల్లలకి తెలుగు అంటే vulgar, hate tongue గా మాత్రమే మిగిలిపోయే పరిస్థితి తొందరలోనే రాకతప్పదు.
నా ప్రసంగం విన్నాక ప్రొ.దెవీ నా pain ను తాను అర్థం చేసుకోగలుగుతున్నానని సభాముఖంగా చెప్పాడు. 1950 నాటికి భారతీయ దేశభాషల్లో రెండో స్థానంలో ఉన్న తెలుగు, ఇప్పుడు 2011 నాటికి అయిదో స్థానానికి దిగజారిందనీ, ఇందుకు కారణం తెలుగువాళ్ళ జనాభా తగ్గడం కాదనీ, తెలుగుని తమ మాతృభాషగా క్లెయిమ్ చేసుకునేవారి సంఖ్యతగ్గడమేననీ కూడా ఆయన చెప్పాడు. తెలుగు అత్యున్నత కావ్యభాష, తాత్త్వికభాష, సంగీత భాష. కానీ ఆ భాషను మనం గాసిప్ కో లేదా క్రూడ్ కామెడీకో మాత్రమే వాడుకునే పరిస్థితులు రావడం పట్ల నా ఆవేదనని తాను అర్థం చేసుకోగలుగుతున్నానని స్పష్టంగా చెప్పాడు.
సమావేశం ముగిసేటప్పటికి నా మనసునిండా ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు సంచలిస్తూ ఉన్నాయి. మన పూర్వీకులు తెలుగుని కావ్యభాషగా ఒక గ్రీకుతో, లాటిన్ తో, చైనీస్ తో, సంస్కృతంతో, తమిళంతో సమానంగా నిలబడగల భాషగా తీర్చిదిద్దారు. ఇప్పుడు తెలుగుని ఇంగ్లిషు, స్పానిష్, జపనీస్ లాంటి భాషల్తో సమానంగా ఒక గ్లోబల్ భాషగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నామీద ఉందనీ అందుకు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేననీ నాకు నేను పదేపదే చెప్పుకుంటూనే ఉన్నాను.
3-2-2025


Thought provoking speech. Thank you for this post
ధన్యవాదాలు రాజుగారూ!
చాలా మంచి పోస్టు భద్రుడు గారు. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. చాలా కోణాల్ని స్పృశించారు. నిజంగా బాగా ఆలోచింపచేసే పోస్టు. చివర్లో మీరు చెప్పినట్టు
తెలుగుని కావ్యభాషగా సంస్కృతం, తమిళం , గ్రీకు, లాటిన్ , చైనీస్ భాషలతో సమానంగా నిలిపిన మన పూర్వీకుల అడుగుజాడలలో నడుస్తూ, ఇప్పుడు మన భాషని ఇంగ్లిషు, స్పానిష్, జపనీస్ లాంటి భాషల్తో సమానంగా ఒక గ్లోబల్ భాషగా తీర్చిదిద్దుదామనే బాధ్యత మీ మెడలో వేసుకుని కృషి చేస్తానని మీకు మీరే సంసిద్ధులవడం చాలా సంతోషం, గర్వం కలిగించింది.. మా వంతు ఉడుతాసాయం ఏమైనా వుంటే తప్పనిసరిగా చేయగలం.. యే మాత్రం సంకోచించకుండా ఆర్డర్ వెయ్యవలసిందిగా మనవి.
విజయసారథి జీడిగుంట.
ధన్యవాదాలు సార్!
అక్కడ నేను అంటే ఆ సమావేశంలో తెలుగు భాషకు ప్రతినిధిగా మాట్లాడాను కాబట్టి నేను. కానీ దాని అర్థం మనమంతా అనే.
శుభాస్య శీఘ్రం
మీ వెంట వుంటాం 🙏
ధన్యవాదాలు సార్
భాషమీద మీ పట్టు , భాష మీద ఉన్న గౌరవం , భాష సంస్కరణ పట్ల మీ దృక్పథాలు అనన్య సామాన్యాలు. ప్రశ్నకోసం జవాబు ఎదిరి చూస్తున్నట్లుగా ఉంది మీ వ్యాసం . వైయక్తిక గుర్తింపుకో , పురస్కార పౌనఃపున్యాలకో కాక సాహిత్యైక జీవనాలంబనగా భాష రూపు దిద్దుకున్నప్పుడు , పొల్లు , తాలు లేని నాణ్యమైన
భాష రూపుదిద్దుకుంటుంది . ఈ వ్యాసం సాహిత్యరంగంలోని ప్రతి వ్యక్తి చదవాలి . కాని ఎందరు చదువుతారన్నది ప్రశ్న. చదివినా లోనారసి భాషాభి వృద్ధికి కంకణం కట్టుకుంటారు?
ఏది ఏమైనా చదువుల తల్లి తెలుగు భాషకోసం వాళ్లాయనకు రికమెండ్ చేసి మీకు జన్మ కల్పించిందని నేను భావిస్తున్నాను. మీకు మనఃపూర్వక నమస్సులు
ఈ సహృదయ స్పందనకు సాష్టాంగ ప్రణామాలు.
శుభస్య శీఘ్రం
మీ వెంట వుంటాం
‘ఇప్పుడు తెలుగుని ఇంగ్లిషు, స్పానిష్, జపనీస్ లాంటి భాషల్తో సమానంగా ఒక గ్లోబల్ భాషగా తీర్చిదిద్దవలసిన బాధ్యత నామీద ఉందనీ అందుకు ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేననీ నాకు నేను పదేపదే చెప్పుకుంటూనే ఉన్నాను….’ – You can make it as a movement sir! All the best.
ధన్యవాదాలు సార్!