
అవధూత గీత మొత్తం ఎనిమిది అధ్యాయాలనీ, అందులో 289 శ్లోకాలున్నాయనీ చెప్పాను. అయితే అందులో ఎనిమిదో అధ్యాయం ప్రక్షిప్తమనే పండితులంతా భావిస్తూ ఉన్నారు. అందులో ఉన్న 28 శ్లోకాల్లో చివరి శ్లోకం దత్తాత్రేయులు ఈ గీతని నిర్మించారని చెప్పేది. మిగిలిన 27 శ్లోకాల్లోనూ 11 నుంచి 26 దాకా 16 శ్లోకాలు స్త్రీ ఆధ్యాత్మిక సాధన కి అడ్డు అని చెప్పే మాటలు. అవి ఏ విధంగా చూసినా అంతదాకా అవధూత గీత చెప్తూ వచ్చిన ద్వంద్వాతీతస్థితికి ఎంతమాత్రం పొసగని వాక్యాలు. మధ్యయుగాల ఆధ్యాత్మిక గ్రంథాల్లో స్త్రీనింద సహజంకాబట్టి ఎవరో ఒక సాధకుడు ఆ శ్లోకాల్ని అవధూత గీతకు అదనంగా చేర్చిపెట్టాడని ఊహించడం కష్టమేమీ కాదు. అందువల్ల రామకృష్ణ మిషన్ వారు ప్రచురించిన ఇంగ్లిషు అనువాదంలో ఎనిమిదో అధ్యాయంలో మొదటి పదకొండు శ్లోకాలకే అనువాదాన్నిచ్చారు. ఆ పదకొండు శ్లోకాల్లోనూ కూడా మొదటిది తప్ప తక్కిన పదిశ్లోకాలూ కూడా అవధూతని ఒక స్థితప్రజ్ఞుడి తరహాలో వర్ణించడానికి చేసిన సాధారణ ప్రవచనం. ఇక మొదటి శ్లోకం ఒకటీ ప్రశస్తమైన శ్లోకం.
త్వద్యాత్రయా వ్యాపకతా హతా తే
ధ్యానేన చేతః పరతా హతా తే
స్తుత్యా మయా వాక్పరతా హతా తే
క్షమస్వ నిత్యం త్రివిధాపరాధాన్
(తీర్థయాత్రలు చెయ్యడం ద్వారా నీ సర్వవ్యాపకత్వానికి భంగం కలిగించాను. ధ్యానం చెయ్యడం ద్వారా నీ చైతన్యసర్వవ్యాపత్వానికి భంగం కలిగించాను. నిన్ను స్తుతించడం ద్వారా వాక్కుతో అందుకోలేని నీ సత్యాన్ని భంగపరిచాను. ఈ మూడు అపరాధాలకీ నన్ను నిత్యం క్షమించు.)
అయితే ఇటువంటి శ్లోకం దత్తాత్రేయులు పలకుతారని అనుకోవడంలో ఔచిత్యం లేదని శంకర్ మోకాషి-పుణేకర్ అన్న మాటల్తో నేను కూడా ఏకీభవిస్తున్నాను.
కాబట్టి, అవధూత గీతకు నా తెలుగు అనువాదంలో ఎనిమిదో అధ్యాయాన్ని పూర్తిగా వదిలిపెట్టేసాను.
అవధూత గీత లోని సంస్కృతం చాలా వరకూ వ్యావహారిక సంస్కృతం. కాబట్టి సాధారణ ఆధ్యాత్మిక పాఠకుడు కూడా ఆ సంస్కృతశ్లోకాల్ని నేరుగా చదువుకుని వాటి తాత్పర్యం గ్రహించడం కష్టమేమీ కాదు.
అయితే చాలా పదజాలం పైకి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని లోతుగా చదివినప్పుడు, భారతదేశంలో అంతదాకా వికసించిన ఎన్నో దర్శనాలనీ, సంప్రదాయాల్నీ, యోగసాధనల్నీ సున్నితంగా విమర్శిస్తున్నట్టుగా గుర్తుపట్టవచ్చు. ఒక్క మొదటి అధాయంలోనే శ్లోకాలవారీగా అటువంటి విమర్శను శంకర్ మోకాషి-పుణేకర్ ఎత్తిచూపించాడు కూడా. అయితే అవేవీ తెలియకపోయినా, అంత లోతుగా ఆ శ్లోకాల్ని మనం పరిశీలించకపోయినా కూడా అవధూత గీత మనకు నేరుగా అందిస్తున్న సత్యాన్ని అందుకోవడంలో మనకేమీ ఇబ్బంది లేదు.
ఎందుకంటే తాను చెప్తున్న సత్యం మొత్తం మొదటి శ్లోకాల్లోనే గీతాకర్త చెప్పేసాడు. తక్కిన శ్లోకాలన్నీ ఆ సత్యాన్ని తిరిగి తిరిగి చెప్పడమే. అలాగని వాటిని మనం పునరుక్తి అనలేం. చక్కటి గురువు తన విద్యార్థులకి పాఠం చెప్పేటప్పుడు తాను చెప్పే అంశం వారి హృదయంలో లోతుగా నాటుకోడం కోసం పదే పదే reinforce చేస్తాడు. అవధూత గీత ఏడు అధ్యాయాలూ కూడా ఒక consistent reinforcement.
అందులో మనకి పదే పదే వినిపించే పదాలు జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహం, నిరంతరం, నిరంజనం, కేవలం, సహజం, సర్వం, ఏకం, సర్వగతం, శివం లాంటివి అవధూత గీతను తక్కిన ఆధ్యాత్మిక గ్రంథాలకన్నా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ పదజాలం వేదాంత పదజాలం కాదు. దీనికి అవధూత గీత చాలావరకూ నాథసంప్రదాయానికి ఋణపడి ఉంటుందనీ, ముఖ్యంగా ‘సిద్ధసిద్ధాంతపద్ధతి’, ‘గోరక్ష వచన సంగ్రహం’, ‘అకులవీరతంత్రా’లకు ఋణపడి ఉంటుందని శంకర్ మోకాషి-పుణేకర్ సవివరంగా ప్రతిపాదించాడు.
గోరక్షానాథుడు ప్రవచించిన పద్ధతుల్లోనూ, మత్స్యేంద్రనాథుడు ప్రవచించిన అకులవీరతంత్రంలోనూ తమ సమకాలిక దర్శనాల విమర్శ కనిపిస్తుంది. ముఖ్యంగా అకులవీరతంత్రంలో 5-9 శ్లోకాలు గమనించదగ్గవి. కానీ వాటికీ అవధూత గీతకీ మధ్య ప్రాథమికంగానే ఒక విభేదం ఉంది. తంత్రాలు సమకాలిక దర్శనాల్ని నిరసించాయి. కాని అవధూతగీతకి వాటిని నిరసించడం మీద దృష్టిలేదు. మనిషి తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు వాటన్నిటినీ దాటిపోతాడన్నదే (సర్వగతం) అవధూత గీత పదేపదే చెప్తూ ఉన్నది. ఆ విధంగా చూసినప్పుడు అవధూత గీత నాథసంప్రదాయాన్ని కూడా దాటిపోయిన రచనగా మనకి కనిపిస్తుంది.
అవధూత గీత అద్వైతగ్రంథంలా కనిపిస్తుందిగాని, అద్వైతం కాదు. ద్వైతమత ప్రవర్తకం కూడా కాదు. తాను చూస్తున్న సత్యం ద్వైతమూ, అద్వైతమూ రెండూ కాదని చెప్పడమే అవధూత గీతను ఒక విశిష్టరచనగా నిలబెడుతున్నది. ఆ ప్రభావమే తనమీద లేకపోయి ఉంటే, కబీరు ఇలా అని ఉండేవాడు కాడని చెప్పగలను. చూడండి (కబీర్ సాహెబ్ కీ శబ్దావలీ, 1-60):
నేను ధార్మికుణ్ణికాను, అధార్మికుణ్ణి కాను. యతిని కాను, కామిని కాను, నేనేదో ఒకటి చెప్పడానికి రాలేదు, వినడానికీ రాలేదు.
నేను సేవకుణ్ణి కాను, ఎవరికీ స్వామినీ కాను. నేను బందీని కాను, ముక్తుణ్ణీ కాను. ఏదో ఒకదానికి అంటిపెట్టుకున్నవాణ్ణీ కాను. అలాగని దేన్నుంచీ తెంచుకున్నవాణ్ణీ కాను.
నేనెవరినుంచీ వేరుపడి లేను. అలాగని ఎవరితోటీ కలిసిఉన్నవాణ్ణీ కాను. నేను నరకానికి వెళ్ళను. స్వర్గానికీ వెళ్ళను.
ప్రతి ఒక్కరికీ వాళ్ళ పనుల్లో సాయపడతాను. ఎవరి పనులకీ జవాబుదారీని కాను.
ఇది నా మతం. దీన్ని అర్థం చేసుకున్నవాళ్ళెంతమందో లేరు. ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు నిశ్చింతగా ఉండగలుగుతారు.
కబీరు దేనీ స్థాపించడు, దేన్నీ కూలదొయ్యడు.
కబీరు చాలావరకూ అవధూత వాక్యాలే మాట్లాడినప్పటికీ ఆయనలో ఒక సామాజిక సుధారకుడున్న విషయం కాదనలేం. కాని అవధూత గీత సంస్కరణ గ్రంథం కాదు. తానొక సత్యాన్ని దర్శించిన తరువాత అవధూత సమాజంలో ఏ విధంగా మెలగాలి, తన తోటిమనుషుల్ని ఏ విధంగా సరిదిద్దాలి అన్న ఆలోచన అవధూత గీతకు లేదు. అటువంటి ఆలోచనలేకపోవడం అవధూత గీత చెప్తున్న మనఃస్తితికి తగ్గట్టుగానే ఉంది కూడా.
అవధూత గీతకీ, తక్కిన ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ఉదాహరణకి, అద్వైతాన్నే తీసుకుందాం మధ్య పోలిక లేదు. తనకన్నా వేరొకటి మరొకటిలేదని భావించడం అద్వైతం. ఆ స్థితిలో మనిషికి preference ఉండదు. అతడు ప్రతి ఒక్క అనుభవాన్నీ సమానంగా స్వీకరిస్తాడు. కాని మరే అవలంబనా లేకుండా ఆ సత్యదర్శనంలోనే మనిషి నిరంతరంగా ఉండేదెట్లా? అది అవధూత గీత వేసుకున్న ప్రశ్న. ‘నిరంతరం’ అనేది అవధూత గీతలోని ఒక ముఖ్యపదం. మనం పొందే ఎరుక ఒక క్షణం మెరుపులాగా తటస్తించి తప్పిపోయేది కాకూడదు. ఒకసారి ఆ ఎరుక కలిగాక నువ్వందులోనే నిశ్చలుడిగా, నిరంతరం ఉండిపోవడమెట్లా? ఆ ఎరుకని బౌద్ధులూ, భగవద్గీతా కూడా ‘ప్రజ్ఞ’ అన్నాయి. బౌద్ధులు ఆ ప్రజ్ఞ సాధించడానికి ముందు శీలమూ, సమాధి అనే రెండుమెట్లు ఎక్కవలసి ఉంటుందన్నారు. ఆ ప్రజ్ఞలో నిలిచి ఉండేవాణ్ణి భగవద్గీత ‘స్థితప్రజ్ఞుడు’ అంది. గీతలోని రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో ఆ స్థితప్రజ్ఞుడెలా ఉంటాడో ఆ లక్షణాలు వర్ణించింది. కాని అవధూత గీత అటువంటిపని పెట్టుకోలేదు. స్థితప్రజ్ఞత ప్రత్యేకంగా సాధించేది కాదనీ, అది నీ సహజావస్థ అనీ, నువ్వు నీకది సహజస్థితి అని గ్రహించిన తరువాత ఆ స్థితి నీకు నిరంతరసాధ్యమవుతుందనీ అవధూత గీత ఎలుగెత్తి ఘోషిస్తున్నది.
సత్యసాక్షాత్కారం పొందినవాడి రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? అక్కడ అతడికి మూడు రకాల కర్మాలూ, అంటే, ప్రారబ్ధం, సంచితం, ఆగామి ఉండవనీ, కాని బయటినుంచి చూసేవాళ్ళకి జ్ఞాని ప్రారబ్ధం ఒకటి మాత్రం అనుభవిస్తున్నట్టు కనిపిస్తుందిగానీ, నిజానికి జ్ఞానికి అది కూడా ఉండదనీ వేదాంతులు చెప్తారు. కానీ ఆ స్థితి రసమయం అని మాత్రం వారెప్పుడూ చెప్పలేదు. కాని అవధూత గీత అవధూతను సమరసమగ్నుడని పదే పదే వర్ణించింది. అంటే సమరసంలో నిండామునిగి ఉన్నవాడు అని. అటువంటి స్థితిలో అతడు ఏం మాట్లాడితే అదే సత్యమని కూడా అంది. అటువంటి స్థితిలో మాట్లాడే మాటలు నిస్సారమైన సత్యాలుగా కాకుండా పునీతమైన భావాలుగా ఉంటాయని కూడా అంది. అటువంటి స్థితికి చేరుకున్నవాడి మాటల్లో ఛందస్సుకోసం, అలంకారాల కోసం వెతకవద్దు అని కూడా అంది.
సమరసం అంటే ఏమిటి? అన్నిటిపట్లా ఒక సమభావం కలిగిఉండటం సమత్వం. అదొక ఆనందస్థితిగా ఉండటం సమరసం. సమత్వం కలిగినవాడికి preference ఉండదు. ఏ అనుభవాన్నైనా అతడు సమానంగానే స్వీకరిస్తాడు. కాని సమరసంలో మునిగినవాడు ఆ అనుభవాల్ని సమానంగా స్వీకరించడమేకాదు, ఆనందంగా అనుభవంలోకి తీసుకుంటాడు. ఉదాహరణకి రూమీ రాసిన ఈ వాక్యాలు చూడండి:
మనిషిగా ఉండటమంటేనే
ఒక అతిథిగృహం తెరవడం.
ప్రతి ఉదయమూ ఒక కొత్త అనుభవం.
సంతోషం, దిగులు, లేకితనం
ఏదన్నాగానీ, ప్రతి భావావేశమూ
ఒక అనుకోని అతిథి.
ప్రతి ఒక్కర్నీ స్వాగతించు, ఆదరించు
సహస్రదుఃఖాలు నీ ఇంటిని చుట్టబెట్టి
వస్తువులన్నీ తల్లకిందులు
చేసేయే అనుకో-
అయినా స్వాగతించు అతిథుల్ని. ..
అటువంటి స్థితికి చేరుకోవడమేకాదు, ఆ స్థితిలోనే నిరంతరం ఉండగలిగినవాడు మాత్రమే తనని తాను ఆకాశంతో పోల్చుకోగలడు. ఆకాశం చూడండి. దానికి హద్దుల్లేవు, దానికి మధ్యలో ఎక్కడా పగులు ఉండదు, చీలిక ఉండదు, అంతరాయం ఉండదు. అది ప్రతి ఒక్కదానిలోనూ, ప్రతి ఒక్కదానిమీదా సమానంగా ఆవరిస్తుంది. ఆవరిస్తుందని అంటున్నామేగాని నిజానికి దానికి రూపం లేదు. రూపం ఉన్నట్టుగా కనిపిస్తుందిగాని, అది శూన్యం. కాని గొప్ప విషయమేమిటంటే ఆ శూన్యం మనకి నిస్సారమైన బోలుదనంగా కనిపించదు. మహాసౌందర్యభరితంగా, క్షణక్షణం చిత్రవర్ణశోభితంగా కనిపిస్తుంటుంది.
ఒక మనిషి నిజంగా ఆకాశం లాంటి వాడు కాగలిగితే! నిజానికి ఇది ఉపనిషదృషి కోరుకున్న స్థితినే. ఛాందోగ్యోపనిషత్తు ‘ఆకాశః పరాయణం’ (1-9-1) (ఆకాశమే అన్నిటికన్నామించి కోరుకోవలసింది) అని అన్నది. ఉపనిషదృషి మాటలు వమ్ము కాలేదు. ఆ ఋషి అటువంటి వాక్యం పలికిన నేలమీదనే తనని తాను ఆకాశంలాంటివాడని చెప్పుకున్న అవధూత గీత ప్రభవించింది. తన పూర్వప్రవక్తలు బోధించిన న్యాయసూత్రాల్ని పరిపూర్ణం చేయడానికే తాను వచ్చినట్టుగా యేసు ఒక మాట అంటాడు (మత్తయి, 5.17) ఉపనిషత్తులు ప్రవచించిన సత్యాన్ని పరిపూర్ణం చెయ్యడానికే అవధూత గీత వెలువడిందని తెలుస్తూనే ఉంది కదా!
నేనొక సారి ఆర్.ఎస్.సుదర్శనంగారిని ఒక ప్రశ్న అడిగాను. ‘మీకు ఎటువంటి ప్రశ్నలూ, సందేహాలూ లేవని అన్నారు కదా. అయినా మీకు రాయాలని ఎందుకు అనిపిస్తున్నది?’ అని. నేను ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు నా వెనక ఆధునిక యూరోప్ ఉంది. రొమాంటిసిజం నుంచి మాడర్నిజందాకా వికసించిన సాహిత్య ఉద్యమాల ప్రభావం ఉంది. అంటే ఒక మనిషి ఏదో ఒక లోటులోంచి, ఒక వెలితిలోంచి, ఒక వినష్టస్వర్గాన్నో, సౌందర్యాన్నో తిరిగి పోందాలన్న కోరికలోంచి మాత్రమే సాహిత్యసృష్టికి పూనుకుంటాడన్న ఉద్దేశ్యంలోంచి నేను ఆ ప్రశ్న అడిగాను. కాని ఆయన చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది. ‘నేను నా జీవితసంతోషాన్ని వ్యక్తం చెయ్యడానికి సాహిత్యసృజన చేస్తున్నాను. ఆ joy, ఆ joy of life. ఉపనిషత్తులు చెప్పింది కూడా అదే ‘ అని ఆయన అన్నారు.
అవధూత గీత ఆమూలాగ్రం ఒక జీవితానంద ప్రకటన. సంతోషం కానిదేదీ తన అనుభవంలోకి రాని మనిషి మాత్రమే చెప్పగల కవిత. ఈశావాస్య ఉపనిషత్తు ‘ఈశావాస్య మిదం సర్వం’ అంది. అంటే ఈ ప్రపంచంలో ఈశ్వరుడు నెలకొనని తావంటూ లేదని చెప్పడం. అవధూతగీత ఆ ఈశ్వరుణ్ణి ఆనందమయుడిగా, అమృతమయుడిగా అనుభవానికి తెచ్చుకుంది. కాబట్టే ‘జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహం’ అని పరమసంతోషంతో ప్రకటిస్తూ ఉన్నది.
అంతే సంతోషంతో ఈ తెలుగు అనువాదాన్ని నృసింహసరస్వతీ స్వామి పాదాలముందు సమర్పిస్తున్నాను. మీతోనూ పంచుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని తెలుగు చెయ్యాలని నా వెంటపడ్డందుకు గంగారెడ్డికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.
Featured image pc: Wikimedia commons
12-11-2024


Song of the free soul-
అవధూత గీత కు మీరు చేసిన అనువాదం బాగుంది. ధన్యవాదాలండీ 🙏
ధన్యవాదాలు మేడం
నమస్తే. అప్పుడే ముగిసిపోయిందా? ఇంకా ఉంటే …అనుకున్నా కానీ ఎలా వుంతుంది? చాలా గొప్పగా సులభ బోధకంగా అనువదించారు.ధన్యవాదాలు.గంగారెడ్డిగారికీ కృతజ్ఞతలు
ధన్యవాదాలు సార్!
ధన్య వాదాలు sir. ఇంత వరకు ఏడు అధ్యాయాల కి మీరు చేసిన అనువాదం వలన ఏమి తెలుసుకున్నామో, అంత
కంటే ఎక్కువ ఇవాళ ఎనిమిదో అధ్యాయం అనువదించడం లేదని చెప్తూ మీరు ఇచ్చిన వివరణ వలన తెలుసుకున్నాం అనిపిస్తోంది. అద్భుతం. నిజమే..నిరంతరం అనే పదం చాలా ముఖ్యం. కాస్త సాధన చేసిన మీదట ఎరుక కలగవచ్చు..కానీ దాన్ని కోల్పోకుండా నిరంతరం అదే ప్రజ్ఞ లో జీవించడం , అదే స్థితి లో ఉండడం.. ఎంత గొప్ప, ఆనందమయ స్థితి. వీరినే పరమహంసలని అంటారేమో! శ్రీ రామకృష్ణులు ఈ కాలం లో మనకు తెలిసి ఇటువంటి వ్యక్తి ఏమో? మరో సారి ధన్యవాదాలు సర్. మరిన్ని మంచి విషయాల కోసం ఎదురు చూస్తున్నాం.🙏🙏🙏🙏
ధన్యవాదాలు మేడం
ఈ తెలుగు అనువాదానికి మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే
ధన్యవాదాలు సార్
ఆకాశం చూడండి. దానికి హద్దుల్లేవు, దానికి మధ్యలో ఎక్కడా పగులు ఉండదు, చీలిక ఉండదు, అంతరాయం ఉండదు. అది ప్రతి ఒక్కదానిలోనూ, ప్రతి ఒక్కదానిమీదా సమానంగా ఆవరిస్తుంది. ఆవరిస్తుందని అంటున్నామేగాని నిజానికి దానికి రూపం లేదు. రూపం ఉన్నట్టుగా కనిపిస్తుందిగాని, అది శూన్యం. కాని గొప్ప విషయమేమిటంటే ఆ శూన్యం మనకి నిస్సారమైన బోలుదనంగా కనిపించదు. మహాసౌందర్యభరితంగా, క్షణక్షణం చిత్రవర్ణశోభితంగా కనిపిస్తుంటుంది.
ఈ వాక్యాలు పదే పదే చదివాను సర్. వేవేల నమస్కృతులు.
నమోనమః.
ధన్యవాదాలు
త్వద్యాత్రయా వ్యాపకతా హతాతే —
This was written by Appayya Deekshitulu garu.