
ఆరవ అధ్యాయం
3
మనస్సే అన్నిటినీ దాటినదీ, నిరంతరమైనది
విశాలం, అవిశాలం అనే భేదాలు లేనిది
మనస్సే నిరంతరం సమస్త శివప్రదమై ఉండగా
ప్రత్యేకంగా ఏమని తలచడం? ఏమని చెప్పడం?
4
అది దివారాత్రాలనే భేదాన్ని నిరాకరించేది
ఉదయాస్తమయాలనే భేదాల్ని నిరాకరించేది
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
సూర్యుడెక్కడ? చంద్రుడెక్కడ? జ్వలనమెక్కడ?
5
కామమూ, వికారమూ అనే భేదాల్ని దాటి ఉండగా
పనులు చెయ్యడం, చెయ్యకపోడమనే భేదం లేకపోగా
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
బయట అనీ లోపలనీ విడివిడిగా చెప్పడమెలాగ?
6
ఇది సారమనీ, ఇది నిస్సారమనీ చెప్పలేనప్పుడు
ఇది శూన్యమనీ, ఇది విశూన్యమనీ ఎంచలేనప్పుడు
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
ఇది మొదటిదనీ, ఇది చివరిదనీ చెప్పడమెలాగ?
7
ఇది భేదమనీ, ఇది విభేదమనీ చెప్పలేనప్పుడు
తెలుసుకునేవాడూ, తెలుసుకునేదీ అని ఎంచలేనప్పుడు
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
మూడోదెక్కడ? దాన్ని దాటి నాలుగోదెక్కడ?
8
గట్టిగా చెప్పిందీ, చెప్పనిదీ ఏదీ సత్యం కానప్పుడు
తెలిసిందీ, తెలియందీ కూడా సత్యం కానప్పుడు
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
విషయేంద్రియాలెక్కడ? మనసెక్కడ? బుద్ధి ఎక్కడ?
9
ఆకాశమూ, వాయువూ సత్యం కాదని తెలిసినప్పుడు
భూమీ, అగ్నీ కూడా సత్యం కాదని తెలిసినప్పుడు
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
మేఘాల మాట ఎక్కడ? సలిలాల మాట ఎక్కడ?
10
కల్పించుకున్న లోకాలన్నిటినీ నిరాకరిస్తుండగా
సృష్టించుకున్న దేవుళ్ళని కూడా నిరాకరిస్తుండగా
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
గుణదోషాలెక్కడ? వాటిని విచారించే బుద్ధి ఎక్కడ?
11
మరణాన్నీ, మరణంకాని దాన్నీ కాదంటూండగా
కారణాన్నీ, కారణాలకు కర్తనీ కాదంటూండగా
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
రావడం పోవడమంటూ దేని గురించి చెప్పడం?
12
ప్రకృతి అనీ పురుషుడనీ భేదం లేదని తెలిసీ
కార్యకారణాల మధ్య విభేదం లేదని తెలిసీ
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
పురుషుడనీ పురుషుడుకానివాడనీ చెప్పడమెలాగ?
13
దుఃఖం కొనితెచ్చే మూడోదంటూ లేదు
గుణాల్ని పైకితెచ్చే రెండోదంటూ లేదు
ఉన్నదొక్కటే సర్వశివప్రదమైనప్పుడు
వృద్ధుడెవడు? యువకుడెవడు? బాలుడెవడు?
14
దానికి వర్ణాశ్రమధర్మాలంటూ లేనప్పుడు
ఒక కర్తా, ఒక కారణమంటూ లేనప్పుడు
ఉన్నదొక్కటే సర్వశివప్రదమైనప్పుడు
లాభమెక్కడ? నష్టమనే మాట ఎక్కడ?
15
తినడం, తినకపోవడం రెండూ అసత్యాలైనప్పుడు
పుట్టడం, పుట్టకపోవడం రెండూ అసత్యాలైనప్పుడు
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
అది నశిస్తుందనిగాని, నశించదనిగాని ఎలా చెప్పడం?
16
పురుషుడూ, పురుషుడు కానివాడూ లేకపోగా
వనితా, వనిత కానిదీ అంటూ లేకపోగా
ఉన్నదొక్కటే సర్వశివప్రదమైనప్పుడు
రంజనమెక్కడ? రంజనలేకపోవడమెక్కడ?
17
అక్కడ మోహమూ, విషాదమూ లేనప్పుడు
అక్కడ సంశయమూ, శోకమూ లేనప్పుడు
ఉన్నదొక్కటే సర్వశివప్రదమైనప్పుడు
అహంకారమెక్కడ? మమకారమెక్కడ?
18
ధర్మాధర్మాలు రెండూ నశించేవి కాగా
బంధమోక్షాలు రెండూ నశించేవి కాగా
ఉన్నదొక్కటే సర్వశివప్రదమైనప్పుడు
అక్కడ దుఃఖవిదుఃఖాల ఆలోచన ఎక్కడ?
19
యజ్ఞమూ, యజ్ఞము కానిదనే విభాగం లేకపోగా
హుతాశనుడనీ, అర్పించే వస్తువులనీ లేకపోగా
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
చేసిన కర్మలు ఫలించడమనే మాటలెక్కడ?
20
అది సుఖదుఃఖాలనుంచి బయటపడ్డదని తెలిసి
అది గర్వాగర్వాలనుంచి బయటపడ్డదని తెలిసి
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
అనురాగ విరాగాల గురించిన ఆలోచన ఎక్కడ?
21
మోహమూ, విమోహమూ అనే వికారాలు లేకపోగా
లోభమూ, విలోభమూ అనే వికారాలు లేకపోగా
అన్నింటినీ దాటినదొక్కటే శివప్రదమై ఉండగా
అవివేక వివేకాల గురించిన ఆలోచన ఎక్కడ?
22
నువ్వు, నేను అనే మాటలెప్పటికీ లేవు
కులమూ, జాతీ అనే తలపులు అబద్ధాలు
శివుణ్ణీ, సర్వోన్నత సత్యాన్నీ నేనే కాగా
అక్కడ అభివందనమెవరికి? ఎలాగ?
సంస్కృతమూలం
షష్ఠాధ్యాయః
3
మన ఏవ నిరంతర సర్వగతం
హ్యవిశాలవిశాలవిహీన పరం
మన ఏవ నిరంతర సర్వ శివం
మనసాపి కథం వచసా చ కథమ్?
4
దినరాత్రివిభేదనిరాకరణ-
ముదితాతనుదితస్య నిరాకరణం
యది చైక నిరంతర సర్వశివం
రవిచంద్రమసౌ జ్వలనశ్చ కథమ్?
5
గతకామవికామవిభేద ఇతి
గతచేష్టవిచేష్ట విభేద ఇతి
యది చైక నిరంతర సర్వశివం
బహిరంతరభిన్నమతిశ్చ కథమ్?
6
యది సారవిసారవిహీన ఇతి
యదిశూన్యవిశూన్యవిహీన ఇతి
యది చైకనిరంతర సర్వశివం
ప్రథమం చ కథం చరమం చ కథమ్?
7
యది భేదవిభేదనిరాకరణం
యది వేదకవేద్యనిరాకరణం
యది చైక నిరంతర సర్వశివం
తృతీయం చ కథం తురీయం చ కథమ్?
8
గదితావిదితం న హి సత్యమితి
విదితావిదితం న హి సత్యమితి
యది చైక నిరంతర సర్వశివం
విషయేంద్రియబుద్ధిమనాంసి కథమ్?
9
గగనం పవనో న హి సత్యమితి
ధరణీ దహనో న హి సత్యమితి
యది చైక నిరంతర సర్వశివం
జలదశ్చ కథం సలిలం చ కథమ్?
10
యది కల్పితలోకనిరాకరణం
యది కల్పితదేవనిరాకరణం
యది చైకనిరంతర సర్వశివం
గుణదోషవిచారమతిశ్చ కథమ్?
11
మరణామరణం హి నిరాకరణం
కరణాకరణం హి నిరాకరణం
యది చైకనిరంతర సర్వశివం
గమనాగమనం హి కథం వదతి?
12
ప్రకృతిః పురుషో న హి భేద ఇతి
న హి కారణకార్యవిభేద ఇతి
యది చైకనిరంతర సర్వశివం
పురుషాపురుషం చ కథం వదతి?
13
తృతీయం న హి దుఃఖసమాగమనం
న గుణాద్ద్వితీయస్య సమాగమనం
యది చైకనిరంతర సర్వశివం
స్థవిరశ్చ యువా చ శిశుశ్చ కథమ్?
14
నను ఆశ్రమవర్ణవిహీన పరం
నను కారణకర్తృ విహీన పరం
యది చైకనిరంతర సర్వశివ-
మవినష్టవినష్ట మతిశ్చ కథమ్?
15
గ్రసితాగ్రసితం చ వితథ్యమితి
జనితాజనితం చ వితథ్యమితి
యది చైకనిరంతర సర్వశివ-
మవినాశి వినాశి కథం హి భవేత్?
16
పురుషాపురుషస్య వినష్టమితి
వనితావనితస్య వినష్టమితి
యది చైకనిరంతర సర్వశివ-
మవినోదవినోదమతిశ్చ కథమ్?
17
యది మోహవిషాదవిహీన పరో
యది సంశయశోకవిహీన పరః
యది చైకనిరంతర సర్వశివ-
మహమేతి మమేతి కథం చ పునః?
18
నను ధర్మవిధర్మవినాశ ఇతి
నను బంధవిబంధవినాశ ఇతి
యది చైకనిరంతర సర్వశివ
మిహదుఃఖవిదుఃఖమతిశ్చ కథమ్?
19
న హి యాజ్ఞిక యజ్ఞ విభాగ ఇతి
న హుతాశన వస్తువిభాగ ఇతి
యది చైక నిరంతర సర్వశివం
వద కర్మఫలాని భవంతి కథమ్?
20
నను శోకవిశోక విముక్త ఇతి
నను దర్పవిదర్పవిముక్త ఇతి
యది చైకనిరంతర సర్వశివం
నను రాగవిరాగమతిశ్చ కథమ్?
21
న హి మోహవిమోహ వికార ఇతి
న హి లోభవిలోభవికార ఇతి
యది చైకనిరంతర సర్వశివం
హ్యవివేకవివేక మతిశ్చ కథమ్?
22
త్వమహం న హి హంత కదాచిదపి
కులజాతివిచారమసత్యమితి
అహమేమ శివః పరమార్థ ఇతి
అభివాదనమత్ర కరోమి కథమ్?
Featured image pc: Wikimedia Commons
8-11-2024


సత్యమే ఈశ్వరుడు, పరమసత్యమే పరమేశ్వరుడు. నమస్సులు 🙏
ధన్యవాదాలు సోదరీ
శివోహం
నమస్సులు