
61
ప్రకాశిస్తూనే ఉంది ఈ సమస్త ప్రపంచం
ఎడతెగకుండా, ఎక్కడా తెంపులేకుండా!
ఆహా! ఎటువంటిది ఈ మాయ! రెండనీ
రెండుకాదనీ భ్రమలు కల్పిస్తూనే ఉన్నది.
62
అది సాకారమనీ, నిరాకారమనీ
‘ఇది కాదు’, ‘ఇది కాద’నీ చెప్తూనే ఉంటారు
భేదమూ, అభేదమూ అణగిపోయాక
ఉన్నదొక్కడే, కేవలం శివుడు.
63
నీకు తల్లిదండ్రుల్లేరు, బంధువుల్లేరు,
భార్యాబిడ్డల్లేరు, స్నేహితులు లేరు,
పక్షపాతం లేదు, విపక్షపాతం లేదు
ఇంక నీ మనసుకి కష్టమెందుకు కలగాలి?
64
మనసా! నీకు పగల్లేదు, రాత్రి లేదు
ఉదయించడం లేదు, అస్తమించడం లేదు
దేహమేలేని నీకు దేహభావననెందుకు
కల్పిస్తున్నారో పండితులు చెప్పు.
65
అది విభక్తంకాదు, అవిభక్తం కాదు
అది సుఖం కాదు, దుఃఖం కాదు
అది సర్వం కాదు, అసర్వమూ కాదు.
తరుగులేనివాడివి నువ్వు, తెలుసుకో.
66
నేను కర్తని కాను, భోక్తనూ కాను, గతంలో
చేసినపనుల్లేవు, ఇప్పుడు చెయ్యవలసినవీ లేవు.
దేహం లేదు, విదేహం లేదు. అయినా ఎందుకని
నాదనీ, నాదికాదనీ పదేపదే అనిపిస్తున్నది?
67
నాకు రాగాదిదోషాల్లేవు, దేహంవల్ల వచ్చే దుఃఖం లేదు
ఉన్నది నా ఆత్మ ఒక్కటే, ఆకాశసమానమని తెలుసుకో.
68
సఖుడా? ఎందుకీ వ్యర్థ సంభాషణలు? మిత్రుడా!
ఇదంతా మనస్సు తప్ప మరొకటి కాదు.
సారభూతమైన మాట చెప్తున్నాను విను
నువ్వే ఆ సారాంశానివి, ఆకాశంతో పోల్చదగ్గవాడివి.
69
ఎక్కడెక్కడ ఏ భావాలతో మరణిస్తున్నా యోగులైనవాళ్ళు
ఘటాకాశం మహాకాశంలో కలిసినట్టే లీనమవుతున్నారు.
70
తీర్థమైనా సరే, అంత్యజుడి ఇంట్లోనైనా సరే
జీవితకాలపు జ్ఞాపకాలు మర్చిపోయినా సరే,
సమభావచిత్తంతో మరణించినవాడు విముక్తుడు,
చివరికి ఆ ఒకే ఒక్క సత్యంలో లీనమవుతాడు.
71
ధర్మార్థ కామమోక్షాలు, ద్విపదాలు, చరాచరాలన్నీ
యోగుల దృష్టిలో ఎండమావి నీళ్ళతో సమానం.
72
గతంలో చేసిన పనులు, ఇప్పుడు చేస్తున్నవి, రేపు చెయ్యబోయేవి
ఏవైనాగానీ, అనుభవించేది నేను కాదన్నది నాకైతే స్పష్టంగా ఉన్నది.
73
శూన్యకుటీరంలాంటి ఈ ప్రపంచంలో సమరస
తత్త్వంతో పవిత్రుడై ఒక్కడే సుఖంగా కూచుని
ఉంటాడు అవధూత. దిగంబరుడు, సమస్తం తన
ఆత్మలోనే ఉందని తెలుసుకున్న నిగర్వ సంచారి.
74
ధర్మార్థకామాలతో పాటు మోక్షం లేని తావే తానని తెలిసినవాడు
ధర్మాధర్మాలు లేనిదెక్కడో అక్కడ బద్ధుడెవరు? ముక్తుడెవరు?
75
ఛందోలక్షణాలతో కూడుకున్న మంత్రమా?
తెలిసినవాడు కాడు. తంత్రమా? తెలియదు.
సమరసతత్త్వంలో మునిగి పరిశుద్ధుడైన
అవధూత ఏది పలికితే అదే పరమమంత్రం.
76
సమస్తం శూన్యం, అశూన్యం కూడా
నిజానికి సత్యం లేదు, అసత్యం లేదు
నా స్వభావత నాకు తెలిసింది చెప్పాను
శాస్త్రాలు తెలుసుకున్నా చెప్పేదీ ఇదే.
రెండవ అధ్యాయం
1
గురువుని బాలుడనీ, విషయభోగరతుడనీ, మూర్ఖుడనీ
సేవకుడనిగానీ, గృహస్థుడనీ తప్పుగా తలవకు.
అశుభ్రమైన ప్రదేశంలో ప్రవేశించినంతమాత్రాన
రత్నాన్ని వదులుకునేవాళ్ళుంటారా ఎవరేనా?
2
గురువుమాట్లాడే మాటల్లో కవిత్వంకోసం వెతక్కు
గ్రహించవలసింది ఆ మాటల్లో సారాన్ని, సత్యాన్ని.
ఆ పడవ చూడు, దానికి రంగుల్లేవు, సొగసైన బొమ్మల్లేవు
అయితే ఏమిటట! అవతలి ఒడ్డుకు దాటించడం లేదా!
3
ప్రయత్నేమీలేకుండానే చలించేదీ, చలించనిదీ
స్వభావతః శాంతం కాబట్టే చైతన్యం గగనోపమం.
4
అప్రయత్నంగానే చరాచరాలన్నిటినీ
ఒక్కటిగా ఒక్కలానే సంచలింపచేస్తున్న
ఆ సర్వవ్యాపక అద్వైత స్వరూపం
నాపట్ల మరొకలా ఎలా ప్రవర్తిస్తుంది?
సంస్కృత మూలం
61
స్ఫురత్యేవ జగత్కృత్స్నమఖణ్డితనిరన్తరమ్
అహో మాయామహామోహో ద్వైతాద్వైతవికల్పనా .
62
సాకారం చ నిరాకారం నేతి నేతితి సర్వదా
భేదాభేదవినిర్ముక్తో వర్తతే కేవలం శివః
63
న తే చ మాతా చ పితా చ బంధుః
న తే చ పత్నీ న సుతశ్చ మిత్రమ్
న పక్షపతి న విపక్షపాతః
కథం హి సంతప్తిరియాం హి చిత్తే.
64
దివా నక్తం న తే చిత్తం ఉదయాస్తమయౌ న హి
విధేహస్య శరీరత్వం కల్పయన్తి కథం బుధాః
65
నావిభక్తం విభక్తం చ న హి దుఃఖసుఖాది చ
న హి సర్వమసర్వం చ విద్ధి చాత్మానమవ్యయమ్.
66
నాహం కర్తా న భోక్తా చ న మే కర్మ పురాధ్యధునా
న మే దేహో విధేహో వా నిర్మమేతి మమేతి కిమ్.
67
న మే రాగాదికో దోషో దుఃఖం దేహాదికం న మే
ఆత్మానం విద్ధి మామేకం విశాలం గగనోపమమ్.
68
సఖే మనః కిం బహుజల్పితేన్
సఖే మనః సర్వమిదం వితర్క్యమ్
యత్సారభూతం కథితం మయా తే
త్వమేవ తత్త్వం గగనోపమోయసి.
69
యేన కేనాపి భావేన్ యాత్ర కుట్ర మృతా అపి
యోగినస్తత్ర లియన్తే ఘటాకాశమివామ్బరే.
70
తీర్థే చాన్త్యజగేహే వా నష్టస్మృతిరపి త్యజన్
సమకాలే తనుం ముక్తః కైవల్యవ్యాపకో భవేత్
71
ధర్మార్థకామమోక్షాంశం ద్విపదాదిచరాచరమ్
మన్యన్తే యోగినః సర్వం మరీచిజలసన్నిభమ్
72
అతితానాగతం కర్మ వర్తమానం తథైవ చ
న కరోమి న భుఞ్జామి ఇతి మే నిశ్చలా మతిః
73
శూన్యాగారే సమరసపూత-
స్తిష్ఠన్నేకః సుఖమవధూతః
చరతి హి నగ్నస్త్యక్త్వా గర్వం
విన్దతి కేవలమాత్మని సర్వమ్.
74
త్రితయతురీయం నహి నహి యాత్ర
విన్దతి కేవలమాత్మని తత్ర
ధర్మాధర్మౌ నహి నహి యాత్ర
బద్ధో ముక్తః కథమిః తత్ర.
75
విన్దతి విందతి నహి నహి మంత్రం
ఛన్దోలక్షణం నహి నహి తంత్రమ్
సమరసమగ్నో భావితపూతః
ప్రలపితమేతత్పరమవధూతః
76
సర్వశూన్యమశూన్యం చ సత్యాసత్యం న విద్యతే
స్వభావభావతః ప్రోక్తం శాస్త్రసంవిత్తిపూర్వకమ్
అథ ద్వితీయోధ్యాయః
1
బాలస్యవా విషయభోగ రతస్యవా పి మూర్ఖస్య
సేవకజనస్య గృహస్థితస్య
ఏతద్గురోః కిమపి నైవ న చిన్తనీయం రత్నం
కధం త్యజతి కోప్య శుచౌ ప్రతిష్ఠమ్.
2
నైవాత్రకావ్యగుణ ఏవతుచిన్తనీయో
గ్రాహ్యః పరం గుణవతా ఖలు సార ఏవ
సిన్దూరచిత్రరహితా భువి రూపశూన్యా
పారం న కిం నయతి నౌరిహ గన్తుకామాన్.
3
ప్రయత్నేన వినా యేన నిశ్చలేన చలాచలమ్
గ్రస్తం స్వభావతః శాన్తం చైతన్యం గగనోపమమ్
4
అయత్నాచ్చాలయేద్యస్తు ఏకమేవ చరాచరమ్
సర్వగం తత్కధం భిన్నమద్వైతం వర్తతే మమ.
దీపావళి, గాణ్గాపూర్, 31-10-2024


ఎంత అద్భుతమైన భావచిత్రాలు.
ఆ సర్వవ్యాపక అద్వైత స్వరూపం
నాపట్ల మరొకలా ఎలా ప్రవర్తిస్తుంది.
🙏
ధన్యవాదాలు సోదరీ!
🙏🙏🙏
సమరసతత్త్వంలో మునిగి పరిశుద్ధుడైన
అవధూత ఏది పలికితే అదే పరమమంత్రం
ధన్యవాదాలు