అవధూత గీత-4

దత్తాత్రేయుల్ని మహాభారతం ఒక ఋషిగా చిత్రిస్తే, పురాణాలు ఆయన్ని మొదట్లో ఒక జ్ఞానయోగిగా చిత్రిస్తూ నెమ్మదిగా ఆయన్ని ఒక విష్ణ్వాతారంగా చూడటం మొదలుపెట్టాయి. మత్య్స పురాణం దశావతారాల్లో పరశురామ అవతారం బదులు దత్తావతారాన్ని విష్ణువు తాలూకు ఆరవత అవతారంగా చూపించింది. భాగవత, గరుడ, అగ్ని, బ్రహ్మ పురాణాల్తో పాటు దేవీ భాగవతం కూడా దత్తాత్రేయుల్ని ఇరవై రెండు అవతారాల్లో ఒకరిగానో లేదా విష్ణు ప్రాదుర్భావ రూపాల్లో ఒకరిగానో చూపించాయి. అలానే భగవద్గీతకు మూలం అని చెప్పే అహిర్బుధ్న్య సంహితకు మూలం అని చెప్పదగ్గ సాత్త్వత సంహిత కూడా దత్తాత్రేయుల్ని ఇరవై అయిదవ ప్రాదుర్భావంగా పేర్కొంది. ఆయన ప్రహ్లాదుడికి కూడా బోధించినట్టుగా వైష్ణవ గ్రంథాలు పేర్కొన్నాయి. ఒక యోగిగా దత్తాత్రేయుల్ని చూడటం వెనుక అవైదిక- శైవ మూలాలు ఉన్నాయనుకుంటే, ఆయన్ని నెమ్మదిగా వైష్ణవ దేవతగా స్వీకరించి, సొంతం చేసుకునే ప్రయత్నాలు పురాణాలు చేపట్టాయని మనం గ్రహించవచ్చు.

ఇక ఆ తరువాత వచ్చిన ఎన్నో ఉపనిషత్తులు, అంటే ప్రధానమైన పదకొండు ఉపనిషత్తులూ కాక, చిన్న ఉపనిషత్తులు, యోగ ఉపనిషత్తులుగా, సన్న్యాస ఉపనిషత్తులుగా భావించేవి దత్తాత్రేయుల్ని మళ్ళా ఒక పరమయోగిగా, ఆచార్యుడిగా ప్రతిపాదించడం మొదలుపెట్టాయి. దర్శన, శాండిల్య, జాబాల, దత్తాత్రేయ ఉపనిషత్తులతో పాటు మరెన్నో ఉపనిషత్తుల్లో దత్తాత్రేయులు ఒక ఆదిగురువుగా కనిపించడం మొదలుపెట్టారు. ఆయన్ని తపోధనుడనీ, మునిశ్రేష్టుడనీ, మహాముని అనీ, యోగ-విత్ అనీ, యోగీశ్వరుడనీ, యోగయుక్తుడనీ మార్కండేయ పురాణం పేర్కొన్నదానికి అనుగుణంగానే ఆ ఉపనిషత్తులన్నీ దత్తాత్రేయ బోధనల్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసాయి.

అయితే పురాణాలు ఆయన్ని ఎంత ఆచారపరుడిగా, వ్యవస్థారక్షకుడిగా చిత్రించడానికి ప్రయత్నిస్తూ వచ్చినా దత్తాత్రేయుల్లోని మరొక పార్శ్వం కూడా మొదణ్ణుంచీ దాగకుండా కనిపిస్తూనే ఉంది. ఏ సామాజిక నియమనిబంధనలకీ కట్టుబడని ఒక స్వేచ్ఛాగామిగా ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. ఆయన్ను ఈ పార్శ్వంలో ‘వికృతాచారుడి’గా పేర్కొంటూ, ఆయన ఒక చేత ఒక స్త్రీని మరొక చేత మద్యపాత్ర ధరించి దేవతలకు కనిపించాడని మార్కండేయ పురాణమే పేర్కొంది. కానీ ఆ రూపం ఆయన అసలు రూపం కాదని తమకు తెలుసనీ, తమని భ్రమిపంచేయడానికే ఆయన అటువంటి బాహ్యరూపంలో ప్రత్యక్షమయ్యారని తాము గుర్తుపట్టామనీ, కాబట్టి తమని అనుగ్రహించి రాక్షసబాధ నుంచి తప్పించమని దేవతలు ఆయన్ని వేడుకుంటారు.

ఇక్కడ ఈ ‘వికృతాచార’ లక్షణం నిజానికి దత్తాత్రేయుల్లోని డయొనీషియన్ పార్శ్వం. అంటే అప్పటికే ఆయన్ని సమాజంలో రెండు వర్గాలు తమవాడిగా భావిస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించాలనుకునే సనాతన వర్గం, రెండోది అటువంటి కట్టుబాట్లకీ, ఆచారవ్యవహారాలకీ అతీతమైన, ఏ చట్రంలోనూ ఇమిడ్చిపెట్టలేని ఒక స్వతంత్ర రూపాన్ని అనుసరించే వర్గం.

సత్యాన్ని దర్శించి దాన్ని తిరిగి ప్రజలకు అందించడంలో దార్శనికులు ప్రపంచమంతటా కూడా రెండు విధాలుగా ఉన్నారు. యూరోప్ లో వారిని philosophers అనీ mystics అనీ వ్యవహరించేరు. మొదటి తరహా దార్శనికులు తాము చూసినదాన్ని ఈ ప్రపంచానికి అర్థమయ్యే భాషలో, భావజాలంలో, ఒక పద్ధతి ప్రకారం బోధించడానికి ప్రయత్నిస్తారు. తాము దర్శించిన సత్యాన్ని అలా ఒక భాషలో పెట్టడానికి వీలుకాదని తెలిసినప్పటికీ వాళ్ళు దాన్ని తార్కికంగా ప్రతిపాదించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని మిస్టిక్స్ అలా కాదు. వారు తాము చూసినదాన్ని తమకు నచ్చినపద్ధతిలో, తమకు వచ్చిన భాషలో, తమకు ఎలా తోస్తే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఒక క్రమపద్ధతిలో కాకుండా తోటిమనుషుల్తో పంచుకుంటూ ఉంటారు.

భారతీయ సంప్రదాయాల్లో ఈ ఇద్దరినీ ‘ఆచార్యులూ’, ‘గురువులూ’ అని పిలుస్తారని పరమాచార్య అన్నారు. ఆచార్యులు తమకు తెలిసినదాన్ని ఒక క్రమపద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు బోధించినట్టుగా బోధించడానికి ప్రయత్నిస్తారు. శంకర, రామానుజ, మధ్వ, వల్లభ మొదలైన వారందరినీ ఆచార్యులని పిలవడానికి అదే కారణం. కాని గురువులు అలా కాదు. వారికి ఒక సిలబస్, కరికులం అంటూ ఉండవు. వారి భాష చాలా సార్లు సాంధ్యభాష. ఇంకా చెప్పాలంటే వారికి భాషతో కూడా పనిలేదు. కేవలం వారి ఉనికినే ఎన్నో సందేహాల్ని పటాపంచలు చేస్తుంది. దక్షిణామూర్తి మొదలుకుని చైతన్యులు, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి దాకా ఇటువంటి గురుపరంపరకి చెందినవాళ్ళు.

దత్తాత్రేయుల స్వరూపంలోని ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఏకకాలంలో ఆచార్యులూ, గురువూ కూడా. శైవ, వైష్ణవ మతాలు, పురాణాలూ, ఉపనిషత్తులూ ఆయనలోని ఆచార్య తత్త్వాన్ని ప్రకటిస్తే, ఆ సంప్రదాయాలకు ఆవల ఉండే ఎన్నో ప్రజాసంప్రదాయాలు ఆయన్ని గురువుగా భావించాయి. స్థూలంగా చెప్పాలంటే వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడాలనుకునే బ్రాహ్మణ సంప్రదాయాలు ఆయన్ని ఒక అవతారంగా, ఆచార్యుడిగా ప్రతిపాదిస్తే, వర్ణాశ్రమ ధర్మాన్ని ధిక్కరించి, దాన్ని కూలదొయ్యాలనుకున్న అబ్రాహ్మణ సంప్రదాయాలు ఆయన్ని ఒక గురువుగా స్వీకరించాయి.

వారిలో ప్రధానంగా నాథ యోగులు, మహానుభావ సంప్రదాయ గురువులు ఉన్నారు. నాథ యోగులు తూర్పు, ఈశాన్య భారతంలో మొదట వజ్రయాన బౌద్ధులుగా మొదలై, తర్వాత శైవంలోకి ప్రవేశించి, టిబెటన్ బౌద్ధం ప్రభావంతో తంత్రాన్నీ, యోగాన్నీ మేళవించిన ఒక కొత్తమార్గాన్ని భారతదేశానికి పరిచయం చేసారు. వారిలో మత్స్యేంద్రనాథుడు, గోరఖ్ నాథుడు ముఖ్య గురువులు, కావడానికి గోరఖ్ మత్స్యేంద్రనాథుడికి శిష్యుడే అయినప్పటికీ గురువుకన్నా ఎక్కువ ప్రసిద్ధి చెందాడు. ఆయన రాసిన  ‘సిద్ధ సిద్ధాంత పద్ధతి’, ‘గోరక్ష వచన సంహిత’ దత్తాత్రేయసంప్రదాయాన్ని దాదాపుగా తన స్వంతం చేసుకున్న రచనలు. నాథ్ యోగులు రాసిన చర్యాగీతాలు బెంగాలీ, అస్సామీ, మైథిలీ-మూడు సాహిత్యాలకీ తొలి కవిత్వం కూడా.

నాథ పంథీల ప్రభావంతో మహారాష్ట్రలో పదమూడో శతాబ్దంలో మహానుభావ సంప్రదాయం వికసించింది. వారు తదనంతర మహారాష్ట్ర భక్తి సాహిత్యాన్నీ, ఆధ్యాత్మిక అన్వేషణనీ ఎంతో ప్రగాఢంగా ప్రభావితం చేసారు. కులవ్యవస్థనీ, విగ్రహారాధననీ, యజ్ఞయాగాదుల్నీ, బ్రాహ్మణ ఆధిపత్యాన్నీ ధిక్కరించిన మహానుభావ సంప్రదాయం దత్తాత్రేయుల్ని తమ తొలిగురువుగా చెప్పుకుంది.
మరొకవైపు మార్కండేయ పురాణానికీ, మహానుభావ సంప్రదాయానికీ మధ్య కాలంలో అంటే సా.శ. 7-13 శతాబ్దాల మధ్య నాథయోగులతో పాటు దత్తాత్రేయులు బౌద్ధుల్నీ, జైనుల్నీ, శాక్తుల్నీ, అఘోరీల్నీ చివరికి శంకరాచార్యుల్నీ, ఆయన ప్రవేశపెట్టిన దశనామి వ్యవస్థనీ కూడా ప్రభావితం చేస్తోనే ఉన్నారు.

ఇలా దత్తాత్రేయుల వల్ల ప్రభావితం అయిన సంప్రదాయాల్ని శంకర్ మోకషి పుణేకర్ ఒక పట్టిక రూపంలో వివరించాడు. దాన్ని స్థూలంగా ఇలా పేర్కోవచ్చు.

దత్తాత్రేయుల బోధనల్ని పురాణయుగానికి చెందినవిగా, చారిత్రిక కాలానికి చెందినవిగా రెండుగా విడదీసి చూస్తే పురాణ కాలానికి చెందిన బోధనల్లో మళ్ళా రెండు విభాగాలు కనిపిస్తాయి. ఒకటి అన్వీక్షికి విద్యపేరిట అలర్కుడికి, ప్రహ్లాదుడికీ, కార్తవీర్యుడికీ చేసిన ఉపదేశాలు. రెండోది, త్రిపురారహస్యం పేరిట పరశురాముడికీ, సుమేధుడికీ, నారదుడికీ బోధించిన తంత్ర విద్య. అంటే మొదటిది యోగ-సాంఖ్య-లోకాయత విద్య, రెండవది తంత్రవిద్య అన్నమాట.

ఇక చారిత్రిక కాలంలో మూడు స్రవంతులుగా ఆయన ప్రభావం కనిపిస్తున్నది. ఒకటి జైనంలో. జైనులు ఆయన్ని సాక్షాత్తూ నేమినాథుడిగా భావిస్తారు. అబూ పర్వతం మీద దత్తాత్రేయుల మందిరం కూడా ఉంది. గిర్నార్ నుంచి మౌంట్ అబూ వెళ్ళే రహదారి అనేక యోగ-తంత్ర సంప్రదాయాలకు నెలవు అనీ, దాదాపుగా ప్రతి ఒక్క సంప్రదాయానికీ దత్తాత్రేయులకూ ఏదో ఒక రూపంలో సంబంధం ఉందనీ రిగోపోలస్ అంటాడు.

ఇక నాథ యోగులది రెండవ స్రవంతి. వారిలో ప్రధాన గురువైన గోరఖ్ నాథుడు వృత్తిరీత్యా నేతపనివాడు. కాబట్టి ఆయన బోధనలకి హిందువులూ, ముస్లిములూ కూడా ఆకర్షితులయ్యారు. ఆయన శిష్యుడు జలంధర నాథుడి వృత్తి వీథులూడ్చడం. రాజుగా జీవించి సన్న్యసించిన భర్తృహరి కూడా గోరఖ్ నాథుడి సంప్రదాయానికి ఆకర్షితుడయ్యాడనే కథ ఉంది. ఇక వీరశైవానికి ఆద్యుడైన రేవణ సిద్ధుడు ఒక రైతు. దాంతో నాథ పంథీలు హిందూ, ముస్లిం మతాలకి అతీతంగా నేతపనివారినీ, దర్జీ పనివారినీ కూడగట్టుకుని ఒక విస్తృత సామాజిక ఉద్యమానికి కారణమయ్యారు. తర్వత రోజుల్లో వారు అనేక సంప్రదాయాలుగా చీలిపోయారు. వారిలో అన్నిరకాల వ్యవస్థల్నీ ధిక్కరించిన కబీరు, బాబా బుదాన్, మహీపతిదాస, గురుబసవ కవి, కృష్ణావధూతలతో పాటు ఇస్లామిక్-హిందూ సూఫీ సంప్రదాయానికి చెందిన మాణిక్ ప్రభు, మరొకవైపు దత్తభక్తులైన నారాయణ మహరాజ్, వాసుదేవానంద సరస్వతి, కేడ్గావోన్ కర్ మహరాజ్ వంటి వారున్నారు. అలానే గుజరాత్ లో రంగావధూత వంటివారు కూడా. ఆ సంప్రదాయాలు మరింత కొనసాగి షిర్డీ సాయిబాబా, మెహెర్ బాబాల దాకా విస్తరించాయి. ఈ వికాసంలో నాథ సంప్రదాయం కాబూల్ దాకా ప్రయాణించింది అని రాస్తాడు పుణేకర్.

అలాగే మహారాష్ట్ర భక్తికవి నామదేవ్ గురువు ఒక నాథ్ పంథీ. ఆయన్నుంచి శైవాన్నీ, విఠోబా భక్తుడిగా వైష్ణవాన్నీ సమానంగా స్వీకరించిన నామదేవుడు తిరిగి మళ్లా ఒకవైపు చోకామేళున్నీ, మరొకవైపు కబీర్నీ,  ఇంకోవైపు నానక్ నీ కూడా సమానంగా ప్రభావితం చేశాడు. ఈ ప్రభావాలన్నిటిలోనూ అంతర్గతంగా దత్తాత్రేయుల ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు.

ఇక మూడవ స్రవంతి వైదిక సంప్రదాయాల పునరుద్ధరణ ఉద్యమాలు, ప్రయత్నాలు. ఇప్పటి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, దక్షిణభారతదేశాల్లో మహానుభావ సంప్రదాయం, శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతీ వంటి వారి రూపంలో గురుసంప్రదాయం, జ్ఞానేశ్వర్, ఏకనాథ్ వంటి భక్తుల రూపంలో మరాఠీ భక్తి ఉద్యమాలు అటువంటి పునరుద్ధరణ ఉద్యమాలు. వీటన్నిటికీ దత్తాత్రేయులే స్ఫూర్తి అని మనం గమనించాలి.  ప్రత్యేకంగా ఏ పునరుద్ధరణ ఉద్యమం చేపట్టకపోయినా తన భక్తి కవిత్వమే ఒక ఉద్యమంగా జీవించిన తుకారామ కూడా దత్తాత్రేయుల ప్రభావానికి లోనైన వాడే.

అంటే ఏకకాలంలో దత్తాత్రేయుల పేరిట మతాలకీ, కులాలకీ అతీతమైన ఒక సంస్కరణోద్యమం, మరోవైపు వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడుకుంటూనే నిర్మలమైన జీవితం, మానవీయమైన సమాజాన్ని నిర్మించాలనుకునే పునరుద్ధరణ ఉద్యమాలూ రెండూ వికసించాయన్నమాట.

కాబట్టి పురాణాల్లో చెప్పినట్టుగా బ్రహ్మ, విష్ణువు, శివుడు అత్రి మహర్షి భార్య అయిన అనసూయామాతకు బిడ్డలుగా జన్మించారనీ, వారు చంద్రుడు, దత్తుడు, దూర్వాసుడూ అనీ, వారిలో చంద్రుడూ, దూర్వాసుడూ తమ తమ అంశల్ని దత్తాత్రేయులకి అందించారనీ అనడంలో ఈ విరుద్ధ స్రవంతుల సమ్మేళనమే ఒక రూపకపరిభాషలో వినిపిస్తున్నదని అనుకోవాలి. అయితే ఆ ముగ్గురూ హిందూ దేవతలు. కాని దత్తాత్రేయుల సమ్మేళనం అక్కడితో ఆగిపోలేదు. ఆయన బౌద్ధ, జైన, తంత్ర, శాక్త, మహ్మదీయ, జొరాష్ట్రియన్ సంప్రదాయాలకు కూడా ఒక ఆదర్శ సంగమంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

దత్తాత్రేయ సంప్రదాయానికి దాదాపు రెండువేల ఏళ్ళ చరిత్ర ఉందనీ, అందులో అవైదిక, వర్ణాశ్రమవ్యతిరేక, వర్ణధిక్కార లక్షణాలు కలిగిన సంప్రదాయానికి దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర ఉందనీ ధెరే రాసాడని పుణేకర్ రాసాడు. ఈ రెండవ సంప్రదాయం గురు కేంద్రక, యోగ ప్రతిపాదక, ఉన్ముక్త చింతనశీలత ప్రధానమని కూడా ధెరే రాసాడని చెప్పాడు. అయితే ఈ లక్షణాలు ప్రధానంగా అవధూత సంప్రదాయ లక్షణాలనీ, ఇవి ఉత్తరాదినుంచి నాథ్ పంథీల ద్వారా మహారాష్ట్రకు ప్రయాణించేయనీ పుణేకర్ చెప్తున్నాడు.

ఈ పరిశీలనలు దృష్టిలో పెట్టుకుని చూస్తే, మనం ఇందాకా చెప్పుకున్న ఆచార్య-గురు అనే రెండు తరగతుల్ని మళ్ళా మూడు తరగతులుగా విభజించుకోవలసి ఉంటుంది. ఒకటి ఆచార్యులు. వారు వర్ణాశ్రమ ధర్మాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా, సామాజిక-రాజకీయ నిర్మాణాలతో సంబంధం లేని ఒక తార్కిక వ్యవస్థ మీద దర్శనాల్ని నిర్మించినవారు లేదా వ్యాఖ్యానించినవారు. ఇక గురువులు తమకన్నా ముందు ప్రభవించిన ఆచార్యుల వ్యాఖ్యానాల నేపథ్యంలో తమ జీవితాల్నీ, నడవడికనీ దిద్దుకుంటూ, తమ బోధల కన్నా కూడా ముఖ్యంగా తమ జీవితాల్నే ఒక ఉదాహరణగా చూపిస్తూ తమ చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రభావితం చేసినవారు. వారు ప్రత్యేకంగా పుస్తకాలు రాయకపోయినా, ప్రాచీన దర్శనాల్ని వ్యాఖ్యానించక పోయినా, వారి ఉనికి, వారి నడవడి వాటికవే ప్రజలకు దారిచూపించేవిగా ఉంటాయి. ఇక అవధూతలు మూడో తరగతి.

ఆచార్యులకి బయటి వాస్తవంతో నిమిత్తం లేదు. వారికి తాము దర్శించిన సత్యాన్ని తార్కికంగా ప్రతిపాదించడమే ముఖ్యం. వారు గురువులు కూడా అయి ఉండవచ్చుగాని, అది వారిలోని మరొక పార్శ్వం తప్ప, ఆచార్యులుగా వారి బాధ్యత కాదు. ఇక గురువులు క్రమపద్ధతిలో జీవితాన్ని నడుపుకోవడం, దాన్ని ఒక ఉదాహరణగా లోకానికి చూపించడం కోసం జీవించే బాధ్యత తలకెత్తుకున్నవాళ్ళు. దాన్నే శంకరాచార్యులు లోకసంగ్రహం అన్నారు. కాని అవధూతలకి ఇటువంటి బాధ్యత ఏమీ లేదు. వారు అసలు దేన్నీ నిలబెట్టాలనుకోరు, దేనీ కూలదొయ్యాలనీ అనుకోరు. ‘బాలోన్మత్త పిశాచవత్’ అనే లక్షణానికి వారు నిలువెత్తు ఉదాహరణగా సంచరిస్తారు. ఏ లోకవ్యవహారానికీ వారి జీవితం ఉదాహరణగా నిలబడదు. ఏ దార్శనిక వ్యవస్థనీ వారు నిర్మించాలనుకోరు. అసలు మరొక మనిషికి అర్థమయ్యేలాగా మాట్లాడవలసిన అవసరం ఉందని కూడా వారు భావించరు. తమ సమస్త అస్తిత్వంలోంచీ పొంగిపొర్లే జీవితానందం తప్ప వారి దగ్గర మరేదీ ఉండదు. అటువంటి అవధూతలు చాలా అరుదు. ఉన్నా వారిని గుర్తుపట్టగలగడం మరీ అరుదు.

భారతీయ దార్శనిక, ఆధ్యాత్మిక సంప్రదాయాల్ని చూసినప్పుడు ప్రతి సంప్రదాయంలోనూ ఆచార్యులూ, గురువులూ విడివిడిగానూ, కలిసి కూడా కనిపిస్తారు. ఉదాహరణకి శంకర, రామానుజ, మధ్వాచార్యుల వంటి వారు ఏకకాలంలో ఆచార్యులూ, గురువులూ కూడా. కాని అవధూతలు మాత్రం వేరే కనిపిస్తారు.

ఒక్క దత్తసంప్రదాయంలో మాత్రమే గురువులూ, అవధూతలూ కూడా కలిసి కనిపిస్తారు. అలానే ఆచార్యుల్నీ, గురువుల్నీ, అవధూతల్నీ కూడా ప్రభావితం చేసిన presence గా దత్తాత్రేయులు మనకి కనిపిస్తున్నారు. దత్తాత్రేయులు తన భక్తులకు ఓంకారంగా, భగవత్స్వరూపంగా, ఎన్నో అవతారాలుగా, సోమ, చంద్ర రూపాలుగా, పదహారుమంది అవధూతలుగా, పంచప్రాణాలుగా, మనుషరూపధారిగా, వైద్యుడిగా, దైవంగా, అవధూతగా, గృహస్థుగా, ఏకముఖుడిగా, త్రిమూర్తిగా, యతిగా, బ్రాహ్మణుడిగా, మహ్మదీయ సాధువుగా, గొర్రెలకాపరిగా, ఇంతవరకూ జీవించిన సంపూర్ణ దత్తభక్తులందరిగా కనిపించారని ఎస్.కె.ఫాడ్కే అనే ఆయన రాసారని మోకాషి-పుణేకర్ పేర్కొన్నాడు.

ఆరవ శతాబ్దం తర్వాత తాంత్రికులుగా, సాధులుగా, సిద్ధులుగా, నాథులుగా, వర్ధిల్లిన ఎన్నో సంప్రదాయాలు తర్వాత కాలంలో సంత్ మత్ కి చెందిన భక్తి ఉద్యమాలుగా పరిణమించాయని సంపూర్ణానంద్ అన్నాడు. అక్షయ కుమార్ బెనర్జియా Philosophy of Gorakhnath (1961) పుస్తకానికి రాసిన ముందుమాటలో సంపూర్ణానంద్ రాసిన ఈ మాటలు మహాయాన బౌద్ధం అనంతరకాలం నుంచి కబీరుదాకా సంభవించిన పరిణామమంతటినీ ఒక్క వాక్యంలో ఇమిడ్చిపెట్టినట్టుగా నాకు అనిపించింది. దాదాపుగా ఈ సంప్రదాయాలన్నింటినీ దత్తాత్రేయులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసేరు.

ఈ నేపథ్యం తెలిస్తే తప్ప అవధూతగీతను మనం అర్థం చేసుకోలేం.


Featured image: Dattatreya Temple at Girnar, PC: Wikimedia Commons

26-10-2024

8 Replies to “అవధూత గీత-4”

  1. శుభోదయం సార్. ఆర్టికల్ చాలా వివర్ణాత్మకము గా వుంది.

  2. “ఆచార్యులూ’, ‘గురువులూ’…

    వ్యత్యాసం తెలిపిన వైనం అద్భుతం!

    ఆ ‘తేడా’ తెలుసుకోవడమే అసలైన విద్య!

    ఎంత బాగుంది. అభినందనలు…సర్.

    తెల తెలవారుతుండగానే మా తలుపు తట్టే సరస్వతీ దేవి ఉనికి కి జోహార్లు….సర్.

  3. ఆచార్యులు, గురువులు, అవదూతలు గురించి చాలా వివరణాత్మకమైన వ్యాసం అందించినందుకు ధన్యవాదనమస్సులు 🙏🙏

  4. చక్కని వ్యాసం. ఎంతో వివరంగా చెప్పారు. సుమాంజలి

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading