
4
సచ్చిదానందమూర్తిగారి పుస్తకాల్లో ముఖ్యంగా మూడు పుస్తకాలు చదవదగ్గవి అని చెప్పాను కదా. అందులో రెండో పుస్తకం, Indian Spirit (1965) పేరిట ఆయన వెలువరించిన వ్యాససంపుటం. ఇందులో ఎనిమిది వ్యాసాలున్నాయి. వాటిల్లో భారతీయ తత్త్వచింతన అనే ఒక వ్యాసం కూడా ఉంది. ఆ వ్యాసమే దానికదే విడిగా ఎన్నో భాషల్లోకి అనువాదమైంది కూడా. ఈ వ్యాసాల్లో ఆచార్య మూర్తి భారతీయ, హిందూ తత్త్వచింతన గురించి, సంస్కృతి గురించీ, నైతికత గురించీ తన ఆలోచనల్నీ, నమ్మకాల్నీ పంచుకున్నారు. పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో భారతీయ సంస్కృతి పట్ల తనది మానవతావాద దృక్కోణం అని చెప్పుకున్నారు. రీజన్ అండ్ రివలేషన్ పుస్తకంలో ఒకచోట తాను హిందూ ఫండమెంటలిస్ట్ ని కానని కూడా చెప్పుకున్నారు. ఈ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో మరొక అడుగుముందుకు వెళ్ళి భారతీయ సంస్కృతి మొత్తాన్ని ఒక్క హిందూపార్శ్వంతోనే గుర్తుపట్టాలని చూడటం మూర్ఖత్వం, సంకుచితత్వం అని కూడా అన్నారు.
ఆ ముందుమాటలో మరొకమాట కూడా నన్ను చాలా ఆకట్టుకుంది. ఒక సంస్కృతిని అర్థం చేసుకోవడం ఒక philosophical task అని అన్నాడాయన. ఒక సంస్కృతిని అధ్యయనం చెయ్యడం సాంస్కృతిక కర్తవ్యమో, సామాజిక శాస్త్ర కర్తవ్యమో లేదా రాజకీయ కర్తవ్యమో అని ఉంటే నేను ఆశ్చర్యపడి ఉండేవాణ్ణి కాను. కాని సంస్కృతిని పరిశీలించడం, ఆ సంస్కృతిలో నిబిడమై ఉన్న దృక్కోణాల్ని మూల్యాంకనం చెయ్యడం తాత్త్విక కర్తవ్యం అనడంలోనే మూర్తి గారి మూర్తిమత్వం తేటతెల్లమవుతూ ఉంది. అవును కదా, అసలు ఒక సంస్కృతిని చూడవలసింది తాత్త్విక దృష్టితో కదా. అప్పుడు మనం ఆ సంస్కృతిలోని విభిన్న దృక్పథాలపట్లా, వైరుధ్యాల పట్లా తీర్పరులం కాకుండా సహిష్ణుతతో చూడగలుగుతాం. మన జాతీయోద్యమం మనకి నేర్పిన విలువైన పాఠం ఇది. భారతదేశ సభ్యత, సంస్కృతి ఏ ఒక్కరి సొత్తో కాదనీ, మనం ఇప్పుడిలా ఉన్నామంటే, మన మంచిచెడ్డలన్నిటికీ ఎందరో కారకులనీ, అన్నిటికన్నా ముందు భారతదేశం, కలిసి జీవించడానికే పెద్దపీట వేస్తూ వచ్చిందనీ మనం గుర్తుపెట్టుకుంటే, భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవడం ఒక తాత్త్విక కర్తవ్యం ఎందుకో గ్రహిస్తాం.
భారతదేశం గురించి తెలుసుకోడానికి తనకు ఎవరెవరు తోడ్పడ్డారో, ఏయే గ్రంథాలు బాసటగా నిలిచాయో వివరంగా చెప్పుకున్నారు. అన్నిటికన్నా ముందు ఆయన మహాభారతానికి కృతజ్ఞత ప్రకటించారు. ఆ తర్వాత పురాణాలకీ, ముఖ్యంగా భాగవత పురాణానికీ అని చెప్తూ హెన్రిక్ జిమ్మర్, బి.కె.సర్కార్ ల వల్ల అర్థ శాస్త్రం, నీతిశాస్త్రం గురించి మరింత వివరంగా తెలుసుకోగలినానని రాసారు. వేదసంహితల్నీ, మీమాంసనీ అర్థం చేసుకోడానికి కున్హన్ రాజా, గంగానాథ్ ఝా రచనలు తోడ్పడ్డాయనీ, మధ్వ పండితులు, రామానుజులూ, బాల గంగాధర్ తిలక్ ల వల్ల భగవద్గీతని అర్థం చేసుకోగలిగానని చెప్పారు. అలానే రైస్ డేవిస్, ఇ.జె.థామస్, రాహుల్ సాంకృత్యాయన్ ల వల్ల బౌద్ధాన్నీ, నెహ్రూ, కె.పి.జయస్వాల్, అరవిందులు, మాక్స్ వెబర్ రచనల వల్ల భారతీయ చరిత్రనీ, సామాజిక శాస్త్రాన్నీ అర్థం చేసుకునే అవకాశం లభించిందని రాసాడు. అలానే అల్బెరూనీ, బెర్నియర్ లాంటి విదేశీ పర్యాటకుల రచనల వల్ల అప్పటి కాలాల గురించి తెలుసుకోగలిగేనని చెప్పారు.
భారతదేశ చరిత్రనీ, సంస్కృతినీ అధ్యయనం చేయడం మొదలుపెట్టాక మొట్టమొదటగా ఎవరికేనా స్ఫురించేది బహుళాభిప్రాయాల ఉనికి గురించి. యూరోప్ చరిత్ర చదివినప్పుడు మనకి అర్థమయ్యేదేమిటంటే, సా.శ. నాలుగవ శతాబ్ది నుంచీ మతం, పదిహేడో శతాబ్ది నుంచీ మతం స్థానంలో రాజ్యం అక్కడ బహుళాభిప్రాయాల్ని అణచిపెడుతూ వచ్చాయని. ఎన్ని రకాల ప్రజాస్వామిక ప్రయోగాలు జరిగినా, జరుగుతూ వస్తున్నా యూరోప్ లో ఇప్పటికీ బహుళ అస్తిత్వాల్ని నిభాయించుకోగల సహిష్ణుత అలవడనే లేదు. యూరోప్, అమెరికా చరిత్రల్ని చదువుకునే పద్ధతిలోనే భారతదేశ చరిత్రని కూడా నిర్మించాలనుకునేవాళ్ళు అటు మతఛాందసవాదులుగానో లేదా ఇటు సిద్ధాంతఛాందసవాదులుగానో ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏముంది? ఇటువంటి ఏకపక్ష దృక్కోణాల మధ్య ఆచార్య మూర్తిలాంటి జిజ్ఞాసువు కనబడితే నాలాంటివాళ్లకి ప్రాణం లేచొచ్చినట్టుంటుంది.
ఈ పుస్తకంలో ఆయన ఒక జైన పండితుడి శ్లోకం ఒకటి ఉదాహరించారు. గుణరత్నుడనే ఆ సాధువు ఇలా అన్నాడట:
బుద్ధుడి బోధలు వినదగ్గవి, జైనుల బోధలు అనుష్టించదగ్గవి, వేదాంతుల బోధలు అనుసరించదగ్గవి, కాగా పరమశివతత్త్వం ధ్యానించదగ్గది అని.
ఎందుకంటే పరమసత్యం అంటూ ఒకటి ఉంటే దాన్ని ఏదో ఒక్కదారిలోనే కనుక్కోలేం. భారతీయ ఆకాశం కింద తలెత్తిన ప్రతి దృక్కోణంలోనూ ఏదో ఒక విలువైన అంశం ఉంటుంది. సత్యాన్ని అవగతం చేసుకోవాలనుకున్నవాళ్ళు వీలైనన్ని పార్శ్వాల్తో పరిచయం పెంచుకోవాలి. బహుళమతానుయాయుల్ని సంప్రదించాలి. ఆ పద్ధతిలో నీకు సత్యం చేజిక్కినా చేజిక్కకపోయినా, ముందు నువ్వు సహజీవనానికి అవసరమైన సహిష్ణుత నేర్చుకోగలుగుతావు.
ఎప్పుడో ముప్ఫై ఏళ్ళ కిందట సుదర్శనం గారు సచ్చిదానందమూర్తిగారు ఎడిట్ చేసిన పుస్తకం ఒకటి నాకిచ్చారు. Readings in Indian History, Politics and Philosophy (1967) అనే ఆ గ్రంథం విలువ నాకు అప్పట్లో పూర్తిగా తెలియలేదు. కాని ఏళ్ళు గడిచాక, భారతీయ విశ్వవిద్యాలయాలూ, సమాచార ప్రసార సాధనాలూ cauldrons of hate గా మారిపోతూండటం చూస్తున్నాక ఆ పుస్తకం ఎంత విలువైనదో అర్థమవుతూ ఉంది. భారతీయ సభ్యతనీ, సంస్కృతినీ, దర్శనాల్నీ గౌరవించే ప్రతి ఒక్కరిదగ్గరా ఉండవలసిన పుస్తకం అది. నాకు తెలిసి అటువంటి సంకలనం మరొకటి ఇప్పటి రోజుల్లో రావడం దాదాపు అసాధ్యం.
ఇక మూర్తిగారి రచనల్లో నేను ప్రత్యేకంగా పేర్కొనాలనుకున్న మూడో పుస్తకం Metaphysics, Man and Freedom (1963) అనే రచన. ఇది ఆచార్యమూర్తి 1958-62 మధ్యకాలంలో ఇచ్చిన మూడు ప్రసంగాల సమాహారం. పట్టుమని తొంభై పేజీలు కూడా లేని ఈ చిన్న పుస్తకం సచ్చిదానందమూర్తిగారి జీవితకాల దర్శనసారాంశం అని చెప్పవచ్చు. తత్త్వశాస్త్రం గురించీ, మనిషి గురించీ, అతడి ఆరాటాల గురించీ తెలుసుకోవాలనుకునేవాళ్ళకి ఇంతకన్నా గొప్ప ప్రారంభ పరిచయ గ్రంథం మరొకటి లేదని చెప్పగలను. అలాగని ఇది బిగినర్ల కోసం ప్రాథమిక స్థాయిలో రాసిన పుస్తకం కాదు. ఈ ప్రసంగాలు ఆచార్య మూర్తి షికాగో లో, వెనిస్ లో, ఢిల్లీలో ఉద్దండులైన తన సమకాలిక తత్త్వశాస్త్ర ఆచార్యుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు. కానీ తత్త్వశాస్త్రంతో కనీస పరిచయం కూడా లేనివాళ్ళకి కూడా ఈ ప్రసంగాలు ఎంతో సరళంగా అర్థమవుతాయి.
పుస్తకం చదువుతున్నంతసేపూ ఆ రచనని అవశ్యం తెలుగులోకి తీసుకువద్దామన్న కోరిక బలపడుతూనే వచ్చింది. అందుకు కావలసిన అనుమతికోసం సచ్చిదానందమూర్తిగారి కుమారుడు రమేష్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఈ పుస్తకాన్ని సచ్చిదానందమూర్తిగారే తెలుగులో కూడా రాసేరని చెప్పారు. చెప్పడమే కాక ‘మనిషి-ముక్తి'(1970) అనే ఆ పుస్తకం కాపీ కూడా నాకు పంపించారు. నవోదయ పబ్లిషర్స్ ప్రచురించిన ఈ తెలుగు అనువాదంలో ఆచార్య మూర్తి తన ఇంగ్లిషు పుస్తకం పైన వచ్చిన అయిదు సమీక్షలు కూడా జతపరిచారు. అయితే ఆ అనువాదం చూసేక కూడా ఆ ఇంగ్లిషు పుస్తకాన్ని తెలుగు చెయ్యాలన్న నా కోరిక చల్లారలేదు. భాష ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కాబట్టి, యాభై ఏళ్ళకిందటి ఈ అనువాదానికి తోడుగా నేను కూడా మరొకసారి అనువదిస్తాను అన్నాను ఆయనతో.
ఒక మనిషి ఒక విషయం మీద సాధికారికత సాధించాడని ఎప్పుడు చెప్పగలమంటే అతడు తాను చెప్పదలుచుకున్నదాన్ని క్లుప్తంగా, సూటిగా, సాధారణశ్రోతలకి కూడా సుబోధకంగా చెప్పగలిగినప్పుడు. తత్త్వశాస్త్రం పట్లా, సత్యమీమాంస పట్లా సచ్చిదానందమూర్తి నిజంగానే ఆచార్యస్థానీయుడని ఈ పుస్తకం సాక్ష్యం చెప్తున్నది.
ఇందులో మొదటి ప్రసంగంలో ఆయన మెటఫిజిక్స్ గురించి చర్చించారు. మెటఫిజిక్స్ అనే మాటకి సరైన తెలుగు పదం లేదు. దాన్ని అధిభౌతికశాస్త్రం అని గానీ, లేదా ఆచార్యమూర్తి వ్యవహరించినట్టుగా అతిభౌతిక శాస్త్రమనీ గానీ పేర్కోడం ద్వారా తెలుగు పాఠకుడికి ఏమీ తెలియచెప్పలేరు. ప్రతి శాస్త్రానికీ ఒక విషయవస్తువు ఉంటుంది. ఫిజిక్స్ భౌతిక పదార్థాన్ని అధ్యయనం చేస్తుంది. యాంత్రపాలజీ మానవుడి గురించి పరిశీలిస్తుంది. వృక్షశాస్త్రం మొక్కలగురించీ, జంతుశాస్త్రం జంతువుల గురించీ మాట్లాడుతుంది. మరి మెటఫిజిక్స్ దేని గురించి మాట్లాడుతుంది? ఇంగ్లిషులో చెప్పాలంటే దాని విషయవస్తువు being as such. ఇంతకీ బీయింగ్ అనే పదానికి కూడా తెలుగు లేదు. తత్త్వశాస్త్ర అనువాదకులు ‘సత్త’ అనే పదం వాడతారు. కానీ ఆ పదం వల్ల మనకేమీ తెలియదు. అలానే becoming అంటే? బీయింగ్ అంటే ‘ఉండటం’, బికమింగ్ అంటే ‘కావటం’. కాని ఈ రెండు క్రియాపదాలకీ తెలుగులో ఒక తాత్త్విక పరిభాష స్థాయి లేదు. కాబట్టి ఆ పదాలు కూడా మనకేమీ చెప్పలేవు. సంజీవ్ దేవ్ గారు బీయింగ్ ని ‘భావము’ అనీ, బికమింగ్ ని ‘భవము’ అని అన్నారు. ‘భూ సత్తాయాం’ అని అమరకోశం చెప్పింది కాబట్టి ఆ రెండు పదాలూ నిజంగానే ఎంతో సముచితమైన పదాలు. కాబట్టి మెటఫిజిక్స్ ని తెలుగులో ‘భావవివేచన’ అందాం (ఏళ్ల కిందట నేను సత్యాన్వేషణ పుస్తకం వెలువరించినప్పుడు అందులో మెటఫిజిక్స్ ని సత్యమీమాంస అని అనువదించాను.)
భావవివేచన అంటే మౌలికంగా మనం ఉండటం గురించిన చింతన. యూరోపులో తత్త్వశాస్త్రం కావడం మెటఫిజిక్స్ గానే మొదలయినప్పటికీ, ఇరవయ్యవ శతాబ్దానికి వచ్చేటప్పటికి అది ఒట్టి స్పెక్యులేషన్ గా నిరాకరణకు గురయ్యింది. వట్టి ఊహాగానమో లేదా మాటల గారడీనో అని తత్త్వశాస్త్ర ఆచార్యులే దాన్ని పక్కకు నెట్టేయడం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో ఆచార్య మూర్తి చేసిన ప్రసంగం ఇది. అందుకని ఆయన తన ఉపన్యాసం మొదలుపెడుతూనే మనం ఇప్పుడొక anti-metaphysical age లో ఉన్నామన్నారు. తాను మెటఫిజిక్సు గురించి మాట్లాడతానంటే తనని ఒక పాతరాతియుగం మానవుడిగా ఎద్దేవా చేసేకాలం అని కూడా అన్నారు. అయినా కూడా ఆయన మెటఫిజిక్స్ కి కాలం చెల్లిపోలేదనీ, ఇప్పుడు కూడా ఇంటలెక్చువల్ గా, భాషాపరంగా, మనస్తత్వశాస్త్ర పరంగా కూడా భావవివేచన అవసరమనే అన్నారు.
మెటఫిజిక్స్ గురించి మూర్తి గారు చర్చించిన ఆలోచనలూ, చేసిన ప్రతిపాదనలూ క్లుప్తంగా వివరించగలిగేవి కాదు. ఆ ప్రసంగం సంగ్రహంగా ఉన్నప్పటికీ అది మనలో విస్తారంగా ఆలోచనలు రేకెత్తిస్తుంది. కాబట్టి ఆ పుస్తకాన్ని అనువదించడమేనా చేయాలి లేదా అందులో చర్చించిన అంశాల మీద మరోసారి వివరంగానేనా రాయాలి.
పుస్తకంలో తక్కిన రెండు అంశాలూ ఒకటి మనిషి గురించి. అందులో తాను చర్చించిన ఆలోచనలకి ఆయన కల్చరల్ యాంత్రొపాలజిస్టులనుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు. ఆ వ్యాసంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. Man is the neighbor of Being అని. ఈ ఒక్క వాక్యాన్ని వివరించడం మీదనే ప్రత్యేకంగా ఒక వ్యాసం రాయవలసి ఉంటుంది. మూడో ప్రసంగం ఫ్రీడమ్ గురించి. ఫ్రీడమ్ అనే ఇంగ్లీషు పదాన్ని ఆయన తెలుగులో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని కాక ‘ముక్తి’ అని అనువదించారు కాబట్టి ఆ అర్థంలో ఆ ప్రసంగాన్ని మరోసారి చదవాలి.
ఇవి కాక సచ్చిదానందమూర్తి రాసిన The Realm of Between (1973) మరొక విశిష్టమైన పుస్తకం. జ్ఞాత, అజ్ఞాత ప్రపంచాల మధ్య భగవంతుడి ఉనికిని అన్వేషించే అధ్యయనం అది. Philosophy of Religion లో ఇంత దాకా వచ్చిన గొప్ప తులనాత్మక పరిశీలనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నేను ఇందాక పేర్కొన్న Readings in Indian Philosophy లో సచ్చిదానందమూర్తి గారి వ్యాసం Our Knowledge of God కూడా ఉంది. ఒక విధంగా ఈ వ్యాసాన్ని Realm of the Between తాలూకు సారాంశంగా కూడా చెప్పుకోవచ్చు.
5
ఆ రోజు శతజయంతి సభకు నన్ను ఆహ్వానించడం వల్ల నాకు మరోసారి సచ్చిదానందమూర్తిగారి గురించి తలుచుకునే అవకాశంతో పాటు ఇంతదాకా చదవని ఆయన రచనల్ని చదివే అవకాశం కూడా లభించింది. భారతీయ తత్త్వశాస్త్రాల్ని క్షుణ్ణంగా చదువుకున్న వ్యక్తి రాసిన రచనలు మనకి లభ్యంగా ఉండికూడా మనం వాటిని చదవలేకపోవడం నిజంగా ఒక దురదృష్టం. కనీసం ఇప్పుడేనా నన్ను ఆ దురదృష్టం నుంచి ఎంతో కొంత బయటపడేసినందుకు రావిపాటి వీరనారాయణరావుగారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.
30-9-2024


పరిచయం చాలా బాగుంది. మనిషి – ముక్తి, పుస్తకం pdf అయినా లేదా పుస్తకం అయిన ఎక్కడైనా లభిస్తుందా సార్. చెప్పగలరా
భారతదేశ సభ్యత, సంస్కృతి ఏ ఒక్కరి సొత్తో కాదనీ, మనం ఇప్పుడిలా ఉన్నామంటే, మన మంచిచెడ్డలన్నిటికీ ఎందరో కారకులనీ, అన్నిటికన్నా ముందు భారతదేశం, కలిసి జీవించడానికే పెద్దపీట వేస్తూ వచ్చిందనీ మనం గుర్తుపెట్టుకుంటే, భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోవడం ఒక తాత్త్విక కర్తవ్యం ఎందుకో గ్రహిస్తాం.
ఒక మనిషి ఒక విషయం మీద సాధికారికత సాధించాడని ఎప్పుడు చెప్పగలమంటే అతడు తాను చెప్పదలుచుకున్నదాన్ని క్లుప్తంగా, సూటిగా, సాధారణశ్రోతలకి కూడా సుబోధకంగా చెప్పగలిగినప్పుడు. తత్త్వశాస్త్రం పట్లా, సత్యమీమాంస పట్లా సచ్చిదానందమూర్తి నిజంగానే ఆచార్యస్థానీయుడని ఈ పుస్తకం సాక్ష్యం చెప్తున్నది.
ఇవే కాదు. ఇంకా ఎన్నదగినవి ,గ్రహించాల్సినవి ఎన్నో ఉన్నాయి
నమస్సులు
ధన్యవాదాలు