
భాద్రపద పౌర్ణమి. చీకటి తీగకి పూసిన పెద్ద పువ్వులాగా నిండు చంద్రుడు ఆకాశంలో రేకలు విప్పుకుంటూ ఉన్నాడు. మరికొంతసేపటిలో కర్నూలు చేరబోతామనగా మా పిల్లవాడు జోగులాంబ అమ్మవారిని చూడాలని ఉందన్నాడు. కారు అలంపురం వైపు తిప్పాం. మేం గుడికి చేరుకునేటప్పటికి సాయంకాలం హారతి పూర్తయిపోయింది. కొలువు ముగించిన తరువాత కనిపించే తీరికని తీరిక అనలేం. ఇక దైవమూ, దైవసేవకులూ కూడా రోజుముగించి విశ్రాంతికి ఉపక్రమించే సమయం అది. అందుకని మర్నాడు మళ్ళా వద్దామనుకున్నాం.
తీరా మొన్న పొద్దున్న గుడికి వెళ్ళేటప్పటికి పదిన్నర దాటింది. భాద్రపదమాసం నేలమీద కనిపిస్తూ ఉందిగాని, ఆకాశంలో కనిపించడం లేదు. చైత్రవైశాఖాల్లో ఉండే వేడి గాల్లో గడ్డకడుతూ ఉంది. అటూ ఇటూ పొలాల్లో మాత్రం జొన్న చేలు చిక్కగా ఎదుగుతూ ఉన్నాయి. పత్తి, పొగాకు పొలాల్లో కలుపు తీస్తూ ఉన్నారు. నల్లరేగడి నేలలంతటా సస్యకళ అల్లుకుంటున్నది. ఆ పొలాలమధ్యనుంచి అలంపురంలో అడుగుపెట్టగానే, మా ఎదురుగా చాళుక్యకాలపు వాస్తులో నవబ్రహ్మ దేవాలయ సముదాయం కనబడగానే, ఇంతకాలం జీవించినందుకు కలగవలసిన తృప్తి ఏదో కలిగింది, ఇక చాలు అనే భావన కలిగింది. సంస్కృతంలో ‘అలం’ అంటే చాలు అనే అర్థం ఉంది. అటువంటి పరిపూర్ణ సంతృప్తిని కలగచేసే లక్షణం ఏదో ఆ క్షేత్రానికి ఉన్నందువల్లనే దాన్ని అలంపురం అని పిలుస్తారని ఎప్పుడో ఎక్కడో చదివాను. లేదా మా హీరాలాల్ మాష్టారు చెప్పారో, గుర్తు లేదు.
అలంపురం అనే మాట సంస్కృతంలో హేలంపురం అనే మాట నుంచి వచ్చిందని కూడా చదివాను. హేలంపురం అనే మాట ఎల్లమ్మ అనే పదం నుంచి కూడా వచ్చి ఉండవచ్చు. అలంపురం రేణుకా క్షేత్రం, పరశురామ క్షేత్రం కూడా.
అలంపురం వెళ్ళడం ఇది మూడవసారి. ఈ గడచిన మూడునెలల్లోనే ఇది రెండవసారి. మొదటిసారి వెళ్ళింది ముప్ఫై ఏళ్ళ కిందట. నేను కర్నూల్లో పనిచేస్తున్న రోజుల్లో. ఒక సాయంకాలం వెళ్ళాం. అప్పుడు మా డ్రైవరు తుంగభద్ర దగ్గరకు తీసుకువెళ్ళి అక్కణ్ణుంచి పడవమీద అలంపురం వెళ్ళాలని చెప్పినట్టు గుర్తు. ఆ రోజు మేం ఇవతలి ఒడ్డుకి చేరుకునేటప్పటికే ఒక పడవ ఒడ్డుని దాటి అవతలి గట్టుకి బయల్దేరింది. ఆ పడవలో ఎవరో గ్రామీణులు ఉన్నారనుకున్నాం. కాని ఇంతలోనే ఆ పడవలో ఉన్నవాళ్ళు నాదస్వరం, డోలు, వేణువు లాంటి సంగీతవాద్యాలు తీసి ఏదో కీర్తన వాయించడం మొదలుపెట్టారు. పడవ నదిని దాటేంతసేపూ వారు అట్లా ఆకాశం కింద ఒక అపురూపమైన గానాబజానా చేస్తూనే ఉన్నారు. పడవ అవతలి ఒడ్డుకి చేరుకోగానే ఆ కచేరీ ఆపేసారు. తమ వాద్యాలు చంకనపెట్టుకుని పడవ దిగి వెళ్ళిపోయారు. అది మరవలేని దృశ్యం. ఇన్నేళ్ళుగానూ అలంపురం అనే మాట వినబడ్డప్పుడల్లా నాకు ఆ నది, ఆ నావ, ఆ నాదస్వరమే గుర్తొస్తూ ఉండేవి.
కాని ఈ సారి మాత్రమే అలంపురం దేవాలయాన్ని మరికొంత దగ్గరగా చూసానని చెప్పాలి. ఇంతకు ముందు రెండు సార్లూ చీకటి పడ్డాక చేసిన సందర్శనలు కావడంతో ఆ గుడినీ, ఆ పరిసరాల్నీ మరింత విశదంగా చూసే అవకాశం దొరకలేదు. ఇప్పుడు స్వామివారినీ, అమ్మవారినీ దర్శించుకున్నాక ఆ ఎదటనే ఉన్న తుంగభద్రని కూడా చూసాను. ఆ నదిలో జలకళ ఉట్టిపడుతోంది. మధ్యాహ్నపు మిలమిలతో పాటు, నిశ్శబ్దపు నిండుదనం కూడా ఆ నదిమీద నీలాకుపచ్చని రంగులో పరుచుకుని ఉంది.

అక్కడొక పురావస్తు సంగ్రహశాల కూడా ఉంది. అటువంటి మూజియం ఒకటి అక్కడ ఉన్నట్టు నాకిప్పటిదాకా తెలీదు. కాని ఆ మూజియంలో అడుగుపెట్టి కొంతసేపు ఆ శిల్పాల్నీ, శాసనశిలల్నీ పరికించి చూసాక, అలంపురం మరొకసారి రావాలన్న కోరిక కలిగింది.

ఏడెనిమిదేళ్ళ కిందట నేను ఐహోళె, పట్టదకల్లు, బాదామి పర్యటన చేసాను. భారతీయ చరిత్ర విద్యార్థులు జీవితంలో ఒకసారేనా ఆ మూడు స్థలాలూ చూడాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే భారతీయ దేవాలయ వాస్తుకి ఐహోళెని ఊయెలతొట్టిగా చరిత్రకారులు అభివర్ణిస్తూ ఉంటారు. కాని ఐహోళె, పట్టదకల్లు భారతీయ దేవాలయ నిర్మాణరీతికి cradle అయితే, అలంపురాన్ని భారతీయ దేవాలయ వికాసం తాలుకు అల్బమ్ అనాలి. సా.శ. 5-6 శతాబ్దాలనుంచి 11-12 శతాబ్దాల దాకా భారతీయ దేవాలయ వాస్తుకళ వికాసం మొత్తాన్ని ఒకచోట ఆల్బంలో దాచుకున్నట్టుగా అలంపురం కనిపించింది. ఈ సంగతి నాకు నిన్ననే అర్థమయింది. నాకు ఈ సంగతి ముందే తెలిసి ఉంటే, ఐహోళె, పట్టదకల్లు చూడగానే అలంపురం వచ్చేసి ఉండేవాణ్ణి.

ఆ మూజియం రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంది. చిన్న మూజియమే కాని, శుభ్రంగానూ, పొందిగ్గానూ ఉంది. ఆ శిల్పాలన్నిటినీ స్థూలంగా ఒకసారి చూసేక, ఈ మూజియం మీదగానీ, ఈ ఊరు మీదగానీ, ఈ వారసత్వ సంపదమీదగానీ ఏవేనా పుస్తకాలుగానీ, బ్రోచర్లుగానీ ఉన్నాయా అని ఆ మూజియం ఉద్యోగిని అడిగాను. అలాంటివేవీ లేవన్నాడు అతను. ‘అలంపురం గురించీ, ఆ శిల్పసంపద గురించీ చెప్పడానికి ఒక గైడు ఉన్నాడు, అతణ్ణే అడగండి’ అన్నాడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, డబ్బు గురించేమో అని అనుకుని ఆ ఉద్యోగి ముప్ఫై రూపాయలిస్తే చాలు అని అన్నాడు. కాని నేను ఆలోచించింది డబ్బుకోసం కాదు. సాధారణంగా ఇటువంటి చారిత్రిక స్థలాల్లో కనిపించే గైడ్లకి చరిత్ర దృష్టి తక్కువగా ఉంటుంది, ఎక్కువ పురాణాలు వినిపిస్తారు అని నాకు వాళ్ళమీద అంత సదభిప్రాయం ఉండదు. కాని గైడుని పెట్టుకుంటే వివరంగా చెప్తాడు కదా అంది విజ్జి. తీరా ఆ గైడు, అతని పేరు సంజీవనాయుడు, తనని ఈమని శివనాగిరెడ్డిగారి శిష్యుడిగా పరిచయం చేసుకున్నాడు. అతడు అలంపురం వాసి. బి ఏ చదివి ఇక్కడే గైడుగా పనిచేస్తున్నాడట. మొదటి అయిదారునిమిషాల్లోనే అతడి పట్ల నాకు చాలా గౌరవం కలిగింది. అతడు ప్రతి ఒక్కశిల్పాన్నీ, శాసనాన్నీ వివరిస్తో మేమక్కడ గడిపిన గంటసేపట్లోనే అలంపురం చరిత్రని అద్దంలో చూపించాడు.

కానీ అలంపురం గురించి గడియారం రామకృష్ణ శర్మగారి ఆత్మకథ ‘శతపత్రము’లో మరెన్నో విశేషాలు చదివినట్టు నాకు గుర్తుంది. రామకృష్ణశర్మగారు ముప్ఫై ఏళ్ళపాటు అలంపురం దేవాలయ ధర్మకర్తల మండలికి అధ్యక్షులుగా కూడా పనిచేసారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టేటప్పుడు ముంపుకి గురైన ప్రాంతాల్లోని దేవాలయాలకు చెందిన శిల్పాల్ని చాలావరకూ ఈ మూజియంలో భద్రపరచడానికి ఆయనే కారణం అనీ, అలానే తుంగభద్ర వల్ల దేవాలయం ముంపుకి గురికాకుండా నదికీ, గుడికీ మధ్య పెద్ద రిటైనింగ్ వాల్ ఒకటి ప్రభుత్వం కట్టించడానికి కూడా రామకృష్ణశర్మగారి చొరవనేకారణమని కూడా ఆ పుస్తకంలో చదివిన గుర్తు ఉంది.

రామకృష్ణశర్మగారి పుస్తకాలేవైనా మూజియంలో ఉన్నాయా అని అడిగాను. ఆ గైడు రామకృష్ణశర్మగారి పేరైతే విన్నాడుగానీ ఆయన పుస్తకాలేవీ చదివినట్టు లేదు. నేను అలంపురం నుంచి తిరిగి వచ్చేస్తుండగా బంగారు రామాచారి గారికి ఫోన్ చేసి రామకృష్ణశర్మగారి ఆత్మకథ నాకు దొరుకుతుందా అనడిగాను. ‘ఆ పుస్తకం మీద మీరు రాసిన సమీక్షతో వేసిన ప్రతి ఒకటి నా దగ్గరుంది, పంపిస్తాను, దానితో పాటు, 1953 లో ఆంధ్రసారస్వత పరిషత్తు ఏడవమహాసభ అలంపురంలో నిర్వహించినప్పటి సావనీరు కూడా పంపిస్తాను’ అన్నారు. నేను అలంపురం పొలిమేరలు దాటే లోపలనే ఆయన ఆ సావనీరుతో పాటు, గడియారం రామకృష్ణశర్మగారు రాసిన ‘అలంపూరు శిథిలములు’ (1946) ‘అలంపుర క్షేత్రం’ (1956), ‘దక్షిణ కాశి అలంపూరు క్షేత్రం’ (1956), ‘అలంపురం’ (1976) అనే పుస్తకాలు కూడా పంపించారు.

వీటితో పాటు డా.ఎన్.రమేశన్ ఆర్జియాలజీ డైరక్టరుగా ఉన్నప్పుడు అలంపురం మీద ఆర్కియాలజీ డిపార్ట్ మెంటు ప్రచురించిన ఫోల్డరు కూడా పంపించారు. ఇప్పుడు ఈ మూజియం నిర్వహిస్తున్నది ఆర్కియాలజీ డిపార్ట్ మెంటునే కాబట్టి ఆ ఫోల్డరు మళ్ళా ముద్రించి ఉండవచ్చు. కానీ అటువంటి ఫోల్డరు ఒకటి తమ డిపార్ట్ మెంటు గతంలో ముద్రించిందని ఆ మూజియం సిబ్బందికి తెలిసినట్టు లేదు.

ఇక శర్మగారు రాసిన నాలుగు పుస్తకాల్లోనూ అలంపురం శిథిలాలు అన్నది మొదటి పుస్తకం. 1946 లో అచ్చయిన ఆ పుస్తకంలోని విశేషాల్నే ఆయన మరింత విపులంగా ఎప్పటికప్పుడు అదనపు సమాచారం జోడిస్తూ తక్కిన మూడు పుస్తకాలూ కూడా వెలువరించినట్టు అర్థమవుతున్నది. వాటిల్లో ‘దక్షిణ కాశి అలంపురం’ అన్న పుస్తకం ఆయన దేవస్థానంకోసం రాసారు. ఆ పుస్తకం చివరి ముద్రణ 2005 లో వచ్చినట్టుగా ఉంది. ఆ తర్వాత మలిముద్రణలు వచ్చేయో లేదో తెలియదు. కాని తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా శ్రీజోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడ్డాక అయినా, ప్రభుత్వం ఈ పుస్తకాల్ని పునర్ముద్రించవలసి ఉండింది. లేదా ఈ నాలుగు పుస్తకాల్లోని సమాచారాన్ని, శర్మగారి తర్వాత మరెవరైనా పరిశోధకులు మరింత సమాచారం సేకరించి ఉంటే, దాన్ని కూడా జోడించి, ఒక సమగ్రమైన గ్రంథం తీసుకురావలసి ఉండింది. ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేసి జోగులాంబ అమ్మవారి పేరుపెట్టినందుకైనా ప్రభుత్వమో, లేదా కనీసం జిల్లా యంత్రాంగమైనా ఈ పని చేసి ఉండవచ్చు.

నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే, సివిల్ సర్వీసు పరీక్షలకి ప్రిపేరయ్యే ఏ విద్యార్థిని అడిగినా ఐహోళె గురించి చెప్పకుండా ఉండడు. కాని ఐహోళెతో సమానమైన చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ఒక ప్రాచీన పట్టణం తెలంగాణాలో ఉందని ఎంతమందికి తెలుసు?
అలంపురం దేవాలయాల గురించి శర్మగారు రాసింది చదివిన తర్వాత నాకు ఐహోళె కన్నా అలంపురమే మరింత విశిష్టమైన క్సేత్రమనిపించింది.
ఎందుకంటే, అలంపురం ప్రాగైతిహాసిక కాలం నుంచీ కూడా ఒక ముఖ్యజనావాసంగా ఉంటున్నదని చెప్పే ఆధారాలు దొరుకుతున్నాయి. ఐహోలు, పట్టడకల్లు లలో బాదామి చాళుక్యులు దేవాలయ నిర్మాణాలు మొదలుపెట్టినప్పుడే అలంపురంలో కూడా మొదలుపెట్టారు. ఏ కారణం వల్లనో గాని, రెండవపులకేశి అలంపురం క్షేత్రం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడని మనకు ఆ చారిత్రిక అవశేషాలు సాక్ష్యం చెప్తున్నాయి. వైదిక ధర్మం హిందూమతంగా మారే క్రమంలో ప్రముఖపాత్ర వహించిన – శైవ, వైష్ణవ, సౌర, శాక్త, గాణాపత్య, కౌమారాలు ఆరింటికీ సంబంధించిన దేవాలయాలు అలంపురంలో ఉన్నాయి. ఇలా ఒక క్షేత్రం మొత్తం ఒక షడాయతనంగా రూపొందినప్పుడు దాన్ని భాస్కర క్షేత్రం అంటారట. భారతదేశంలో భాస్కర క్షేత్రాలు చాలా అరుదు, అపురూపం. ఐహోళె అటువంటి భాస్కర క్షేత్రం అవునో కాదో నాకు తెలియదుగాని, అలంపురం అటువంటి క్షేత్రం.

భారతీయ దేవాలయ నిర్మాణంలో ప్రధానంగా మూడు రకాల శైలులు ఉన్నాయి. అవి నాగర, వేసర, పల్లవ శైలులు. ఇందులో నాగర, వేసర రీతులు ఉత్తరాది శైలులు. పల్లవ శైలి దఖిణాది శైలి. బాదామి చాళుక్యులు దేవాలయ నిర్మాణంలో ప్రయోగాలు మొదలుపెట్టినప్పుడు ఉత్తర-దక్షిణ రీతుల్ని మేళవించి నాగరరేఖాప్రాసాద శైలి అనే ఒక కొత్త శైలిని రూపొందించారు. శర్మగారు రాసినదాని ప్రకారం చాళుక్యులు ఈ శైలిలో ఉత్తర వాస్తు రీతిలో ఉండే ఎత్తైన విమానం, ద్వారబంధాలకు చిత్రాలంకరణ శిల్పం అనే రెండు లక్షణాల్ని తీసుకున్నారు. దక్షిణ శైలిలో ఉండే విశాలమంటపం, ప్రదక్షిణాపథం, గోడలకి బయట కోష్ఠ పంజరం, పురాణగాథల చిత్రణ తీసుకున్నారు. ఈ నాగరరేఖా ప్రాసాద శైలి చాళుక్యశైలిగా గుర్తింపు పొందింది. దాదాపుగా నవబ్రహ్మ ఆలయాలన్నీ ఈ రీతిలోనే కట్టారు.

ఆ తర్వాత పులకేశిమీద పల్లవ నరసింహవర్మ దండయాత్ర చేసినప్పుడు ఆయన అలంపురంలో ఆగేడనీ, అందువల్ల పల్లవశైలి కూడా అలంపురంలో అడుగుపెట్టిందనీ శర్మగారు రాస్తున్నారు. ఆ పల్లవశైలినే ద్రావిడవిమానశైలి అంటారనీ పల్లవసేనాపతులు కట్టించిన ఒక శుద్ధ ద్రావిడ శైలి ఆలయాన్ని కూడా మనం అలంపురంలో చూడవచ్చుననీ శర్మగారు రాసారు.

బాదామి చాళుక్యులకీ, పల్లవులకీ మధ్య యుద్ధాలు ముగిసి ఆ రెండు రాజవంశాలూ కనుమరుగయ్యాక తలెత్తిన కల్యాణి చాళుక్యుల కాలంలో కదంబ విమాన శైలి ఆలయాలు అలంపురంలో ప్రత్యక్షమయ్యాయి. ఇవి కాక త్రిక దేవాలయ శైలిలో నిర్మించిన సూర్యదేవాలయాలు కూడా ఇక్కడున్నాయి. ఇక నరసింహస్వామి ఆలయంలో ఈ పూర్వరీతులన్నిటితో పాటు శ్రీకృష్ణదేవరాయల కాలంలో తీర్చిదిద్దిన విజయనగర శైలి కూడా కనిపిస్తున్నదని శర్మగారు వివరిస్తున్నారు.

అంటే దాదాపు అయిదారు శతాబ్దాలు మొదలుకుని పదిహేను, పదహారు శతాబ్దాల దాకా వెయ్యేళ్ళపాటు దక్షిణభారతదేశంలో సంభవించిన దేవాలయ నిర్మాణ పరిణామం మొత్తం మనం అలంపురంలో చూడవచ్చునన్నమాట. కేవలం దక్షిణాది అని మాత్రమే కాదు, ఉత్తర-దక్షిణ సంస్కృతుల సమన్వయం ఎలా జరుగుతూ వచ్చిందో కూడా చూడవచ్చు. ఆంధ్ర చరిత్రలో, సంస్కృతి నిర్మాణంలో వేంగీ చాళుక్యులు పోషించిన పాత్ర; తెలంగాణా చరిత్ర, సంస్కృతిలో వేములవాడ చాళుక్యులు పోషించిన పాత్ర మనకు తెలుసు. ఆ రెండు రాజవంశాలకూ బాదామి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు నమూనాగా ఉన్నారు. కాబట్టి బాదామి చాళుక్యుల నుంచి కాకతీయులదాకా, ఆ తర్వాత విజయనగర కాలం దాకా మన చరిత్ర, సంస్కృతి రూపొందిన క్రమం మొత్తం మనం అలంపురం శిల్పాల్లో అధ్యయనం చెయ్యవచ్చన్నమాట.
ఇందుకొక ఉదాహరణ చెప్తాను. అక్కడ మూజియంలో బాదామి చాళుక్యుల కాలం నాటి విష్ణు శిల్పాలున్నాయి. అవి ఎర్రరాతి శిల్పాలు. ఆ శిల్పాల్లో విష్ణువు వదనం గుండ్రంగా కనిపిస్తుంది.

ఆ మూర్తులు నాత్యలంకారమూర్తులు. ఆ విగ్రహాలకు ఆభరణాలు, వస్త్రాలు, శిరోభూషణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అంటే బౌద్ధ శిల్పాన్ని అనుసరించే క్రమంలో, విష్ణువుని సంభావించడానికి బుద్ధశిల్పాన్ని ఆ శిల్పులు నమూనాగా తీసుకున్నారని అనుకోవచ్చు. అదే విష్ణుమూర్తి ముఖం పది, పదకొండు శతాబ్దాలు దాటినతర్వాత కోలగా మారింది. ఆభరణాలూ, మేలిమి వస్త్రాలూ శిల్పంలో ద్యోతకం కావడం మొదలుపెట్టాయి. మరొక విధంగా చెప్పాలంటే బాదామీ చాళుక్యుల కాలం నాటి సమాజం కన్నా విజయనగర సామ్రాజ్య కాలం నాటి సమాజంలో సంపద మరింతగా పోగుపడిందని ఆ అలంకారాలు మనకి సాక్ష్యమిస్తున్నాయి.

ఇలా ఆ మూజియంలోని శిల్పాల్ని మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చు. భారతదేశంలో మరెక్కడా కనిపించనంత విస్తారంగా బ్రహ్మ విగ్రహాలు, సూర్య విగ్రహాలు అలంపురం క్షేత్రంలో కనిపిస్తున్నాయి. శర్మగారు తన కాలం నాటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వీటన్నిటినీ స్థూలంగా స్పృశించి వదిలిపెట్టారు. కాని ఆ తర్వాత ఆ అధ్యయనం ఒక్క అడుగుకూడా ముందుకు జరిగినట్టు లేదు. ఇదే నన్ను కలతపెట్టే అంశం.
అన్నట్టు మరో విషయం కూడా రాసితీరాలి. విశ్వబ్రహ్మేశ్వరాలయం పడమటి గోడమీద వరూధినీ ప్రవరుల కథ చెక్కి ఉందనీ, 1521లో కృష్ణదేవరాయలు అలంపురం వచ్చినప్పుడు, పెద్దన కూడా వచ్చాడనీ, అప్పుడు ఈ గోడ మీద శిల్పాన్ని చూసి ఉంటాడనీ, అప్పుడే మను చరిత్ర రాయటానికి సంకల్పించి ఉంటాడనీ శర్మగారు రాశారు. మహా నదులు పుట్టిన చోటుల్లానే మహాకావ్యాలు పుట్టిన తావులు పట్టుకోవడం కూడా అంత చిన్న విషయం కాదు.
మొత్తానికి ఆ మూజియంలో గడిపిన గంటసేపట్లోనూ టైం మెషీన్ ఎక్కి పది శతాబ్దాల పాటు ప్రయాణించి వచ్చాను. ఇంటికి తిరిగివచ్చాక కూడా ఆ దేవీదేవతలు నాతో పాటే ఉన్నారు. మరొకసారి అలంపురానికి రమ్మనీ తమతో పాటు మరికొంతసేపు గడపమనీ నన్ను పదే పదే అడుగుతూ ఉన్నారు.
21-9-2024


శుభోదయం సార్. అలంపురం గురించి చాలా విషయాలు తెలియజేసారు. ధన్యవాదాలు. ఇటువంటి విషయాలు లోతుగా అధ్యయనం చేసి ఇట్లా చెప్పే సాహిత్యకారులు నాకు మరొకరు తెలియరు.
ప్రకాశం జిల్లా సత్యవోలులో రామలింగేశ్వర స్వామి ఆలయం వుంది సార్. 6, 7శతాబ్దాలలో బాదామి చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారని అంటారు. చూడదగిన ఆలయం. గిద్దలూరు పట్టణానికి 5-6 k.m. దూరంలో ఉంది. మీరు ఈ దేవళం గురించి వినివుంటారనుకుంటున్నాను.
ధన్యవాదాలు. సత్య వోలు ఆలయం గురించి నాకు తెలియదు. ఎప్పుడైనా తప్పకుండా చూస్తాను.
నేను 2016 లో వెళ్ళేనండీ. అద్భుతమైన ఆలయం. సరిగ్గా అమ్మవారికి సాయం సంధ్యా హారతులు ఇచ్చే సమయానికి వెళ్ళాను. అదొక గొప్ప అనుభూతి. ఆ ఆలయంలో శిల్పకళ, ప్రక్కనే నిండుగా ప్రవహించే తుంగభద్ర, మనస్సును ప్రాపంచిక విషయాలనుండి మళ్లిస్తాయి!
ధన్యవాదాలు
Pranams, A Marvalous work done in creative world, our today’s existence depends on our culture , heritageand Sanathsna Dharma. The temples are meditation and vibrative dyana places to people to assemble, to pray God or Goddess. The anicient Bharatha varsha paved way to civilization and culture. Your presentations definitely show path way to youth. The Government must come farword to take up great works , for protecting the our culture and Heritage.
పరిపాలనా కాలంలో నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి సంభవించింది. మీరు ఈ కోణంలో మరో వ్యాసం వ్రాయవచ్చు.
నా దృష్టి ప్రధానంగా అక్కడ ఏముంది, దాన్నుంచి ఏం గ్రహించగలం అన్నదాని మీదనే.
అలంపూర్ రెండు, మూడు సార్లు వెళ్లాను. ఒకసారి వెళ్ళినప్పుడు, బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో పూజారి అక్కడ స్థల పురాణం చెప్పారు. మీరన్నట్టు ఏదైనా పుక్కిట పురాణమేమో తెలియదు.. కానీ
శతాబ్దాల కిందట అక్కడ కొందరు సిద్ధులు
పరసవేదికి సంబంధించిన ప్రయోగాలు చేసారు అనికూడా చెప్పాడాయన.
లోపల సిద్ధుల విగ్రహాలు ఉన్నాయి. మీరు ఆవిషయం కూడా ప్రస్తావిస్తారని అనుకున్నా.
మీ వ్యాసం లో అక్కడ మనుచరిత్ర పుట్టిన చోటుగా.. చెబుతూ “మహాకావ్యాలు పుట్టిన తావులు” అనడం నచ్చింది.మీ వ్యాసాలనుండి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ధన్యవాదాలండీ🙏
ధన్యవాదాలు మేడం
మీరు ఏది చదివినా అది చూసినా ఇది మాకొక కొత్త పాఠ్యాంశం అవుతుంది. మా చిన్నతనంలో
అలంపురం పాఠం ఉండేది. ఇప్పుడిది స్నాతకోత్తర పాఠం .
ధన్యవాదాలు సార్!
మీతో పాటు అలంపురం దేవాలయ అక్షర చిత్ర యాత్ర చేయించారు సర్ భద్రుడుగారు . మీ ఈ ట్రావాలాగ్ భారతదేశ (దక్షిణ భారత )దేవాలయాల
వాస్తు ,శిల్ప సంపదల పరిణామ క్రమ వర్ణన చరిత్ర పరిశోధన విద్యార్థులకు ఒక రిఫరెన్స్ ఆర్టికల్ గా ఉపయోగపడుతుంది .
ధన్యవాదాలు .
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
నేనూ మీతో పాటే వచ్చేసాను. ఎందుకంటే… మా అమ్మ పేరు జోగులాంబ.బంగారు తల్లి. మొత్తం పిచ్చి పట్టినట్టు చదివేశాను. అమ్మ కనిపించడం అంటే అదేమన్నా మాములు విషయమా? అందులో చెప్తుంది ఎవరు? పసిడి పలుకుల బంగారు తండ్రి. చినవీరభద్రుడు.
నమోనమః
ధన్యవాదాలు
భాస్కర క్షేత్రం అలంపురం గురించి మీ వివరణాత్మక వ్యాసం మళ్ళీ ఓసారి అక్కడకు వెళ్లి చూడమని ప్రేరేపిస్తోంది. ధన్యవాదాలు
ధన్యవాదాలు మేడం