స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ లో ఇంటర్నేషనల్ ఆర్ట్ షో మొదలయ్యిందని విన్నప్పణ్ణుంచీ వెళ్ళాలనుకున్నవాణ్ణి ఇవాళ్టికి వెళ్ళగలిగాను. నాతో పాటు అమృత కూడా వచ్చింది. మొదటిరోజే వెళ్ళగలిగి ఉంటే బహుశా పికాసో చిత్రలేఖనాలు ఒకటి రెండేనా ఒరిజినల్స్ చూసే అవకాశం దొరికి ఉండేది. కాని హుస్సేన్ వి వాటర్ కలర్స్ మూడు, సౌజా, అరా, లక్ష్మాగౌడ్ వంటివారి చిత్రలేఖనాలు ఇంకా ప్రదర్శనలో ఉండటంతో వెళ్ళినందుకు సంతోషమే మిగిలింది.
ఈ షో ని క్యురేట్ చేసిన స్టాలిన్ గారిని అడిగితే దాదాపు నూట ఇరవై మంది చిత్రకారులవి రెండువందల దాకా చిత్రలేఖనాలు ప్రదర్శనలో పెట్టామని చెప్పారు. ప్రత్యేకంగా థీం అంటూ ఏదీ అనుకోలేదనీ, చిత్రకారులు తమ వర్క్ లో ఏవి బాగా అనిపిస్తే వాటిని ప్రదర్శించడానికే తాము మొగ్గు చూపించామనీ అన్నారు.

మామూలుగా ఇటువంటి ప్రదర్శనల్లో బ్రోచర్లు లేదా చిత్రలేఖనాల వివరాలతో ఉండే కాటలాగులు పెడుతుంటారుగాని, ఈ సారి అటువంటివేవీ లేవు. ప్రదర్శనకు వచ్చిన చిత్రలేఖనాలతో ఒక పుస్తకం త్వరలో తేబోతున్నామని మాత్రం చెప్పారు. ఇంటర్నేషనల్, నేషనల్ చిత్రలేఖనాలు ముప్ఫై నలభై దాకా ఉన్నాయని అన్నారుగాని, నాకైతే అన్ని కనిపించలేదు. బహుశా సెక్యూరిటీ కారణాల వల్ల పికాసో లాంటివాళ్ళని మొదటిరోజు ప్రదర్శన తర్వాత తీసేసి ఉండవచ్చు.
అంతర్జాతీయ ప్రశస్తి పొందిన చిత్రకారులు కాక, తెలుగు రాష్ట్రాల చిత్రకారులు కాక, దేశస్థాయిలో మరొక ముప్ఫై మందిదాకా చిత్రకారులు కూడా పాల్గొన్నారని స్టాలిన్ అన్నారు. అయితే చిత్రకళాప్రదర్శనకి ఒక ఇతివృత్తమంటూ ప్రత్యేకంగా ఏమీ లేనందువల్లా, వివిధ చిత్రకారుల కృషి ఎలా వచ్చినదాన్ని అలా ప్రదర్శించినందువల్లా వైవిధ్యం ప్రధాన ఆకర్షణగా ఉండింది. వస్తువులోనూ, మాధ్యమాల్లోనూ, చిత్రలేఖనాలు గీయడానికి వాడిన గ్రౌండ్ లోనూ కూడా వివిధత్వం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. జానపదరీతులు మొదలుకుని నగర జీవిత సమ్మర్దందాకా ఎన్నో దృశ్యాలు ఎన్నో రీతుల్లో కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏక్రిలిక్ మాధ్యమంతో పాటు మిక్సెడ్ మీడియా కూడా ప్రముఖస్థానం ఆక్రమించింది. అయితే హుస్సేన్ వి తప్ప మరే వాటర్ కలర్స్ నాకు కనిపించలేదు. వివిధ వాద్యాలతో బిగ్గరగా వినిపిస్తున్న బాండ్ లాంటి ఆ చిత్రకళా ప్రదర్శనలో వాటర్ కలర్స్ ఉండి ఉంటే ఒకటి రెండు లలితగీతాల్ని కూడా విన్న అనుభూతి మిగిలి ఉండేది.
అలాగే లాండ్ స్కేప్స్, స్టిల్ లైఫ్స్ కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో లేవు. ఉన్నవాటిలో ఏలూరుకి చెందిన పంతంగి శ్రీనివాస్ అనే చిత్రకారుడు హైపర్ రియలిస్టిక్ గా చిత్రించిన సీతాఫలాల బొమ్మ చాలా తాజాగానూ, దగ్గరికి రమ్మని పిలిచేదిగానూ కనిపించింది.

ఒకరిద్దరు చిత్రకారులు నన్ను గుర్తుపట్టేరు. వారిలో సిద్ధిపేటకు చెందిన అహోబిలం ప్రభాకర్ ఒకరు. ఆయన ఏక్రిలిక్ లో చిత్రించిన రాధాకృష్ణులు చిత్రకళపైన ఆయన పట్టుని తెలియచేసేదిగా ఉంది.

చాలాకాలం పాటు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడుకేషన్ టెక్నాలజీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసిన మురళిప్రసాద్ గారు మిక్సెడ్ మీడియాలో చిత్రించిన శివుడు, కైలాసశిఖరశ్రేణి చిత్రాలు కూడా ఆయన సాధనని పట్టిచ్చేవిగానే ఉన్నాయి.

ఇక మా బంధువూ, ఒంగోలుకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు డా.మాచిరాజు కాన్వాసులు కూడా మనల్ని నోరారా పిలిచి మరీ పలకరిస్తున్నాయి. వాటితో పాటు డా.మాచిరాజు దంపతులను కలుసుకోవడం కూడా ఒక సంతోషం ఈ రోజుకి.

తిరిగి వస్తూండగా అమృతని అడిగాను, నీకెలా అనిపించింది ఈ ప్రదర్శన అని. ఇంకా స్పష్టత రావాలి, ఇంకా సాధన చెయ్యాలి అంది. అవును, చిత్రకారుడికి కావలసింది సహృదయ వీక్షకులు, ఆ తర్వాతే ఆర్ట్ కలెక్టర్లు. ఎంత మంది అప్రిషియేటర్లు తమ చిత్రలేఖనాలు చూస్తే చిత్రకారులకి అంత ఉత్తేజం దొరుకుతుంది.
అందుకనే ఇలా చిత్రకళా ప్రదర్శనలకు వెళ్ళినప్పుడల్లా నాకు కలిగే చింతనే మళ్ళా ఇప్పుడు కూడా నన్ను కమ్ముకుంది. ఎందుకని మన పౌరసమాజానికి ఇటువంటి కళాప్రదర్శనల పట్ల ఆసక్తి ఉండదు? ఇలాంటి గాలరీల్లో ఎంతసేపూ చిత్రకారులూ, ఆర్ట్ కలెక్టర్లూ, ఇంటీరియర్ డిజైనర్లూ, మీడియా తప్ప మరెవరూ కనిపించరెందుకు? మల్టీప్లెక్సుల్లో తొక్కిసలాడుతూ, అక్కడ ఫుడ్ కౌంటర్లదగ్గర పొడుగాటి క్యూలల్లో నిలబడి ఆవురావురుమంటూ పెద్ద పెద్ద పాప్ కార్న్ పొట్లాలు రెండుచేతుల్లోనూ మోసుకుంటూ థియేటర్లలోకి నడుచుకుంటూపోయే మన నాగరిక సమాజానికి ఈ చిత్రకళా ప్రదర్శనల పట్ల ఆసక్తి ఎప్పటికి అంకురిస్తుంది? ఒక ఆదివారం తమ పిల్లల్తో, బంధుమిత్రుల్తో కలిసి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్ళి కొంతసేపు ఆ చిత్రలేఖనాలు చూసి అక్కడున్నప్పుడూ, తిరిగివచ్చేటప్పుడూ ఒక హుస్సేన్ గురించీ, ఒక తోటవైకుంఠం గురించీ మనవాళ్ళు సంతోషంగా మాట్లాడుకునే రోజులు నా జీవితకాలంలో చూడగలనా?
17-9-2024

“ఎందుకని మన పౌరసమాజానికి ఇటువంటి కళాప్రదర్శనల పట్ల ఆసక్తి ఉండదు?”
What a pertinent emotion…Sir!
Perfection is not loved in this imperfect world, Sir.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
వివిధ వాద్యాలతో బిగ్గరగా వినిపిస్తున్న బాండ్ లాంటి ఆ చిత్రకళా ప్రదర్శనలో వాటర్ కలర్స్ ఉండి ఉంటే ఒకటి రెండు లలితగీతాల్ని కూడా విన్న అనుభూతి మిగిలి ఉండేది.
తిరిగి వస్తూండగా అమృతని అడిగాను, నీకెలా అనిపించింది ఈ ప్రదర్శన అని. ఇంకా స్పష్టత రావాలి, ఇంకా సాధన చెయ్యాలి అంది. అవును, చిత్రకారుడికి కావలసింది సహృదయ వీక్షకులు, ఆ తర్వాతే ఆర్ట్ కలెక్టర్లు. ఎంత మంది అప్రిషియేటర్లు తమ చిత్రలేఖనాలు చూస్తే చిత్రకారులకి అంత ఉత్తేజం దొరుకుతుంది.
అందుకనే ఇలా చిత్రకళా ప్రదర్శనలకు వెళ్ళినప్పుడల్లా నాకు కలిగే చింతనే మళ్ళా ఇప్పుడు కూడా నన్ను కమ్ముకుంది. ఎందుకని మన పౌరసమాజానికి ఇటువంటి కళాప్రదర్శనల పట్ల ఆసక్తి ఉండదు? ఇలాంటి గాలరీల్లో ఎంతసేపూ చిత్రకారులూ, ఆర్ట్ కలెక్టర్లూ, ఇంటీరియర్ డిజైనర్లూ, మీడియా తప్ప మరెవరూ కనిపించరెందుకు? మల్టీప్లెక్సుల్లో తొక్కిసలాడుతూ, అక్కడ ఫుడ్ కౌంటర్లదగ్గర పొడుగాటి క్యూలల్లో నిలబడి ఆవురావురుమంటూ పెద్ద పెద్ద పాప్ కార్న్ పొట్లాలు రెండుచేతుల్లోనూ మోసుకుంటూ థియేటర్లలోకి నడుచుకుంటూపోయే మన నాగరిక సమాజానికి ఈ చిత్రకళా ప్రదర్శనల పట్ల ఆసక్తి ఎప్పటికి అంకురిస్తుంది? ఒక ఆదివారం తమ పిల్లల్తో, బంధుమిత్రుల్తో కలిసి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్ళి కొంతసేపు ఆ చిత్రలేఖనాలు చూసి అక్కడున్నప్పుడూ, తిరిగివచ్చేటప్పుడూ ఒక హుస్సేన్ గురించీ, ఒక తోటవైకుంఠం గురించీ మనవాళ్ళు సంతోషంగా మాట్లాడుకునే రోజులు నా జీవితకాలంలో చూడగలనా?
మీ ఫీల్ నాకు అర్థం అయి కన్నీళ్ళు వచ్చాయి. ఒకమనిషి భావన అదే విధంగా అందాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి సార్.
ఇప్పటి వేలం వెర్రి సినిమాలు. ఓ చెత్త యవ్వన, మోహపు ప్రేమకథలు.
లేదా కీర్తి కాంక్ష. అహం తో ముందుకి సాగే జనం.
ప్చ్.
ధన్యవాదాలు
anguishతో అడుగుతున్నారు, మీరు. ముందు చిత్రకళను appreciate చెయ్యగలిగే స్థాయి ప్రజకు ఉండాలి కదండీ. నేనెంత ప్రయత్నించినా నాలో ఉన్న చిత్రకళను గుర్తించి appreciate చేసే skills పెరగలేదు. మీరు సూచించగలరు.
-వాసు-