ఒక సంభాషణ

ప్రసిద్ధ కవి శిఖామణి సంపాదకత్వంలో వెలువడుతున్న కవిసంధ్య పత్రిక యాభయ్యవ సంచిక విడుదలవుతున్న సందర్భంగా నాది కూడా ఒక ఇంటర్వ్యూ కావాలని అడిగాడు. కవిత్వానికి సంబంధించి నన్ను ప్రశ్నలు అడగడానికి తగినవారిగా నా మనసులో ఎవరేనా ఉన్నారా అని కూడా అడిగాడు. నాకు ఎవరూ స్ఫురించలేదు. ఆయన్నే నిర్ణయించమన్నాను. ఆ తర్వాత మళ్ళా ఫోన్ చేసి నన్ను ఇంటర్వ్యూ చెయ్యడానికి వాసు ఒప్పుకున్నారని చెప్పాడు. వాసు పేరు వినగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. వాసు పేరు నాకు ముందే ఎందుకుతట్టలేదనుకున్నాను. వాసు స్వయంగా అద్భుతమైన కవి, భావుకుడు, నా కవిత్వాన్ని చదివినవాడు. నా కవితల్ని ఇష్టపడేవాడు కూడా. ఎవరేనా మన రచనలు చదివినవాళ్ళు మనల్ని మన సాహిత్యంగురించి ప్రశ్నిస్తే అదొక లెర్నింగ్ ఎక్స్ పీరియెన్సుగా ఉంటుంది. మన గురించి మనకి కొత్త పార్శ్వాలు బోధపడతాయి. మనం చేస్తున్న కృషి మరింత కాలం కొనసాగించడానికి కొత్త ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆ విధంగా వాసూకీ నాకూ మధ్య జరిగిన సంభాషణ ఇది. కవిసంధ్య పత్రికలో ఈ సంభాషణ మరీ ఎక్కువపేజీలు ఆక్రమించకూడదన్న ఉద్దేశ్యంతో నేను నా జవాబులు వీలైనంత కుదించుకుని చెప్పాను. వాటికి మీ బ్లాగులో వివరంగా జవాబులు రాయండి అని వాసు అన్నాడుగాని, ప్రస్తుతానికి ఆ ఇంటర్వ్యూ వేడిచల్లారకముందే మీతో పంచుకుంటున్నాను.


చినవీరభద్రుడూ, ఇది కవిసంధ్య కోసం నేను చేస్తున్న ఇంటర్‌వ్యూ. ఇది కవిత్వానికే చెందిన సంభాషణ.

జ. ఎప్పుడేనా, ఏ దేశంలోనేనా, పూర్వ కవిత్వాన్ని అర్థం చేసుకోడానికీ, కఠినమైన పదాలకు అర్థాలు చెప్పడానికీ, విశేషాంశాలూ బోధపరచడానికీ విమర్శ పనికొస్తుందిగాని, సమకాలంలో వస్తున్న కొత్త తరహా కవిత్వాన్ని గుర్తుపట్టడంలో విమర్శ ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటుంది. ఉదాహరణకి అప్పకవి పోతనని తక్కువచేసాడు. కాని చెళ్ళపిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పోతన తెలుగువాళ్ళ మహాకవిగా మారాడు. కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఉమాకాంతం పులుముడు కవిత్వం అన్నాడు. కాని శ్రీ శ్రీ తనకి దారి చూపించింది కృష్ణశాస్త్రి కవిత్వమే అని అన్నాడు.

జ. కవిత్వం ఒక charged utterance. విద్యున్మయ వాణి. కాలరిడ్జి చెప్పినట్టుగా best words in best order.

జ. నిర్వికల్ప సంగీతం చాలా ప్రభావాలనుంచి బయటపడుతూ సొంతగొంతు వెతుక్కోడానికి చేసిన ప్రయత్నం. అప్పట్లో నా సమస్యకి రెండు పార్శ్వాలు. ఒకటి మా ఊళ్ళో చిన్నప్పణ్ణుంచీ నేను చూస్తూ వచ్చిన ప్రాకృతిక సౌందర్యం. రెండోది, దాన్నుంచి దూరంగా రావలసినందువల్ల మానసికంగా కలిగిన alienation. అందుకనే ‘నా కవిత్వమంతా ఎల్లల్లేని హోం సిక్ నెస్స్ నుంచి పొంగిందే’ అని రాసుకున్నాను. అందుకని ఆ సౌందర్యాన్ని చిత్రించడానికీ, ఆ పరాయీకరణని చిత్రించడానికీ కావలసిన సామర్థ్యం కోసం నేనెంతోమంది కవుల వైపు చూస్తో ఉండేవాణ్ణి. ఆ పుస్తకంలో ‘విశ్వవీణ’ పేరిట నేను అనువదించిన కొందరు ప్రపంచకవులున్నారు. వాళ్ళంతా నన్ను ప్రభావితం చేసారు. అయినా సూటిగా చెప్పాలంటే అది టాగోర్ లో మునిగి బైరాగిలో తేలిన కాలం.

జ. ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మకు సి.వి.కృష్ణారావుగారు ముందుమాట రాసారు. ఆ తర్వాత ఆ కవిత్వానికి మీవంటి సహృదయుడు లభించాడు. ఒక కవి జీవితకాలంలో ఇద్దరు పాఠకులు దొరకడం కన్నా ఆ కవికి గొప్ప భాగ్యం మరొకటి ఉంటుందనుకోను.

జ. నాకు బైరాగి కన్నా అజంతా కవిత్వమే ముందు పరిచయం. అజంతా వ్యక్తిగతంగా కూడా తెలుసు. నా ‘నిర్వికల్ప సంగీతం’ పుస్తకం ఆయనకి పంపిస్తే ‘అద్భుతం, మరో మాట లేదు’ అని ఒక కార్డు రాసాడు కూడా. కాని కవిత్వానికి వచ్చేటప్పటికి బైరాగితో అజంతాని పోల్చలేను. గురజాడ, శ్రీ శ్రీ, బైరాగి- ఈ ముగ్గురూ తెలుగులో నా ఆధునిక కవిత్రయం అని నేను చెప్పుకుంటానని మీకు తెలుసు.

జ. మీరన్నట్టే.

జ. శ్రీ శ్రీని చదవకపోతే ఇరవయ్యవ శతాబ్దం బోధపడదు, తెలుగు కవిత్వంలోనూ, ప్రపంచకవిత్వంలోనూ కూడా. శ్రీ శ్రీని చదవకపోతే, తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరేదాకా ఒక కవి అంతర్ బహిర్ యుద్ధమెలా కొనసాగిస్తుండాలో బోధపడదు.

జ. కవిత్వం ఒక సాధికారిక ప్రక్రియ. ఇంతదాకా కులం, ప్రాంతం, లింగం అనే ప్రాతిపదికలమీద నిరాదరణకూ, అప్రధానీకరణకూ గురైనవారికి ఒక ఐడెంటినీ, అస్తిత్వ ధైర్యాన్నీ అందించడంలో కవిత్వం ఇచ్చే ఆసరా గొప్పది. అయితే, స్వానుభవం, సహానుభవం అని రెండున్నాయి. మహాభారతం స్వానుభవం అనీ, రామాయణం సహానుభవం అనీ శెషేంద్ర ఒకచోట రాసాడు. మహాభారతం స్వానుభవం ఎందుకంటే కురుక్షేత్రంలో ప్రవహించింది వ్యాసుడి రక్తమే కాబట్టి. కాని అంతిమంగా కావ్యంగా గుర్తింపు పొందింది రామాయణం కాని మహాభారతం కాదు. మహాభారతానికి అంతకన్నా ఎక్కువ గౌరవం లభించి ఉండవచ్చు. దాన్ని వేదంతో సమానంగా లెక్కే సారని మనకి తెలుసు. కాని రామాయణాన్నే తొలి కావ్యం అన్నారు. తోటిమనిషి సంతోషానికో, కష్టానికో చలించి, చెప్పిన మాటలు, ఆ సుఖదుఃఖాలతో సంబంధం లేనివాళ్లని కూడా చలింపచేయగలిగినప్పుడే కవిత్వం సార్వజనీనమవుతుంది.

జ. దాశరథి కాదు, కొంత వరకూ ఇస్మాయిల్ అని చెప్పవచ్చు. కానీ అది కూడా ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ సంపుటం వరకూ మాత్రమే. నీటిరంగుల చిత్రం నుంచీ నన్ను శిల్పపరంగా ప్రభావితం చేసిన కవులు రిల్క, తోమాస్ ట్రాన్స్ ట్రోమర్. ఇప్పుడైతే యెహుదా అమిహాయి, చెస్లావ్ మీవోష్, లూయీ గ్లక్ లు. శబ్దాలంకారాల్నీ, అర్థాలంకారాల్నీ దాటిన స్థితిలో అనుభవాన్ని కవితగా మార్చడమెలానో వారికి తెలుసు.

నిజమైన కవిత పుట్టే తావులో వ్యక్తి, సమష్టి అంటో విడివిడిగా ఉండరు. అందుకనే ఆత్మాశ్రయం, వస్త్వాశ్రయం అని కవిత్వాన్ని స్థూలంగా విభజించిన తెలుగు కవిత్వ విమర్శ పట్ల నాకు చెప్పలేనంత అసహనం. ప్రాచీన సంగం కవుల్ని చూడండి, తాంగ్ యుగానికి చెందిన చీనా కవుల్ని చూడండి, గాథాసప్తశతి కవుల్ని చూడండి. అక్కడ వ్యక్తీ, సమష్టీ అని రెండు లేవు. ఒక అనుభవం ఉంటుంది, దాన్ని అనుభూతిగా వడగట్టిన కవిత ఉంటుంది. మీరీ ప్రశ్న అడగ్గానే నాకు బమ్మరాజు అని ఒక గాథాకవి గుర్తొస్తున్నాడు. ‘కాళ్ళమధ్య దారాన్ని తొక్కిపట్టి చూరుమీంచి కిందకు జారుతున్న సాలీడు కనిపించని దారానికి కట్టిన బొగడపువ్వులాగా కనిపిస్తున్నది’ అంటాడు.  ఇక్కడ వ్యక్తీ లేడు, సమష్టీ లేదు. ఉన్నదల్లా ఒక దర్శనం మాత్రమే. ప్రపంచ కవిత్వంలో నేను చదివిన గొప్ప పద్యాల్లో ఇది కూడా ఒకటని చెప్పగలను. కవీ, అతడి సమాజమూ,అతడి కాలమూ, ప్రాంతమూ కాదు- ఆ కవి దర్శనం, దాన్ని కవితగా మార్చగల శిల్ప సామర్థ్యం-అంతిమంగా ఈ రెండే లెక్కకొస్తాయి.

జ. మానవ సృష్టి కొనసాగినంతకాలం కవిత్వం ఉంటుంది. వేలాదిమంది, లక్షలాది మంది పాఠకులు చదివినంతమాత్రాన గొప్ప కవిత్వం వస్తుందని చెప్పలేం. ఒక కవి జీవితకాలంలో ఎవరూ చదవనంత మాత్రాన కవిత్వం రావడం ఆగిపోతుందనీ చెప్పలేం. హాప్కిన్స్ నీ, ఎమిలీ డికిన్ సన్ నీ వాళ్ళ వాళ్ల జీవితకాలాల్లో ఎంతమంది చదివి ఉంటారు?

జ. ప్రతి ఒక్క మానవ సంబంధమూ వ్యాపార సంబంధంగా మారిపోయిన ఈ కాలంలో, భాష అయితే గాసిప్ కో, లేదా హేట్ స్పీచ్ కో మాత్రమే ఉపయోగపడుతున్న ఈ కాలంలో, తనకి గాని తన కుటుంబానికి కానీ ఆర్థికంగా ఏమాత్రం ప్రయోజనం కలిగించదని తెలిసినా కూడా కవిత్వం రాయకుండా ఉండలేకపోతున్న ప్రతి ఒక్క సమకాలిక కవీ నాకు ఇష్టుడే, ఇష్టురాలే.

జ. ప్రపంచ సాహిత్య పఠనం నన్ను సదా జాగరూకుడిగా ఉంచుతుంది. రాస్తే అలా రాయాలనిపిస్తుంది. సోపోక్లీసులాగా ఒక నాటకం, కీట్స్ లాగా ఒక ఓడ్, హాఫిజ్ లాగా ఒక గజల్, టాల్ స్టాయి లాగా ఒక నవల, చెహోవ్ లాగా ఒక కథ, కాన్ స్టాంటిన్ కవఫే లాగా ఒక కవిత, ఇస్సాలాగా ఒక హైకూ, భారతియార్ లాగా ఒక గీతం.. శ్రీ శ్రీ అనుకున్నట్టు ‘ఆశయాలంకేం అనంతం, అప్పారావంతటివాణ్ణి’ అని అనుకోడమైతే అనుకుంటూ ఉంటాను. కాని అందుకెంత పరిశ్రమ చెయ్యాలి! అక్కడే వెనకబడుతున్నాను.

జ. చాలాసార్లు నా పఠనం నా చేతుల్లో ఉండదు. ఒక పుస్తకం చేతుల్లోకి రాగానే ఆ పుస్తకం మరికొన్ని పుస్తకాల వైపు నన్ను పట్టుకుపోతుంది. ఒక మంచి మిత్రుడు తన మిత్రులందర్నీ నీకు పరిచయం చెయ్యాలని ఉబలాటపడ్డట్టే గొప్ప పుస్తకం ప్రతీదీ మరెన్నో గొప్ప పుస్తకాల్ని చూపిస్తుంది. అదీకాక, లైబ్రరీ ఏంజెల్, బుక్ షాపు ఏంజెల్ కూడా ఉంటాయి. ఆ దేవదూతలు కూడా నా చిన్ని ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరిచేసేస్తుంటారు. ఒక పూలతోటలో ప్రవేశించిన సీతాకోకచిలుకని చూడండి. ఎక్కడా క్షణమేనా ఆగదు. ఒకపువ్వుమీద వాలుతుందా, ఇంతలోనే మరొక పువ్వురమ్మని పిలుస్తుంది. నా పఠనం కూడా అంతే.

జ. కవి కవిత్వం రాసే మొదటిరోజుల్లో బృందాలకోసం, శిబిరాల కోసం వెతుక్కోవడ సహజం. కానీ ఎల్లప్పటికీ వాటికే అంటిపెట్టుకోవడం తనకి తనని దూరం చేసేస్తుంది.

జ. కవిత్వ శిల్పం గురించి నాకు ఎప్పటికప్పుడు కలుగుతూ వస్తున్న అభిప్రాయాలు కూడా అందుకు కొంత కారణం. ఒక్కొక్కసారి spontaneity గొప్ప విలువ అనిపించేది. ఒక్కొక్కసారి craftsmanship ముఖ్యమనిపించేది. ఒంటరిచేల మధ్య ఒక్కత్తే మన అమ్మ కవితల కాలంలో శిల్పం ముఖ్యమనిపించేది. కోకిల ప్రవేశించే కాలం కవితలు రాసేటప్పుడు సద్యఃస్పందన ముఖ్యమనిపించేది. ఈ రెండింటి మధ్యా సమతూకంకోసం ప్రయత్నించడంలో కొండమీద అతిథి, కొండకింద పల్లె కవితలు పుట్టుకొచ్చాయి.

జ. అవును. ఆ పుస్తకం గురించి మీరు చెప్పినదానికన్నా అదనంగా చెప్పడానికేమీ లేదు.

17. నేను మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలడిగాను. మీరు నన్నొక ప్రశ్న అడగండి..

జ. కవిసంధ్య పూర్తి కవిత్వపత్రిక. ఇన్నాళ్ళ పాటు నిరవరోధంగా ఒక పత్రిక వెలువరించడం మామూలు విషయం కాదు. మీకు శుభాభినందనలు, తెలుగు పాఠకుల తరఫున ధన్యవాదాలు.

15-5-2024

10 Replies to “ఒక సంభాషణ”

  1. తోటిమనిషి సంతోషానికో, కష్టానికో చలించి, చెప్పిన మాటలు, ఆ సుఖదుఃఖాలతో సంబంధం లేనివాళ్లని కూడా చలింపచేయగలిగినప్పుడే కవిత్వం సార్వజనీనమవుతుంది.👌
    మీ రచనల అధ్యయనానికి ఈ ముఖాముఖి మరింత పుష్టిని కలుగజేస్తుంది. శ్రీనివాస్ న్యాయపతి గారు మీనుండి రాబట్టవలసిన విషయాలకు న్యాయం చేకూర్చారు. ప్రపంచసాహిత్యావగాహనాగస్త్యులు మీరు. మీ నుండి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి . కవిత ,నాటకం, ఓడ్ ,గజల్,హైకూ, నవల,కథ మొదలైనవి ఏ ప్రామాణికత లో ఉండాలో మార్గదర్శనం చేయటం బాగుంది. ఇరువురికీ అభినందనలు సర్ .

  2. ప్రతి ఒక్క మానవ సంబంధమూ వ్యాపార సంబంధంగా మారిపోయిన ఈ కాలంలో, భాష అయితే గాసిప్ కో, లేదా హేట్ స్పీచ్ కో మాత్రమే ఉపయోగపడుతున్న ఈ కాలంలో, తనకి గాని తన కుటుంబానికి కానీ ఆర్థికంగా ఏమాత్రం ప్రయోజనం కలిగించదని తెలిసినా కూడా కవిత్వం రాయకుండా ఉండలేకపోతున్న ప్రతి ఒక్క సమకాలిక కవీ నాకు ఇష్టుడే, ఇష్టురాలే.

    . కవి కవిత్వం రాసే మొదటిరోజుల్లో బృందాలకోసం, శిబిరాల కోసం వెతుక్కోవడ సహజం. కానీ ఎల్లప్పటికీ వాటికే అంటిపెట్టుకోవడం తనకి తనని దూరం చేసేస్తుంది.

    నమోనమః.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading