నిర్వికల్ప సంగీతం

నిర్వికల్ప సంగీతం నా మొదటి కవితాసంపుటి. రాజమండ్రిలో ఉండగా 1986 లో వెలువరించాను. మా సాహితీవేదిక మిత్రులు దాన్నొక పండగలాగా జరిపారు. ఆ సమావేశంలో మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారు, ఆర్.ఎస్.సుదర్శనంగారు ప్రసంగించడం నాకు జీవితం అనుగ్రహించిన గొప్ప కానుక. నా మిత్రులు మహేశ్, గోపీచంద్ కూడా ఆ పుస్తకం మీద మాట్లాడేరు.

ఆవిష్కర్త ఎవరు?

మా బామ్మగారు. ఆమె నా పసితనంలో నాతో గజేంద్రమోక్షం, రుక్మిణీ కల్యాణం కంఠస్థం చేయించారు. ఆ కొండకింద పల్లెలో, ఆకాశంలో తారకల గుసగుస తప్ప మరే చప్పుడూ లేని ఒక ప్రాచీననిశ్శబ్దంలో ఆమె సన్నని గొంతుతో ‘కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు ‘అని పోతన్నను వినిపించడం నిన్నమొన్నటి ముచ్చటలాగా ఉంది. ఆ విధంగా కవిత్వానికి ఆమెనే నా మొదటి గురువు కాబట్టి ఆమెతోటే ఆ పుస్తకం ఆవిష్కరింపచేసుకున్నాను.

ఆ పుస్తకానికి ఊహించని స్పందన వచ్చింది. దాశరథి కృష్ణమాచార్య ఆంధ్రప్రభలో సమీక్షించడమే కాక, నాకో ఉత్తరం రాసారు. మీరు ఏ దేశంలో ఉంటారు అని. ఎందుకంటే ఆ కవితలేవీ పత్రికల్లో వచ్చినవి కావు, నేరుగా పుస్తకరూపంలోనే వెలువడ్డవి కావడంతో నేను ఈ దేశంలో ఉండటంలేదేమో అనుకున్నారాయన.

అజంతాకి ఆ పుస్తకం పంపితే ఒక పోస్టు కార్డు రాసాడు: ‘అద్భుతం, మరో మాట లేదు’ అంటో. చండీదాస్ కి ఆ పుస్తకం ఎలానో చేరింది. ఆయన సుదర్శనంగారికి ఉత్తరం రాసాడు. ఇంకా ఇలానే చాలామంది ఆ రోజుల్లో నేను అభిమానించే, ఆరాధించే కవులు సంజీవ దేవ్, శేషేంద్ర, ఇస్మాయిల్, త్రిపుర, మో లాంటివాళ్ళు ఆ పుస్తకాన్ని ప్రేమగా తమ హృదయాలకు హత్తుకున్నారు. విశాఖపట్టణం నుంచి జ్యేష్ఠ గారికీ నాకూ మధ్య ఆ పుస్తకం మీద కొంత సంవాదం కూడా నడిచింది. ఆయన్ని చూడటం కోసమే ఒకరోజు విశాఖపట్టణం వెళ్ళాను కూడా.

1988 లో నూతలపాటి గంగాధరం పురస్కారం లభించడం మరో ముచ్చట. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పుస్తకం నా విజిటింగ్ కార్డుగా మారిపోయింది.

మరో ముచ్చట కూడా గుర్తొస్తోంది. ఒకప్పుడు పుట్టపర్తి నారాయణాచార్యులుగారికి తన పుస్తకం మీదనే విద్వాన్ పరీక్ష రాసే సందర్భం ఏర్పడిందని మనకు తెలుసు. అంతకాకపోయినా దాదాపు అలాంటి అనుభవమే నాకూ తటస్థించింది. తెలుగు విశ్వవిద్యాలయంలో పిఎచ్ డి చేద్దామని అప్లై చేస్తే ఇంటర్వ్యూకి పిలిచారు. డా.నారాయణరెడ్డి ఛైర్మన్ గా ఉన్న బోర్డుముందు హాజరయ్యాను. ఆ బోర్డులో ఒక మెంబరుగా ఉన్న జి.వి.సుబ్రహ్మణ్యంగారు ‘నిర్వికల్ప సంగీతం లో తాత్త్వికతను వివరించండి’ అనడిగారు. అప్పటికే ఆయన కూడా నిర్వికల్ప సంగీతం మీద ఆంధ్రప్రభలోనో ఎక్కడో ఒక పెద్ద వ్యాసం రాసి ఉన్నారు. అయినా నాతో మాట్లాడించాలని ఆయనకు అనిపించిందన్నమాట. దాదాపు అయిదారునిమిషాలు నేను ఆ పుస్తకం గురించే మాట్లాడుతో ఉండిపోయేను. మరొక ప్రశ్న వేయకుండానే ఆ ఇంటర్వ్యూ పూర్తయిపోయింది.

అప్పట్లో వేసినవి 500 కాపీలే. మళ్లా వెయ్యలేదు. ప్రింటింగుకి సాంస్కృతికశాఖ 1800 ఇస్తామని చెప్పి 900 మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బు నా మిత్రుడు సోమయాజులు పెట్టుకున్నాడు. పుస్తక ఆవిష్కరణకి గౌతమీ గ్రంథాలయం హాలు ఉచితంగా ఇచ్చారు. చిన్నచిన్న ఖర్చులకోసం నా మిత్రుడు గోపీచంద్ ఇచ్చిన వందరూపాయలూ సరిపోయాయి.

పుస్తకం వెల పది రూపాయలు. ఆంధ్ర ప్రభలో సమీక్ష చదివి జూకంటి జగన్నాథం పది రూపాయలు మనియార్డరు చేసాడు. అదే మొదటి కొనుగోలు. ఆ తర్వాత ఆ పుస్తకం ఎవరికీ అమ్మినట్టు గుర్తులేదు. ఎవరు కనబడితే వాళ్ళ చేతుల్లో పెడుతూ వచ్చాను. అలా పంచిన కాపీలు ఏళ్ళ తరబడి ప్రయాణిస్తోనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ తరువాత తనికెళ్ళ భరణి తనకి ఆ పుస్తకం మద్రాసులో అందిందని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను.

ఆ ఏడాదే సి.వి.కృష్ణారావుగారు పిలిస్తే హైదరాబాదు వచ్చి ‘నెలనెలా వెన్నెల’ లో ఆ పుస్తకంలోంచి కొన్ని కవితలు చదివాను. హిప్నటిస్ట్ నాగరాజు కూడా ఆ సమావేశంలో ఉన్నాడు. ఆయన ఆ మీటింగు అవగానే నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ‘మీ దగ్గర ఇంకా ఎన్ని కాపీలున్నాయి?’ అనడిగాడు. అప్పటికింకా మూడువందల పైనే కాపీలున్నాయి. మొత్తం తాను కొనేస్తానన్నాడు. నా ఉత్సాహానికి అడ్డులేదు. ఆయన ఆ కాపీలు కొంటే సోమయాజులుకీ, గోపీచంద్ కీ బాకీ తీర్చెయ్యవచ్చనుకున్నాను. రాజమండ్రి వెళ్లాక ఆయనకి ఉత్తరం రాసాను. జవాబు లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన జవాబివ్వలేని లోకానికి వెళ్ళిపోయాడు.

దాదాపు నలభయ్యేళ్ళవుతోంది. మళ్ళీ ముద్రించాలని అనుకున్నానుగాని ఆ డబ్బుతో మరో కొత్త సంపుటి వేసుకోవచ్చుకదా అని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. గిరిజన సంక్షేమశాఖలో నా సహోద్యోగి చంద్రిక ఆ పుస్తకం తాను ప్రచురిస్తానని నన్ను చాలా సార్లు అడిగారు. నేనెలానూ ఒప్పుకోనని తెలిసి కూడా ఆమె గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉంటారు. 2036 నాటికి ఆ పుస్తకం వచ్చి యాభై ఏళ్ళు అవుతుంది కాబట్టి పునర్ముద్రణ అప్పుడు చేద్దాంలే అని చెప్తూ ఉంటాను. ఈలోపు ఆ పుస్తకం మొత్తం మళ్ళా తాను తిరిగి రీటైపు చేసి ఆ ఒరిజినల్ ప్రతి ఎలా ఉందో అచ్చం అలానే ఒక పిడిఎఫ్ చేసి నాకు పంపించారు. ఆమె పంపించి కూడా అయిదారేళ్ళు గడిచింది.

ఇవేళ మంత్రి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆ పుస్తకం తాను చూడలేదని అనగానే, ఇంక ఆలస్యం చెయ్యకూడదనిపించింది. అందుకని చంద్రిక కంపోజ్ చేసిన ఆ పిడిఎఫ్ ని ఇదుగో ఇలా మీతో పంచుకుంటున్నాను.

12-9-2024

12 Replies to “నిర్వికల్ప సంగీతం”

  1. మీ నిర్వికల్ప సంగీతాన్ని హృదయంతో వింటాను
    సార్
    ధన్యవాదాలు

  2. తొలి గీతాలు (గడ్డి పూవు) టాగోర్ గారి గీతాంజలిని స్ఫూరింపంప చేసింది.

  3. నిర్వికల్ప సంగీతం నిజంగానే మీ విజిటింగ్ కార్డ్. తొలి ప్రచురణ , ఆవిష్కరణ, ప్రముఖుల స్పందనలు , ముప్పైఎనిమిదేళ్ల ముచ్చట ముచ్చటగా ఉంది.

  4. నమోనమః
    మీ వంటి వ్యక్తులకి నమస్కారం అని కేజువల్ గా అంటే సరిపోదు. మీరూ గ్రహిస్తే మనసారా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నామని.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading