
లెస్ మర్రీ ఆధునిక ఆస్ట్రేలియన్ మహాకవి. 2019 లో ఆయన పోయినప్పుడు, ఒక వార్తాపత్రిక అడగ్గానే ఈ వ్యాసం రాసిచ్చాను. ఆ పత్రిక ప్రచురించిందో లేదో గుర్తులేదు, నేను కూడా మర్చిపోయేను. ఇవాళ గూగుల్ మెయిల్ స్పేస్ క్లీన్ చేస్తుంటే ఈ వ్యాసం బయటపడింది. మీకు నచ్చుతుందని ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
‘తల్లులూ, కవులూ పురాతన హిమయుగాల వారసులు. వారి సేవల్ని డబ్బుతో కొలవలేం’ అన్నాడు లెస్ మర్రీ. ‘కవిత్వం వల్ల డబ్బు రాదు, నిజమే, కాని, డబ్బు వల్ల కూడా కవిత్వం రాదు’ అని రాబర్ట్ గ్రేవ్స్ అన్న మాటలు గుర్తు చేస్తూ కవిత్వం మనిషి తన సమస్త అస్తిత్వంతోటీ చేపట్టే సృజనాత్మక కార్యకలాపమని కూడా అన్నాడు మర్రీ.
ఇటువంటి మాటలు మానవచరిత్రలో ఏ కాంస్యయుగ కాలం నాడో వ్యాసవాల్మీకులో, హీబ్రూ ప్రవక్తలో, హోమర్, వర్జిల్, హొరేస్ లో అనవలసిన మాటలు. ఋగ్వేదకాలం నాడు మనుషులు ఒకే గోత్రంగా, అఖండ మానవకుటుంబంగా ఉన్నప్పుడు, భూమ్యాకాశాల్ని ఏకం చేసే దివ్య పారవశ్యక్షణాల్లో మాత్రమే విశ్వసించిన మాటలు. మనుషులు తమ సమస్త అస్తిత్వంతో, చైతన్యంతో తోటి మనుషుల్తో మాత్రమే కాదు, సమస్త ప్రకృతితోటీ ఒకటికాగల అనుభూతిని పొందే క్షణాలు ఉంటాయనీ, వాటిని మాటల్లో పెట్టినప్పుడు కవిత్వమంటామనీ, కాని, మాటల్లో పెట్టనప్పుడు కూడా మనుషులు తాము లోనయ్యే ఆ పారవశ్యం కూడా కవిత్వమేననీ అన్నాడు లెస్ మర్రీ.
మనుషులు, జాతులూ, దేశాలూ విభిన్న సమూహాలుగా, శకలాలుగా, అస్తిత్వ సంఘటనలుగా విడిపోతున్న ఈ కాలంలో, ఈ పోస్ట్ మాడర్న్ యుగంలో, ఇటువంటి విశ్వాసాలతో కవిత్వం చెప్పిన కవి ఒకడు మనకు సమకాలికుడిగా ఉండటమే నమ్మలేని విషయం. అటువంటిది, పోయిన నెల 29 న ఆ కవి, తన 80 వ ఏట ఈ లోకాన్ని వదిలిపెట్టివెళ్ళిపోయాడంటే మరింత కష్టంగా తోచే విషయం.
లెస్ మర్రీ (1938-2019) ని తమ అనధికార ఆస్థాన కవిగా ఆస్ట్రేలియా గత శతాబ్దం చివరిరోజులకే అంగీకరించడం మొదలుపెట్టింది. కాని ఆయన ఆ స్థానం నుంచి కూడా మరింత విశాలంగా జరిగి, విస్తృత ప్రపంచానికి చెందిన మహాకవిగా గణనకెక్కాడు. ఒక వైపు, ప్రపంచ కవిత్వ పటం మీద ఆస్ట్రేలియా కొక విశిష్ట స్థానం కల్పిస్తూనే, మరొకవైపు, ఆధునిక పాశ్చాత్య దేశాల సభ్యతకి తెలియని, అనుభవంలోలేని, ఆదిమ సమాజాల దివ్యపారవశ్యానుభవాన్ని కవిత్వ రూపంలో పరిచయం చేస్తూ వచ్చాడు. ఆస్ట్రేలియా ఖండం అనాగరిక ఆదివాసుల భూమిగా ఉండేదనీ, అక్కడ 1788 లో తెల్లవాడు కాలుపెట్టినతర్వాతనే అభివృద్ధి మొదలయ్యిందనీ నమ్మే వాళ్ళందరికీ అతడు చెప్తూ వచ్చినదొకటే మాట: ‘కవిత్వం ఆస్ట్రేలియాలో కొన్ని వేల ఏళ్ళుగా వర్ధిల్లుతూ ఉంది. 1788 తర్వాత నుంచీ మనం రాసుకుంటున్నది కేవలం వచనం మాత్రమే’ అని.
అతడి దృష్టిలో కవిత్వం వచనంలాగా మరొక సాహిత్య ప్రక్రియ లేదా సాధారణ వ్యవహారానికి పనికొచ్చే సమాచార ప్రసార సాధనమూ కాదు. మనిషికి రెండు చైతన్యాలూ, ఒక దేహమూ ఉన్నాయనీ, ఆ రెండు చైతన్యాలూ ఒకటి జాగృదవస్థా, రెండవది స్వప్నావస్థా అనీ, ఆ మూడూ ఒక్కటైనప్పుడు మాత్రమే కవిత్వం పలుకుతుందనీ అతడు నమ్మాడు. దాన్నతడు Wholespeak అన్నాడు. మనుషులకి తమ రెండు మనస్సులూ తమ దేహంతో ఒకటయ్యే అనుభవం సాధారణ జీవితంలో అనుక్షణం సిద్ధిస్తూనే ఉంటుందనీ, కాని వాళ్ళు దాన్ని మాటల్లో పెట్టలేరనీ, కాని, ఆ సమగ్రక్షణాల కోసం తమ ప్రేమల్లో, పెళ్ళిళ్ళలో, పనిలో, ఇష్టాయిష్టాల్లో, మతంలో వెతుక్కుంటూ ఉంటారనీ అన్నాడతడు. మనసూ, దేహమూ ఒకటయ్యే భావావేశాన్ని అతడు కవిత్వమంటున్నప్పుడు అతడు వివరిస్తున్నదాన్ని దాదాపుగా మనమొక రెలిజియస్ ఎక్స్ పీరియన్స్ గా భావించవచ్చు. అతడు ఆ విషయాన్ని కూడా దాచలేదు. కవితలు చిన్నపాటి మతాలనీ, మతాలు సుదీర్ఘ కవితలనీ కూడా వర్ణించాడతడు.
అతడు మత విశ్వాసాల రీత్యా రోమన్ కాథలిక్. కాని, కవిత్వాన్ని మతమంటున్నప్పుడు అతడు చెప్తున్న మతం మధ్యయుగాలనుంచి మనకి వారసత్వంగా లభించిన మతం కాదు. అది పురాతన హిమయుగాల కాలం నాటి మతం. ఏదో ఒక దేవుడూ, పాపపుణ్యాలూ, స్వర్గనరకాలూ లేని మతం. జీవించడమే, నీ చుట్టూ ఉన్న చరాచర అస్తిత్వమంతటితోటీ నువ్వు ఒకటిగా అనుభూతి చెంది జీవించడమే జీవితపరమార్థమని చెప్పే మతం. ఈ మతానుభవం అతడు రోమన్ కాథలిక్ చర్చిలో కన్నా, ఆస్ట్రేలియన్ ఆదివాస సమాజాల్లో ఎక్కువ సజీవంగా ఉన్నట్టు కనుగొన్నాడు. అలా కనుగొని, దాన్ని మాటల్లో పెట్టడానికి ప్రయత్నించడం ద్వారా, అతడు పాశ్చాత్య నాగరిక ప్రపంచానికన్నా ఆఫ్రికాలో, ఆసియాలో, ఆస్ట్రేలియాలో ఉన్న అసంఖ్యాక ఆదివాస సమాజాలకు మరింత సన్నిహితంగా జరిగాడు.
అలాగని, ఎనిమిది దశాబ్దాల లెస్ మర్రీ జీవితం మొత్తం ఒక తెంపులేని ఆధ్యాత్మికానుభవంగా సాగిందని అనుకోకూడదు. అతడి జీవితంలో సంతోషం కన్నా విషాదమే ఎక్కువ. అతడి తండ్రి ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని నబియాక్ కి చెందిన రైతు. అక్కడి గ్రామ సీమ బున్యా లోనే మర్రీ బాల్యం గడిచింది. ఏళ్ళ తరువాత, 1988 లో అతడు తిరిగి బున్యాకి వెళ్ళిపోయి, గత ముప్పై ఏళ్ళుగా అక్కడే జీవిస్తూ కవిత్వం రాస్తూ గడిపాడు. ‘బున్యా నా గృహం మాత్రమే కాదు, నా శరణాలయం కూడా’ అన్నాడతడు. అతడి చిన్నతనంలో, పన్నెండేళ్ళ వయసులో, తల్లి మరణించింది. గర్భస్రావంతో సరైన వైద్య సదుపాయం లేక తల్లి మరణించడం మర్రీని జీవితకాలం వెంటాడింది. తల్లి మరణించగానే తండ్రి డిప్రెషన్ లో కూరుకుపోయాడు. తండ్రికి సహాయంగా ఉండటంకోసం మర్రీ చదువు మానేసాడు. అలా మానేసినవాడికి ముప్పై ఏళ్ళ వయసుకి గానీ, డిగ్రీ చేతికందలేదు. చిన్నప్పుడు ఒకసారి తన తల్లి దగ్గర విన్నాడట, ప్రపంచంలో ఇంగ్లీషు ఒకటే భాష కాదని. ఆ క్షణం నుంచే అతడు ఎన్ని భాషలు నేర్చుకోవచ్చో అన్ని భాషలు నేర్చుకోవడం మీదనే దృష్టి పెట్టాడు. తర్వాతి రోజుల్లో ఆ భాషా పరిజ్ఞానమే అతడికి అనువాద వృత్తిని సమకూర్చి పెట్టింది. జీవనోపాధిగా మారింది. ముప్పై, ముప్పై అయిదేళ్ళ వయసు వచ్చేటప్పటికి అతడు పూర్తికాలపు రచయితగా జీవించడానికి నిర్ణయించుకున్నాడు. 1965 లో వెలువరించిన మొదటి కవితాసంపుటి The Ilex Tree నుంచి అతడు వెనుదిరిగి చూడలేదు. సంపుటం వెనక సంపుటం వెలువరిస్తూనే వచ్చాడు. సుమారు రెండువేల దాకా కవితలు, ఆత్మకథనాత్మక దీర్ఘకవితలు, వచనరచనలు కూడా వెలువరించాడు.
1988 లో తిరిగి బున్యాకి వెళ్ళిపోయినతర్వాత, అతడి పసితనపు జ్ఞాపకాలు అతణ్ణి చుట్టుముట్టి డిప్రెషన్ కి లోనయ్యాడు. ఎనిమిదేళ్ళపాటు ఆ చిత్తచాంచల్యం కొనసాగింది. అటువంటి స్థితిలో కూడా అతడు కవిత్వం రాయడం మానలేదు. నెమ్మదిగా అతడి సృజన ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలయ్యింది. అతడి కవిత్వం ఎన్నో భాషల్లోకి అనువాదం కావడం మొదలయ్యింది. నోబెల్ పురస్కారం మినహా చెప్పుకోదగ్గ పురస్కారాలెన్నో దేశవిదేశాల్లో అతణ్ణి వరించాయి.
అలాగని మర్రీ ని సమకాలిక ఆస్ట్రేలియా పూర్తిగా నెత్తిమీద పెట్టుకుందనుకుంటే అది పొరపాటే. అతడి మతవిశ్వాసాలవల్లా, మతాన్నీ, కవిత్వాన్నీ సమానంగా చూసినందువల్లా సెక్యులరిస్టుల ఆగ్రహానికి గురవతూనే వచ్చాడు. గ్రామీణ ఆస్ట్రేలియా గురించి రాసినందుకు నాగరిక-విద్యాధిక ఆస్ట్రేలియా అతణ్ణి పూర్తిగా తన వాడిగా భావించలేకపోయింది. ప్రాచీన ఆదివాసుల జీవనశైలిని ఆరాధిస్తున్నందుకు, కుడి-ఎడమ పక్షాలు రెండూ కూడా అతడికి సమకాలిక ప్రపంచంలో ప్రాసంగికత లేదని భావించాయి. కాని, అతడు రాస్తున్నది అత్యున్నత స్థాయి కవిత్వమనీ, అనితరసాధ్యమైన శైలి అనీ, ఆస్ట్రేలియాకి గర్వకారణమనీ అనుకోవడానికి మాత్రం వారిలో ఏ ఒక్కరికీ సంకోచం లేకపోయింది.
తన కవిత్వంలో మరీ వెలువరించిన భావాలెటువంటివి? అవి ప్రధానంగా గ్రామీణ జీవనశైలినీ, ఆదివాసుల జీవనసమగ్రతనీ పైకెత్తేవి. నాగరిక ఆస్ట్రేలియాని అతడు పాశ్చాత్య సామ్రాజ్యవాద భావజాలానికి ప్రతినిధిగా భావించాడు. పట్టణ-గ్రామీణ ఆస్ట్రేలియాల మధ్య విలువల్లో ఏర్పడ్డ దూరాన్ని అతడు బొయేషియా-ఏథెన్స్ వివాదంతో పోల్చాడు. ఒకప్పుడు ప్రాచీన గ్రీసులో బొయేషియా గ్రామీణ, ప్రాకృతిక విలువలకీ, ఏథెన్సు నాగరిక సభ్యతకీ ప్రతినిధులుగా మారాయి. ఆ వైరుధ్యం విరోధంగా మారి పెలొపొనీషియన్ యుద్ధానికి కూడా దారితీసింది. సాహిత్యానికి సంబంధించినంతవరకూ ఈ వివాదాన్ని ఆస్ట్రేలియన్ మార్గ- దేశి వివాదంగా చెప్పుకోవచ్చు. ఇందులో మర్రీ ఆస్ట్రేలియన్ దేశి విలువలవైపు నిలబడ్డాడు. పట్టణ జీవితంలోని పరాయీకరణ, ఆదివాసుల జీవితంలోని ధ్యానశీలత, గ్రామీణ ఆస్ట్రేలియాలోని కాయకష్టం, మేధావుల ఆత్మవంచన, విదేశీ భావజాలాల డొల్లతనం అతడి కవిత్వానికి ప్రధాన వస్తువులు.
విస్మృత సమాజాలకీ, విస్మృత విలువలకీ గొంతునివ్వడమే తన జీవనధ్యేయంగా చెప్పుకున్నాడతడు. రంగురంగుల యూకలిప్టస్ అడవులు, పచ్చిక బయళ్ళు, కొండలు, నదులు, ధారాళమైన సూర్యకాంతితో వెల్లివిరిసే ఆస్ట్రేలియన్ ఆకాశాలూ అతడి కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంటాయి. గడ్డిపూలు, పక్షులు, ఆదివాసుల నమ్మకాలతో పాటు గ్రామీణ సాయంకాలాలు, అడవుల్లోని అపరాహ్ణాల నిశ్శబ్దం, ఆవుల్ని మేతకు తీసుకుపోయే గోపాలకుల మనోలాలిత్యం అతడి కవిత్వమంతా పరుచుకుని కనిపిస్తాయి. నాగరిక సమాజాలకు తెలియని మట్టివాసనని అతడు దోసిళ్ళతో మనమీద కుమ్మరిస్తాడు.
శైలి పరంగా అతడొక అనితరసాధ్యమైన డిక్షన్ ని రూపొందించుకున్నాడు. అతడి కవిత్వంలో శబ్దాలాంకారాలు తక్కువేమీ కాదు. శ్లేష, అర్థోక్తి, యమకం, అనుప్రాస, పూర్వకావ్యస్ఫురణ, పాండిత్య ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తాయి. కాని, వాటి దగ్గరే అతడు ఆగిపోడు. మరొక వైపు రూపకాలంకారాల ప్రయోగంలో అతడు ఆధునిక యూరపియన్ మహాకవులకి ఏ మాత్రం తీసిపోడు. యూకలిఫ్టస్ అడవిని వర్ణిస్తూ అది ‘పురాతన యుద్ధభూమి ‘ లాగా ఉందంటాడు. కొన్నిసార్లు తన అనుభూతిని వర్ణించడానికి అలంకారాలు చాలాక వక్రోక్తినీ, వ్యంగ్యోక్తినీ ఆశ్రయిస్తాడు. జెనీవా సందర్శించినప్పుడు రాసిన కవితలో ‘నువ్వు మానవాళిని సూట్లుగానూ, పాంట్లు గానూ మార్చేసావు’ అంటాడు. కాని, అతడి దృష్టి ఎంతసేపూ, శబ్దాలంకారాల్నీ, అర్థాలంకారాల్నీ కూడా దాటిన ఒక నిశ్శబ్దాన్ని పట్టుకోవడం మీదనే. ఉదాహరణకి , కలపమిల్లుల పట్టణాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ‘రాత్రి కాగానే అక్కడ ఇళ్ళు ఒకదాన్నొకటి కనిపెట్టుకుని ఉంటాయి/ ఇక్కడ కిటికీలోంచి కనబడే వెలుగుకి కూడా ఒక అర్థముంటుంది’ అంటాడు.
మర్రీ కవిత్వం వర్ణాత్మకం, కాని ప్రతి కవిత అంతిమ ప్రయోజనం ఒక ధ్వనిని స్ఫురింపచేయడమే. మాటల కందని ప్రగాఢమైన మానవానుభూతిని మాటలకు మించి స్ఫురింపచెయ్యడమే అతడి కవిత్వం. ఉదాహరణకి తన తల్లిని తలుచుకుంటూ రాసిన రెండు పద్యాల్లో ‘బరువులు’ అనే ఈ కవిత చూడండి. ఇక్కడ to carry అనే ఇంగ్లీషు క్రియాపదం మీద అతడు ఊనికపెట్టాడు. అది శబ్దాలంకారం. కాని అతడి దృష్టి దానిమీద లేదు. తన తండ్రి నడుస్తున్న గడ్డికుటీరంలాగా ఉన్నాడని చెప్పడం అర్థాలంకారం. కాని ఆ రూపకాలంకారం దగ్గర కూడా మనల్ని ఆగిపోనివ్వడు. ‘బరువులు’ అనే మాట వస్తువుల బరువులుగా మనకి ముందు పరిచయమై, చివరికి, మోయలేని గర్భభారంగా తెలియరావడంలో ఉన్న ధ్వని కేవలం వస్తుధ్వని కాదు. తన తల్లి తన జీవితంలో మోసిన అతిపెద్ద బరువు తనే అని కవి భావిస్తున్న ఒక కరుణారసధ్వని ఈ కవిత సారాంశం.
బరువులు
సొంతానికి ఎడ్లబండి లేకపోడంతో మా నాన్న ఎప్పుడు చూసినా
పచ్చిచొప్ప మోసుకుపోయే గుడిసెలాగా ఉండేవాడు, తిరుగుతూనే
ఉండేవాడు, వెన్న డబ్బాలు మోసిమోసి డస్సిపోతుండేవాడు, అయినా
చిన్నపాటి బరువు కూడా మా అమ్మ చేతమోయనిచ్చేవాడు కాడు.
బరువులకి బదులు ఆమె వంటగదిలోనో, పశువుల కొట్టంలోనో
ఏదో ఒక పనిచేసేది, పాటలు పాడుకుంటూ ఉండేది,ఇరుగు
పొరుగుకి నర్సులాగా సేవలు చేసేది, ఇంజెక్షన్లిచ్చేది, పోసుకోలు
మాటలు పక్కన పెట్టేది, చిన్న చిన్న సంఘాలు కూడగట్టేది.
ఉన్నదున్నట్టుగా మాటాడే గుణాన్నినిచ్చింది నాకు,
తన ముఖకవళికల్నీ, సంకల్పశుద్ధినీ అందించింది
తన సుమధురకంఠస్వరాన్నివ్వలేదుగానీ
సూటిదనాన్నీ, స్పష్టతనీ ఉగ్గుపోసింది.
అప్పట్లో నాకు తెలీదు, ఆ తర్వాత చాలా ఏళ్ళపాటు
అదేమిటో అర్థం కాలేదు, నా తర్వాత
ఆమె గర్భం మళ్ళా బరువు మొయ్యలేదు.
24-5-2019
మర్రీ మీద ఇంతకు ముందు రాసిన రెండు వ్యాసాలు కూడా చదవాలనిపిస్తే ఈ లంకెలు చూడండి:


సర్ .ఎంతో విలువైన వ్యాసం.
“మనిషికి రెండు చైతన్యాలూ, ఒక దేహమూ ఉన్నాయనీ, ఆ రెండు చైతన్యాలూ ఒకటి జాగృదవస్థా, రెండవది స్వప్నావస్థా అనీ, ఆ మూడూ ఒక్కటైనప్పుడు మాత్రమే కవిత్వం పలుకుతుందనీ అతడు నమ్మాడు.”
ఇన్నాళ్లకు నాకు నచ్చిన వాక్యం దొరికింది అనేకంటే
నా అనుభవానికి దగ్గరైనదని అనిపించింది.
కవిత్వం చెక్కటం నా వల్లకాదు. అది సహజసిద్ధమైన కొండవాగువంటిది. మీ అనితరసాధ్యమైన సాహిత్య జ్ఞానం మాకు లభిస్తున్న ఒక వరవర్షపాతం. 🙏
ధన్యవాదాలు సార్!
జీవించడమే, నీ చుట్టూ ఉన్న చరాచర అస్తిత్వమంతటితోటీ నువ్వు ఒకటిగా అనుభూతి చెంది జీవించడమే జీవితపరమార్థమని చెప్పే మతం.
గడ్డిపూలు, పక్షులు, ఆదివాసుల నమ్మకాలతో పాటు గ్రామీణ సాయంకాలాలు, అడవుల్లోని అపరాహ్ణాల నిశ్శబ్దం, ఆవుల్ని మేతకు తీసుకుపోయే గోపాలకుల మనోలాలిత్యం అతడి కవిత్వమంతా పరుచుకుని కనిపిస్తాయి.
సర్. మీరు చెప్పే విధానం లో మమేకమై వినడం జరుగుతుంది. అప్పటి దాకా కాలక్షేపం చేసే సమయం మీ పోస్ట్ చదువుతున్నప్పుడు ఒక అల్లరి విద్యార్థి హఠాత్తుగా తల్లి మందలింపు తో నిశ్శబ్దం అయిపోయి చదువు మీద ఏకాగ్రతతో దృష్టి పెట్టినట్టు మీ పోస్ట్ చదివే సమయం నాకు జీవిత పాఠం భోదిస్తున్నట్టు, విలువల్ని తెలుసుకుని అడుగులు వేస్తున్నట్టు ఉంటుంది.
మీకు నా నమస్సులు.
ధన్యవాదాలు