
ఈ నియాంపురం నవల నియాంగిరి కొండల్లో నివసిస్తున్న డోంగ్రియా కోదు సమాజానికి సంబంధించిన కథ. వారి ప్రాంతంలో బాక్సైట్ తవ్వకంకోసం ప్రభుత్వమూ, కార్పొరేట్ శక్తులూ కలిసి వారి జీవితంలోనూ, సంస్కృతిలోనూ సృష్టించిన విధ్వంసం తాలూకు చిత్రణ. కాబట్టి ఈ నవల్లోకి ప్రవేశించే ముందు భారతదేశంలో గిరిజనులగురించీ, వారి సమాజాల్లో సంభవిస్తున్న పరివర్తన గురించీ స్థూలంగానైనా కొన్ని విషయాలు ప్రస్తావించవలసి ఉంది.
2.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 705 షెడ్యూల్డు తెగల వారు దాదాపు పదకొండు కోట్లమంది ఉన్నారు. వారిలో తొంభై శాతం మంది కొండప్రాంతాల్లోనూ, గ్రామీణప్రాంతాల్లోనూ జీవిస్తుండగా, పది శాతందాకా పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. చరిత్రపూర్వయుగకాలం నుంచీ ఆవాసాన్నేర్పరచుకున్న ఆదివాసులు భారతదేశ చరిత్రను నిర్మించడంలో, భారతీయ సంస్కృతినీ, సభ్యతనీ తీర్చిదిద్దడంలో అపారమైన పాత్ర పోషించారు. ఒకవిధంగా భారతదేశాన్ని ఆదివాసుల దేశమని కూడా అనవచ్చు.
కానీ అందుకు ప్రతిగా వారికి లభించవలసిన గౌరవం తక్కిన సమాజం నుంచి లభించలేదనే చెప్పాలి. పైగా, అడవుల్లోనూ, కొండల్లోనూ జీవిస్తున్న గిరిజనుల్ని మైదాన ప్రాంత సమాజాలు యుగయుగాలుగా దోచుకుంటూనే వచ్చాయి. ఈస్టిండియా కంపెనీ పాలన మొదలుకావడానికి ముందు గిరిజన ప్రాంతాల్లో జరిగే దోపిడీ స్థానికంగానే ఉండేది. పూర్వ, మధ్యయుగాల పాలకులూ, వాణిజ్య శక్తులూ గిరిజనుని సైనిక అవసరాలకోసమో లేదా వారి ఉత్పత్తుల్ని కొల్లగొట్టుకోవడం మీదనో దృష్టిపెట్టినంతగా వారి సంస్కృతినీ, జీవనసరళినీ ధ్వంసం చేయడం మీద దృష్టి పెట్టలేదు.
కాని ఈస్టిండియా కంపెనీ 1757 తర్వాత గిరిజన ప్రాంతాల్లోని అటవీ సంపద మీద దృష్టిసారించాక గిరిజన ప్రాంతాల్ని తన ఏలుబడిలోకి తీసుకురాడానికి అనేక ప్రయత్నాలు చేసింది. తాను పన్ను వసూలు చేసుకోవడం కోసం పెంచి పోషించిన జమీందారులు గిరిజన ప్రాంతాల్ని యథేచ్ఛగా కొల్లగొట్టుకోడాన్ని ప్రోత్సహించింది. దాంతో గిరిజనులు కంపెనీ మీద తిరగబడటం మొదలుపెట్టారు.
అప్పణ్ణుంచీ నేటిదాకా గిరిజన ప్రాంతాల్లో చిందుతున్న రక్తపాతానికి నాలుగు దశలున్నాయి. మొదటిది 1795 నుంచి 1860 దాకా కంపెనీ పాలనమీద జరిగిన తిరుగుబాట్లు. ఈ దశలో ప్రధానంగా గిరిజన ప్రాంతాల పాలకులు, గిరిజన రాజులు, ముఠాదార్లు తమ పాలనని కాపాడుకోడానికి కంపెనీ సైన్యాల్తో నిరంతరంగా యుద్ధాలు చేస్తోనే ఉన్నారు. రెండో దశలో అంటే 1860 నుంచి 1920 దాకా బ్రిటిష్ పాలనమీదా, వారి మద్దతుతో గిరిజన ప్రాంతాల్లో విస్తరించిన ఆర్థికపరమైన దోపిడీమీదా జరిగిన తిరుగుబాట్లు తలెత్తాయి. ఈ దశలో గిరిజన ప్రాంతాల్లోని సామాన్య గిరిజనులనుంచి విప్లవవీరులు పుట్టుకొచ్చేరు. మూడోదశ 1920 నుంచి 1947 దాకా నడిచింది. ఈ కాలంలో గిరిజన ప్రాంతాల్లో ఒకవైపు సాయుధపోరాటాలూ, మరొకవైపు గాంధేయ స్ఫూర్తితో జాతీయవాద ఉద్యమాలూ కూడా నడిచాయి. కొన్ని చోట్ల అవి రైతాంగ తిరుగుబాట్లు. కొన్ని చోట్ల స్వపరిపాలన పోరాటాలు.
ఇక స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత కూడా గిరిజన ప్రాంతాల్లో అశాంతి చల్లారలేదు. 1967 తర్వాత నేటిదాకా గిరిజన ప్రాంతాలు భారతప్రభుత్వంతోనూ, స్థానిక ప్రభుత్వాలతోనూ సంఘర్షిస్తోనే ఉండటం నాలుగోదశ. ఈ దశ ఇంతదాకా గిరిజన ప్రాంతాల్లో సంభవించిన పోరాటాలన్నిటికన్నా మరింత సంక్లిష్టమైన దశ. ఎందుకంటే ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ పాలకులూ కూడా ప్రధానంగా గిరిజనుల అటవీహక్కుల్నీ, అటవీ సంపదనీ కొల్లగొట్టడం మీదనే దృష్టిపెట్టారు. కాని స్వతంత్ర భారతదేశంలో పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, రోడ్ల విస్తరణ లాంటి ‘అభివృద్ధి’ కార్యక్రమాల పేరిట, అలాగే, మునుపెన్నడూ ఊహించను కూడా ఊహించలేని ఎన్నో రకాల ‘అభయారణ్యాల’ ప్రాజెక్టులపేరిట, గిరిజన ప్రాంతాల్ని పూర్తిగా ‘జాతీయీకరించి’ అక్కడి స్థానిక గిరిజనుల్ని నిర్వాసితుల్ని చేసే ప్రయత్నాలు మిక్కుటమయ్యాయి.. లెక్కలు వేసి చూస్తే, 1947కి పూర్వం గిరిజనేతరులు వ్యక్తులుగా ఆక్రమించిన గిరిజనులభూమికన్నా, స్వతంత్రభారతదేశంలో ప్రభుత్వం ‘చట్టబద్ధంగా’ ఆక్రమించిన గిరిజన భూమి కనీసం వందరెట్లు ఎక్కువ.
గిరిజన ప్రాంతాల్లో సంభవించిన తిరుగుబాట్లలో అత్యధిక శాతం మధ్యభారతదేశంలోనే సంభవించాయి. దేశంలోని గిరిజనుల్లో దాదాపు అరవై శాతం మధ్యభారతదేశంలోనే కేంద్రీకరించి ఉండటమే కాదు, విస్తారమైన ప్రాకృతికవనరులు కూడా ఆ ప్రాంతాల్లోనే నెలకొని ఉండటం కూడా అందుకు కారణం. అయితే, ఈస్టిండియా కంపెనీ పాలన మొదలైన తొలిరోజుల్లో బెంగాల్ ప్రెసిడెన్సీ సైన్యాల మీద కోలులు, సంతాలులు, ఓరవాన్లు, బొంబాయి ప్రెసిడెన్సీ సైన్యాల మీద భిల్లులు, రామోషీలు, గోండులు చేసిన తిరుగుబాట్లకీ, మద్రాసు ప్రెసిడెన్సీతో కోందులు చేసిన తిరుగుబాటుకీ మధ్య ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంది.
1790-1860 మధ్యకాలంలో స్థానిక గిరిజన పాలకులు కంపెనీతో తలపడ్డప్పటికీ అది ప్రధానంగా రెండు వైరి పక్షాల మధ్య సంభవించిన యుద్ధంగానే ఉండింది. కానీ మద్రాసుప్రెసిడెన్సీలో భాగమైన పూర్వపు గంజాం జిల్లాలో కోరాపుట్ ప్రాంతానికి చెందిన కోదులు చేసిన పోరాటం రెండు పాలనావ్యవస్థల మధ్య పోరాటంగా మారింది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల పాలన ప్రత్యక్షపాలన. గిరిజన ప్రాంతాల్లో ప్రాకృతిక వనరులమీద ఆధిపత్యం మొత్తం గిరిజన సమాజానిది. నేరం, న్యాయం, శిక్ష వంటివాటి పట్ల గిరిజనుల దృక్పథం వేరు. అక్కడ కులవ్యవస్థ లేదు, వర్ణవ్యవస్థ లేదు. బ్యురోక్రసీ లేదు. రాతకోతల్లేవు. కాని ఈస్టిండియా కంపెనీ పరోక్ష ప్రజాస్వామ్యానికి పుట్టిన బిడ్డ. దానిద్వారా గిరిజన ప్రాంతాల్లో కరెన్సీ, కలెక్టర్లు, కోర్టులు, పోలీసులు, జైళ్ళు, స్కూళ్ళు లాంటి ఆధునిక నిర్మాణాలు ప్రవేశించాయి. సహజంగానే అవి సాంప్రదాయిక గిరిజన జీవితానికి పూర్తిగా భిన్నమైనవి. కాబట్టి పూర్వపు గంజాం, విశాఖపట్టణం జిల్లాల్లోని గిరిజనులు ఈస్టిండియా కంపెనీ సైన్యాలతో మాత్రమే కాదు, కంపెనీ ద్వారా పరిచయమవుతున్న కొత్త తరహా పాలనావిధానంతోనూ, ఆధునిక నిర్మాణాలతోనూ కూడా తలపడ్డారు.
1832-34 మధ్యకాలంలో కోరాపుట్ ప్రాంతంలోని గుంసూరు సంస్థానంలో తలెత్తిన తిరుగుబాటుని అణచడానికి వచ్చిన మద్రాస్ ప్రెసిడెన్సీ రెవెన్యూ బోర్డు మెంబరు ఎడ్వర్డ్ జార్జి రస్సెల్‌కి ఈ సంగతి అర్థమయింది. అందుకని అతడు గిరిజన ప్రాంతాలకు సంబంధించినవరకూ కంపెనీ తన పాలనావిధానాన్ని సవరించుకోవడం మంచిదనీ, వీలైనంతవరకూ గిరిజన ప్రాంతాల సంస్కృతినీ, స్థానిక ‘స్వపరిపాలన’ నీ గుర్తించి గౌరవించడం మంచిదనీ సూచించాడు. ఆ సూచనల ఫలితంగా 1839 లో గంజాం, విశాఖపట్టణం జిల్లాల చట్టం వచ్చింది. తర్వాత రోజుల్లో, బ్రిటిష్ పాలన మొదలయ్యాక, ఆ విధానాన్నే మరింత విస్తరించి 1874 లో షెడ్యూల్డు జిల్లాల చట్టంగా తీసుకొచ్చారు. కాని 1922-24 లో సీతారామరాజు తిరుగుబాటు చేసేదాకా ఆ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించలేదు!
1947 దాకా దేశంలో గిరిజన ప్రాంతాల్ని రెండుగా విభజించి మధ్యభారతదేశంలోని ప్రాంతాలకు పాక్షికంగానూ, ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలకు పూర్తిగానూ స్వయంప్రతిపత్తిలాంటిది అమలుచేసారు. అయితే జాతీయోద్యమ నాయకులు ప్రధానంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనుంచి వచ్చినవారు కావడం వల్లా, వారికి గిరిజన ప్రాంతాల సమస్యలపట్ల అవగాహన లేకపోయినందువల్లా గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ‘విభజించు-పాలించు’ వ్యూహంలో భాగంగానే చూసారు. అందుకని 1946 లో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసినప్పుడు గిరిజన ప్రాంతాల విషయంలో పాటిస్తున్న ఈ ప్రత్యేక విధానాన్ని కొనసాగించాలా వద్దా అన్నది అధ్యయనం చేయడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. కాకాసాహెబ్ కలేల్కరు అధ్యక్షతన ఏర్పడ్డ ఆ ఉపసంఘం గిరిజన ప్రాంతాల చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేసి బ్రిటిష్ విధానాన్ని కొనసాగించవలసిన అవసరం ఉందని చెప్పింది. ఆ సూచనల ప్రకారం భారతరాజ్యాంగం మధ్యభారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో అనుసరించవలసిన పాలనా విధానాన్ని అయిదవ షెడ్యూలులోనూ, ఈశాన్యభారతదేశంలో అనుసరించవలసిన పాలనా విధానాన్ని ఆరవషెడ్యూలులోనూ స్పష్టంగా పేర్కొంది.
రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలు మధ్యభారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో ‘శాంతి, సుపరిపాలనలు’ నెలకొల్పడం తన లక్ష్యాలుగా పేర్కొంది. అందుకోసం అవసరమైతే రాజ్యాంగంలోని తక్కిన అధికరణాలన్నిటినీ కూడా పక్కన పెట్టవచ్చని చెప్పింది. కానీ ఏడున్నర దశాబ్దాలకు పైబడ్డ స్వతంత్ర భారతదేశ చరిత్రలో గిరిజన ప్రాంతాల్లో ‘శాంతి’, ‘సుపరిపాలనలు’ నెలకొనకపోగా, అశాంతీ, దుష్పరిపాలనలే అలముకుంటూ వస్తున్నాయి.
ఎందుకని?
ఎందుకంటే చాలా కారణాలు చెప్పవలసి ఉంటుంది. కాని ప్రధానంగా ఒకటే కారణం. 1950 కి పూర్వం గిరిజనుల శత్రువు పరాయిపాలకుడిరూపంలోనో లేదా గిరిజనేతరుడిరూపంలోనో ఉండేవాడు. దేశం స్వతంత్రమయ్యాక రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ ప్రజాస్వామిక ప్రభుత్వాలు గిరిజనులకు పూర్తి రక్షణ ఇవ్వగలవనీ, వారిని జాతినిర్మాణంలో భాగస్వాముల్ని చెయ్యగలవనీ భావించారు. కానీ గిరిజనులకి అండగా నిలబడవలసిన ప్రభుత్వాలే గిరిజన ప్రాంతాల, గిరిజనుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలాగా పనిచెయ్యడం, అందులో తిరిగి గిరిజనుల్లో ఒక వర్గాన్ని తమకు భాగస్వాములుగా మార్చుకోవడం గిరిజన ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తున్నది.
పైగా ఇదంతా కూడా ‘అభివృద్ధి’ పేరిట ముందుకు తీసుకుపోతూండటం! ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు విషయమే తీసుకోండి. ఆ ప్రాజెక్టు ఏ విధంగానూ గిరిజనులకి మేలు చేసేది కాదు. పూర్తిగా మైదాన ప్రాంతాలకి ఉపకరించే ప్రణాళిక. కాని దానికోసం తరతరాలుగా తమ నేలనీ, అడవినీ నమ్ముకున్న గిరిజనులు లక్షమందికి పైగా నిర్వాసితులయ్యారు. ఇంత గిరిజనవిద్రోహకరమైన ప్రాజెక్టుని 1950 కి ముందు మనం ఊహించలేం. అప్పటి ప్రభుత్వాలు ఇటువంటి పని చేసి ఉంటే, ఒక కొమురం భీం, ఒక సీతారామరాజు తప్పనిసరిగా తలెత్తి ఉండేవారు. కాని 1950 తర్వాత, రాజ్యాంగ పరిథిలో, ప్రజాస్వామిక చట్టాల మేరకు, ఒక జాతీయప్రభుత్వం మాత్రమే ఇటువంటి పని చేయగలుగుతున్నది. దాన్ని గిరిజనులు నోరెత్తకుండా అంగీకరించవలసి రావడం విషాదాల్లోకెల్లా విషాదం.
కానీ ఆశ్చర్యకరంగా, అయిదవ షెడ్యూలులో పొందుపరిచిన పాలనా విధానంగానీ లేదా గిరిజన ప్రాంతాల శ్రేయస్సుకోసం ప్రభుత్వాలు రూపొందిన అటవీ హక్కుల చట్టం 2006, పంచాయితీ రాజ్ విస్తరణ చట్టం 1996 గాని గిరిజనులు ఇలా మోసపోకుండా అడ్డుపడగలిగినవే. కాని వాటిని అమలు చేసే సంకల్ప శక్తి ప్రభుత్వాలకు లేకపోవడం, ఆ ప్రభుత్వాల చర్యల్ని ప్రశ్నించవలసిన పౌరసమాజంగాని, సమాచార ప్రసార సాధనాలు కాని పూర్తి మౌనం వహించడం మనల్ని నిశ్చేష్టితుల్ని చేసే అంశాలు. అసలు ప్రభుత్వం ‘చట్టబద్ధంగా’ చేపడుతున్న ఈ చర్యలు నిజంగా చట్టబద్ధాలూ కానేకావనీ, న్యాయబద్ధాలు అసలే కావనీ ఎంతమందికి తెలుసు? నిజానికి ఇటువంటి అంశాల్లో ప్రజల్ని జాగృతం చెయ్యవలసిన రచయితలకీ, మేధావులకే ఈ అంశాల పట్ల పూర్తి అవగాహనలేని కాలంలో మనమున్నాం.
కనకనే, ఈ నేపథ్యంలో, ఒక తెలుగు రచయిత రాసిన ఈ ‘నియాంపురం’ నవల చూడగానే నాకు వెయ్యేనుగుల బలం ఒక్కసారిగా సంప్రాప్తించినట్లనిపించింది.
3
గిరిజన ప్రాంతాల్లోని ప్రాకృతిక వనరుల్ని కొల్లగొట్టుకోవడంలో ఇంతకుముందు పరాయిపాలకులు కూడా ఒడిగట్టడానికి సాహచించనంత నిస్సిగ్గుతో మన కాలం నాటి ప్రభుత్వాలు బరితెగిస్తున్నాయి. అటువంటి ప్రయత్నాల్లో ఒకటి ఒరిస్సాలో, నియాంగిరి కొండల్లో బాక్సైట్ తవ్వకం కోసం ఒరిస్సా ప్రభుత్వం వేదాంత అల్యూమినియం లిమిటెడ్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం.
గిరిజన ప్రాంతాల్లో మైనింగ్, మినరల్ ప్రాసెసింగ్ రంగాల్ని అభివృద్ధి అవకాశాలుగా చూడటం నిజానికి ప్రభుత్వాలే మొదలుపెట్టాయి. 1981 లో కోరాపుట్ జిల్లాలోని దామన్ జోడీలో, అంగుళ్లో నేషనల్ అల్యూమినియం కంపెనీని ప్రారంభించడం ద్వారా ఆ ప్రాంతాల్లోని గిరిజనుల సంస్కృతినీ, అస్తిత్వాన్నీ తుడిచిపెట్టేసే ప్రక్రియ ప్రభుత్వమే మొదలుపెట్టిందని చెప్పవచ్చు. అవే ప్రాంతాలు 1830-60 మధ్యకాలంలో ఈస్టిండియా కంపెనీ విస్తరణని అడ్డుకోడానికి తమ ప్రాణాలు పణం పెట్టిపోరాడేయని గుర్తుతెచ్చుకుంటే అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ సరికొత్త విధ్వంసాన్ని ఎలాఎదుర్కోవాలో మనకి ఒక పట్టాన తోచదు. కాని నియాంగిరికి చెందిన డోంగ్రియా కోందులు అలా అనుకోలేదు.
వారు భారతప్రభుత్వం రూపొందించిన చట్టాల ప్రకారమే ఒరిస్సా ప్రభుత్వంతో పోరాటం మొదలుపెట్టారు. తమ అంగీకారం లేకుండా ఒరిస్సా ప్రభుత్వం తమ కొండల్లో బాక్సైట్ తవ్వకానికి అనుమతి ఇవ్వడం చట్టవ్యతిరేకమని ఎలుగెత్తి చెప్పారు. అలా ఏకపక్షంగా ఒక కంపెనీకి ఒక కొండని అమ్మేయడం అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో పొందుపరిచిన సామూహిక హక్కుల్ని కాలరాయడమే అవుతుందని వాదించారు. చివరికి సుప్రీం కోర్టు కలిగించుకుని కోదు గ్రామసభల్ని సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా బాక్సైట్ తవ్వకం చేపట్టడానికి వీల్లేదని తీర్పునివ్వడంతో పట్టుమని పదివేల మంది కూడా జనాభాలేని దోంగ్రియా కోందులు అత్యంత శక్తిమంతమైన జాతీయ ప్రభుత్వవిధానాల మీద పైచేయి సాధించారు.
ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ సైన్యాల్ని ముప్పుతిప్పలు పెట్టిన కోదులే ఈ కొత్త పోరాటాన్ని మొదలుపెట్టడం యాదృచ్ఛికం కాదని మనకు అర్థమవుతున్నది. ఈ పోరాటంలో డోంగ్రియా కోందుల వెనక ఎందరో యాక్డివిస్టులు ఉండి వుండవచ్చుగాక, కాని, ఈ పోరాటం శాంతియుతంగానూ, పూర్తిగా చట్టపరిథిలోనే, చట్టాల ఆసరగానే, ప్రభుత్వ చట్టవ్యతిరేక చర్యల్ని ప్రశ్నించేదిగా వికసించడం మనం గమనించాలి. నాకు తెలిసి, 1917లో చంపారన్‌లో మహాత్మాగాంధి మొదలుపెట్టిన సత్యాగ్రహానికి సమానమైన పోరాటం ఇది. నిజానికి గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వాలూ, మల్టీనేషనల్ కంపెనీలూ కలిపి సాగిస్తున్న దోపిడీని ఎలా ఎదుర్కోవాలో నియాంగిరి కోదులే మనకొక దారి చూపిస్తున్నారు.
ప్రభుత్వాలు చేసిన చట్టాల ఆధారంగానే ప్రభుత్వాల్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. దశాబ్దకాలం పైగా సాగిన, ఇంకా సాగుతున్న ఈ పోరాటంలో నియాం గిరి గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలు, సంక్లిష్టతలు, తమలోనే సంభవించిన చీలికలు సామాన్యమైనవి కావు. వారు అధిగమించిన ప్రలోభాలు, ప్రభావాలు మామూలు మామూలువి కావు. కాని విశాల, నాగరిక భారతదేశానికి ఆ పోరాటం గురించి తెలియవలసినంతగా తెలియనే లేదు. ఆ పోరాటానికి లభించవలసిన డాక్యుమెంటేషన్ పూర్తిగా లభించనే లేదు. అందుకు కారణం ఊహించడం కష్టమేమీ కాదు. మన మీడియాని నడిపేదే పెట్టుబడిదారులైనప్పుడు ప్రజాపోరాటాల్ని వారు పైకెత్తి చూపిస్తారని ఊహించలేం కదా.
కాబట్టే, ఈ రచయిత నన్ను అబ్బురపరుస్తున్నాడు. ఈయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటిదాకా ఈయన రచనలేవీ నేను చదవలేదు. ఈయన తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధుడు కాడు. కానీ ఎంతో శక్తిమంతమైన వార్తాపత్రికలూ, ఛానెళ్ళూ చేయని, చేయలేని పనిని ఈ రచయిత ఒంటిచేత్తో చేసి చూపించాడు. అభివృద్ధి పేరిట స్వతంత్ర భారతదేశం తమమీద సాగిస్తున్న దండయాత్రని ఒక గిరిజన గ్రామం ఎలా ఎదుర్కున్నదో ఈ రచయిత ఎంతో విశ్వసనీయంగా, సాధికారికంగా చిత్రించి చూపించాడు. తెలుగులో గిరిజనుల గురించిన సాహిత్యాన్ని ఈ నవల ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లింది.
4.
జనసంఖ్య రీత్యా చూస్తే పూర్వపు ఆంధ్రప్రదేశ్ మొత్తం దక్షిణభారతదేశంలోనే అతి పెద్ద గిరిజన రాష్ట్రం. ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా తెలంగాణాలో తొమ్మిది శాతం పైగా, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఆరుశాతం దాకా గిరిజనులున్నారు. కాని ప్రాచీన సాహిత్యంలోనైనా గిరిజనుల ప్రస్తావన మనకి కనిపిస్తుందిగాని, ఆధునిక తెలుగు సాహిత్యంలో చాలాకాలందాకా గిరిజనులకి చోటు దొరకలేదు, కనీసం, 1970 దాకా.
ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికులని కొనియాడే వీరేశలింగం, గురజాడ, రాయప్రోలు, ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రశస్తికెక్కిన విశ్వనాథ, కృష్ణశాస్త్రి, చలం, శ్రీ శ్రీ, కొ.కు, పాలగుమ్మి పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు వంటి వారి రచనల్లో గిరిజనులుగానీ, వారి సమస్యలు గానీ మనకి కనిపించవు. 1970 కి పూర్వం ఒక చింతాదీక్షితులు, ఒక దువ్వూరి రామిరెడ్డి వంటి వారు మాత్రమే ఇందుకు మినహాయింపు. శ్రీకాకుళంలో గిరిజనులు తిరగబడిన నేపథ్యంలో భూషణంగారు ‘కొండగాలి’ కథలు రాసిన తర్వాత కూడా రావిశాస్త్రి, కాళీపట్నం వంటివారి సాహిత్యంలో కూడా గిరిజనుడు మనకి కనిపించకపోవడం ఆశ్చర్యం. చివరికి 1980 తర్వాత కూడా ఎక్కడో ఒక ‘చివరిమనిషి’, ఒక ‘ఎల్లి’ వంటి నవలలు తప్ప చెప్పుకోదగ్గ సాహిత్యమేదీ గిరిజనుల గురించి కనిపించదు.
అయితే గత ఇరవయ్యేళ్ళల్లో ఈ పరిస్థితి మారుతూ ఉంది. ఇప్పుడు స్వయంగా గిరిజన రచయితలే తమ జీవితాల గురించి తామే రాయడం మొదలుపెట్టారు. వారికీ, వారి రచనలకీ కూడా గుర్తింపు లభిస్తున్నది.
కానీ ఈ రచయితలకి తమ జీవితాల్నీ, తమ ప్రాంతాల్నీ చిత్రించడానికి తెలుగుసాహిత్యంలో తమముందు చెప్పుకోదగ్గ నమూనాలేవీ లేవు. వాళ్ళముందున్నదల్లా గిరిజనేతర రచయితలు గిరిజనేతర జీవితాల గురించి రాసుకున్న కథలూ, నవలలూ మాత్రమే. కాని గిరిజనుల గురించి రాయాలనుకున్న రచయిత కేవలం గిరిజన సమాజాన్నీ, జీవితాన్నీ మాత్రమే చిత్రిస్తే చాలదు. అతడు గిరిజన ప్రాపంచిక దృక్పథాన్ని కూడా పట్టుకోవాలి. ఆ దృక్పథాన్ని చిత్రించడానికి గిరిజనుల పాటలు, కథలు, సామెతలు, పొడుపుకథలు, గిరిజన పురాణగాథల్లో వెతుక్కోవాలి. వాటి గురించి బాగా తెలిసి ఉండాలి. తెలిసిన విషయాల్ని నిస్సంకోచంగా రాయగలగాలి. అటువంటి రచనలకి నాకు తెలిసినంతవరకూ గోపీనాథ మొహంతి ’అమృతసంతానం’ నవలని మించిన నమూనా మరొకటి లేదు.
ఈ రచయిత కూడా ‘అమృత సంతానం’ నుంచి ప్రేరణ పొందాడని అనుకోవచ్చు. (ఈ నవల్లో మను భవానీపట్నలో చదువుకుంటున్నప్పుడు అక్కడ సైన్సు టీచరు పేరు గోపీనాథ మొహంతి!) కేవలం శైలిలోనూ, శిల్పం లోనూ మాత్రమే కాదు. విషయంలోనూ, విశదీకరణలోనూ కూడా. మొహంతి తన నవలలో చిత్రించింది కూడా కోరాపుట్ ప్రాంతంలోని కోదుల జీవితాన్నే. ఇప్పుడు ఈ నియాంపురం కూడా డోంగ్రియా కోదుల గురించే రాసిన రచన.
నవల్లో రచయిత పొందుపరిచిన తక్కిన భౌగోళిక విశేషాల్ని బట్టి అది కలహండి, కోరాపుట్ జిల్లాల మధ్య ప్రాంతంలో సంభవించిన కథగా కనిపిస్తుంది. అయితే తెలుగు వాళ్ళ జీవితం కాదుకదా అని అనవచ్చునేమో. కానీ అలా అనలేం. ఎందుకంటే, మొదటిది, అటువంటి డోంగ్రియా కోదులే మన పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మిపురం, కొమరాడ మండలాల్లోనూ, పాడేరు కొండల మీద జీవిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు వీళ్ళంతా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన పూర్వపు గంజాం జిల్లా గిరిజనులే. కాబట్టి ఇది తెలుగు ప్రాంతాల గిరిజనుల కథ కూడా. కానీ అంతకన్నా విస్తృతమైన సందర్భం ఈ కథకి ఉంది. ఇందులో సంభవిస్తున్న విధ్వంసమే మన పాడేరు మన్యంలో కూడా సంభవించే ప్రమాదం చాలాకాలంగా పొంచి ఉంది. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల పట్ల ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాలకి లోపల్లోపల అణగిపోని కోరిక ఒకటి బలంగానే ఉంటున్నది. ఏ రోజైనా గిరిజనులూ, గిరిజన ప్రేమికులూ ఆదమరచిన రోజున పాడేరు మన్యం మొత్తం ఒక నియాంపురం కాగలదని ఈ నవల మనల్ని హెచ్చరిస్తున్నది.
అలాగని ఈ నవలను అమృతసంతానానికి అనుకరణగా చెప్పలేను. అమృతసంతానం ఎక్కడ ఆగిపోయిందో ఈ నవల అక్కడ మొదలవుతున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ నవలని 21 వ శతాబ్దపు అమృత సంతానంగా అభివర్ణించవచ్చు. మొహంతి నవల రాసినప్పుడు కోదుప్రాంతంలో కొండలు ధరణిదేవత రూపాలు మాత్రమే. కాని ఆ నవలను సాహిత్య అకాదెమీ ఇంగ్లిషులోకి అనువదించినప్పుడు దానికి ఫెలిక్స్ పెడల్ రాసిన ముందుమాట ఆ నవలకు సరికొత్త ప్రాసంగికతను తీసుకొచ్చింది. తమ కొండల్ని వట్టి కొండలుగా భావించకుండా వాటిని దేవతలుగా భావించినందువల్లనే ఈ రోజు కోదులు ఆ కొండల్ని కాపాడుకోగలిగారు.
రాజా నరసింహ తన నియాంపురం నవల ద్వారా కోదు జీవితాన్నీ, వారి పోరాటాన్నీ ఈ సరికొత్త ప్రాసంగికతతో మనముందు చూపిస్తున్నాడు. అమృత సంతానం లానే ఈ నవల కూడా గిరిజన జీవితాన్ని ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించడానికి ప్రయత్నించింది. పుట్టుక, పెళ్ళి, చావు, పూజ, బలి, వియ్యం, కయ్యం – ఒక సమాజాన్ని చిత్రించడానికి అవసరమైన ఏ ఒక్క పార్శ్వాన్నీ రచయిత విడిచిపెట్టలేదు. గిరిజన జీవితంలో ఏడాది పొడుగునా నడిచే క్రతుకాండ, సంబరాలు, ఉత్సాహం, వేడుకలు వేటినీ రచయిత వదల్లేదు. సంతలు, దోపిడీ, వడ్డీ, వెట్టి, అణచివేత, తిరుగుబాటు- గిరిజన జీవితాన్ని ప్రతిబింబించే ఏ సందర్భాన్నీ రచయిత పక్కన పెట్టలేదు. చివరికి తాను కళ్ళతో చూసినదాన్ని పూర్తిగా తిరగమార్చి తప్పుడు కథనాలు రాసిపంపించే విలేకరితో సహా గిరిజన ప్రాంతంలో మనకి కనబడేవాడేవడూ ఇందులో కనబడకుండాపోడు.
తాను ఏ డోంగ్రియా కోదు జీవితాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఆదివాసుల్ని ఈ రచయిత చాలా దగ్గరగా చూసాడనీ, చాలాచోట్ల వారితో మమేకమయ్యాడనీ, వారిని మాత్రమే కాదు, వారి దేవతల్ని కూడా దగ్గరగా చూసాడనీ ఈ నవల సాక్ష్యం చెప్తున్నది. గిరిజన సంస్కృతిపట్ల లోతైన అవగాహన ఉన్న ఒక రచయిత రాసిన నవల కాబట్టే ఇన్నాళ్ళకు తెలుగులో ఒక పూర్తిస్థాయి గిరిజన నవల వచ్చిందని అనిపిస్తున్నది నాకు.
శిల్ప రీత్యా కూడా ఈ నవల ఉన్నత ప్రమాణాలు సాధించగలిగింది. నవల చదవడం పూర్తయ్యేటప్పటికి ప్రతి ఒక్క పాత్రా సుధామ సనాట, సితారి, నాని, డర్‌కు జాని, గామ, సుఖదేవ్, భీమా, నియాంపురానికి వలస వచ్చిన లెంజుకోదులతో సహా, ప్రధాన, అప్రధాన పాత్రలన్నీ మనకు బాగా తెలిసిన వ్యక్తులుగా మారిపోతారు. పాత్ర చిత్రణలో కథకుడు గొప్ప సామర్థ్యం చూపించేడు.
ప్రధాన పాత్ర మను దృష్టికోణం నుంచి చెప్పినందువల్ల కొన్ని పాత్రలకి విస్తారమైన చిత్రణ దొరికింది, కొన్నిటికి క్లుప్తంగానే దొరికింది, కాని ప్రతి ఒక్క చిత్రణా సమగ్రంగానే ఉండటం గమనించదగ్గది. ఉదాహరణకి కల్పని చిత్రిస్తున్నప్పుడు చాలాసార్లు ఆమె శారీరిక సౌందర్యాన్నీ, కదలికలనే చిత్రిస్తున్నట్టు అనిపిస్తుందిగానీ, ఆమె మీద గ్రామసభ విచారణ చేపట్టినప్పుడు, ఆమెలోని ధీరత్వం మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.
అలానే గ్రామపెద్ద సుధామ సనాటాని చూపించిన ప్రతిసన్నివేశంలోనూ రచయిత చూపించిన కౌశల్యం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అంతేకాదు, తన ఊరిలో, తన కోదు సమాజం కళ్ళల్లో ఒక చక్రవర్తికి సమానమైన సనాటాని పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్ స్పెక్టర్ కొట్టిన దృశ్యం మామూలుగా రచయితలు చూడగలిగినా చూపించడానికి ఇష్టపడేదికాదు. మొహంతి అయితే అమృతసంతానంలో సరుబు సావోతాని అటువంటి సన్నివేశంలో ఊహించనైనా ఊహించలేడు. కాని వాస్తవాన్ని చూడటంలోనూ, చూసింది చెప్పడంలోనూ ఈ రచయితకి ఎటువంటి సంకోచాలూ లేవు. నవల చివర్లో నియాంపురంలో సంభవించిన విధ్వంసమంతా ప్రతీకాత్మకంగా మంచాల పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధామ సనాటాని అవమానించడంలోనే రచయిత మనకి ద్యోతకం చేసాడని చెప్పవచ్చు.
గిరిజన ప్రాంతాల్ని ఎంతో దగ్గరగా చూసిన రచయిత మాత్రమే ఇదుగో ఇటువంటి వాక్యాలు రాయగలడు:
‘ఇక్కడ రాజు పేదవాడు, అతని ప్రజలు ధనవంతులు.’
‘మైదాన ప్రాంతాల్లో పిల్లలు స్కూలు ఎగ్గొడితే, గిరీజన ప్రాంతాల్లో టీచర్లే స్కూల్ కి ఎగ్గొడుతుంటారు.’
‘డోంగ్రియాల సమాజంలో హోదాలు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చవు.’
‘ప్రపంచమంతా సంతోషం కోసం అన్వేషిస్తుంటే డొంగ్రియాలు మాత్రం అన్వేషణలోనే సంతోషం కోసం వెతుక్కుంటారు.’
‘డోంగ్రియాలు పండ్లతోటలు సాగుచేయడంలో ఎంతో నైపుణ్యం సంపాదించారు. కాని పండ్లను డబ్బు చేసుకోవడంలో నైపుణ్యం సమపాదించుకోలేకపోయారు.’
‘భారతదేశంలోని తూర్పుకనుమల్లో అమెరికా, ఐరోపా, చైనా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులు కనిపిస్తాయి. కొన్ని అసలైనవి, చాలా నకిలీవి.’
‘వేశ్య అనే మాటకి సమానమైన పదం కువి భాషలో లేనేలేదు.’
సన్నివేశ కల్పనలోనూ, ఉత్కంఠని రేకెత్తించడంలోనూ, కథలోని బిగువుని కొనసాగించడంలోనూ రచయిత ప్రతిభ మెచ్చదగ్గది. కల్ప పైన బెజుణి ఆరోపణలు చేసినప్పుడు డర్‌కు జాని చెప్పిన మాటలు, ముఖ్యంగా ఆ గ్రామసభని చిత్రించిన పద్ధతి రచయిత సామర్థ్యానికి ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు.
మూడువందల పేజీలు దాటకపోయినప్పటికీ ఈ నవల ఒక విశిష్ట సంస్కృతినీ, ఒక విషాదకర విధ్వంసాన్నీ మన కళ్ళకు కట్టినట్టు చిత్రించడంలో పూర్తిగా సఫలమయ్యిందని చెప్పవచ్చు.
5.
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి గత అయిదేళ్ళుగా ‘అన్వీక్షకి’ చేస్తున్న ప్రయోగాలు, ప్రయత్నాలు ఎంతో విలువైనవి. ముఖ్యంగా 2024 ఉగాది సందర్భంగా నవలలపోటీ నిర్వహించి దాదాపు పాతికపైగా నవలల్ని ఎంపికచేసి ఒక్కసారే ప్రచురించే ప్రయత్నం ఇప్పటిదాకా ఏ ప్రచురణ సంస్థా చేసి ఉండని ప్రయత్నం. ఆ ప్రయత్నమే చేయకపోయి ఉంటే, నియాంపురం వంటి నవల వెలువడి ఉండేది కాదు. తెలుగులో గిరిజన సాహిత్యం ఇలా మరొక అడుగు ముందుకు వేసి ఉండేదికాదు. అందుగ్గాను అన్వీక్షకి సంస్థని మనసారా అభినందిస్తున్నాను. అలాగే ఒక గిరిజన ప్రేమికుడిగా ఈ నియాంపురం నవలని రెండు చేతులూ చాచిమరీ స్వాగతిస్తున్నాను.
Featured image: Dongria Khonds, pc: The Hindu Newspaper
6-8-2024


ఎప్పటి లాగానే మీ నుండి కొత్త విషయాలు తెలిసుకోవడం , అది ఆలోచనీయంగా మారడం
మన దేశచరిత్ర తెలుసుకోవడం గురించి మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనే భావన కలిగించింది . పనికి రాని బూజు భావాలమీద పెట్టే శ్రద్ధ , మన ప్రస్తుత మానవ సమాజం మీద పెట్టలేక పోవడం శోచనీయం .
“ప్రభుత్వాలు చేసిన చట్టాల ఆధారంగానే ప్రభుత్వాల్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. “
ఇంటికి వెళ్లినప్పుడల్లా మా ఊరి చుట్టూ ధ్వంసమౌతున్న గుట్టల చూసి కడుపు తరుక్కు పోతున్నది. ఆ విధ్వంసానికి మూలకారకులు శాసన సభ్యులు ప్రభుత్వమే అయినప్పుడు
ఏమీ చేయలేని పరిస్థితి. కంచే చేను మేస్తే ఏమి చేయగలం . ఎలా ఎదుర్కోగలం. మీరన్నట్లు ప్రసిద్ధ రచయితలెవ్వరూ గిరిజనుల గురించి పట్టించుకోలేని కారణం ఆ వ్యవస్థ నాగరిక వ్యవస్థకు దూరంగా ఉండటం . అక్కడ ఏమి జరుగుతున్నదే ఎవరికీ తెలియరాకపోవడం. మీ లాంటి వారు గిరిజన శాఖలో ఉన్నారు కనుక ఈ మాత్రమైనా విషయాలు తెలుస్తున్నవి.
పదవుల పందేరాల ప్రభుత్వాలు కళ్లు తెరవాలంటే
ప్రలోభాలకు లొంగని కవులు రచయితలు మాత్రమే విజృంభించాలి. అమెరికా చరిత్ర చదివినప్పుడు స్థానిక రెడ్ ఇండియన్లను దారుణంగా అణగదొక్కి ఇతర ఖండాలవాళ్లు
వాళ్లను నామరూపాలు లేకుండా చేసిన విషయం
కలచివేసింది. ఇక్కడ మన జాతికి మనమే శత్రువులు కావడం మ దౌర్భాగ్యం .
ఎంతో ఆవేదనతోను, ఎంతో అనుకంపతోను రాసిన మీ అభిప్రాయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మంచి విషయమున్న పుస్తకాన్ని పరిచయం చేశారు. నమస్సులు.
ధన్యవాదాలు మేడం
వీరభద్రుడు గారూ నమస్కారం.ఈ పుస్తక సమీక్ష ను భూమిక లో వెయ్యమంటారా. మీరు ఒప్పుకుంటే కుంటే bhumikahyd@gmail.com కు మెయిల్ చెయ్యండి.సమీక్ష చాలా హ్రుద్యంగా ఉంది. వెంటనే పుస్తకం కొనుక్కుని చదవాలనిపిస్తుంది.
ధన్యవాదాలు.
తప్పకుండా మేడం. ధన్యవాదాలు.
Mailed, madam.
మంచి ఫీల్ తో చెప్పారు. చరిత్ర తొలినాళ్ళ నుండి గిరిజనుల దోపిడీ జరుగుతూనే ఉంది. అశోకుడు దక్షిణానికి వచ్చినా హర్షుడు, సముద్రగుప్తుడు.. అందరూ దక్షిణాన ఉన్న వజ్రాలు, బంగారు గనుల కోసమే. పరిటాల, కొల్లూరు, జొన్నగిరి.. అన్ని వజ్రాల, బంగారాల గనులే సర్..
మీ స్పందనకు ధన్యవాదాలు సార్
ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకోగలిగాను. నిజానికి మీరు చెప్పే విధానంచదువుతూ ఉంటే మీరు చెప్పే ప్రతి వాక్యం వదలకుండా చదివించి ఆశ్చర్యపరిచింది.
సన్నివేశ కల్పనలోనూ, ఉత్కంఠని రేకెత్తించడంలోనూ, కథలోని బిగువుని కొనసాగించడంలోనూ రచయిత ప్రతిభ మెచ్చదగ్గది. కల్ప పైన బెజుణి ఆరోపణలు చేసినప్పుడు డర్‌కు జాని చెప్పిన మాటలు, ముఖ్యంగా ఆ గ్రామసభని చిత్రించిన పద్ధతి రచయిత సామర్థ్యానికి ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు.
మూడువందల పేజీలు దాటకపోయినప్పటికీ ఈ నవల ఒక విశిష్ట సంస్కృతినీ, ఒక విషాదకర విధ్వంసాన్నీ మన కళ్ళకు కట్టినట్టు చిత్రించడంలో పూర్తిగా సఫలమయ్యిందని చెప్పవచ్చు.
మీరు సమగ్రంగా చెప్పిన విధానం లో ఒక్కోసారి విపరీతమైన బాధ కలిగి ఎందుకు చాప కింద నీరులా ఇన్ని అన్యాయాలు దాగి ఉంటాయో కదా? అన్న ఆలోచనతో ఒక నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళు వచ్చాయి. కానీ తరతరాలుగా జరుగుతున్న అన్యాయాల్ని విని కాస్సేపు బాధపడి మళ్ళీ ఎవరి దారిన వారు పోవడమేనా? అనే బాధ… మీ వంటి మహానుభావులు మీ కుటీరం ద్వారా ఎన్నెన్నో గుప్తంగా అణచబడిన విషయాల్ని చెప్తుంటే చేతులెత్తి నమస్కరించడం తప్ప నేను చేయగలిగేది ఏముందో తెలియక సతమతం అవుతున్నాను.
మీ మాటలు ఒక మేలుకొలుపు ని ఇస్తాయి.
కనీసం బాధ ని వ్యక్తీకరించే అవకాశం. లభించింది. నమోనమః.
ధన్యవాదాలు