
నేను 2024 లో జీవిస్తున్న మరీ పాతకాలం మనిషిని. నేనింకా ఎనిమిదో శతాబ్ది చీనా కవిత్వం దగ్గరా, పదమూడో శతాబ్ది రూమీ దగ్గరా, పంతొమ్మిదో శతాబ్ది యూరపియన్ చిత్రలేఖనం దగ్గరనే ఆగిపోయినవాణ్ణి. ఎప్పుడేనా సినిమాలు చూద్దామనిపిస్తే, ఇరవయ్యవశతాబ్ది దాటి ఒక్కడుగు కూడా ముందుకు రాలేనివాణ్ణి. అసలు గతశతాబ్దంలో వచ్చిన గొప్ప సినిమాలు కొన్ని చూడటానికేనా నా శేషజీవితం సరిపోతుందో లేదో అనుమానమే.
అలా మొన్నొకరోజు పియర్ పావ్లో పాసోలీనీ తీసిన The Gospel According to St.Matthew (1964) చూసేను. పాసోలీనీ ఆ సినిమాని మత్తయి సువార్తలోని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా, రాసింది రాసినట్టుగా, సినిమాగా మలిచాడు. ఆ సువార్తలోని ఎన్నో ఘట్టాల్ని ఎంతో నాటకీయంగా మలిచి ఉండవచ్చు. ఎన్నో వాక్యాలకు స్ఫూర్తిప్రదాయకమైన సన్నివేశ కల్పనలు చేసి ఉండవచ్చు. కానీ ఆ దర్శకుడు ఆ సువార్తను అన్నిటికన్నా ముందు, దైవానుశాసనానికి తనని తాను అంకితం చేసుకున్న ఒక మానవుడు తన ఆవేదన, ఆత్మీయత, ఆగ్రహం ఎంత మాత్రం దాచుకోని ఒక గంభీర ప్రకటనగా అర్థం చేసుకున్నాడు. మనక్కూడా అలానే చూపించాడు.
ఆ బెత్లెహోము, ఆ కపెర్నహోము, ఆ గలిలయ సముద్ర తీరం, ఆ జెరికో, యెరుషలేము ల మధ్య అశాంత చిత్తుడిగా సంచరించిన ఒక అత్యంత శాంతమానవుణ్ణి మనకు మత్తయి ఎలా చూపించాడో దర్శకుడూ అలానే చూపించాలనుకున్నాడు. ఒకసారి యేసు బాప్తిస్మం తీసుకున్నాక, ఆ తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కమాటా ఉరుము ధ్వనిలానే ఉంది. ఆత్మవంచకులమీదా, పరవంచకులమీదా ఆయన ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు పిడుగులు కురిపిస్తున్నట్టే ఉంది. తన శిష్యుల్ని ఎంచుకుంటున్నప్పుడు తనవాళ్ళని గుర్తుపట్టేటప్పటి ఆదరం, సాతాను ప్రలోభపరుస్తున్నప్పుడు అతణ్ణి పక్కకు పొమ్మనగల నిబ్బరం, తనల్ని ప్రశ్నిస్తున్న పరిసయ్యుల్నీ, సద్దుకయ్యుల్నీ నిరుత్తరుల్ని చెయ్యగల వాక్పటిమ, పిల్లల్ని చూసినప్పుడు ఆ కళ్ళల్లో కనిపించే నిరుపమాన ప్రేమోల్లాసం, చివరికి తనను పట్టివ్వబోతున్నది యూదా అని తెలిసిన తర్వాత కూడా అతడి చూపగలిగిన నిర్లిప్తత, తనతో తన శిష్యులు కడదాకా ఎలానూ నిలబడలేరు సరే, కనీసం తన కోసం ప్రార్థించడానికి ఒక రాత్రి నిద్రకూడా వాయిదావెయ్యలేకపోవడం చూసినప్పటి నిస్త్రాణ- సినిమా పొడుగుతా క్రీస్తు నిజంగానే ఒక ఆరాధ్యమానవుడిగా కనిపిస్తూనే ఉన్నాడు.
ఆ సినిమా చూసినతర్వాత బావుందిలే అని అనుకుని మరో పనిలోకి పోలేకపోయాను. మళ్ళా మత్తయి సువార్త ఆమూలాగ్రం చదివితే తప్ప సినిమా చూసినప్పుడు కొన్ని ఘట్టాలు, కొన్ని వాక్యాలు, కొన్ని సంభాషణలు నాలో కలిగించిన అలజడిని పూర్తిగా సంభాళించుకోలేకపోయాను.
మత్తయి సువార్త మొదటిసారి నా హైస్కూల్లో రోజుల్లో చదివాను. అప్పట్లో చిలకలూరి పేటనుంచి ఎస్.జాన్ డేవిడ్ అనే ఆయన నాలుగు సువార్తల్నీ విడి విడి పుస్తకాలుగా అందమైన ముఖచిత్రాలతో ప్రచురించి ఉచితంగా పంచిపెట్టేవాడు. ఆయనకి ఒక పోస్టు కార్డు రాస్తే చాలు, మన పేరు మీద నాలుగు సువార్తలూ వచ్చేసేవి. కొన్నాళ్ళ పాటు తాడికొండలో ఆయనకి ఉత్తరం రాయని విద్యార్థి లేడు. అందమైన పువ్వులో, పిట్టలో ముఖచిత్రాలుగా ఉండే ఆ సువార్తలు ఎవరి పేరుమీద పోస్టు బాక్సులో కనిపించినా, అవి నా కోసమే వచ్చిన గ్రీటింగు కార్డుల్లాగా తోచేవి. కాని అది సువార్తలు పూర్తిగా అర్థం చేసుకోగల వయసుకాదు.
మళ్ళా రాజమండ్రిలో గడిపిన రోజుల్లో సువార్తలు చదివాను. కానీ అప్పటికి నాకు యోహాను సువార్త ముందు తక్కిన మూడు సువార్తలూ వెలవెలబోతున్నాయనిపించింది. సహజమే. ఎందుకంటే, యోహాను సువార్త గ్రీకు మాట్లాడే యూదులకోసం రాసిన పుస్తకం. కాబట్టి అది అత్యున్నత గ్రీకు సాహిత్యలక్షణాలకు అనుగుణంగా చెప్పిన కథనం. అక్కడ క్రీస్తు జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనా, ఆయన పలికిన ప్రతి ఒక్కమాటా ఒక రూపకాలంకారంగా మారిపోయింది. నా యవ్వనదినాల్లో కవిత్వంలో పీకలదాకా ప్రేమలో పడ్డ నాకు ఆ సువార్త అన్నిటికన్నా గొప్పదిగా తోచడంలో ఆశ్చర్యమేముంది?
చాలా ఏళ్ళ తరువాత లూకా సువార్త మీద రాధాసామీ సత్సంగ్ కి చెందిన మహారాజా చరణ్ సింగ్ వ్యాఖ్యానం చదివాను. అంతకు ముందు నాకేమంత గొప్పగా తోచని లూకా సువార్తలోని ప్రతి ఒక్క అధ్యాయం సరికొత్త వెలుగుతో కనిపించింది. ఆ ప్రేరణతో మార్కు సువార్త, మత్తయి సువార్త కూడా చదివాను. కాని నెమ్మదిగా, ఎప్పుడు నా హృదయంలో స్థిరపడిపోయిందోగాని, సువార్త అనగానే మత్తయి సువార్తనే అనే మెలకువ ధ్రువపడిపోయింది.
28 అధ్యాయాల మత్తయి సువార్త ప్రపంచప్రజల్ని ప్రభావితం చేసినంతగా కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా ప్రభావితం చెయ్యలేదు అని రాసాడు ఒక సువార్త పండితుడు. ఆశ్చర్యం లేదు. ఆ సువార్త మీదనే తొలి చర్చి సంఘటితమైంది. తొలి క్రైస్తవులు ఆ సువార్తలోని ప్రతి ఒక్క వాక్యాన్నీ తమ ప్రాణాలకన్నా మిన్నగా నమ్మారు. యేసు వినిపిస్తున్న దివ్యవాణి కేవలం యూదులకోసం మాత్రమే కాదనీ, ఆయన మాటల్ని ఎవరు విశ్వసించినా, వాళ్ళెక్కడివాళ్ళైనా వాళ్ళే నిజమైన క్రైస్తవులు కాగలరనీ తొలి క్రైస్తవ విశ్వాసులు నమ్మారు. ఈ రోజు క్రైస్తవం ప్రపంచవ్యాప్త విశ్వాసంగా రూపొందడానికి తొలిక్రైస్తవుల ఆత్మత్యాగాలే ప్రధాన కారణం అనుకుంటే వాళ్ళనట్లా త్యాగమయుల్ని చేయగలిగింది మత్తయి సువార్తనే.
మత్తయి ఒక సుంకరి. అంటే పన్నులు వసూలు చేసేవాడు. ఎవరికోసం? యూదుప్రాంతాన్ని పాలిస్తున్న రోమన్ రాజ ప్రతినిధులకోసం. అంటే ఇప్పటి మాటల్లో చెప్పాలంటే state కి ఆర్థిక పుష్టి సమకూర్చే వృత్తిలో ఉన్నవాడతడు. క్రీస్తు బీదల మనిషి. కాబట్టి సుంకరుల పట్ల ఆయన తన ఏహ్యత దాచుకోకపోవడం సువార్తల్లో కనిపిస్తుంది. కాని మత్తయి లాంటి సుంకరిని తన శిష్యుడిగా స్వీకరించడంలో, చాలా సార్లు సుంకరులతోనూ, పతితులతోనూ కలిసి విందు ఆరగించడంలోనూ క్రీస్తు సందేశం స్పష్టంగానే ఉంది. ఒక మనిషి ఏ జాతిలో పుట్టాడు, ఏ వృత్తి చేస్తున్నాడు, ఏ మాటలు మాట్లాడుతున్నాడు- వీటి వేటితోటీ ఆయనకు నిమిత్తం లేదు. తన మాటలు నమ్ముతున్నాడా లేదా అంతే. అది కూడా తన మాటలని కాదు, తన ద్వారా వినిపిస్తున్న తన తండ్రి మాటలని నమ్ముతున్నాడా లేదా. అదొక్కటే ఆయనకు ముఖ్యం. తన హృదయాన్నిట్లా విప్పిపరవడంలో ఆయన చూపించిన ఈ హృదయవైశాల్యానికి మత్తయి సువార్తలో ఎన్నో ఉదాహరణలున్నాయి. అసలు తన జీవితకథ చెప్పడానికి ఒక సుంకరిని ఎంచుకోవడంలోనే గొప్ప కవిత్వ స్ఫూర్తి ఉంది. కాబట్టే మత్తయి సువార్తని యూదులు తమ సొంతమనిషి తమకోసం పట్టుకొచ్చిన సువార్తగా భావించారు.
మత్తయి సువార్తలోని ఆసక్తికరమైన వైరుధ్యం ఇక్కడే ఉందంటున్నాడు ఎ.ఎన్.విల్సన్ అనే సువార్త పండితుడు. Canongate ప్రచురించిన మత్తయి సువార్త (1998) కు రాసిన ముందుమాటలో ఆయన దాన్నిలా వివరిస్తున్నాడు: మత్తయి సువార్త పూర్తిగా రూపుదిద్దుకునేనాటికి, క్రీ.శ ఒకటో శతాబ్దం నాటికి క్రైస్తవుల్లో రెండు విభాగాలుఏర్పడ్డాయి. ఒకరు, యూదులుగా పుట్టి క్రీస్తుని నమ్ముతున్నవాళ్ళు. పాత నిబంధనలోని దైవానుశాసనం క్రీస్తులో పరిపూర్ణత పొందిందని భావించేవాళ్ళు. క్రీస్తు శిష్యుల్లో ఒకరైన పేతురుతో మొదలుకుని తొలిక్రైస్తవానికి ఆధారస్తంభాలుగా నిలబడ్డవాళ్ళు. వాళ్ళకి మత్తయి సువార్త ఒక అనుశాసనం. అది సంగ్రహరూపంలో మరొక తోరా. వారిదృష్టిలో యేసు కొండమీద చేసిన ప్రసంగం మోషే ధర్మసూత్రంలాంటిదే. కాని మరొకవైపు సినాయి కొండకి ఆవల, గలిలి సముద్రపు ఆవలి ఒడ్డున క్రీస్తు వాణికి ఆకర్షితులవుతూ క్రైస్తవులుగా మారుతున్న మరెన్నో తెగలవారికి ఆ సువార్త ఒక కృపావర్షం. ఎందుకంటే వాళ్ళు యూదీయ ధర్మశాస్త్ర సంప్రదాయంలో పుట్టిపెరిగినవాళ్ళు కారు. యుగాలుగా పాతనిబంధన ప్రవక్తలు ఘోషిస్తో వచ్చిన మెస్సయ్యా యేసేనని తెలుసుకోవడం వారికేమంత ముఖ్యం కాదు. వారికి ప్రత్యక్షమైన ఏసు ఒక గతానికో, ఒక మతానికో కొనసాగింపు కాదు. వాళ్ళ దృష్టిలో ఆయనకి ఏ ధర్మశాస్త్రమూ ఏమంత ముఖ్యం కాదు. ఆయనకి తన తండ్రి ప్రేమని పంచడం అన్నిటికన్నా ప్రధానం. ఆయన కోరుకునేది యజ్ఞయాగాదులు కాదు, దయ. ఆయన ధ్యేయం నీతిమంతుల్ని వెతుక్కుని వారిని బలపరచడం కాదు, ఎవరు పాపులో, ఎవరు పతితులో, వారి పక్కన నిలబడి వారికి ధైర్యాన్నివ్వడం. వాళ్ళని స్వస్థపరచడం.
ఇలా ధర్మానికీ, దయకీ మధ్య సాధించిన ఒక అపురూపమైన సమతూకం వల్లనే మత్తయి సువార్త అంత ప్రభావశీల పుస్తకంగా రూపొందిందంటాడు విల్సన్. మనకి అర్థమయ్యే ఉదాహరణలతో చెప్పాలంటే, బుద్ధుడి తొలి అనుయాయులైన థేరవాదుల్నీ, మలి అనుయాయులైన మహాయానుల్నీ-ఇద్దర్నీ రెండు చేతుల్తోనూ దగ్గరగా పొదువుకునే ఒక బుద్ధుని సువార్త ఉండి ఉంటే ఎలా ఉండేదో, మత్తయి సువార్త అటువంటిదన్నమాట.
అయినప్పటికీ మత్తయి సువార్తలో యేసు దూరం పెట్టినవాళ్ళు తక్కువేమీ లేరు. అందరికన్నా ముందు సంపన్నులు. ఒక ఒంటె సూదిబెజ్జం గుండా పోగలదేమోగాని, ఒక ధనికుడికి ఈశ్వర సామ్రాజ్యంలోకి ప్రవేశం దుస్సాధ్యం అనేది మత్తయి సువార్త పదే పదే ఘోషించే అంశం. ఆ సువార్త పొడుగునా క్రీస్తు బీదలపక్కన, దుర్బలుల పక్కన, నిస్సహాయుల పక్కన జీవించడానికే ఎక్కువ ఉత్సాహపడుతుంటాడు. ధనికుల్తో పాటు పవిత్రస్థలాల్ని వ్యాపారకేంద్రాలుగా మార్చినవాళ్ళ పట్ల క్రీస్తు తన ఆగ్రహాన్ని ఎంత మాత్రం దాచుకోలేదు. అక్కడ ఆయన నిలువెల్లా ‘ఎర్రక్రీస్తు’ ఇక క్రీస్తు ద్వేషించిన మూడవ సమూహం ఆత్మవంచకులు. మామూలు ఆత్మవంచకులు కాదు, ధర్మశాస్త్రాపేరిట, నీతివాక్యాల పేరిట, న్యాయసూత్రాల పేరిట తమకొక జీవనశైలినీ, తమని అనుసరించేవాళ్ళకి మరొక జీవనశైలినీ నిర్దేశించే పండిత, ధార్మిక, మఠాధిపతిగణం మీద క్రీస్తు పదేపదే విరుచుకుపడుతూనే ఉంటాడు. ‘ఆత్మవంచకులారా’అని సంబోధించకుండా అసలు ఆయన వాళ్ళతో మాట్లాడనే మాట్లాడడు. పాసోలినీ సినిమాలో ఆ ఘట్టాలన్నీ ఒళ్ళు గగుర్పొడిచేవిగా ఉన్నాయి. స్వయంగా మార్క్సిస్టు అయిన పాసోలినీ క్రీస్తు వాక్యాలతో ఇటాలియన్ ఫాసిస్టుల్ని ఎండగడుతున్నాడని గుర్తుపట్టడం కష్టం కాదు.
క్రీస్తు గురించి రాస్తూ కార్ల్ జాస్పర్స్ ప్రపంచం అంతంకాబోతోంది, కాని మనుషులు తమ నడతని ఎంతకీ చద్దదిద్దుకోరేమిటి అన్న ఆవేదననీ, ఆగ్రహాన్నీ క్రీస్తు వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుందన్నాడు. కానీ మత్తయి సువార్త చదివినప్పుడు మనకి క్రీస్తు ఈశ్వరసామ్రాజ్యం చేతికందేటంత దగ్గరగా ఉందని పదే పదే చెప్తూండటం కనిపిస్తుంది. నిజమే, ఆయన తన దేశస్థులపట్లా, నగరాలపట్లా, మతధార్మికంగా ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్ళపట్లా తన ఆగ్రహాన్ని ఎక్కడా దాచుకోలేదు. కానీ దానికి కారణం ఈశ్వరసామ్రాజ్యానికి వాళ్ళు అడ్డుగా నిలబడుతున్నారనీ, తమకో న్యాయమూ, ప్రజలకూ న్యాయమూ పాటిస్తో, ప్రజలు ఈశ్వరకృపని అందుకోకుండా ఏదో ఒక విధంగా మభ్యపెడుతూనే ఉన్నారన్నదే.
Kingdom of God is at hand అనేది మత్తయి సువార్త పొడుగునా ప్రతిధ్వనించే నినాదం. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఈశ్వరసామ్రాజ్యం మరెక్కడో లేదని కూడా కనీసం రెండుసందర్భాల్లో ఆయన స్పష్టంగా చెప్తాడు. అంతేకాదు అలాంటి నిర్మలులైన పసిహృదయాల్ని ఎవరు గాయపరిచినా వాడు మెడకి బండరాయి కట్టుకుని సముద్రంలో దూకి చావడం మేలని కూడా అంటాడు. ఈశ్వర సామ్రాజ్యం ఎక్కడో ఊరుబయట విశాల మైదానంలో ఎదురయ్యేది కాదు. అది ఒక ఆవగింజలాంటిది, అది విత్తనాల్లోకెల్లా అతి చిన్నది, కాని పెరట్లో పడిమొలకెత్తగానే దాని కొమ్మలు చకాచకా పెరుగుతాయి, దానిమీద ఎక్కడెక్కడి పిట్టలూ వచ్చి వాలతాయి. పరలోక రాజ్యం రేపటిరొట్టెల కోసం ఇవాళ పులియబెట్టిన పిండిలాంటిది, ఇంత నానబెడితే పొద్దున్నకి రెట్టింపవుతుంది. దైవకృప సరైన పొలంలో విత్తనాలు చల్లే రైతులాంటిది. అది పెరట్లో దొరికిన నిధినిక్షేపం లాంటిది. అది ఒక ముత్యాల వర్తకుడికి దొరికిన ముత్యాలపంట. అంతేనా? అది ఒకడు సముద్రంలో వలవిసిరి బైటకి లాగిన వేటలాంటిది. వలలో మంచివీ, చెడ్డవీ రెండూ పడతాయి. కాని జాలరి చివరికి మంచివి పోగుచేసుకుని చెడ్డవాటిని అక్కడే పారేసి వెళ్ళిపోతాడు.
ఈశ్వరకృపకి ఏ హద్దులూ లేవు అన్నది క్రీస్తు నమ్మిక, కాని అర్హతలుంటాయి. For many are called for, but few are chosen అనేది ఆయన పదేపదే చెప్పేమాట. అందులో ఎటువంటి రాజీ లేదు. ఈశ్వరకృప మనుషుల మధ్య భేదం చూపించదు. It is at hand. కాని అందుకోడంలో తప్పనిసరిగా భేదాలున్నాయి. కాని ఆ భేదాల్ని నిర్ణయించేది పుట్టుక, చదువు, గుణగణాలు, చివరికి ధర్మశాస్త్రనియమాల నిష్ఠుర పాలన కూడా కాదు. కావలసింది ఒక్కటే. నమ్మకం. పరిపూర్ణ విశ్వాసం. నువ్వు నమ్మకంగా పిలిస్తే కొండ కూడా నడుచుకుంటూ నీ దగ్గరకొస్తుందంటాడాయన. నమ్మకంలో యేసు నమ్మకం అచంచలం. తన కాలం నాటి పురోహితులమాటలకీ, క్రీస్తు మాటలకీ మధ్య ప్రజలకి కనిపించింది ప్రధానంగా ఈ తేడానే. For he taught them as one having authority and not as the scribes (7:29).
కాని యేసుకు తెలుసు, తాను కొండమీద చెక్కుచెదరని ఇల్లుకట్టాలనుకుంటాడు, కాని తనని అనుసరిస్తున్న మనుషుల మనసులు వట్టి ఇసుక. ఒక ఉదాహరణ చెప్తాను. తాను కొండమీద నిలిచే లాంటి విశ్వాసిసమాజాన్ని నిర్మించబోతున్నానని యేసు పేతురుతో చెప్తూ ఆ దేవాలయ తాళాలు పేతురుకే అప్పగిస్తున్నానని అంటాడు. ఆ మరునిమిషమే తాను యెరుషలేం వెళ్ళక తప్పదనీ, అక్కడ ప్రధానపురోహితులు తనని బంధించి వధిస్తారనీ, కాని మూడోనాడు తాను పునరుజ్జీవితుడవుతాడనీ చెప్తాడు. ఆ మాటలు విన్న పేతురు ‘ప్రభూ, అలాంటి పరిస్థితి మీకెప్పటికీ రాకూడదు’ అని అంటాడు. అనగానే యేసు ఆగ్రహోద్రిక్తుడై ‘సాతానూ, నా ముందు నిలబడకు. నిన్ను చూస్తేనే పాపం. నువ్వు మాట్లాడేది దేవుడి మాటలు కాదు, మనుషుల మాటలు’ అని అరుస్తాడు. ఈ సారి సినిమా చూసినప్పుడు నా దృష్టిని పట్టుకున్న దృశ్యాల్లో ఇదొకటి.
కాని సరిగ్గా ఇక్కడే మత్తయి సువార్త సాంప్రదాయిక మతగ్రంథాలకన్నా ప్రత్యేకంగా నిలబడుతున్నది. మనుషులు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎలా ప్రవర్తిస్తారు, నియమనిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారు అన్న వాస్తవిక దృక్పథంతో నిమిత్తం లేకుండా వారినుంచి పన్నులు రాబట్టినట్టుగా విశ్వాసాన్ని రాబట్టాలనుకోవడం సాంప్రదాయిక మతాల పని. కాని యేసుకి మనుషుల దుర్బలత్వం తెలుసు. అందుకనే ఆయన I will have mercy, and not sacrifice అని అన్నాడు. మరి ధర్మశాస్త్రాల సంగతేమిటి అని పురోహితులు ఆయన్ని ప్రశ్నించినప్పుడు, think not that I am come to destroy the law, or the prophets; I am not come to destroy, but fulfil అని అంటాడు. చాలా చాలా గొప్ప వాక్యం ఇది. ఎంత గొప్ప వాక్యం అంటే, దీనికి సమానమైన ఉదాహరణగా మన పూర్వమీమాంస, ఉత్తరమీమాంసల మధ్య సంవాదాన్ని చెప్పుకోవచ్చు. పూర్వమీమాంసికులు కర్మలు నెరవేర్చడమొక్కటే మనిషి కర్తవ్యం అని చెప్పారు. నెరవేర్చని, లేదా సరిగా నెరవేర్చని, లేదా నెరవేర్చలేని కర్మల ఫలితం నుంచి, వాళ్ళ దృష్టిలో, విముక్తి లేదు. కాని వేదాంతులకి జ్ఞానం ముఖ్యం. జ్ఞానాగ్ని కర్మల్ని దహించివెయ్యగలదు. కాని జ్ఞానమార్గం అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా అన్న ప్రశ్నతో విశిష్టాద్వైతులూ, ద్వైతులూ ఈశ్వరకృపకి పెద్దపీట వేసారు.
సినిమా చూస్తున్నంతసేపూ, చూసాక, మరోసారి మత్తయి సువార్త చదువుతున్నంతసేపూ మరెన్నో ఆలోచనలు నాలో ఉప్పెనలాగా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జనబాహుళ్యం (multitudes) పట్ల క్రీస్తు వైఖరి. ఆయన వీలైనంతవరకూ వారిని తప్పించుకు తిరుగుతూనే ఉన్నాడు. అలాగని వాళ్ళని వదులుకోలేకపోతూనే ఉన్నాడు కూడా. ఎన్నోసార్లు వాళ్ల పట్ల ఆయనకు వాళ్ళ పట్ల గొప్ప దయ పుట్టిందని చెప్తాడు సువార్తకారుడు. జనబాహుళ్యానికీ, క్రీస్తుకీ మధ్య ఎప్పటికప్పుడు ప్రకంపనలకు లోనవుతున్న ఆ అనుబంధం గురించే మరోసారి వివరంగా మననం చెయ్యాలని ఉంది.
నాలుగు సువార్తల్లోనూ యోహాను సువార్త తప్ప తక్కిన మూడింటినీ synoptic gospels అంటారు. అంటే వాటిలో వర్ణించబడ్డ విషయాల్లో ఒక సారూప్యత ఉందని దాని అర్థం. ఆ మూడింటిలోనూ మార్కు సువార్త మొదటిదనీ, మత్తయి దాన్నిబట్టే తన సువార్త రాసాడనీ బైబిల్ పరిశోధకులు చెప్పేమాట. కాని కొందరు దాన్ని అంగీకరించడం లేదు. మత్తయి సువార్త అరమాయిక్ భాషలో మొదట రాసిందనీ, తర్వాత గ్రీకులోకి అనువాదమయ్యిందనీ, తక్కిన సువార్తల్లో కనబడని కొన్ని స్థానిక విశేషాలు, మొదటిశతాబ్దానికి ఇంకా ప్రజల స్మృతిలో సజీవంగా ఉన్నవి మత్తయి సువార్తలో కనిపిస్తున్నాయనీ వారి వాదన. కాని ఆ సువార్తకారుడు తనకాలం నాటి క్రైస్తవ విశ్వాసుల్లోని పరస్పర విరుద్ధ ఆకాంక్షలకి ఒక ఆమోదయోగ్యమైన సమన్వయాన్ని సాధించడంలో కృతకృత్యుడయ్యాడని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఈ అంశంలో మత్తయి సువార్తకు సాటి రాగల మరొక పవిత్రగ్రంథం భగవద్గీత మాత్రమే.
10-7-2024


మీలో అతి చిన్న వయసులోనే సర్వమత సమన్వయ భావమేర్పడటం ఒక విశేషం.నాలాంటి వాళ్లకి ఇది చదువకూడదు , ఇది చదవాలి అని నిర్దేశించే వాళ్లు లేక పోయినా , పరమతస్థులతో ఎంతో కలివిడిగా తిరిగినా , అది మనకు సంబంధించింది కాదు అనే ముద్ర ఎందుకు పడిందో ఇప్పుడాలోచిస్తే ఎంతగా ఆలోచించినా
తట్టటం లేదు. అప్పుడప్పుడూ ఇలాంటి సువార్త పుస్తకాలు చేతికందినా ఎన్నడూ తెరచి చదివింది లేదు. ఇప్పుడు మీ భావపరవశం చూస్తుంటే
గురజాడ మంచియన్నది పెంచుమన్నా ! అన్నమాట ఒక్క తెలుగువాళ్లతో, భారతీయులకో కాదు , విశ్వజనావళికిచ్చిన సందేశం అనిపిస్తుంది.
మీ రచనలోని అనేక విషయాలు అవగాహన లో లేనివి గనుక కొంత అవగాహనా లోపమేర్పడవచ్చు . కాని అసలు సారాంశం పతిత పావన తత్త్వం మాత్రం బోధపడుతున్నది. మీ ఎల్లలోకమలొక్క ఇల్లై అన్న సద్భావనా స్వారస్యం ఆనందింప జేస్తున్నది .
మతముకన్న మనిషి మిన్న
మనిషికన్న మానవత్వం మిన్న
దైవత్వం అంటే పరిపూర్ణ మానవత్వమే అనిపించింది . నమస్సులు.
ధన్యవాదాలు సార్
నేను క్రైస్తవుడను..కానీ నేనెప్పుడూ సువార్త లను ఇంత బాగా అర్థం చేసికోలేదు. నిజమే జాన్ డేవిడ్ గారు పంపే సువార్త లు సేకరించిన వారిలో నేనొకణ్ని.
కానీ పూర్తిగా ఎప్పుడూ చదవలేదు మీరు రాసిన సౌవార్త విశేషం నన్ను ఇప్పుడు సువార్త లు చదవాలనే నిర్ణయం వైపు మరలించింది.సర్వమానవ శ్రేయస్సే మూల్యం గా రాసే మీకు దీవెనలు.దైవం మిమ్మల్ని కాపాడాలి.
ధన్యవాదాలు సుదర్శన్ గారూ!
Amazing sir