మరికొన్ని కలయికలు

భూమన సుబ్రహ్మణ్యం రెడ్డిగారు శ్రీ శ్రీ మహాప్రస్థానం కానుక చేస్తున్న దృశ్యం

అన్నమాచార్య ప్రాజెక్టు వారు ఏర్పాటు చేసిన అన్నమయ్య సాహిత్య సభల్లో పాల్గోటానికి తిరుపతి వెళ్ళిన నాకు మరో రెండు సభల్లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది.

అన్నమయ్య సభలకోసం తిరుపతి వస్తున్నానని తెలిసి  నన్ను మరికొంతమంది సాహిత్యమిత్రులు కలుసుకోవాలని అనుకుంటున్నారనీ, వారందరికీ వీలుగా ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ఆముదాల మురళి గారు చెప్పారు. నన్ను ఆ గోష్ఠికి రమ్మని ఆహ్వానించేరు.

28 వ తేదీ సాయంకాలం శ్రీ వేంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడెమీ (శ్వేత) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గోష్ఠికి అకాడెమీ డైరక్టర్ భూమని సుబ్రహ్మణ్యం రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఆ గోష్ఠిలో కవులు, రచయితల్తో పాటు తిరుపతిలోని ఎన్నో పరిశోధన సంస్థలకు, సాహిత్య సంస్థలకు ప్రాతినిధ్యం వహించే పండితులు, పరిశోధకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోష్ఠి నిర్వహించిన ఆముదాల మురళిగారు శ్రీ తరిగొండ వేంగమాంబ ప్రాజెక్టులోనూ, సారంగపాణి ప్రాజెక్టులోనూ పరిశోధకులుగా పనిచేస్తున్నారు. వారితో పాటు శ్రీవేంకటేశ్వర మూజియం డైరక్టరు నాగోలు కృష్ణారెడ్డిగారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు సూర్యదేవర హరికృష్ణగారు, ఓరియెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన రాజశేఖర్ గారు, వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్ఞ్మయ పీఠానికి చెందిన కలువగుంట రామ్మూర్తిగార్లతో పాటు వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు భాష ఆచార్యులు, పరిశోధకులు కూడా ఆ గోష్ఠిలో పాల్గొన్నారు. శివుని రాజేశ్వరిగారు, స్రవంతి ఐతరాజుగారు, శారదగారు వంటి విదుషీమణుల్తో పాటు సాహిత్య అకాదెమీ పురస్కార సన్మానితుడు, మిత్రుడు నరేంద్ర కూడా ఆ సభలో ఉన్నారు. నా చిరకాలమిత్రుడు, ప్రస్తుతం ఎస్.వి.బి.సి ఛానెల్లో పనిచేస్తున్న రచయిత, యాత్రాచరిత్రకారుడు బి.వి.రమణ కూడా ఆ సభకు హాజరు కావడం నిండుదనాన్ని తెచ్చింది.

గోష్ఠి మొదలుపెడుతూ మురళిగారు నా గురించి మాట్లాడిన నాలుగు మాటలూ నన్ను ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుత సాహిత్య ప్రపంచంలో ఏదో ఒక్క సాహిత్యానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్క సాహిత్య సంప్రదాయానికీ, కావ్యవాక్కుకీ నేను అభిమానినని ఆయన చెప్పడం నన్ను చాలా సంతోషపరిచింది. నువ్వు నమ్మిన దారిన నీ వంతు కృషి నువ్వు చేసుకుంటూపోతూ ఉండాలేగాని నిన్ను అర్థం చేసుకోగలిగే సహృదయులు ఎవరో ఒకరు నిన్ను చేరగలరని నాకు మరోసారి నమ్మకం కలిగింది.

ఆ రోజు అక్కడకు వచ్చిన చాలామంది పండితుల్నీ, పరిశోధకుల్నీ నేను కలుసుకోవడం అదేమొదటిసారిగానీ, వారు నా రచనలు చదివామని చెప్తుంటే నా మనసెంతో పులకించిపోయింది. ఒకరు మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ పైన నేను రాసిన ‘నీ శిల్పివి నువ్వే’ పుస్తకం గురించీ, డా.కాళ్ళకూరి శైలజ గారి ‘డావో’ పుస్తకానికి నేను రాసిన ముందుమాట గురించీ ప్రస్తావించారు. మరొకరు కథాప్రక్రియ గురించి నేను రాసిన వ్యాసాలు తమకి తరగతిబోధనలో ఎంతో ఉపకరించాయని చెప్పారు. మరొకరు సత్యాన్వేషణ గురించీ, ఇంకొకరు ఒక విజేత ఆత్మకథ గురించీ మాట్లాడేరు. చాలు, ఒక రచయితగా నా కృషికి ఇంతకన్నా నేరు కోవలసింది మరేమీ లేదనుకున్నాను

మనకు వారసత్వంగా లభించిన తెలుగు భాషా, సాహిత్యాల్ని కాపాడుకోవడం ఎలా అన్నదానిగురించే ఆ గోష్ఠిలో  ప్రధానంగా చర్చ జరిగింది. భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు వెంగమాంబ, సారంగపాణి ప్రాజెక్టుల ద్వారా చేపడుతున్న పనుల గురించి విన్నాక కలిగిన ఉద్వేగంలోంచే నేను చాలాసేపు మాట్లాడేను. ముఖ్యంగా తెలుగు కవులు జీవించిన స్థలాల గురించీ, నడయాడిన తావుల గురించీ, పలికినపద్యాలు, పాటల గురించి యువతరానికి తెలియచెప్పడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టగలమో అన్నదాని చుట్టూతానే చర్చ జరిగింది. ఉదాహరణకి మహారాష్ట్రలో ప్రతి ఏటా వార్కరి జరిగినట్టే, జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాంల అభంగాలు పాడుకుంటూ గ్రామీణులు పండరియాత్ర చేసినట్లే, అన్నమయ్య తిరుగాడిన ముఖ్యమైన స్థలాలనుండి ఆయన కీర్తనలు పాడుకుంటూ ఒక సంకీర్తనా యాత్ర జరపవచ్చుకదా అని అనుకున్నాం.

అలాగే ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి గారు తిరుపతి గంగమ్మ జాతర గురించీ, తిరుపతి చుట్టూ ఉన్న ఐతిహ్యాల గురించీ రాసిన రెండు పుస్తకాలు నాకు ఇచ్చినప్పుడు స్థానిక చరిత్రకారుల సదస్సు ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా అనుకున్నాము. ఎందుకంటే నేను నా పర్యటనలో భాగంగా చాలా ప్రదేశాల్లో స్థానిక చరిత్రకారుల్ని చూస్తున్నాను. ఒంగోలులో జ్యోతి చంద్రమౌళి గారు అటువంటి ఒక స్థానిక చరిత్రకారుడు. దాట్ల దేవదానం రాజుగారు యానాం చరిత్ర మీద ఒక పుస్తకం వెలువరించారు. తూర్పుగోదావరి జిల్లా కైఫియత్తుల మీద బొల్లోజు బాబా ఒక పుస్తకం రాశారు. చిత్తూరు జిల్లాలో కీల పట్లకు వెళ్ళినప్పుడు కీలపట్ల కోనేటి రాయుడు పైన ఒక పుస్తకం చూశాను. ఇటువంటి స్థానిక చరిత్రలు ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఎన్నో ఉండి ఉండవచ్చు. కానీ వాటి గురించి బయట జిల్లాల వారికి తెలియదు. కాబట్టి అటువంటి స్థానిక చరిత్రకారుల సదస్సు ఒకటి జరిగితే స్థానిక చరిత్రలు ఎన్నో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆ మర్నాడు కూడా తమ ఉద్యోగుల్ని ఉద్దేశించి మాట్లాడమని సుబ్రహ్మణ్యం రెడ్డిగారు ఒక తరగతి ఏర్పాటు చేసారు. ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, తన సంస్థ పట్ల ఆయనకున్న అంకితభావం నన్ను ముగ్ధుణ్ణి చేసాయి. బుధవారం మధ్యాహ్నం దాదాపు అరవై డెబ్భై మంది ఉద్యోగులు, అర్చకులు ఉన్న సమావేశంలో వారిని ఉద్దేశిస్తూ, వారు తమ వృత్తి జీవితాన్ని మరింత స్ఫూర్తివంతంగా నడుపుకోడానికి అవసరమైన సూచనలు చేస్తూ ఒక ప్రసంగం చేసాను. నేను ఉద్యోగ విరమణ చేసి రెండేళ్ళు కావొస్తున్నది. ఈ రెండేళ్ళుగా ఒక రిసోర్సు పర్సన్ గా నన్నెవరూ పిలవకపోయినా, భగవంతుడు తన సిబ్బందిని చైతన్యవంతుల్ని చేయడానికి నా సేవలు వాడుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.

ఆ సమావేశం అయిన తరువాత, శ్వేత భవనంలో పై అంతస్థులో ఉన్న శ్రీ వేంకటేశ్వర సెంట్రల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సందర్శించాను. దాదాపు లక్ష పుస్తకాలతో ఏర్పాటు చేసిన ఆ గ్రంథాలయం తిరుమల-తిరుపతి దేవస్థానాల సముదాయంలో మరొక విలువైన దేవాలయంగా భాసించింది. భారతీయ తత్త్వశాస్త్రానికీ, దర్శనాలకూ, ఆధ్యాత్మికతకూ సంబంధించిన విజ్ఞాన నిలయంగా ఆ గ్రంథాలయాన్ని అభివర్ణించవచ్చు.

Sri Venkateswara Central Library and Research Institute, Tirupati

వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్సు ప్రొఫెసరుగా పనిచేసిన ఊటుకూరు పుల్లారెడ్డిగారు పదవీవిరమణ తర్వాత ఈ గ్రంథాలయ బాధ్యతలు చూస్తున్నారు. శ్వేత డైరక్టరు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డిగారే సంచాలకులుగా ఉన్న ఈ గ్రంథాలయంలో మొత్తం పదముగ్గురు సిబ్బంది ఉన్నారు. లక్ష గ్రంథాల్లో దాదాపు అరవై వేల గ్రంథాల దాకా డిజిటైజేషన్ పూర్తయ్యింది. 1993 లో ప్రారంభించిన ఈ లైబ్రరీలో టిటిడి ప్రచురణలన్నిటితో పాటు, టిటిడి ఆర్థిక సహాయం అందించిన ప్రచురణల ప్రతులు కూడా భద్రపరిచారు. కింద అంతస్థులో విశాలమైన రీడింగ్ రూము, పత్రికలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రోజుకి అరవై మందిదాక లైబ్రరీకి వస్తుంటారని అసిస్టెంట్ లైబ్రేరియన్ రాజు నాతో అన్నారు.

Sri Venkateswara Central Library and Research Institute, Tirupati

నేను ఆ పుస్తకాలు చూస్తూ ఉండగా, ఆముదాల మురళిగారు ఒక సంస్కృత గ్రంథాన్ని తీసుకొచ్చి నాకు చూపిస్తూ ‘ఖండన ఖండ ఖాద్యం, చూడండి సార్’ అని అన్నారు. ఆ గ్రంథం పన్నెండో శతాబ్దికి చెందిన శ్రీహర్షుడనే వేదాంతి రాసిన పుస్తకం. ఆయన తన కాలం నాటి న్యాయదర్శనాన్ని ఖండిస్తూ ఆ పుస్తకం రాసాక, న్యాయదర్శనం తన రూపు మార్చుకుని నవ్యన్యాయంగా మారక తప్పలేదు. ఒకప్పటి భారతీయ దర్శనాల్లోని సంవాదాలకూ, పాండిత్య స్ఫూర్తికీ, దార్శనిక స్పష్టతకూ ఆ గ్రంథం ఒక ఉదాహరణ.

నేను ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని మళ్ళా ఒక్కసారి ఆ గ్రంథాలయం మొత్తం కలయచూసాను. అక్కడ ఏ అలమారులో చూసినా అటువంటి పుస్తకాలు కొల్లలుగా ఉన్నాయి. అక్కడ కేవలం రామాయణాలే ఆరు రాకులకు సరిపడా ఉన్నాయి. వేదాలు, వేదాంతం, దర్శనాలు, వ్యాఖ్యానాలు- ఆ భాండాగారాన్ని ఉపయోగించుకునే వారేరీ? కనీసం రోజూ ఆ గ్రంథాలయంలో గడపడం కోసమేనా నాకు ఆ క్షణాన నా నివాసం తిరుపతికి మార్చేసుకోవాలనిపించింది.

ఆ సాయంకాలం నన్ను గెస్ట్ హవుజ్ లో డా.కృష్ణారెడ్డిగారు, బి.వి.రమణ గారు కలుసుకున్నారు. కృష్ణారెడ్డిగారు సంస్కృతం, తెలుగు, పురావస్తు శాస్త్రాల్లో పండితులు. తెలుగు శాసనాలమీదా, శాసనాల్ని ఆధారం చేసుకుని చరిత్రను నిర్మించడం మీదా ప్రామాణికమైన విద్వత్తు ఉన్న వ్యక్తి. టిటిడి ఇప్పుడు తన మూజియం నవీకరణ ప్రాజెక్టు బాధ్యతల్ని ఆయనకి అప్పగించింది. అటువంటి పండితుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు తన పుస్తకాలు ఇవ్వడం నా సుకృతం అనిపించింది.

శ్రీ నూకా రాంప్రసాద్ రెడ్డి, ఆకెళ్ళ విభీషణ శర్మ, డా.నాగోలు కృష్ణారెడ్డిలతో నేను

బి.వి.రమణ నేను పాడేరులో పని చేస్తున్న రోజులనుంచీ నా మిత్రుడు. ఇతిహాసపు చీకటి కోణం మరుగున పడి కనిపించని కథలు తెలిసినవాడు. ఇప్పుడు తిరుపతి గురించీ, తిరుమలకొండల గురించీ అంత సాధికారికంగా మాట్లాడగల వ్యక్తిని మరొకరిని చూడం. అన్నమయ్య సంచరించిన తావుల్ని ఎన్నో సార్లు తాను స్వయంగా చుట్టబెట్టినవాడు. ఆయన కూడా తన రచనల్ని తీసుకొచ్చి నాకు అందించండం నాకు భగవత్ప్రసాదమే అనిపించింది.

ఈ సారి నాకు దొరికిన మరొక కానుక నూకా రాంప్రసాద్ రెడ్డి. ఆయన నాకు చాలాకాలంగా తెలిసి ఉన్నా కూడా ఇంతసేపు గడిపే అవకాశం ఇప్పుడే దొరికింది. ఆయన రాయలసీమకు దొరికిన ఒక విలువైన వజ్రం. ఎన్నెన్నో విషయాలు ఆయన చెప్తూనే ఉన్నారు. తాను నాతోపాటు రైల్వేస్టేషన్ కు వచ్చి నాకు వీడ్కోలు పలికారు. ఆయన నన్ను రైలెక్కించి రైలు కదిలేదాకా అక్కడే  నిలబడ్డ దృశ్యమే నా కళ్ళముందు నిలబడిపోయింది. ‘సార్, అన్నమయ్య గురించి ఒక పుస్తకం రాయండి, మా పెన్నేటి పబ్లికేషన్స్ తరుఫున ప్రచురిస్తాం’ అని ఆయన చెప్పిన మాట నా మనసులో బలంగానే నాటుకుంది. బహుశా ఆ కారణం చేతనేనా అన్నమయ్య తిరుగాడిన తావుల్లో రానున్న రోజుల్లో నేను కూడా తిరుగాడాలన్న ఆశపుట్టింది నాకు.

2-6-2024

7 Replies to “మరికొన్ని కలయికలు”

  1. మీరు నడచిన ,నడుస్తూన్న తావులు కూడా సాహిత్య సాంస్కృతిక పవిత్ర ప్రదేశాలేనండి.వాటిని మీరు నిర్మాణశైలి, అనుభూతి, చరిత్ర, వాటి పరమోన్నత లక్ష్యసాధన అనే నాలుగు డైమన్షన్స్ (మితులు) లో మాకు ఈ కుటీరంలో అందిస్తున్నారు.మేం తరిస్తున్నాం…నమోనమః మాష్టారూ…

  2. నువ్వు నమ్మిన దారిన నీ వంతు కృషి నువ్వు చేసుకుంటూపోతూ ఉండాలేగాని నిన్ను అర్థం చేసుకోగలిగే సహృదయులు ఎవరో ఒకరు నిన్ను చేరగలరని నాకు మరోసారి నమ్మకం కలిగింది

    అన్నమయ్య తిరుగాడిన తావుల్లో రానున్న రోజుల్లో నేను కూడా తిరుగాడాలన్న ఆశపుట్టింది నాకు.
    ఈ మాటలు అతి విలువైనవి

    సర్. మీరు తిరుగాడుతూ నా వంటి వారిని దయతో మీ మాటఓ ద్వారా మీతో తీసుకువెళ్తారు.
    అంతకంటే అదృష్టం ఏముంటుంది?
    సాహిత్యం అంటే నే తమరు అనే భావన నాలో నాటుకుపోయింది. నాకు వచ్చిన కొన్ని అక్షరాలు మీ సాహిత్య సొబగు తో జీవం పోసుకుని నన్ను ఆనందింపజేస్తాయి.
    నేను నడిచే దారిని సుగమం చేస్తాయి.
    నమోనమః

  3. సార్ మీకు హృదయ పూర్వక నమస్కారాలు
    మీ పోస్టులు ఎప్పుడు చదివినా అదే ఆనందం, తన్మయత్నం. ఎప్పుడూ మీ రచనలు చదువుతూ, మీ మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది. ఇంత జ్ఞానాన్ని, ఇన్ని ఆలోచనల్ని , ఇన్ని కర్తవ్యాల్ని అమృతంలా మాపై కుమ్మరిస్తున్నందుకు తెలుగుజాతి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
    నా గురించి కూడా రెండు మంచి మాటలు రాసినందుకు మీకు నా ధన్యవాదాలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading