
నా యవ్వనకాలంలో నేను రాసుకున్న హీరోల లిస్టులో శీలావీర్రాజు గారు కూడా ఒకరని తలుచుకోవడంలో నాకు చెప్పలేని సంతోషం. నేను బి ఏ చదువుతున్నరోజుల్లో, ఒకసారి భమిడిపాటి జగన్నాథరావుగారి ద్వారా మైనా నవల గురించి విన్నాను. అప్పట్లో ఆయన ఏలూరులో పనిచేస్తుండేవారు. వీకెండ్స్ కి కాకినాడ వచ్చినప్పుడు, ఒకసారి మాటల మధ్యలో ఆ నవల గురించి ప్రస్తావించినప్పుడు, ఆ నవల వెంటనే చదవాలని అనిపించింది. ఆ మాటే ఆయనతో అంటే, మరుసటి సారి వచ్చినప్పుడు ఆ నవల పట్టుకొచ్చారు. ఆయన దాన్ని బైండుచేయించి పెట్టుకున్నారు. కాబట్టి ఆ నవల మరెవరికీ ఇవ్వరనీ, తనతో పాటే దాచుకునే అపురూపమైన పుస్తకాల్లో అది కూడా ఒకటనీ ఆ ముదురునీలం రంగు బైండు పుస్తకం చూడగానే అర్థమయింది.
ఆయన సాయంకాలం మా ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు బహుశా ఏడో, ఎనిమిదో అయి ఉంటుంది. ‘ఈ పుస్తకం నువ్వు చూస్తావని తెచ్చాను. కాని ఇక్కడ ఉంచబోవడం లేదు. నేను పొద్దున్నే వెళ్ళేటప్పుడు నాతో పట్టుకుపోతున్నాను’ అని అన్నారు. ‘మీ బస్సు పొద్దున్న ఎన్నింటికి?’ అనడిగాను. ‘అయిందింటికి’ అన్నారు. అంటే కనీసం నాలుగింటిలోపల ఆ పుస్తకం నేను చదవడం పూర్తిచేసెయ్యాలన్నమాట అనుకున్నాను. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక, కిచెన్ తలుపులు దగ్గరగా వేసుకుని, ఆ పుస్తకం మొదటిపేజీనుంచి చివరిపేజీదాకా ఆత్రంగా చదివేసాను. ఏమి నవల అది! ఆ పుస్తకం చదివాను అనేకన్నా, ఒక అపురూపమైన లోకంలో ఆ పాత్రల్తో గడిపి వచ్చానని చెప్పడం సమంజసంగా ఉంటుంది. ఇంకా తెల్లవారకుండానే ఆ పుస్తకం జగన్నాథరావుగారికి ఇచ్చేస్తూ, ‘మీరు బైండు పుస్తకం మాత్రమే తీసుకు వెళ్తున్నారు. అసలు పుస్తకం నా హృదయంలో దాచి కుట్టేసుకున్నాను’ అని చెప్పాను.
శీలా వీర్రాజుగారిని నేను కలిసింది చాలా తక్కువసార్లు. కలిసినప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకున్నది ఏమీ లేదు. కాని ఆయన పేరు విన్నా, ఆయన చిత్రించిన కవర్ పేజీలు చూసినా, ఎన్నో పుస్తకాల శీర్షికలు ఆయన చేతిరాతలో చూసినా, నా మనసులో ఒక సున్నితమైన స్పందన కలుగుతూ ఉండటం నేను గుర్తుపడుతుండేవాణ్ణి. ఒక సున్నితహృదయుడు మనతో మాట్లాడనక్కరలేదు. అతడు కనీసం పొరుగింటివాడిగా కూడా ఉండనక్కర్లేదు. అతడికీ మనకీ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తూ ఉండవలసిన పనిలేదు. ఎక్కడో ఒక దేవాలయంలో సాయంకాలం పూట వెలిగించిన దీపంలాగా, ఏదో ఒక కొలనులో పొద్దున్నే విరిసిన తామరపువ్వులాగా, అటువంటి శుభ్రమనస్కుడొకడు ఈ లోకంలో ఉన్నాడని తెలిస్తే చాలు. అకారణంగానే నీ మనసు తేటపడుతూండటం నీకు తెలుస్తూంటుంది. నీ కలల్లో కూడా మెత్తని పూలతావి నిన్ను తాకిపోతుంది.
శీలావీర్రాజు గారు వేసిన బొమ్మలు చూస్తే మనకి ఈ విషయమే అర్థమవుతుంది. ఆయన చిత్రలేఖనంలో సమాజం, మనుషులు, దైనందిన జీవితం, సకలవృత్తులూ కనిపిస్తాయిగానీ, బయటి ప్రపంచంలో వాటిచుట్టు హోరుమంటో వినిపించే నాయిస్ ఆ బొమ్మల్లో కనిపించదు.
ఆయన చిత్రించిన దృశ్యాలు మనం రోజూ చూసేవే. కాని రోజువారీ జీవితంలో సౌందర్యం కనిపించకపోగా నిష్ఠురత్వమే అధికభాగం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అవే దృశ్యాలు వీర్రాజు గారు చిత్రించినప్పుడు వాటిచుట్టూ పల్చని పారదర్శకపు పొర కప్పినట్టుగా, ఆ జీవితదృశ్యాలమీంచి దుమ్ము తుడిచి వాటిని పూలరేకలుగా మార్చినట్టుగా అనిపిస్తుంది. ఉదాహరణకి ‘దుఃఖిత దీనబాంధవి’ (1970) అనే బొమ్మ చూడండి.

వస్తువు దృష్ట్యా, వర్ణసమ్మేళనం దృష్ట్యా ఈ బొమ్మ చూడగానే ఎడ్వర్డ్ మంచ్ ప్రసిద్ధ చిత్రలేఖనం ‘ద స్క్రీమ్’ (1893) గుర్తురాకుండా ఉండదు.

Edward Munch, The Scream
కాని మంచ్ చిత్రంలో ఉన్న దుఃఖమూ, దైన్యమూ వీర్రాజుగారి బొమ్మలో కనిపించవు. ఎందుకంటే ఆయన దుఃఖాన్ని చిత్రించడం అలా ఉంచి, దాన్ని చూడను కూడా చూడలేడు. బీభత్సమయ జీవితాన్ని కూడా ఆయన సాంత్వనపరిచి, సాత్వికీకరించి బొమ్మగా మలుస్తాడు. వీర్రాజుగారి బొమ్మలో ఎరుపూ, నలుపూ చూడండి. అవి మనలో భయం రేకెత్తించేబదులు, చెప్పలేని ఒక సానుభూతిని రేకెత్తిస్తాయి. మనం ఆ దుఃఖితురాలి దగ్గర కొంతసేపు ఆగుతాం. ఆమెకీ మనకీ మధ్య ఒక ఆత్మీయత పెనవేసుకుంటున్నట్లుగా గుర్తిస్తాం.
ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి 2010 లో చిత్రించిన ఒక చిత్రంలో ఒకాయన తల క్షవరం చేయించుకుంటున్న దృశ్యం ఉంటుంది. క్షురకుడు ఆయన తలవెంట్రుకలు కత్తిరిస్తుంటాడు. క్షవరం చేయించుకుంటున్న వ్యక్తి మీంచి కత్తిరించిన వెంట్రుకలు కిందపడుతూ ఉంటాయి. అతడు ఎంతో విధేయంగా తన తలని క్షురకుడికి అప్పగిస్తున్నటుగానూ, క్షురకుడు ఎంతో శ్రద్ధగా దువ్వెనా, కత్తెరా పెట్టి అతడి తలవెంట్రుకలు కత్తిరించబోతున్నట్టుగా కనిపిస్తూంటుంది.
నాకు తెలిసి ఇటువంటి అంశం మీద ఎవరూ కవిత రాయగా చూడలేదు. ‘కాదేదీ కవితకి అనర్హం’ అని రాసిన మహాకవి కూడా, తలవెంట్రుకలు కత్తిరించడం మీద, కవితరాయలేదు. అంటే తల క్షవరం లో సౌందర్యంకానీ, మానసిక భావోద్దీప్తి కలిగించగల స్ఫూర్తిగానీ ఏమీ లేదన్నమాటే కదా. మామూలు జీవితంలో అదొక అసౌకర్యంతో కూడుకున్న పని. ఎంత తొందరగా ఆ పని ముగిస్తారా, ఎంత తొందరగా లేచి, మీద పడ్డ ఆ వెంట్రుకలు దులుపుకుందామా అనే అనిపిస్తూ ఉంటుంది. కానీ వీర్రాజు గారు చిత్రించిన చిత్రం చూడండి. అందులో అసౌకర్యం లేదు. ఆయనే వేరే చిత్రాల్లో చిత్రించినట్టుగా, వాకిట్లో రంగవల్లి తీర్చడంలో, అరుగుమీద కూచుని పూలు గుచ్చడంలో ఎటువంటి శ్రద్ధ, తాదాత్మ్యం, తల్లీనత కనిపిస్తాయో, ఈ దృశ్యంలో కూడా అవే కనిపిస్తాయి. అక్కడ క్షవరం చేయించుకుంటున్న వ్యక్తీ, క్షురకుడూ కూడా ఒక సున్నితమైన ప్రక్షాళనా కార్యక్రమంలో కలిసి ఎంతో శ్రద్ధగా పాలు పంచుకుంటూ ఉన్నట్టుగా ఉంటుంది. తల వెంట్రుకలు కత్తిరించడమనే రసహీనమైన పని ఈ చిత్రలేఖనంలో ఒక పవిత్రకార్యక్రమంలాగా కనిపించడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

నిజానికి ఏ చిత్రకారుడూ బయటి ప్రపంచాన్ని చిత్రించడు. చిత్రిస్తున్నట్టు కనిపించిన తావుల్లో కూడా నిజానికి అతడు తన అంతరంగాన్నే చిత్రిస్తుంటాడు. కాబట్టి వీర్రాజు గారు కూడా బయటి జీవితాన్ని చిత్రిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఆయన తన అంతరంగాన్నే చిత్రిస్తున్నారని చెప్పడం సులభమే. కాని ఆ అంతరంగం ఎంతో సంస్కారవంతమైందీ, పరిశుభ్రమైందీ అని కూడా చెప్పకపోతే ఆ చిత్రలేఖనాలకే కాదు, ఆ చిత్రకారుడికి కూడా అన్యాయం చేసినవాళ్లమవుతాం.
1973 లో ఆయన చిత్రించిన ఒక స్టిల్ లైఫ్ చిత్రానికి ‘సెల్ఫ్ పోర్ట్రేట్’ అని పేరుపెట్టారు. ఆ బొమ్మలో ఉన్నది ఒక పూలగిన్నె, కుంచెలూ, కలాలు పెట్టుకున్న ఒక పాత్రా, ఒక ఇంకు బాటిలూ, సగం కనిపిస్తున్న ఒక కవితా, దాని మీద తెరిచిపెట్టిన పెన్నూను.

బహుశా ఈ చిత్రంలో కనిపిస్తున్నదానికన్నా వీర్రాజు గారి గురించి అదనంగా మరేమీ చెప్పలేం. ఒక తాజాపూలగుత్తి, ఒక కవితా కవిత రాస్తున్న కలమూ, కొన్ని కుంచెలూ, ఇంకు సీసా- ఇవన్నీ కలిసి శీలావీర్రాజు అని చెప్పవచ్చు. కాని ఆ బొమ్మలో ఆయన ప్రాధాన్యతలు కూడా మనకి తెలుస్తున్నాయి. కుంచెలు పెట్టుకున్న ఆ గిన్నె పక్కన సగం చిత్రిస్తూ ఉన్న ఒక బొమ్మ గీసి, పక్కనొక రంగుల పళ్ళేన్నో, లేదా రంగు ఇంకా తడి ఆరని కుంచెనో చిత్రించకుండా ఆయన ఒక కవితనీ, సగం తెరిచిపెట్టిన కలాన్నీ మాత్రమే ఎందుకు చిత్రించినట్టు? అంటే తనలోని చిత్రకారుడికన్నా కవి పట్లనే ఆయన ఎక్కువ మొగ్గు చూపుతున్నాడా? ఉహు. కాదనుకుంటాను. తనలోని కవి ఇంకా సజీవంగా ఉన్నాడని చెప్పుకోడానికి తనకి ఊతమిస్తున్నది చిత్రలేఖనమే అని కూడా మనకి చెప్తున్నారా?
రెండేళ్ళ కిందట ఆయన తన చిత్రలేఖనాలు మొత్తం రాజమండ్రిలో దామెర్ల రామారావు ఆర్ట్ గాలరీకి కానుకగా ఇచ్చేసినప్పుడు ఆ గాలరీ ప్రారంభోత్సవం నా చేతులమీదుగా జరగాలని కోరుకున్నారు. అది నా సుకృతం. ఒక సూపర్ స్టార్ తన చిత్రాన్ని తన అభిమానితో రిలీజ్ చేయించడం లాంటిది అది.
‘యోగులు దేవుడిలో కలుసుకున్నట్టుగా, మనం కళాకారులం, కళలో కలుసుకుంటాం’ అని రాసాడట ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత ఫ్లాబే. అవును, అటువంటి ధన్యాత్ముల లోకం ఒకటి ఉంది. అక్కడ రవీంద్రుడూ, మహాదేవి వర్మా, అడవిబాపిరాజూ, సంజీవదేవ్, బుచ్చిబాబూ వంటి వాళ్ళు కలిసి ముచ్చటించుకుంటూ ఉంటారు. వాళ్ళది ఎంత శబ్దమయప్రపంచమో అంత వర్ణమయ ప్రపంచం కూడా. ప్రాచీన చీనా కవి వాంగ్ వెయి లాగా వాళ్ళ రాతలు బొమ్మలు, వాళ్ళ బొమ్మలు కవితలూనూ. ఇప్పుడు వీర్రాజు గారు కూడా ఆ బృందంలో శాశ్వతసభ్యులయ్యారన్నదే మనకి ఆయన తలపులు కలిగించే సంతోషం.
Featured image: Painting by Seela Veerraju
1952024


ఒక గొప్ప రసావిష్కరణం. ఒకే ఒకసారి అదే మొదటిసారి అదే చివరి సారి ఆయన పక్కన తిరుమల శ్రీనివాసాచార్య పుస్తకాల నాలుగు ముఖచిత్ర కారుడిగా కూచొని చిరు పలుకరిం పులతో ఆనందించే అదృష్టం కలిగింది. ఆ నాలుగింటిలో ఒక పుస్తకం ఆయనకు అంకిత మివ్వబడింది. వారికి నా మనఃపూర్వక నతులు.
ధన్యవాదాలు సార్!
Sir, thank you so much for introducing such great people to me.
ఈ పరిచయ వ్యాసం లో ప్రతి మాటా ఎంతో బావుంది. 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
భలే పరిచయ వాక్యాలు, ప్రతీ పదం వొ అమృత వాక్కు లా వుంది సర్, thank you so much 🙏
ధన్యవాదాలు మేడం!
ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు
శిలావీ గారి మెచ్చుకోలు దక్కిన వర్ధమాన చిత్రకారుణ్ణి అప్పట్లో! వారి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.. thank you sir
ఆయన చిత్రాల్లోని లోని ‘వెన్న’తను వివరించడం.. so nice
ధన్యవాదాలు సార్!
అలా వంటగది తలుపులు వేసుకొని చదివిన నా ఇంటర్మీడియట్ రోజులను గుర్తు చేసారు. శీలా వీర్రాజు గారి గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ధన్యవాదములు!
ధన్యవాదాలు మేడం