సంగీత పత్రిక

Franz Shubert, 1827

తెలుగులో ఈ మధ్య చాలా వెబ్ పత్రికలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సాధారణ వార్తాపత్రికలు పోషించినదానికన్నా ఈ పత్రికలు ఎక్కువ క్రియాశీలకంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఈ పత్రికల్లో రాసే రచయితలూ, ఈ పత్రికలు చదివే పాఠకులూ కూడా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నారు. అలానే మంచి కథలూ, కవిత్వమూ చదివి వినిపించే యూ ట్యూబర్లూ, తెలుగు సంస్కృతికి, ముఖ్యంగా సినిమాకీ సంబంధించిన విషయాల మీద అత్యధికశ్రోతల్ని చేరగలుగుతున్న టాక్ షోలు, అంతర్జాల రేడియో ప్రసారాలూ కూడా తెలుగులో దర్శనమిస్తున్నాయి.

అయితే సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం వంటి లలితకళల సమాహారంగా ఉండగల నెట్ పత్రికగానీ, ఛానెల్ గానీ తెలుగులో ఇంకా రావలసే ఉంది. అటువంటి పత్రిక ఎలా ఉండవచ్చునో చూడాలనుకున్నవాళ్ళకి http://www.interlude.hk ఒకసారి చూడమని చెప్తాను.

షాంగైలో ఒక సంగీతకారుల కుటుంబంలో పుట్టి, పారిస్ లో స్థిరపడ్డ జూలియెట్ లియు నడుపుతున్న వెబ్ పత్రిక ఇది. ఇది సంగీత పత్రిక. ఇందులో ప్రధానంగా పాశ్చాత్య సంగీతానికి సంబంధించిన వ్యాసాలు, ఇంటర్వ్యూలు, విశ్లేషణలు ఉన్నాయి.  ప్రతి ఒక్క వ్యాసంలోనూ ఆడియో, వీడియో లింకులున్నాయి. ఆ వ్యాసాలూ, వాటికి ఉదాహరణగా ఇచ్చిన ఆ సంగీతకృతులూ, వాటిల్లో ఏ ఒక్క వాస్యమైనా చదవడం గొప్ప అనుభవం అని చెప్పవచ్చు. అత్యున్నత అభిరుచికి ప్రతి ఒక్క వ్యాసం దర్పణం.

ఈ పత్రికలో నన్ను మరీ ముగ్ధుణ్ణి చేసిన అంశం సంగీతానికీ, కవిత్వానికీ; సంగీతానికీ, చిత్రలేఖనానికీ; సంగీతానికీ, నాట్యానికీ; శిల్పానికీ మధ్య ఉన్న అనుబంధాన్ని అధ్యయనం చేసే అద్భుతమైన వ్యాసాలు. సంగీతకారుల్ని ప్రభావితం చేసిన కవులు, కళాకారులు, కవుల్నీ, రచయితల్నీ ప్రభావితం చేసిన సంగీతకారులు- ఈ విభాగంలో ఏ ఒక్క వ్యాసం చదివినా ఒక జీవితకాలపు అధ్యయనాన్ని మనకు అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు ఉంటుంది.

ఉదాహరణకి, ఎమిలీ డికిన్ సన్ కవిత్వంలోంచి పన్నెండు కవితల్ని ఎంచుకుని వాటికి స్వరకల్పనచేసిన Aaron Copland అనే స్వరకర్తపైన రాసిన ఈ వ్యాసం చూడండి. అసలు ఎమిలీ డికిన్ సన్ కవిత్వం గురించి ఎవరన్నా రాసింది చదవడమే నాకొక పండగ అనిపిస్తుంది. అలాంటిది ఆ కవితలకి స్వరకల్పన చేసిన ఒక సంగీతకారుడిగురించీ, ఆ కృతుల గురించీ చదవడం, అతడు స్వరపరిచిన పన్నెండు కవితల్నీ ఇక్కడ వినడం ఎంత సంతోషాన్నివ్వగలదో ఊహించగలమా!

https://interlude.hk/the-music-of-poetry-aaron-copland-12-poems-of-emily-dickinson

అలాగే సంగీతం కన్నీళ్ళు తెప్పించడం మీద రాసిన ఈ వ్యాసమూ, ఇందులో పొందుపరిచిన ఉదాహరణలూ చూడండి:

https://interlude.hk/moved-tears

నిజానికి కేవలం సంగీతంకోసమే ఇటువంటి ఒక పత్రిక నడపవలసివస్తే తెలుగువాళ్ళ కన్నా అర్హులెవరుంటారు? తెలుగు నాదాత్మక భాష. సంగీతభాష. వాగ్గేయకారుల భాష. నిజానికి ఒక్క అన్నమయ్య మీదనే ఇటువంటి ఒక పత్రిక నడపవచ్చు, ఇటువంటి ఒక పత్రికను నిరాఘాటంగా కొన్ని దశాబ్దాల పాటు నడపడానికి ఒక్క త్యాగరాజస్వామి కృతులు చాలు.  తెలుగు భావకవుల లలితగీతాల గురించి ఇటువంటి సంచయం రాగలిగితే అంతకన్నా మించిన తెలుగువిందు మరొకటి ఏముంటుంది?

ఇటువంటి సంగీతపత్రిక తెలుగులో వస్తే మరో ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు ఒక కవి ఒక గీతం రాస్తే దాన్ని స్వరపరిచి నలుగురికీ చేరవేయగలిగే మాధ్యమాలు తెలుగు సినిమా, టెలివిజన్ మాత్రమే. యాభై అరవయ్యేళ్ళ కిందట తెలుగులో లలిత సంగీతాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన రేడియో ఇప్పుడు అదే స్థాయిలో ఆ పాత్ర నిర్వహిస్తోందని చెప్పలేం. కాని ఇటువంటి పత్రిక ఒకటి వస్తే తెలుగుకవులు, ముఖ్యంగా వచనకవులు, గజల్ కవులూ, పద్య కవులూ కూడా తమ కవితల్ని, పాటల్నీ, పద్యాల్నీ స్వరపరుచుకుని నలుగురితో పంచుకోగలిగే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకి బైరాగి రాసిన ‘మేఘాల మోహాలు ముసురుకొనునీరేయి’ అనే అపురూపమైన గీతాన్ని ఎవరేనా స్వరపరుస్తారా, ఎవరేనా గానం చేస్తారా అని గత ముప్ఫై ఏళ్ళుగా నేను ఎదురుచూస్తూనే ఉన్నాను. పెట్టుబడి రాజ్యమేలే సినిమా, టెలివిజన్ మాధ్యమాలకు ప్రత్యామ్నాయ మాధ్యమం ఒకటి వస్తే తప్ప ఈ లోటు పూడదు.

మనం గమనించవలసిందేమంటే ఒకప్పుడు యూరోప్ లో సంగీతమంటే చర్చి సంగీతమూ, ప్రార్థనాగీతాలూ మాత్రమే అనుకునే రోజుల్లో జర్మన్ స్వరకర్త ఫ్రాంజ్ షూబర్ట్ జర్మన్ కవుల గీతాల్ని స్వరపరిచి కచేరీల్లో ఆలపించేట్టు చేసాడు. గొథే, షిల్లర్, హైన్రిక్ హైనీ వంటి జర్మన్ గీతకారుల గీతాల్ని ఆయన Lieder పేరిట స్వరపరిచి ప్రజాబాహుళ్యానికి ఒక మనోహరలోకాన్ని పరిచయం చేసాడు. ఇరవయ్యవశతాబ్ది ప్రారంభంలో రవీంద్రుడు రవీంద్రసంగీత్ పేరిట తన కృతుల్ని తానే స్వరపరుచుకుని ఒక సంగీతశాఖను ప్రారంభించడం పైన షూబర్ట్ ప్రభావం ఉందని చెప్పుకున్నాడు కూడా. ఇటువంటి ఒక వెబ్ పత్రిక వస్తే మనలో కూడా ఒక షూబర్ట్, ఒక రవీంద్రుడు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది.

ఇవన్నీ రాస్తున్నానుగాని, నిజానికి నా ఉద్దేశం, ఇటువంటి ఒక సంగీత పత్రిక, అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న పత్రిక ఒకటి ఉందన్న వార్త మీతో పంచుకోవడమే. ఆలస్యమెందుకు? వెంటనే ఈ సంగీతమయప్రపంచంలో అడుగుపెట్టండి.

Featured image: Music and painting, generated through AI

19-5-2024

2 Replies to “సంగీత పత్రిక”

  1. విలువైన సమాచారం. ఎన్నో ఆత్మీయతలకు నెలవుగా ఈ వేదిక విలసిల్లుతుందన్న శుభాకామనలతో

    బంగారు రామాచారి

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading