
సత్యాన్వేషణ పుస్తకాన్ని సమీక్షిస్తూ డా.రఘురామరాజు అందులో కాంట్ రచనలకు చేసిన అనువాదం తనని మళ్ళా ఇంగ్లిషులో కాంట్ ని చదివేలా చేసిందని రాసారు. అందుకు కారణం తెలుగులో నేను వాడిన పరిభాష తనకు కొత్త స్ఫురణలు కలిగించడం కారణమని చెప్పారు. ఆ రోజుల్లోనే ఆయనతో ఒక జర్మన్ కాన్సలేట్ ఉద్యోగి మాట్లాడుతూ కాంట్ పరమపదించి రెండువందల ఏళ్ళు అయిందనీ, అయినా, ఆయన రచనలు భారతీయ భాషల్లోకి పెద్దగా అనువాదం కావడం తాను చూడలేదనీ అన్నాడట. రఘురామరాజు ఆ సంగతి నాతో ముచ్చటిస్తూ కాంట్ రచనలనుంచి కొన్ని ఎంపికచేసిన వ్యాసాల్ని తెలుగులోకి తీసుకొస్తే బావుంటుంది కదా అన్నారు. అక్కడితో ఆగకుండా పీకాక్ క్లాసిక్స్ గాంధీగారి ముందు కూడా ఆ ప్రతిపాదన పెట్టారు. అప్పట్లో గాంధీగారు పాశ్చాత్యతత్త్వశాస్త్రం నుంచీ, సైన్సునుంచీ తెలుగులోకి అనువాదాలు చేయించి పికాక్ క్లాసిక్స్ తరఫున వెలువరిస్తూ ఉన్నారు. అప్పటికే ఆయన ప్లేటో సంభాషణలు ప్రచురించి ఉన్నారు. కాంట్ ని కూడా తెలుగు చెయ్యొచ్చనే ఆలోచన ఆయనకి ఉత్సాహాన్నిచ్చింది. వెంటనే నా దగ్గరకొచ్చి ఎన్ని పేజీలైనా ఫర్వాలేదు, తాను ఆ పుస్తకం ప్రచురిస్తానని చెప్పారు.
ఇది 2004 లో మాట. కాని కాంట్ రచనలనుంచి ఏడెనిమిది వ్యాసాలు ఎంపిక చేసి నూట ఇరవై ముప్ఫై పేజీల అనువాదం చెయ్యడానికి నాకు మూడేళ్ళు పట్టింది. ఆ మూడేళ్ళూ నేను మరే రచనా చెయ్యలేదు. కాంట్ ని జర్మన్ నుంచి ఇంగ్లిషులోకి అనువదించడమే పెద్ద పరీక్ష అని ఇంగ్లిషు అనువాదకులు చెప్పుకున్నారు. అలాంటిది ఆ ఇంగ్లిషుని తెలుగు చెయ్యడం నాకు నిజంగానే అగ్నిపరీక్షగా మారింది. దాదాపు ఒక వాక్యమే ఒక పేజీ నిడివి ఉండే ఆ రచనలనుంచి, ఆ వాక్యాల్ని సమానార్థకమైన తెలుగు పరిభాషలోకి మార్చడం నేననుకున్నంత సులువుగా తోచలేదు. ఏమైతేనేం, చివరికి, చిన్నదేగాని, సమగ్రంగా కాంట్ ని పరిచయం చెయ్యగల ఒక సంకలనాన్ని, అనువాదాన్ని ఆయన చేతుల్లో పెట్టాను. ‘ జర్మన్ తత్త్వవేత్త కాంట్ రచనలు’ (2008) అనే ఆ పుస్తకం వెలువడి ఒకటిన్నర దశాబ్దం గడిచిపోయినా తెలుగువారెవరూ దాన్ని పట్టించుకున్నట్టు లేదు. ఒక పత్రికలో మాత్రం ఒక సమీక్ష చూసాను, అంతే.
ఇన్నాళ్ళకు డా.విరించి విరివింటి ఆ పుస్తకం చూసి తమ Essence Group జూమ్ సమావేశాల్లో కాంట్ మీద ఒక ప్రసంగం చెయ్యమని అడిగారు. ఏ విషయం మీద మాట్లాడవచ్చునో నన్నే నిర్ణయించుకోమన్నారు. నేను సంకలనం చేసి అనువదించిన పుస్తకంలో మొదటి వ్యాసం ‘జ్ఞానోదయం అంటే ఏమిటి? ఒక ప్రశ్నకు జవాబు’ అనేది. ఆ వ్యాసం గురించి మాట్లాడతానని చెప్పాను.
అయితే మొన్న ఆదివారం సాయంకాలం కాంట్ మీద చేసిన ప్రసంగంలో ముందు స్థూలంగా పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్రలో కాంట్ స్థానం గురించి కొంత వివరించేక, అప్పుడు ఆ వ్యాసం గురించి మాట్లాడేను. ఆ తర్వాత సమకాలిక సమాజానికి ఆ వ్యాసం ఎంతవరకూ దారిచూపగలదో కూడా వివరించాను.
అరవై మందికి పైగా మిత్రులు హాజరైన ఆ గోష్ఠి దాదాపు రెండున్నర గంటలసేపు నడిచింది. నా ప్రసంగం ముగించేక సుమారు అరగంటసేపు ప్రశ్నోత్తరాలు కూడా నడిచాయి. చాలా కాలం తర్వాత ఎంతో ఉత్తేజకరమైన ఒక సద్గోష్ఠి నడిచిందనిపించింది.
డా.విరించి ఆ సమావేశం రికార్డు చేసి మూడు భాగాలుగా అందించారు. అందులో ‘జ్ఞానోదయం అంటే ఏమిటి’ అనే వ్యాసం పైన మాట్లాడిన భాగం ఒక్కటీ, సుమారు అరగంట ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
కాంట్ పైన చేసిన మొత్తం ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
ప్రశ్నోత్తరాల భాగం ఇక్కడ వినవచ్చు.
Featured image: Moonrise over the Sea, Caspar David Friedrich, 1822
16-5-2024

