ఒక అత్యవసర బాధ్యత

ఒక పుస్తకాన్ని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలని అనుకుంటే, తరాలు మారిన తర్వాత కూడా ఆ పుస్తకానికి కొత్త పాఠకులు వస్తూ ఉంటే, ఒక పుస్తకం రాసినప్పటికన్నా మరిన్ని కొత్త అర్థాల్నీ, వ్యాఖ్యానాల్నీ సంతరించుకుంటూ ఉంటే మనం దాన్ని క్లాసిక్ అంటాం. సాధారణంగా క్లాసిక్ ల ఆకర్షణ కథలోనో, లేదా కథనపద్ధతిలోనో, శైలిలోనో లేదా ఒకటి రెండు వెన్నాడే ముఖ్యపాత్రల్లోనో ఉంటుంది. కాని అమృతా ప్రీతం రాసిన ‘పింజర్’ (1950) నవలకు దాదాపు డెబ్భై అయిదేళ్ళ తరువాత లభిస్తున్న ప్రాసంగికత ఒక విధంగా మనల్ని దుఃఖపూరితుల్ని చేసే అంశమే.

ఆ నవల దేశవిభజన కాలంలో ఇరు వైపులా అపహరణకు గురైన హిందూ, ముస్లిం స్త్రీల విషాదానికి సంబంధించిన కథ. దేశవిభజనకి ముందే ఎన్నేళ్ళుగానో హిందూ, ముస్లిముల మధ్య రగులుతున్న కక్షల్లో అపహరణకు గురైన ఒక స్త్రీ వైపునుంచి చెప్పిన కథ ఇది. అది ఆమె జీవితంలో మటుకే సంభవించిన ఒక యాదృచ్ఛిక సంఘటనకాదనీ, పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు, రాజకీయాలు సామాజిక జీవితాన్ని ప్రభావితం చెయ్యడం మొదలవగానే వేలాదిమంది స్త్రీల జీవితాల్లో కూడా ఆ విషాదం పునరావృతమయ్యిందనీ చెప్పిన నవల అది. ఆధికారికంగా తేల్చిన లెక్కల ప్రకారం చూసినా దేశవిభజన సమయంలో 50,000 మంది హిందూ స్త్రీలూ , 35,000 మంది ముస్లిము స్త్రీలూ అపహరణకో, మానభంగాలకో, నిర్బంధానికో, నిర్వాసానికో గురయ్యారని చరిత్ర చెప్తున్నది.  అంటే దాదాపు లక్ష జీవితాల కన్నీటి కథ. కాని ఇది దేశవిభజన కాలానికి మాత్రమే పరిమితమైన విషాదమా? మనం మేలుకోకపోతే చరిత్ర మళ్ళీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని చెప్పకనే చెప్తున్న కథ ఇది.

ఒక తెగనో, జాతినో, ప్రాంతాన్నో, కులాన్నో, మతాన్నో కించపరచడానికో, వారిమీద ప్రతీకారం తీర్చుకోడానికో, వారిమీద పూర్తి గెలుపు సాధించామని తృప్తి చెందడానికో వారి స్త్రీలని అవమానపరచడమనే మానవస్వభావంలో అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో కనవస్తున్న క్రూర ప్రవృత్తి. అటువంటి స్త్రీల దుఃఖాన్ని చూసి తట్టుకోలేక ప్రసిద్ధ గ్రీకు నాటకకారుడు యురిపిడిస్ Trojan Women నాటకం రాసాడు. ఎంతో ఉన్నత ఆదర్శాలను వల్లించే భారతీయ సమాజంలో కూడా ఈ క్రూరత్వం అనాదిగా ఉన్నదని మన ఇతిహాసాలే మనకు సాక్ష్యమిస్తున్నాయి. ఒక మనిషిమీద పగ తీర్చుకోడానికి అతడు లేని సమయం చూసి అతడి భార్యను అపహరించడం ఒక ఇతిహాసంలో ఇతివృత్తం. ఒకరి మీద పూర్తి విజయం సాధించామని చెప్పుకోడానికి వాళ్ళ భార్యను నలుగురిముందు వివస్త్రను చెయ్యడానికి ప్రయత్నించడం మరొక ఇతిహాసంలో ఇతివృత్తం. ఈ సమాజంలో ఇంత తీవ్రాతితీవ్రమైన క్రూరత్వం ఉంది కాబట్టే ఆ ఇతిహాసకారులిద్దరూ అంత దుఃఖంతో, ఆవేదనతో ఆ కావ్యాలు రాశారు.

కాని యుగాలు గడిచినా ఈ లక్షణాలు భారతీయ ప్రవృత్తిలో క్షాళితం అయిన సూచనలు కనిపించడం లేదు. నేడు కాశ్మీరులో, మణిపూరులో, గుజరాతులో ఒక కులం మరో కులం మీద, ఒక మతం మరో మతమ్మీద, ఒక తెగ మరో తెగ మీద గెలుపు సాధించామని చెప్పుకోడానికో, తమదే పైచేయి అని నమ్మించుకోడానికో చేస్తున్నదేమిటి? తాము ద్వేషిస్తున్న కులాల, తెగల, మతాల స్త్రీలను మానభంగం చేయడం, వివస్త్రల్ని చేయడం, నలుగురిలో ఊరేగించడం, ఇంకా హీనాతిహీనమైన సంగతేమిటంటే, మానభంగం చేసి జైలుకు వెళ్ళివచ్చినవాళ్ళని పూలదండలు వేసి సత్కరించడం.

ఏ చీకటియుగాల్లోనో, మధ్యయుగాల్లోనో, లేదా దేశవిభజనకాలంలాంటి సంక్షుభిత సమయాల్లోనో మాత్రమే జరిగాయని చెప్పుకునే ఇటువంటి సంఘటనలు ఈ కాలంలో, ఇంత విద్య, అభివృద్ధి, సమాచార ప్రసార సాధనాల మధ్య నిస్సిగ్గుగా, బాహాటంగా జరుగుతుండటం మనల్ని విచలితుల్ని చేస్తున్నది.

అమృత ప్రీతం ఎప్పుడో రాసిన ‘పింజర్’ ఇటువంటి కాలంలో అత్యవసరమైన కథగా, మనకన్నా నిర్భీతితో, దేశాల పట్ల, మనుషుల పట్ల అపారమైన ప్రేమతో రాసిన నవలగా కనిపించడం ఒకవైపు సంతోషాన్నీ, మరొకవైపు బాధనీ కలిగిస్తున్నది.

ఇప్పుడు ఈ నవలని పూర్ణిమా తమ్మిరెడ్డి హిందీనుంచి తెలుగులోకి అనువదించారు. ఎలమి ప్రచురించిన ఈ అనువాదం ‘పంజరం’ నిన్న సాయంకాలం హైదరాబాదు బుక్ ఫెయిర్ లో ఆవిష్కరించే గౌరవం, సంతోషం నాకు లభించాయి. ఎంతో ప్రసిద్ధి చెంది, సినిమా గా కూడా వచ్చిన ఈ నవలని నేను ఈ అనువాదంలోనే మొదటిసారి చదివాను. పూర్ణిమ అనువాదంలో కాకుండా ఏ ఇంగ్లిషు అనువాదం లోనైనా ఈ పుస్తకం చదివి ఉంటే, ఆ రచనని ఇంత హృద్యంగా నాలోకి తీసుకోగలిగి ఉండేవాణ్ణి కానేమో.

ఎందుకంటే అమృత కవయిత్రి కూడా. కవిగానూ, రచయితగానూ ఆమె అపారమైన సంయమనంతోనూ , అణచిపెట్టుకున్న వేదనతోనూ ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క వాక్యం రాసారని మనకి అర్థమవుతుంది. మరొక కవి గాని, రచయితగాని ఈ పుస్తకం రాసి ఉంటే కొన్ని కొన్ని ఘట్టాల్ని ఎంతో వివశత్వంతో ఎంతో గంభీరమైన శైలిలో మరెంతో నాటకీయంగా రాసి ఉండేవారు. కొన్ని పుటలమేరకు విస్తరించి చెప్పగల సందర్భాల్లో కూడా ఆ ప్రలోభాన్ని నిగ్రహించుకుని అమృత ఒకటి రెండు వాక్యాల్లోనే మన హృదయంలోకి బాకులు దింపినట్టుగా తన భావావేశాల్ని వ్యక్తం చేస్తుంది. ఒక రచయితని మహారచయితగా మనం గుర్తుపట్టగల తావులు ఇవి.

మూల రచనలోని ఆ బిగువునీ, అంతరాంతరాల్లోకీ కుక్కిపెట్టుకున్న ఆ దుఃఖాన్నీ అంతే సరళంగా, నిరలంకారంగా పూర్ణిమ తెలుగులోకి తీసుకురాగలిగింది అని చెప్పగలను. అందుకనే ఈ పుస్తకం తెలుగులో చదవడమే నాకెంతో తృప్తిగా అనిపించింది. మచ్చుకి కొన్ని వాక్యాలు చూడండి:

ఇటువంటి వాక్యాలు ఈ పుస్తకంలోంచి ప్రతి ఒక్క పేజీలోంచి ఎత్తి రాయవచ్చు. డెబ్భై ఏళ్ళకింద మనుషులు సరిహద్దులు గీసుకుని విడిపోతూ, ఆ విభజనలో తాము మనుషులుగా కూడా ముక్కలైపోయిన సందర్భాన్ని చిత్రించిన ఈ నవలను చదువుతుంటే ఆ విభజన అక్కడితో ఆగిపోలేదనీ, ఇప్పుడు నిలువుగా, అడ్డంగా సమాజం మరింత ముక్కలవుతూ ఉందని స్ఫురించకుండా ఉండదు. మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు వణుకుపుట్టింది:

పుస్తకం చివరకు చేరుకునేటప్పటికి రచయిత్రి ఇలా అంటున్నది:

హిందువైనా, ముస్లిమయినా మనిషి అన్నిటికన్నా ముందు మనిషి. స్త్రీ అన్నిటికన్నా ముందు స్త్రీ. తల్లి కావడం కన్నా, చెల్లి కావడం కన్నా, భార్యకన్నా కూడా ముందు ఆమె ఒక మనిషి. మనుషులు తమలో తాము కలహించుకుంటున్నప్పుడు ఆ కలహాలకి ఏ ఒక్క స్త్రీ కూడా మొదటి విక్టిము కాకూడదు, చివరి విక్టిమూ కాకూడదు.

ఈ అనువాదానికి చివర పూర్ణిమ ఒక పరిచయవ్యాసం కూడా రాసింది. ఆ వ్యాసం చివర ఆమె ఇలా రాస్తున్నది:

అమృతా ప్రీతమ్ ఈ నవల ఎంతో బాధ్యతతో రాసింది. అంతే బాధ్యతతో పూర్ణిమ దీన్ని తెలుగు చేసింది. ఈ రచనని ఆవిష్కరించడం నాకు గౌరవం, కానీ అంతకుమించిన బాధ్యత. అత్యవసరమైన బాధ్యత.

ఏ ప్రదేశమైనా ఏ ఒక్క మతానికో, కులానికో, తెగకో మాత్రమే చెందింది కాదనీ, మరీ ముఖ్యంగా భారతదేశం ఏ ఒక్క హిందువులకో జాగీరు కాదనీ, అది ముస్లిములదీ, క్రైస్తవులదీ, శిక్ఖులదీ, బౌద్ధులదీ, అన్నిటికన్నా ముఖ్యం ఆదివాసులదీ, శతాబ్దాలుగా ఈ నేలని నమ్ముకుని జీవిస్తున్న ప్రతి ఒక్కరిదీ అని ఎలుగెత్తి చెప్పవలసిన బాధ్యత అది. ఈ దేశాన్ని ముక్కలుగా కోయడం మొదలుపెడితే ఆ రంపపుకోత అన్నిటికన్నా ముందు స్త్రీలు భరించవలసి ఉంటుందనీ, అన్నిటికన్నా ముందు ఈ దేశపు స్త్రీలు రక్తం, కన్నీళ్ళు చిందించవలసి ఉంటుందనీ, మన మన రాజకీయ ప్రయోజనాల కోసం ఒకప్పుడు దేశాన్ని విభజించినట్టు, ఇప్పుడు సమాజాన్ని విభజించవద్దనీ చెప్పవలసిన బాధ్యత. అటువంటి విభాజకశక్తులకు ఎదురునిలుస్తున్న ఒక అమృత, ఒక పూర్ణిమ వంటి వారి పక్కన సదా నిలబడవలసిన బాధ్యత.

12-2-2024

8 Replies to “ఒక అత్యవసర బాధ్యత”

  1. మంచి పుస్తక పరిచయం. చెప్పానుకదా! ఇటీవలే నేను పరిశీలించిన పుస్తకంలో పంజాబీ కవయిత్రి రచయిత్రి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అమృతా ప్రీతమ్ గురించి కూడా చదివాను
    .” శాంతి అంటే కేవలం సంక్షోభ రాహిత్యమే కాదు,శాంతి అంటే పూలు వికసించే వేళ” అన్న అనువాద వ్యాఖ్య ఆలోచనీయం .అమె ప్రసిద్ధ రచనగా పింజర్ మరియు స్మృతి కావ్యం సూఫీకవి వారిస్ షాకు గురించి తెలిసింది.
    అందులోని వాక్యాలు
    “పొలాలలో శవాలు కుప్పపడి ఉన్నవి
    చెనాబు నదీ జలాలు రక్తసిక్తమై ప్రవహిస్తున్నవి
    ఎవరు కలిపారో విషాన్ని
    మన ఐదు జీవనదులు
    పుడమికి కల్మషాన్ని పులుముతున్నవి”
    ఈ సందర్భంగా ప్రసిద్ధ శ్లోకం కూడా గుర్తుకు వచ్చింది
    ‘తరుణ ప్రసూతి పుష్పాణి మరుద్వహతి సౌరభం’
    మీకు సర్వదా కృతజ్ఞులం.

  2. ఈ పుస్తకాన్ని నేను పూర్ణిమగారి తెలుగు వర్షన్ లో చదవలేదు. కుష్వంత్ సింగ్ అనే మరో సుప్రసిద్ధ రచయిత ఆంగ్లానువాదంలో చదివాను. మంచి అనువాదం.మూలగ్రథ్తం అంత అందంగా చేశారు. హిందీలో ఊర్మిళా మధోంకర్ మనోజ్ వాజ్పాయ్ లీడ్ రోల్స్. చాలా మూలానికి దగ్గరగా తీసారు
    చరిత్రలో జరిగిన ఒక అమానుష ఘటన విభజన అయితే, ఆ సందర్భంలో జరిగిన అత్యాచారాలు దానిని మించిన అమానుషఘటనలు, హిందూ ముస్లిం స్త్రీల పట్ల జరిగిన హింసలు, మానభంగాలు.
    చాలామంది ఈవస్తువు మీద రాసారు.
    ఆ స్త్రీలు వెనక్కి వస్తే కుటుంబాలు అంగీకరించకఈ అభాగ్య స్త్రీ లని వెనక్కి పంపటం అపహరణకంటే దారుణం. అలాంటి పరిస్థితితులలో పూరోని అర్థం చేసుకున్నవాడు ఆమెపట్ల అపరాథం చేసినవాడు అపరాథభావంతో కృంగిపోయి క్రమేణా ఆమెని మనసారా కోరుకున్నవాడు భర్తే! పూరో పరిస్థితి తులతో రాజీడినతర్వాత అతని తపనని గుర్తిస్తుంది. ఈ మానవీయకోణం అమృతా ప్రీతమ్ ప్రత్యేకత. చివరికి అవకాశం వచ్చినా అన్న తీసుకెళ్లటానికి వచ్చినా వెళ్లదు.
    మరిచి పోలేని నవల.

  3. Sir , నిన్న నేను మీ ప్రసంగం విన్నాను. మీరు మాట్లాడుతుంటే హాయిగా వుంది. పంజరం మీ మాటలతో రెక్కలు విప్పుకుంది

  4. మీరు పంజరం గురించి రాసినది చదివాను. నేను Pinjar అని సినీమా తీశారు.చాలా బాగా తీశారు.నేను సినీమా చూశాను. చాలా రోజులు వెంటాడుతుంది. . పుస్తకం చదివే అనుభూతే వేరు. .

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading