కాలానికి ఊపిరి పొయ్యాలి

సంవత్సరంలో చివరిరోజు. సాయంకాలం నగరం మీద పరుచుకున్న సంజకాంతిలో మంచు తెలుపు కలిసి పలచని తెర కప్పుతున్నట్టుగా ఉంది. నగరాకాశం పూచిన పూవుల్లగా పతంగులు ఎగురుతున్నాయి. ఇవి వాడిపోని పూలు, ఏ కొమ్మమీదా వాలడానికి ఇష్టపడని పిట్టలు. వాటి దారాల కొసలు పట్టుకున్న పిల్లలకి సంతోషం తప్ప మరేమీ తెలియని తరుణం ఇది. వాళ్ళ ఆనందమే ఒక నగరం ఆనందం.

రేపణ్ణుంచి కొత్త సంవత్సరం మొదలుకాబోతున్నది. ఎక్కడో ఎవరో రాస్తున్నారు, ఇది మా కొత్త సంవత్సరం కాదు, ఉగాదితోటే మా కొత్త సంవత్సరం మొదలవుతుంది అని. నిజమా? నాకైతే ప్రతి రోజూ కొత్త సంవత్సరమే. గిరిజన ప్రాంతాల్లో పుట్టి పెరిగినవాణ్ణి. వాళ్ళతోటే జీవితం అత్యధికభాగం గడిపినవాణ్ణి. వాళ్ళలానే మారే ప్రతి ఋతువూ కొత్త సంవత్సరానికి తలుపు తెరుస్తుందనే నమ్ముతాను. చాంద్రమాన, సౌరమానాలే కాదు, నా హృదయమానంతో కూడా కాలాన్ని లెక్కపెట్టుకుంటూనే ఉంటాను.

నిజానికి ప్రతి పగలూ రాత్రికి స్వాగతమిచ్చే ప్రతి సంధ్యవేళా కాలానికి మోకరిల్లవలసిన సమయమే. ప్రతి ఉషోదయం నూతన సంవత్సరాగమనమే. శతపథ బ్రాహ్మణంలో రాసారని ఎవరో చెప్పగా విన్నాను. కాలానికి కణుపులుంటాయిట. ఉదయాస్తమయాలు, శుక్లకృష్ణపక్షాలు, ఋతువులు, ఉత్తరదక్షిణాయనాలు- కాలం ఒక దశ దాటి మరొక దశలోకి ప్రయాణించే ప్రతి సంధ్యవేళా మనం కాలానికి ఊపిరూదుకోవాలట. కనకనే నాకు ప్రతి ఉదయవేళా, ప్రతి అస్తమయ సంధ్యా ఒక పర్వవేళ. అప్పుడు నేనే పనిచేస్తున్నా, ఒక క్షణం పాటు ఆగి నాలోకి చూపు సారించుకుని, కాలానికి నమస్కరించుకుంటాను.

కాలం తన గుప్పెట్లో ఏమి దాచి ఉంటుంది? రాబోతున్న ప్రతి రోజూ, ప్రతి మాసం, ప్రతి ఋతువు, ప్రతి ఏడాదీ మనకీ, మన వాళ్ళందరికీ మంచిచెయ్యాలని కోరుకుంటాం. ఒక్క న్యూ యియర్ డే అనేమిటి? ప్రతి ఉదయమూ శుభోదయం కావాలనే మనసారా కోరుకుంటాం. పూలతో, పళ్ళతో, గ్రీటింగ్స్ కార్డుల్తో, కేకుల్తో, వెలుగుతున్న కొవ్వొత్తుల్తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. లేదా ఒక దీపం వెలిగించి, ఒక అగరువత్తి వెలిగించి, ఒక స్తోత్రం చదువుకుంటాం. కాలం మనకి ఊపిరిపొయ్యడమే కాదు, కాలానికి కూడా మనం ఊపిరి పొయ్యాలి.

ఈ మాటలు, ఈ శుభాకాంక్షలు మామూలు రోజుల్లో మామూలుగా చెప్పడం కాదు, నా జీవితంలో అతికష్టమైన ఒక పరీక్షాకాలంలో నడుస్తూ కూడా ఈ మాటలు చెప్పగలను. ఆగామికాలం మీకే కాదు, నాక్కూడా శుభకాలమనే నమ్ముతూ ఈ మాటలు రాస్తున్నాను. కాలం నాకొక్కడికే కాదు, మీక్కూడా శుభకాలం కావాలన్న హృదయపూర్వక శుభాకాంక్షతో ఈ మాటలు రాస్తున్నాను.

నాలుగైదు రోజులకిందట, అత్యంత నిరాశామయక్షణాల్లో, రమణుల వాక్యమొకటి నాకు కనిపించింది.

The Grace you are seeking is also the Grace seeking you అని.

ఎటువంటి వాక్యం! ఈ మాటలే రూమీ కూడా అన్నాడని ఒకప్పుడు నేను మీతో పంచుకున్నాను. ‘నువ్వు నీళ్ళ కోసం దప్పికపడినప్పుడు, గుర్తుపెట్టుకో, నీళ్ళు కూడా నీ కోసం దప్పికపడుతుంటాయి’ అన్నాడాయన.

కొత్త రోజుకి మనం తలుపులు తెరుస్తున్నపుడు, పూలగుత్తితో స్వాగతం పలుకుతున్నప్పుడు, కొత్తరోజు కూడా పూలమాలల్తో మన ఇంటిగుమ్మం దగ్గర నిలబడి ఉందని మనం గుర్తుపట్టగలం. మన శుభాకాంక్షలే కాలం మళ్ళా తన శుభాకాంక్షలుగా మన చేతుల్లో పెడుతుందని మర్చిపోకండి.

31-12-2023

19 Replies to “కాలానికి ఊపిరి పొయ్యాలి”

  1. ప్రతీ ఉదయం, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించ గలిగే మనసుకి నిత్యం కొత్త సంవత్సరమే…. Thank you sir…
    సంతోషకరమైనదిగా మలుచుకునే సందర్భానికి శుభాకాంక్షలు ☺️🙏

  2. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.మీ ప్రతి మాటా అక్షరసత్యం. కొత్తగా అప్పుడే పుట్టినట్టు
    నూతనోత్సాహం తో వుండాలంటే
    కాలానికి ఊపిరి పొయ్యాల్సిందే. ఈ ఉదయానికి మీ అందమైన టపా అంకింతమిస్తూ మీకు ధన్యవాదాలు

  3. నిన్న ఎంతగా
    నలిగిపోనీ

    పొద్దున్నే సూర్యకాంతి
    పొగలు కక్కే కాఫీ
    ఒంటి మీద వేణ్ణీళ్ళు

    అల తడిపి వెళ్ళిన
    ఇసకతిన్నెలా మళ్ళీ
    తళతళలాడతాను!

    Thank you for all your posts, Sir. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు.

  4. Great Greetings.
    Wish you what all you desire for…Sir.
    Life is beautiful reading your writings.
    Thank you so much…Sir 🙏

  5. “కాలానికి ఊపిరూదుకోవాలి”
    మంచి మాట..
    మీ మాటలు చదువుతూ, వింటూ ఏడాది గడచింది..
    ఇలాగే రాబోయే కాలమూ గడవాలని ఆకాంక్షిస్తూ..
    నూతన సంవత్సర శుభాకాంక్షలండీ💐🙏

  6. 🌹🌹🌹🌹🌹
    మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    🙏🙏🙏🙏🙏

  7. అద్భుతంగా రాశారు. మారే ప్రతి ఋతువూ కొత్త సంవత్సరానికి తలుపు తడుతుందనడం ఎంత మంచి సమన్వయం! ప్రతి ఋతువులోనూ కొత్తగా జన్మిస్తామని నేను ఈ మధ్యనే ఒకచోట రాశాను. రమణులు, రూమీ మాటల మధ్య ఎంత గొప్ప సాదృశ్యం!

  8. Thank you for the all your words this past year that inspired and delighted me and looking forward to many many more in the new year!
    Wishing everyone a great year filled with love, laughter and joy!!

  9. రచన తెచ్చిన పూల గుత్తి పరిమళాలు గుబాలిస్తున్న వేళ ఈ కొత్త సంవత్సరానికి తలుపు తెరిచాను. వందనాలు మీకు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading