బసవన్న వచనాలు-23

బాగా గుర్తు. 1994 లో, పాడేరులో నేనున్నప్పటి క్వార్టర్సులో పెరట్లో సిల్వర్ ఓక్ చెట్టుకింద కూచుని మా మాష్టారినుంచి వచ్చిన ఇన్ లాండ్ కవర్ విప్పాను. అందులో కనిపించింది ‘ఒక చేత్తో పాలగిన్నె, మరొక చేత్తో బెత్తం పట్టుకుని బసవన్న నన్ను చేరవస్తున్నాడు’ అని రాసిన వాక్యం.

ముప్ఫై ఏళ్ళు పట్టింది బసవన్న భక్తిప్రపంచంలోకి నాకు ప్రవేశం దొరకడానికి. ‘ఆయనలో ఒక బసవన్న మాత్రమే కాదు, అల్లమప్రభువు, అక్కమహాదేవి కూడా కనిపిస్తున్నారు మీ అనువాదాలు చదువుతుంటే’ అని అన్నాడు ఆదిత్య. నా అనువాదాలు సఫలమయ్యాయనిపించింది. ‘కబీర్ ని కన్నడంలో చదువుతున్నట్టుంది’ అన్నాన్నేను. అంతేనా? బుల్లేషానీ, లాలన్ ఫకీర్ నీ కూడా కన్నడంలో చదువుతున్నట్టుంది. పంతొమ్మిదో శతాబ్దపు బెంగాలీ బావుల్ గాయకుడు లాలన్ ఫకీర్ అన్నాడు ‘మనిషినీ వెలుగునీ కలపండయ్యా’ అని. బసవన్న కవిత్వమంతా మనిషినీ వెలుగునీ కలిపే ఒక అపూర్వరసవాదమని నాకిప్పటికి అర్థమయ్యింది.

ఈ నెలరోజులూ బసవనామస్మరణలో, ఆ కవిత్వాన్ని మళా నా మాటల్లో నేను చదువుకోడంలో గడిచింది. ఈ నెలరోజులూ నాతో పాటు కలిసినడిచిన మీకందరికీ నా ధన్యవాదాలు. నిన్న సోమయ్యగారు ఫోన్ చేసి ‘ఇవి వీలైనంత తొందరలో పుస్తకంగా తీసుకురండి. ఇప్పటి కాలానికి చాలా అవసరమైన కవి బసవన్న’ అన్నారు. తప్పకుండా తీసుకువస్తాను.

శ్రీశైలభ్రమరాంబమల్లికార్జునులు నాకెంతో ఇచ్చారు. నా జీవితాన్ని నిలబెట్టారు. వారు నాతో ఎప్పుడూ ప్రేమతో పాలే తాగించారు తప్ప బెత్తం దెబ్బలు రుచిచూపించలేదు. అంతేనా? నా మీద ఎవరేనా కత్తి విసిరినప్పుడల్లా ఆ కత్తిని వరమాలగా మారుస్తూ వచ్చారు. కాని ఆ ప్రేమకి తిరిగి ఇప్పటిదాకా నేనేమీ ఇవ్వలేకపోయాను. అందుకని, ఇదుగో, ఈ 300 వచనాలూ బిల్వపత్రాలుగా వారి చరణాలపైన సమర్పిస్తున్నాను.


286

మూగవాడు
కన్న
కలలాగా
అయ్యింది
నా భక్తి.

ఆ లక్షణం
చెప్పగలిగేదీ కాదు
వినగలిగేదీ కాదు.

నా అవివేకాన్ని
పోగొట్టవయ్యా
కూడలసంగమదేవా! (295)

287

మున్నూట అరవై రోజులూ
సాముచేసి
తీరా యుద్ధంలో
అడుగుపెట్టాక
చేతులు రానట్టుంది
నా భక్తి.

ఎంతకాలం
లింగార్చన చేసి
ఏమి ఫలం?
మనసు దృఢం
కాకపోతే?

కుండలో ఉన్న
పాలు పారబోసి
మళ్ళా
నింపగలనా
కూడలసంగమదేవా? (298)

288

చూసేవారుంటేనే
చేస్తాను
దైవార్చన.

నాకొక
నిజం లేదు.

నాకొక
నిజాయితీ లేదు.

లింగాన్ని చూపించి
పొట్టపోసుకునే
మోసకారినయ్యా
కూడలసంగయ్యా! (307)

289

ఏనుగు
ఆ దారిలో
వెళ్ళిందంటే
మేకకూడా
అటుపోవచ్చా?

సంగడిశరణులూ
నేనూ
సమానమని
చెప్పవచ్చా?

జంగముల్ని
కొల్చే
భక్తులకి
సరితూగుతానా?

చెప్పయ్యా
కూడల సంగయ్యా (329)

290

చెట్టునీడన
నిలబడి
తననీడ
తాను చూసుకోడం
సాధ్యమేనా?

నీ శరణులముందు
నేనేపాటి
భక్తుణ్ణయ్యా?

నీ శరణులముందు
నేనేపాటి
యోగ్యుణ్ణయ్యా?

నేను
భక్తుణ్ణని చెప్పుకుంటే
ఆ మాట
కాల్చెయ్యదా
కూడలసంగమదేవా? (334)

291

చేతిలో చీపురు
తలమీద
చుట్టకుదురు.

పనిమనిషి
బిడ్డనయ్యా నేను.

కూడలసంగమదేవుడికి
మంచం అరణంగా
తెచ్చుకున్న
పనిమనిషి
బిడ్డనయ్యా నేను. (355)

292

దారితప్పిన శిశువు
తల్లికోసం ఏడ్చినట్టు

తోవతప్పిన పశువు
మందకోసం వెతికినట్టు

మీ మనుషుల రాకకోసం
తపిస్తున్నాను
మీ భక్తుల రాకకోసం
తపిస్తున్నాను.

నాకు మీ శరణుల రాక
కూడలసంగమదేవా
కమలానికి
దినకరుడుదయించినట్టు. (366)

293

జలం నుంచి
బయటపడ్డ
చేప బతికిందంటే
ఆశ్చర్యం.

నన్ను
గణసమూహంలోనే
ఉంచవయ్యా లింగా.

శివ శివా
కూడలసంగమదేవా
నీ కొంగుపట్టి
వేడుకుంటాను. (368)

294

నువ్వుల్లేకుండా
గానుగాడినట్టుంది
నా భక్తి.

ఉప్పుని
నీట్లో అద్దుకుని
తిన్నట్టుంది నా భక్తి.

నేను చేసానని
చెప్పుకుంటే
ఆ చిచ్చు చాలదా
కూడలసంగమదేవా? (384)

295

మావాళ్ళంతా
నన్ను పొగిడి పొగిడి
బంగారుశూలానికెక్కించారు.

ఈ పొగడ్త నన్ను
చీల్చేసింది.
అయ్యో!
భరించలేనీ బాధ.

అయ్యో!
మీ మన్నన పదునైన
అమ్ములాగా గుచ్చుకుంది
అయ్యో!
భరించలేనీ నొప్పి.

నువ్వు నిజంగా
నా మేలుకోరేవాడివైతే
కూడలసంగమదేవా!
ధర్మరాజా!
ఈ పొగడ్తలకి
అడ్డుపడవయ్యా!

296

గోడలేకుండా
చిత్తరువు
గీయగలమా?

ధాత్రిలేకుండా
విత్తనం
నాటగలమా?

జంగముడులేకుండా
అర్చన
చెయ్యవచ్చునా?

రూఢీశ్వరుణ్ణి
మళ్ళా
వివరించవచ్చునా?

తనువులేని
నిర్మలమూర్తి
కూడలసంగమదేవుడు
జంగమముఖం
ధరించాక
నాకు మరొకటి
తెలియదయ్యా. (399)

297

ఎడమచేతికి
సంకెళ్ళు
తగిలించి
కుడిచేతిని
నరుక్కుంటే
నొప్పి ఉండదా?

ప్రాణం ఒకటీ
దేహం ఒకటీ
కాదు.

లింగాన్ని
పూజించి
జంగం పట్ల
ఉదాసీనత
వహిస్తే

తగలబడిపోనా
నేను
కూడలసంగమదేవా ? (406)

298

తనువు
నొప్పించి
మనసు
విసిగించి
నీ పాదాలు
పట్టుకునే
వాళ్ళున్నారా?

ఈ కథనం
వాళ్లని
కాల్చకుండా
ఉంటుందా?

శివభక్తుల బాధ
కూడలసంగమదేవా
లింగానికి బాధ. (407)

299

భక్తి మాటలు
చక్కగా పలుకుతాను.

పలికినట్టే
నడుచుకుంటాను.

నడతలో
మాట
నిలబెట్టుకుంటాను.

పైకి తూగే
తక్కెడ కర్ర
నీ చేతుల్లో ఉంది.

రవ్వంత
జారినా

నన్ను ముంచి
నువ్వు తేలిపోవయ్యా
కూడలసంగమదేవా ! (441)

300

ఎడమచేతిలో
పాలగిన్నె
కుడిచేత్తో
బెత్తం పట్టుకుని
ఎప్పుడొస్తాడు
మా అయ్య?

దండించిమరీ
పాలు తాగించే తండ్రి.

‘దండక్షీరద్వయం హస్తే
జంగమో భక్తిమందిరం
అతిభక్త్యా లింగ తుష్టి
రపహాస్యాద్యమదండనం.’

అని అన్నారు కదా.

కూడలసంగమదేవయ్యా
నిన్నెలా ప్రేమించాలో
ఆ తోవ చూపే
తండ్రివి నువ్వేనయ్యా! (383)

16-12-2023

14 Replies to “బసవన్న వచనాలు-23”

  1. మా వాళ్ళంతా
    నన్ను పొగిడి పొగిడి
    బంగారు శుాలానికెక్కించారు .. 🛐

    ఈ వచనాలు చదువుతుంటే Appreciate చేయటానికి కూడా మాట పెగలడం లేదు.. గురువుగారు
    అయిన బంగారు శుాలానికిక్కే అర్హత.. మీలాంటి డమరుకని(కవుల)కే ఉంటుంది.. 🙏

    మ్రెాగింది డమరుకం(✍️)
    మేల్కొంది తెలుగు సాహిత్యలోకం
    సాగింది బీజాక్షర తాండవం
    శంభో శివమ్ శంకరం
    వందే జగన్నాయకం 🙏🙏

  2. “మనిషినీ వెలుగునీ కలిపే ఒక అపూర్వ రసవాదం!”
    చిన్న చిన్న పదాల్లో నే భగవంతుని చేరే దారి చూపించే చమురు దీపాలు. కనులకు కాంతి-మనసుకు శాంతి!
    పుస్తకం గా తెస్తే ఇంకా బాగుంటుంది.
    మీకు ఒకసారి ధన్యవాదాలు చెబితే సరిపోదు..రుణం తీరిపోదు.
    నమస్సులు🙏

  3. చెట్టునీడన
    నిలబడి
    తననీడ
    తాను చూసుకోడం
    సాధ్యమేనా?
    ఎంత సరళగ్రాహ్యోపమానం.

    జనులకొరకు జంగమయ్య
    బసవని నోరున వెడలెనొ
    కారణమితడసలు కర్త
    శివుడేమోననిపించును

    పరిపరి విధముల బసవడు
    తనకు తాను నికషమయ్యె
    పసిడి తానె గీటురాయి
    కూడా తానాయె చూడ

    విశ్వమందు కొండొకచో
    ఉండరె నిశ్చల భక్తులు
    భాషలు వేరేమొ గాని
    భావములేకాత్మజములు

    ఒక కబీరు ఒక మీరా
    ఒక బసవన ఒక లాలన్
    మనిషిని వెలుగును కలిపే
    బాటవెతుకు మహనీయులు

    పూర్వజన్మలోని పుణ్య
    మిసుమంతగ నున్నదేమొ
    మీ వెరుగున బసవన వచ
    నానురక్తి యొనగూడెను

    అచ్చమైన మానవతా
    దీపశిఖరి కద బసవన
    ఎచ్చుతగ్గులెరుగని సమ
    సమాజాభిలాషి కతన

  4. అద్భుత వచనాలు…. పామరులకు సైతం అర్థమయ్యేవిధంగా, భక్తి కలిగేవిధంగా…

    శివయ్య కరుణించే విధంగా.. 🙏🙏🙏

  5. చక్కని వివరణాత్మక సమాచారాన్ని అందిస్తున్నందులకు అభినందనలు.ధన్యవాదములు.

  6. అక్క మహాదేవి , బసవన్న వచనాల పేర్లు మాత్రమే విన్న నేను ఈ వచనాల మీద దూపగొన్న జీవిలాగ దోసిలి పట్టాను సార్ …

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading