
తెలుగులో శివకవులు బసవన్న ప్రభావంతో దేశిఛందస్సులపైనా, దేశి పదజాలం పైనా ఎక్కువ మొగ్గు చూపించారనీ, నన్నయ అనుసరించిన కావ్యభాష స్థానంలో ప్రజాభాషను తీసుకు వచ్చారనీ మన సాహిత్య చరిత్రకారులు రాసారు. కాని ఇది పూర్తి సత్యం కాదు. మన తెలుగు సాహిత్య చరిత్రకారులకి బసవన్న వచనాల గురించీ, అందులో ఆయన చూపించిన శిల్పం గురించీ, ఆ పదజాలం గురించీ పూర్తి అవగాహన ఉందని చెప్పలేం. ఎందుకంటే సోమన్నలాగా బసవన్న కూడా దేశిఛందస్సులవైపు మొగ్గి ఉంటే వచనానికి బదులు త్రిపదల్నీ, రగళెల్నీ, షట్పదుల్నీ ఉపయోగించుకుని ఉండేవాడు. అంతే కాదు, సోమన్న చెప్పుకోవడం తాను జానుతెనుగులో రాస్తున్నాడని చెప్పుకున్నప్పటికీ, అతడి బసవపురాణంలోకూడా సంస్కృతప్రాబల్యం తక్కువేమీ కాదు.
ఈ సందర్భంగా రామానుజన్ చేసిన పరిశీలన ఒకటి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. రామానుజన్ అన్నదేమిటంటే, తాత్త్వికంగా వచన కవులు, మార్గప్రభావాన్నే కాదు, దేశి సంప్రదాయాల్ని కూడా దూరం పెట్టారని. విస్తృతభారతదేశవ్యాప్తిలో ఉన్న వైదిక, పురాణదేవతల్ని ఎంత దూరం పెట్టారో, స్థానికంగా ప్రజలు కొలిచే చిల్లరదేవుళ్లని కూడా అంతే దూరం పెట్టారని. ఇది చాలా నిశితమైన, ఎంతో అంతర్దృష్టి కలిగిన పరిశీలన. వచనకవులు great tradition తో పాటు little tradition ని కూడా పక్కన పెట్టడంలో ఆశ్చర్యం లేదుసరికదా, అది చాలా సహజమైన వైఖరి అనే మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే, సంప్రదాయం, మార్గ పద్ధతికి చెందినా, దేశిపద్ధతికి చెందినా, సంప్రదాయం సంప్రదాయమే. అందులో ఒక వ్యవస్థ ఉంటుంది. ఒక నిచ్చెనమెట్ల అమరిక ఉంటుంది. దానికొక పురాణకల్పన ఉంటుంది. వచనకవులు, అన్ని రకాల నిచ్చెనల్నీ పక్కకు నెట్టినవాళ్ళు, తమ సాహిత్యసృజనలో మాత్రం నిచ్చెనల్ని ఎట్లా అంగీకరిస్తారు?
రామానుజన్ రాసిన ఈ విశ్లేషణ చదివిన తర్వాత నిజానికి తెలుగు శివకవులు కన్నడ వచనకవులు చూపించినంత విప్లవాత్మకతని చూపించలేకపోయారనీ, ఇక్కడి మార్గసంప్రదాయాన్ని ఎదుర్కోడానికి ప్రజల్లో బలంగా ఉన్న దేశిసంప్రదాయాన్ని తలకెత్తుకున్నారనీ గ్రహించాను.
ఇక్కడే తమిళ శివకవులకీ, వచన వీరశైవ కవులకీ మధ్య ప్రధానమైన వ్యత్యాసం కూడా నాకు కనిపిస్తోంది. తమిళ శివకవులు తమిళఛందస్సుల్ని విరివిగా వాడుకోవడమేకాక, శివుడికి సంబంధించిన pan-Indian mythology ని కూడా విరివిగా వాడుకున్నారు. వాళ్ళ శివుడు వృషభారూఢుడు, గరళకంఠుడు, స్మశానవాసి, కపాలధారి, త్రిశూల ధారి, త్రిపురాంతకుడు, రావణుణ్ణీ, అర్జునుణ్ణీ, కార్త్యవీర్యార్జునుణ్ణీ ఓడించి, అనుగ్రహించినవాడు -ఇలా, శివుడి గురించిన పరికల్పనలన్నీ మనకి ఆ పదికాల్లో కనిపిస్తాయి. అంతే కాదు, సంబంధర్ రాసిన పదికాల్లో ఒక చరణం తప్పనిసరిగా రావణుడి గర్వం శివుడెలా అణచివేసాడో చెప్పేదిగా ఉంటుంది. అంటే ఒక్క కారైక్కల్ అమ్మైయ్యారు తప్ప తప్పిన శివకవులందరి కవిత్వంలోనూ కనిపించే శివుడు ఏకకాలంలో పురాణశివుడూ, తమిళ శివుడూ కూడా. ఒక్క అమ్మైయ్యారు మాత్రమే ఆయన్ని పూర్తి తమిళశివుడిగా దర్శించింది. బసవన్న కవిత్వంలో ఈ పురాణగాథల ప్రస్తావన లేకపోలేదుగాని, ఆ శివలీలల్ని పదే పదే స్మరించడం మీద బసవన్నకి ఆసక్తి లేదు. ఆయన శివుడు పురాణశివుడూ కాడు, కన్నడ శివుడూ కాడు. ఆయన అత్యంత శరణుల శివుడు.
అసలు ఈ వచనమనే ప్రక్రియను మాదిగ చెన్నయ్య అనే వచనకవి ప్రారంభించాడని చెప్తారు. ఆయన చోళనాడు నుంచి కల్యాణికి వచ్చాడు. అతడి పేరు మీద ఇప్పుడు పది వచనాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. కాని ఆ వచనాలు చాలు, అతడొక కొత్తతోవ వేసినవాడని చెప్పడానికి. ఈ వాక్యాలు చూడండి (వచనము, బసవసమితి, బెంగుళూరు, పే.586):
నడవడి, నుడి సిద్ధాంతమైతే కుల,వెలి, సూతకములు లేవు
నుడి శ్రేష్టము, నడవడి హీనం అయినప్పుడు
అదే విడుదలలేని అంత్యజత్వం.
ఈ ఒక్క వాక్యం చాలు, వచనకవిత్వానికి మాదిగ చెన్నయ్య గురజాడ అప్పారావు వంటివాడని చెప్పడానికి. ఇతనితో పాటు డొక్కల కక్కయ్య, తేడర దాసిమయ్య అనే మరో ఇద్దరు వచనకవులు కూడా బసవన్నకి స్ఫూర్తిప్రదాతలుగా ఉన్నారు. వీరిలో చెన్నయ్య, కక్కయ్యలనుంచి రాజీలేని స్పష్టతనీ, దాసిమయ్యనుంచి ఎడతెగని అంతస్సంఘర్షణనీ బసవన్న గ్రహించి ఉంటాడని చెప్పుకోవచ్చు.
ఒక వచనంలో (353) ఆయన బాణుడు, మయూరుడు, కాళిదాసు తనవాళ్ళని చెప్తూ, కక్కయ్య, చెన్నయ్య తనని ఎత్తి ముద్దాడారని చెప్పుకున్నాడు. ఇక్కడ వ్యాసుణ్ణీ, వాల్మీకినీ, భవభూతినీ, భాసుణ్ణీ పేర్కోకపోవడం గమనించాలి. మయూరుడు సూర్యశతకకవి. బాణుడి కాదంబరి పురాణాల్తో నిమిత్తంలేనికథ. ఇక కాళిదాసు ప్రధానంగా కుమారసంభవ కవి. తాను వాళ్ళ మనిషి. సందేహం లేదు. కాని కక్కయ్య, చెన్నయ్య తనని ఎత్తుకు ముద్దాడినవాళ్ళు. అంటే బసవన్న సంస్కృత కావ్యసంప్రదాయం గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండికూడా, దాన్ని పక్కన పెట్టి కక్కయ్య, చెన్నయ్యల దారిని అనుసరించాడన్నమాట.
నాకు తెలిసి ఇలా పూర్తిగా ప్రజల భాషని తన భాషగా మార్చుకున్నవారు ఒక కబీరు, ఒక వేమన, ఒక అమ్మైయ్యారు, చర్యాగీత కవులు, ఒక బసవన్న మాత్రమే. కాని వాళ్ళందరిలోనూ బసవన్న మరింత అట్టడుగు నేలని ముద్దాడాడు. Unto the Last అంటే ఇదేనేమో.
అలాగని వచనం అనే ప్రక్రియ పూర్తిగా గాల్లోంచి సృష్టించిన ప్రక్రియ అని ఎవరూ అనలేదు. ఇప్పటికి అరవయ్యేళ్ళ కిందటే కన్నడ పరిశోధకులు త్రిపదకీ, వచనాలకీ మధ్య ఉన్న పోలికలు పట్టుకుని, త్రిపదనుంచి వచనం వచ్చి ఉండవచ్చునని ఊహించారు. అలాగే వీరగాథలు పాడే జానపదగాయకుల పద్ధతిలో వచనకవుల దగ్గర కూడా ఒక ఉమ్మడి పదభాండాగారం ఉందనీ, stock phrases ఉన్నాయనీ చెప్పారు. ఉపనిషత్తులు మొదలుకుని తక్కిన భారతీయ భక్తికవులందరూ వాడుకుంటూ వస్తున్న పోలికలు, ప్రతీకలు వచనాల్లో కూడా కనిపించడం ఆశ్చర్యం కాదు. కాని ఆ పదజాలంలోనూ, ఆ అర్థాలంకారాల్లోనూ వచనకవులకే సాధ్యమైన ఒక ప్రయోగపద్ధతి ఉందని కూడా మనం ఒప్పుకోవాలి. అందుకనే చాలా భక్తి కవిత్వాలు వాటిలోని సంగీతాన్ని పక్కనపెడితే, monotonous గా వినబడతాయిగాని, బసవన్న కవిత్వం అత్యాధునికంగా, అత్యంత సమకాలికంగా కనిపిస్తున్నది.
111
ప్రభువులు వచ్చారా గుడికి తోరణాలు కట్టి
స్వాగతించండి
చుట్టాలొచ్చారా
తీరిక లేదని చెప్పండి.
అప్పుడెందుకు రారు వాళ్ళు?
నీళ్లకీ, కులానికీ
వెలి అయినప్పుడు?
సమయాచారానికి
సమర్పించుకున్నప్పుడు?
పరుసవేది తాకాక
ఇనుము బంగారంగా మారిపోయాక
ఇంకా వెనకటి
బంధుత్వాలుంటాయా
కూడలసంగమదేవా? (449)
112
దేవతలతో కూడి
భక్తుడు ఇంటికొచ్చినప్పుడు
నువ్వే పనిచేస్తుంటావు
అనడుగుతానా?
నీ ఆన.
నీ భక్తులమీద ఆన.
నా తలమీద ఆన
నా తలమీద ఆన.
భక్తుల కులం ఎంచానా
కూడలసంగమదేవా
అమ్మవారిమీద ఆన (453)
భక్త ప్రసాద స్థలము
113
అయ్యా, మీ మనుషుల
దాసోహానికి
నా తనుధనమనాలు
పనికొచ్చేట్టు చెయ్యవయ్యా.
దాసోహానికి
నా తనువు పొంగాలి.
దాసోహానికి
నా మనసు లొంగాలి.
దాసోహానికి
నా ధనం కరగాలి.
నీ మనుషుల అనుగ్రహంలోనే
ఎప్పుడూ
ఆడి, పాడి,
చూసి, కూడి,
భావించి, సుఖించి
నేను పరిపక్వం కావలయ్యా
కూడల సంగయ్యా (459)
114
వాళ్ళు తినగా మిగిలింది
ఆత్రంగా ఆరగిస్తాను.
శరణుల ఇంటి దాసికి
దాసుణ్ణి నేను.
మా శరణుల ఇంట్లో
వెర్రిభక్తుణ్ణి నేను. (461)
115
వాకిలి వదిలిపెట్టకుండా
ఆ ఎంగిలి కోసం
కాచుకునుండే పనివాణ్ణి.
నాలాంటి
పనివాళ్ళ ఇంట్లో సందడైతే
ఎగిరెగిరి గంతులేస్తాను.
మా కూడలసంగముడి మనుషులు
తినగా వదిలిపెట్టినదాన్ని
తినే పనివాణ్ణి. (466)
116
బానిసకి శాస్త్రాలేమిటి?
బంటుకి ఆచారమెక్కడ?
సేవకుల సేవకుడికి
ఆగమాలెందుకయ్యా?
ఎంగిలి తిని బతికేవాడికి
కూడలసంగమదేవా
నిన్ను నమ్మడమొక్కటే
ఆచారం. (467)
117
తల్లివి నువ్వు
తండ్రివి నువ్వు.
బంధువు నువ్వు
బలగం నువ్వు.
నువ్వు తప్ప నాకు
మరెవరూ లేరయ్యా.
పాలముంచినా
నీటముంచినా
కూడలసంగమదేవా
నాకు నువ్వే దిక్కు. (481)
భక్తుని శరణస్థలము
118
అరచేతిలో లింగాన్ని చూస్తూ
కనుగొనలనుంచి
అశ్రువులు పొంగేదెప్పుడో
చూపులే ప్రాణమై
ఉండేదెన్నడో
సద్భక్త కూటమినే ప్రాణమై
ఉండేదెన్నడో
ఈ అంగవికార సంగం అణిగి
లింగా, లింగా అనుకుంటూ
ఉండేదెన్నడో
కూడల సంగమదేవా (485)
119
నాట్యమాడి కాళ్ళు అలిసిపోడం లేదు
చూసి చూసి కళ్ళు అలిసిపోడం లేదు
పాటలు పాడి నాలుక అలిసిపోడం లేదు.
ఏమని చెప్పను? ఏమని చెప్పను?
నిన్ను చేతులారా పూజించి
మనసు అలిసిపోడం లేదు.
ఏం చెప్పను? ఏం చెప్పను?
కూడలసంగమయ్యా
నీ పొట్టచీల్చుకుమరీ
నీ లోపలకొచ్చెయ్యాలన్నంత
సంబరంగా ఉంది నాకు. (487)
120
నీ చూపుల్లో
చెప్పలేనంత సుఖం.
నీ సన్నిధి
చెప్పలేనంత సుఖం.
మూడున్నరకోట్ల రోమాలు
కళ్ళుగా
నిన్ను చూసి చూసి
కూడలసంగమదేవా-
మనసులో పుట్టిన కోర్కెకి
మేనంతా పులకరించింది. (491)
121
తాళమానాల లెక్క తెలియదు
స్వరలయల లెక్క తెలియదు.
అమృతగణాలేవో
దేవగణాలేవో
అసలే తెలియదు.
మిమ్మల్ని నొప్పించకుండా
కూడలసంగమదేవా
నా మనసుకి నచ్చినట్టు
పాడుకుంటాను (494)
122
తలబోడి చేసుకుని
మగదాసినై నిన్ను సేవిస్తాను
లజ్జ లేదనుకున్నా సరే
నిన్ను దగ్గరకు లాక్కుంటాను
సిగ్గు లేదనుకున్నా సరే
నిన్నే దగ్గరకు లాక్కుంటాను.
నా చుట్టూ మనుషులంతా
నవ్వుకోనీ, నవ్వకపోనీ
కూడలసంగమదేవా
నీ మనుషుల దారినే
నడుస్తాను. (497)
123
నాకు మీరు గుర్తొచ్చినప్పుడే
ఉదయం.
మిమ్మల్ని మర్చిపోతే
అదే అస్తమయం.
మీ తలపులే నా బతుకు
చూడయ్యా, తండ్రీ,
మీ తలపులే నా ప్రాణం.
మీ అడుగుజాడని
నా హృదయంలో
అచ్చొత్తించండి.
నా నొసటన
మీ ఆరక్షరాల పేరు
రాసిపెట్టండయ్యా
కూడలసంగయ్యా (498)
124
నా కాయాన్ని దండిక చెయ్యండి
నా శిరాన్ని బుర్రగా మార్చండి
నా నరాన్ని తీగగా మార్చి
నా వేలుని కడ్డీ చెయ్యండి.
నా ఎదనొత్తి వాయించి
ముప్ఫై రెండు స్వరాలు పలికించయ్యా
కూడలసంగయ్యా (499)
125
మీకు ముడుపు కట్టిన బతుకుని
సంసారమనే కుక్క
ముట్టకుండా చూడయ్యా
నా మనసంతా మీ తలపే
మీరు తప్ప మరొకటి తెలియదు.
కన్నెతనంలో మీ చేయిపట్టాను
మీలో ఒక్కటయ్యాను.
మహాప్రభూ, నన్ను చూడు
దయచూడు
నేను నీ సతిని,
నువ్వు నా పతివి.
ఇంటి యజమాని
ఇంటిని చూసుకున్నట్టు
నా మనసు కనిపెట్టుకునే
మగడు మీరే.
మీ మనిషి
మరొకరి వెంటపడితే
అది మీకే సిగ్గుచేటయ్యా
కూడలసంగయ్యా (505)
4-12-2023


వచన రచనకు మీ వింగడింపు బాగుంది. అసలు సిసలు శివతత్వం బసవన్న వచనాల నిండా.
ధన్యవాదాలు సార్
సాహితీమూర్తికి వందనం.
“మీకు ముడుపు కట్టిన బతుకుని. సంసారమనే కుక్క
ముట్టకుండా చూడయ్యా”
సర్వస్య శరణాగతి కోరుకోవడం అంటే ఇదే కదా.
ఓం నమః శివాయ.
ధన్యవాదాలు మాష్టారూ