బసవన్న వచనాలు-7

మన మతాల్లో, అవి సనాతనం, శైవం, వైష్ణవం, బౌద్ధం, జైనం మొదలైనవాటన్నిటిలోనూ ఆరాధనా పద్ధతులన్నిటినీ మూడు విభాగాలుగా చూడవచ్చు. అవి యజ్ఞం, యోగం, పూజ. యజ్ఞం వైదిక కార్యకలాపం. అది సమ్యక్ కర్మ, సమష్టి కర్మ. యోగం పూర్తిగా వ్యక్తిగత మనో-శారీరిక శిక్షణ. స్వీయ క్రమశిక్షణ. ధ్యానం కూడా ఇందులోకే వస్తుంది. ఇక పూజ పూర్తిగా అవైదిక ఆరాధనా పద్ధతి.

యజ్ఞంలోని సమష్టితత్త్వం, యోగంలోని వ్యక్తిగత నైతికతా రెండూ పూజలో ఉన్నాయి. అంటే ఎవరికి వారూ చేసుకోవచ్చు, లేదా మొత్తం కుటుంబం, గ్రామం, సమాజం అంతా కలిసి కూడా పాల్గోవచ్చు. అందువల్ల అనతికాలంలోనే పూజ ఈ దేశంలో ప్రధాన ఆరాధనాపద్ధతిగా స్థిరపడిపోయింది. యజ్ఞయాగాలు నెమ్మదిగా ప్రజలకి దూరం కావడం మొదలుపెట్టాక, యజ్ఞం స్థానంలో దేవాలయం వచ్చిచేరింది. దేవాలయాన్ని ఒకసారి నిర్మించి, దైవానికి ప్రాణప్రతిష్టచేసాక అది నిత్యయజ్ఞంగా నలుగురికీ అందుబాటులోకి వచ్చింది. కానీ తర్వాతకాలంలో సంభవించిన సామాజిక-రాజకీయ పరిణామల వల్లా, దేవాలయాలు కూడా అందరికీ అందుబాటులోకి రావడం మానేసాక, నామమూ, జపమూ ముందుకొచ్చాయి. మధ్యయుగాల భక్తి కవులు దేవాలయానికి ప్రత్యామ్నాయంగా నామాన్ని చూపించారు. నామాన్ని ఎవరూ ఎవరినుంచీ తీసుకోలేరు. నామానికి కులమతభేదాలు లేవు. ఎవరేనా ఒక గురువునుంచి దీక్ష తీసుకుంటే చాలు, నామం సాధకుడి ఆధ్యాత్మిక అవసరాల్ని పూర్తిగా తీర్చగల సాధనంగా మారగలిగింది. ఇక ఇరవయ్యవ శతాబ్దం వచ్చేటప్పటికి నామజపం కన్నా ధ్యానం, రకరకాల మెడిటేషన్ టెక్నిక్స్ ఎక్కువ ప్రజాదరణ పొందడం మొదలుపెట్టాయి.

బసవన్న ఈ మూడింటి స్థానంలో, అంటే యజ్ఞం, దేవాలయం, పూజ- వీటి స్థానంలో కాయికానికి పెద్దపీట వేసాడు. ఆశ్చర్యంగా ఉంటుందిగాని, పదిహేనో శతాబ్దంలో రూపుదిద్దుకున్న protestant ethic కీ, కాయికానికీ మధ్య పోలికలు కనిపిస్తాయి. రెండూ కూడా work is worship అనే నమ్మాయి. కాని ప్రొటెస్టంట్ నైతికత వల్ల పెట్టుబడిదారీ విధానం లాభపడింది. కానీ బసవన్న ప్రతిపాదించిన కాయికం ప్రిమిటివ్ కమ్యూనిజానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మనిషి కష్టపడాలి, పనిచెయ్యాలి, ఆర్జించాలి, తన తనువు, ధనమూ, మనస్సూ కూడా శివసంఘానికి ధారపోయాలి. త్రివిధ దాసోహం ముఖ్యం.

పనిముఖ్యం కాబట్టి ఆడంబరంగా చేసే పూజలకీ, తమ గొప్ప చాటింపు చేసుకునే పూజలకీ బసవన్న చాలా దూరం. యజ్ఞ యాగాదులు ముందే లేవు. వాటితో పాటు బసవన్న తన దివ్యప్రపంచంలోంచి దేవాలయాన్ని కూడా పక్కనపెట్టేసాడు. ఒకటి, దేవాలయంలోకి దళితులకి ప్రవేశం లేకపోవడం వల్ల. రెండోది, ఆ పూజలూ, ఆ ఆడంబరాలూ అంతిమంగా ఏ కొద్దిమందికో మాత్రమే పనికొచ్చేవిగా మారడం కనిపిస్తున్నందువల్ల. కాబట్టి కాయికమే కైలాసం అన్నతరువాత దేహమే దేవాలయం అని అనకుండా ఎలా ఉంటాడు?

బౌద్ధజైనాల్లో దేవుడు లేడుగాని, బుద్దుణ్ణీ, తీర్థంకరుల్నీ దేవుళ్లని చెయ్యడం మొదలుపెట్టాక, వారికి కూడా దేవాలయాలూ, చైత్యాలూ, మందిరాలూ నిర్మించడం మొదలుపెట్టాక, అక్కడ కూడా రకరకాల ఆరాధనా పద్ధతులూ, వాటి ఆడంబరవ్యయం పెరగడం మొదలుపెట్టాక, బసవన్నకి అవి కూడా సమాజంలో తారతమ్యాల్ని ప్రోత్సహించేవిగానే కనబడ్డాయి.

కాబట్టి వాటన్నిటిబదులూ, ఆయన మూడు ఆరాధనా పద్ధతుల్ని ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించినట్టుగా వచనాల్లో కనిపిస్తుంది. మొదటిది, యజ్ఞానికి బదులు కాయికం. రెండోది యోగానికి బదులు, ఆత్మశిక్షణ, త్రివిధమలినాల నుంచీ విముక్తుడు కావడం. మూడోది పూజకి బదులు, శరణుల్నీ, జంగముల్నీ గౌరవించడం. కానీ వైదికధర్మం లోని బ్రాహ్మణుల్లాగా, బౌద్ధ, జైన శ్రమణుల్లాగా శరణులు కాయకష్టానికి దూరంగా ఉండే ఒక తరగతిగా రూపొందకుండా జాగ్రత్తపడ్డాడు. నేటికీ మన గిరిజనుల్లో పురోహితులుగా పనిచేసే వాళ్ళు ఆ క్రతువులు జరిపినప్పుడు మాత్రమే పూజారులుగా ఉంటారు. క్రతువు పూర్తవగానే వాళ్ళు కూడా తక్కిన గిరిజనుల్లాగా కొండకో, అడవికో, పొలానికో పని చేసుకోడానికి వెళ్ళిపోతారు.

ఈ ఆశయాలూ, ఈ egalitarian spirit ఈ రోజు వీరశైవం, లింగాయత ధర్మం ఏ మేరకు నిలుపుకున్నాయో నాకు తెలియదు. బసవన్న వచనాల్లో కనిపించే అపారమైన ఆ మానవత్వం, ఆ దయ, తోటిమనిషిని అధికుణ్ణిచేసి తనను తాను తగ్గించుకునే ఆ వినయం, సౌశీల్యం ఈ రోజు ఎంతమంది శరణుల్లో కనిపిస్తాయో నాకు తెలియదు. కాని, నేడు మన సమాజంలో యాగాలు, పూజలు, వ్రతాలు, ఉత్సవాలు, ప్రవచనాలు, హారతులు పేరిట నానాటికీ పెరిగిపోతున్న ఆడంబరం, అవధుల్లేని వ్యయం, వైభవ ప్రదర్శనల్ని చూస్తుంటే మాత్రం బసవన్న లాంటి మనుషులు ఎనిమిది శతాబ్దాల ముందటికన్నా కూడా ఇప్పుడు ఎక్కువ అవసరం అని అనిపిస్తున్నది.

పురాణాల్లోని కట్టుకథల్ని బిగ్గర గొంతుల్తో ప్రవచనాలుగా చెప్తున్నవాళ్ళూ, సమాజాన్ని ఒక spiritual space లోకి తీసుకుపోడానికి బదులు ఒక mythological space లోకి నెడుతున్నవాళ్లూ బసవన్న వచనాలు చదవడం అత్యవసరం అనిపిస్తున్నది. ఆధ్యాత్మికతను కూడా ఒక అంగడిసరుకుగా మారుస్తున్న నేటి సమాజంలో అది ప్రధానంగా ఒక నైతిక క్రమశిక్షణ అనీ, నీకూ, నీ తోటిమనిషికీ, ముఖ్యంగా కాయకష్టం చేసే మనుషుల్తో నువ్వు ఏర్పరుచుకునే మానవతాబంధంలోంచే దేవుణ్ణి దర్శించగలుగుతావని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉంటుంది.

హిందూమతానికిగాని, ఆ మాటకొస్తే ఏ మతానికైనా మరొక మతం వల్ల ప్రమాదం ఉంటుందని నేననుకోను. ఏ మతానికైనా ప్రమాదం ఆ మతంలోంచే వస్తుంది. ఆ మతం చెప్తున్న నైతిక సూత్రాల్ని ఆచరించకుండా, ఆచరిస్తున్నట్టు నటించడంలోంచే మతాలు క్షీణించడం మొదలుపెడతాయి. ఎవరేనా తమ మతాల్ని నిజంగా కాపాడుకోవాలంటే, అత్యవసరంగా చెయ్యవలసిన పనులు, వాటిలో ఆడంబరాల్ని తొలగించడం, ఆత్మవంచనని నిర్మూలించడం, ఉచ్చనీచ తారతమ్యాల్ని పరిహరించడం. అటువంటి దారి తనకి శరణుల్ని చూసి తెలిసిందని బసవన్న చెప్పుకున్నాడు. కాని మనవరకూ మనకి బసవన్న వచనాల్లోంచి ఆ దారి తేటపడుతున్నది.


61

‘నాకు నచ్చావు’, ‘నేను మెచ్చాను’,
‘నీకు అమ్ముడుపోయాను’ అన్నావనుకో
తనువుని అల్లాడించి చూస్తాడు
మనసుని అల్లాడించి చూస్తాడు
ధనాన్ని అల్లాడించి చూస్తాడు

అయినా భయకంపితుడివిగా
చేతులు జోడించి నిలబడ్డావనుకో

భక్తికంపితుడిగా నిలబడతాడు
మన కూడలసంగమదేవుడు (214)

62

ధనంకోసం మనసు ఒడ్డితే ఏమవుతుంది
మనసుకోసం ధనం ఒడ్డితే ఏమవుతుంది

తనువునీ, ధనాన్నీ దాటి
మాట్లాడటం తెలిసినవాళ్ళకి
అతడు నిస్సీముడు
నిజైక్యుడు.

తనుమనధనాలు ఎక్కడ సమర్పణమో
అదే కూడలసంగమదేవుడు మెచ్చే తావు (216)

63

మాఘమాసపు పొద్దుటి ఎండ
దేహానికి సుఖంగా ఉంటుంది.
మధ్యాహ్నం ఎండ చివరికొచ్చేటప్పటికి
కఠినంగా ఉంటుంది.

మొదట లింగపూజ
భక్తికి అనువుగా ఉంటుంది
చివర జంగమ పూజ
భక్తికి కఠినంగా ఉంటుంది.

వాళ్ల గురించి తెలుసు కాబట్టి
కూడల సంగమదేవుడు
అలాంటివాళ్ళని దగ్గరికి రానీయడు. (219)

64

తినేటప్పుడు లేదనడు
గుడ్డలు కట్టేటప్పుడు లేదనడు
బంధువులు వచ్చినప్పుడు లేదనడు.

లింగానికి లేదంటాడు
జంగానికి లేదంటాడు
ఇంటికొచ్చిన పురాతనభక్తులకి
లేదంటాడు.

చావు ముంచుకురాగానే మాత్రం
గుడికి మొయ్యమంటాడు.

చూడబోతే కూడలసంగమదేవా
వాళ్ళు దేవుడికే
పీనుగవెట్టి పురమాయించినట్టు. (222)

65

కాలాగ్ని రుద్రుడి సంరంభం తెలియనివాళ్ళు
ధాన్యం కుప్పలు లెక్కపెట్టుకుంటూ ఉంటారు.
కారడవిలో చిచ్చు చెలరేగుతుంటే
నక్కల్లాగా ఊళపెడుతుంటారు.

దేవుడి పట్ల ప్రేమలేకుండా
గొప్పకి పూజలు చేసేవాళ్ళ భక్తి
కూడల సంగమదేవా
రాత్రి పూట గొడుగుపట్టించుకున్నట్టు. (227)

66

చేసాను అనే భావన
మనసులో పుట్టిందా
ఏవగించుకుంటుంది
వేధిస్తుంది శివుని డమరుకం

చేసాను లింగానికి అనకండి
చేసాను జంగానికి అనకండి

చేసాననే మాట మనసులో లేకపోతే
నువ్వేది కోరుకుంటే అదిస్తాడు
కూడలసంగమదేవుడు (234)

67

దొంగిలించవద్దు, చంపవద్దు
అబద్ధాలాడవద్దు
కోపగించుకోవద్దు
తోటిమనిషిని అసహ్యించుకోవద్దు.

నిన్ను పొగుడుకోవద్దు
మరొకర్ని తెగనాడవద్దు.

ఇదే అంతరంగ శుద్ధి
ఇదే బహిరంగ శుద్ధి

ఇదే మా కూడల సంగముణ్ణి
సంతోషపరిచే పద్ధతి. (235)

68

దేవలోకం మర్త్యలోకం
రెండు వేరు వేరుగా లేవు
చూసుకోండి.

సత్యం పలికావా
అదే దేవలోకం
కల్లలాడావా
అదే మర్త్యలోకం.

ఆచారం స్వర్గం
అనాచారం నరకం.

కూడలసంగమదేవా
నువ్వే ప్రమాణం. (239)

69

చూసుకున్నారా!
పుణ్యపాపాలు:
మీ చేతుల్లోనే ఉన్నాయి.

‘అయ్యా’ అన్నారా
స్వర్గం.
‘ఒరే’ అన్నారా
నరకం.

దేవా! భక్తా! జయ! జియ్య!
అని అన్నారా
కైలాసం చేతికందినట్టే కదా
కూడల సంగమదేవా! ( 240)

70

‘ఏమిటిలా వచ్చారు
క్షేమంగా ఉన్నారా?’ అనడిగితే
మీ ముల్లె వట్టిపోతుందా?

‘కూర్చోండి’ అన్నారనుకో
నేల కుంగిపోతుందా?

మిమ్మల్ని పలకరించిన వెంటనే
జవాబిచ్చారనుకోండి
మీ నోరూ నాలుకా అరిగిపోతాయా?

మనుషుల్తో కలవకపోయినా సరే
ప్రేమగా మాట్లాడకపోయినా సరే
కూడలసంగమదేవుడు
మీ ముక్కు కొయ్యక మానడు. (241)

30-11-2023

12 Replies to “బసవన్న వచనాలు-7”

  1. “బసవన్న వచనాల్లో కనిపించే అపారమైన ఆ మానవత్వం, ఆ దయ, తోటిమనిషిని అధికుణ్ణి చేసి తనను తాను తగ్గించుకునే ఆ వినయం, సౌశీల్యం ఈ రోజు ఎంతమంది శరణుల్లో కనిపిస్తాయో నాకు తెలియదు.”

    తోటి మనిషిని మనిషిగా గుర్తించి సమాజంలో గౌరవాన్ని ఇస్తే సరిపోదా…

    ఈ అధికుడు, తగ్గించుకోవటం ఎందుకు…అంటే 12 వ శతాబ్దంకి అది అవసరం. ఈ శతాబ్దంలోనైనా మనుషులు గోడల్ని కూల్చాలి కదా. అటువంటి ప్రయత్నం రచనల్లో అయినా జరగాలి కదా.

    12 వ శతాబ్ది లో బసవన్న చూపిన మార్గాన్ని మరికొంత ముందుకు తీసుకు వెళ్ళాలి కదా.

    బసవన్న అనుకుని ఉంటాడు, నన్ను పోలిన శరణులు (తరవాతి తరాలలో), నేను పలికిన ఈ వచనాలను అర్థం చేసుకొని ఆ వచనాలలో కనిపించే ఒక రమణీయ సమ సమాజాన్ని స్థాపించే ప్రయత్నమన్నా చెయ్యాలని.

    మనమేమో roberst frost – mending wall దగ్గర ఆగిపోయాము. బాధగా ఉంది.

  2. మనసు పులకరిస్తోంది.ఆడంబరం…అతిగా మారి లక్షల వ్యయంతో పూలూ దీపాలూ…అబ్బబ్బా…భయానక వాతావరణం! గుడికి వెళ్ళేందుకు బాధ కలుగుతోందండీ.

  3. దొంగిలించవద్దు, చంపవద్దు
    అబద్ధాలాడవద్దు
    కోపగించుకోవద్దు
    తోటిమనిషిని అసహ్యించుకోవద్దు.

    నిన్ను పొగుడుకోవద్దు
    మరొకర్ని తెగనాడవద్దు.

    ఇదే అంతరంగ శుద్ధి
    ఇదే బహిరంగ శుద్ధి

    ఇదే మా కూడల సంగముణ్ణి
    సంతోషపరిచే పద్ధతి.
    ఎంత గొప్ప వచనం

  4. “”పురాణాల్లోని కట్టుకథల్ని బిగ్గర గొంతుల్తో ప్రవచనాలుగా చెప్తున్నవాళ్ళూ, సమాజాన్ని ఒక spiritual space లోకి తీసుకుపోడానికి బదులు ఒక mythological space లోకి నెడుతున్నవాళ్లూ—-ఆధ్యాత్మికతను కూడా ఒక అంగడిసరుకుగా మారుస్తున్న నేటి సమాజంలో అది ప్రధానంగా ఒక నైతిక క్రమశిక్షణ అనీ, నీకూ, నీ తోటిమనిషికీ, ముఖ్యంగా కాయకష్టం చేసే మనుషుల్తో నువ్వు ఏర్పరుచుకునే మానవతాబంధంలోంచే దేవుణ్ణి దర్శించగలుగుతావని  తెలుసుకోవలసి ఉంటుంది.””‘

  5. మీ సంతకం గమనించక, బసవన్న చిత్రం ఏ పాఠ్య పుస్తకం లోంచో ఎంచుకున్నారనుకున్నా. ఈ పోలికలు మీ ప్రొఫైల్లో కనిపిస్తున్నాయి నాకు

  6. క్షమించాలి, నేనన్నది ఆయన మీలో కనిపిస్తున్నాడని.. అది నాకు.

    1. అవును సార్. అలానే అర్ధమైంది. కానీ అది కూడా చాలా పెద్దమాటనే. మీ అభిమానానికి ధన్యవాదాలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading