
తంజావూరు కలలు. పుస్తకం పేరుచూడగానే ఒక తుళ్ళింతకి లోనుకాకుండా ఎలా ఉంటాం! ఇవాళంటే మన ఆ ఊరినుంచి మానసికంగా దూరంగా జరిగిపోయాంగాని, ఒకప్పుడు తెలుగువాళ్ళ సాహిత్యతీర్థక్షేత్రాల్లో అది కూడా ఒకటి. నాయకరాజులు, చేమకూర వెంకట కవి, రంగాజమ్మ, ముద్దుపళనిల కాలంలోనే కాదు, ఎంతమందికి గుర్తుందో తెలియదుగాని, ఆ నగరాన్ని కీర్తించినవాళ్ళల్లో జాషువా కూడా ఉన్నాడు. ‘తెలుగు సౌరభ్యంబుల్ గమగమ వలచిన చోటది’ అని అనడమే కాక, ‘కృష్ణరాయలవారి యెడబాటు చీకట్లు ముసరి దిక్కులలోన మసలువేళ భూరి వాజ్ఞ్మయలక్ష్మి దారిబత్తెము తోడ ‘తంజాపురానికి తరలిపోయిందని’ కూడా అన్నాడు.
ఆరేళ్ళ కిందట నేను ఆ నగరాన్ని మొదటిసారి చూసినప్పుడు ఆ ఆకాశం కింద ఏదో తెలియని ఆత్మీయత, ఆ కావేరీ గాలుల్లో ఏదో పూర్వజన్మల రక్తబంధస్పర్శ నన్ను తాకుతూనే ఉంది. కానీ, మన కాలంలో, తంజావురుతో ఇంతగా తాదాత్మ్యం చెందిన కవి మాత్రం ఇదుగో, ఈ వంశీకృష్ణనే అనడంలో సందేహం లేదు.
ఈ కవిత్వపుటలన్నిటా తంజావూరు ఒక ఊరుగా, ఒక స్మృతిగా, ఒక ప్రతీకగా కనిపిస్తుంది. ఆ ‘బృహదీశ్వరాలయం రాజరాజన్ తిరువాసల్’ , ఆ ‘వన్నిమరం నీడ’ , ఆ ‘పశ్చిమకనుమల నవపారిజాతాలైన నీలకురింజిపూలు’, ఆ సరస్వతీమహల్ మెట్లమీద కూచుని ఆలపించుకునే స్వాతి తిరునాళ్ కీర్తనలు, ‘శ్రీ పెరుందేవి తాయారు చుట్టూ శ్రీ వరదరాజ పెరుమాళ్ తిరుగాడినట్టు’ కవి తన వాజ్ఞ్మానసాలతో తంజావూరు చుట్టూ తిరుగాడుతూనే కనిపిస్తాడు. ‘మా తంజావూరు కలలకు అంతే లేదు, తంజావూరు ఒక నగరం కాదు, అది మా జీవితం’ అని సూటిగా చెప్పెయ్యడమే కాక, ‘అశరీరంగా అయినా సరే! ఒక్కసారి తంజావూరును చూడాలని వుంది’ అని ఆనుకుంటూనే ఉంటాడు.
ఈ కవిత్వం మొదటిపఠనంలో మనకి తెలిసేది ఇంతదాకా. కాని ఆ ఇతడికి తంజావూరు కేవలం ఊరు కాదనీ, తన జీవితానికి ఆలంబనగా నిలబడుతున్న ఏ అమూల్య మనోమయకోశానికో ప్రతీక అనీ మనకి అస్పష్టంగానైనా స్ఫురించకుండా ఉండదు.
కాని ఆ రత్నపేటికని తెరిచేముందు, కవి, తానెలాంటి కాలంలో జీవిస్తున్నానని చెప్తున్నాడో, ఆ కాలపు జాడల్ని మనం ముందు గుర్తుపట్టాలి. ‘ఇదొక తలకిందుల కాలం’ అని చెప్తూ, ఎంత తలకిందులంటే ‘మీనం మకరంలా, మకరం మీనంలా’ కనిపిస్తున్నదని చెప్తాడు. ఈ ఒక్క అభివ్యక్తి చాలు ఈ కవి కవితావాక్కు ఎంత పరిణతమో చెప్పడానికి. మీనమకరాలు తల్లకిందులు కావడమనే మాటలో రెండు అర్థాలున్నాయి. ఒకటి కాలచక్రం లోని మీనమకరరాసులు ఒకదానిలా ఒకటి కనిపిస్తున్నాయంటే, కాలం తల్లకిందులైనట్టే కదా. కాని మరొక అర్థంలో, మీనంలోని సౌకుమార్యం, లాలిత్యం, సున్నితచలనాల స్థానంలో మకరంలోని కాఠిన్యం, మందకొడితనం, భీకరత్వం కనిపించడం. అంటే లోకంలో ఏది ప్రేమించదగ్గది అని మనం అనుకుంటామో అది ప్రేమపరాజ్ఞ్ముఖంగా కనిపించడమన్నమాట. కనుకనే ఇప్పటి జీవితాన్ని ‘ఆదిమానవ మృగత్వం, అమేయ, అజేయ కఠిన శిలాసదృశ మానవదుర్గం’ అని వర్ణిస్తూ, ‘నీటికీ, కన్నీటికీ, ఉమ్మనీటికీ నడుమ ఓలలాడే క్షణాల నీడలం’ అని కూడా అంటాడు. ‘కృష్ణబిలం’ ఇక్కడ పదేపదే వినవచ్చే మాట. మన కాలం నాటి మానవుడి కష్టావస్థని ఈ కవి సరిగ్గానే నిదానించాడనడానికి ఎన్నో గుర్తులు ఈ పుటల్లో:
ఇవాళ ఒక ఉత్తరం రాశా నన్ను నేను కూడదీసుకుని
మనిషి లేడని తిరిగి నా దగ్గరకే వచ్చింది. ..
మహాద్భుత భూగోళానికీ
సగభాగమే వెలుతురులో ఉంటుంది
మిగతా సగము
చీకటిలోనూ, అంతకుమించి అంధకారంలోనూ. ..
జీవితంలో దిద్దుబాట్లు కాదు, ఓవర్ రైటింగ్ ఎక్కువైంది. ..
ఇలా చాలా వాక్యాలు ఎత్తిచూపవచ్చు.
ఇటువంటి దురవస్థ నడుమ అతడికి రెండు ఊళ్ళకి దారులు కనిపిస్తున్నాయి. ఒకటి తంజావూరు, రెండోది తిరువణ్ణామలై. తంజావూరులో అతడికి ‘వెన్నెల అరణ్యాలలోకి వేణుగానం వ్యాపించినట్టు’ ఒక ‘విమల తేజోమయ ప్రభాతసంగీతం’ వినిపించింది. ‘కరిమబ్బులు కమ్ముకుని దారితోచని వేళ మెరుపులా వెలుగుని సృష్టించుకోవటమెలానో’ తెలిసిన ఒక స్త్రీమూర్తి కనిపించింది. ‘ఒళ్ళంతా కుతూహలపు బిందువు’ లాగా, ‘సుధారఘునాథన్ వినీల కుంతలాలనుండి జారిపడిన కుసుమశకలంలాగా’ ‘తోటని వసంతం కరుణించినట్టు’ ఆమె అతడి జీవితంలో అడుగిడిరది. కాని అప్పుడే ‘ప్రేమ దేహాలని విదేహం చేస్తుందని’ కూడా అతడికి బోధపడిరది.
ఇప్పుడు అతడి దృష్టి రెండోదారి మీద పడిరది. కాని ‘తంజావూరులో పోగొట్టుకున్న దానిని తిరువణ్ణామలై లో వెతికితే ఏం లాభం?’. అయినా వెతుక్కోడం మానలేదు. చివరికిలా అనుకుంటాడు:
తంజావూరునీ తిరువన్నామలైనీ
కలిపి కుట్టాలని వ్యర్థప్రయత్నం చేస్తూ
నాతో నేనే ద్వేషిస్తూ రమిస్తున్నా
తంజావూరులో పొందినదానిని
అరుణాచలంలో కోల్పోయాను
ఇక్కడితో ఈ కవిత్వం ఆగిపోయి ఉంటే విశేషం లేదు. ఆధునిక రక్తికవిత్వంగానో, విరక్తికవిత్వంగానో మిగిలిపోయి ఉండేది. కాని, తంజావూరూ, తిరువణ్ణామలై రెండూ కలిసిన ‘మార్గశిర’ కవితతో ఈ కవిత ఆధునిక భక్తికవితగా మారింది. ఉత్కృష్టమైన విన్నపంగా మారింది.
ఎక్కడో ఒకచోట
ఒకడుంటాడు
జగదానంద కారకుడు
అతడిని ప్రేమించకుండా ఎలా ఉండగలం
అనే ఎరుక కలగ్గానే, కవి ‘కృష్ణబిలం’ నుంచి బయటపడి, కృష్ణప్రేమికుడయ్యాక, ఇటువంటి వాక్యాలు రాకుండా ఎలా ఉంటాయి? చూడండి:
దూరంగా అనామకంగా ఒంటరిగా ఉన్న ఆ రెల్లుపొద మీద వాలిన చిరుగాలి తరగ ఒకటి ఆ రెల్లుపొద ఒంటరితనాన్ని తన భుజాన ఎత్తుకుని దేవాలయంలోని ఆ నల్లనయ్య మూర్తి ముందు గుమ్మరించింది. అప్పుడా నల్లనయ్య చిరుగాలి తరగచెవిలో ఏమి చెప్పాడో తెలియదు కానీ, ఆ చిరుగాలి తరగ మళ్ళీ రెల్లుపొద దగ్గరకు వచ్చి రెల్లుపొదను కౌగలించుకుంది. ఆ స్పర్శకి నిలువెల్లా ఉప్పొంగిన రెల్లుపొద నిలువెల్లా మయూరబర్హంలాగా విప్పుకుంది.
మార్గశిర ఈ సంపుటిలోని చివరి కవిత, పతాక కవిత. ఈ కవితకి వచ్చేటప్పటికి మనకి మనకాలపు క్షేత్రయ్యగా, మన కాలపు ముద్దుపళనిగా ఈ వంశీకృష్ణుడు సాక్షాత్కరించాడని చెప్పడం అతిశయోక్తి కాదు. క్షేత్రయ్య సరే, ముద్దుపళనిని ఎందుకు గుర్తుచేస్తున్నాను? తెలుగులో కవులకి భగవంతుడు కలలో కనిపించి తనమీద కవిత్వం చెప్పమని అడిగింది నలుగురినే. మొదటిది తిక్కన, ఆయనకి హరిహరనాథుడు కనబడ్డాడు. రెండోది, అనంతామాత్యుడు, ఆయనకి అహోబల నారసింహుడు కలలో కనబడ్డాడు. మూడోది, శ్రీకృష్ణదేవరాయలు, ఆయనకి శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కనిపించాడు. కాని ముద్దుపళనికి స్వయంగా శ్రీకృష్ణుడే కలలో కనిపించి తన మీద కావ్యం రాయమని అడిగాడు.
మరొకవైపు చలంగారున్నారు. తిరువణ్ణామలైలో కూచుని యశోదాగీతాలు పాడుకున్న కవి. అయితే, తంజావూరునూ, తిరువణ్ణామలైనీ కలిపి కుట్టిన మొదటి కవి మాత్రం ఈ వంశీకృష్ణుడే. తెలుగు కవిత్వంలో ఈ సంఘటన ఇలా నిలబడిపోతుంది.
29-1-2025


Excellent introduction, sir…
ఈ కలలు నాకూ ఇష్టం.
ధన్యవాదాలు మానసా!
Good morning sir today your article about tanjavur dreams it’s very nice
Iam also visited in that place, that is a really a nice experience in my life Thank u so much sir from Srinidhi dept of heritage museum employee
ధన్యవాదాలు శ్రీనిధీ!
మంచి పుస్తకానికి చక్కని పరిచయం. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?
వంశీకృష్ణ కి మీ చిరునామా పంపిస్తాను.
గొప్ప విశ్లేషణ పరిచయం మీది. వంశీ గారి కల తంజావూరు ను తిరువన్నామలై ని కలిపి కుట్టడం అని అనడం అద్భుతమైన ఊహ అభినందనలు సర్
ధన్యవాదాలు సార్!