
నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా మొన్న శుక్రవారం ప్రసంగంలో నేను ఫ్రెడరిక్ డగ్లస్ ఆత్మకథ గురించి మాట్లాడేను. ఆ పుస్తకానికి ముక్తవరం పార్థసారథిగారు చేసిన అనువాదాన్ని పీకాక్ క్లాసిక్స్ గాంధి గారు 2011 లో ప్రచురించిన సంగతి కూడా చెప్పాను. ఆ మర్నాడే, విజయ్ జీడిగుంట ఆ పుస్తకం చదవడమే కాక, తన అనుభూతిని తన వాల్ మీద పంచుకున్నారు కూడా. ఆయన ఆ పోస్టుపెట్టిన రోజు ఫిబ్రవరి 14 డగ్లస్ పుట్టినరోజు కూడా కావడం మరింత సంతోషాన్నిచ్చింది. నిన్న, తుమ్మూరి రామ్మోహనరావుగారు కూడా ఆ పుస్తకం చదివి తన స్పందన పంచుకున్నారు. ఆ రెండు స్పందనలూ నా మిత్రులందరి దృష్టికీ రావాలని కోరుకుంటూ ఇక్కడ పంచుకుంటున్నాను.
‘Little Valentine‘
విజయ్ జీడిగుంట
చాలా ఏళ్ల క్రితం చదివాను ‘ఒక యోగి ఆత్మకథ’ అనే పేరుతో తెలుగులోకి అనువదించిన పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ (Autobiography of a Yogi). ఆ పుస్తకం కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్ర మాత్రమే కాదు, భారతీయ ఆధ్యాత్మికతకు, యోగా విజ్ఞానానికి ఒక పరిచయ గ్రంథం అనుకోవచ్చు. ఒక సామాన్య బాలుడైన ముకుంద లాల్ ఘోష్ తన గురువు శ్రీ యుక్తేశ్వర్ గిరి గారి ముఖతః పొందిన శిక్షణతో పరమహంస యోగానంద అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఎలా ఎదిగారన్న సంగతి అద్భుతంగా ఆవిష్కరించిన పుస్తకం అది. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని, అంతర్గత శాంతిని పొందాలనుకునే వారికి ప్రేరణ నిచ్చే విధంగా క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా కథల రూపంలో వివరించిన ఈ పుస్తకాన్ని స్టీవ్ జాబ్స్ వంటి టెక్నలాజికల్ దిగ్గజాలు తమ జీవితకాలం వెంట ఉంచుకునేవారంటే దీని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
ఇంతకీ ఇప్పుడు ఈ పుస్తక ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే నిన్న చదివిన మరొక ఆత్మకథ నన్ను ‘ఒక యోగి ఆత్మకథ’ లాగే కుదిపేసింది. వివరాల్లోకి వెళితే, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ప్రతి శుక్రవారం ఫేస్బుక్ వేదిక గా చేస్తున్న ప్రత్యక్ష ప్రసారాలలో అమెరికా లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలంతా జరుపుకునే నల్లజాతి చరిత్ర మాసోత్సవం ( Black History Month or African-American History Month ) సందర్భంగా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంపైన చేసిన రెండవ ప్రసంగం లో నిన్న, జార్జి మోజెస్ హోర్టాన్, ఫ్రెడరిక్ డగ్లస్, పాల్ లారెన్స్ డన్ బార్ ల గురించి, వారి సాహిత్యం గురించి మాట్లాడారు. అందులో భాగంగా అమెరికాలో బానిసత్వ విముక్తి కోసం పోరాడిన ఫ్రెడరిక్ డగ్లస్ (Frederick Douglass) రచించిన నేరేటివ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ఫ్రెడరిక్ డగ్లస్, ఏన్ అమెరికన్ స్లేవ్’ (Narrative of the Life of Frederick Douglass, an American Slave, 1845) గురించి సవివరంగా విశ్లేషించారు.
బానిసత్వం అనే సామాజిక రుగ్మత ఎంత భయంకరంగా ఉండేదో కళ్లకు కట్టినట్టుగా చూపే ఈ పుస్తకానికి ముక్తవరం పార్థసారథి గారు చేసిన తెలుగు అనువాదం ‘ఒక బానిస ఆత్మకథ’ పేరు తో పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించారని, ఆన్లైన్ లోనూ, బుక్ షాప్స్ లోనూ కూడా దొరుకుతోందని చెప్పారు. కేవలం డబ్బై పేజీల పుస్తకం కాబట్టి ఫ్రెడరిక్ డగ్లస్ తన జీవితంలో అనుభవించిన చిత్రహింసలు, అవమానాలు మరియు చివరికి తను పొందిన స్వేచ్ఛ గురించి రాసుకున్న ఈ నిజజీవిత గాథ తప్పక చదివి మన వంతుగా ఆ గొప్ప వ్యక్తికి చిన్న నివాళి ఇవ్వడం అప్పటి కాలంలో బానిస బతుకుల పట్ల సహానుభూతి ప్రకటించడం అన్నారు. అప్పుడు ఈ పుస్తకం ఎలా సంపాదించాలా అనుకుంటుంటే ప్రసంగం వింటున్న తోటి శ్రోత, ఎఫ్బీ మిత్రురాలు వనజ తాతినేని గారు ఇంటర్నెట్ ఆర్కైవ్ లో ఉన్న పీడీఎఫ్ డౌన్లోడ్ చేసి పంపడం తో వెంటనే చదవడం మొదలుపెట్టాను.
చాలా చోట్ల కళ్ళు తుడుచుకుంటూ చదివిన ఈ పుస్తకం నాకు ఇది ‘ఒక బానిస ఆత్మకథ’ లా కాదు, ఫ్రెడరిక్ డగ్లస్ అనే ఒక కర్మయోగి ఆత్మకథ లా అనిపించింది. బానిసత్వపు చీకటి కోణాలను, బానిస యజమానుల క్రూరత్వం, కుటుంబాలను విడదీయడం మరియు మనుషులను జంతువుల కంటే హీనంగా చూడటం వంటి వాస్తవాలను ఆ రోజుల్లో అంత ధైర్యంగా రాయడం ఎంత సాహసమో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అప్పట్లో బానిసత్వం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి నిస్సందేహంగా ఇది ఒక ప్రాథమిక, ప్రామాణిక గ్రంథం.
బానిసలు చదువుకుంటే యజమానులకు కీడు జరుగుతుందని నమ్మే రోజుల్లో, డగ్లస్ రహస్యంగా అక్షరాలు నేర్చుకున్న విధానం, చదువు నేర్చుకోవడం ద్వారా ఒక మనిషి మానసిక బానిసత్వం నుండి ఎలా విముక్తి పొందవచ్చో వివరించిన తీరు ( How Literacy Leads To Liberty అన్నారు భద్రుడు గారు), అత్యంత క్రూరులైన యాజమానుల వద్ద అనేక భయంకరమైన అడ్డంకులను దాటిన వైనం, తనను హింసించే ఒక యజమానిపై డగ్లస్ ఎదురు తిరిగి పోరాడిన ఘట్టం ఎంతటి పాషాణ హృదయాలనైనా కరిగించి తీరతాయి.
ప్రాణాలకు తెగించి అమెరికా లో బానిసత్వ చట్టం లేని ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయి స్వేచ్ఛా జీవితం ప్రారంభించే వరకు తను పడ్డ బాధల్ని అక్షరీకరించిన ఫ్రెడరిక్ డగ్లస్ ఆత్మకథ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంకల్ప బలంతో, పట్టుదలతో ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపిస్తుంది. నాకు ఈ ఆత్మకథ చదువుతున్నంత సేపు బోయి భీమన్న గారు రాసిన “పాలేరు” నాటకం గుర్తొస్తూనే ఉంది. ఆ నాటకంలో కూడా ఒక వ్యక్తి ‘బానిసత్వం’ (వెట్టి చాకిరి) నుండి విద్యావంతుడిగా ఎదిగిన క్రమాన్ని అద్భుతంగా వివరిస్తుంది. అయితే అది ఒక సృష్టించబడిన పాత్ర అయితే ఇక్కడ నిజ జీవితం.
ఈ పుస్తకం చదివాకా ఎవరికైనా ఫ్రెడరిక్ డగ్లస్ గురించి మరింతగా తెలుసుకోవాలనిపించి తీరుతుంది. ఈ పుస్తకానికి కొనసాగింపుగా ఫ్రెడరిక్ డగ్లస్ మరో రెండు పుస్తకాలు ‘ మై బాండేజ్ అండ్ మై ఫ్రీడమ్ ‘ (1855). ‘ లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ ఫ్రెడరిక్ డగ్లస్’ (1881) రాసారు. సమయం దొరికినప్పుడు తప్పక చదవాలనుకుంటున్నాను.
ఇంతకీ ఫ్రెడరిక్ డగ్లస్ అసలు పేరు అది కానే కాదు. ఫ్రెడరిక్ డగ్లస్ తన పేరును మార్చుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన సంగతి ఉంది. మేరీల్యాండ్‌లో బానిసగా జన్మించినప్పుడు అతనికి ఫ్రెడరిక్ ఆగస్టస్ వాషింగ్టన్ బెయిలీ (Frederick Augustus Washington Bailey) అని తన తల్లి పేరు పెట్టింది. అప్పట్లో బానిసలకు తండ్రి పేరు ఉండేది కాదు, కేవలం యజమాని ఇచ్చిన గుర్తింపు మాత్రమే ఉండేది..1838లో డగ్లస్ బానిసత్వం నుండి తప్పించుకుని మేరీల్యాండ్ నుండి న్యూయార్క్‌కు పారిపోయాకా, తన పాత పేరుతో ఉంటే యజమానులు తనను సులభంగా కనిపెట్టి తిరిగి బానిసత్వంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉందని తనకి ఆశ్రయమిచ్చి ఆదరించిన నాథన్ జాన్సన్ గారి ఇంటిపేరు ( Surname) తీసుకుని ఫ్రెడరిక్ జాన్సన్ అని మార్చుకున్నాడు. అయితే, అక్కడ ‘జాన్సన్’ అనే పేరు గల వ్యక్తులు చాలామంది ఉండటంతో నాథన్ జాన్సన్ మరో పేరు పెట్టుకుంటే మంచిదని అప్పుడు తాను చదువుతున్న ప్రముఖ ఆంగ్ల కవి సర్ వాల్టర్ స్కాట్ ( Sir Walter Scott ) రాసిన ‘ది లేడీ ఆఫ్ ది లేక్ (The Lady of the Lake) అనే పద్యంలో ప్రధాన పాత్ర పేరు ‘డగ్లస్’ (Douglas) పెట్టుకోమని సూచించారు.
పేరు మాత్రమే కాదు అప్పట్లో బానిసలకు వాళ్ళు పుట్టిన తేదీ కూడా తెలిసే అవకాశముండేది కాదు. పుస్తకం ప్రారంభిస్తూ ఫ్రెడరిక్ డగ్లస్ ఇలా అంటారు. “తమ వయస్సు గురించి గుర్రాలకు ఎంత తెలుసో చాలా మంది బానిసలకు కూడా అంతే తెలుసు.” ఆయన జీవించినంత కాలం 1817 ఫిబ్రవరి నెలలో పుట్టానని అనుకునే వారు. కాని ఆయన మరణించిన చాలా కాలం తర్వాత, పరిశోధకులు బానిసలు, వారి యజమానుల పాత రికార్డులను పరిశీలించి ఆయన ఫిబ్రవరి, 1818లో జన్మించారని ధృవీకరించారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఫ్రెడరిక్ డగ్లస్ జయంతిని ఈ రోజున అంటే ఫిబ్రవరి 14 (Valentine’s Day) జరుపుకోడానికి మరొక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఆయన చిన్నతనంలో తన తల్లి (హ్యారియెట్ బెయిలీ) తనను చూసేందుకు రాత్రిపూట మైళ్ల దూరం నడిచి వచ్చేదని, అలా ఆమె తనను ఎప్పుడు కలిసినా “Little Valentine” అని ప్రేమగా పిలిచేదని, ఆమె జ్ఞాపకార్థం ఫిబ్రవరి 14 తన జన్మదినంగా జరుపుకుంటున్నాని చెప్పారు.
అందుకని ఫ్రెడరిక్ డగ్లస్ 208వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ..
— feeling inspired.
14-2-2026
ఒక ఉత్తమ పుస్తకం చదివిన అనుభూతి
తుమ్మూరి రామ్మోహన రావు
మొన్నటి శుక్రవారం ప్రసంగంలో వాడ్రేవు చినవీరభద్రుడు గారు విద్యావంతులు అందరూ ఫ్రెడరిక్ డగ్లస్ ఒక బానిస ఆత్మకథ తప్పక చదివి తీరాలని నొక్కి నొక్కి చెప్పగానే ఆ పుస్తకం ఎలా లభిస్తుందన్న ఆలోచనలో ఉండిపోయాను. ఇంతలో జీడిగుంట విజయకుమార్ గారు పిడిఎఫ్ చదివానని దాని గురించి వారి స్పందన తెలియజేసారు.
వెంటనే గూగుల్ లో ఎందుకు ప్రయత్నించకూడదు అని ప్రయత్నిస్తే సులభంగానే ముక్తవరం పార్థసారథి గారి అనువాదం ఒక బానిస ఆత్మకథ కనిపించింది. వెంటనే చదవటం మొదలు పెట్టాను. విడతలు విడతలుగా ఈ రోజు ఉదయం వరకు మొత్తం చదివాను. అప్పుడర్థమైంది వీరభద్రుడు గారు ఎందుకు అంతగా ప్రతివారు చదవాలని నొక్కిచెప్పారో.
1845 రాసిన ఆయన ఆత్మకథ ఎంతటి వ్యథాయథార్థ కథనో చదువుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. కేవలం 180 సంవత్సరాల క్రితం మన నాగరికత ఎంత హైన్య స్థితిలో ఉందో ఆలోచిస్తే మానవ జాతి మీదనే వెగటు కలుగుతుంది. కరడుగట్టిన మనస్తత్త్వపు యజమానులు ఇంటికి అవసరమైన వస్తువులు కొన్నట్టు బానిసలను కొనడం అనే విషయం చదువుతుంటే ఎంత బాధ కలిగిందో చెప్పడానికి మాటలు చాలవు. సరే పని కోసం కొనుక్కున్నా వస్తువులను శుభ్రంగా ఉంచుకున్నట్టు బానిసలను మంచిగా చూసుకుంటే కొంత గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. పశువుల కంటే హీనంగా కొరడాలతో కొడుతూ పనితీసుకోవడమంత దారుణం మరొకటి కనిపించదు. డగ్లస్ తన బానిసత్వపు అనుభవాలను వివరిస్తుంటే ఆ కొరడా దెబ్బలు మనమే తింటున్నంతగా ఒళ్లు జలదరిస్తుంది. అసలు వాళ్లెందుకు తిరగబడకుండా ఉన్నారనే స్పృహ కలుగుతుంది.
కానీ, వెంటనే అంతకంటే పెద్ద కొరడా దెబ్బ మన ఆత్మ మనమీద వేస్తుంది. నువ్వు ప్రస్తుత సమాజంలో అనేక రకాల మానసిక బానిసత్వాలు దాడి చేస్తుంటే తిరగబడుతున్నావా అని. నిజమే ఈ నవల ను వివరించడం పెద్ద విషయం కాదు. కానీ ఆ నవల కలిగించే మానసిక సంచలనం ఇప్పుడవసరం. నీగ్రోలను లేదా నల్లజాతి వాళ్లను పశువుల కంటే హీనంగా వాడుకుని మతం పేరు చెప్పుకుని మహా దారుణాలు చేసిన కుహనా వ్యవస్థ, అనేక మారు రూపాలతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అని సూచించడానికే వీరభద్రుడు గారు ఈ పుస్తకం చదివి తీరాలన్నారు. అవును ఈ పుస్తకం చదివిన వారు తప్పక చదువక ముందు, చదివిన తరువాత అనే మానసికంగా మార్పును గ్రహిస్తారు. బానిసత్వం ఒక్కరంగానికే చెందింది కాదని అవగాహనకు వస్తారు.
ఇంకా చాలా రాయాలని ఉంది కానీ దాని గురించి రాస్తే చదవకుండా ఉండే అవకాశం ఉంది. పుస్తకంలో కొసమెరుపులు అనుబంధం మరియు ఎడిటర్ పీకాక్ క్లాసిక్ ముక్తాయింపు మీకు మీరుగా చదువుకోండి. నన్నడిగితే చదివిన వాళ్లు దాన్ని గుప్తంగా ఉంచితే చదివే వారికి కొంత థ్రిల్ మిగిల్చిన వాళ్లమవుతాం. వీరభద్రుడుగారికి మనః పూర్వక కృతజ్ఞతలు.
15-2-2026


Thank you, Sir for introducing African American Literature to us especially in the context of Black History Month.
What wonderful reflections by Vijay garu and Rammohan Rao garu!!
I am yet to listen to the talks completely in this series, but feeling inspired to read ‘ఒక బానిస ఆత్మకథ’ as well
ధన్యవాదాలు మాధవీ!
Thanks Madhavi garu
ధన్యవాదాలు సర్ .
ధన్యవాదాలు సార్!
మీ కుటీరం లో మరో సారి ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు భద్రుడు గారు.
మాధవి గారు, నా పోస్టుకు మీరిచ్చిన సహృదయ స్పందనకు కూడా కృతజ్ఞతలు.
ధన్యవాదాలు సార్!