రాజమండ్రి డైరీ, 1986

ఒకప్పుడు రాజమండ్రిలో సాహితీవేదిక అనే సాహితీబృందం ఉండేది. ఆ సంస్థ 1980 డిసెంబరు 25 న ఏర్పాటయింది. ఆ రోజుని గుర్తుపెట్టుకుని గతమూడేళ్ళుగా అప్పటి మిత్రులు డిసెంబరు 25 నాడు రాజమండ్రిలో కలుస్తూ ఉన్నారు. ఈ ఏడాది కూడా గౌతమీ గ్రంథాలయంలో మళ్ళా కలుసుకున్నారు. ఆ సందర్భంగా నా పుస్తకాలు రెండు ఆవిష్కరణకు నోచుకున్నాయి.

ఒకటి, రాజమండ్రి డైరీ, 1986 (2022). ఈ పుస్తకాన్ని మల్లాప్రగడ రామారావుగారు వారి శ్రీమతి బాలాత్రిపురసుందరిగారు ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని మా మిత్రుడు, స్వర్గస్థుడు సమాచారం సుబ్రహ్మణ్యంకి అంకితమిచ్చాను. అతని తరఫున అతని సోదరుడు, మిత్రుడు రవి మొదటి కాపీ స్వీకరించాడు. రెండో పుస్తకం, Song of My Village, Selected Poems, 1982-92. ఈ పుస్తకాన్ని ఛీఫ్ ఇన్ కంటాక్స్ కమిషనరుగా పనిచేసి పదవీవిరమణచేసిన మా మిత్రులు మేడిశెట్టి తిరుమలకుమార్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని మా మిత్రుడు, స్వర్గస్థుడు మహేశ్ కి అంకితమిచ్చాను. అతని తరఫున ఆ పుస్తకాన్ని మల్లాప్రగడ దంపతులు స్వీకరించారు.

వాటిల్లో రాజమండ్రి డైరీ మీద ముక్కామల చక్రధర్ ఇవాళ విశాలాంధ్రలో తన ‘చక్రవాకం’ కాలంలో సమీక్షించారు. ఆ సమీక్షనిక్కడ మీతో పంచుకుంటున్నాను.


భద్రుడి కవిత్వ డైరీ
__

ఇది వాడ్రేవు చినవీరభద్రుడు సరిగ్గా 360 రోజుల తక్కువగా 39 సంవత్సరాల క్రితం అంటే.. 31-12-1986 సంవత్సరంలో తన డైరీలో రాసుకున్న ఆ ఏడాది చివరి మాటలు. ఇన్ని దశాబ్దాలలో చినవీరభద్రుడికి ఆ hopefulness తన వెంటే ఉంది. శ్రీ శ్రీ అన్నాడు కదా.. ‘వస్తే రానీ.. కష్టాల్‌.. నష్టాల్‌… కోపాల్‌.. తాపాల్‌… శాపాల్‌..’ అని. ఈ వీరభద్రుడు కూడా అలాగే అనుకుని ఉండి తీరాలి. డిసెంబర్‌లో చివరి రోజున రాసుకున్న డైరీకి రెండు నెలల ముందు అక్టోబర్‌ మూడో తేదిన రాసిన డైరీలో ఇలా అన్నాడు వీరభద్రుడు. ‘శ్రీశ్రీ కవి. అంతకన్నా గొప్ప మనిషి’ ఇది యాదృచ్ఛికం కావచ్చు. కానీ, చినవీరభద్రుడ్ని కవిగానూ, మనిషిగానూ కూడా నిలబెట్టిన రోజులు అవి.

ఆ రోజులు అలా అలా రాజమండ్రి మీంచి పారుతూ శ్రీశైలం అడవుల్లోనూ, పార్వతీపురం కొండ కోనల్లోనూ, పాడేరు అమాయకపు గిరిజనుల్లోనూ, మహా నగరం హైదరాబాద్‌లోనూ, కొత్త రాజధాని అమరావతిలోనూ తేలియాడేలా చేసాయి అనిపించింది ఈ డైరీ చదివాక.

ఇతరుల డైరీ చదవకూడదని మా నాన్న నా చాలా చిన్నప్పుడు చెప్పారు. కానీ, చినవీరభద్రుడు రాజమండ్రి డైరీ 1986… అంటూ ప్రపంచం మీదకి వదిలాక ఎలా చదవకుండా ఉంటాం. పైగా ఈ రాజమండ్రీ డైరీకి ట్యాగ్‌ లైన్‌గా ‘ఆ ఊరు ఆ యేరు ఆ పద్యాలు’ అని స్పష్టంగా చెప్పిన తర్వాత చదవకుండా ఎలా ఉండగలం?

ఈ కొంగొత్త పొత్తం ఈ మధ్యనే అంటే మరీ మూడు రోజుల క్రితమే విడుదలైంది. ఈ పుస్తకం విడుదల సమయంలో నేను ఈ డైరీ గురించి మాట్లాడాల్సి ఉంది. కానీ… వ్యక్తిగత, దుఖభాజన కారణాల వల్ల నేను వెళ్లలేకపోయాను. హాజరు కాలేకపోవడం శారీరికం. ఆ డైరీలో అక్షరాలు మన చుట్టూనే పరిభ్రమించడం మానసికం.

వీరభద్రుడి ఈ డైరీ నిండా ఒకానొక సంక్షోభ, సందిగ్ధ, సంశయ, సంభ్రమాశ్చర్య, సమ్మోహిత వాక్యాలే నిండి ఉన్నాయి. ఇది చినవీరభద్రుడిలోని యవ్వన కాంతితో పాటు శారీరిక అలజడిని కూడా మనకి ఎరుక పరుస్తుంది. బహుశా ఏ వయసు వారైనా ఆ వయసులో రాసుకునే, రాసుకోవాల్సిన, తెలియాల్సిన, తెలియజెప్పాల్సిన ఘటనలే ఉన్నాయి. ఈ డైరీ రాసిన సమయం భధ్రుడికి తన జీవితం మొత్తంలోనే ఓ నిత్యానంద, క్షణికావేశ, కోపోద్రిక్త, ఆగ్రహ, అనుభవాల పుటలుగా నాకనిపించాయి.

ఈ డైరీతో పాటు కొన్ని అనుబంధాలను కూడా చేర్చిన వీరభద్రుడు ఈ రెంటికి మధ్య ఓ లింక్‌ కూడా ఉందని గ్రహింపునిచ్చాడు. ‘తూర్పు గోదావరి సాహిత్య చరిత్రలో సాహితీ వేదిక’ వ్యాసంలో తన ప్రాణ మిత్రుడు కవులూరి గోపీచంద్ గురించి చెబుతూ ‘1987 లో రాయగడలో ఓ పేపరు మిల్లులో కెమిస్టుగా చేరాడు. అక్కడుండగానే కాఫ్కా సమగ్ర సాహిత్యాన్ని చదివాడు. తండ్రి ప్రభావం వల్ల నాసిక్తుడిగా పెరిగిన గోపీచంద్‌కు రాయగడ వెళ్లినప్పటి నుంచి ఆధ్యాత్మికానుభావాలు కలగడం మొదలైంది. మరి ఏ అనుభవాల ప్రభావమో తెలియదుగానీ, ఒక రోజు రైలు ప్రయాణంలో విజయవాడలో తన భార్యనీ, కుమారుడ్ని వదిలి వెళ్లిపోయిన వాడు, ఇప్పటి దాకా ఎక్కడున్నాడో తెలియదు’ అని రాసారు.

వీరభద్రుడి డైరీలో తన మిత్రుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారి కవులూరి గోపీచంద్‌ పేజీలో ఏదో ఒక మూల తారసపడతాడు. 1986 సంవత్సరం సెప్టెంబర్‌ 18 వ తేదిన రాసిన డైరీలో ఈ మాటలున్నాయి. ‘మనిషి స్వధర్మమే అతడ్ని తన వాళ్ల నుంచి isolate చేస్తుంది అన్నాడు గోపీచంద్‌. రాత్రి చాలాసేపు వెన్నెల్లో అతని ఇంటి దగ్గర కబుర్లు’. నిండు వెన్నెలలో ఇలా గోపీచంద్‌ చెప్పిన మాటలు కొన్ని నెలలకే అతను తన వాళ్లని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడంటే అతడు ఎంత isolate అయ్యాడో తెలియజేస్తాయి. ఈ గోపీచంద్‌ గురించే చాలా కాలం క్రితం వీరభద్రుడు రాసిన గోపిచంద్ కి రెండు పద్యాలు అన్న కవితలో

ఈ పద్యానికి సమాధానం ఈ డైరీలోని ప్రతి పేజీలోనూ కనపడుతుంది. గోపీచంద్‌ మాత్రమే కాదు… వీరభద్రుడు కూడా…

ఏం చేసినా ఇంత శ్రద్ధగానే ఉంటుంది
ఏం చేయకపోయినా ఇంత శ్రద్ధగానే ఉంటుంది

ముక్కామల చక్రధర్‌, సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

28-12-2025

12 Replies to “రాజమండ్రి డైరీ, 1986”

  1. చాలా బాగుంది సర్.. పుస్తకం మీద ఇష్టం, పుస్తకం ప్రత్యేకత రెండూ ఇంత తక్కువ నిడివిలోనూ స్పష్టంగా రాశారు. వారికి థాంక్యూ. ❤️

  2. రాజముండ్రి డైరీ 1996 రాసినప్పుడు రచయిత ఎదుర్కొన్న సామాజిక, ఆర్ధిక పరిస్థితులకు తోడు ఉద్యోగ స్థితిగతులు కారణం గా నిలుస్తాయి. తన ప్రతిభకు సరిపోని కుర్చీలో ఇరుకుగా కూర్చున్నప్పుడు ఆయన కార్యాలయాన్ని నేనుకూడా సందర్శించాను. ఫైళ్లు కారణంగా ఆ చాలీ చాలని టేబుల్ ముందు ఒక పెద్ద హాలు లాంటి చోట పది మంది సహోద్యోగులతో కూర్చుని శ్రద్ధగా పనిచేసుకోవడాన్ని నేను, మల్లు ప్రత్యక్షంగా చూసిన గుర్తు. తనని కలిసిన దాదాపు ప్రతి సారి ఆయన సాహితీ మిత్రుడు “గోపీచంద్” ప్రస్తావన తప్పనిసరిగా చేసేవారు. .

    మందులు స్టాక్ తెచ్చుకునేందుకు రాజముండ్రి హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్లడం మిత్రుడు “మల్లు” కు అలవాటు. ఒక్కోసారి నన్నుకూడా తీసుకెళ్ళేవాడు. రెండు మూడు సందర్భాల్లో చినవీరభద్రుడు దగ్గర గడిపిన గుర్తు. ఆ రోజుల స్నేహపూరిత వాతావరణాన్ని, గోదారి గట్టున కూర్చుని మల్లు, చినవీరభద్రుల మాటల్ని వింటూ గడిపిన రోజులు నాకు గుర్తు.

    అనంతర కాలంలో నేను కూడా “డైరీ” రాయడం అలవాటు చేసుకున్నాను. అయితే, ఆ పనిని సమర్ధవంతంగా చివరి వరకు కొనసాగించలేక పోయాను. అనేక కారణాల్లో, ‘వివాహం’ కూడా ఒకటి.

    38 వ హైదరాబాద్ పుస్తక మహోత్సవం లో డిసెంబర్ 26 న ఆయన ద్వారా ఈ పుస్తకాన్ని స్వీకరించాను. మిత్రులు “చక్రధర్” విశ్లేషణ రచయిత అంతరంగ ఆవిష్కరణ!.

  3. రాజమండ్రి డైరీలోని మరికొన్ని పేజీలు చదవాలనిపిస్తోంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading