
దేశభాషలలో సాంకేతిక విద్య: చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు
కిందటి నెలలో హైదరాబాదులోని చైతన్యభారతి ఇన్స్టిట్యూటు ఆఫ్ టెక్నాలజీ వారు ఒక సదస్సు నిర్వహించారు. ఇంజనీరింగు విద్యలో ఉద్భవిస్తున్న నూతన ధోరణులపైన జరిగిన ఒక ప్రాంతీయ సదస్సు అది. ఎ.ఐ.సి.టి.ఇ వారి ‘వాణి’ కార్యక్రమం కింద జరిగిన ఆ సదస్సుకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సందర్బంగా, సదస్సులో పాల్గొన్న ఇంజనీరింగు నిపుణులు రాసిన 34 వ్యాసాల సంపుటాన్ని ఆవిష్కరించాను. ప్రారంభసదస్సు తర్వాత, తెలుగులో సాంకేతిక శాస్త్రాల బోధన గురించి ప్రత్యేక ప్రసంగం కూడా చేసాను.
జాతీయ విద్యావిధానం: దేశభాషల్లో ఉన్నత విద్య
‘వాణి’ అంటే ‘వైబ్రంట్ అడ్వొకసి ఫర్ అడ్వాన్సుమెంటు అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్’. ఈ కార్యక్రమం జాతీయ విద్యావిధానం 2020 లో భాగంగా అమలు జరుగుతున్నది. జాతీయ విద్యావిధానం ఉన్నతవిద్యారంగంలో చేపట్టిన సంస్కరణల్లో ప్రధానమైనది దేశభాషల్లో సాంకేతిక శాస్త్రాల బోధన. అందుకు గాను, ఉన్నత విద్యాసంస్థల్లో దేశభాషల్ని బోధనామాధ్యమాలుగా పెంపొదించడం, అలా చేపట్టడానికి ముందుకొచ్చే సంస్థల్ని ప్రోత్సహించడం, సాంకేతికశాస్త్రాల పాఠ్యగ్రంథాల్ని దేశభాషల్లోకి అనువదించడం, ‘అనువాదిని’ యాప్ ద్వారా సాంకేతిక పరిజ్ఞాన్న్ని అనువదించే ఏర్పాటు, అలా అనువదించిన వనరుల్ని ‘ఈ-కుంభ్’ ప్లాట్ ఫారం ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ప్రవేశ పరీక్షలు దేశభాషల్లో నిర్వహించడం, పరిశోధనని కూడా పెద్ద ఎత్తున దేశభాషల్లో చేపట్టడం, ఐ.ఐ.టి, ఎన్.ఐ.టి ల్లో దేశభాషా మాధ్యమాల్ని బలోపేతం చెయ్యడానికి ముమ్మరమైన ఏర్పాట్లు మొదలైనవి ఉన్నాయి. ‘వాణి’ కూడా ఇందులో భాగమే. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ‘వాణి-2.0’ లో భాగంగా దేశభాషల్లో సాంకేతికవిద్యను అనుసంధానం చేయడంకోసం చేపడుతున్న ప్రయత్నాల్లో ప్రాంతీయ గోష్ఠులు నిర్వహించడం కూడా ఒకటి.
దేశభాషల్లో ఆధునిక విద్య: చరిత్ర
భారతీయ దేశభాషల్లో ఆధునిక విద్య చేపట్టడం ఎలా అన్నదాని మీద పందొమ్మిదో శతాబ్దం నుంచీ కూడా వాడీ, వేడీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 1823 లో ఈస్టు ఇండియా కంపెనీ సంస్కృతం బోధించడానికి గ్రాంటు ప్రకటించినప్పుడు దాన్ని ఖండిస్తూ రాజారామ్మోహన రాయి అప్పటి గవర్నరు జనరలుకి ఒక ఉత్తరం రాసాడు. సంస్కృతాన్నీ, పారశీకాన్నీ కొత్తగా ప్రోత్సహించే బదులు ఇంగ్లాండులోలాగా ఇక్కడి కళాశాలల్లో కూడా సైన్సు, గణితం బోధించడానికి చర్యలు చేపట్టమని విజ్ఞప్తి చేసాడు. దాంతో అప్పటి బెంగాల్లో విద్యావంతులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ప్రాచీన భాషల్నీ, ప్రాచీన సాహిత్యాన్నీ బోధించవలసిన అవసరం గురించి వాదించారు. వారిని ‘ఓరియెంటలిస్టులు’ అని అన్నారు. మరొక వర్గం వారు ఇంగ్లిషు మాధ్యమం ద్వారా సైన్సు, గణితం బోధించడానికి పెద్దపీట వేసారు. వారిని ‘ఆంగ్లిసిస్టులు’అని అన్నారు. ఈ రెండు వర్గాలమధ్యా జరిగిన వాదోపవాదాల్లో ఎటువైపు మొగ్గుతీసుకోవాలో కంపెనీ పదేళ్ళకు పైగా ఎటూ తేల్చుకోలేకపోయింది. చివరికి మెకాలే చూపించిన పరిష్కారం ప్రకారం, ఇంగ్లిషు ఎడ్యుకేషన్ యాక్టు, 1835 ద్వారా , ఉన్నతవిద్యారంగంలో ఇంగ్లిషుని బోధనామాధ్యమంగా నిర్ణయించింది.
పంతొమ్మిదో శతాబ్దంలో ఓరియెంటలిస్టులు, ఆంగ్లిసిస్టులుగా ఉన్న వర్గాలే ఇప్పుడు ఛాందసవాదులు (ఫండమెంటలిస్టులు), ఉదారవాదులు (లిబరల్సు) గా పరిణమించారు. ఆ రెండు వర్గాలూ కూడా మెకాలేని విమర్శిస్తుండటం మనం చూస్తున్నాం. అందుకు కారణం వారికి పందొమ్మిదో శతాబ్దంలో నడిచిన వివాదం గురించీ, దానికి మెకాలే చూపించిన మధ్యేమార్గం గురించి లోతుగా తెలియకపోవడమే.
మెకాలే ఏమి ప్రతిపాదించాడు?
ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న భారతీయ భూభాగంలో కంపెనీ నెలకొల్పిన ఉన్నత విద్యాసంస్థల్లో ఇంగ్లిషుని తప్పనిసరిగా బోధనాభాషగా చేపట్టాలి. తద్వారా ఒక తరం ఇంగ్లిషు మాధ్యమం ద్వారా యూరోపుకి సమానంగా సైన్సులోనూ, గణితంలోనూ అత్యంత ప్రావీణ్యం కలిగిన విద్యావంతులుగా రూపొందాలి. వారు ఆ విధంగా విద్యావంతులైన తర్వాత, తిరిగి వారు, తాము నేర్చుకున్నదాన్ని, తమ మాతృభాషల్లో తమ తోటి ప్రజలకు అందించాలి-ఇవీ స్థూలంగా మెకాలే ప్రతిపాదనలు. సాధారణంగా మెకాలేని విమర్శించేవారు ఇందులో ఆయన రాసినదానిలో మొదటివాక్యాల్ని మాత్రమే పేర్కొంటూ ఉంటారు. కాని, అలా పాశ్చాత్యవిద్యలో విద్యావంతులైనవారు, తిరిగి తాము నేర్చుకున్నదాన్ని, తమ దేశభాషల్లో అంచెలంచెలుగా అందించాలని చెప్పాడన్న మాట చెప్పరు.
కాని ఈస్టిండియా కంపెనీ, తర్వాత రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలానే పట్టించుకున్నాయి. ముఖ్యంగా 1854 లో వెలువడ్డ వుడ్స్ డిస్పాచి ని ‘భారతీయ విద్యకు మాగ్నాకార్టా’ గా భావిస్తారు. చాలామందికి తెలియనిదేమిటంటే, ఆ ఉత్తర్వులు రాసింది అప్పట్లో ఈస్టిండియా కంపెనీలో పనిచేస్తున్న ప్రసిద్ధ తత్త్వవేత్త జాన్ స్టువర్ట్ మిల్. వుడ్స్ డిస్పాచి ఏమందంటే, ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషల్లోనూ, ఉన్నతపాఠశాలల్లో మాతృభాషల్లోనూ, ఇంగ్లిషులోనూ రెండింటిలోనూ, ఉన్నత విద్యలో ఇంగ్లిషులోనూ విద్యాబోధన జరగాలని. ఈ మూడు స్థాయిల్లోనూ మాతృభాషల మధ్యా, ఇంగ్లిషు మధ్యా అనుసంధానం సక్రమంగా జరగడానికి ఇంగ్లిషువిద్యావంతులైన భారతీయులు తిరిగి తాము నేర్చుకున్నదాన్ని మాతృభాషల్లో వ్యాప్తి చెయ్యవలసి ఉంటుంది. కాని మెకాలే మినిటు వెలువడ్డ దాదాపు యాభై ఏళ్ళ తరువాత కూడా అటువంటి ప్రయత్నాలేమీ జరగడం లేదని విలియం హంటరు నేతృత్వంలోని కమిషను 1882 లో గుర్తించింది.
లార్డ్ కర్జన్ వైస్ రాయిగా బాధ్యతలు స్వీకరించాక, 1901 లో సిమ్లాలో ఒక సదస్సు నిర్వహించాడు. అప్పటికి కూడా, అంటే, మెకాలే విద్యావిధానం అమల్లోకి వచ్చి ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడా, దేశభాషల్లో ఆధునిక విద్యాబోధన ఏ మాత్రం ముందుకు కదల్లేదని గమనించాడు. అందుకని దేశభాషల్లో విద్యాబోధనని బలోపేతం చెయ్యడానికి కర్జన్ చాలా సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
దేశభాషల్లో ఆధునిక విద్య: దేశీయమేధావుల వైఖరి
కాని భారతదేశంలో ఆధునిక విద్య గురించి రూటుమాపు నిర్దేశిస్తున్నపుడు మెకాలే అత్యంత కీలకమైన విషయంలోనే పొరపడ్డాడని చెప్పక తప్పదు. ఇంగ్లిషు చదువుకోవడం ద్వారా ఆధునిక విద్యలో ప్రావీణ్యం సంపాదించిన దేశీయమేధావులు తిరిగి తమ భాషల్లో ఆధునిక విజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారని అనుకోవడమే ఆ పొరపాటు. 1835 నుంచి ఇప్పటిదాకా కూడా ఇంగ్లిషు మాధ్యమంలో ఆధునిక విద్యావకాశాల్నీ, తద్వారా ఉద్యోగావకాశాల్నీ పొందిన భారతీయులు అత్యధిక సంఖ్యాకులు తిరిగి తమ పిల్లలకి ఆ చదువు చెప్పించడం మీదా, వారికి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించిపెట్టడం మీదా చూపించిన శ్రద్ధ, తోటి భారతీయులకు ఆ విద్యని అందించడం మీద చూపించనేలేదు. పైగా, అటువంటి ప్రయత్నాలు ఎవరేనా చేపడితే, వారంతా సంఘటితపడి, అటువంటి ప్రయత్నాల్ని ఏ విధంగా నీరు కార్చారో, మనకి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వపు కాంపొజిషన్ కమిటీ నివేదికా, దానిపైన గురజాడ ప్రకటించిన ‘అసమ్మతి పత్రం’ (1913-14) చదివితే అర్ధమవుతుంది.
బోధనా మాధ్యమం మారితే సరిపోదు
ఈస్టిండియా కంపెనీ, ఆ తర్వాత బ్రిటిషు ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు విద్య, ఇంగ్లిషు మాధ్యమం, మరొకవైపు, నూటయాభై ఏళ్ళుగా వాటివల్ల లబ్ధి పొందిన భారతీయులు తమ మాతృభాషల పట్ల చూపిస్తూ వచ్చిన నిర్లక్ష్యం ఈరోజు అత్యధిక సంఖ్యాకులైన ప్రజలు ఇంగ్లిషును బోధనామాధ్యమంగా కోరుకోడానికి దారితీసాయి. ఇప్పుడు మళ్ళా విద్యావేత్తలు రెండు శిబిరాలుగా- ఇంగ్లిషు మాత్రమే బోధనాభాష కావాలని వాదించేవారు, కాదు, మాతృభాషల్లోనే బోధన చేపట్టాలని వాదించేవారుగ- వివాదాన్ని కొనసాగిస్తున్నారు. కాని ఈ రెండు వర్గాలూ విస్మరిస్తున్నదేమిటంటే, ఇంగ్లిషును బోధనామాధ్యమగా స్వీకరించినమాత్రాన, ఎకాఎకి ఆధునిక విద్య సాధ్యం కాదనీ, అలాగే తెలుగులోనో, దేశభాషల్లోనో ఆధునిక విద్యకి సంబంధించిన వనరుల్ని సృష్టించుకోకుండా, కేవలం మాతృ భాషల్ని బోధనామాధ్యమాలుగా కొనసాగించినంత మాత్రాన కూడా ఏమీ ఒరగదనీ. నిజానికి బోధనాభాషని ఒక సెంటిమెంటుకి సంబంధించిన అంశంగా, భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా చూడటంలోనే వారి సంకుచిత దృష్టి తేటతెల్లమవుతోంది.
ఆధునిక విద్య నిరంతర ఉద్యమం కావాలి
ఆధునిక విద్య ఒక రెడీమేడ్ సరుకు కాదు. దాన్ని టెక్స్టుబుక్కులరూపంలోనో, క్వశ్చన్ బాంక్సురూపంలోనో తయారుచేసి, ప్యాకేజీ చేసి, అంగడిసరుకులాగా అమ్మేది కాదు. అది నిరంతర ఉద్యమం. అలాకాకపోతే, సైన్సులోనూ, గణితంలోనూ మౌలిక పరిశోధన జరగదు. ఇప్పుడు ఇంగ్లిషు మీడియం ద్వారా చదువుకుంటున్న అత్యధిక సంఖ్యాకులైన భారతీయ విద్యార్థులు చివరికి చౌకధరలకి సేవలు అందించే టెక్నో-కూలీలుగా మారడానికీ, వారిలోంచి ఒక్కరు కూడా నోబెలు పురస్కారం పొందగలిగిన సైంటిస్టు కాకపోడానికీ మూలం ఇక్కడే ఉంది. ఆధునిక విద్య అనుదినం, అనుక్షణం అభివృద్ధి చెందవలసి ఉంటుంది. యూరోపులోనూ, అమెరికాలోనూ, జపానులోనూ సైన్సు అభివృద్ధి చెందిందంటే అది ఆయా జాతులు అహర్నిశలు చేపట్టిన ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యపడిందని మనం మర్చిపోకూడదు. ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు పార్టీ రాజకీయాలుగా వేదికలుగా మారుతున్న ఈ కాలంలో, ఇప్పుడొక ప్రైవేటు ఇంజనీరింగు సంస్థ ఈ విషయం మీద ఇటువంటి ఒక గోష్ఠి నిర్వహించడం, అందుకనే, నాకెంతో సంతోషం కలిగించింది.
తెలుగు ప్రభ పత్రిక, 19-12-2025


చాలా చక్కని వివరణాత్మక వ్యాసం. ఇప్పటికీ పాఠం చెప్పామనిపించుకునే బోధనా వ్యవస్థ కొనసాగుతున్నది. అర్థించని విద్యార్థులకు అర్థం కోసమే పని చేసే ఉపాధ్యాయులు బోధించే వ్యవస్థ , నాకు ఇష్టం లేక పోయినా విధిలేక పని చేసిన విద్యావ్యవస్థలో నేను గమనించిన విషయం . పాఠ్యాంశాల దగ్గరనుండి పాఠ్యప్రణాళికలు , పాఠశాల వ్యవస్థలు మొక్కుబడిగా జరగటమే తప్ప , ఫలితాంశాలు
ఉండవలసిన రీతిలో లేకపోవడం విద్యారంగం
పట్ల చిన్నచూపే . మూడో ఎక్కమే సరిగా రానివాడికి బీజగణిత సూత్రాలు బోధిస్తే ఎలా ఉంటుంది . ఒక విఫల గణిత ఉపాధ్యాయునిగా
నా అనుభవంలో ఏనాడూ సిలబస్ పూర్తి చేయలేక పోయాను. కారణం తొమ్మిదవ తరగతిలో ఉన్నవాడికి ఆరో తరగతి ఏడో తరగతి లెక్కలు చెప్పవలసి రావడం . తెలియకుండా ఈనాటి విద్యార్థుల బౌద్ధిక విద్యాస్థాయిని పరిశోధన చేస్తే డిగ్రీల స్థాయి తెలుస్తుంది . మీ నుండి మరిన్ని విపులమైన విద్యా సంబంధ వ్యాసాలు రావాలి. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో మార్గదర్శకంగా రాయండి. నమస్సులు.
చాలా విపులమైన స్పందన. ఎంతో ఉపయుక్తమైన స్పందన. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Good morning sir, iam Srinidhi today your essay is very nice & good informative now a days ..
Sreenidhi (dept of heritage museum employee).
ధన్యవాదాలు.