అంటున్నాడు తుకా-18

66

ఒక దుకాణం తెరిచాను
వచ్చినవారందరికీ రెండుచేతులా పంచిపెడతాను.

సాధువు ఎంత ఉదారుడు! ఎంత ఉదారుడు!
ఆయన భాండాగారం తరుగులేనిది.

అడిగిన వాళ్ళకల్లా ఇస్తూనే ఉంటాడు
రానున్నవాళ్ళ సంగతి స్వామి చూసుకుంటాడు.

ఎవరి ఆత్మనిండా దేవుడుండాడో
అతడెప్పటికీ రిక్తం కాడు.

घातला दुकान । देती आलियासी दान ॥१॥
संत उदार उदार । भरलें अनंत भांडार ॥ध्रु.॥
मागत्याची पुरे । धणी आणिकांसी उरे ॥२॥
तुका म्हणे पोतें । देवें भरिलें नव्हे रितें ॥३॥ (1747)

67

మీరు నా మాటల్నెందుకు తప్పుపడుతున్నారు
పాండురంగా! ఈ విమర్శనుంచి బయటపడెయ్యి.

ఇంక మరెవర్ని సంప్రదించగలను?
సంసారవృక్షాన్ని సమూలంగా పెరికిపెట్టాను.

స్వామిసేవ నాకై నేను శిరసావహించాను
అందుకనే దీనిగురించి చెప్పుకుంటున్నాను.

తుకా అంటున్నాడు: ఎవరికి ఈ విద్యదొరకదో
అతడేం మాట్లాడినా నిష్ప్రయోజనం.

कां हो तुम्ही माझी वदविली वाणी । नेदा हे निवडूनि पांडुरंगा ॥१॥
आणीक म्यां कोणां पुसावा विचार । मुळीं संवसार दुराविला ॥ध्रु.॥
स्वामिसेवा ह्मुण घेतली पदरीं । सांगितलें करीं कारण तें ॥२॥
तुका म्हणें नाहीं शिकविलें जेणें । तो याच्या वचनें उगा राहे ॥३॥ (1774)

68

ఈ మాటలు నావికావు, వీటి అర్ధం నాకు తెలియదు
సాధుసంతుల ముందు మోకరిల్లి చెప్తున్నాను.

నాతో మాట్లాడిస్తున్నది పాండురంగడు
నా దేహాంగాలంతటా ఆయనే నిండివున్నాడు.

వేదాంతవిచారం గురించి మాట్లాడటానికి,
మందమతిని, నాకు అంతశక్తి ఎక్కడుంది?

రామా కృష్ణా హరీ ముకుందా మురారీ
అనుకోడమొక్కటే ఈ మూగవాడికి తెలిసిన ధ్యానం.

తుకా అంటున్నాడు: గురువుల అనుగ్రహం వల్ల
నా బరువంతా పాండురంగడు తనే మోస్తున్నాడు.

नेणें अर्थ कांहीं नव्हती माझे बोल । विनवितों कोपाल संत झणी ॥१॥
नव्हती माझे बोल बोले पांडुरंग । असे अंगसंगें व्यापूनिया ॥ध्रु.॥
मज मूढा शक्ती कैंचा हा विचार । निगमादिकां पार बोलावया ॥२॥
राम कृष्ण हरी मुकुंदा मुरारि । बोबड्या उत्तरीं हें चि ध्यान ॥३॥
तुका म्हणे गुरुकृपेचा आधार । पांडुरंगें भार घेतला माझा ॥४॥ (1790)

69

భక్తిభావాన్ని మూటలుగా బిగించికట్టాను
కావలసినవాళ్ళెవరంటూ సంతలో అరుస్తున్నాను.

సంతోషపు బజారులో అంగడి తెరిచాను
రామనామమనే సరుకు పరిచిపెట్టాను.

సకలజనులకూ ఉచితంగా పంచిపెడతాను
భవసాగరం దాటించే తరణోపాయమిది.

పూర్వం దీనివల్ల ఎందరో భాగ్యవంతులయ్యారు
ఎప్పటికీ తరగని సంపద కూడబెట్టుకున్నారు.

ఇది చచ్చుపుచ్చు కాదు, కల్తీ, నకిలీ కాదు,
తుకా అంటున్నాడు: మనసుపెట్టండి చాలు.

भक्तीभावें आह्मी बांधिलासे गांठी । साधावितों हाटीं घ्या रे कोणी ॥१॥
सुखाचिया पेंठे घातला दुकान । मांडियेले वान रामनाम ॥ध्रु.॥
सुखाचें फुकाचें सकळांचें सार । तरावया पार भवसिंधु ॥२॥
मागें भाग्यवंत जाले थोर थोर । तिहीं केला फार हाचि सांटा ॥३॥
खोटें कुडें तेथें नाहीं घातपात । तुका म्हणे चित्त शुद्ध करीं ॥४॥ (2009)

70

నేను మీ ఇంటికి కాపలాదారుని.
మీ సమస్తం కాపాడుతున్నాను.

ప్రపంచం మిమ్మల్ని తాకకుండా
ఒక కవచంలాగా నిలబడ్డాను.

నాకప్పగించిన ప్రమాణాలబట్టి
నడుచుకుంటున్నాను.

చేతిలో కర్రాదండంపట్టుకుని
మీకోసం నిలబడతాను.

నా బుద్ధి బలం యుక్తి శక్తి
సర్వశక్తులూ మీకే అర్పించాను.

తుకా అంటున్నాడు: మంచిది
ఇక నా కూలీనాకిప్పించండి.

जालों द्वारपाळ । तुझें राखिलें सकळ ॥१॥
नाहीं लागों दिलें अंगा । आड ठाकलों मी जगा ॥ध्रु.॥
करूनियां नीती। दिल्याप्रमाणें चालती ॥२॥
हातीं दंड काठी । उभा जिवाचिये साठी ॥३॥
बळ बुद्धी युक्ती । तुज दिल्या सर्व शक्ती ॥४॥
तुका म्हणे खरा । आतां घेईन मुशारा ॥५॥ (2067)

71

సంకీర్తన ఒక ధ్యానం, ఒక సాధన, అలంకరణ
సంకీర్తనని మించిన పుణ్యం మరొకటి లేదు.

సంకీర్తన ఎంత నిక్కమంటే, ఎంతఖచ్చితమంటే
సంకీర్తన మధ్య దేవుడు సదా నిలిచి ఉంటాడు.

మనసారా ఆ నామం నలుగురు జపించినా చాలు,
మహాపాపాలన్నీ క్షణంలో దగ్ధమైపోతాయి.

కీర్తించినవారితోపాటు, తక్కినవాళ్ళూ తరిస్తారు
నారాయణుణ్ణి చేరతారు నమ్మండంటున్నాడు తుకా.

कथा देवाचें ध्यान । कथा साधना मंडण । कथे ऐसें पुण्य आणीक नाहीं सर्वथा ॥१॥
ऐसा साच खरा भाव । कथेमाजी उभा देव ॥ध्रु.॥
मंत्र स्वल्प जना उच्चारितां वाचे मना । म्हणतां नारायणा क्षणें जळती महा दोष ॥२॥
भावें करितां कीर्तन तरे तारी आणीक जन । भेटे नारायण संदेह नाहीं म्हणे तुका ॥३॥ (2356)


Featured image courtesy: Oscar Garcia Medina via pexels.com

30-11-2025

2 Replies to “అంటున్నాడు తుకా-18”

  1. ఎవరికి ఈ విద్యదొరకదో
    అతడేం మాట్లాడినా నిష్ప్రయోజనం.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading