
43
కొందరు నిందించవచ్చుగాక,
కొందరు పూజించ వచ్చుగాక
నన్నదీ తాకదు, ఇదీ తాకదు
రెంటికీ ఎడంగా ఉన్నాను.
దేహం అనుభవాలు దేహానివి
ఏది ప్రాప్తించినా మంచిదే.
తుకా అనుభవానికొచ్చేది ప్రతీదీ
నారాయణుడిదీ, జనార్దనుడిదీ.
निंदी कोणी मारी । वंदी कोणी पूजा करी ॥१॥
मज हें ही नाहीं तें ही नाहीं । वेगळा दोहीं पासुनी ॥ध्रु.॥
देहभोग भोगें घडे । जें जें जोडे तें बरें ॥२॥
अवघें पावे नारायणीं । जनार्दनीं तुक्याचें ॥३॥ (48)
44
జనావాసమా, నిర్జనమా-
విట్టలుడి పేరుమీద రెండూ ఒకటే
ఇటు చూసినా, అటుచూసినా
విట్ఠలుడూ, రుక్మాయీ.
వనమైనా, పట్టణమైనా-ఒకటే నాకు.
ప్రతి ఒక్క చోటూ ఒక్కటే, ఒక్కలాంటిదే
సుఖదుఃఖాల చింత పక్కనపెట్టి
కౌతుకభరితుడై తుకా నాట్యం చేస్తాడు.
जन विजन जालें आम्हां । विठ्ठलनामा प्रमाणें ॥१॥
पाहें तिकडे बापमाय । विठ्ठल आहे रखुमाई ॥ध्रु.॥
वन पट्टण एकभाव । अवघा ठाव सरता जाला ॥२॥
आठव नाहीं सुखदुःखा । नाचे तुका कौतुकें ॥३॥ (49)
45
తాడు గట్టిగా లాగితే పోగులన్నీ బిగుసుకున్నట్టు
ఈ సమస్త విశ్వం దేవుడిలో పొందిగ్గా కుదురుకుంది.
ఇటుకల్తో గోడ కట్టినట్టు కాదు
ప్రతి ఒక్క ప్రాణీ మరోప్రాణితో ముడిపడింది.
తక్కినవాళ్ళ సుఖదుఃఖాలు మనలోకి ప్రవహిస్తాయి
ఇలానే మన సుఖదుఃఖాలు వాళ్లవీనూ.
తుకా అంటున్నాడు: ఒకసారి మనసుకెక్కిందా,
ఈ సత్యం, చూడు సమస్తప్రపంచం శోభామయం.
देवाच्या संबंधें विश्व चि सोयरें । सूत्र ओढे दोरें एका एक ॥१॥
आहाच हें नव्हे विटायासारिखें । जीव जीवनीं देखें सामावलें ॥ध्रु.॥
आणिकांचें सुख दुःख उमटे अंतरीं । एथील इतरीं तेणें न्यायें ॥२॥
तुका म्हणे ठसावलें शुद्ध जाती । शोभा चि पुढती विशेषता ॥३॥ (826)
46
కొందరు తపోదికాలు సాధన చేస్తారు
కొందరు ధ్యానాదికాలు సాధన చేస్తారు.
కాని మాది ఆ దారి కాదు
మేము పండరివీథుల్లో నాట్యమాడతాం.
కొందరు ఆత్మస్థితిలో నిలిచి ఉంటారు
కొందరు ముక్తిపొందడమే పరమార్థమంటారు
తుకా అంటున్నాడు- హరిసేవకులుగా
బతకడంలోనే మా సంతోషం, సాఫల్యం.
करोत तपादि साधनें । कोणी साधो गोरांजनें ॥१॥
आम्ही न वजों तया वाटा । नाचूं पंढरीचोहटां ॥ध्रु.॥
पावोत आत्मिस्थिति । कोणी म्हणोत उत्तम मुक्ति ॥२॥
तुका म्हणे छंद । आम्हां हरीच्या दासां निंद्य ॥३॥ (367)
47
సంసారభారం ఇప్పటికే నెత్తినుంది
దాని మీద మరింత బరువుమోపకు.
భక్తిమార్గం స్వభావమే అటువంటిది
నీకున్నదంతా వదిలిపెట్టక తప్పదు.
అడుక్కోడం వృత్తిగా మార్చుకుని
గాడిదలాగా బతకడమెందుకు?
నడిబజారులో కాపురం పెట్టి
సన్న్యాసవస్త్రాలు ధరించడమెందుకు?
జీవనప్రసాదాన్ని మరుగుపర్చి కవులు
నేతికి బదులు నీళ్ళు కోరుకుంటారు.
తుకా అంటున్నాడు దేవతగానైనా మారు
లేదా దెయ్యంగానన్నా మారు.
संसाराचा माथां भार । कांहीं पर न ठेवीं ॥१॥
भक्तीची ते जाती ऐसी । सर्वस्वासी मुकावें ॥ध्रु.॥
भिक्षाणी वेवसाव। काला करितो गाढव ॥२॥
करुनि वस्ती बाजारीं । म्हणवी कासया निस्पृही ॥३॥
प्रसादा आडुनि कवी । केलें तुप पाणी तेवीं ॥४॥
तुका म्हणे होंई सुर । किंवा निसुर मजुर ॥५॥ (902)
Featured image: Photography by Enging Akyurt via pexels.com
23-11-2025


శుభోదయం సర్. ప్రతీ ప్రాణీ మరో దానితో ముడిపెట్టబడే ఉంది..చిన్న పదాలలో చింతనామృతం.
ధన్యవాదాలు మేడం