
బైరాగి శతజయంతి సంవత్సరం సందర్భంగా ‘కవిసంధ్య’ పత్రిక ఒక ప్రత్యేక సంచిక తీసుకువస్తున్నారనీ, దానికోసం ఒక వ్యాసం రాసిమ్మనీ శిఖామణి అడిగారు. పత్రిక కాబట్టి స్థలనియంత్రణ తప్పనిసరి. కాబట్టి బైరాగి గురించి నాలో సముద్రమంత ఘూర్ణిల్లుతున్న భావోద్వేగాన్ని ఒక వ్యాసానికి కుదించడం నిజంగా పరీక్షనే. ఆ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.
ఆలూరి బైరాగి (1925-78) ఐతిహాసిక కవి, కథకుడు, నవలాకారుడు, బాలసాహిత్య రచయిత, అనువాదకుడు. ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్యంలో ప్రతి పదేళ్ళకు ఒక యుగంగా ఎన్నో సాహిత్య యుగాల్ని లెక్కేసుకుంటూ పోయిన సాహిత్యచరిత్రకారుల దృష్టిలో పడకుండా తప్పించుకున్నవాడు. అందువల్ల బతికిపోయినవాడని కూడా చెప్పాలి. కాబట్టే, తాను పుట్టి వందేళ్ళు గడిచాక, ఇప్పుడిప్పుడే సమస్త ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు.
మామూలు కవులు తమ జీవితకాలాల్లోనే గుర్తింపుకు నోచుకుంటారు. కాని మహాకవుల కాలమానం వేరు. వారు గొప్ప తైలవర్ణచిత్రాల్లాగా కాలం గడిచే కొద్దీ కొత్త కాంతులీనడం మొదలుపెడతారు. తమ తమ జీవితకాలాల్లో తమని విస్మరించిన సాహిత్యచరిత్రకు తదనంతరకాలాల్లో వారే ప్రతినిధికవులుగా నిలబడతారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. నేడు ప్రాచీన చీనా కవిత్వంలో ఋషీశ్వరుడిగా ప్రస్తుతి పొందుతున్న తావో యువాన్-మింగ్ (365-427) ని తన జీవితకాలంలో ఎవరూ కవిగా గుర్తించలేదు సరికదా, మరొక శతాబ్దం తర్వాత కూడా ఒక అప్పకవి ఆయన్ని రెండో రకం కవిగా లెక్కేసి పక్కన పెట్టేసాడు. మూడు వేల ఏళ్ళ చీనా సాహిత్యంలో సర్వోన్నత కవిగా నేడు నీరాజనాలు అందుకుంటున్న దు-ఫు (712-770) జీవితకాలంలో ఆయన కవితలు రెండు మూడు మాత్రమే సంకలనాలకు ఎక్కాయి. నేడు అమెరికన్ కవయిత్రుల్లో అగ్రేసర కవిగా గుర్తింపు పొందుతున్న ఎమిలీ డికిన్ సన్ (1830-1886) జీవితకాలంలో ఆమెవి పట్టుమని పది కవితలు కూడా పత్రికల్లో అచ్చు కాలేదు. దాదాపు పదిహేడు వందల కవితలు ఆమె రాసినవి ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టాకనే ఈ లోకం అందుకోగలిగింది. జార్జి హెర్బర్టు లాంటి ఇంగ్లిషు మెటఫిజికలు కవి, కాన్ స్టాంటైన్ కవఫీ లాంటి ఆధునిక గ్రీకు కవి- ఇలా చాలా ఉదాహరణలు ఇవ్వగలను. ఇప్పుడు బైరాగిని కూడా ఈ కోవలో లెక్కవేస్తున్నందుకు ఒక తెలుగువాడిగా నాకు చాలా గర్వంగా ఉంది.
బైరాగి కవిత్వంలో రెండు సంపుటాలు ‘చీకటినీడలు’, ‘నూతిలో గొంతుకలు’ ఆయన జీవితకాలంలోనే అచ్చయ్యాయి. మొదటి సంపుటిని మనం తొలికవితల పుస్తకంగా పక్కన పెట్టొచ్చు. కాని నూతిలో గొంతుకలు మాటేమిటి? ఒకప్పుడు నా దగ్గర ఆధునిక భారతీయ సాహిత్య చరిత్ర గురించిన సరైన తేదీలు లేక, నేను బైరాగిని ముక్తిబోధ్ మార్గంలో కవిత్వం రాసిన కవిగా భావించాను. నా ‘నిర్వికల్ప సంగీతం’ లో అలా రాసుకున్నాను కూడా. కాని ఆ పొరపాటును ఇప్పటికి సరిదిద్దుకున్నాను. ఒక్క ముక్తిబోధ్ మాత్రమే కాదు, ఆధునిక భారతీయ సాహిత్యంలో మరే మాడర్నిస్టు కవీ కూడా ‘నూతిలో గొంతుకలు'(1955) నాటికి తన సొంతగొంతును ప్రతిష్ఠించుకోనేలేదు. ఏ విధంగా చూసినా, ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ సాహిత్యంలో రెండు మహాదశలు-ఒకటి ఆధునిక (modern) దశ, దానికి టాగోరు (గురజాడ, సుబ్రహ్మణ్య భారతిల్ని కూడా కలుపుకుని ) ప్రతినిధి కవికాగా, రెండోది, ఆధునిక వాద (modernist) దశ, దానికి బైరాగి వైతాళికుడు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ప్రత్యక్షమవుతున్న నిష్ఠురవాస్తవాల పట్ల అందరికన్నా మొదట మేల్కొన్న భారతీయ కవి బైరాగినే. ఆయన నూతిలో గొంతుకలు రాసేనాటికి ఆధునిక తెలుగు యుగకవి శ్రీ శ్రీ ఇంకా ‘సదసత్సంశయం'(1953-68) లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు.
1969 ఉగాది ఆంధ్రపత్రికలో అనుకుంటాను కె.వి.రమణారెడ్డి’అభ్యుదయానంతర కవిత్వ ధోరణులు’ అని ఒక వ్యాసం రాసాడు. అందులో modern అనేది కాలవాచకం కాదని తనకి చాలా ఆలస్యంగా తెలిసింది అని రాసాడు. సంతోషం. కాని అది స్టీఫెన్ స్పెండరు రాసిన The Struggle of the Modern (1963) చదివితే తప్ప తెలియలేదని కూడా రాసుకున్నాడు. కాని అప్పటికి పదిహేనేళ్ళ కిందటే, బైరాగి భారతీయ కవిత్వాన్ని modern దశని దాటించి modernist దశలోకి ప్రవేశపెట్టాడని ఆయనకు తెలియదు. తెలుగు సాహిత్య విమర్శ బైరాగి కన్నా ఎప్పుడూ వెనకబడే ఉందనడానికి ఇంతకన్నా నిరూపణ అవసరంలేదనుకుంటాను.
తెలుగులో ఇప్పటికీ modern, modernity, modernism అనే పదాల్ని సమానార్థకాలుగానే వాడుతుంటారు. కాని ఈ మూడు పదాలూ వలసవాదంలో భాగంగా యూరోపునుండి దిగుమతి అయిన పదాలు. ఇవి మన భాషల్లోకి ప్రవేశించేటప్పటికే వీటివెనక మూడువందల ఏళ్ళకు మించిన చరిత్ర ఉంది. Modern అనేది ఎప్పుడు మొదలయ్యిందని అడిగితే పాశ్చాత్య సమాజం ఒక్కో రంగానికి ఒక్కో చరిత్ర చెప్తుంది. కాని దానికి సంపూర్ణస్వరూపం ఏర్పడ్డది పద్ధెనిమిదో శతాబ్దంలో Age of Enlightnmentలో. దాని ముఖ్యసూత్రాలు ఇవి: మనిషే అన్నిటికీ ప్రాతిపదిక, స్వర్గనరకాలంటూ వేరే లేవు, ఈ ప్రపంచాన్ని స్వర్గతుల్యం చేయడమే మనిషి కర్తవ్యం, అందుకు తాత్త్వికంగా హేతువాదమూ, రాజకీయంగా ప్రజాస్వామ్యమూ, వైజ్ఞానికంగా ప్రయోగాత్మక సైన్సూ ప్రధాన ఉపకరణాలు. అధిక వస్తూత్పత్తీ, గణితమూ, సైన్సూ, ఆధునిక భాషాబోధనలు లక్ష్యంగా పెట్టుకున్న ఆధునిక విద్య, కొత్త రాసాయినిక ఔషధాలూ, శస్త్రచికిత్సల మీద దృష్టి పెట్టిన ఆధునిక వైద్యమూ, నగరీకరణా మానవాళికి కొత్త భవిష్యత్తును సాధించిపెడతాయి. వీటితో పాటు నెమ్మదిగా చట్టం ముందు అందరూ సమానులే అనే భావన, మానవులందరికీ సమాన ఉపాధి అవకాశాలుండాలనే, సమాన హక్కులుండాలనే ఆదర్శాలు కూడా తోడయ్యాయి. దాదాపుగా ఈ నమ్మకాలతో పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచిన యూరోపు చాలా సార్లు బిగ్గరగానూ, చాలా సార్లు రహస్యంగానూ నమ్మిన మరో అంశం, తాను ‘మానవాళి’, ‘మానవుడు’ అని అంటున్నప్పుడల్లా అది యూరోపుకి మాత్రమే పరిమితమైన మానవప్రపంచం అనే.
ఈ ఆధునిక జీవనవైఖరినే తదనంతరం ప్రపంచమంతా కూడా ప్రగతివాదంగా, ఉదారవాదంగా స్వీకరించింది. ఇప్పుడు కూడా మన సాహిత్యంలో ఎవరు ఈ నమ్మకాల్ని ప్రకటిస్తే వారిని ఆధునిక రచయితలుగా భావిస్తూండటం పరిపాటి.
కానీ ఈ నమ్మకాలు మతమ్మీదా, స్వర్గనరకాలమీదా, ఫ్యూడలు ఆర్థిక వ్యవస్థమీదా ఆధారపడ్డ ప్రాచీన యూరోపుని విడుదల చేస్తున్నట్టు పైకి కనబడ్డా అంతకన్నా మరింత సంక్లిష్టమైన సంక్షోభం వైపు నెడుతున్నాయనే జాగృతి పందొమ్మిదో శతాబ్దం నడిమి కాలానికే యూరోపులో మొదలయ్యింది. బోదిలేరు, కీర్కుగార్డు, డోస్టొవెస్కీవంటి పందొమ్మిదో శతాబ్ది రచయితలు యూరోపుని హెచ్చరించడం మొదలుపెట్టారు. కాని వారేమి చెప్తున్నారో ఇరవయ్యవశతాబ్ది ప్రారంభానికిగాని పాశ్చాత్య ప్రపంచానికి అర్థం కాలేదు. ఫ్రాయిడు, నీషే, ఇలియటు, జాయిసు, కాఫ్కా వంటి రచయితలు మొదటిప్రపంచానికి ముందూ, రెండు ప్రపంచయుద్ధాల మధ్యకాలంలోనూ మాట్లాడిన మాటలు, రాసిన రచనలు ఒక కొత్త ధోరణికి దారి తీసాయి. దాన్నే ఇప్పుడు మనం modernism అంటున్నాం. modernism అంటే, ఒక్కమాటలో, critique of the modern. అలాగని అది సంప్రదాయవాదం కాదు. Tradition అందిస్తున్న పరిష్కారాలపట్ల ఆధునికులకీ, ఆధునికవాదులకీ ఇద్దరికీ నమ్మకం లేదు. అయితే ఆధునికవాదులకి, సంప్రదాయవాదుల పరిష్కారాలతో పాటు, ఆధునికులు అందిస్తున్న పరిష్కారాలపట్ల కూడా పూర్తి నమ్మకం లేదు. కాబట్టి, కాలవాచకంగా చూస్తే, modernism ఆధునిక దృక్పథం కన్న మరింత ముందడుగు వేసిన దృక్పథం అని చెప్పాలి. యూరోపులో కనీసం మూడు వందల ఏళ్ళ పాటు నడిచిన ఈ క్రమపరిణామం గురించి ఏమీ తెలియని తెలుగు ప్రపంచం బైరాగి వంటి కవి modernist దృక్పథంతో కవిత్వం చెప్పగానే, అతణ్ణి పలాయన వాది అనీ, నిరాశావాది అనీ, నిహిలిస్టు అనీ, అతడి భాష కఠినమనీ, లేదా ఆ తెలుగు హిందీ నుడికారంతో కూడుకున్న తెలుగు అనీ, ఏదో ఒకటి, తన పరిజ్ఞానానికి అప్పటికి ఏ మాట దొరికితే ఆ లేబులు ఆయనకు తగిలిస్తూ వచ్చింది. అదంతా చూసి, విని, విసుగెత్తి, చివరికి బైరాగి ‘నేను మీ కవిని కాను, వెడలి పొండి ‘అని అనకుండా ఉండలేకపోయాడు.
ఇక మరొక తరహా పాఠకులు, ఇలియటు ‘వేస్ట్ లాండ్’ రాసాడని తెలిసినవాళ్ళు, బైరాగి ఇలియటును అనుకరించాడని రాయడం మొదలుపెట్టారు. The Waste Land (1922) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన కావ్యం. ‘నూతిలో గొంతుకలు’ (1955) రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన పదేళ్ళ తరువాత వచ్చిన కావ్యం. మొదటి ప్రపంచ యుద్ధంతో యూరోపులో feudal order విచ్ఛిన్నమైంది. రెండో ప్రపంచ యుద్ధంతో colonial order విచ్ఛిన్నమైంది. (మొదటి ప్రపంచ యుద్ధంతో దేవుడు మరణించాడు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైన్సు మరణించిందని రాశారు చలంగారు.) మొదటి ప్రపంచయుద్ధకాలంలో ప్రభవించిన సోవియేటు సమాజం రెండో ప్రపంచం పూర్తయ్యేటప్పటికి state capitalism దిశగా బలపడుతూ ఉంది. తన కాలం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లభిస్తుందేమోనని ఇలియటు catholic faith వైపు చూస్తూ ఉన్నాడు. మరొక వైపు తన సమకాలిక ప్రగతివాద తెలుగు కవులు 64 దాకా రష్యా వైపూ, ఆ తర్వాత చైనా వైపూ చూస్తూ ఉన్నారు. కాని అటువంటివ్యవస్థిత మతంలోగాని, వ్యవస్థిత రాజ్యంలోగాని, వ్యవస్థిత కథనాల్లోగాని తన ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని బైరాగి నమ్మలేదు. మానవుడు నిజమైన మానవుడిగా, దయార్ద్ర హృదయుడిగా రూపొందడం వల్లమాత్రమే, ‘మానవాళికి మంచికాలం రహిస్తుందని’ నమ్ముతూ ఉన్నాడు. అటువంటి మానవుడి ఆగమనాన్ని స్వాగతిస్తూ రాసుకున్న కవితలు ‘ఆగమగీతి’ (1981) గా వెలువడటంతో బైరాగి కవిత్వ దర్శనం సంపూర్ణమైంది.
ఈ పరిణామాలన్నిటినీ 1978 కి ముందు సాకల్యంగా, నిర్మమత్వంతో పరిశీలించి అంచనావెయ్యడం, నిజంగానే, కష్టం. బైరాగి కవిత్వాన్ని శ్రద్ధగా, చదవవలసినట్టుగా చదివే సమయం ఇప్పటికి లభించింది. కాబట్టి, ఆ పని ఇప్పటికైనా మొదలుపెడదాం.
Featured image: Detail from an image from pexels.com
7-9-2025


నమస్సులు. ఎంతో వివరంగా బైరాగి గారి గురించి చెప్పారు. మీరు చెప్పబోయే వారి కవిత్వం గురించి ఎదురు చూపు.
ఎంతో చక్కని మాట.
బైరాగి కవిత్వాన్ని శ్రద్ధగా, చదవవలసినట్టుగా చదివే సమయం ఇప్పటికి లభించింది. కాబట్టి, ఆ పని ఇప్పటికైనా మొదలుపెడదాం. అన్న మీ మాటలు మళ్ళీ మళ్ళీ చదివాను.
చదవ వలిసినట్టుగా చదివే సమయం అనే పదాలు నాలో ఉత్సుకత ని రేపాయి. ఎదురుచూస్తాను. నమస్సులు
ధన్యవాదాలు మేడం!
చాలా గొప్పగా రాసారు సార్…. 🙏🙏❤️
ధన్యవాదాలు