నన్ను వెన్నాడే కథలు-11

ఇప్పటి యువతీయువకులూ, కవులూ, కథకులూ ఎంతమంది గోర్కీని చదువుతున్నారో తెలియదుగానీ, మా తరందాకా గోర్కీని చదవడం తప్పనిసరిగా ఉండేది. ఇంకా చెప్పాలంటే నువ్వొక సాహిత్యబృందంతో కలిసి తిరగాలంటే గోర్కీని చదివి ఉండటం ఒక అలిఖిత సభ్యత్వ నిబంధనలాగా ఉండేది.

నలభయ్యేళ్ళ కిందట నేనెవరి ఇంటికి వెళ్ళినా అక్కడ గోర్కీ ‘అమ్మ’ తప్పనిసరిగా కనిపించేది. సావిత్రిగారికైతే ‘అమ్మ’ ఒక పారాయణ గ్రంథం. ఆమెని చుట్టుముట్టిన కష్టాల మధ్యా ఆమె ఎప్పుడు ఆ పుస్తకం తెరిచినా ఏదో ఒక వాక్యం కనిపించి, సాధారణంగా విశ్వాసులు ఆధ్యాత్మిక గ్రంథాల్లో వెతుక్కునేలాంటి, ఒక ఊరట ఆ వాక్యంలో ఆమెకి దొరికేది. ఇక ఆ రోజంతా తనని ఎవరు కలిసినా వారితో ఆ వాక్యం గురించే ముచ్చటించేవారామె.

ఇక మరెవరిదగ్గరైనా ‘నా బాల్యము ‘, ‘నా బాల్యసేవ’, ‘నా విశ్వవిద్యాలయాలు’ -మూడూ పుస్తకాలూ కూడా కనిపించాయంటే వారి సాహిత్యాభిలాష అత్యున్నతస్థాయికి చెందింది అనుకునేలాంటి రోజులవి. సాహిత్యభిలాష మాత్రమే కాదు, వారికి సమాజం పట్లా, మనిషి పట్లా, శ్రామికుల భవితవ్యం పట్లా, వాళ్ళ పట్ల రచయితకి ఉండవలసిన కర్తవ్యం పట్లా ఉండే నమ్మకం ముందు శిరసొగ్గాలనిపించేది.

‘స్వర్ణ పిశాచి నగరం’ నాకు చాలా నచ్చిన పుస్తకాలలో ఒకటి. ఇక ‘గోర్కీ సాహిత్య వ్యాసాలు’ చదివే నేను పుస్తకాల గురించీ, రచయితల గురించీ ఎలా తలుచుకోవాలో, ఎలా రాయాలో నేర్చుకున్నాను. ఇక మరెవరిదగ్గరైనా గోర్కీ కథల తెలుగు అనువాదం లేదా నాటకాల ఇంగ్లిషు సంపుటీ ఉన్నాయంటే వారు మా దృష్టిలో తేరిపారచూడలేనంత ఎత్తులో కనిపించేవారు.

అటువంటి రోజుల్లో ఏ మిత్రుల దగ్గరో చూసాను మొదటిసారి ‘మాక్సిం గోర్కీ కథలు’. ప్రగతి ప్రచురణాలయం వారు ప్రచురించిన రాచమల్లు రామచంద్రా రెడ్డి అనువాదం. అది బహుశా 1975 కి పూర్వమే ప్రచురితమై ఉండవచ్చు. ఎనభైల మొదట్లో చూసాను. ఇన్నేళ్ళ తరువాత నా భాగ్యం కొద్దీ మళ్ళా ఇంటర్నెట్టులో చూడగలిగాను. మీలో ఎవరికేనా ఆ కథలన్నీ చదవాలనిపిస్తే, ఇదిగో, ఈ లంకె నొక్కి డౌనులోడు చేసుకోవచ్చు.

గోర్కీ రాసిన కథల్లో మూడు కథలు నన్నిప్పటికీ వెన్నాడుతున్నాయి. మొదటిది, ‘ఇరవై ఆరుగురు పనివాళ్ళూ, ఒక స్త్రీ’. ఆ కథని నా కథాప్రాజెక్టులో భాగంగా అనువదించాను. Critical realism కి ఉదాహరణగా ఆ కథని పరిచయం చెయ్యవలసి ఉంది కాబట్టి, ఇక్కడ ఎత్తుకోవడం లేదు. ఇక మిగిలిన రెండు కథల్లో , ‘డాలర్ భూతం’ గోర్కీ లోని ఊహాశక్తికీ, ఆయన వ్యంగ్యదృష్టికీ గొప్ప ఉదాహరణ. కానీ, ఇక్కడ మీకు పరిచయం చెయ్యడానికి, ఆ కథని కూడా పక్కన పెట్టి, ‘మానవుని జననం’ (1912) కథని ఎంచుకున్నాను.

ఎందుకు ఎంచుకున్నానో, చదివాక మీకే తెలుస్తుంది. ఈ కథ మొదటిసారి చదివేక, మళ్ళా నలభై ఏళ్ళ తరువాత ఇదే చదవడం. చదివినంతసేపూ నా హృదయం ద్రవీభూతమైపోతూ ఉంది. ఇలాంటి కథ ఈ మధ్యకాలంలో ఒక్కటి కూడా చదవలేదు. నువ్వు కథకుడివే అయితే నీ జీవితానికి ఇలాంటి కథ ఒక్కటి రాస్తే చాలనిపిస్తుంది. నువ్వు మనిషివే అయితే నీ తోటిమనిషి పట్ల ఇటువంటి సౌభ్రాతృత్వాన్ని ప్రకటించగలిగే ఒక్క రోజు దొరికినా చాలనిపిస్తుంది.


ఒక మానవుని జననం

రష్యన్ మూల కథ: మక్సిం గోర్కీ

తెలుగు సేత: రాచమల్లు రామచంద్రా రెడ్డి


1892 కరువు సంవత్సరం సుహూంకూ, ఒచెమ్ చీరీకి మధ్య కొదోర్ నదిఒడ్డున సముద్రానికి చేతివేటు దూరంలో- తళతళ మెరిసే కొండ సెలయేటి ఉల్లాసపు కలకలనాదాన్ని మించి, తీరాన్ని ఒరుసుకునే సముద్రపు అలల గలగల స్పష్టంగా వినవచ్చు.

శరదృతువు. చెర్రీ లారెల్ చెట్ల సందుటాకులు కొదోర్నది తెల్లని నురుగులో, చాకచక్యం గల చేపల్లాగ, సుడిదిరుగుతూ, వురకలువేస్తూ వున్నాయి. నేను నది ఒడ్డునరాళ్లలో కూర్చొని, కొంగలూ, కార్మొరంతులూ కూడా బహుశా ఆకులను చేపలుగాభ్రమించి, ఆశాభంగం పొందుతున్నాయని అనుకుంటూ వున్నాను – అందుకే అవి అక్కడ, కుడి వైపున, చెట్ల కవతల, ఒడ్డును సముద్రం ఒరుసుకునే చోట, అంత బాధగా అరుస్తున్నాయి.

తలమీద చెస్ట్ నట్ చెట్లు బంగారు సొమ్ములు పెట్టుకున్నాయి, నా కాళ్లవద్ద యెన్నో ఆకులు పడి వున్నాయి, మనుషుల ముంజేతులనుండి ఖండింపబడిన హస్తాలలాగ కనిపిస్తూ, అవతలి వొడ్డున హార్న్ బీమ్ కొమ్మలు అప్పుడే బోడివై, చినిగిన వలలాగ గాలిలో వ్రేలాడుతున్నాయి. ఆ వలలోపల, అందులో చిక్కుకున్నట్లు, ఒక పసుపు యెరుపురంగుల కొండవడ్రంగి పిట్ట యెగురుతూ, తన నల్లని ముక్కుతో చెట్టు బోదెబెరడును పొడుస్తున్నది, పురుగులను బయటికి తరమడానికి; ఆ పురుగులను వెంటనేదిగమింగుతున్నాయి సుదూర ఉత్తరంనుండి వచ్చిన అతిథులు హుషారైన చిన్నటామ్ట్ లూ, బూడిదరంగు నట్ హాచ్ లూ.

నా యెడమ వైపు, కొండ పేటులకు ఆనుకొని నల్లని మేఘాలు వేలాడుతున్నాయి, వర్షం కురవబోయేటట్లు, వాటి నీడలు పచ్చని కొండదరులమీద ప్రాకుతున్నాయి; ఆ దరులలో యెండిపోయినట్లు కనిపించే బాకుడ్ చెట్లు పెరిగినాయి, పురాతనమైన బీచ్,

లిండెన్ చెట్ల తొర్రలలో అడవి తేనె దొరుకుతుంది- రోమ్ కాలంలో ఆ తేనె పాంపే సైనికులను దాదాపు తలకిందులు చేసింది, దాని తీయని కైపుతో మొత్తం ఒక లీజియన్ అంతా పడిపోయినారు. తేనెటీగలు లారెల్, అజాలియా పూలనుండి తయారు చేస్తాయి ఆ తేనెను, బాటసారులు చెట్ల తొర్రలలోనుండి దాన్ని తీసుకొని, గోధుమతో చేసే పల్చని లావాష్ రొట్టెలకు పూసుకొని తింటారు.

నేను చేస్తూ వుండిన పని సరిగ్గా అదే, చెస్ట్ నట్ చెట్లకింద రాళ్లమీద కూర్చొని, ఒక కోపిష్టి తేనెటీగ వేసిన కాట్లను రుద్దుకుంటూ. తేనె నింపిన టీ పావులో బ్రెడ్డుముక్కలు ముంచి తింటున్నాను, అలసట చెందిన శరత్కాలపు సూర్యుని విలాసక్రీడలనుచూసి ఆనందిస్తూ.

శరదృతువులో కాకసస్ ఒక గొప్ప వైభవోపేతమైన చర్చిలా గుంటుంది, గొప్పజ్ఞానులు – వాళ్లు విధిగా గొప్ప పాతకులు కూడా – తమ గతాన్ని అంతరాత్మ నిశితదృక్కులనుండి దాచుకోడానికి కట్టిన చర్చిలాగుంటుంది; బంగారూ, పచ్చలూ, నీలాలూ పొదిగిన విస్తారమైన దేవళంలాగుంటుంది; సమర్కాండ్, షెమాహాలలోని తుర్కీయులుపట్టుతో నేసిన మహా నాజూకైన రత్నకంబళాలు పరిచిన పర్వతసానువులతో. వాళ్లు ప్రపంచాన్నంతా దోచుకొని తెచ్చిన కొల్లసొమ్ము సూర్యుని ముందర వుంచినారు, సూర్యునికిఅర్పణ చేస్తూ:

“భవదీయం – భవజ్జనితం – భవదర్పితం!”

… పెద్ద గడ్డాల, తెల్ల జుట్టు బృహత్కాయులు చురుకైన చిన్నపిల్లలలాగ వికసించిన నేత్రాలతో పర్వతాలమీదనుండి కిందికి దిగిరావడం నాకు కనిపించింది; వాళ్లు భూమిని అలంకరిస్తూ, రంగురంగుల సంపదలను తమ దండి చేతులతో వెదజల్లుతూ, పర్వతాగ్రాలను మందమైన వెండిపొరలతో కప్పుతూ, వివిధవృక్షాల జీవద్వస్త్రాలను కొండచరియలకు కట్టబెట్టుతూ వస్తున్నారు- వాళ్ల చేతికింద యీ పుణ్యభూఖండం అనిర్వచనీయసౌందర్యం సంపాయించుకుంది.

యెంత అద్భుతమైన పదవి – యీ ప్రపంచంలో మానవునిది! యెంత అద్భుతమైన వస్తుసంపద కనపడుతుంది, హృదయాన్ని చలింపజేసే సౌందర్యం కలిగించే నిశ్చలానందం యెంత తీయగా గుండెను పిండుతుంది!

నిజమే, ఒకోసారి కష్టంగా వుంటుంది. గుండెలో ద్వేషజ్వాలలు చెలరేగుతాయి, దుఃఖం తీరని ఆశతో హృదయరక్తం పీలుస్తుంది, కానీ యిది శాశ్వతంగా వుండదు. తరుచుగా సూర్యుడు కూడా యెంతో విషాదదృక్కులు బరపుతాడు మానవులమీద: తానువాళ్ల కోసం యెంతో శ్రమపడినాడు, కానీ యెంత దౌర్భాగ్యపు మూకగా తయారైనారు వాళ్ళు….

కొంతమంది మంచివాళ్లు వున్నారు, సహజమే అది, కానీ వాళ్లను బాగుచెయ్యాలి, లేదా పునర్నిర్మాణం చెయ్యాలి.

…నా యెడమ పక్క పాదలపైన అటూ యిటూ కదిలే నల్లని తలలు కనపడుతున్నాయి. సముద్రతీరపు గుసగుసలమధ్య, నది గళగరింపుల మధ్య మానవ కంఠాలు సవసవగా వినపడుతున్నాయి. అవి “కరువు పీడితు”లవి, వాళ్లు సుహూంలో రోడ్డు నిర్మిస్తూవుండినారు, యిప్పుడు ఒచెమ్ చీరీకి పోతున్నారు, అక్కడ మళ్లీ పని దొరుకుతుందనే ఆశతో.

వాళ్లు నాకు తెలుసు – వాళ్లది ఒరేల్. వాళ్లతో కలిసి నేను పనిచేసినాను. మొన్న మాకు డబ్బు యిచ్చేసి పొమ్మన్నారు. నేను వాళ్లకంటె ముందు, రాత్రిపూట బయలుదేరినాను, సూర్యోదయం చూడడానికి సముద్రతీరం చేరుకునేటట్లు.

వాళ్లు అయిదుమంది వుండినారు – నలుగురు రైతులూ, యెత్తు బోటెముకలుగల ఒక రైతు యువతీ. ఆమె గర్భిణి; పెద్ద కడుపు పైకి తోసుకొనివచ్చింది, రెప్పవేయక చూసే ఆమె లేత నీలికన్నుల్లో భయం కనిపించేది. పసుపురంగు కర్చీఫ్ ఆమె తలపొదల పైన వూగుతూ నాకు కనిపిస్తున్నది, వికసించే పొద్దుతిరుగుడుపూవు గాలిలోవూగినట్లు. ఆమె మగడు సుహూంలో మరణించినాడు- పండ్లు మితిమీరి తిని. నేను వీళ్లతో కలసి ఒకే గుడిసెలో వుండినాను: పాత రష్యన్ సంప్రదాయానికి అనుగుణంగా వాళ్లు తమ కష్టాలను యెంతగానో, యెంతో బిగ్గరగా చెప్పుకునేవాళ్లు, వాళ్ల మొత్తుకోళ్లు మూడుమైళ్ల దూరం వినిపించివుంటాయి.

వీళ్లు మొద్దు మనుషులు, శనిదేవత కాలి కింద నలిగి, కృశించి నీరసించిపోయిన తమ పుట్టిన గడ్డనుండి పెకలింపబడి, గాలికాలపు పండుటాకుల్లాగ యిక్కడికికొట్టుకవచ్చినవాళ్లు. యీ వింత సంపన్మయవాతావరణానికి వాళ్లు కండ్లు చెదిరి, నివ్వెరపోయినారు, యిక్కడి కష్టమైన పనితో పూర్తిగా కొయ్యబారిపోయినారు. వాళ్లు తమమసకబారిన దిగులు కన్నులు పులపొడుస్తూ ప్రతిదాన్నీ దిగ్భ్రాంతితో చూసేవాళ్లు, ఒకరివైపు ఒకరు జాలిగా చిరునవ్వు నవ్వుతూ, నీరసకంఠాలతో మాట్లాదుకునేవాళ్లు:

“ఓ, యేమి భూమి!”

“బంగారు పండే భూమి!”

“అయినా, కాస్త గరువు నేల….”

“సుఖం లేని భూమి, మొత్తానికి….”

వాళ్లకు తమ సొంత వూర్లు జ్ఞాపకం వచ్చేవి-కొబిలీ లోగ్, సుహోయ్ గోన్, మోకెంకొయె – ప్రతి పిడికెడుమట్టిలోనూ తమ తాతముత్తాతల బూడిద కలిసిన వూర్లు- ప్రతిదీ మనసులో నాటుకొని, తమకు పరిచితమై, ప్రీతిపాత్రమై, ప్రతిదీ తమ చెమటతో తడిసిన వూర్లు.

వాళ్లతో కలిసి అక్కడ మరొక స్త్రీ వుండేది- యెత్తుగా, నిటారుగా, పెద్దదవడలతో, కొయ్యపలక లాగ చదునైన రొమ్ముతో, బొగ్గులాగ నల్లగా వున్న, కాంతిలేని మెల్లకండ్లతో.

సాయంత్రం పూట ఆమె, పసుపు కర్చీఫ్ స్త్రీతో కలిసి, గుడిసె వెనుక కొంత దూరంపోయి, రాళ్ల కుప్పమీద కూర్చొని, చేతిమీద చెంప మోపి, తల ఒక పక్కకు వాల్చి, కోపిష్టి గొంతు యెత్తి పాడేది:

“వూరి శ్మశానం ఆవలనూ
పచ్చపచ్చని పొదల మాటునా
బంగరు కాంతుల యిసుక తిన్నెపై
నా తెల్లని శాలువ పరిచెదనూ.
అక్కడ కూర్చుంటాను
నా ప్రియతముడొచ్చిందాకా
ఆతడు అచటికి రాగానే
ఆహ్వానిస్తా హృదయంతో….”

పసుపు కర్చీఫ్ మనిషి సాధారణంగా మౌనంగా వుండేది, మెడ వంచి తన కడుపు వైపు చూసుకుంటూ, ఒకోసారి ఆమె కూడా కలిసేది, పాటలోని విషాదపూరితమైన మాటలను బొంగురు, యీడుపు, మగగొంతుతో పాడుతూ:

“ఓ ప్రియతమా,
నా హృదయమా,
నాకిక లేనే లేదా
మళ్లీ నిను గను రాతా….”

దక్షిణాది రాత్రుల వూపిరాడనీని నల్లని చీకటిలో యీ శోకకంఠాలు వింటుంటే ఉత్తరాది మంచు యెడారులూ, హుంకరించే మంచుతుఫానులూ, తోడేళ్ల దూరపుకూతలూ జ్ఞాపకం వస్తాయి….

తరువాత మెల్లకంటి స్త్రీ జ్వరంతో పడిపోయింది. ఆమెను స్ట్రెచర్ మీద పట్టణానికి తీసుకుపోయినారు. దానిమీద ఆమె వణుకుతూ యేడ్చింది, వూరి శ్మశానం గురించీ,బంగరు కాంతుల యిసుక తిన్నె గురించీ పాట పాడుతూనే వుందా అన్నట్లు.

.. .కర్చీఫ్ తల వంగి అదృశ్యమైంది.

నేను తిండి ముగించి, పావులోని తేనెను ఆకులతో కప్పి, సంచి భుజానికి తగిలించుకొని, వాళ్లు పోయే దారిలోనే తీరికగా బయలుదేరినాను, కార్నెల్ చేతికర్ర గట్టినేలమీద టకటకలాడిస్తూ.

నేను ఆ యిరుకు బూడిదరంగు రోడ్డుమీద పోతూవుండినాను. నా కుడివైపు ముదురునీలపు సముద్రం పైకీ కిందికీ యెగుర్లాడుతున్నది. అదృశ్యంగా వున్న వడ్రంగులు వేలకొలది తోపడాలతో సముద్రంమీద పనిచేస్తున్నట్లువుంది ఆ దృశ్యం; తోపడా పొట్టుగాలికి కొట్టుకొనిపోతున్నది బీచివైపు, గలగలమంటూ; ఆ గాలి తడిగా, వెచ్చగా, సువాసనగా వుంది, ఆరోగ్యంగల స్త్రీ ఊరుపులాగ, ఒక టర్కిష్ ఫెలుకా, రేవువైపు వంగి, నీళ్లలో సరసరపోతున్నది, సుహూం చేరుకోడానికి; దాని తెరచాపలు సుహూంలోని ఆర్భాటపుఇంజనీరు వూదుచెక్కిళ్లలాగ ఉబ్బుకొని వున్నాయి – అతను చాలా ముఖ్యమైనవాడు. యెందుకనో అతను అక్షరాలు తేలబలికేవాడు.

“నోరు మూసుకో! తెలివిపరుణ్నని హనుకున్నావేమో, చిటికెలో పోలీస్స్టేషన్ కు పంపించేస్తాను!”

మనుషులను పోలీస్ స్టేషన్ కు పంపించడం అతనికి యిష్టం. యిప్పటికల్లా గోరీలోనిపురుగులు అతన్ని యెముకల దాకా శుభ్రం చేసి వుంటాయనే ఆలోచన హాయిగా వుంది.

…నడక సుఖంగా వుంది, గాలిలో తేలిపోతున్నట్లుంది. ఆహ్లాదకరమైన ఆలోచనలూ, రంగురంగుల స్మృతులూ మనసులో మెల్లగా నృత్యం చేస్తున్నాయి. నాలోపల నృత్యంచేసే ఆకారాలు సముద్రంలోని అలల్లాగ వున్నాయి- పైన తెల్లని శిఖరాలతో, లోపలలోతుల్లో ప్రశాంతంగా; అక్కడ యవ్వనపు ఉజ్వల ఉల్లాసపూరిత ఆశలు నిబ్బరంగా యీదుతున్నాయి, ఉప్పునీటి లోతుల్లో తళతళ మెరిసే చేపల్లాగ.

రోడ్డు సముద్ర తీరంవైపు పోతున్నది, అలలు ఒరుసుకునే యిసుక పీకకు అంతకంతకూ దగ్గరౌతూ. పొదలు కూడా సముద్రాన్ని చూడాలని ఉబలాటపడుతున్నట్లుంది, రిబ్బన్ లాంటి రోడ్డుమీదికి వంగి, అపార నీలజలార్ణవంవైపు మెడలు సాచుతున్నాయి.

పర్వతాలమీదనుండి గాలి వీస్తూ వుండింది – వర్షం వచ్చే సూచన.

…పాదలలోనుండి మెల్లని మూలుగు వినిపించింది – మనిషి మూలుగు, యెప్పుడైనా మనుషుల గుండెలను కదిలించేది.

నేను పొదలు పక్కకు తొలగించి చూసినాను, పసుపు కర్చీఫ్ స్త్రీ కనిపించింది. ఆమె వాల్నట్ చెట్టు బోదెకు ఆనుకొని వుంది, తల భుజంమీదికి వాలి వుంది, నోరు వికృతంగా వుంది, కండ్లు ఉబికి పిచ్చిగా వున్నాయి. తన పెద్ద పొట్టమీద చేతులుపెట్టుకొని, పొట్ట యెగిరెగిరి పడేటంత మహా అసహజంగా ఆమె వూపిరి యెగపోసుకొంటున్నది, పొట్ట చేతులతో పట్టుకొని, తోడేలుపసుపురంగు పండ్లు వెళ్లబెట్టి,మూలుగుతున్నది.

“యేమిటిది? యెవరైనా కొట్టినారా నిన్ను?” నేను అడిగినాను, ఆమెమీదికి వంగుతూ.

ఆమె ఆ బూడిదరంగు దుమ్ములో తన వుత్త కాళ్లు వూకించినట్లు కదిలించి, తన బరువైనతల తిప్పుతూ గస పెట్టింది:

“వెళ్ళిపో… సిగ్గులేదూ, వెళ్ళిపో….”

అప్పుడు అర్థమైంది నాకు అదేమైందీ – అంతకు ముందొకసారి చూసినాను అది. సహజంగానే నేను భయపడి వెనక్కి వురికినాను. కానీ ఆమె బిగ్గరగా, దీర్ఘంగా కేకలువేయసాగింది. ఆమె కండ్లు తలకాయలోనుండి బయటికి వెళ్లబొడుచుకొని వచ్చినట్లున్నాయి. ఆ కండ్లలో కన్నీరు పొంగి, ఉబ్బి బిగిసిన ముఖంమీద కారుతున్నది.

యిది చూసి నేను మళ్లీ ఆమె దగ్గరికి పోయినాను. నా సంచీ, కెటిలూ, టీ పావూనేలమీద పడవేసి, ఆమెను నేలమీద సాచి వెలకిల పండబెట్టి, ఆమె మోకాళ్లు వంచబోతుండగా, ఆమె నన్ను పక్కకు తోసి, నా ముఖంమీదా, రొమ్ముమీదా కొట్టి, అటుతిరిగి దోగాడుతూ పొదల్లోకి పోయింది, ఆడ యెలుగులాగ గురగుర మంటూ,గర్జిస్తూ:

“సైతాన్! పశువు!”

ఆమె చేతులు సచ్చుబడి బోర్లపడింది, ముఖం నేలకు కొట్టుకుంది. ఆమె మళ్లీకేకలు ప్రారంభించింది, కాళ్లు వూకించి సాచుతూ.

ఆ ఉద్వేగపు అలజడిలో ఆ వ్యవహారం గురించి నాకు తెలిసిందంతా వేగంగా జ్ఞాపకం చేసుకున్నాను. ఆమెను వెలకిల దిప్పి, ఆమెకాళ్లు మడిచినాను – పిండం పై సార అప్పటికే వెలుపలికి వచ్చింది.

 “కదలకుండా వుండు, వచ్చేస్తున్నది.”

నేను బీచికి పరుగెత్తుకుంటూ పోయి, చొక్కా చేతులు పైకి మడిచి, చేతులుకడుక్కొని, మంత్రసాని పని చేయడానికి తిరిగి వచ్చినాను.

మంటలో బేర్చ్ తాటలాగ ఆమె విలవిలలాడుతున్నది. ఆమె తన చుట్టూనేలమీద చేతులతో కొట్టుతూ, వాడిపోయిన గడ్డి గంటలు పెరికి, నోట్లో దురుక్కోడానికి ప్రయత్నిస్తున్నది; ఆ ప్రయత్నంలో ఆమె యెరుపెక్కిన పిచ్చికండ్లు గల తన వికృతభయంకరమైన ముఖంమీద మట్టి పోసుకుంది. యింతలో పై పొర పగిలి శిశువు తలకనిపించింది. నేను ఆమె కాళ్లు విలవిల తన్నుకోకుండా పట్టుకోవలసివచ్చింది, శిశువు బయటికి రావడానికి తోడ్పడవలసివచ్చింది, యేడ్చే వంకర నోట్లో ఆమె గడ్డి దురుక్కోకుండా చూడవలసివచ్చింది.

మేము ఒకరినొకరం కాస్త తిట్టుకున్నాం – ఆమె పండ్లు, యీలకరిచి తిట్టింది, నేను మెల్లగా తిట్టినాను; ఆమె బాధతోనూ, బహుశా సిగ్గుతోనూ తిట్టింది, నేను దిక్కుతెలియకపోవడంతోనూ, అపారమైన సానుభూతితోనూ తిట్టినాను.

“తండ్రీ!” ఆమె గసపోసుకుంది, నల్లబడిన, నురుగు నిండిన పెదవులుకొరుక్కుంటూ; యెండలో హఠాత్తుగా రంగు వెలిసినట్లున్న ఆమె కన్నులనుండి నీళ్లుదుమికినాయి, దుర్భరమైన ప్రసూతివేదనలో తల్లి కడవలతో కార్చే కన్నీళ్లు; ఆమె దేహమంతా ముక్కలు ముక్కలుగా చీలుస్తున్నట్లు, బిగుసుకొనిపోయింది.

“పో, వెళ్ళిపో, సైతాన్”

వడ దిరిగిన చేతులతో ఆమె నన్ను తోస్తూ వుండింది. నేను నిండు మనస్సుతో అన్నాను.

“మతి పోగొట్టుకోవద్దు! త్వరగా కానీ, ఐపోతుంది.”

నాకు ఆమెపట్ల యెనలేని పరితాపం కలిగింది, ఆమె కన్నీళ్లు నా కన్నులలోనుండే దుముకుతున్నట్లున్నాయి. ఆవేదనతో నాగుండె వ్రీలిపోయింది. నాకు యేడుపు వచ్చేటట్లుంది. నిజానికి యేడుస్తూ కేకవేసినాను:

“ఊ! కానీ!”

అంతే – నా చేతుల్లో ఒక మానవుడు వున్నాడు – యెర్రని బుల్లి మానవుడు. కన్నీళ్లతో నా కండ్లు మసకలు గమ్మినా, వాణ్ని చూడగలిగినాను – ఒళ్లంతా యెర్రగా, ప్రపంచంపట్ల అప్పుడే అసంతృప్తి చెంది, తన్నుకుంటూ, కొట్టుకుంటూ, గొంతెత్తి అరుస్తున్నాడు, యింకా తల్లికి బంధింపబడివున్నప్పటికీ. వానికి నీలికండ్లు వున్నాయి, నలిగిపోయిన యెర్రని ముఖంమీద తమాషా అయిన చిన్న ముక్కు అణగదోసినట్లుంది, వాడు వేసే కేకలకు పెదవులు కదలుతున్నాయి:

“యా- ఆ-ఆ  యా- ఆ-ఆ “

వాడు బంక బంకగా వున్నాడు, నా చేతుల్లోనుండి జారిపోతాడేమో అని నాకు భయమైంది. నేను మోకాళ్ల మీద కూర్చొని వాణ్ని చూస్తూ నవ్వుతున్నాను – వాణ్ని చూడడం అంత సంతోషంగా వుంది నాకు, ఆ సంతోషంలో తరువాత చేయవలసిన పని పూర్తిగా మరిచిపోయినాను.

“తాడు కోసెయ్….” తల్లి గుసగుస చెప్పింది; ఆమె కండ్లు మూసుకొనివుంది,

ముఖం వాడిపోయి, తెల్లగా వుంది శవంలాగ. నల్లబడిన పెదవులు కదిలీ కదలనట్లుగా ఆమెమళ్లీ అన్నది:

“కోసెయ్… కత్తితో..!”

నా కత్తి ఆ గుడిసెలో యెవరో దొంగిలించినారు; కనుక బొడ్డు తాడును పండ్లతో కొరికినాను. పసివాడు బూరగ మేళంలాగ ఆరిచినాడు. తల్లి చిరునవ్వు నవ్వింది. ఆమె కన్నుల చీకటిలోతుల్లో అపూర్వంగా నీలిదీపాలు వెలగడం కనిపించింది నాకు, నల్లబారిన ఆమె చెయి స్కర్టులో జేబు కోసం తారాడింది. కాట్లు పడి రక్తం చిమ్మిన పెదవుల సందున ఆయాసంగా మాటలు వెలువడినాయి:

“నాకు… శక్తి లేదు…. నా జేబులో… టేపుముక్క వుంది…. బొడ్డు… ముడెయ్.”

నేనా టేపుముక్క వెదకి పసివాని బొడ్డు ముడివేసినాను. ఆమె మరింత చిక్కగాచిరునవ్వు నవ్వింది, ఆ ముఖంలోని ఆనందమూ, వెలుగూ దాదాపు నా కండ్లకు మిరుమిట్లుగొలిపినాయి.

“నీవు సర్దుకో, యింతలో నేను వీణ్ని తుడుచుకొని వస్తాను.”

ఆమె ఆందోళనతో గుసగుస చెప్పింది:

“జాగ్రత్త. మెల్లగా తుడువు. జాగ్రత్తగా.”

ఆ యెర్రని బుల్లి మానవశకలంతో మెల్లగా వ్యవహరించవలసిన అవసరం లేకపోయింది. వాడు పిడికిళ్లు బిగించి అరవసాగినాడు, నన్ను యుద్ధానికి రమ్మని సవాల్చేస్తున్నట్లు:

“యా-ఆ-ఆ”

“అదీ, అలా వుండాలి! నీ హక్కులు నీవు స్థాపించుకోవాలి భయ్యా. లేకపోతే నీ చుట్టూ వున్న జనం నీ పీక నులిమేస్తారు.”

ఒక అల వచ్చి మా యిద్దరిమీదా యెగిరి పడింది. దాని తుంపురులు తాకినప్పుడు వాడు మరీ బిగ్గరగా, అత్యంత మనస్ఫూర్తిగా కేకలు వేసినాడు. తరువాత, నేను వాని రొమ్మూ, వీపూ తట్ట సాగినప్పుడు వాడు కనుబొమలు ముడివేసి, అలలు ఒకటొకటే వానిమీద పొర్లినప్పుడు తన్నుకుంటూ అరవసాగినాడు.

“అరువు భయ్యా, అరువు! దిక్కులు దద్దరిల్లేటట్లు అరువు!”

మేము అతని తల్లివద్దకు చేరుకునేటప్పటికి ఆమె కండ్లు మూసుకొని నేలమీద పండుకొని వుంది; ప్రసవానంతరపు నొప్పులతో ఆమె పెదవులు కొరుక్కుంటూ వుంది; మూల్గుల, నిట్టూర్పుల మధ్య ఆమె నీరసపు గుసగుస వినపడింది:

“పిల్లవాణ్ని… యిలా యివ్వు….”

“పిల్లవాని కేం తొందరలేదులే.”

“యిలా యివ్వు!

వణికే చేతులతో ఆమె తారాడుతూ జాకెట్ విప్పుకోసాగింది. ఆమె రొమ్ముమీది బట్టలు తొలగించడంలో నేను తోడ్పడినాను. ఆ రొమ్ము యిరవైమంది పసిబిడ్డలను సాకడానికి తగినంతగా ప్రకృతి తయారుచేసింది. కేకలు వేసే ఆ ఒరేల్ వాస్తవ్యుని నేను ఆమె వెచ్చనిదేహానికి ఆనించినాను. వాడు వెంటనే గ్రహించి, యేడుపు మానినాడు.

“తల్లీ, మేరీమాతా,” మెత్తగా అన్నది ఆమె, వణుకుతూ, సంచిమీద వున్న చింపిరితలను అటూ యిటూ తిప్పుతూ.

హఠాత్తుగా ఆమె మెల్లగా కేకవేసి, మళ్లీ కండ్లు తెరిచింది, పవిత్రమైన, అనిర్వచనీయ సౌందర్యవిలసితమైన నూతృత్వపు కండ్లు. ఆ నీలికండ్లు పైకి నీలిఆకాశంలోకి చూసినాయి. సంతోషభరమైన, కృతజ్ఞతాభరమైన చిరునవ్వు ఆ కండ్లలో మెరిసి లీనమైపోయింది. బరువుగా చేయి యెత్తి ఆమె శిలువ గుర్తు వేసుకుంది, తనకూ బిడ్డకూ వేసింది.

“భగవంతుని గన్న తల్లి… మేరీమాతా….”

ఆమె కండ్లు కాంతి తగ్గినాయి, ఆమె చాలా సేపు మౌనంగా వుండిపోయింది, దాదాపు వూపిరి కూడా పీల్చకుండా. తరువాత వ్యవహారధోరణిలో, దృఢమైన కంఠంతో ఆమె అన్నది:

“నా సంచి విప్పు, బాబూ.”

నేను సంచి ముడి విప్పినాను. ఆమె లీలగా చిరునవ్వు నవ్వుతూ, నావైపు నిశ్చలంగాచూసింది. ఆమె గుంత చెక్కిళ్లూ, చెమటపట్టిన నొసలూ యెర్రబారినట్లుతోచింది నాకు.

“ఒక నిముషం పక్కకు పో.”

“శ్రమ పడవద్దు.”

“సరేలే. పక్కకు పో.”

నేను పొదలమాటుకు పోయినాను. నా గుండె అలసిపోయింది, నా రొమ్ములో చిలిపి పక్షులు పాడుతున్నట్లుంది. యిదీ, సముద్రపు నిరంతర మర్మరధ్వనీ యెంతో హాయిగావున్నాయి, ఒక సంవత్సరమంతా అలాగే వింటూ వుండవచ్చుననిపించింది.

దగ్గరలోనే యెక్కడో సెలయేటి గలగల వినిపించింది. ఆడపిల్ల తన ప్రియుణ్నిగురించి చెలికత్తెతో చెప్పుతున్నట్లుంది అది.

పొదలపైన తల లేచింది, పసుపు కర్చీఫ్ మట్టసంగా కట్టుకొని.

“అదేమిటి? యింత తొందరగా లేచినావు?”

ఒక పొద కొమ్మలు పట్టుకొని ఆమె కూర్చుంది; ఆమె ముఖమంతా పాలిపోయింది,

ఆమె ప్రాణమంతా తోడేసినట్లు. కండ్లకు బదులు రెండు పెద్ద నీలిసరస్సులు వున్నాయి అక్కడ. చిరునవ్వు నవ్వుతూ, సుకుమారమైన అనుభూతి నిండిన కంఠంతో ఆమె అన్నది:

“చూడు, యెలా నిద్రపోతున్నాడో.”

వాడు బాగానే నిద్రపోతున్నాడు. కానీ, నాకు తెలిసినంతవరకు, పసిబిడ్డలందరిలాగే. భేద మేమైనా వుంటే పరిసరాలలో వుంది: వాడు తళతళ మెరిసే శరత్కాలపు ఆకులకుప్పమీద, ఒక పొదకింద పండుకున్నాడు, అలాంటి పొదలు ఒరేల్ ప్రాంతంలో పెరగవు.

“నీవు పండుకుంటే మంచిది, అమ్మా,” అన్నాను.

“లేదు,” అన్న దామె నీరసంగా తల ఆడిస్తూ. “సర్దుకొని బయలుదేరాలి ఆ వూరు – అదేదీ?”

“ఒచెం చీరీ?”

“ఆఁ. మావాళ్లు యిప్పటికే కొన్ని మైళ్లు ముందు పోయివుంటారు.”

“నడిచి పోతానంటావేమిటి?”

“మేరీమాత లేదూ? ఆమె తోడ్పడుతుంది.”

సరే, మేరీమాత ఆమెకు తోడు వుంది గనుక, నేను నోరు మూసుకున్నాను!

ఆమె ఆ ముడుచుకున్న చిన్నముఖం వైపు నిశ్చలంగా చూసింది, కండ్లలో హార్దికమైన మెత్తని కాంతిపుంజాలు కళకళలాడుతూ. ఆమె పెదవులు నాక్కుంది, చేత్తో మెల్లగా తన రొమ్ము నిమురుకుంది.

నేను ఒక మంట ముట్టించి, చుట్టూ రాళ్లు అమర్చినాను, వాటిమీద కెటిల్ పెట్టడానికి.

“నిముషంలో నీకు కాస్త టీ తయారుచేస్తాను, అమ్మా.”

‘ఓ, చెయ్! నా రొమ్ములో అంతా యెండిపోయింది.”

“మీ వాళ్లు నిన్ను యెందుకు వదిలేసినారు?”

“లేదు, వదిలేయలేదు. నేను వెనుకబడిపోయినాను. వాళ్లు కాస్త తాగినారు… అది మంచిదే అయింది. వాళ్లు నా వెంటవున్నప్పుడు యిది జరిగివుంటే యెలా వుండేదో.”

ఆమె నా వైపు చూసి, ముఖానికి మోచేయి అడ్డం పెట్టుకుంది. తరువాత రక్తంతో సహా యెంగిలి ఉమ్మేసి, సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వింది.

“యిది మొదటి కాన్సా?”

“ఔను. నీ వెవరు?”

“మనిషిని, యేదో ఒక విధంగా….”

“అది కనపడుతున్నదిలే. నీకు పెండ్లైందా?”

“అంత గౌరవం కలగలేదు.”

“బొంకుతున్నావు!”

“లెదు.”

ఆమె రెప్పలు వాల్చింది; తరువాత అన్నది:

“యీ ఆడవాళ్ల పని నీకెలా తెలుసు?”

అప్పుడు బొంకినాను.

“నేర్చుకున్నాను. నేను విద్యార్థిని- అంటే తెలుసా?”

“బాగా తెలుసు. మా గురువుగారి పెద్ద కొడుకు విద్యార్థి. గురువు కావడానికి నేర్చుకుంటున్నాడు.”

“అదే, నేనూ ఒక విద్యార్థిని. పోయి నీళ్లు తెస్తాను.”

ఆమె పసిబిడ్డమీదికి వంగింది, వానికి వూపిరి ఆడుతున్నదో లేదో వినడానికి. తరువాత సముద్రంవైపు చూసింది.

“స్నానం చేస్తే బాగుండు, కానీ యిక్కడి నీళ్లు వింతగా వున్నాయి. యేమి నీళ్లుయివి? ఉప్పగా, చేదుగా వుంటాయి.”

“స్నానం చేసిరాపో – యివి ఆరోగ్యకరమైన నీళ్లు.”

“నిజంగా?”

“ఔను. సెలయేట్లోకంటె వెచ్చగా వున్నాయి కూడా, అవి మంచులాగున్నాయి.”

“నీవు చెప్తే సరే….”

ఒక అబ్ హాజియన్ గుర్రంమీద తూగుతూ, నడక వేగంతో పోతూవుండినాడు, అతనితల రొమ్ముమీదికి వాలి వుంది. ఆ బిగువైన చిన్నగుర్రం, చెవులు అల్లాడిస్తూ, పెద్ద నల్లని కండ్లతో మా వైపు సందేహంతో చూసి సకిలించింది. రౌతు, బొచ్చు టోపీ పెట్టుకున్నతన తల పూకించి యెత్తి, మా దిశగా చూసి, మళ్లీ తల వాల్చినాడు.

“తమాషా అయినవాళ్లు, యిక్కడి మనుషులు, అంత భయంకరంగా కనిపిస్తారు కూడా,” అన్నది ఒరేల్ యువతి మెల్లగా.

నేను నీళ్లు తేవడానికి పోయినాను. సెలయేరు స్వచ్ఛంగా, పాదరసంలాగ రాళ్ల మీదనుండి దుముకుతున్నది; శరత్కాలపు ఆకులు ఉల్లాసంగా నీళ్లలో పల్టీలు కొడుతున్నాయి.

అద్భుతం! నేను చేతులూ, ముఖమూ కడుక్కొని, కెటిల్నిండా నీళ్లు పట్టుకొని, తిరిగిపోయినాను. పొదల సందున ఆమె కనిపించింది, మోకాళ్ల మీద ప్రాకుతూ, ఆందోళనగా వెనక్కిచూస్తూ.

“యేమిటి సంగతి?”

ఆమె ఉలిక్కిపడింది, ముఖం తెల్లబడింది. ఆమె తన శరీరం కింద యేదోదాచి పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. అది యేమయిందీ నేను ఊహించుకున్నాను.

“అది యిలా యివ్వు, పాతిపెడతాను.”

“ఓ! దీన్ని స్నానాలగదిలో పాతిపెట్టాలి, భూమిలో….”

“యిక్కడ త్వరలో స్నానాలగది కట్టబోతున్నారా?”

“నీవు హాస్యమాడుతున్నావు, నాకేమో భయంగా వుంది! యే జంతువైనా తినిపోతే యెలా? దీన్ని భూమిలో పాతిపెట్టాలి.”

ఆమె ముఖం పక్కకు తిప్పుకొని, తడిగా వున్న బరువైన మూట నా చేతికిచ్చి,మెల్లగా, సిగ్గు పడుతూ అంది:

“సరిగా చేస్తావు కదూ, లోతుగా? యేసుక్రీస్తు కోసమని… యీ పసివాని కోసమని, సరిగా చెయ్, నీకు పుణ్య ముంటుంది….”

నేను తిరిగి వచ్చేటప్పటికి ఆమె బీచినుంచి వస్తున్నది, తడబడే అడుగులతో, చేయిపార జాపుకొని; ఆమె స్కర్టు నడుముదాకా తడిసింది, ముఖం కొద్దిగా యెర్రబారింది, లోపలి కాంతితో వెలుగుతున్నట్లు. నేను ఆమెను మంట దగ్గరికి తీసుకువచ్చి, ఆశ్చర్యంతో అనుకున్నాను:

“యేమి శరీరబలం!”

తరువాత మేము తేనెతో టీ తాగినాం. ఆమె మెల్లగా అన్నది:

“అయితే చదువు మానేసినావన్నమాట?”

“ఔను.”

“తాగుడు – కదూ?”

“ఔను. తాగుడుతో నాశనమైనానమ్మా!”

“సిగ్గు చేటు! యిలా చూడు, నీవు సుహూంలో తిండిని గురించి మేనేజర్ తో రగడ

పెట్టుకున్నప్పుడు నిన్ను చూసినాను. అప్పుడనుకున్నాను: యితను తాగుబోతై వుండాలి, యెవరన్నా యితనికి భయం లేదు.”

ఆమె తన వాచిన పెదవులమీది తేనె నాక్కుంది. సరికొత్త ఒరేల్ మనిషి ప్రశాంతంగా నిద్రిస్తున్న పొదవైపు ఆమె తన నీలికన్నులు తిప్పుతూనే వుంది.

“వీడు యెలా బతుకుతాడో?” అన్నది ఆమె నిట్టూరుస్తూ, నావైపు పరిశీలనగాచూస్తూ. “నీవు మంచి సాయం చేసినావు – కృతజ్ఞురాలిని. కానీ వీనికిది మంచిదేనా, యెమో….”

తినడం, తాగడం అయిన తర్వాత ఆమె సిలువ గుర్తు వేసుకుంది. నేను నా సంసారం సర్దుకుంటూ వుండగా ఆమె మత్తుగా వూగుతూ కూర్చుంది, మళ్ళీ రంగువెలిసినట్లున్న కన్నులతో నేలకేసి నిలజూస్తూ. తరువాత ఆమె లేచి నిలబడింది.

“నిజంగా బయలుదేరుతున్నావా?” అన్నాను.

“ఔను”

“నడిచే శక్తి వుందంటావా?”

“మేరీమాత లేదూ? వాణ్ని యిలా యివ్వు!”

“వీణ్ని నేను తెస్తాను.”

కొంత వాదులాట తర్వాత ఆమె లొంగింది. మేము బయలుదేరినాం, పక్కపక్కన, భుజం భుజం రాచుకుంటూ.

“తొట్రుకొనిపడను గదా,” అన్నదామె, క్షమార్పణగా చిరునవ్వు నవ్వుతూ, నాభుజంమీద చెయ్యి పెట్టి.

రష్యాదేశపు కొత్త పౌరుడు, అజ్ఞాత భవితవ్యం గల మానవుడు, నా చేతుల్లో పండుకొని వున్నాడు, ముక్కుతో పెద్దవాళ్ల చప్పుళ్లు చేస్తూ, సముద్రం, తెల్లని తోపడాపొట్టుతో నగిషీ చేయబడి, ఒడ్డుకు కొట్టుకుంటూ, మర్మరిస్తున్నది; పొదలు ఒక దానితో ఒకటి గుసగుసలాడుతున్నాయి, సూర్యుడు మధ్యాహ్నరేఖమీద ప్రకాశిస్తున్నాడు.

మేము మెల్లగా నడుస్తూ పోయినాం, తల్లి అప్పుడప్పుడూ నిలబడి దీర్ఘంగానిట్టూరుస్తూ, తల వెనక్కి యెగిరేస్తూ, సముద్రంవైపూ, అడవులవైపూ సర్వతాలవైపూ నిలజూస్తూ, తరువాత తన కొడుకు ముఖంలోకి తొంగిచూస్తూ. ఆమె కండ్లు వేదనాశ్రువులచేత క్షాళితమై మళ్లీ ఆశ్చర్యకరమైనంత స్వచ్ఛంగా వున్నాయి, అనంత ప్రేమజ్యోతియొక్క నీలికాంతితో వెలిగిపోతూ.

ఒకసారి ఆమె నిలబడి అన్నది:

“తండ్రీ, భగవంతుడా! యెంత అద్భుతంగా వుంది! నేను యిలాగే పోగలను, ప్రపంచం చివరకు యిలాగే యిలాగే, వీనితో, యీ నా పసివాడు పెరుగుతూ, తల్లిరొమ్మున స్వేచ్ఛగా పెరుగుతూ, నా ముద్దుల చిన్నారిబాబు….”

సముద్రం మర్మరిస్తూనే వుంది….

1912


(ఈ కథ గోర్కీ జీవితంలోని ఒక ఘటనమీద ఆధారపడింది. 1892 అంత్యకాలంలో గోర్కీ కాకసస్ లో సుహూం-నొవొరొస్సీయస్క్ రోడ్డు నిర్మాణంలో పనిచేసినాడు. అక్కడ, ఒక నిర్మానుష్యమైన దారిలో నొప్పులు పడుతున్న స్త్రీ ఒకామె ఆయనకు తటస్థపడింది. ఆమెకు కాన్పు చేసినాడు ఆయన-సం.)

Featured image: Mother Child Maternity, Kuzma Petrov Vodkin, 1913

14-10-2025

2 Replies to “నన్ను వెన్నాడే కథలు-11”

  1. నువ్వు కథకుడివే అయితే నీ జీవితానికి ఇలాంటి కథ ఒక్కటి రాస్తే చాలనిపిస్తుంది. నువ్వు మనిషివే అయితే నీ తోటిమనిషి పట్ల ఇటువంటి సౌభ్రాతృత్వాన్ని ప్రకటించగలిగే ఒక్క రోజు దొరికినా చాలనిపిస్తుంది.
    మీ పలుకులు మేలిమి బంగారపు తునకలు. ఆ మెరుపు తళుకులు చూస్తూ ఆహా అనుకోవడమే.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading