కడలీ, పుడమీ

నేనింతకుముందు మీతో ఒక సంగీతపత్రిక గురించి ముచ్చటించాను. Interlude.HK. ఆ పత్రిక 22-8-2025 నాటి సంచికలో పర్వతాల మీద కూర్చిన పదిహేను శాస్త్రీయ సంగీత కృతుల గురించి వివరంగా రాసింది. పాశ్చాత్య సంగీతంలో, పర్వతారోహణల్నీ, పర్వతగాంభీర్యాన్నీ, పర్వతసౌందర్యాన్నీ సంగీతంలోకి అనువదించిన పదిహేను కృతులు. వాటిల్లో Franz Liszt కృతి కూడా ఒకటి ఉంది. ఆధునిక ఫ్రెంచి సాహిత్యవేత్తల్లో అగ్రగణ్యుడైన విక్టర్ హ్యూగో 1831 లో రాసిన Ce qu’on entend sur la montagne’ ( What One Hears on the Mountain) అనే గీతానికి స్వరకల్పన అది.

విక్టర్ హ్యూగో రొమాంటిక్ యుగానికి ఫ్రెంచి ప్రతినిధి. జర్మనీలో గొథేలాగా, ఇంగ్లిషులో బైరనులాగా అతడు తన కాలం నాటి భావోద్వేగాలకి ఒక గంభీరవాక్కుని సంతరించగలిగాడు. (అవును, విక్టర్ హ్యూగో అంటే, The Hunchback of Notre Dame (1831) నవల రాసినాయనే. కానీ, హ్యూగో అన్నిటికన్నా ముందు మహాకవి, స్వేచ్ఛాగీతకారుడు, ధిక్కారకవి, మూడవ నెపోలియను కాలంలో తన స్వాతంత్ర్యకాంక్షవల్ల దేశబహిష్కార శిక్ష పొందినవాడు కూడా!) అటువంటి రొమాంటిక్ భావోద్వేగానికి Franz Liszt లాంటి మరొక రొమాంటిక్ సంగీతకారుడు మాత్రమే స్వరకల్పన చేయగలడు. హ్యూగో గీతానికి స్వరకల్పన చేస్తూ, ఆ గీత సారాంశాన్ని లిస్ట్ ఇలా వివరించాడని ఇంటర్ లూడు పత్రిక రాస్తున్నది:

ఈ వివరణ చూసిన తరువాత ఈ గీతం వెంటనే చదివాను. అన్నిటికన్నా ముందు, ఆ గీతంలోని ఆ గంభీరవాక్కు, ఆ sustained emotion నన్ను విభ్రాంతపరిచాయి. విక్టర్ హ్యూగోని చదవవలసినంతగా చదవలేదని అర్థమయింది. వెంటనే Selected Poems (పెంగ్విను, 2002) తెప్పించాను. అందులో ఈ కవితలేదు. కాని ఆర్కైవులో ఇంతకన్నా మంచి సంపుటి ఒకటి దొరికింది. అందులో ఈ కవితకు ప్రశస్త అనువాదం కనిపించింది. ఈ కృతి విన్నప్పణ్ణుంచీ, ఈ గీతం చదివినప్పణ్ణుంచీ, గత రెండుమూడు నెలలుగా ఆ గీతాన్ని తెలుగు చేయాలనే అనుకుంటూ ఉన్నానుగాని, నాకు శక్తిచాలలేదు. అయినా ఇప్పటికి సాహసించి, ఇలా తెలుగులో మీతో పంచుకుంటున్నాను. (ఇటువంటి కవిత తెలుగులో ఎవరు రాయగలరా అనిపించింది. ఎంత ఆలోచించినా బైరాగి ఒక్కడే కనిపిస్తున్నాడు!)

ఈ గీతం చదివాక ఆ సంగీత కృతి కూడా వినండి. (మన తెలుగు సంగీతకర్తలు ఎప్పటికి ఇటువంటి స్వరకల్పనలు చేయగలుగుతారు!)


కొండమీద మనమేదో వింటున్నప్పుడు

ఓ శిఖరౌన్నత్యమా!

నువ్వెప్పుడేనా, ప్రశాంతగంభీరంగా ఉన్నప్పుడు
పర్వతశిఖరం పైన నిలబడి స్వర్గసన్నిధిని అనుభవంలోకి తెచ్చుకున్నావా?
అది శబ్దతీరంలోనా లేక బ్రిటనీ సముద్రతీరంలోనా?
పర్వతపాదాల చెంత సముద్రసన్నిధినా?
అక్కడ ఆ సాంద్రతరంగాల మ్రోల నిల్చుని
ప్రశాంతంగా, మౌనంగా నువ్వేదైనా వినగలిగావా
ఇదిగో, మనం వినేదిదే- రోజుకొక్కసారైనా కలల్లో
నా ఊహాలు సముద్రతీరంపైన ఆ విహంగయానం మీద నిలుస్తాయి
ఆ మహాపర్వత శి ఖరం మీంచి ఆ తిక్తాఖాతంలోకి దూకుతాయి
ఒక పక్క పుడమి, మరొక పక్క కడలి
నేను విన్నాను, ఆలకించాను, కాని ఒకసారి విన్న గొంతుమరొకసారి వినబడలేదు
అది ఏదో ఒక గళం నుంచి వెలువడి మన చెవుల్ని తాకేది కాదు.

మొదట్లో, అదొక విస్తార, సాంద్ర, కల్లోల ధ్వని
చెట్లమధ్యనుంచి ఈళపెట్టే గాలికన్నా అస్పష్టం
తారస్థాయి స్వరాలాపన, తీపి గుసగుస
సాయంకాల రాగంలాగా మెత్తన, ఖడ్గసంచాలనంలాగా సుదృఢం
బధిరాంతక సమరక్షేత్రం పదాతిదళాల్ని కౌగిలించుకుని
మహోద్రేకంతో యుద్ధభేరీనినాదంగా మారుతుంది
అది మనం తుడిచిపెట్టలేని, విస్మరించలేని ప్రగాఢ సంగీతం
తెంపులేకుండా ప్రపంచమంతా పరుచుకునే ఒక ద్రవస్థితి
పునః పునః సంచలించే తన తరంగిత వలయాలతో
విస్తృత గగనాలపైన విస్తరిస్తూపోతున్నది
కింద అఖాతంలోని నీడల్లోకి
కాలం, దేశం, రూపం, గణనాలతోసహా
తనని తాను కోల్పోయేట్టుగా ప్రవహిస్తుంది.
మరొక విశీర్ణవాతావరణంలాగా
ఆ అనంతస్తోత్రం సమస్తభూమండలాన్నీ ముంచెత్తుతుంది.
సమరససుశ్రావ్యతలో తెరచాపలెత్తి గాల్లో పయనిస్తూ
ఆ సంగీత సమారోహం మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తుంది.

ఒకింత నిర్లిప్తుడనై నేనీ శూన్యవీణల్ని వింటూ
ఆ శబ్దార్ణవంలో తప్పిపోయాను.
మొత్తానికి తికమకపడుతూనే, అస్పష్టంగానే
ఒకదానితో ఒకటి కలగలిసిపోయిన రెండు ధ్వనుల్నీ పోల్చుకున్నాను.
అవి భూమ్మీంచీ, సముద్రమ్మీంచీ ఆకాశం వైపు ప్రవహిస్తున్నాయి
ఏకకాలంలో ఒక విశ్వపరివ్యాప్తగీతాన్ని గానం చేస్తున్నాయి
ఒకే కెరటం కింద రెండు సముద్రప్రవాహాల్ని కనుగొన్నట్టుగా
లోతైన ఒక మర్మరధ్వనిలో నేనా రెంటినీ వినగలిగాను.
ఒకటి సముద్రాల్లోంచి ప్రభవించింది, వైభవగానం. సంతోషస్తోత్రం.
అది కెరటాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్న చప్పుడు
మరొకటి, మనముంటున్న భూమ్మీంచి పైకి లేస్తున్నది.
మనుషుల సణుగుడు, విషాదవికీర్ణం
అహర్నిశలు నడుస్తున్న ఈ మహాసంగీత సమారోహంలో
ప్రతి ఒక్క కెరటానికీ తనదంటూ ఒక గొంతు ఉంది, ప్రతి ఒక్క మనిషికీ తనదైన ఒక గోల ఉంది .

ఇప్పుడు, నేను చెప్పానుకదా, ఈ సుందరసాగరం
ఒక సంతోష, ప్రశాంత గళాన్ని పరచిపెట్టింది
దైవనగరంలో ప్రాచీనవీణల్లాగా ఆ స్వరం
సృష్టి సౌందర్యాన్ని సంస్తుతిస్తున్నది.
మందపవనాలూ, ఝంఝామారుతాలూ ఆ కోలాహలాన్ని
మరింత విస్మయోద్వేగంతో భగవంతుడివైపు కొనిపోతున్నవి
ఆ కెరటాలు ప్రతి ఒక్కటీ దేవుడుమాత్రమే లాలించదగ్గవి
ప్రవక్తదానియేలు సన్నిధిలో తలవంచిన సింహంలాగా
ఆ మహాసముద్రం ఒక్కొక్కప్పుడు తన స్వరతీవ్రత తగ్గిస్తుంది
సంధ్యావసానవేళ అగ్నికీలలు చిమ్ముతున్నప్పుడు
భగవంతుని హస్తం ఆ బంగారు జూలు నిమరడం
నేను చూసాననే అనుకుంటున్నాను.

అయితే ఆ మహనీయ కోలాహలం చెంతన
మరొక స్వరం, భీతిల్లిన వార్తాహరుడి హాహాకారంలాగా
తుప్పుపట్టిన నరకద్వారపు తలుపుగొళ్ళేలలాగా
ఇనపతంత్రీవాద్యంపైన నొక్కుపడ్డ కమానులాగా
కీచుమంటూ, తునిగిపోతూ, విలపిస్తున్నది,

అది పరాభూత అభిశప్తత, చరమపశ్చాత్తాప తిరస్కరణ, తాపసదీక్షాతిరస్కరణ,
శాపం, దైవనింద, పొలికేక- సుళ్ళుతిరుగుతున్న
మానవ వ్యర్థాలాప ప్రవాహంలో కొట్టుకుపోతున్నవి
దినాంతవేళ నిశీథి కమ్ముకుంటున్నప్పుడు లోయమీంచి గబ్బిలాల గుంపులు ఎగిరిపోయినట్టు
ప్రకంపిస్తున్న సహస్రాధిక ప్రతిధ్వనుల్లో వినిపించే ఆ చప్పుడేమిటి?
అయ్యో! అది మన పుడమి, అక్కడ మనిషి ఏడుస్తున్నాడు.

సోదరా, మనం ఇంతదాకా విని ఉండని,
నిరంతరం పునరుజ్జీవిస్తూ, నిరంతరం తిరోహితమవుతూ
వినిపిస్తున్న ఈ రెండు శబ్దాలూ
ఒకటి: ‘ప్రకృతి’ అంటున్నది, మరొకటి, ‘మానవాళి’ అంటున్నది
బహుశా దేవుడొక్కడే కల్పాంతపర్యంతం ఈ ఘోష వింటూ ఉంటాడు.

నేను ఆలోచనలో పడ్డాను; నా ఆత్మకి
అయ్యో! ఇప్పటిదాకా రెక్కలు దొరకలేదు
నా నీడలో ఇంతదాకా ఇంత వెలుతురు చూసింది లేదు
నేనట్లా చిరకాలం స్వప్నిస్తూ ఉన్నాను, మార్చిమార్చి పరికిస్తూ ఉన్నాను
నా నుంచి దాచిపెట్టిన ఆ అంధకారపూరిత పాతాళాన్ని
నా ఆత్మలో తెరుచుకున్న అంతులేని అఖాతాన్ని
అసలు మనమిక్కడెందుకున్నామని ఆలోచించాను
ఇదంతా దేనికోసం, మన ఆత్మకి కర్తవ్యమేమిటి, కేవలం ఉండటమేనా, లేకా జీవించడం కూడానా
ఎందుకని భగవంతుడు, ఈ ప్రకృతిగీతాన్నీ, మానవవిలాపాన్నీ ఒక్కచోట చేర్చే
ఒక నిష్ఠుర పాణిగ్రహణగీతాన్ని తానొక్కడే పఠిస్తున్నాడు?


Featured image courtesy: unsplash.com

4-10-2025

6 Replies to “కడలీ, పుడమీ”

  1. ముందుగా హృదయ పూర్వక నమస్కృతులు.
    ఇది చదివాక నాలోని సంగీతకృతి.

    “ఇక్కడ కవి రెండు స్వరాలు వింటున్నాడు. ఒకటి ఎల్లల్లేనిది, వైభవోపేతం, సువ్యవస్థితం. భగవంతుడి ఎదట ఒక సంతోషగానాన్ని వినిపిస్తున్నది. మరొకటి బోలుగొంతు. దుఃఖపూరితం, ఏడ్పులూ, పెడబొబ్బలూ, నిందలూ, శాపాలతో కూడుకున్నది. ఒకటి ప్రకృతిని వర్ణిస్తున్నది. మరొకటి మానవాళిని చిత్రిస్తున్నది. అవి రెండూ పక్కపక్కనే పెనగులాడుతూ, ఒకదాన్నొకటి దాటుకుంటూ, ఒకదానితో ఒకటి కలగలిసిపోతూ ఉన్నవి. చివరకూ ఆ రెండూ కూడా ఒక పవిత్రస్థితిలో అంతర్ధానమవుతున్నవి.”

    తెలుసా మహానుభావా… శ్రీ చినవీరభద్ర… ఒక్కో రాగం ఒకోసారి వింటూ ఆస్వాదిస్తూ,ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కానీ ఈ మాటలు అన్ని రాగాల సమన్వయం. మీ ఆలోచనల్ని అందుకోవడం లో నాకు తెలుగు భాష ని నేర్పిన మా నాన్నగారికి హృదయపూర్వకంగా కైమోడ్పులు.

    “ఈ కృతి విన్నప్పణ్ణుంచీ, ఈ గీతం చదివినప్పణ్ణుంచీ, గత రెండుమూడు నెలలుగా ఆ గీతాన్ని తెలుగు చేయాలనే అనుకుంటూ ఉన్నానుగాని, నాకు శక్తిచాలలేదు. అయినా ఇప్పటికి సాహసించి, ఇలా తెలుగులో మీతో పంచుకుంటున్నాను.’
    తమకు శక్తి చాలా లేదా? ఆశ్చర్యం. మీరు రాసే ప్రతి పదం ఒక తల్లిగా నాకు కలిగిన కష్ట, నష్టాల్లో నుంచి నాలో కలిగే అలజడికి ఓదార్పు ని ఇవ్వగలిగే శక్తి కలవి.
    మాటల్లో వ్యక్తం చేయలేని ఆశక్తత వల్ల నా భావాల్ని తెలియజేయలేకపోతున్నాను.
    శ్రీ బైరాగి గారి సంగీత కృతి ఈ ఉదయం నేను మౌనంగా ఆలపిస్తున్న రాగం లో అనేక రాగాల్లో సమ్మేళితమై వినిపిస్తోంది.
    నమోనమః

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading