ఒక జీవితజయగాథ

డా.దీర్ఘాసి విజయభాస్కర్ ఉపనిషత్తుల సందేశాన్ని ‘సృష్టిగర్భ’ (ఉపనిషత్కాంతి) పేరిట తెలుగులో ఒక పుస్తకంగా వెలువరించారనీ, దానికి నేనొక పరిచయవ్యాసం రాసాననీ కూడా ఇంతకుముందు మీతో పంచుకున్నాను. మొన్న ఆదివారం విశాఖపట్టణం పౌరగ్రంథాలయంలో ఆ పుస్తక పరిచయ సభ జరిగింది. ఆ వేదిక మీద నేను కూడా ఉన్నాను.

ఆ సభకి అధ్యక్షత వహించిన రామకృష్ణానంద నన్ను కూడా ఆ పుస్తకం గురించి మాట్లాడమని పిలుస్తూ అప్రయత్నంగా ఒక గంగపుత్రుల పాట అందుకున్నాడు. గంగమ్మని స్వాగతిస్తూ ఆయనలా పాడగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ పుస్తకానికి రాసిన నా పరిచయ వ్యాసానికి ‘మరొక గంగావతరణం’ అని పేరుపెట్టాను.

గంగ భూమీదకు అవతరించిన కథ మనందరికీ తెలిసిందే. అది ఒక తరంలో జరిగింది కాదు. తరతరాల తపస్సు చివరికి భగీరథుడికి ఫలించింది. ఆయన గంగని ఎందుకు తీసుకొచ్చాడు భూమ్మీదకి? శాపగ్రస్తులైన తన పూర్వీకులకి సద్గతి కోసమే కదా. రామకృష్ణానంద గంగాగీతం ఆలపించిన ఆ క్షణాన నాకు హటాత్తుగా తట్టింది, ఇదుగో, ఇక్కడ దీర్ఘాసి విజయభాస్కర్ కూడా తన పూర్వీకుల ఆకాంక్షల్ని నిజం చెయ్యడంకోసమే ఈ ఉపనిషద్గంగని మనమధ్యకు ప్రవహింపచేసాడని.

విజయభాస్కర్ ది శ్రీకాకుళం దగ్గర అంపోలు గ్రామం. ఆయనది దమ్మలి సామాజిక వర్గం. ఆయన పూర్వీకులు వందల ఏళ్ళ కిందట బౌద్ధ ప్రచారంలో దమ్మలిపికారులుగా సేవలు అందించి ఉండవచ్చు. కాని కాలక్రమంలో బౌద్ధమత ప్రభావం క్షీణించాక ఆ సామాజిక వర్గం రైతులుగా, రైతుకూలీలుగా మారిపోయి, చివరికి నిరుపేద నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ఆ కుటుంబాల్లో, ఒక విధంగా చెప్పాలంటే ఆ ఊళ్ళో కూడా విజయభాస్కరే మొదటి గ్రాడ్యుయేటు, మొదటి పోస్టు గ్రాడ్యుయేటు, మొదటి లెక్చరరు, మొదటి ఉన్నతాధికారి, మొదటి రాష్ట్రస్థాయి అధికారి, మొదటి డాక్టరేటు, ఇక సంగీత నాటక అకాడెమీ పురస్కారం పొందిన మొదటి రచయిత కూడా. అంతేనా? ఆ మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లిషు సాహిత్యం విభాగంలో ఆయన నాటకాలమీద ప్రొ.తమ్మినేని హరిబాబు డాక్టరేటు చేసారు. ఆయన చెప్పినదానిబట్టి, ఆంధ్రవిశ్వవిద్యాలయ చరిత్రలో డాక్టరలు పరిశోధనకు నోచుకున్న మొదటి ప్రాంతీయ రచయిత కూడా విజయభాస్కరే.

ఒక మనిషి మన కళ్ళముందు, మన జీవితకాలాల్లో చేసిన ఈ ప్రయాణం మనసుని పులకింపచేసే జయగాథ. వెనకబడిన ప్రాంతాలూ, కులాలూ, కుటుంబాలూ అని తమని తాము నిరుత్సాహపరుచుకునే అసంఖ్యాకులైన యువతీయువకులకి ఈ జీవనగాథలో గొప్ప స్ఫూర్తి అయాచితంగా లభిస్తూ ఉన్నది.

ఇటువంటి జీవితాలు సహజంగానే నన్ను ఆకట్టుకుంటాయి. వారి గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. వారి జీవితప్రయాణం నుంచి నాబోటి వాడు నేర్చుకునేది ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది కాబట్టి, అదేమిటో తెలుసుకోవాలని ఉంటుంది. అందుకని మొన్న గోదావరి ఎక్సుప్రెస్సులో ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నంతసేపూ ఆయన జీవితవిశేషాలు మరీ మరీ అడిగిచెప్పించుకున్నాను.

పదిలంగా పట్టి పెట్టుకున్న మంచినీళ్ళలాంటి తన జ్ఞాపకాల్ని ఆయన చాలా ధారాపాతంగా నాతో పంచుకున్నాడు. ఆ విశేషాలన్నీ విన్న తరువాత నాకు రూమీ వాక్యమే పదే పదే గుర్తొస్తూ ఉండింది, ఇంతకు ముందు నేనెన్నోసార్లు మీతో పంచుకున్నదే, ఒక మహావాక్యం: ‘నువ్వు నీళ్ళ కోసం దప్పి పడ్డప్పుడు, గుర్తుపెట్టుకో, నీళ్ళు కూడా నీకోసం దప్పి పడి ఉంటాయి’ అన్నది.

విజయభాస్కర్ తండ్రితాతలు దాదాపు నిరక్షరాస్యులు. అటువంటి నేపథ్యం నుంచి ఈయన ఈ రోజు 25 నాటకాలూ, ఆరు నాటికలూ, నాలుగు కావ్యాలూ, ఒక నవల, ఒక కథాసంపుటి రాయడమే కాక, ఇప్పుడు ‘సూత రంగస్థలి’ అనే ఒక వినూత్న నాటకరంగసిద్ధాంతానికి రూపకల్పన ఎలా చేయగలుగుతున్నాడు? అంటే దానికి రెండు కారణాలు కనిపించాయి. మొదటిది, ఆయనలోని దప్పిక. జ్ఞానం గురించి, వెలుగు గురించి, మెలకువ గురించి నిత్యం పరితపించే ఒక హృదయం. గింజలో నిద్రాణంగా ఉందని మనమనుకునే జీవం నిజానికి ఒక నిప్పుతునకలాగా లోపల్లోపల జ్వలిస్తూనే ఉంటుంది. ఆ నీవారశూకమట్లా సంతప్తంగా ఉందని తెలియగానే మట్టి దాన్ని ఆహ్వానిస్తుంది. మేఘం ఆ వైపుగా ప్రయాణిస్తుంది. సూర్యరశ్మి వర్షిస్తుంది. భూమ్యాకాశాలు ఏకమై ఒక రసక్రతువు మొదలుపెడతాయి. గింజలోంచి మొలక అంకురిస్తుంది.

విజయభాస్కర్ కి ప్రాథమిక పాఠశాలలో చదువుచెప్పిన బంకుపల్లె కృష్ణమూర్తి ఆ పిల్లవాడికి కాళిదాసు పేరు పరిచయం చేసాడు. శ్రీకాకుళంలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజి అయిపోగానే బస్సుకోసం ఆగకుండా కాలినడకన ఇంటిదారి పట్టే కుర్రవాడితో పాటు కలిసి నడుస్తూ ఇంగ్లిషు ఉపాధ్యాయుడు పల్లి సీతారాములు తాను మర్నాడు చెప్పబోయే పాఠం ముందు రోజే చెప్పేసేవాడు. గ్రాడ్యుయేషను పూర్తయ్యాక బి.ఇడిలోనూ, ఎమ్మేలోనూ కూడా సీటు ఒక్కసారే వచ్చింది. ఆ రోజుల్లో సాధారణంగా ఏ తండ్రి అయినా బి.ఇడి లో చేరమనే చెప్పి ఉండేవాడు. ఉద్యోగం తక్షణ అవసరం కాబట్టి. కాని విజయభాస్కర్ తండ్రి నువ్వు ఎమ్మే చదువు, మరింత ప్రపంచం చూస్తావు అని చెప్పాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లిషు సాహిత్యంలో ఎమ్మేలో చేరిన విజయభాస్కర్ కి ఎల్.ఎస్.అర్.కృష్ణశాస్త్రి వంటి ఆచార్యుడు దొరకడం నిజంగా భాగ్యం. ఆయన ఆ రోజు అరవిందుల సావిత్రిలోని మొదటి అధ్యాయం The Golden Dawn చెప్పి ఉండటం కూడా ఈ రోజు ఉపనిషత్కాంతిగా ప్రసరించడానికి కారణమయ్యిందని చెప్పవచ్చు.

ఇవి అందరికీ దొరికే అనుభవాలు కాదు. ఎమ్మేలో ఉండగా విజయభాస్కర్ ఒక రేడియో నాటిక రాసాడు. రాసానని కృష్ణశాస్త్రిగారికి చెప్పాడు. ఆ ఆచార్యుడు ఒక ట్రాన్సిస్టరు తెప్పించి క్లాసులో పిల్లల్తో పాటు ఆ నాటిక వినడం మొదలుపెట్టాడు. ఈ లోపు వైస్-ఛాన్సలరు నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. కాని ఆచార్యుడు నాటిక పూర్తయ్యేదాకా కదల్లేదు. ఆ తర్వాత వి.సి ఆయన్ని ఎలానూ అడుగుతాడు కదా. ఆయన కారణం చెప్పాడు. ఆవుల సాంబశివరావు లాంటివాడు ఆ వి.సి కుర్చీలో కూర్చున్నాక, సంగతి ఇదీ అని తెలిసాక, ఆ యువకుణ్ణి వచ్చి తనని కలవమని ఆహ్వానించకుండా ఎలా ఉంటాడు?

చింతపల్లి ప్రభుత్వ జూనియరు కళాశాలలో పనిచేస్తున్న రోజుల్లో విజయభాస్కర్ కి కాళీపట్నం రామారావుగారి ద్వారా ఎస్.కె.మిశ్రో పరిచయం లభించింది. అత్యంత గౌరవనీయుడైన ఆ ప్రయోక్త ఆ తరువాత ఆయిదారేళ్ళపాటు విజయభాస్కర్ ని తన కొడుకులాగా చూసుకున్నాడు. రూపకప్రయోగ రహస్యాలు మొత్తం బోధించాడు. మొన్న విశాఖపట్టణంలో విజయభాస్కర్ కి ‘నాటకరత్న’ బిరుదు లభించిందంటే దానివెనుక మిశ్రో గారు ఆనాడు వర్షించిన ప్రేమామృతమే కారణమంటే అతిశయోక్తి కాదు కదా!

మునిసిపల్ పరిపాలనా శాఖలో విజయభాస్కర్ దాదాపుగా అన్ని హోదాల్లోనూ పనిచేసాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ, తర్వాతా కూడా సాంస్కృతి శాఖ సంచాలకుడిగా నిరుపమానమైన సేవలు అందించాడు. అక్కడ కూడా ఆయనకి స్నేహితులు, గురువులు, మార్గదర్శకులు దొరుకుతూనే ఉన్నారు. ఇండియను అడ్మినిస్ట్రేటివు సర్వీసుకి చెందిన ఎస్.ఆర్.రావు సూరత్ ని ఆదర్శపట్టణంగా తీర్చిదిద్దినందుకు ఆయనకి పద్మశ్రీ గౌరవం లభించిందని మనకి తెలుసు. అటువంటి రావు విజయభాస్కర్ ని అభిమానించకుండా ఎలా ఉంటాడు?

ఆయన జీవితంలోకి ప్రవేశించిన మరొక మార్గదర్శకుడు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ. తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్య విభాగానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విజయభాస్కర్ తో నాటక రంగ పరిశోధన చేపట్టారు. ఆయన పర్యవేక్షణలో విజయభాస్కర్  బ్రెహ్టోల్డ్ బ్రెహ్ట్  నాటకాల పైన డాక్టరేట్ చేయడం మరొక విశేషం. ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడ అంపోలు! ఎక్కడ బ్రెహ్ట్!

ఇన్నాళ్ళూ విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, అధికారిగా, రచయితగా, ప్రయోక్తగా విజయభాస్కర్ జీవించిన జీవితం వేరు, ఇప్పుడాయన ఒక రూపక సిద్ధాంతకారుడిగా మారుతున్నాడు. భరతముని నాట్యశాస్త్రాన్నీ, అరిస్టాటిల్ పొయెటిక్సునీ మథించి, శూద్ర, దళిత కథానాయకులు కేంద్రంగా ఉండే ఒక నవీన నాట్యశాస్త్రాన్ని రచిస్తున్నాడు. అభిశప్తులైన తన పూర్వీకులకోసం గంగని భూమ్మీద ప్రవహింపచేయడమంటే ఇదే కదా! అలాగని ఆయన ఆలోచనల్లో వట్టి ఒత్సాహికత మాత్రమే లేదు. నాట్యశాస్త్రం గురించీ, పొయెటిక్సు గురించీ ఆయన తులనాత్మకంగా నాతో ప్రస్తావించిన విషయాల్లో ఎంతో సాధికారికత కనిపించింది. అంటే ఆ జ్ఞానతృష్ణ ఆ మానవుడిలో ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉందన్నమాట!

ఇవన్నీ విన్నాక విజయభాస్కర్ ని ఆయన జీవితానుభవాలు కూడా ఒక పుస్తకంగా వెలువరించమని అడిగాను. నేటి కాలానికి, నేటి దేశానికి కావలసింది ఇటువంటి జీవితాలూ, ఇటువంటి జీవితచరిత్రలూనూ.

20-8-2025

11 Replies to “ఒక జీవితజయగాథ”

  1. .. నీళ్ళు కూడా నీ కోసం దప్పి పడి ఉంటాయి అన్న మాట ఈ రచనలో చూడగానే ఒళ్ళంతా గరి పొడిచినట్టైంది…

    Thank you for sharing ❤️

  2. ఎంత గొప్ప వ్యాసం!!

    శ్రీ విజయ భాస్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకరూపంగా రావాల్సిన అవసరం వుంది. ముందు తరాల వారికి శ్రీ విజయభాస్కర్ గారు మార్గదర్శి.

    సృష్టి గర్భ పుస్తకం లభ్యతా వివరాలు తెలుపగరు 🙏🙏❤️

  3. చాలా బాగా పరిచయం చేశారు. విజయభాస్కర్ గారి జీవన ఉద్యోగ సాహిత్య ప్రస్థానం గురించి మాలాంటి వారికి తెలియని విషయాలెన్నింటినో చెప్పారు. ఇప్పుడు ఇక ఖచ్చితంగా విజయభాస్కర్ గారు
    జీవితానుభావాల్ని రాసి తీరాల్సిందే. రాయాల్సిందేనని నొక్కి వక్కనిస్తున్నాం. ఇన్ని విషయాలు చెప్పిన మీకు అభినందనలు చిన్నవీరభద్రుడు గారూ

  4. శ్రీ విజయభాస్కర్ గారి పరిచయం బాగుంది. ఎందరో మహానుభావులను గురించి మీద్వారా తెలుసుకుంటున్నా. ధన్యవాదాలు🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading