
ఋతుపవనం ఇప్పటికి బలపడింది. చుట్టూ తొలివానల చల్లదనం. ఈ తేమకోసమే ప్రాణులు ఏడాది పాటు ఎదురుచూస్తుంటాయి. నేలలో విత్తనాలతో పాటు హృదయం కూడా ఇటువంటి తేమగాలి కోసమే ఎదురుచూస్తున్నదని అర్థమయింది. ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్న ఈ నగరంలో పక్షులు కూడా ఇంకా రెక్కలు విప్పుకోడానికి బద్ధకిస్తున్నట్లుంది. రోజంతా శ్రుతి చేసుకుంటూ మబ్బులు ఏ వేళకో ఉన్నట్టుండి పెద్ద కచేరీ చేసినట్టు ఒక్క వాన కురిసిపోతుంది. మామూలుగా అయితే ఈ చిరుచలిగాలిలో చెట్లతో పాటు నేను కూడా వానపాటలు నెమరేసుకుంటూ ఉండాలి. కాని ఇప్పుడు నా మనసు పాటల్ని దాటిన లోకం వైపు చూస్తూ ఉంది.
చిన్నప్పుడు ఏమీ తెలియని వయస్సులో అడవినీ, కొండల్నీ, మబ్బుల్నీ, మేఘాల్నీ చూస్తూ గడిపేను. కాలం గడిచేకొద్దీ లోకం వేపు చూడటం మొదలుపెట్టాక, రెండు జీవితాలు, రెండు ప్రపంచాలు. ఒక అడుగు మనుషుల వైపూ, రెండడుగులు మళ్ళీ పూలవైపూ, పాటలవైపూ వేస్తూ వచ్చాను. ఇన్నేళ్ళయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నడిచి వచ్చిన దారి పొడుగునా ముళ్ళు. కానీ ఇస్సా అనుకున్నట్టుగా, పూలని చూస్తూ ఉండటంలో, ఎట్లాంటి నరకంలోంచి నడిచి వచ్చానో నా మనసుకి పట్టనేలేదు. ఇప్పుడు కూడా నాలో ఒక భాగాన్ని నరకం దహిస్తూనే ఉంది. కాని మరొక భాగం నేనింతదాకా పూర్తిగా గుర్తుపట్టలేకపోయిన దైవానుగ్రహంలో పునీతమవుతూ ఉంది. ఇంకా ఏమనిపిస్తూ ఉందంటే, ఆ నరకం కూడా ఆ దైవానుగ్రహంలో భాగమేనని. రాముడు వనవాసానికి పోవడం కూడా ఆయన ప్రయాణంలో భాగమే అన్నట్టుగా. ఇంకా ఇంకా ఏమనిపిస్తూ ఉందంటే, నరకం అని నాకు తెలుస్తున్నది, దైవానుగ్రహం పట్ల ఇంకా పూర్తిగా కుదురుకోని నమ్మకమేనని.
విశ్వాసికి నిజంగా నరకం ఏమిటంటే తన నమ్మకంలో అతడికి పూర్తిగా నమ్మకం చిక్కకపోవడం. కాదు, ఈ వాక్యాన్నిలా చెప్పాలి. తన నమ్మకాన్ని ఇంకా ఏవో సందేహాలు పట్టి కుదుపుతూ ఉండటమే నరకం. గతుకుల దారి మీద రెండెడ్ల బండిలో ప్రయాణిస్తున్నట్టు, దారి ఉంటుంది, బండి ఉంటుందిగాని, కుదుపులు కూడా ఉంటాయి. సరిగ్గా ఇలాంటప్పుడే గొప్ప విశ్వాసుల రచనలు, వారు ఎదుర్కొన్న అనుభవాల కథనాలు చదవడం గొప్ప ఊరటగా ఉంటుంది. ఒకప్పుడు భాగవతం ఇందుకోసమే చదివేవారు. భగవంతుడి గురించి కొత్తగా తెలుసుకోడానికి కాదు. భగవంతుడు తెలుస్తున్నా కూడా బాధలు తప్పకపోవడం గురించి తెలుసుకోడానికి. ఆ బాధల్ని సహించినవాళ్ళూ, కించిత్తైనా చలించనివాళ్ళూ, వాళ్ళెలా సహించగలిగారో తెలుసుకోడానికి. ఇప్పుడు నాకు అటువంటి భగవద్విశ్వాసుల గురించి మరింత చదవాలని అనిపిస్తూ ఉంది. వారు నమ్మినదేవుడెవరేనా కావొచ్చు. వాళ్ళు కాథలిక్కులో, మహాయానులో, వీరశైవులో, డ్రూయుడ్లో- ఎవరేనా కావొచ్చు, కాని వాళ్ళు విశ్వాసులై ఉంటే చాలు. తమ జీవితకాలాల్లో తమకంటూ ఒక దేవుడున్నాడని నమ్మినవాళ్ళయితే చాలు. ఒక దేవుడి పిలుపు వినబడ్డాక ఈ ప్రపంచంలో మరేదీ రుచించనివాళ్ళయితే చాలు. ఆ విశ్వాసం ఒక మతానుష్ఠానంగానే మారక్కరలేదు. వారు కవులు, చిత్రకారులు, తోటలు పెంచేవాళ్ళు, బాటలు వేసేవాళ్ళూ కూడా కావొచ్చు. కాని ఆ పిలుపు తప్ప మరేదీ పట్టనివాళ్ళు కావాలి.
నేను మొన్న కాథలిక్కు సాధువు బ్రదర్ రోజర్ రాసుకున్న జర్నలు గురించి మీతో పంచుకున్నాను. ఆ పుస్తకంలో ఇంకా పంచుకోవలసిన వాక్యాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన జీవితమంతా క్రీస్తు ఉనికిని అనుభవంలోకి తెచ్చుకుంటూనే ఉన్నాడు. అయినా ఇంకా వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆ ఉనికి నిశ్చయం కావడం ఆయన విశ్వాసం. కానీ ఇంకా వెతుక్కోవలసి రావడం ఆయనలోని మానవస్వభావం. నాదీ అటువంటి మానవస్వభావమే కాబట్టి ఆయన వెతుకులాటలో నన్ను నేను పోల్చుకోగలుగుతున్నాను. Peace of Heart in All Things అనే పుస్తకంలో ఒకచోట ఆయన ఇలా ప్రార్థిస్తున్నాడు:
Searching for you, Christ, means discovering your presence even in the lonely places deep within us. ..
సాధారణ భగవద్భక్తులకి తమ హృదయాల్లో ఇటువంటి చొరరాని చోటులుంటాయని తెలియదు. గుడికి వెళ్తారు, వస్తారు. పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. వ్రతాలు చేస్తారు, యాత్రలు చేస్తారు. కాని జీవితమంతటినీ ఊపేసే ఒక పెనుగాలిలాగా, కాళ్ళకింద నేలని చాపలాగా లాగిపారేసేట్టు భూమికంపించేలాగా, ఏదో ఒక విపత్తు చుట్టుముట్టినప్పుడు, అప్పుడు గ్రహిస్తారు, తామిన్నాళ్ళూ తమ పూజల్లో, ప్రార్థనల్లో దేవుడివైపు నిజంగా చూడనేలేదని. అప్పుడు, సరిగ్గా అలాంటి వేళల్లో, నీ అవిశ్వాసం, నీ సందేహం నీ సమస్త జీవితానుభవంకన్నా ఎంతో బలమైనవని తెలిసి వస్తుంది. విపత్తు కన్నా కూడా, నీ విశ్వాసానికి ఊనిక దొరక్కపోవడం నిన్నెక్కువ తల్లడిల్లపరుస్తుంది. అప్పుడు చూస్తావు నువ్వు, నీ భయాలు, నీ అనుమానాలు నీ లోపలనే తిష్ఠవేసుకు కూచున్నాయని. నువ్వు దేవుడికి హారతి పట్టినప్పుడల్లా ఆ వెలుగు తమ మీద పడకుండా అవి తప్పించుకుంటూనే ఉన్నాయని.
నాకనిపిస్తున్నది, మహావిపత్తులు జీవితంలో సంభవించేది, బహుశా, ఈ మూలమూలల్ని కూడా శుభ్రం చేయడానికేనేమో. అందుకనే బ్రదర్ రోజర్ A Prospect of Happiness లో ఇలా అంటున్నాడు:
Christ Jesus, inner Light, do not let my darkness speak to me, make me able to welcome your love.
ఎవరికేనా సరే వాళ్ళల్లోని చీకటి మాట్లాడటం మొదలుపెడితే అంతకన్నా దారుణానుభవం మరొకటి ఉండదు. నువ్వు నీ నమ్మకం ఎదట మోకరిల్లిన ప్రతిసారీ అది నీ చెవిలో గొణుగుతూనే ఉంటుంది. నిన్ను నీ దైవం నుంచి పక్కకు లాక్కుపోడానికి అది చెయ్యని ప్రయత్నమంటూ ఉండదు. నువ్వు మోకరిల్లినప్పుడు అది కూడా నీ పక్కనే మోకరిల్లుతుందిగానీ నిన్ను ప్రశాంతంగా ప్రార్థించుకోనివ్వదు. నువ్వు దైవ చరణాల ఎదట సాష్టాంగపడుతుంటావేగాని, నీ మనసంతా తనే ఆక్రమించి ఉంటుంది. గొప్ప వెలుగు ముందు నిలబడి ఉండి కూడా నీ ముఖాన్న ఒక ముసుగు కప్పుకున్నట్టే ఉంటుంది.
అది, ఆ nagging నుంచి ఎలా తప్పించుకోడం? దాన్ని నువ్వు హతమార్చలేవు. దాన్నుంచి పారిపోలేవు. మన పురాణాల్లో రాస్తారే, ఒక రాక్షసుణ్ణి వధిస్తే అసంఖ్యాకంగా రాక్షసులు పుట్టుకొస్తూ ఉంటారని. నీ అపనమ్మకం అలాంటి ఆసురీ శక్తి. దాని మృత్యు రహస్యం ఎవరు చెప్తారు?
ఇదిగో, అలాంటి దిక్కుతోచని సమయాల్లోనే, భగవద్విశాసుల వాక్యాలు గొప్ప రక్షణ, ధైర్యం, కవచం. ఉదాహరణకి బ్రదర్ రోజర్ 29-1-1981 న తన జర్నల్లో రాసుకున్న ఈ వాక్యం చూడండి:
The foundation of our life is to know that God loves us. Everything in our existence springs up from that love.
భగవంతుడు మనల్ని బేషరతుగా ప్రేమిస్తున్నాడనే నమ్మకం మనకి కలగడమే మనకి దైవానుగ్రహం లభిస్తున్నది అనడానికి తార్కాణం. మనకి ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టమూ అన్నిటికన్నా ముందు మనల్ని ఒక అపరాధభావంలోకి నెడుతుంటుంది. మనం చేసిన పొరపాట్లు, తప్పులు, అపరాధాలు- భగవంతుడు మనల్ని శిక్షించడానికే మనల్ని ఈ కష్టాలకి లోను చేస్తున్నాడనిపిస్తుంది. కాని దేవుడు ఒక పెత్తందారుకాడు. క్రూరుడైన యజమాని కాడు. ఆయన ఒక కాన్ స్టేబుల్ కాడు. మాజిస్ట్రేటు అసలే కాడు. 2-5-1980 న ఈ క్రైస్తవ సాధువు రాసుకున్న ఈ మాటలు చూడండి:
మా చర్చిలో ఈజిప్టుకి చెందిన ఏడవశతాబ్దపు చిన్న ప్రతిమ ఉంది. దానిలో ఒక అపరిచిత స్నేహితుడి భుజాల చుట్టూ తన చేయి వేసిన క్రీస్తు కనిపిస్తాడు. అలా అతడి భుజాలచుట్టూ తన చెయ్యి వేయడం ద్వారా అతడి బరువుల్ని, తప్పుల్ని, అతడి మీద పడి ఒత్తిడి చేస్తున్న సమస్త భారాన్నీ తాను స్వీకరిస్తున్నట్టు క్రీస్తు ప్రకటిస్తున్నాడు. కాని ఆ బొమ్మలో క్రీస్తు ఆ అపరిచిత వ్యక్తి వేపు చూడటం లేదు. అతడిపక్కనే అతణ్ణి వెన్నంటి నడుస్తున్నాడు. ఆ అపరిచిత వ్యక్తి ఎవరో కాదు. మనలో ప్రతి ఒక్కరమూనూ.
ఇక్కడ క్రీస్తు అనే మాటకి బదులు ఎవరి దైవాన్ని వారు పెట్టుకుని ఈ వాక్యాలు చదువుకోవచ్చు. కాని గమనించవలసిందేమంటే మనల్ని శిక్షించడం దైవం పనికాదు. అందులో ఆయనకి ఆనందం లేదు. మరయితే ఈ కష్టాలు, ఈ బాధలు, మన ప్రమేయమేమీ లేకుండానే, మన దోషం లేకుండానే మనం అనుభవించక తప్పని ఈ నరకయాతన ఎవరి సృష్టి? యెహోవాని నిలదీసిన యోబులాగా మనం ప్రతి రోజూ, ప్రతి క్షణమూ మన దైవాన్ని నిలదీస్తూనే ఉన్నాం. కాని మన ప్రశ్నలకి దైవం నేరుగా జవాబు చెప్పడు. అందుకు బదులు, ఇదుగో, ఇలాంటి విశ్వాసుల ద్వారా మన ప్రతి ఒక్క ప్రశ్నకీ, precise గా జవాబులు చెప్తూనే ఉంటాడు. మనం ఆయన్ని నిన్న అడిగిన ప్రశ్నలు ఇవాళ మర్చిపోతామేమోగాని, దైవం ఏ ఒక్క ప్రశ్ననీ మర్చిపోడు. దానికి జవాబు ఎక్కడ ఏ పుస్తకంలో రాసి ఉంటే, ఆ పుస్తకం మన చేతులకి అందేదాకా, మనంతట మనమే ఆ పేజీ తెరిచేదాకా ఓపిగ్గా ఎదురుచూస్తూనే ఉంటాడు. అప్పుడు ఇదుగో ఇలాంటి పుస్తకం మన చేతుల్లోకి వచ్చాక, ఇదుగో, ఇలాంటి వాక్యం కనిపిస్తుంది:
For whoever has learned to love, for whoever has learned to suffer, life is imbued with serene beauty.
ఎందుకంటే ప్రేమ మాత్రమే కాదు, వేదన కూడా భగవంతుడి వైభవంలో భాగమే. ప్రేమ చాలాసార్లు మన surface feelings ని మాత్రమే అనుభవంలోకి తెస్తుంది. కాని వేదన మనలోపల్లోపల మన చీకటిగదుల్లో కూడా వెలుగు ప్రసరింపచేస్తుంది. ప్రేమలో మనం ఎంతసేపూ ముందుకే చూస్తుంటాం. కాని వేదనలో మనం వెనుదిరిగి చూస్తాం. పక్కకి చూస్తాం. పైకి చూస్తాం. ప్రతి ఒక్కదాన్నీ పట్టిపట్టి చూస్తాం. దేన్ని పట్టుకుంటే, అదెంత చిన్న ఆధారమేనా కానివ్వు, ఏది చేతికందుతుంటే దాన్నే మరింత మరింత లాగి చూస్తాం. ఊపి చూస్తాం. వేదన మన మనస్సుతో, దేహంతో, ఆత్మతో లోనయ్యే ఒక సమగ్రానుభవం.
He realized taht a passion for Christ is expressed through a person’s whole being, flesh and spirit
ఆ వేదనని తట్టుకోగలిగితే, అప్పుడు,
Then, little by little, the praise of his love becomes the only thing that matters. Play within me, organs and zithers. Flutes, sing in me. Soft sounds and jubilant music, all together: Let nothing stop the indispensable praise of his love.
బ్రదర్ రోజర్ తన రచనల్లో పదేపదే అగస్టయిన్ సాధువు వాక్యమొకటి తరచు గుర్తుచేస్తూంటాడు. అగస్టయిన్ అన్నాడట: Love, and say it with your life అని. కొన్నిసార్లు దైవసన్నిధి మనకి పట్టపగటి వెలుగులాగా కళ్ళకి కట్టినట్టుంటుంది. చాలాసార్లు అది అదృశ్యమైపోతూ ఉంటుంది. కానీ, తోవ కనిపించని, అలాంటి చీకటివేళల్లో కూడా, కారుమబ్బుల వెనక వెండివెలుగులాగా, ఒక నిశ్చయం మనలోపల వెలుగుతూనే ఉంటుంది. అందుకనే భగవద్విశ్వాసులందరిలానే, బ్రదర్ రోజర్ కూడా ఇలా అంటున్నాడు: The simple desire for God is already the beginning of the faith. లేదా ఇలా అంటాడు If you desire to know God, you already have faith.
భగవంతుడు ఒక్కసారి నా మొరాలకించాడని తెలిసినా కూడా అది నాకు జీవితకాల పాథేయంగా మారిపోతుంది. కనీసం మరొక మానవుడి ప్రార్థనలు విన్నాడని తెలిసినా కూడా నాకు చెప్పలేనంత ధైర్యం కలుగుతుంది.
ఏళ్ళతరబడి నేను ప్రార్థిస్తూ వచ్చాను. కాని అది నిజానికి అది ప్రార్థన కానే కాదనీ, నేను చేసిందల్లా రోజూ దైవం ముందు నా కోరికల చిట్టా చదువుతూ ఉండటమేననీ ఇన్నాళ్ళకి గ్రహించాను. ప్రతి రోజూ తెల్లవారగానే నా దారిలో పొంచి ఉన్న ప్రమాదాల గురించీ, భయాల గురించీ, తలెత్తబోయే ఆపదల గురించీ విన్నవించుకుంటూనే, కానీ దాన్నే ప్రార్థనగా భావిస్తూ వచ్చేను.
కాని ఇప్పుడు నిజమైన ప్రార్థన అంటే ఏమిటో తెలిసింది. తెల్లవారి లేచి నువ్వు దైవాన్ని ఏమీ కోరుకోనక్కర్లేదు. నువ్వు చెయ్యవలసిందల్లా ధన్యవాదాలు చెప్పుకోవడమే. మరొక ప్రభాతం నీకు లభించినందుకు. మరొక రోజు నీకు దక్కినందుకు. మరొకసారి దైవాన్ని తలుచుకోగలినందుకు.
నీకు లభిస్తున్నది ప్రతి ఒక్కటీ దైవానుగ్రహంలో భాగమేనని నువ్వు ఎంతగా నమ్మగలిగితే నీ జీవితం అంత అనుగ్రహానికి నోచుకుంటుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా నిన్ను నిజంగా ఎవరేనా ప్రేమిస్తున్నారంటే అది దైవం ఒక్కడే. ఆ సంగతి నువ్వు ఏ కొంచెం నమ్మినా కూడా ఆయన మరింత సంతోషంతో నీ వైపు మరొక రెండడుగులు ముందుకేస్తాడు.
Featured image: PC: fnp.com
3-7-2025


చదువుతుంటే నా కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి ఈ రోజు ఎందుకో తెలియదు. కృతజ్ఞతలు సార్.
శుభోదయం. నమస్కారాలు.
మాటల్లో చెప్పలేనంత గొప్పగా రాశారు సర్.. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేస్తున్న సాహిత్య సేవకి వేనవేల వందనాలు..
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఎంతో అద్భుతంగా ఉందండీ. జీవితంలో మనం అనుకునేవి సమస్యలా, కావా అని చెబుతూనే, మానవ మనస్సుని చక్కగా ఉన్నది అన్నట్లుగా చూపారు. గొప్ప పరిష్కారం, సమాధానం ముగింపులో తెలియపరచడమూ ఆచరణీయంగా ఉన్నది, దీనిని పాటించగలిగితే అంతకు మించిన ధన్యత ఉండబోదు.
ధన్యవాదాలు సార్!
“ప్రతిఫలాపేక్ష లేకుండా నిన్ను నిజంగా ఎవరేనా ప్రేమిస్తున్నారంటే అది దైవం ఒక్కడే. ఆ సంగతి నువ్వు ఏ కొంచెం నమ్మినా కూడా ఆయన మరింత సంతోషంతో నీ వైపు మరొక రెండడుగులు ముందుకేస్తాడు.”
“నిజమైన ప్రార్ధన” చదివాక చాలాసేపు మౌనం గా ఉన్నాను…
రోజర్ గారి కొట్స్ తో హృదయం మనసు వికసించేలా చాల హత్తుకునే లా రాశారు 💐🙏
ధన్యవాదాలు సార్!