హోల్డర్లిన్-5

అన్నపానీయాలు-2

మహిమోపేతమైన ఈ రాత్రి కురిపిస్తున్న కరుణ ఆశ్చర్యకారకం, ఆమె ఎక్కణ్ణుంచి వస్తున్నదో ఎరిగినవారు లేరు, ఆమెనుంచి ఏమి తలెత్తనున్నదో తెలిసినవారూ లేరు. ఆమె ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది, మనుషుల ఆశావహమానసాల్ని కూడా నడిపిస్తున్నది, కాని ఆమె ఏమి చేయగలదో అర్థం చేసుకున్న ఋషి ఒక్కడూ లేడు.

సర్వేశ్వరుడు, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నవాడు నువ్విట్లా ఉండాలని కోరుకున్నాడు, కాబట్టే నువ్వు సహజంగానే రాత్రికన్నా జాగృతదినాన్ని ఎక్కువ అభిలషిస్తావు.

కాని స్పష్టంగా చూడగల ఒక దృష్టి ఉంటే అది అప్పుడప్పుడు నీడల్ని కూడా ప్రేమిస్తుంది,  నిద్ర తనంతటతాను రాకముందే కేవలం ఉల్లాసం కోసం ఆహ్వానిస్తుంది.  ఒకడు  సాహసికుడైతే  ఆ చీకట్లోకి తేరిపారచూడాలనుకుంటాడు. పూలమాలల్తో, పాటల్తో ఆమెని అర్చించడం సముచితమే అనిపిస్తుంది. ఆమె ఆత్మలో పరిపూర్ణస్వతంత్రురాలు. అయినా మనం పోగొట్టుకున్నవాళ్ళకీ, మరణించినవాళ్ళకీ ఆమె ఎంతో పవిత్రురాలు. ఆమె మనకి మరుపునీ, పవిత్ర మాదకతనీ ప్రసాదిస్తుంది.

ఒకింత సందిగ్ధపూర్వకమైన ఆ విరామంలో, ఆ చీకట్లో, మనం జారిపోకుండా గట్టిగా పట్టుకోగల ఒక ఆధారం ఉండే ఉంటుంది. ఆమె వల్లనే మనకి మాటలు లభిస్తాయి.  ప్రేమికుల్లాగా మన నిద్దురవాయిదా వెయ్యగలుగుతాం, రాత్రంతా మెలకువగా ఉండటానికి ఆమెనే మనకొక పూర్ణపానపాత్రనీ, అమేయ సాహసాన్నీ, అపురూపస్మృతుల్నీ అనుగ్రహిస్తుంది.


Bread and Wine


2.

The kindness of exalted Night is wonderful, and no one
    Knows where she comes from, or what will emerge from her.
Thus she moves the world, and the hopeful minds of humans:
    Not even a sage knows what she’s up to.
The highest god, who loves you very much, wants it so;
    Therefore you prefer reasonable day to the night.
But occasionally a clear eye loves the shadows as well,
    And tries to sleep just for pleasure, before it’s necessary,
Or a brave person likes to gaze directly into the Night:
    Surely it’s right to dedicate wreaths and songs to her,
Since she is holy to those who are lost or dead, although
    She herself exists totally free in spirit, forever.
She must grant us oblivion and holy drunkenness,
    That in the hesitating interval, in the darkness,
There’ll be something for us all to hold onto.
    She must afford us flowing words, sleepless
As lovers are, and a fuller cup, and bolder life, and
    Holy remembrance as well, to stay wakeful at night.


హోల్డర్లిన్  Bread and Wine  కవితలో ఇది రెండవ ఖండిక. ఇక్కడ ఆయన రాత్రిని ఆహ్వానిస్తున్నాడు. ఒక సాహసికుడు మాత్రమే ఆ చీకట్లోకి తేరిపారచూడగలడని చెప్తున్నాడు. ఆమె కవులకి వాక్కుని ప్రసాదిస్తుంది. రాత్రి వల్లనే మన స్మృతులకొక సార్థకత లభిస్తుంది. మన గతం మళ్ళా ఆ చీకటివేళల్లోనే తిరిగి ప్రాణంపోసుకుంటుంది.

పైకి ఒక రాత్రిస్తుతిగా కనిపిస్తున్న ఈ కవితలో పద్ధెనిమిదో శతాబ్దపు రొమాంటిక్ స్పిరిట్ ని మనం గుర్తుపట్టగలం. పదిహేడు-పద్ధెనిమిది శతాబ్దాల enlightenment పైన తిరుగుబాటుగా రొమాంటిసిజం వచ్చింది. మనిషి భావనా ప్రపం చం కేవలం కార్యకారణసంబంధాలమీదా, ఆలోచనమీదా, హేతువు మీదా, తర్కం మీదా మాత్రమే ఆధారపడిలేదని, మానవప్రపంచంలోని చీకటినీడల్లోకి చూడగలిగినప్పుడే మన పానపాత్ర పూర్ణపాత్రగా మారుతుందని చెప్తున్నాడు కవి.

28-4-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading