ఫిలిస్‌ వీట్లి

ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ నేను వెలువరించిన ‘వికసించిన విద్యుత్తేజం‘ పుస్తకానికి ఇప్పటిదాకా ఒక్క సోమశేఖర్ నుంచి మాత్రమే ప్రతిస్పందన లభించింది. ఆ పుస్తకంలో మూడు నాలుగు కొత్త వ్యాసాలున్నాయి. కాబట్టి మిత్రులు వాటిని ఇక్కడైనా చదువుతారని ఇలా అందిస్తున్నాను.


ఫిలిస్‌ వీట్లిని 1761 లో ఆఫ్రికానుంచి ఎత్తుకొచ్చి అమెరికాలో బానిసగా ఆమ్మేసారు. ఆమెని ఆఫ్రికాలో గాంబియా లాంటి ఏదో దేశం నుంచి తీసుకువచ్చి ఉండవచ్చును. ఆమెని బలవంతంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చును. అందుకని ఆ అనుభవాలు ఆమెకి తన బాల్యం గురించిగాని, తన తల్లిదండ్రుల గురించిగాని ఎటువంటి జ్ఞాపకాల్నీ మిగలకండా చేసాయి. ఆమె ఆఫ్రికానుంచి తన కూడా తెచ్చుకున్నది ఒకే ఒక్క జ్ఞాపకం. రోజూ పొద్దున్నే సూర్యోదయం అయ్యేటప్పుడు తన తల్లి ఇన్ని నీళ్ళు తీసుకుని సూర్యుడి వైపు ధారగా పొయ్యడం మాత్రం ఆమె మనసులో బలంగా నాటుకుపోయిన దృశ్యం. తరువాత ఆమె జీవించినంతకాలం ప్రతి సూర్యోదయం ఆమెకి తన తల్లినీ, ఆ దృశ్యాన్నీ గుర్తుచేస్తూనే ఉండేది.

ఆమెని బానిసల అంగడికి తీసుకొచ్చి అమ్మకానికి పెట్టినప్పుడు అదృష్టవశాత్తూ ఆమె బోస్టన్‌కి చెందిన జాన్‌ వీట్లి కుటుంబం దృష్టిలో పడిరది. వీట్లీ శ్రీమతి అప్పటిదాకా ఏ బానిసల్ని కొనుక్కున్నా వారు నడివయసులో ఉండటంతో మధ్యలోనే వెళ్ళిపోయేవారు. కాని ఆమెకి తనకి వృద్ధాప్యంలో తోడుగా ఉండే ఒక మనిషికోసం వెతుక్కుంటూ ఉంది. ఈ చిన్నపిల్లని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఈమె తన జీవితాంతం తనకి తోడుగా ఉండ గలదని అనుకుంది.

ఏళ్ళ తరువాత ఫిల్లిస్‌ గురించి వీట్లీ కుటుంబానికి చెందిన వారొకరు రాసిన మెమొయిర్‌లో ఆ బాలికను ఇంటికి తెచ్చుకునేటప్పటికి ఆమె ముందుపళ్ళు అప్పుడే ఊడిపోయి కొత్త పళ్ళు వస్తూ ఉన్నాయని రాసారు. ఆ దృశ్యాన్ని మరవడం కష్టం. ఇటువంటి దృశ్యంతో, ఈ బాలిక కథతో నేను ఈ పుస్తకం మొదలుపెడుతున్నాను. అంటే ఈ రోజు పల్లెల్లో ఆదివారం పశువుల సంతకి పోయి ఒక ఆవునో మేకనో కొనుక్కున్నట్టుగా, పట్టణాల్లో మనుషులు బజారుకి వెళ్ళి కొత్త సోఫాసెట్టునో లేదా కొత్త మంచమో లేదా కొత్త టివి, కొత్త ఫ్రిజ్జు కొనుక్కున్నటుగా, తాము కొనుక్కున్నవి నాలుగు కాలలపాటు మన్నేవిగా ఉండాలని అనుకునేట్టుగా, 264 సంవత్సరాల కిందట, అమెరికాలో మనుషుల్ని కొనుక్కునేవారు అనే ఒక యథార్థంతో ఈ చరిత్ర మొదలుపెడుతున్నాను. అలా ఒక దిక్కులేని బాలికని, ఎక్కడో ఖండాతరం నుంచి, ఆమె తల్లిదండ్రులకు తెలీకుండా, బలవంతంగా ఎత్తుకొచ్చి, దేశంకాని దేశంలో, తమ జాతికాని జాతి వారికి, తమ భాష, తమ మతం, తమ ఆచారవ్యవహారాలు కాని కుటుంబానికి ఒక పశువుని అమ్మినట్టు అమ్మేసే ఒక చరిత్ర గురించిన పరిచయాన్ని ఈ దృశ్యంతో మొదలుపెట్టక తప్పట్లేదు.

అలా 1525 నుంచి 1866 మధ్యకాలంలో దాదాపు 125 లక్షల మంది ఆఫ్రికన్లని, కొత్త ప్రపంచానికి, అంటే అమెరికాలకు, కరీబియన్‌ దీవులకు తీసుకొచ్చి బానిసలుగా అమ్మేస్తే, వాళ్ళల్లో ఆ ప్రయాణనరకంలో మరణించినవాళ్ళు మరణించగా 107 లక్షలమంది మరణంకన్నా క్రూరమైన బానిసత్వంలో మనుగడ సాగించారు.

కాని దాదాపు ఆ కోటిమందిలోనూ ఫిల్లిస్‌ది ఒక ప్రత్యేకమైన కథ. ఆమెని కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్న యజమానురాలు ఆమెని తక్కిన బానిసల్లాగా చూడలేదు. ఆమెని సొంత బిడ్డలాగా చూసుకుంది అని చెప్పాలి. అంటే తేలికపాటి పని ఇవ్వడం, సాధారణంగా బానిసలకి దొరకని కనీస సదుపాయాలు అందివ్వడమే కాదు, అసలు పద్ధెనిమిదో శతాబ్దంలో ఏ బానిస కూడా ఊహించలేని గొప్ప అవకాశాన్ని ఆమెకి అందించింది. అదేమంటే, చదువు చెప్పించడం.

ఫిల్లిస్‌ యజమానురాలి కూతురు ఫిల్లిస్‌కి ఇంగ్లిషు చదవడం రాయడం నేర్పింది. అనతికాలంలోనే ఆ బాలిక అపూర్వమైన ప్రతిభ చూపించింది. ఆమె చాలా త్వరలోనే బైబిలు పాత కొత్త నిబంధనలతో పాటు అలెగ్జాండర్‌ పోప్‌ అనువదించిన హోమర్‌ని చదువుకోగలిగే స్థాయికి చేరుకుంది. గ్రీకు, లాటిన్‌ పురాతనగాథల్తో పాటు, ప్రాచీన, అధునిక భూగోళశాస్త్రం, ప్రాచీనచరిత్ర, ఖగోళశాస్త్రాల్లో కూడా ప్రవేశం సంపాదించ గలిగింది. తన కాలందాకా వచ్చిన ఇంగ్లిషు కవిత్వంలోని శ్రేష్ఠకవిత్వం ఆమె చదువు కోగలిగింది.

ఇటువంటి చదువు బానిసలకనే కాదు, స్వాతంత్య్రపూర్వపు అమెరికాలో, అంటే ఇంకా బ్రిటిష్‌కాలనీగానే కొనసాగుతున్న అమెరికాలో ఉన్నత కుటుంబాల్లో కూడా కేవలం బాలికలకే కాదు, బాలురకి కూడా అలభ్యమనే చెప్పవచ్చు. ఇటువంటి విద్యని నిజంగా ఉన్నతవిద్య అనవచ్చు. ప్రాచీన గ్రీసులోనూ, రినైజాన్సునాటి రోములోనూ కూడా ఇది సంపన్న కుటుంబాల పురుషులకి మాత్రమే లభ్యంగా ఉండేడి. ఇటువంటి విద్యలభించాక ఫిల్లిస్‌ కవయిత్రి కాకుండా ఎలా ఉంటుంది?

కవిత్వం పలకడం మొదలుపెట్టాక ఆమె వెనుదిరిగి చూడలేదు. 1772 నాటికి, అంటే ఆమెకి పద్ధెనిమిది, పందొమ్మిదేళ్ళ వయసునాటికే, ఒక కవితాసంపుటి వెలువరించడానికి చాలినన్ని కవితలు రాసిందామె. కాని ఒక నీగ్రో బాలిక, బానిసగా జీవిస్తున్న మనిషి, ఇంగ్లిషులో కవిత్వం చెప్తున్నదంటే ఎవరూ నమ్మలేదు. అందుకని, 1773 నాటికి ఆమె అచ్చు వేసుకోడానికి సిద్ధం చేసుకున్న రాతప్రతిని ఆమె యజమాని కొందరు పెద్దల్నీ, మతాచార్యుల్నీ సమావేశపరిచి వారికి చూపించాడు. వారి సమక్షంలో ఆమెని హాజరు పరిచాడు. వారంతా ఆమెను ప్రశ్నించి, పరీక్షించి, ఆ కవిత్వం ఆమె రాస్తున్నదనే నిశ్చ్యానికి రాగలిగేరు. అక్కడితో ఆగకుండా, ఆమె కవయిత్రి అని తాము స్వయంగా చూసి, పరీక్షించి, నిర్ణయించుకున్నామని ఒక పౌరప్రకటన కూడా విడుదల చేసారు!

ఈ లోపు ఫిల్లిస్‌ అస్వస్థతకి లోనయ్యింది. ఆమెకి గాలిమార్పు ఉంటే మంచిదనే   ఉద్దేశ్యంతో ఆమె యజమానులు ఇంగ్లాండు వెళ్తున్న తమ కొడుకుతో పాటు ఆమెని కూడా 1773 లో ఇంగ్లాండు పంపించారు. అక్కడ ఆమె ఉన్న కాలంలోనే Poems on Various Subjects, Religious and Moral అనే పేరిట తన కవితలు అచ్చు వేసుకుంది. ఆ విధంగా ఆఫ్రికన్‌-అమెరికన్‌ రచయితల్లో మొదటి పుస్తకం అచ్చు వేసుకున్న రచయితగా లేదా రచయిత్రిగా ఫిల్లిస్‌ వీట్లీ చరిత్ర సృష్టించింది. ఆమె ప్రతిభ గురించి విని బ్రిటిష్‌ యువరాజు ఆమెని కలుసుకోడానికి ఆసక్తి కనపరిచాడు. కాని ఈ లోపు బోస్టన్‌లో తన యజమానురాలు ఆరోగ్యం క్షీణించిందనీ, ఆమె తనను చూడాలని ఆత్రుత పడుతోందని తెలియడంతో ఫిల్లిస్‌ 1774 లో తిరిగి అమెరికాకు వచ్చేసింది.

ఆమె అమెరికాకి తిరిగి వచ్చి కొన్నాళ్ళు కూడా గడవకుండానే వీట్లీ శ్రీమతి మరణించింది. ఆమె మరణంతో ఫిల్లిస్‌ మానసికంగా అనాథ అయిపోయింది. 1778 లో వీట్లి కూడా మరణించడంతో ఆమెకి బానిసత్వం నుంచి విముక్తి లభించింది. కాని అంతదాకా ఆమెకి లభిస్తూ వస్తున్న ఒక ఆశ్రయం కూడా కరువైపోయింది.

అటువంటి పరిస్థితుల్లో పీటర్‌ అనే తోటి నల్లజాతి మనిషి తనని పెళ్ళి చేసుకోడానికి ముందుకొస్తే ఆమె సమ్మతించింది. కాని ఆ నిర్ణయం ఆమె ఏ దుర్ముహూర్తంలో తీసుకుందోగాని, అంతదాకా ఆమె జీవించిన జీవితం వేరు. ఆ తర్వాత తాను మరణించే దాకా అంటే 1784 దాకా ఆరేళ్ళ కాలంపాటు ఆమె దుర్భరమైన పేదరికంలో అనారోగ్యంలో గడిపింది.

ఆమె భర్త చెడ్డవాడని చెప్పలేముగాని మితిమీరిన స్వాతిశయం వల్ల అతడు వీట్లి కుటుంబ సభ్యుల్ని గాని లేదా ఫిల్లిస్‌ పరిచయస్తుల్ని గాని దగ్గరకు రానిచ్చేవాడు కాడు. ఈలోపు ఫిల్లిస్‌కి ముగ్గురు పిల్లలు పుట్టారు. కాని తల్లి అనారోగ్యంవల్ల పిల్లలు కూడా రోగిష్టిగానే ఉండేవారు. చివరికి ఇద్దరు పిల్లలు ఆమె కళ్ళముందే మరణించారు కూడా. 1784 లో ఫిల్లిస్‌ భర్త అప్పులపాలై జైలుకు వెళ్లవలసి రావడంతో ఫిల్లిస్‌ పూర్తిగా దిక్కులేనిదై పోయింది. చివరికి గడ్డుపేదరికంలో, అనారోగ్యంతో ఆమే ఆమె మూడవ బిడ్డా కూడా ఒక్కసారే ఈ లోకం వదిలిపెట్టివెళ్ళిపోయారు. ఎక్కడో ఆఫ్రికాలో ఏ దేశంలోనో తన తల్లినీ, తండ్రినీ కోల్పోయి దేశం కాని దేశంలో బానిసగా బతుకు సాగించవలసిన ఫిల్లిస్‌ మధ్యలో కొన్నాళ్ళు మాత్రం దేదీప్యమానమైన జీవితం జీవించింది. అపారమైన ప్రతిభ చూపించింది. చివరికి యువరాజు దృష్టినే ఆకర్షించగలిగేటంత కవిత్వాన్ని వెలువరించింది. మళ్ళీ అంతే అనామక పరిస్థితుల్లో నిరుపేదగా ఈ లోకం నుంచి సెలవు తీసుకుంది.

జీవించింది 31 ఏళ్ళే అయినప్పటికీ, చిన్నవయసులోనే గొప్ప కవిత్వం చెప్పి అదృశ్యమైపోయిన షెల్లీ, కీట్స్‌, తోరూదత్‌ లాంటి అత్యంత ప్రతిభావంతులైన కవుల సరసన చేర్చదగ్గ కవిగా ఫిల్లిస్‌ మిగిలిపోయింది. ఇక ఆఫ్రికన్‌-అమెరికన్‌ ప్రజానీకంలో మొదటి పుస్తకం అచ్చు వేసుకున్న రచయితగా, మొదటి పుస్తకం అచ్చువేసుకున్న రచయిత్రిగా ఫిల్లిస్‌ వీట్లీ చరిత్ర సృష్టించింది.

అయితే, ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యానికి ఆమెను ఆదికవిగా పరిగణించాలా లేదా అన్నదాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంతదాకా  ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యచరిత్ర రాస్తూ వచ్చిన విమర్శకులు ఆమెని కవయిత్రిగా అంగీకరించినప్పటికీ, ఆమెని తొలి ఆఫ్రికన్‌-అమెరికన్‌ కవయిత్రిగాగానీ, రచయితగా గానీ అంగీకరించడానికి ఇష్టపడలేదు. అందుకు బదులు తొలి నల్లజాతి రచయిత అనే గౌరవాన్ని 1845 లో తన ఆత్మకథ వెలువరించిన ఫ్రెడెరిక్‌ డగ్లస్‌కీ, నల్లజాతి సాహిత్యానికి ఆదికవి అనే గౌరవాన్ని పాల్‌ లారెన్స్‌ డన్‌బార్‌కీ ఇస్తూ ఉన్నారు. అందుకు వారు ప్రధానంగా చెప్పే కారణం ఏమంటే, ఫిల్లిస్‌ కవిత్వంలో తాను ఆఫ్రికన్‌-అమెరికన్‌ జాతికి చెందినదాన్ననే చైతన్యం వికసించలేదనీ, ఆమె పూర్తిగా తన యజమానుల ప్రాపంచిక దృక్పథాన్నే తన జీవిత దృక్పథంగా స్వీకరించిందనీ. ఒక విధంగా చెప్పాలంటే ఆమె పుట్టుకకు మాత్రమే నల్లజాతికి చెందిందిగానీ, కాని భాషలో, నుడికారంలో, శిల్పంలో, వస్తువులో ఆమె పూర్తి శ్వేతజాతి వారసత్వాన్నే స్వీకరించిందనీ.

కాని ఈ వాదన నా వరకూ నాకు అంగీకరించదగ్గదిగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె కవిత్వంలో అప్పటి బ్రిటిష్‌ లేదా యూరపియన్‌ సామ్రాజ్యవాద భావజాలం కనిపించడం లేదు. ఆమె ఏ శ్వేతజాతి ప్రయోజనానికీ మద్దతు ప్రకటించలేదు. తన తోటి బానిసల పట్ల ఏహ్యత ప్రకటించలేదు. నిజమే, ఒక మనిషి మరొక మనిషిని కొనుక్కునే వ్యవస్థ పట్ల ఆగ్రహం ప్రకటించలేదు, కాని, ఆ పరిస్థితి పట్ల తన ఆమోదాన్ని కూడా ప్రకటించలేదు. నిజానికి ఆమె కవిత్వ వస్తువులోగాని, ఆమె భావనాప్రపంచంలోగాని, ఇంగ్లాండు, అమెరికా, ఆఫ్రికాలతో కూడిన భౌతిక ప్రపంచానికి ఉన్నది ద్వితీయస్థానం మాత్రమే. ఆమెకి తన యజమానుల పట్ల ఉన్నది గౌరవం, కృతజ్ఞత మాత్రమే. కాని ఆమె హృదయం మాత్రం భగవదర్పితం. ఆ భగవంతుడు క్రైస్తవ, పాగాన్‌, ఆఫ్రికన్‌ పరిధుల్ని దాటిన భగవంతుడు. ఆమె ఆయనతో ఒక ఘనిష్ట హృదయసంబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ అనుబంధాన్ని వ్యక్తం చేయడానికి ఆమె క్రైస్తవ, గ్రీకు, లాటిన్‌ ప్రతీకల్ని ఎంతగా వాడుకున్నదో, తన ఆఫ్రికన్‌ సూర్యారాధనని కూడా అంతే వాడుకుంది.

తన భావాల్ని ప్రకటించడానికి ఆమె తీసుకున్న భాష, ప్రతీకలు, ఉపమానాలు, వ్యక్తీకరణ classical సంప్రదాయానికి చెందినవి కావడం తిరస్కరించవలసిన విషయం కాదు. గర్వించవలసిన విషయం. అదే కవిత్వాన్ని 1773 లో ఎవరేనా ఇంగ్లిషు కవయిత్రి రాసి ఉంటే ప్రపంచమంతా ఆమెకి బ్రహ్మరథం పట్టి ఉండేవారన్న మాట కాదనలేం.

ఇంతకీ ఆమెని తొలి ఆఫ్రికన్‌-అమెరికన్‌ కవయిత్రిగా అంగీకరించకపోవడానికి ప్రధాన అభియోగం ఏమిటి? ఆమె కవిత్వంలో ఒక racial subjectivity కనిపించడం లేదన్నది. ఆమె ఎంతసేపూ అలెగ్జాండర్‌ పోప్‌నో, మిల్టన్‌నో మాత్రమే అనుకరిస్తూ ఉన్నదనేది. తాను ఒక ఆఫ్రకన్‌ వారసత్వానికి చెందినదాన్ననీ, అనేక చారిత్రిక కారణాల వల్ల తాను పుట్టిన ఊరికీ, దేశానికీ దూరమయ్యాయననీ, అలా తాను వ్యక్తిగతంగా లోనైన విషాదం వ్యక్తిగా తనకు మాత్రమే సంబంధించింది కాదనీ, అది ఒక జాతి తన వ్యాపారప్రయోజనాల కోసం మరొక జాతిని అణచి ఉంచడంలో భాగంగా జరిగిందనీ ఆమె గుర్తించలేదనేది ఆమె మీద ప్రధాన ఆరోపణ. ఒక డగ్లస్‌, ఒక డన్‌బార్‌ అలా గుర్తించారు కాబట్టే, వారు సృష్టించిన సాహిత్యం కేవలం సాహిత్యంగా మిగిలిపోకుండా, ఒక స్వాతంత్య్రపోరాట చరిత్రగా కూడా మారిందనీ, డగ్లస్‌ నుంచి లాంగ్‌స్టన్‌ హ్యూస్‌ మీంచి టోనీ మారిసన్‌ దాకా ఆ స్వేచ్ఛాకాంక్షను  తరం వెనుక తరం ఒక దివిటీగా అందిపుచ్చుకుంటూ ఆ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారనీ, అలా చూసినప్పుడు ఆ మహనీయ స్వేచ్ఛాగీతకారుల పంక్తిలో మొదటి మనిషిగా ఫిల్లిస్‌ను లెక్కవెయ్యలేమనీ సాహిత్యచరిత్రకారుల వాదన.

కానీ ఈ ప్రశ్నను మనం మరింత లోతుగా చూడాలి. ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యకారులు కోరుకుంటున్నదేమిటి? స్వాతంత్య్రం? ఎటువంటి స్వాతంత్య్రం? మొదట్లో అది తమ దేహాల మీద పూర్తి హక్కు తమకే ఉందని గుర్తించమనే స్వాతంత్య్రప్రకటన. ఆ తర్వాత అది తమని కూడా మనుషులుగా చూడమనే ఆకాంక్ష. ఆ తర్వాత తమకి కూడా తమ ప్రతిభావ్యుత్పత్తుల్ని వికసింపచేసుకునే హక్కు ఉందని గుర్తించమనే కోరిక. ఆ తర్వాత?

నువ్వు పూర్తి స్వాతంత్య్రాన్ని పొందిన తరువాత ఏమి చేస్తావు? నీ మనసుకి నచ్చినట్టుగా ఒక కవివో, చిత్రకారుడివో, కళాకారుడివో లేదా దేశనిర్మాణంలోనో, ప్రపంచ నిర్మాణంలోనో భాగస్వామివి కావడమే కదా! తర్వాత రోజుల్లో ఆఫ్రికన్‌-అమెరికన్‌ సమాజం నుంచి ఒక పాల్‌ రోబ్సన్‌ లాంటి వాడు ప్రభవించినప్పుడు మనకి తెలిసేది ఇదే. అంటే, మనుషులు తమ ప్రతిభావ్యుత్పత్తుల్ని వికసింపచేసుకోడానికీ, ప్రకటించుకోడానికీ మధ్య ఉన్న అడ్డంకులు దాటగలిగితే ప్రతి ఒక్క ఆఫ్రికన్‌-అమెరికన్‌ కూడా ఒక పాల్‌ రోబ్సన్‌ కాగలడనే కదా. అంతే కాదు. ఆ స్థితికి చేరుకునేదాకా, వాళ్లు రాసే కవిత్వం, సృష్టించే సాహిత్యం వారిలో రగిలే స్వాతంత్రేచ్ఛ వల్ల పఠనీయాలుగా, ఉత్తేజకారకాలుగా ఉంటాయి. కాని ఒకసారి వారు తాము కోరుకున్న స్థితికి చేరుకున్న తరువాత దేని గురించి రాయాలి?

తర్వాత రోజుల్లో లొరైన్‌ హన్స్‌బెర్రీ లాంటి రచయిత్రి వేసుకున్న ప్రశ్న ఇదే. తాను సృష్టించే సాహిత్యం కేవలం తన సమూహానికీ, తన సమాజానికీ మాత్రమే సాహిత్యంగా మిగిలిపోకూడదు. లేదా వేరే దేశాలవారు, వేరే భాషల వారు ఏదో sociological లేదా anthropological కారణాల వల్ల మాత్రమే చదివే సాహిత్యంగా ఉండిపోకూడదు. ప్రపంచంలో ఎక్కడ ఏ జాతికి, ఏ భాషకి చెందిన మానవుడైనా సరే, ఏ అవస్థలో ఉన్నా సరే, తన సాహిత్యం అతడు చేరదీసుకోగలిగేది కాగలగాలి. ఇదే ఏ సాహిత్యకారుడైనా అంతిమంగా కోరుకునేది.

ఉదాహరణకి తోరూదత్‌నే తీసుకోండి. ఆమె పుట్టినప్పుడు భారతదేశంలో మొదటిస్వాతంత్య్ర సంగ్రామం మొదలవుతున్నది. ఆమె మరణించేనాటికి ఇంకా భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడలేదు. కానీ తోరూదత్‌ కవిత్వాన్ని చదువుతున్నప్పుడు ఆమె తానొక వలసదేశానికి చెందినదనే స్ఫూర్తితో కవిత్వం రాయలేదనే ఆరోపణ మనకి వినబడదు. ఆమె యూరోప్‌లో జీవించిందనీ, ఇంగ్లిషు, ఫ్రెంచి సాహిత్యకారులతో కలిసి చర్చలు చేసిందనీ, ప్రాచ్య, పాశ్చాత్య పురాణప్రతీకల్ని ఇతివృత్తాలుగా తీసుకుని  కవిత్వం రాసిందనీ మనం ఆమెని పక్కన పెట్టెయ్యం. ఈ రోజు ఆమె కవిత్వం చదివే పాఠకుడు ఆమె కవిత్వంలో నిరుపమానమైన లాలిత్యం, అద్వితీయ క్లాసిసిజం పక్కపక్కనే కనిపిస్తుండటం చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేడు.

ఇటువంటి గౌరవమే ఫిల్లిస్‌కి కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. అసమానతలు, సామాజిక అన్యాయాలూ లేని సమాజం ఏర్పడ్డప్పుడు, ఒక మనిషికి ఎటువంటి విద్య లభిస్తుందో, అటువంటి విద్య ఫిల్లిస్‌కి అదృష్టవశాత్తూ లభించింది. ఒకవేళ ఆమెకి అటువంటి విద్య లభించకపోయి ఉంటే, ఆమె రచయితగా రూపొంది ఉండేదా? చెప్పలేం. ఆమెలోని తృష్ణ ఆమెని ఒక హోర్టాన్‌ గానో, డగ్లస్‌ గానో మార్చి ఉండేది కాదనీ అనుకోలేం. కాని అప్పుడు ఆమె రాసి ఉండే కవిత్వం మాత్రం ఇప్పుడు రాసిన కవిత్వంలా ఉండి ఉండేది కాదనీ, బహుశా, అప్పుడు ఆమె ఏమి రాసి ఉన్నా ఆ రచనల్లో racial subjectivity ఏదో ఒక మేరకు కనిపించి ఉండేదనీ మాత్రం చెప్పగలం.

ఫిల్లిస్‌ జీవితం నుంచి మనం గ్రహించవలసిన అత్యంత విలువైన విషయాలు మరొక మూడు ఉన్నాయి. మొదటిది, ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొత్తూకాదనేది. ఒక బాలుణ్ణిగాని, బాలికనిగాని మనం చిన్నప్పణ్ణుంచీ ఎటువంటి వాతావరణంలో పెంచుతా మన్నదాన్నిబట్టి వారి వికాసం ఆధారపడుతుందనేది. చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేసి చక్కటి విద్యావకాశాలు కల్పిస్తే, ఒక శిశువు వికసించడానికి, జాతి, దేశం, మతం, భాష ఏవీ అడ్డునిలబడేవి కావని ఫిల్లిస్‌ నిరూపించింది. నా ఉద్యోగ జీవితం పొడుగునా గిరిజన విద్య కోసం వివిధ ప్రయత్నాలు, ప్రయోగాలు చేపట్టడానికి నాకు ఇటువంటి విశ్వాసమే ఉండేది. సహజంగా ఏ పిల్లవాడూ లేదా ఏ బాలిక కూడా ప్రతిభావిహీనులు కారనీ, వాళ్ళని మనం ఏ పాఠశాలలో చేర్పిస్తున్నాం, ఆ పాఠశాల వ్యవస్థ ఏ విధంగా ఉన్నదీ అన్నది మాత్రమే ఆ పిల్లల విద్యావికాసాన్ని ప్రభావితం చేస్తుందనేది నేను స్వయంగా చూసిన విషయం.

అయితే ఫిల్లిస్‌ జీవితం మనకి మరొక విషయం కూడా చెప్తోంది. కేవలం సౌకర్యాలు, అవకాశాలు కల్పించి ఊరుకుంటే చాలదు. వారిపట్ల మనం శ్రద్ధ చూపించాలి. ప్రేమానురాగాలు చూపించాలి. ఫిల్లిస్‌ గురించి రాసిన వాళ్ళు ఒక సంఘటన నమోదు చేసారు. అదేమంటే ఆమె ఒక రోజున బయటకు వెళ్ళింది. బోస్టన్‌లో ఆ రోజు మంచు విపరీతంగా కురుస్తోంది. ఆమె యజమానురాలు వెంటనే ఆమెని ఎక్కడున్నా సరే తీసుకు రమ్మని బండి పంపించింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చేదాకా ఆ తల్లి కొట్టుకుపోతూనే  ఉందని రాసారు వాళ్ళు. అవకాశాలు కల్పించడంతో పాటు ఇటువంటి ప్రేమానురాగాల్ని కూడా పంచగలిగితే పిల్లలు అద్భుతాలు చేస్తారనడంలో సందేహం లేదు.

ఇక మూడవ అంశం, విద్య ఒనగూడినప్పుడు, అది ఆ మనిషిని కేవలం తన ఇంటికీ, తన కుటుంబానికీ, తన సమూహానికీ, మాత్రమే పరిమితంగా ఉంచదు. ఆ బిడ్డ ఎప్పటికప్పుడు మరింత విస్తృతసమాజంలో భాగస్వామికావడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె చేపట్టే ప్రతి ప్రయత్నం వైపూ తక్కిన ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూసేటట్టుగా తనని తాను తీర్చిదిద్దుకుంటూ ఉంటుంది. దీనికి ఫిల్లిస్‌ జీవితం నుంచే ఒక ఉదాహరణ చెప్పవచ్చు.

1775 నాటికి అమెరికా స్వాతంత్య్ర పోరాటం జరుగుతుండేకాలం నాటికి వీట్లీ కవయిత్రిగా తన ప్రతిభను పూర్తిగా కనబరచగలిగింది. తాను రాసిన ఒక కవితను ఆమె జార్జి వాషింగ్టన్‌కి అంకితమిస్తూ ఆయనకి ఒక ఉత్తరం రాసింది. అమెరికా స్వాతంత్య్రపోరాట సేనానీ, తర్వాత కాలంలో అమెరికా రాష్ట్రాల దేశాధ్యక్షుడూ అయిన వాషింగ్టన్‌ ఆమెని ప్రశంసిస్తూ జవాబు రాయడమే కాక, ఎప్పుడేనా తానుండే కేంబ్రిడ్జికి వచ్చినట్లయితే తనని వచ్చి కలుసుకొమ్మని ఆహ్వానించేడు కూడా.

ఎటువంటి పోరాటమూ చేపట్టనవసరం లేకుండానే తనకు ఉన్నతస్థాయి విద్య లభించినమాట నిజమేగాని ఆమె ఆ అవకాశాన్ని సౌకర్యవంతమైన జీవితం జీవించడం కోసం కాక, మానసికంగా, సృజనాత్మకంగా వికసించడానికి వాడుకుందని కూడా మనం గమనించాలి. ఆమె చేసిన పోరాటం సామాజిక-రాజకీయ ప్రమాణాలతో కొలిచేదికాదు. అది ఆత్మికపోరాటం. మానసికవిముక్తి కోసం చేసిన పోరాటం.  ఆమె రచనలు చేసేనాటికి మేరీ వోల్‌స్టన్‌ క్రాఫ్ట్‌ వంటి రచయిత్రి ఇంకా పుట్టనే లేదు. ఆమె మరణించిన పాతికేళ్ళకి గాని మార్గరెట్‌ ఫుల్లర్‌ పుట్టి ఉండలేదు. ఆమె కవితాసంపుటి వెలువడిన మరొక అర్థశతాబ్దం తర్వాత గానీ ఎమిలీ డికిన్‌సన్‌ కళ్ళు తెరవలేదు. కాబట్టి కేవలం ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యానికి మాత్రమే కాదు, అసలు మానసిక స్వేచ్ఛ కోసం పోరాడిన ఆధునిక రచయిత్రుల పరంపరలోనే ఆమెను అగ్రేసరురాలిగా చెప్పవలసి ఉంటుంది.

ఇక్కడ పొందుపరిచిన ఆమె రెండు కవితల్లో మొదటి కవితలో ఆమె ఏదో ఒక దయ వల్ల మాత్రమే తాను ఆఫ్రికానుంచి అమెరికా రాగలిగానని చెప్పుకుంటున్నది. తన దేశాన్ని pagan land అని అంటున్నప్పుడు అనాగరికం అనే అర్థంలోకాక, తాను నమ్మిన దేవుడి గురించి తెలియని దేశమనే అర్థంలోనే చెప్తున్నదని నేననుకుంటున్నాను. లేకపోతే ఆమె primitive అనే పదమే వాడి ఉండేది.  కాని తాను అక్కణ్ణుంచి వచ్చినంతమాత్రాన, తన జాతిని గాని, తన జాతిరంగుని గాని చూసుకుని ఆమె కించపడటం లేదు. పైగా అవకాశాలు కల్పిస్తే నల్లవాళ్ళు కూడా దేవదూతల కోవలో చేరగలరని చెప్తున్నది. కాబట్టి తాను జీవిస్తున్నది తెల్లవాళ్ళ దేశంలో అనిగాని లేదా తన చుట్టూ ఉన్న క్రైస్తవులూ, తెల్లవాళ్ళూ తన జాతికన్నా మెరుగైన వారనిగాని ఆమె అనుకోవడం లేదన్నది స్పష్టమే. పైగా ఆమెకి ఒక ఎరుక లభించిందని కూడా చెప్తున్నది. దేవుడున్నాడనీ, రక్షకుడున్నాడనీ, కాబట్టి తనకి ముక్తి లభిస్తుందని నమ్మకం కలిగిందనీ అంటున్నప్పుడు, ఆమె సామాజిక-జాతీయ విమోచనలకు భిన్నమైన ఒక ఆత్మిక విముక్తి గురించి మాట్లాడుతున్నదని తెలుస్తూనే ఉంది కదా!

ఇక రెండవ కవిత, పద్ధెనిమిదో శతాబ్ది సుప్రసిద్ధ ఇంగ్లిషు కవుల neo-classical సంప్రదాయంలో రాసిన కవిత. అయాంబిక్‌ పెంటామీటర్‌లో రాసిన హీరాయిక్‌ కప్లెట్‌ లో ప్రాచీన గ్రీకుదేవతల్ని మేల్కొల్పుతూ, ఆమె స్తుతిస్తున్నది, నిజానికి, తన చిన్నప్పుడు తన తల్లి ఆరాధించిన సూర్యుణ్ణే!


నేను నా పురాతన భూమి నుంచి
ఇక్కడికొచ్చానంటే ఏదో ఒక దయవల్ల.
వివేకశూన్యమైన నా ఆత్మకి
దేవుడున్నాడనీ, రక్షకుడున్నాడనీ తెలిసింది.
నాకు తెలియదు ఒకప్పుడు ముక్తి అంటే ఏమిటో.
కొందరున్నారు మా నల్లజాతిని తృణీకరించేవాళ్ళు
మా చర్మం రంగుచూసి దడుసుకునేవాళ్ళు.
కాని క్రైస్తవులారా! గుర్తుపెట్టుకోండి, నీగ్రోలు
కెయిన్‌ లాగా నల్లగా ఉండి ఉండవచ్చుగాక
కాని సంస్కరిస్తే వాళ్ళు కూడా దేవదూతలుకాగలరు.

యశోమయ నవదేవతలారా, నాకు తోడునిలవండి
నా తంత్రులు సవరించుకోడానికి సాయమివ్వండి
గానయోగ్యఛందస్సులు నా పైన కురిపించండి
ఇప్పుడు ప్రభాతదేవత తనని స్తుతించమంటున్నది.

ఉషోదయవేళ సహస్రకాంతిఛాయలు సమస్తం
ఆకాశానికి అడ్డంగా పరుచుకుంటున్నవి
ప్రభాతం ఉదయిస్తున్నది, వెలుగు విప్పారుతున్నది
కొమ్మకొమ్మనా ప్రత్యూషపవనం ఓలలాడుతున్నది.

వీనులవిందైన గానం వినిపిస్తూ పక్షిగణం మేల్కొంటున్నది
నిగిడ్చిన చూపుల్తో, రంగుల తురాయిల్తో కదలాడుతున్నవి.

దినవహ్ని వేడిమినుంచి తరుఛాయలు
తమ పచ్చని నీడన ఊరటకలిగిస్తున్నవి
వాగ్దేవత తన వీణ శ్రుతిచేస్తుండగా
మిగిలినదేవతలు వింజామరపడుతున్నవి.

తరుఛాయలు, మృదుమారుతాలు, రంగుల నింగి
రేకెత్తిస్తున్న హాయి మధ్య నా హృదయముప్పొంగుతున్నది
అదుగో, చూడు, ప్రాచీదిశన అరుణకిరణదివాకరుడు
ఆ చండకరుడి ప్రకాశానికి నీడలు తరలిపోతున్నవి.

కాని, ఓహ్! మరీ మిక్కుటం ఆ కిరణప్రతాపం
ఇప్పుడే పుట్టిన ఈ గీతం ఇంతలోనే ముగుస్తున్నది.


Featured image: Phillis Wheatley in the Boston Women’s Memorial. Credit: ckilger, CC-BY-NA-2.0 / Flickr

26-1-2025

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading