
24
నా మనోవాక్కాయకర్మసహితంగా దేవా!
నీ శరణు వేడుకోడానికి వచ్చాను.
నిన్ను కాక మరొకరిని మనసున తలవలేదు
నా కోరికలు నీ పాదాలదగ్గరే పెట్టేసాను.
నా హృదయంలో మహాబరువైన వేదన
నువ్వు కాక దాన్ని తీర్చేదెవరు?
నేను నీ దాసుణ్ణి నువ్వు నాకు అప్పుపడ్డావు
చాలా దూరం నుంచి నేనిక్కడకొచ్చాను
అప్పిచ్చినవాడిలాగా నీ గుమ్మం ముందున్నాను.
తుకా అంటున్నాడు: ముందు మన లెక్కలు తేల్చు.
सर्वभावें आलों तुज चि शरण । कायावाचामनसहित देवा ॥१॥
आणीक दुसरें नये माझ्या मना । राहिली वासना तुझ्या पायीं ॥ध्रु.॥
माझिये जीवींचेकांहीं जडभारी । तुजविण वारी कोण दुजे ॥३॥
तुझे आम्ही दास आमुचा तूं ॠणी । चालत दूरूनी आलें मागें ॥३॥
तुका म्हणे आतां घेतलें धरणें । हिशोबाकारणें भेटी देई ॥४॥ (1246)
25
భగవద్భక్తి సంతలో దొరికే సరుకు కాదు
శాంతి అడవుల్లో తిరిగితే చిక్కేది కాదు.
డబ్బు కుమ్మరిస్తే వచ్చిపడేది కాదు
ఆకాశంలోనూ పాతాళంలోనూ ఉన్నది కాదు.
తుకా అంటున్నాడు: నువ్వే దాని మూల్యం
కాకపోతే దాని గురించి మాట్లాడుకోడం వృథా.
नाहीं संतपण मिळत ते हाटीं । हिंडतां कपाटीं रानीं वनीं ॥१॥
नये मोल देतां धनाचिया राशी । नाहीं तें आकाशीं पाताळीं तें ॥१॥
तुका म्हणे मिळे जिवाचिये साठी । नाहीं तरी गोष्टी बोलों नये ॥३॥ (1205)
26
ఈ రోజు నిజంగా ధన్యమైంది
భగవద్భక్తుల దర్శనం దొరికింది.
నా పాపతాపాలు తునిగిపొయ్యాయి
ఒక్కసారిగా నా దైన్యం తొలగిపోయింది.
నా హృదయానికి శాంతి చిక్కింది
మనసు నీ పాదాలదగ్గర కుదురుకుంది.
తుకా అంటున్నాడు: నా ఇంటికి
దీపావళీ, దసరా ఒక్కసారే వచ్చినట్టుంది
धन्य आजि दिन । झालें संताचें दर्शन ॥१॥
जाली पापातापा तुटी । दैन्य गेलें उठाउठीं ॥ध्रु.॥
जालें समाधान । पायीं विसांवले मन ॥२॥
तुका म्हणे आले घरा । तोचि दिवाळीदसरा ॥३॥ (994)
31-3-2025

