
మేం మంత్రాలయంలో అడుగుపెట్టేటప్పటికి మంచి ఎండ. ఆ మధ్యాహ్నమంతా బయటకి పోలేక నరహరి తీర్థ నిలయంలోనే గడిపాం. సాయంకాలం బయటకి వచ్చేటప్పటికి ఫాల్గుణమాసం పూర్తి వికాసంలో ఉందని అర్థమయింది. గాలంతా వేపపూల సుగంధం. నేనింతకు ముందు చూసిన మంత్రాలయం 2009 వరదల్తో అదృశ్యమైపోయింది. ఇప్పుడక్కడ అత్యంత వైభవోపేతమైన సరికొత్త ప్రాంగణం కనిపిస్తూ ఉంది. వీథి దీపాలు, భవనాల్లో దీపాలు, దేవాలయ ప్రాంగణంలో దీపాలు. అక్కడొక చోట రాసినట్టుగా ఈ కొత్త మంత్రాలయం సురవనాలయంలాగా వెలుగులీనుతూ ఉంది.
నేను నా జ్ఞాపకాల్ని తడిమి చూసాను. 1990 లో, అంటే ఇప్పటికి సరిగా మూడున్నర దశాబ్దాల కిందట, మే నెలలో నేను కర్నూలులో చేరటానికి వెళ్ళిన రోజు. ఆ రోజు కలెక్టరుగారు ఎక్కడో కాంపులో ఉన్నందువల్ల వెంటనే హీరాలాల్ మాష్టారి దగ్గరకు వెళ్ళాను. నాతో పాటు మా అన్నయ్య సుందర్రావు కూడా ఉన్నాడు. మాష్టారి ఇంట్లోనే మా మధ్యాహ్నభోజనం. ఆ కొద్దిసేపట్లోనే మాష్టారు కర్నూలు జిల్లా ప్రాశస్త్యం, చరిత్ర స్థూలంగా చెప్పుకొచ్చి కలెక్టరు వచ్చే లోపు మీరు మంత్రాలయం పోయి రావొచ్చుకదా అన్నారు.
అలా అడుగుపెట్టాం మొదటిసారి మంత్రాలయం ప్రాంగణంలో. ఆ రోజు మాతో పాటు గిరిజన సంక్షేమ కార్యాలయ అటెండరు రామచంద్రయ్య కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో ఏళ్ళుగా రెవెన్యూ డిపార్టుమెంటులో పనిచేసి ఉండటం వల్ల తానే ఒక జిల్లా గెజెటీరుగా మారిపోయాడు. మేము మంత్రాలయం చేరుకునేలోపే అతడు ఆ స్థానిక ఐతిహ్యాలు తనకి తెలిసినవన్నీ మాకు చెప్పేసాడు. ముఖ్యంగా, సీమజిల్లాల్లో జిల్లాలో రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టడం కోసం పాలేగార్లతోనూ, ఇనాముదార్లతోనూ పోరాటం చేసిన థామస్ మన్రో మంత్రాలయం సందర్శన గురించి కూడా మాకు చెప్పాడు. మఠానికి ఆదోని నవాబు ఇనాము ఇచ్చిన భూముల్ని స్వాధీనపర్చుకోడానికి మన్రో మంత్రాలయం వెళ్ళినప్పటి కథ అంతా పూస గుచ్చినట్టు చెప్పేసాడు. బళ్ళారి కలెక్టరుగా మన్రో ఆరోజు తన బూట్లు విప్పి గౌరవంతో ఆ ప్రాంగణంలో అడుగుపెట్టాడనీ, అప్పుడు ఆయనతో బృందావనంలో సజీవులై ఉన్న స్వామి మాట్లాడేరనీ, తిరిగి మఠం నుంచి తన శిబిరానికి వెళ్ళగానే మన్రో తాను ఇనాము భూముల్ని స్వాధీన పరుచుకోడానికి సిద్ధం చేసిన ఉత్తర్వులు అక్కడికక్కడే చింపేసాడనీ ఆ రోజు రామచంద్రయ్య ద్వారానే విన్నాను. ఆ విషయం బళ్ళారి జిలా గెజెటులో రాసి ఉన్న సంగతి రామచంద్రయ్యకి తెలియకపోవచ్చు. కాని డబ్ల్యు. ఫ్రాన్సిస్ అనే ఐ.సి.ఎస్. అధికారి నమోదు చేసిన ఈ ఐతిహ్యం కనీసం 1916 నాటి గెజెటుకే ఎన్నోసార్లు పునర్ముద్రితమవుతూ ఉంది.
ఆ తర్వాత కర్నూలు జిల్లాలో నేను రెండున్నరేళ్ళకు పైగా ఉన్నాను. ఎన్నోసార్లు మంత్రాలయం వెళ్ళేను. మరీ ముఖ్యంగా మాకు రాజయ్యగారు జిల్లాకలెక్టరుగా ఉన్న రోజుల్లో నెలనెలా ఆదోని డివిజనలు రెవ్యూ మీటింగులు జరిగినప్పుడల్లా మీటింగు పూర్తవ గానే ఆ సాయంకాలమే ఆయన మమ్మల్ని మంత్రాలయం తీసుకుపోయేవారు. అప్పట్లో అక్కడ ఉండటానికి సరైన వసతిగృహాలు ఉండేవి కావు కాబట్టి మేము ఎమ్మిగనూరు దగ్గరుండే ఐ.టి.సి గెస్టు హవుజులో ఉండేవాళ్ళం.
అప్పట్లో మా ఇంటికి మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, మా బంధు మిత్రులు ఎవరు వచ్చినా, కర్నూల్లో సి-కేంపులో ఉండే మా క్వార్టర్సులో పొద్దున్నే బాలమురళి గీతాలతో వాళ్ళకి తెల్లవారేది. మరీ ముఖ్యంగా ‘మేలుకో గురురాజ మేలుకో రవితేజ మేలుకో శ్రీ రాఘవేంద్ర, మమ్మేలుకో ..’ కీర్తన వింటూనే ‘మమ్మల్ని మంత్రాలయం ఎప్పుడు తీసుకువెళ్తావు?’ అనడిగేవారు.
అలాంటి రోజుల్లో హీరాలాల్ మాష్టారు ఒకరోజు నారాయణరావుగారనే ఒక లెక్చరరుగారి ఇంటికి తీసుకువెళ్ళారు. నారాయణ రావుగారు అప్పుడు సిల్వర్ జూబిలీ కళాశాలలో బోటనీ లెక్చెరరుగా పనిచేస్తుండేవారు. ఆయనకి ముగ్గురమ్మాయిలు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన సాయంకాలం ఆ పిల్లల్లో పెద్దమ్మాయి, చిన్నమ్మాయి కలిసి ఆలపించిన ‘తుంగా తీర విహారం, భజ మన రాఘవేంద్ర యతిరాజం’ నిన్ననే విన్నట్టుగా ఉంది. ఆ సాయంకాలం నేను ఊహించలేదు, ఆ పెద్దమ్మాయి నా ఇల్లాలుగా ఇంట్లో అడుగుపెడుతుందని.
నా పెళ్ళయి వారం రోజులు కూడా తిరక్కుండానే నేను కర్నూలు నుంచి బదిలీ మీద అదిలాబాదు వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు మళ్ళా నా కొలీగు నా స్థానంలో కర్నూల్లో జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా చేరిన బాలయోగి మా ఇద్దర్నీ తన కారు మీద మంత్రాలయం తీసుకువెళ్ళాడు. అక్కడ దర్శనం తర్వాత మఠంలో భోజనం చేసాం. అలా నేను ఉద్యోగంలో చేరినప్పుడూ, అక్కణ్ణుంచి సెలవు తీసుకునేటప్పుడూ కూడా స్వామి ఆశీస్సులు లభించడం నా భాగ్యం.
ఆ తర్వాత కూడా మరొక రెండుమూడు సార్లు వెళ్ళానేమో అదంతా చాలా కాలం కిందటి మాట. కాని ఇప్పుడు ఈ మంత్రాలయాన్ని చూస్తూ ఉంటే ఇదే మొదటిసారి ఇక్కడ అడుగుపెట్టినట్టు ఉంది.
మా అదృష్టవశాత్తూ యాత్రీకులు ఎక్కువమంది లేకపోవడంతో మాకు స్వామి బృందావనం దగ్గరికి నేరుగా పోగలిగే అవకాశం దొరికింది. ఆ సాయంకాలం శ్రీ సుయతీంద్ర తీర్థ శ్రీపాదులవారి మహాసమారాధనోత్సవాల వల్ల ఆ ప్రాంగణంలో భక్తిగీతాలాపన జరుగుతూ ఉంది. మఠమంతా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. మేము బృందావనం దగ్గర ప్రణమిల్లి మంచాలమ్మ దర్శనం కూడా చేసుకుని మళ్ళా మఠం ఆవరణలోకి వచ్చేటప్పటికి పల్లకీ సేవ మొదలయ్యింది. ఆ సేవ పూర్తయ్యాక మా సోదరుడూ, మంత్రాలయంలో పరిమళ ప్రసాదం బాధ్యతలు చూస్తున్న శేషగిరి వల్ల ప్రస్తుత మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థరు వారి దర్శనం, ఆశీస్సులు కూడా లభించాయి.
అక్కడి పుస్తకాల స్టాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి పైన ద హిందూ పత్రిక 2019 లో ప్రచురించిన ఒక ప్రత్యేక సంచిక దొరికింది. అక్కడే ఆ ప్రాంగణంలోనే కూచుని దాదాపుగా ఆ పుస్తకం చదవడం పూర్తిచేసేసాను. ఆ ప్రత్యేక సంచికలో శ్రీ రాఘవేంద్రుల గురించీ, మంత్రాలయం గురించీ, 2009 లో వరదల గురించీ, వరదల తర్వాత మంత్రాలయ పునరుజ్జీవనం గురించీ, సంగ్రహంగానే కానీ, అన్ని పార్శ్వాల్నీ స్పృశిస్తూ వ్యాసాలున్నాయి.
మధ్వాచార్యులు ప్రబోధించిన ద్వైతమతాన్ని మరింతగా ప్రజల్లో విస్తరింపచేయడానికీ, తక్కిన దర్శనాల్ని పరాస్తం చేసి ద్వైత దర్శనాన్ని బలపర్చడానికీ శ్రీ రాఘవేంద్రులు చేసిన కృషి ఆయన్ని వేదాంత చరిత్రలో ఒక ప్రముఖ ఆచార్యుడిగా నిలబెట్టడమేకాక, ఆయన జీవితకాలంలో చూపించిన మానవత్వం, మహిమలు ఆయన్ని ఒక తీర్థరుస్థాయి నుంచి ఒక స్వామి స్థాయికి తీసుకువెళ్ళాయి. శ్రీ రాఘవేంద్రుల జీవితం, కృషి రేఖామాత్రంగా చూసినవారికి కూడా ఆయన తన కాలంలో హిందూ-మహ్మదీయ పరస్పర సహనానికి ఒక కేంద్రంగా నిలబడ్డారని కూడా తెలుస్తుంది. ఈ అంశంలో శ్రీ రాఘవేంద్రుల జీవితచరిత్రకి ఈ రోజు అపారమైన ప్రాసంగికత ఉంది.
శ్రీ రాఘవేంద్రుల పూర్వీకులు కదంబుల కాలానికి చెందిన వారు. కదంబరాజు మయూర వర్మ ఆశ్రితులుగా జీవించిన ఆ పూర్వీకులు నెమ్మదిగా హంపీ విజయనగరానికి తరలివెళ్ళారు. శ్రీ రాఘవేంద్రుల తండ్రికి ముత్తాత అయిన కృష్ణభట్టు శ్రీకృష్ణదేవరాయలకు వైణిక గురువుగా ఉండేవారు. కృష్ణభట్టుల మనమడ్దైన తిమ్మన్న భట్ట రక్షస-తంగడి యుద్ధంలో విజయనగరం కూలిపోయాక ఆదిల్ షా సైన్యాల నుంచి తప్పించుకుని కుంభకోణానికి వెళ్ళిపోయారు. అక్కడ శ్రీ సుధీంద్ర తీర్థుల మఠంలో తలదాచుకున్నారు. శ్రీ రాఘవేంద్రులు ఆయనకు మూడవ సంతానం. ఆయన చిన్నప్పటి పేరు వేంకటనాథుడు. తన తల్లిదండ్రులు కాలం చేసాక రాఘవేంద్రులు మదురై వెళ్ళి కొంతకాలం తన బావమరిది దగ్గర ఉన్నారు. కాని అక్కడ చాలా గడ్డుపేదరికం చవి చూసారు. దాంతో తిరిగి మళ్ళా కుంభకోణం వచ్చి సుధీంద్రులదగ్గరే ఆశ్రయం పొందారు. అక్కడ ఉండగా శ్రీ రాఘవేంద్రుల పాండిత్యం, వాదనైపుణ్యం, ఆయన వ్యక్తిత్వం సుధీంద్రుల్ని ముగ్ధుల్ని చేసాయి. దాంతో ఆయన తన తర్వాత మఠాధిపతి బాధ్యతలు రాఘవేంద్రులకు అప్పగించాలనుకున్నారు. అందుకని ఆయన్ని సన్న్యాస దీక్ష స్వీకరించమని అడిగారు. గురువు తన మనసులో మాట బయటపెట్టాక కూడా రాఘవేంద్రులు కొంతకాలం పాటు ఏమీ తేల్చుకోలేకపోయారు. తన ఏకైక కుమారుడు లక్ష్మీనారయణకి ఇంకా ఉపనయనం జరగలేదు. కాని ఆ బాధ్యతలూ, ఆ పిల్లవాడి పోషణ మొదలైనవన్నీ మఠం చూసుకుంటుందని ఆయనకు తెలుసు. కాని ఆయన ప్రధానంగా బెంగపెట్టుకున్నది తన శ్రీమతి సరస్వతి గురించే. అంతదాకా తన కష్టసుఖాల్ని కలిసి పంచుకుంటున్న ఆమెని వదిలిపెట్టి సన్న్యాసం స్వీకరించడం గురించి ఆయన చాలా కాలం పాటు ఏమీ తేల్చుకోలేకపోయారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అటువంటి ఒక రాత్రి ఆయనకి దివ్యదర్శనం కలిగింది. తనని సన్న్యాస దీక్ష స్వీకరించవలసిందిగా దివ్యాదేశం అందింది. ఆయన తన నిర్ణయాన్ని సుధీంద్రులకి చెప్పారు. ఆ గురువు మహదానందంతో తంజావూరు రఘునాథనాయకుల సమక్షంలో ఆయన్ని సన్న్యాసాశ్రమంలో ప్రవేశపెట్టారు. అప్పటిదాకా వేంకటనాథుడిగా ఉన్న పేరుని రాఘవేంద్రులుగా మార్చారు.
కానీ తన భర్త సన్న్యాస ఆశ్రమ దీక్ష తీసుకున్న వార్త వినగానే ఆయన భార్య సరస్వతమ్మ తట్టుకోలేక ప్రాణం విడిచిపెట్టింది. రాఘవేంద్రులకు సన్న్యాస దీక్ష ఇవ్వడానికి ముందు సుధీంద్రులు యాదవేంద్రుడనే ఒక శిషుడి గురించి కూడా కొంత ఆలోచన చేసారు. అయితే శ్రీ రాఘవేంద్రులు విద్యామఠం అధిపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు యాదవేంద్రులు ద్వైత మత ప్రచారం చేస్తూ దేశాటనంలో ఉన్నారు. ఆయన కుంభకోణం తిరిగి రాగానే రాఘవేంద్రుల దర్శనం చేసుకుని ఆయన్ని అభినందించారు. అసూయని జయించిన ఆ యాదవేంద్రుణ్ణి చూసి రాఘవేంద్రులు తాను మఠాధిపతి బాధ్యతలనుంచి వైదొలగడానికి సిద్ధపడ్డారు.యాదవేంద్రుల్నే తన స్థానం స్వీకరించమని అడిగారు. కాని యాదవేంద్రులు అందుకు అంగీకరించలేదు.మఠం తాలూకు అధిదేవత మూలరాములు కాబట్టి రాఘవేంద్రులకే ఆయన సేవచేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
విద్యామఠం బాధ్యతలు స్వీకరించాక శ్రీ రాఘవేంద్రులు దాదాపుగా దేశమంతా సంచరించారు. ఎన్నో వ్యాఖ్యానాలు, భాష్యాలు రాసారు. తర్వాత రోజుల్లో కన్నడ భక్తి సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన దాసకీర్తనకు శ్రీకారం చుట్టారు. ఆయన తర్వాత విజయదాసరు, గోపాల దాసరు, జగన్నాథ దాసరు దాససాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసారు. ఈ రోజు కర్ణాటక సంగీతంలోనూ, హిందుస్తానీ సంగీతంలోనూ కూడా గొప్ప గాయకులు పండిట్ భీం సేన్ జోషి వంటివారు దాసకీర్తనలకు మరింత వ్యాప్తి కలిగించారు.
శ్రీ రాఘవేంద్రులు తన పర్యటనల్లో భాగంగా ఆదోని ప్రాంతంలో తుంగభద్ర ఒడ్డున ఉన్న మంచాల గ్రామంలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు తన తదుపరి కార్యక్షేత్రం అక్కడే అని నిశ్చయించుకున్నారు. బిజాపుర్ సుల్తాన్ మొదటి ఆదిల్ షా కాలంలో ఆయన పూర్వీకులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తుంగభద్ర తీరం రెండవ ఆదిల్ షా కాలం నాటికి అయన్ని మళ్ళీ పిలిచింది. బిజాపూర్ పాలకులకు ఆదోనిలో ప్రతినిధిగా ఉన్న నవాబు సిద్ధి మసూద్ ఖాన్ మొదట్లో రాఘవేంద్రుల్ని ఇష్టపడలేదు. కాని ఆయన్ని స్వయంగా చూసి, మాట్లాడిన తరువాత, ఆయనకు భక్తుడిగా మారిపోయేడు. స్వామి కోసం తానేదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అప్పుడు స్వామి మంచాల గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం, ఆశ్రమం కోసం కొంత భూమి ఇమ్మని అడిగాడు. ఆ గ్రామంలో కృతయుగంలో ప్రహ్లాదుడు యజ్ఞం చేసాడనీ, అందుకనే తమకి అక్కడ నివసించాలని కోరిక కలిగిందనీ స్వామి చెప్పారు. ఆ భూమి ఒక స్థానిక కాజీ ఆధీనంలో ఉండేది. నవాబు ఆ కాజీకి వేరే చోట స్థలం చూపించి స్వామికోరినంత భూమిని ఇనాముగా సమర్పించుకున్నాడు. తర్వాత రోజుల్లో మన్రో వచ్చింది ఆ ఇనామును రద్దు చెయ్యడం కోసమే. కాని స్వామి తన బృందావనం నుంచే మన్రోతో మాట్లాడి అతడి మనసు మార్చగలిగారు .
మంత్రాలయం వచ్చిన కొన్నేళ్ళకు, 1671 లో ఆయన సజీవసమాధిలోకి ప్రవేశించారు. ఆ సమాధినే బృందావనం అంటారు. అక్కడ తాను మరొక 700 ఏళ్ళ పాటు సజీవంగా ఉంటాననీ, తనను చూడవచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు వింటననీ, తీరుస్తాననీ వాగ్దానమిచ్చారు. అందుకే ఇప్పటికీ ఆ బృందావనం దగ్గర గోడమీద మీ కోరికలు పూర్తిగా చెప్పుకుని మరీ వెళ్ళండి అని రాసి ఉంది!
గతంలో ఎన్నో సార్లు మంత్రాలయం వెళ్ళినా ఎన్నడూ లేనట్టుగా ఈ సారి స్వామి సన్నిధి మరింత సన్నిహితంగా తోచింది. అన్నిటికన్నా ముందు ఆయన ముందొక కవి అనీ, నాబోటి వాళ్ళ వేదనకొక గొంతునిచ్చాడనీ అర్థమయింది. అందుకే అక్కడ కూచున్న కొద్దిసేపట్లోనే రాగయవేంద్రులు రాసిన ఈ కృతిని భీం సేన్ జోషి, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, పి.బి.శ్రీనివాస్ తో సహా పాడింది వింటే గాని తనివితీరలేదు. చూడండి, సుప్రసిద్ధమైన ఆయన గీతం, ఆ మాటలకు నా తెలుగు:
ఇందు ఎనగె
ఇందు ఎనగె గోవింద నిన్న పదార
విందవ తోరో ముకుందనె
సుందర వదననె నంద గోపన కంద
మందరోద్ధార ఆనంద ఇందిరా రమణ
నొండెనయ్య నా భవబంధనదొలు సిలుకి
ముందె దారి కానదె కుందిదె జగదొళు
కందను ఎందన కుందగళనిణసిదె
తందె కాయో కృష్ణ కందర్ప జనకనె
మూఢతనది బహు హేది జీవననాగె
ధౄడభకుతియను మాడలిల్లవో హరియె
నోడలిల్లవో నిన్న పాడలిల్లవో మహిమె
గాడికార కృష్ణ బేడికొంబెనో నిన్న
ధారుణినిలొలు భూభార జీవననాగి
దారి తప్పి నడెదె సేరిదె కుజనర
ఆరు కాయువరిల్ల సేరిదె నినగయ్యా
ధీర వేణుగోపాల పారుగానిసో హరియె
నేడు నాకు నీ చరణాలు చూపించు
నేడు నాకు నీ చరణాలు చూపించు గోవిందా
నాకు నీ పాదాలు చూపించు ముకుందా
సుందర వదనా! ముకుందా
మందరోద్ధారా! ఆనందా! ఇందిరారమణా!
భవబంధనాల్లో చిక్కి నలుగుతున్నాను
ముందుదారి కనిపించక కుంచించుకుపోయాను
చిన్న బిడ్డననుకుని నా తప్పులెంచకు
తండ్రీ, కృష్ణా, కందర్ప జనకా, రక్షించు.
బహుమందమతిని, కష్టమ్మీద బతుకీదుతున్నాను
దృఢంగా భక్తినిలుపుకోవడమెలానో తెలియదు
నిన్ను చూడలేదు, నీ మహిమను పాడలేదు
మోహనరూపా!కృష్ణా! నిన్ను వేడుకుంటున్నాను
భూమికి బరువై జీవిక సాగిస్తున్నాను
దారితప్పి చివరికి కుజనుల్ని చేరుకున్నాను
నన్ను కాపాడేవాళ్ళెవరూ లేరు, నువ్వు తప్ప
ధీర వేణుగోపాలా! నన్ను ఒడ్డుకి చేర్చు.
30-3-2025


మంత్రాలయం గురించి మాకు తెలియని చరిత్ర మీ తీర్థయాత్ర ద్వారా తెలియ జెప్పినందుకు ధన్యవాదాలు సర్
ధన్యవాదాలు సార్!
అనుభూతిని అక్షరాల్లో అందించి క్షేత్ర సందర్శన, చరిత్ర సమీక్షణ చేయించారు.పోల్కంపల్లి శాంతాదేవి గారు ఇటీవల గురురాఘవ్ంద్ర చరిత్ర అని ఒక బృహద్గ్రంథం నవలా రూపంలో వెలువరిస్తే దానికి ముఖ చిత్రం తొలి, మలి ముద్రణలకు రూపొందించే అవకాశం కలిగింది.
పుస్తకం సమర్పించే సమయంలో ఆహ్వానం వచ్చినా ఎందుకో కుదరలేదు.
నమస్సులు.
ఆహా అద్భుతం ఈ రోజు ఈ క్రొత్త సంవత్సరం ఇలా గురుముఖత గురు రాఘవేంద్రుని గురు కటాక్షం లభించింది
ఆనంద బాష్పాభిషేకంతో నమస్సులు…🙏🙏🙏
ధన్యవాదాలు సార్!
నమస్తే సార్ మీరు మా జిల్లా అల్లుడని తెలిసి చానా సంతోషం అనిపించింది మీరు ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయము ఇవన్నీ పేర్లు చెప్తుంటే మా మనిషి అనిపిస్తుంది మాది పత్తికొండ సార్
పత్తికొండ, తుగ్గలి, ఆలూరు మండలాల్లో నేను చాలా సార్లు తిరిగాను. చాలా సంతోషం.
ప్రహ్లాద్ కడుపులో ఉనప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా అని, నాకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పేవారు.
వారిలో, మా అక్క అత్తగారు నా కోసం మంత్రాలయం వెళ్ళి, మొక్కుకుని చిన్న లాకెట్ లాంటిది తెచ్చారు. అది ఎన్నేళ్లో నాతో ఉంది. ప్రహ్లాద్ పుట్టాక, ఆవిడ ప్రేమను గుర్తు చేసుకుంటూ పిల్లాణ్ణి తీసుకుని మేమిద్దరం వెళ్ళాం మంత్రాలయానికి. ఆ ప్రాంగణంలో ఎంత సేపు కూర్చున్నా తనివితీరలేదు.
మీరు చెప్పిన కోణం కొత్తది…ఆ పాట వెదుక్కుని వింటాను. భక్తిలో మీ హృదయం ఎంత నిర్మలంగా స్పందిస్తుంది! తెలుగు పదాలు అద్దినట్టే అమరిపోయాయి.🙏
ఆ పాట పాడిన అమ్మాయితో మీ తొలినాళ్ళ కథ పూర్తిగా చెబితే వినాలని ఉంది ..😊😊
పాట పాడిన అమ్మాయి ఎవరా అని
నారాయణ రావు గారి పెద్దమ్మాయి…😊❤️
ఆ రాయరు ( భక్తులు తమ ప్రియతమ రాఘవేంద్రు ని పిలుచుకునే పిలుపు) నా జీవితపర్యంతం తమ అనుగ్రహాన్ని వర్షిస్తూనే వున్నారు, ఆ పేరు తలుచుకోగానే చల్లని పిల్లతిమ్మెర మనస్సుని తాకినట్టు అనిపిస్తుంది
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!