తొలకరి చినుకులు

గోపాల పేట పూర్వపు మహబూబు నగరు జిల్లాలో, ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఒక గ్రామం. నిజాం కాలంలో అది ఒక చిన్న సంస్థానంగా ఉండేది. ఇప్పుడు మండల కేంద్రంగా ఉంది. అక్కడ జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలతో పాటు ఒక జూనియరు కళాశాల, మూడు ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తున్నాయి. ఆ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి పరిమళగారు నడుపుతున్న ‘తొలకరి చినుకులు’ పాఠశాల. గ్రామీణ విద్యార్థులకి ఇంగ్లిషుమీడియంలో ఉన్నత విద్యాప్రమాణాలతో కూడుకున్న విద్యని అందించడం కోసం ఆమె 2012 లో ప్రారంభించిన ఈ పాఠశాల ప్రత్యామ్నాయ విద్యాప్రయోగాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాఠశాల వార్షికోత్సవానికి, ఆ విద్యార్థుల గ్రాడ్యుయేషను సెరిమొనికి రమ్మని  ఆహ్వానిస్తే నేనూ, అనిల్ బత్తుల నిన్న సాయంకాలం గోపాల్ పేట వెళ్ళాం.

వరంగలుకి చెందిన స్వర్ణలత గారు దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్వశిక్షా అభియానులో పనిచేసారు. కొంతకాలం వరంగల్ జిలా ప్రాజెక్టులో గర్ల్ చైల్డ్ డెవలప్మెంటు అధికారిగానూ, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రాజెక్టులో మానిటరింగు ఆఫీసరుగానూ పనిచేసారు. అప్పణ్ణుంచీ ఆమెతో కొనసాగుతున్న స్నేహం ఇప్పుడు నన్ను గోపాల్ పేటకు తీసుకువెళ్ళింది.

ఏదైనా ఒక గ్రామీణ పాఠశాలలో అడుగుపెట్టి చాలా కాలమయ్యింది. అందుకని ఆ పాఠశాలనుంచి పిలుపు రాగానే ఉత్సాహంగా బయల్దేరాను. అదీకాక, ఈ మధ్యకాలంలో గ్రాడ్యుయేషన్ వేడుకలు విశ్వవిద్యాలయాల్నీ, కళాశాల్నీ దాటి పాఠశాలల్లో కూడా అడుగుపెట్టాయని విన్నాను. ఆ పండగ ఎలా జరుగుతుందో చూడాలన్న కుతూహలం కూడా కొంత ఉండింది.

నా అనుభవం మీద నేను గ్రహించిందేమంటే, ఒక పాఠశాల పనితీరు చూడటానికి రెండు దారులున్నాయి. ఒకటి, ఆ పాఠశాల నడుస్తున్నప్పుడు పొద్దున్నే స్కూలు తెరిచే టైముకన్నా ముందే అక్కడికిపోయి సాయంకాలం దాకా, వీలైతే, ఒక రాత్రి కూడా, అక్కడే ఉండి ఆ పాఠశాల ఎలా నడుస్తున్నదో దగ్గరగా చూడటం. లేదా, రెండోది, ఆ పాఠశాల వార్షికోత్సవానికి వెళ్ళడం.

సాధారణంగా వార్షికోత్సవాల్లో పాఠశాలలు తమని తాము ఆకర్షణీయంగా చూపించుకుంటాయి కదా, అప్పుడు ఆ పాఠశాల గురించిన నిజాలెలా తెలుస్తాయి అని మీకు సందేహం రావచ్చు. ఇది కూడా నా అనుభవంలో గ్రహించాను, ఒక పాఠశాల గురించిన దాదాపు యథార్థ ముఖచిత్రం ఆ పాఠశాల వార్షికోత్సవంలో కనిపించినట్టుగా మరెన్నడూ కనిపించదు.

ఆ మధ్య కొన్నేళ్ళ కిందట హైదరాబాదులో ఒక కార్పొరేటు పాఠశాల వార్షికోత్సవానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచారు. అది చాలా పేరున్న కార్పొరేట్ సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా ప్రతి పట్టణంలోనూ ఆ పాఠశాలకొక బ్రాంచి పనిచేస్తున్నది. ఆ సాయంకాలం ఆ పాఠశాల ప్రాంగణమంతా తళతళలాడిపోతూ ఉంది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నత మధ్యతరగతికి చెందినవాళ్ళు కావడంతో ఒకవైపు ప్రాంగణం పొడుగునా కార్లు బారు తీరివున్నాయి. ఆ తల్లిదండ్రుల కొత్త దుస్తులు, అత్యంత ఖరీదైన అలంకరణలు జిగేల్మనిపిస్తూ ఉన్నాయి. వార్షికోత్సవ వేడుక మొదలుకాడానికి ముందు ఆ సంస్థల ఫౌండరు పైన ఒక విజువల్ ప్రెజెంటేషను చూపించారు. ఆయన జీవించే ఉన్నా ఆ సినిమా ఎందుకు చూపించారో నాకు అర్థం కాలేదు. ఆ సినిమా పొడుగునా అతడు తన పాఠశాలలు సందర్శిస్తూ ఉంటే ఆ పాఠశాలల్లో పిల్లలూ, ఉపాధ్యాయులూ అతడి పాదాల మీద పూలు జల్లుతున్న దృశ్యాలే ఉన్నాయి. నాకు కడుపులో తిప్పేసింది. కాని అంతకన్న దుర్భర క్షణాలు ముందున్నాయని ఆ తర్వాత అర్థమయింది. ఆ వేడుకలో భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ పేరిట పిల్లలు డాన్సులు మొదలుపెట్టారు. అత్యంత జుగుప్సాకరమైన సినిమాపాటలకి ఆ పిల్లలు వేసిన రికార్డింగుడాన్సులవి. ఆ డాన్సుల్ని ఫొటోలు తీసుకోడానికి ఆ తల్లిదండ్రులు తమ సెల్ ఫోన్లతో, వీడియో కెమేరాల్తో ఎంతలా ఎగబడుతూ ఉన్నారంటే ఆ తొడతొక్కిడి తట్టుకోడానికి ఆ యాజమాన్యానికి శక్తి చాల్లేదు. 

ఆ ఒక్క సాయంకాలం ఆ పాఠశాల గురించే కాదు, మొత్తం ఆ సంస్థ గురించిన యథార్థాల్ని  నాకు పూర్తిగా ఎరుకపరిచింది.

కానీ ఆ రోజు నగరంలో నేను చూసిన ఆ ప్రఖ్యాత కార్పొరేటు పాఠశాలకీ, నిన్న సాయంకాలం ఒక చిన్నపాటి మండలకేంద్రంలో ఒక చిన్న ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికీ ఉన్న తేడా నాకు కొట్టొచ్చినట్టు కనబడింది. మేము ఆ ఫంక్షను హాల్లో అడుగుపెడుతుండగా, గుమ్మం బయట రాసిన స్వాగత పత్రమే ఆ పాఠశాల గురించి నాకెంతో చెప్పింది. అందులో పాఠశాల ‘మూడు తరాలకి’ స్వాగతం పలికుతూ ఉంది. సాధారణంగా వార్షికోత్సవాలకి తల్లిదండ్రుల్ని పిలవడమే గొప్ప. అటువంటిది తాతల్నీ, నాయనమ్మల్నీ, అమ్మమ్మల్నీ కూడా ఆహ్వానిస్తున్నరన్న ఆ పిలుపు వైపు అనిల్ నా దృష్టి మరల్చి ‘చూడండి, ఇంత ఆత్మీయమైన పిలుపు నేనిప్పటిదాకా ఎక్కడా చూడలేదు’ అన్నాడు.

ఆ తర్వాత ఆ హాల్లో దాదాపు మూడు గంటల పాటు గడిపేం. దిగువ మధ్య తరగతి కుటుంబాలకీ, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకీ, దళితులకీ చెందిన ఆ పిల్లలు ఆ పాఠశాల ద్వారా తమకి అందుతున్న సంపూర్ణ విద్యను మా కళ్ళకు కట్టి చూపించారు. ఆ పిల్లలు ప్రదర్శించిన ప్రతిభాపాటవాల్లో ఒక ఇంగ్లిషు స్కిట్, తెలుగు ఏకపాత్రాభినయం, జానపద గీతాలు, అన్నమయ్య కీర్తన, కరాటే, యోగాసనాలు, జిమ్నాస్టిక్స్- ఒకటేమిటి, ఆ స్కూలు పిల్లలకి ఎంత ప్రేమ పంచుతూ ఉన్నదో ఆ మూడుగంటలూ నేను గ్రహిస్తూనే ఉన్నాను.

అన్నిటికన్నా మరీ ఆకర్షణీయంగా ఉన్నవి మూడు నా మదిలో నిలిచిపోయాయి. ఒకటి, చిన్నపిల్లలు ఆడిన జడకోలాటం. అటువంటి ఒక విన్యాసం నేను చూడటం ఇదే మొదటిసారి. ఆ కోలాటమాడుతున్నంతసేపూ, ఆ రంగురంగుల తాళ్ళతో పిల్లలు జడ అల్లి మళ్ళా ఆ జడవిప్పుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళు తమ క్రీడలో లీనం కావడమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కర్నీ తమ సంతోషంలో ముంచేసారు. రెండోది, ఆ పిల్లల ఇంగ్లిషు. మూడవది, అన్నిటికన్నా గొప్పగా నన్ను ముగ్ధుణ్ణి చేసింది గ్రాడ్యుయేషన్ సెరిమొని. ఇప్పుడు నగరాల్లో జరిగే ఈ వేడుకకి టోపీలు అద్దెకి తెస్తారని విన్నాను. కాని నిన్న ఆ పాఠశాల తమ పిల్లల్ని కొబ్బరాకుల కిరీటాల్తో సత్కరించింది. ఒకప్పుడు ప్రాచీన ఏథెన్సులో వీరుల్ని ఆలివ్ ఆకుల కిరీటాల్తో సత్కరించేవారని చదివింది నాకు గుర్తొచ్చింది. ప్రి-ప్రైమరి నుంచి ప్రైమరీలోకీ, ప్రైమరీనుంచి హైస్కూలు తరగతులకి పిల్లలు గ్రాడ్యుయేటు అవుతున్న సందర్భంగా వారినట్లా ఆకుల్తో చుట్టిన కిరీటాల్తో సత్కరించడం నన్నెంత ముగ్ధుణ్ణి చేసిందో చెప్పలేను. ఇది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ జరుపుకోదగ్గ వేడుక కదా అనిపించింది.

నిన్న పిల్లలు జానపదగీతాలు పాడుతూ మధ్యలో నందకిశోర్ రాసిన పాట కూడా పాడటం మాకొక తుళ్ళింత. నందకిశోర్, గౌరునాయుడు ధన్యులు. నేను ఏ పాఠశాలకు వెళ్ళినా వాళ్ళు తమ పాటల్లో నాకు ఎదురవుతూనే ఉంటారు.

పిల్లల కథలమీదా, సినిమాల మీదా అనిల్ బత్తుల కృషి చేసాడని తెలుసుగాని, అతడు కథ చెప్పడం మొదలుపెడితే పిల్లలు మంత్రముగ్ధులైపోడం కూడా నిన్ననే చూసాను.

అనిల్ బత్తుల పిల్లలకి కథ చెబుతూ

కాని అక్కడున్నంతసేపూ, తిరిగి వచ్చేసాక కూడా నాకు ఒకటే ఆలోచన. ఇటువంటి పాఠశాలలూ, ప్రయోగాలూ self-sustain కావడమెలా అన్నదే. అందుకని నిన్న ఆ తల్లిదండ్రులకి చెప్పాను:  ఇప్పుడు మీ పిల్లల మీద ఈ పాఠశాల చూపిస్తున్న శ్రద్ధ ఎంత గొప్ప పెట్టుబడినో మీకిప్పుడు తెలీదు, మరొక ఇరవయ్యేళ్ళయ్యాక తెలుసుకుంటారు. మీరెంత భాగ్యవంతులో అప్పుడర్థమవుతుంది అని. కాబట్టి ఈ పాఠశాలను కాపాడుకోవలసింది మీరే అని పదే పదే వారికి చెప్పాను.

23-3-2025

12 Replies to “తొలకరి చినుకులు”

  1. ఒక గొప్ప అనుభవాన్ని కళ్లముందుంచారు.

  2. అంత ఆనందమయమైన ఆ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను, సంబరాలను మా కళ్ళ ముందర తిరిగి అంతే అందంగా, ఎంతో హృద్యంగా ఆవిష్కరించినందుకు మీకు అనేక ధన్యవాదాలు భద్రుడు గారు.

  3. తొలకరి చినుకులు… పాఠశాల పేరే చాలా బావుంది.

  4. తొలకరి – పరిమళాలను ఈ ఉదయపు సమయాన గుర్తు చేసినందుకు మనసారా అభినందనలు .,

  5. రెండు భిన్న అనుభవాల ద్వారా పాఠశాల విద్య ఎలా ఉంటే విద్యార్థులకు ఉపయోగకరమో అద్భుతంగా వివరించారు.

  6. ఎంత బావుంది మాస్టారూ!. మనసుకి హాయిగా ఉంది. ఇలాంటి స్కూళ్ళు కూడా ఉన్నాయా అని అనిపించింది. మీ వ్యాసం కళ్ళకు కట్టినట్టుంది. మీరు చాలా అద్భుతంగా రాస్తారు.

  7. నేను మిస్సయ్యాను…
    ఈ బడి పండుగను
    చూడాలని వుండె

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading