అంటున్నాడు తుకా-8

20

ఆనందపు వెల్లువ ముంచెత్తింది
ప్రేమతరంగాలు ఎగిసిపడుతున్నాయి
విఠలుడనే తెప్పను కరిచిపట్టుకుంటాను
ఈదుకుంటూ ఆవల ఒడ్డుకు చేరుకుంటాను
అన్నలారా, ప్రజలారా, దూకండి
ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు
అపారం అమృతం ఈ ప్రవాహం
తుకా అంటున్నాడు: మన పుణ్యం గొప్పది
కాబట్టే ఈ ప్రవాహం మనవైపు మళ్ళింది.

पूर आला आनंदाचा । लाटा उसळती प्रेमाच्या ॥१॥
बांधूं विठ्ठलसांगडी । पोहुनि जाऊं पैल थडी ।
अवघे जन गडी । घाला उडी भाई नो ॥ध्रु.॥
हें तों नाहीं सर्वकाळ । अमुप अमृतांचें जळ ॥२॥
तुका म्हणे थोरा पुण्यें । ओघ आला पंथें येणें ॥३॥ (701)

21

కన్య అత్తవారింటికి పోయేటప్పుడు
దారిపొడుగునా వెనక్కి చూస్తూనే ఉంటుంది
నా బతుకూ నడుస్తున్నదలానే
మనం కలుసుకునేదెప్పుడు కేశవా?
తల్లికి ఎడమయిన బిడ్డ
ఒంటరిదై బిత్తరిచూపులు చూస్తుంది
నీళ్ళకి దూరమైన చేప లాగా
తల్లకిందులవుతున్నాడు తుకా.

कन्या सासुर्‍यासि जाये । मागें परतोनी पाहे ॥१॥
तैसें जालें माझ्या जिवा । केव्हां भेटसी केशवा ॥ध्रु.॥
चुकलिया माये । बाळ हुरू हुरू पाहे ॥२॥
जीवना वेगळी मासोळी । तैसा तुका म्हणे तळमळी ॥३॥(266)

22

ఈ ప్రపంచమంటే చెప్పలేని భయం
కాని దీన్ని వదిలిపెట్టలేను
ఈ నలుగులాట తట్టుకోలేక
నీకే మొరపెట్టుకుంటున్నాను
దేనిగురించన్నా ఆలోచించానా
మనసు నా నుంచి పారిపోతుంది
తుకా అంటున్నాడు: దేవా
ఇక్కడికి బలవంతంగా చేరుకోలేం.

भय वाटे पर । न सुटे हा संसार ॥१॥
ऐसा पडिलों कांचणी । करीं धांवा म्हणउनी ॥ध्रु.॥
विचारिता कांहीं । तों हें मन हातीं नाहीं ॥२॥
तुका म्हणे देवा । येथें न पुरे रिघावा ॥३॥ (1116)

23

మా ఊరు నా కంటికి దూరమయింది.
ఈ ప్రవాసదుఃఖమెన్నాళ్ళిట్లా?
మా ఊరివారెవరన్నా ఆత్మీయులు
దారమ్మట కనిపిస్తారా అని చూస్తాను
దిక్కులన్నీ నిర్జనమైపోయాయి.
ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు
తుకా అంటున్నాడు: ఒక్క వార్తా లేదు
పాండురంగా, నీ గురించి బెంగ పెట్టుకున్నాను.

आपुले गांवींचें न देखेसें जालें । परदेसी एकलें किती कंठूं ॥१॥
म्हणऊनि पाहें मूळ येतां वाटे । जीवलग भेटे कोणी तरी ॥ध्रु.॥
पाहातां अवघ्या दिसतील दिशा । सकळ ही वोसा दृष्टीपुढें ॥२॥
तुका म्हणे कोणी न सांगे वारता । तुझी वाटे चिंता पांडुरंगा ॥३॥ (1279)

9-3-2025

5 Replies to “అంటున్నాడు తుకా-8”

  1. Sir,

    మొదటిది అయితే అసలు manifestation లా చదువుతుంటేనే ఆనందపు వెల్లువ లా అనిపించింది. భలే కుదిరిందది. వాళ్లంతా ఇట్లాంటి సంతోషమే అనుభవించి అది మనకి అందివ్వాలని కదా రాశారు!

    ఈ ఉదయం ఇట్లాంటి ఊహ ను పంచినందుకు మీకు చాలా చాలా థాంక్స్.

    1. ఈ కవితలన్నీ అందమైనవే. అత్తవారింటికి వెళ్లే అమ్మాయి మాటిమాటికి వెనక్కి తిరిగి చూసినట్టు తాను కూడా దేవుడి కోసం బెంగ పెట్టుకున్నాడనడం ఎంత గొప్పగా ఉంది! అత్తవారింటికి వెళ్లే అమ్మాయి మాటిమాటికి వెనక్కి తిరిగి చూసేది తన తల్లి గురించే కదా! అలానే చివరి కవిత మరీ అద్భుతంగా ఉంది. అక్కడ తన ఊరు, తను వాళ్లు, అక్కడి నుంచి వచ్చే కబురు ఇవన్నీ కూడా భగవంతుడి గ్రామానికి చెందినవే అనడంలోని ధ్వని చాలా గొప్పగా అనిపించింది.

  2. ఎలాంటి ప్రేమలో తలమునకలైతే ఇలాంటి వాక్యాలు! మళ్ళీ మళ్ళీ చదువుకుంటాము..thanks again sir.
    *

    With immense love and respect..❤️ Always.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading