
ఇప్పుడు కవిత్వం రాస్తున్న కవులు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు రాస్తున్నది వెంటనే చదివే పాఠకులు ఉండటమే కాదు, ఆ కవితల పట్ల ప్రతిస్పందన కూడా వెంటనే దొరుకుతోంది. ఇలా రియల్ టైమ్ లో ప్రతిస్పందన మాత్రమే కాదు, ఆ కవిత్వంలోని అందాల్ని వెంటనే విశ్లేషించి చెప్పే విమర్శ, సమీక్ష, ప్రశంస- ఏ పేరేనా పెట్టండి- అది కూడా లభ్యమవుతోంది. అటువంటి నిక్కమైన పరీక్షల్లో ఈ మధ్య నేను చదివింది, తూముచర్ల రాజారాం గారు రాసిన వ్యాసాలు. ‘పూలమీద వాలిన తేనెటీగ’ పేరిట ఆ వ్యాసాల్ని స్పందన, కవిసంగమం వారు ఒక సంపుటంగా తెస్తున్నప్పుడు దానికొక బ్లర్బ్ రాయమని అడిగితే, ఇదుగో, ఈ నాలుగు వాక్యాలూ రాసాను.
పూసిన పూలల్లో ఊటలూరేది మకరందం. తేటి దాన్ని సేకరించగానే దాని తీపి రెండిరతలవుతుంది. అప్పుడు దాన్ని మనం తేనె అంటాం. కవులు రాసిన కవితలు విన్నప్పుడు మనకి కలిగేది సంతోషం. కాని ఒక సహృదయుడు వాటిని చదివి, అనుభవించి, పలవరించినప్పుడు మనకి ఆ సంతోషం ద్విగుణీకృతమవుతుంది. దాన్ని మనం కావ్యానందం అంటాం.
అనర్గళమైన వక్త, విమర్శకుడు తూముచర్ల రాజారాం గారు మన సమకాలికులైన పాతికమంది కవుల కవిత్వాల్ని తాను చదివి, ఆ లోతుల్లోకి దూకి, ఆ లోకాల్లో విహరించి తిరిగి వచ్చి మనతో పంచుకున్న ఈ వ్యాసాలు కావ్యానందానికి నిక్కపు నిరూపణలు. ఇందులో ప్రతి ఒక్క కవినీ ఆయనా తిరిగిమళ్ళా కవిత్వపు వెలుగులోనే పోల్చుకోడానికి ప్రయత్నించారు. వాళ్ళ కవిత్వాన్ని మళ్ళా కవిత్వపురంగుల్లోనే వర్ణించారు.
అందుకనే ఈ పుటల్లో ‘పాఠకుడి ఏకాంతంలోకి నడిచినంతమేర బాధను పరిమళించే’ అఫ్సర్, ‘కనురెప్పలు ఆడినంత వరకూ కవిత్వదారుల్లోకి మేలుకుంటూ వెళ్ళే’ రవిప్రకాష్, ‘పురాతన పులకింతలో పరవశించిపోయే కమ్మని లేతకల’ లాంటి ఆశారాజు, ‘కవితాకస్తూరి వాహకుడు’ కొప్పర్తి, ‘కవిత్వసమాధిలో కలవరంలోకి వొచ్చిన ప్రతి అంశాన్ని కవిత్వంగా మార్చగలిగే’ కొనకంచి, ‘వెన్నెలతీగను మీటి రాతిరిజముకు మీద పున్నమిని గానం చేసిన’ గౌరునాయుడు, ‘వాక్యాల్ని చెరుకుగడ తీపితో, మోదుగపూల కళ్ళ ఎరుపుతో, పత్రహరితం ప్రజ్వరిల్లేలా రాయగల’ దర్భశయనం, ‘కరవాలంపై పద్యాన్ని ఆరబెట్టగల’ దాసరాజు, ‘చీకటిలో కూడా అతనిదే ఆ కవిత్వం అని పోల్చగల’ నారాయణ శర్మ `ఇలా ప్రతి ఒక్క కవీ ఈయన చూపుల్లోంచి చూసినప్పుడు మరింత ప్రకాశవంతంగా గోచరిస్తున్నారు. ఆ కవుల ఆదృష్టాన్ని అభినందిస్తున్నాను.
పూలమీద వాలిన తేనెటీగ, రాజారాం తూముచర్ల, డిసెంబరు, 2024, 218 పేజీలు, రు.250/-, పుస్తకం కావలసినవారు 90000 89436 ను సంప్రదించవచ్చు.
12-1-2025


అనేక కృతజ్ఞతలు