
రాపోలు సీతారామరాజు నల్గొండ జిల్లాకి చెందిన యువకుడు. చాలామంది తెలుగువాళ్ళు చాలా దేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్టే ఈయన కూడా చాలాకాలంగా దక్షిణాఫ్రికాలో జొహన్నెస్ బర్గ్ లో పనిచేస్తున్నాడు. కాని ఎన్నో దేశాల్లో నివసిస్తున్న ఎందరో తెలుగువాళ్ళు ఆ దేశాల్లో పుట్టి పెరిగి మానవాళికి మహోపకారం చేసిన మహనీయులెవరి గురించీ పుస్తకాలు రాసినట్టు నేను వినలేదు. ఉదాహరణకి, అమెరికాలో ఎంతమంది తెలుగువాళ్ళు లేరు! కాని ఒక్కరేనా అబ్రహాం లింకన్ గురించో లేదా ఫ్రెడరిక్ డగ్లస్ గురించో ఒక్క పుస్తకమేనా రాసారా? అలానే ఇంగ్లండులో ఉన్నవాళ్ళు షేక్ స్పియర్ గురించో, జర్మనీలో ఉన్నవాళ్ళు హెగెల్ గురించో, మార్క్స్ గురించో ఒక పుస్తకమేదన్నా రాసినట్టు మీరు చూసారా? కాని సీతారామరాజు దక్షిణాఫ్రికాలో ఉన్నందుకు, టంకసాల అశోక్ గారు చెప్పినట్టుగా ‘ముందు ఆఫ్రికాతో ప్రేమలో పడ్డాడు.’ ఆ తర్వాత మండేలాతో ప్రేమతో పడ్డాడు. ఆ అభిమానం ఆరాధనగా మారి అక్కడితో ఆగిపోక, ఇప్పుడు ‘స్వేచ్ఛ కోసం సుదీర్ఘ ప్రయాణం, నెల్సన్ మండేలా'(2024) పేరిట అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చేలాగా చేసింది.
వారం పదిరోజుల కిందట సీతారామరాజు మా ఇంటికొచ్చాడు. ఆయన ఆ రోజు తన పుస్తకం గురించి చెప్తూ, అంతకన్నా కూడా ముఖ్యంగా, తాను ఉన్నంతసేపూ, మండేలా జీవితం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. తన మాటల్లో మండేలా జీవితంలోని కొన్ని ఘట్టాల్ని అతడు తలుచుకుంటూ ఉన్నప్పుడు, ఉదాహరణకి, దక్షిణాఫ్రికా జైళ్ళల్లో ఖైదీలు తమ మలమూత్రాల కోసం ఇచ్చిన కుండను తామే పొద్దున్న ఎత్తిపోసుకోవలసి ఉంటుందని చెప్తూ, మండేలా సహచర ఖైదీకి అస్వస్థతగా ఉన్నప్పుడు, అతడు కూడా మండేలాని నిర్బంధించిన జైల్లోనే పై అంతస్తులో ఉన్నప్పుడు, మండేలా ఆ మెట్లన్నీ ఎక్కి, అతడి దగ్గరికి వెళ్ళి అతడి మలమూత్రాల పాత్ర కూడా తానే మోసుకొచ్చి శుభ్రం చేసాడని చెప్తున్నప్పుడు, ఆ యువకుడి కళ్ళల్లో ఒక నిర్మలకాంతి కనిపించింది. నా చుట్టూ ఉన్న మనుషుల్లో, తెల్లవారి లేస్తే నేను చూడకతప్పని మీడియాలో, సోషల్ మీడియాలో ఇటువంటి ఒక సంఘటనని ఇంత పునీత నేత్రాల్తో స్మరించుకునే మనుషులింకా ఎవరైనా ఉన్నారా అని ఆలోచనలో పడ్డాను.
అతడు అక్కడితో ఆగలేదు. దేశానికి స్వతంత్రం లభించి, జాతీయ ప్రభుత్వం ఏర్పడి మండేలా దేశాధ్యక్షుడయ్యాక, వర్ణవివక్షని మించిన మరొక మహోపద్రవం ఎయిడ్స్ రూపంలో తన ప్రజల్ని చుట్టుముట్టిందని తెలిసినప్పుడు, దాని గురించి బహిరంగంగా మాట్లాడటమే ఒక టాబూగా మారినప్పుడు, మండేలా, స్వయంగా తన కొడుకే ఎయిడ్స్ బారిన పడి మరణించాడని సమస్త ప్రపంచం వినేట్టుగా చెప్పి మరీ ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేసాడని కూడా చెప్పుకొచ్చాడు. ఇటువంటి పని ప్రపంచ చరిత్రలో మరొకరెవరు చెయ్యగలరు? మహాత్మా గాంధీ తప్ప. కానీ ఇప్పుడీ దేశంలో గాంధీ గురించి మాట్లాడటమే ఒక టాబూ. ఆయన పేరు ఎత్తడానికే మనుషులు అసహ్యానికో, భయానికో, తెలియని ద్వేషానికో లోనవుతున్న కలికాలంలో, ఒక యువకుడు తాను నివసిస్తున్న దేశంలో గాంధీని పోలిన మరొక మనిషి గురించి తెలుసుకుని, తన హృదయంలో అతడికి చోటిచ్చి, ఇదుగో, ఇంతదూరం మా ఇంటికొచ్చి మరీ, నాతో ఆ విషయాలు మననం చేసుకుంటున్నందుకు, నేనతడికి ప్రత్యుపకారంగా ఏమి చేయగలుగుతాను?
అందుకనే, నిన్న రవీంద్రభారతిలో, అతడి పుస్తకం ‘నెల్సన్ మండేలా’ ఆవిష్కరణ సందర్భంగా నేను కూడా పోయి నలుగురిముందూ హృదయపూర్వకంగా అతణ్ణి మరొక్కమారు అభినందించకుండా ఉండలేకపోయాను.
నెల్సన్ మండేలా పుస్తకాన్ని అనువాదంగా రాజు పేర్కోడం అతడి నిజాయితీ తప్ప మరేమీ కాదు. కాని దాన్ని మనం పూర్తిగా అతడి స్వీయ రచనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మండేలా గురించి ఎవరు రాసినా మండేలా తన గురించి తాను రాసుకున్నదానికన్నా అదనంగా మరేమీ రాయలేరు, చెప్పలేరు. కాని మండేలా ముఖ్యమైన రచనలు Long Walk to Freedom (1994), Conversations with Myself (2011) లోంచి పాఠకులకు ఎంత అవసరమో అంత మాత్రమే ఎంచి, ఆయన చెప్పినదాన్ని సంక్షిప్తీకరించి తిరిగి చిన్న చిన్న తెలుగు వాక్యాల్లో చెప్పడం చిన్నపాటి పని కాదు. ఈ పునఃకథనానికి గొప్ప ఎడిటింగ్ స్కిల్ కావాలి. మూలంలో ఎంత ఉత్తేజముందో, ఎంత భావతీవ్రత ఉందో అదెక్కడా నష్టపోకుండా చూసుకోగలిగే ఔదార్యం కావాలి. ఈ నైపుణ్యాలు రాజులో పుష్కళంగా ఉన్నాయని ఈ పుస్తకం మనకు ఋజువు చేస్తుంది. కాబట్టే, దీన్ని రాజు తన స్వీయరచనగా పేర్కొన్నా నేనైతే అభ్యంతరం చెప్పి ఉండేవాణ్ణి కాను.
నన్ను ముగ్ధుణ్ణి చేసినవి, మిమ్మల్ని కూడా ముగ్ధుల్ని చేయబోయేవి మూడు విషయాలున్నాయి. మొదటిది, ఆ పుస్తకం ముద్రణలోని శ్రేష్ఠత. అంతర్జాతీయ స్థాయి ప్రచురణకర్తలు ముద్రిస్తున్నప్పటికీ డా.కలాం పుస్తకాలు కూడా అంత నాణ్యంగా వెలువడ్డాయని చెప్పలేను. ఈ పుస్తకం మన చేతుల్లోకి రావడమే ఒక కానుక అన్నట్టుగా ఉంది. రెండోది, ఆ పుస్తకంలోని పాఠ్యశీలత. నేను చేతుల్లోకి తీసుకున్న రెండున్నర గంటల్లో 350 పేజీల పుస్తకం చదవడం పూర్తిచేసేసానంటే అర్థం చేసుకోండి. ఎక్కడా ఆగనివ్వదు. నిజానికి ఆ పుస్తకం మన చేతుల్లో ఉన్నంతసేపూ ఒక విద్యుచ్ఛక్తి మనలోకి ప్రవహిస్తూనే ఉంటుందని చెప్పగలను. ఇక మూడవది, ఆ శైలి, ఆ భాష, ఆ ఔచిత్యం. మొదట నాలుగైదు పేజీలు చదవగానే, సీతారామరాజు పక్కకు తప్పుకుని నేరుగా మండేలానే మనముందు ప్రత్యక్షమవుతాడు. ఇక ఆ తరువాత మనం వినేదంతా మండేలా ముఖతః వింటున్నట్టే వినబడుతుంది.
మండేలా విధానాల మీద దక్షిణాఫ్రికా మొత్తం ఏకగ్రీవం కాదనీ, ఆయన మీద విమర్శలున్నాయనీ, ఆయన తెల్లవారితో రాజీపడ్డాడనీ కొంతమంది అంటూ ఉండటం నేను వినకపోలేదు. కానీ ఈ పుస్తకం చదివాక, మండేలా మధ్యాహ్నసూర్యుడిలాగా పరిపూర్ణంగా ప్రకాశిస్తో నాకు కనబడ్డాడు. మనకి జీవితంలో, సమాజంలో, రాజకీయాల్లో లెవెల్-4 లీడర్లు చాలు. అంటే ఎంతసేపూ తమని తామే పైకెత్తి చూపుకుంటూ ఎదుటి మనిషినో, వర్గాన్నో, వర్ణాన్నో, ప్రాంతాన్నో, దేశాన్నో ద్వేషించడం నేర్పుతూ, ఆ ద్వేషమే తమ ప్రభావశీలత్వానికి పెట్టుబడిగా జీవించే నాయకులు మనల్ని ఆకర్షించినట్టుగా, గాంధీ, కలాం, మండేలా లాంటి లెవెల్-5 నాయకులు మనల్ని ఆకర్షించరు. లెవెల్-5 నాయకుడు అన్నిటికన్నా ముందు ఆత్మజేత. జీవించినంతకాలం తనలోని అంతశ్శత్రువు పట్ల అతడు సదా జాగరూకుడిగా ఉంటాడు. తనలోని శత్రువుని ఏ మేరకు అతడు అణచివేస్తూ పోగలడో ఆ మేరకు తన బాహ్యశత్రువుని జయించడమే కాదు, క్షమిస్తాడు కూడా. ఈ క్షమాగుణం మనకి అర్థం కాదు. కుల, వర్ణ, జాతి విద్వేషాలు నెలకొన్న వైరి వర్గాల్లో ఒకరు మరొకర్ని ఎప్పుడు, ఎప్పటికి పూర్తిగా నిర్మూలిస్తారు, ఆ శుభముహూర్తమెప్పుడు అన్న ఆతృతలోనే మన జీవితం గడిచిపోతుంది. కాని చరిత్ర చెప్తున్నది మరోలా ఉంది: ఇలా ఒక పీడక-పీడిత వైరివర్గంలో పీడితులు పీడకుల్ని భౌతికంగా నిర్మూలించేక, ఆ చిట్టచివరి జార్ కూడా మరణించేక, అప్పుడు ఆ మొదటి బోల్షివిక్ తనే ఒక జార్ గా మారతాడని. నువ్వు నీలో ఉన్న జార్ ని నిర్మూలించనంతవరకూ బయట జార్ లని ఎంతమందిని నువ్వు వధించినా లాభం లేదు. లేదని ఇదుగో రష్యా-యుక్రెయిన్ యుద్ధమే చెప్తోంది. (నిజానికి ఈ వైరివర్గంలో ఇద్దరూ జార్ లే కావడం మరొక విషాదవికారం.)
కాని మండేలా ఆ ప్రమాదం నుంచి తాను బయటపడటమే కాదు, తన జాతిని కూడా బయటపడేసాడు. ఎందుకంటే, ఏళ్ళ తరబడి వర్ణవివక్షకు గురయిన తరువాత, మానసికంగా తనలోని ఆఫ్రికన్ స్థానంలో ఒక శ్వేతజాతీయుడు తలెత్తడంలో ఆశ్చర్యం లేదని ఆయనకు తెలుసు. ఈ వాక్యాలు చూడండి. తమ పోరాటానికి సోదర ఆఫ్రికా దేశాల మద్దతు కూడగట్టుకోడానికి అతడు ఘనానుంచి అడిస్ అబాబా వెళ్ళే విమానం ఎక్కినప్పుడు ఇలా రాసుకున్నాడు:
అక్కడ నుండి అడిస్ అబాబా విమానం ఎక్కాను. ఆ ప్రయాణంలో ఓ వింత అనుభవం ఎదురైంది. పైలట్ ఒక నల్లజాతి వ్యక్తి. ఇంతకుముందెన్నడూ ఒక నల్లజాతి పైలట్ ని చూసి ఎరుగను. ఒక నల్లజాతి వ్యక్తి పైలట్ అవ్వడమేంటన్న ప్రశ్న మనసును తొలిచి, భయమేసింది. వర్ణవివక్షాలోకంలో బతికిన నాకు తెలియకుండానే బానిస మనస్తత్వం ఏర్పడిందని అర్థమయ్యింది. (పే.173)
ఇక్కడ మన దేశంలో వివిధరకాల వివక్షల్ని ధిక్కరిస్తూ పోరాటాలు చేసేవారు ముందు ఇటువంటి వాక్యాల్ని గమనించాలి. 27 ఏళ్ళ పాటు లేదా పదివేల రోజుల పాటు కఠినకారాగారశిక్ష అనుభవించినందువల్ల మండేలా పట్ల నాకు కలిగిన గౌరవంకన్నా, ఇదుగో, తనను తాను సూక్ష్మంగా పరిశీలించుకున్న ఇటువంటి క్షణాలలో మండేలా పట్ల నా గౌరవం రెట్టింపయ్యింది.
నిజమే, ఇందులో కూడా శాంతియుత సత్యాగ్రహాల ఘట్టాలు, ఆత్మత్యాగాలు, నిజాయితీతో కూడిన ప్రవర్తన తన శత్రువుల్లో కూడా తీసుకురాగల పరివర్తన కనిపిస్తుంది, గాంధీ జీవితంలో కనిపించిన సంఘటనలే, ఇక్కడ కూడా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఈ వాక్యాలు చూడండి. 1962 లో మండేలా మీద మోపిన దేశద్రోహం కేసి విచారణ ముగింపుకి వచ్చిన సందర్భంలో, మండేలా ఇలా రాస్తున్నాడు:
వాదప్రతివాదాలలో నా వంతు వచ్చినప్పుడు నేనెవరిని సాక్షులుగా విచారించడంలేదని, నా వాదనను ఇంతటితో ముగిస్తున్నానని ప్రకటించాను. నిర్ఘాంతపోయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ‘దేవుడా’ అనడం నాకు వినిపించింది… కోర్టు మరుసటి రోజుకు వాయిదా పడింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా దగ్గరికి వచ్చి మండేలా, నా వృత్తిజీవితంలో మొదటిసారి రేపు నాకు కోర్టుకు రావాలనిపించడం లేదు. నిన్ను శిక్షించాలని న్యాయమూర్తిని కోరలేకపోతున్నాను అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నానన్నాడు.(పే.193-194)
మరొక సంఘటన గురించి చెప్తున్నప్పుడు ఇలా రాసుకున్నాడు:
నిజానికి ఒకరిని దూషించడం నా స్వభావానికి విరుద్ధం. కాని ఆ రోజు నన్ను నేను ఆపుకోలేకపోయాను. నీలాంటి వ్యక్తిత్వంలేని మనిషితో మాటలనవసరం, ఇంకోసారి అలాంటి భాష పునరావృతమైతే పరిణామాలు వేరేలా ఉంటాయని తీవ్రస్వరంతో హెచ్చరించి విసురుగా బయటికొచ్చాను. నా మాటలటో ఆ అధికారి నోరు మూయించినా స్వీయనియంత్రణ కోల్పోడమనేది ప్రత్యర్థి చేతిలో నేను ఓడిపోయినట్లేనని భావిస్తాను.
మండేలాని ఎందుకు నాయకుడు అంటానంటే ఇందుకు. ఆయనకి సత్యాగ్రహంగాని, సాయుధపోరాటంగాని, యుద్ధంగాని, చర్చలుగాని ఏవైనా రెండోస్థాయి అంశాలే. ఆయనకి ప్రధానం తన జాతీయ సమగ్రత. తన మనుషులు స్వతంత్ర పౌరులుగా జీవించే క్షణాన్ని తాను కళ్ళారా చూడాలనుకున్నాడు. తక్కినవన్నీ దానికి సాధనాలే తప్ప అవే అంతిమలక్ష్యాలు కావు. ప్రజల్ని నిజంగా ప్రేమించినవాడు వ్యూహ కర్త అయితే ఇలా ఉంటాడు. అటువంటివాడు మాత్రమే, తన సహచరులు చెరసాలలో మగ్గుతున్నప్పటికీ తాను ఒక్కడే శత్రువుతో చర్చలకు సాహసిస్తాడు. కాబట్టే ఇలా రాసుకోగలిగాడు:
నేను నా మిత్రులం ఒకే జైలులో ఒకే భవంతిలో ఉన్నా వాళ్ళని కలవాలంటే ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ అభ్యర్థన ప్రిటోరియాలో ఉన్న జైళ్ళ ప్రధాన కార్యాలయానికి వెళుతుంది. అక్కడ అనుమతి మంజూరు చేస్తే ఇక్కడ మేము కలుసుకోడానికి ఏర్పాట్లు చేస్తారు. అందుకు వారాలు పట్టొచ్చు. అలా కొన్ని రోజుల తర్వాత మేం కలుసుకున్నాం. నేనెవరికీ చెప్పకుండా గోప్యంగా ప్రయత్నిద్దామని అనుకున్నాను కనుక, నైతికంగా తప్పని తెల్సినా చర్చల విషయం వాళ్ళతో మాట్లాడలేదు. తెలిసి కూడా చెబితే ఆదిలోనే వాళ్ళు నా ఉత్సాహాన్ని నీరుగారుస్తారని నా భయం. ఆత్మవిశ్వాసమున్న నాయకుడు అనుకున్న ఫలితాలను సాధించడానికి సమూహానికి భిన్నంగా ఒక్కోసారి అపసవ్యదిశలో నడవాల్సి ఉంటుంది.(పే.273-74)
ఎందుకంటే ఒక జాతి విముక్తి చెందే క్రమంలో ఇదొక్కటే దారి అని ఏ మార్గం గురించీ నిశ్చయంగా చెప్పలేం. ఈ పుస్తకంలోనే మండేలాతో అల్జీరియా విప్లవనాయకుడు చెప్పినట్టుగా (పే.176) కొన్నిసార్లు ‘జెట్ యుద్ధ విమానాల సముదాయం కంటే కూడా అంతర్జాతీయ ప్రజాభిప్రాయం ఎక్కువ విలువైందిగా’ కనిపిస్తుంది.
తీరుబడిగా కూచుని ఒకరినొకరం త్వరత్వరగా ముక్కలు చేసుకుంటున్న మన సమాజంలో, మనం మండేలా చరిత్ర చదువుతున్నప్పుడు, ఆ నాయకుడూ, అతని వ్యూహాలూ మనమూహించినంత రొమాంటిక్ గా లేవని బాధపడటంలో అర్థం లేదు. ఎందుకంటే తన దేశం గురించి, తన జాతి గురించి మనకన్నా కూడా మండేలాకి ఎక్కువ తెలుసు. ఈ వాక్యాలు చూడండి:
చాలామంది ప్రజలు ఆఫ్రికన్ సమాజంలోని సోదరభావం, సమానత్వ స్వభావం గురించి గొప్పగా ఒక ఆదర్శవంతమైన చిత్రాన్ని చిత్రిస్తుంటారు. ఆ చిత్తరువును నేనూ అంగీకరిస్తుంటాను. కానీ వాస్తవానికి అంత సమానత్వం ఆఫ్రికన్ సమాజంలోనూ ఉండదు. ఒకరినొకరు సమానంగా చూసే భావన కనిపించదు. ..(పే.164)
ఒక చిన్న స్థానిక తెగకు చెందిన ఒక యువకుడు విశ్వమానవుడిగా మారిన కథ ఇది. ఇలాంటి పుస్తకాలు ఎందుకు చదవాలంటే, కనీసం ఇది చదివినంతసేపేనా మనం మన పరిమిత కక్ష్య నుంచి బయటపడగలుగుతాం. అలాకాక, మనం మన fragmented identities తోనే ఆ జీవితాన్ని అంచనా వెయ్యడానికి పూనుకుంటే, నష్టపోయేది మనమే.
ఈ సూక్ష్మ రాజకీయ విశ్లేషణల జోలికి పోకుండా కూడా ఒక మెట్రిక్యులేటు, ఒక గృహిణి, ఒక ఆటో డ్రైవరు, ఒక లారీ క్లీనరు కూడా ఈ పుస్తకంలో ప్రయాణించి తమ జీవితాల్లో వెలుగు నింపగల గొప్ప స్పూర్తిని మూటగట్టుకోగలరు. ఎందుకంటే ఇందులో కనిపించే మనిషి ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక భర్త, ఒక తాత, ఒక అనుచరుడు, ఒక నాయకుడు, ఒక ఖైదీ, ఒక దేశాధ్యక్షుడు కూడా. ఈ పుస్తకానికి మూలమైన తన ఆత్మకథ గురించి మండేలా ఇలా రాసుకున్నాడు:
ఆ రాత్రుళ్ళు నిశ్శబ్ద వాతావరణంలో సెల్ లో నేనొక్కడినే రాసుకుంటున్నప్పుడు నా బాల్యం, యవ్వనం, నేను తిరిగిన ప్రదేశాలు, నేను పెరిగిన విధానం, కలుసుకున్న మనుషులు మొత్తం నా పూర్తిగా నా జీవితాన్నే సింహావలోకనం చేసినట్లయింది. అదంతా మెలకువలో కన్న కలలా కనిపించింది. దాన్ని వీలైనంత సరళంగా, నిజాయితీగా కాగితం మీదకి తర్జుమా చేయడానికి ప్రయత్నించాను.(పే.251)
మెలకువలో కన్న కల! మండేలా జీవితానికి ఇంతకన్నా సముచితమైన పదం మరొకటి కనిపించదు. మన నాయకత్వాలూ, మన పోరాటాలూ కలతనిద్రలో కనే కలలు. కాని మండేలా పూర్తి జాగరూకతతో ఒక కలగన్నాడు. కలగన్నాడు అనడం కూడా సరైన క్రియాపదం కాదు. పూర్తి మెలకువలో అతడు తన కలని తాను ఎప్పటికప్పుడు స్పష్టపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టే అది మనం చెప్పుకునే సిద్ధాంతాల ప్రకారం, మనం రాసుకునే వ్యూహాల ప్రకారం నడిచినట్టు కనిపించదు. కాని అంతిమంగా ఆ కలనిజం కావడం అతడు చూసాడు, అతడి జాతి చూసింది, మొత్తం ప్రపంచం చూసింది.
స్వేచ్ఛ కోసం సుదీర్ఘ ప్రయాణం, రాపోలు సీతారామరాజు, నెల్సన్ మండేలా, 342 పేజీలు, వెల.రు.400/- దొరికే చోటు: నవోదయ బుక్ హవుజ్, హైదరాబాదు, http://www.telugubooks.in
8-1-2025


అద్భుత పోరాట ప్రయాణం చేసి గెలిచిన ఒక వీరుడు, నాయకుడి గురించి మరింత పరిచయం చేసిన సీతారామ రాజు గారికి, విపులంగా విశ్లేషించిన మీకు సదా దన్యవాదములు …🌹🙏✊
ధన్యవాదాలు ప్రసూనా!
Great writ3up, as usual, on a good book
బాగుంది
ధన్యవాదాలు సార్
Great writeup on a good book
Thank you
చాలా బాగుంది సర్ , ఇప్పటికే రెండు సార్లు ఈ పుస్తకం చదివినా మీ విశ్లేషణ చదివాక కొత్త దృష్టితో మళ్ళీ చదవాలనిపించింది..
ధన్యవాదాలు