
ప్రతి శుక్రవారం సాయంకాలం ఫేస్ బుక్ లైవ్ లో చేసే పుస్తక పరిచయాల్లో భాగంగా ఈ వారం నుంచీ బైరాగి కవిత్వం మీద మాట్లాడబోతున్నాను. ఇది ఆయన శతజయంతి సంవత్సరం (1925-2025).
అందులో భాగంగా మొదటగా నా ఆధునిక కవిత్రయంలో గురజాడ, శ్రీ శ్రీలతో పాటు బైరాగి కూడా ఒకరని చెప్తూ, అందుకు కారణాల్ని వివరించాను.
ఆయన జీవించి ఉన్నప్పుడే కాక, ఇప్పుడు వందేళ్ళ తరువాత కూడా ఆయన్ని తెలుగు సాహిత్య ప్రపంచం ఎందుకు పట్టించుకోలేదో, ఆయన రాసిన కవిత ‘నేను మీ కవిని కాను’ ను బట్టే చెప్పవచ్చునని ఆ కవిత చదివి వివరించాను.
ఆసక్తి ఉన్నవారు మొత్తం ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
3-1-2025


గొప్ప ప్రసంగం
ధన్యవాదాలు సార్
గొప్ప ప్రసంగం ప్రసంగ పాఠం వుంటే బాగుంటుంది. దాచుకుని పంచుకోవచ్చు
ధన్యవాదాలు మేడం
ఈ రోజు మీ కవిత్రయం పరిచయం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. మీ ప్రసంగం సబ్ టైటిల్స్ ఇంగ్లీషులో వస్తే ఇతర భాషల వారు వినటానికి అనువుగా ఉంటుంది అని అనిపించింది.
అటువంటి అవకాశం ఉందేమో చూస్తాను.
మీరు లైవ్ లో మాట్లాడినప్పుడు వినడం కుదరలేదు సర్. ఇపుడు 4.30 కు నిద్రలేచి ప్రసంగం ఆసాంతం విన్నాను. మీ ప్రసంగ ప్రవాహ ఝరికి ధన్యవాదాలు. బైరాగి గురించి ఎవరు ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా చెప్పినా, రాసినా – వినాలని, చదవాలని అనిపిస్తుంది. డిగ్రీ చదివే రోజులనుంచి బైరాగి చుట్టూ తిరుగుతున్నాను.
మీ ప్రసంగం లో ప్రస్తావించిన రెండు అంశాల గురించి….1. బైరాగి శతజయంతి సభ తానా ప్రపంచ వేదిక వారు అక్టోబర్ చివరి ఆదివారం జూమ్ వేదికగా జరిపారు. రెండొవది అరసం వారు తెనాలిలో డిసెంబర్ 8 న జరిపారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడారు. అరసం వారు యువతరం కోసం ప్రచురిస్తున్న కవితాస్రవంతి శీర్షిక న పాపినేని సంపాదకత్వం లో బైరాగి కవిత్వాన్ని ప్రచురించారు. విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ వారు రేపు 8 వ తేదీన బైరాగి శతజయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
బైరాగి శతజయంతి సందర్భంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం వారి బైరాగి స్మారక అవార్డు అందుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
2. బైరాగి ని ఈ తరానికి పరిచయం చేసే బృహత్తర కార్యక్రమాన్ని మనమే ఎందుకు నిర్వహించకూడదు? ఈ సంవత్సరం వీలైనన్ని చోట్ల శతజయంతి సభలు ఏర్పాటు చేసి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం.
మీ స్పూర్తితో కన్నెగంటి రామారావు గారు వ్యాస పరంపర మొదలుపెట్టారు సంతోషం.
నేను కవితా!ఫిబ్రవరి సంచిక బైరాగి ప్రత్యేక సంచికగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
ఇంకా చాలా చెయ్యాలి సర్.
మీరు రాసిన వివరాలన్నీ చాలా సంతోషం కలిగిస్తున్నాయి.
మరో ముఖ్యమైన సంగతి మర్చిపోయాను సర్. యార్లగడ్డ గారు బైరాగి బస్ట్ సైజ్ విగ్రహాన్ని తయారు చేయించారు. తెనాలిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకొన్నాము. ఐతానగర్ లో చక్రపాణి గారి విగ్రహం పక్కన పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాము. త్వరలో ఆ కార్యక్రమ వివరాలు మీతో పంచుకుంటాను.
చాలా సంతోషం.