
అన్వర్ సిద్ధహస్తుడైన చిత్రకారుడే కాదు, చేయి తిరిగిన చిత్రకళావిశ్లేషకుడు కూడా. చిత్రకారుల చిత్రాలపైన అతడు రాసేవాటిలో అన్నిటికన్నా ముందు గొప్ప passion కనిపిస్తుంది. Strong likes and dislikes కనిపిస్తాయి. ఏ కళనైనా నిర్మమత్వంతో సమీపించేవాళ్ళకి మనతో పంచుకోడానికీ ఏమీ ఉండదు, మనం వినడానికీ ఏమీ ఉండదు. అలాకాక కొందరు చిత్రకారుల పట్లా, వాళ్ళ గీతలపట్లా, వర్ణసంయోజనపట్లా చెప్పలేనంత వ్యామోహాన్ని పెంపొందించుకునే కళాభిమానుల రాతల్లోంచి ముందు మనల్ని చేరవచ్చేది గొప్ప energy. అన్వర్ బాపు చిత్రకళపట్ల రాసేది చదువుతుంటే ముందు మనం స్తిమితంగా కూచోలేం. ఆ రాతలు మనల్ని కుదిపేస్తాయి. అలా కుదిపెయ్యడం కూడా కళాప్రయోజనమే.
ఇంతకీ ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, అతని వాల్ మీద నేను గీసిన ఒక బొమ్మ గురించిన నాలుగు మంచిమాటలు కనబడ్డాయి. సాహిత్యంలో నాకు కొంత అధికారం ఉందని చెప్పుకోగలనుగాని, చిత్రలేఖనం విషయంలో నేనింకా అమెచ్యూర్ ని అనే చెప్పుకుంటాను. కాని ఇదుగో, అన్వర్ రాసిన ఈ మాటలు చదివినతర్వాత నా గ్రాడ్యుయేషన్ చేతికొచ్చినట్టే ఉంది.
ఆయన రాసిన మాటలు నాకెందుకు నచ్చాయంటే, చిత్రలేఖనంలో కాగితం తాలూకు తెలుపు కూడా ఒక ముఖ్యమైన భాగం అని ఆయన నమ్ముతున్నందువల్లా, నమ్మిందే ఇక్కడ రాసినందువల్లా.
చిత్రలేఖనంలో బొమ్మ లేదా బొమ్మ వేసిన గ్రౌండ్, అది కాగితం కావచ్చు, కాన్వాస్ కావచ్చు, పట్టువస్త్రం కావొచ్చు, ఏదన్నాగానీ, దానిలో విస్తారమైన ఖాళీ జాగా కూడా ఉండాలనీ, అది కూడా కలిస్తేనే బొమ్మ అవుతుందనీ ఎన్నో శతాబ్దాలకు ముందే చీనా, జపాన్ చిత్రకారులు కనుక్కున్నారు. ఆ మెలకువ వెనక చైనీయుల ‘యిన్-యాంగ్’ సూత్రం ఉంది. ఏళ్ళ తరబడి ఆ చిత్రలేఖనాలు చూపరుల్ని ఎందుకు తమ దగ్గరకు లాక్కుంటున్నాయో ఒక పట్టాన అర్థం కాక నెమ్మదిగా పాశ్చాత్యప్రపంచం గ్రహించిందేమిటంటే, చిత్రాన్ని గీసినప్పుడు, దానిలో గీతలు మాత్రమే కాదు, గీతల మధ్య ఖాళీజాగా కూడా ముఖ్యమేనని. దాన్ని పాశ్చాత్య చిత్రకారులు negative space అని అంటున్నారు.
కానీ ఆ మాట పదకొండో శతాబ్ది సోంగ్ యుగపు చీనాచిత్రకారుడితో చెప్తే, అది negative space కాదు, చిత్రలేఖనంలో అదే అత్యంత positive space, మనం గీతలు గీసి దాన్ని భంగపరుస్తున్నాం కాబట్టి, మనం ఏ మేరకు ఇంకు పూస్తామో అదే negative space అని అనగలడు కూడా!
ధన్యవాదాలు అన్వర్!
13-11-2024
ఆర్టిస్ట్ అన్వర్
నీటిరంగు నమస్కృతి

మా ఊరొక కావ్యం అనే పుస్తకపు ఈ ముఖచిత్రం చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆనందంగా కూడా. బొమ్మ కింద సంతకం కనపడకపోయినా ఈ బొమ్మ చిన వీరభద్రుడు గారిది అని పోల్చుకోగలిగినాను. బొమ్మల్లో ఆయన ముద్ర తెలియడానికి పుంఖానుపుంఖాలుగా బొమ్మలు వేసి, అచ్చు చేసి మార్కెట్ మీదికి వదిలినవాడు కాదాయన. దానికాయన సాధన అని పేరు పెట్టుకున్నారో, ధ్యానం ఆని పిలుచుకుంటారో ఎరుగను. ఆ మాదిరి మెలకువ ఆయన బొమ్మల పోకడదీ. నాకు తెలిసి ఆయన తనకోసం బొమ్మలు వేసుకునే మనిషి, ప్రపంచాన్ని మేలుకొలుపడానికో, ప్రపంచపు లెక్కలలో తానూ చిత్రకారుడిగా ఒక పీఠం వేసుకుని కూర్చోడానికో చేసుకుంటున్న కృషి కాదు ఆయన అభ్యాసానిది. మైండ్ ఫుల్ నెస్ అనేది మనకు సంబంధించిన మాటనేది ఒక మెట్టయితే, ఒక కాగితం తాను వట్టి తెల్లబోయిన వివర్ణం మాత్రమే కాదని కొంచెం రంగుతో కలిసి తామొక బొమ్మ అని తనకు తాను ఎఱుక చెందడం అది చాలా ఎత్తు మెట్టు. కొన్నిసార్లు మనలాంటి మామూలు మనుష్యులకు కూడా కాగితపు తెల్ల హృదయం అందడం అనేది అమానుషస్థితి తప్పా మరొకటి కాదు. ఇదంతా సృష్టి సంగతి, స్రష్ట సంగతి.
ఈ బొమ్మని చూస్తే నాకు ఆశ్చర్యం కలగడం దేనికంటే . భద్రుడు గారు ఇక్కడ వాడినవి నీటి రంగులు. చిత్రకళా ప్రకటనకు వాడే మూలవస్తువుల్లో నీటి రంగుల వాడకం అనేది అచ్చు నిమిత్తం కాదు. నిజానికి ఎటువంటి బొమ్మనయినా అచ్చు రూపంలో కాదు దాని అసలు రూపంగా చూడడం కొరకే చిత్రకళ ఉన్నది . చిత్రకళ ఒక్కటే కాదు లలిత కళలని చాలా మటుకు ప్రత్యక్షంగా మాత్రమే దర్శించుకోవాలి. నృత్యం, సంగీతం, గానం, శిల్పం…. ఆ చెంతకు చేరి వాటిని వినాలి , చూడాలి, కన్నులు ఆశ్చర్యంతో విచ్చుకోవాలి. హృదయం సంబరంతో సంప్రముగ్ధమవ్వాలి.
ఆన్నీ అన్నివేళలా సాధ్యం కాదు కాబట్టి కొన్ని మార్గాల ద్వారా కళ విస్తారమవ్వక తప్పదు. బొమ్మ అందులో భాగమే, అయితే భూమిపై తొలి పాట పలికిన గొంతుక సినిమాల్లో పాడటమే తన లక్ష్యం అనుకోనట్లుగా, బొమ్మ కూడా పుట్టీ పుట్టగానే దాని తొలి లక్ష్యం పుస్తకాల ముఖ్యపత్రాలుగా మారడం కాదు. కళ ఎప్పుడయితే వ్యాపారం ఒక భాగంగా, ఒక సాధనంగా తోడయ్యిందో వాటికి తగ్గట్టుగానే రంగుల వాడకపు వ్యాకరణమూ మారుతుంది. పుస్తకాల కవర్ పేజీల మీది బొమ్మలు ఆకర్షణీయంగా, గొప్ప వెలుగుతో గ్రాహకుడిని ఆకర్షించాలి. ఈరోజు మనకు తెలియని, ఆలోచించ అవసరం లేని చాలా విషయాలు చాలా పెద్ద పరిశోధనల అనంతరం అందుబాటులోనికి వచ్చాయి. మీరు పత్రికల్లో చూసే బొమ్మలు, ఇలస్ట్రేషన్ లకు అద్దే రంగులు మామూలు క్లాసికల్ నీటి రంగులు అయి ఉండవు. అవి ఫోటో కలర్స్. అవి బొమ్మ అందాన్ని హెచ్చు చేస్తాయి. ఆ రంగులు చూసేవాడిని ఆకట్టుకునేట్టు ఉంటాయి. మీరు కనుక పాత తెలుగు పత్రికల్లో బాలి, చంద్ర, గోపి, కరుణాకర్ గార్ల రంగుల ఇలస్ట్రేషన్లు చూసి ఉంటే. ఆ మీద పరమ క్లాసికల్ వాటర్ కలర్స్ వాడి బొమ్మలు వేసే చిత్రకారుల బొమ్మల మీద అవహగాహన మీకు కనక ఉండి ఉంటే, ఫోటోకలర్ ప్రభ ముందు వాటర్ కలర్ ఎలా నీరు కారిపోతుందో సులభంగా అర్థం చేసుకోగలరు. ఎంత ప్రభ ఉన్నా ఫోటో కలర్ వాడకం అనేది సులువు కూడా కాదు. ఏ చిత్రకళా పరిషత్ లలో సైతం ఫైన్ ఆర్ట్ కు సంబంధించిన ఆన్ని రకాల సాధనాల్లో శిక్షణ ఇస్తారు కానీ, ఫోటో కలర్ వాడకం జోలికి ఏ గురువు వెళ్ళడు. కలర్ కాదది కాలకూట విషం.
పుస్తకాల షాపుల్లో, పుస్తక ప్రదర్శనల్లో వరుసగా పరిచిన పుస్తకాల అట్టల మీది బొమ్మలు చూస్తూ, పరిశీలిస్తూ ఉంటాను కదా. చప్పున తేడా తెలిసి పోతూనే ఉంటుంది. పెన్సిల్ స్కెచ్, ఫోటో కలర్, కట్ కలర్, వాటర్ కలర్ లు వాడి ముద్రించిన ఏ ఏ బొమ్మ ఎంత ఆకర్షణగా ఉందో, ఎంత అనాకర్షణగా ఉందో. వీటన్నిటికీ మించి డ్రాయింగ్ బలం అనే మాట కూడా ఉంది. దాని గురించి మాట్లాడడం లేదిక్కడ. నీటి రంగుల బొమ్మ పుట్టింది కవర్ పేజీ కోసమో. ప్రింట్ తీసి గోడకు అంటించుకోవడం కోసమో కాదు.దాని అందాన్ని ఒరిజనల్ లోనే చూడాలి. అచ్చు బొమ్మలో ఫోటో కలర్ పక్కన వెలవెల పోతూ ఉంటుంది వాటర్కలర్, వేరే మాటే లేదు. కేతకీ గులాబ్ జూహీ చంపక్ బన్ ఫూలే అంటూ గొంతెత్తిన మన్నాడే ముందు పండిట్ భీమ్ సేన్ జోషి ఓడిపోలేదూ? అలాన్నమాట.
అయితే అటువంటి అభిప్రాయపు, నిర్ణయపు, నమ్మకపు రోజుల్లో, మా ఊరొక కావ్యం అనే ఈ బొమ్మ నన్ను చూడవచ్చి కాసేపు మాట మాటాడనివ్వలేదు. ఎంత ప్రకాశంగా కుదిరింది ఇక్కడ వాటర్ కలర్? ఎంత అందంగా ఆకర్షిస్తుంది ఇది నా కళ్ళని. ఇంతకాలం అచ్చు పనిమీద, రంగుల కెమిస్ట్రీ మీద నేను తోడుకున్న జ్ఞానం అంతా వృధాయేనా అని ఒక నిముషకాలం అనిపించినా. అదేమీ కాదు.
ఇక్కడ మహత్తు అంతా రంగులో లేదు. వీరభద్రుడు గారి ఒద్దికలో ఉంది. ఆయన ప్రకటించిన గౌరవంలో ఉంది. ఆయన చేసిన కూర్పులో ఉంది. బొమ్మలు వేసేవారు బొమ్మల విషయంలో, సరంజామా వాడుకలో సవాలక్ష సాముగరిడలు నేర్చుకుని ఉండవచ్చు. పిల్లికి చెట్టు ఎక్కడం తెలిసినట్లుగా ఎంతటి చిత్రకారుడికయినా కాంపొజిషన్ అనే ఎక్కడ ఏది అనే విద్య తెలియకుంటే ఏది తెలియనట్లే, ఎంత తెలిసినా సాధించనట్లే.
మా కాలపు తెలుగు వారి ఆస్తి అయిన చిన వీరభద్రుడు కాగితపు తెలుపు మీద గౌరవంతో గీసిన బొమ్మ ఇది. బొమ్మ తనకు తానుగా భూమంత ఆకుపచ్చగా . వినమ్రంగా , ఒద్దికగా కింద కూచుని, ఆకాశమంత తెలుపుకు నమస్కరించుకున్న బొమ్మ. వీరభద్రుడి నీటి రంగు నమస్కృతి ఇది.
11-11-2024


ఇద్దరు అత్యుత్తమ కళాకారుల అపూర్వ సమ్మేళనం. పాఠకులం మేమంతా ఆనందంతో పులకాంకితమయ్యాము. ధన్యోస్మి.
ధన్యవాదాలు సార్!
శుభోదయం సర్, అన్వర్ గారు చాలా విషయాలు రాశారు. చిత్రకళ సాంకేతిక విషయాలు నాకు తెలియవు.కానీ ఆ బొమ్మ ఒక్కటే కాదు , మీరు వేసే బొమ్మలన్నీ సహజాతి సహజంగా కనిపిస్తుంటాయి.ఈ రంగుల మేళవింపు అద్భుతంగా పట్టుకుంటారు. అభినందనలు సర్
ధన్యవాదాలు మేడం!
నీటి రంగుల నమస్కృతి మీకు
ధన్యవాదాలు సార్