అవధూత గీత-12

మూడవ అధ్యాయం

5

మొత్తమంతా అద్వైతరూపమేనని ఎలా చెప్పగలను
మొత్తమంతా ద్వైతరూపమేనని ఎలా చెప్పగలను
మొత్తమంతా నిత్యమనీ, అనిత్యమనీ ఎలా చెప్పగలను
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

6

నేను లావుకాదు, సన్నంకాదు, నాకు రాకపోకలు లేవు
ఆదిమధ్యాంతరహితమైన పరాత్పరమూ లేదు
అన్నిటికన్నా మించిన సత్యాన్నే నేను చెప్తున్నాను
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

7

జ్ఞానోపకరణాల్లో ఏమీలేదని తెలుసుకో
సమస్తవిషయాలూ ఆకాశతుల్యమే. ఉన్నదొకే
ఒక్క నిర్మలసత్యం,అది బద్ధంకాదు, ముక్తంకాదు
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

8

నేనేమీ అర్థమయ్యే, అర్థంకాని అడవినికాను నాన్నా,
నేనేమీ చేరగలిగే, చేరలేని చోటుని కాను తండ్రీ
దగ్గరలో ఉన్న రూపాల్లో దాగినవాణ్ణి కాను బిడ్డా,
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

9

నిష్కర్మనీ, కర్మనీ కూడా దహించే జ్వాలనవుతున్నాను
నిర్దుఃఖాన్నీ, దుఃఖాన్నీ కూడా దహించే జ్వాలనవుతున్నాను
నిర్దేహాన్నీ, దేహాన్నీ కూడా దహించే జ్వాలనవుతున్నాను
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

10

నిష్పాపాన్నీ, పాపాన్నీ కూడా దహించే హుతాశనుణ్ణి నేను
నిర్ధర్మాన్నీ, ధర్మాన్నీ కూడా దహించే హుతాశనుణ్ణి నేను
నిర్బంధాన్నీ, బంధాన్నీ కూడా దహించే హుతాశనుణ్ణి నేను
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

11

నాన్నా! నేను పుట్టేవాణ్ణీ కాను, పుట్టుకలేనివాణ్ణీ కాను
తండ్రీ! యోగమొందేవాణ్ణి కాను, యోగరహితుణ్ణీ కాను
బిడ్డా! నాకు చిత్తమంటూలేదు, చిత్తం లేనివాణ్ణీ కాను
జ్ఞానామృతాన్ని, సమరసాన్ని, గగనసమానుణ్ణి.

12

మోహమూ, నిర్మోహమూ అనే మనోవికల్పాలు లేవు నాకు
శోకమూ, నిశ్శోకమూ అనే మనోవికల్పాలు లేవు నాకు
లోభమూ, నిర్లోభమూ అనే మనోవికల్పాలు లేవునాకు
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

13

సంసారసంతతి అనే తీగ ఎప్పటికీ నాది కాదు
సంతోషసంతతి వల్ల దొరికే సుఖమూ నాది కాదు
అజ్ఞానంవల్ల తగులుకునే బంధం నాకెప్పటికీ లేదు
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

14

సంసారసంతతి అనే రజోవికారం నాది కాదు
సంతాపసంతతి అనే తమోవికారమూ నాది కాదు
స్వధర్మజనకమైన సాత్త్వికవికారమూ నాది కాదు
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, ఆకాశసమానుణ్ణి.

15

సంతాపాన్ని, దుఃఖాన్ని కలిగించే బాధ్యత నాకెప్పటికీ లేదు
సంతాపయోగాన్ని పుట్టించే మనస్సు కూడ నాది కాదు
అటువంటి అహంకారభావన కూడా నాకెప్పటికీ కలగదు
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, అకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

16

చలించడం, చలించకపోవడం అంతరించిపోయే తావు నేను
స్వప్నమూ, మెలకువ, హితాహితాలూ అంతరించే చోటు నేను
నిస్సారమూ, సారమూ, చరాచరాలూ అదృశ్యమయ్యే స్థితినేను
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, అకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

17

తెలుసుకునేదిలేడు, తెలుసుకునేవాడులేడు, హేతుతర్కాల్లేవు
ఇది మాటలకి అందేది కాదు, బుద్ధీ మనసూ రెండూ లేవు
ఇలాంటి అవస్థ గురించి నేన్నీకు ఏమని వివరించగలను?
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, అకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

18

భిన్నమూ, అభిన్నమూ అనే రెండులేని పరమసత్యం అది
లోపలా బయటా అనేవి లేని ఆ సత్యం ఎటువంటిది కావచ్చు?
మునుపు పుట్టిందికాదు, దేనిలోనూ తగులుకున్నదీ కాదు.
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, అకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

19

ఇష్టాయిష్టాలనేవి లేని ఆ సత్యసారాన్ని నేనే
దృష్టాదృష్టాలంటూ లేని ఆ సత్యసారాన్నీ నేనే
సంసారశోకం ఏమాత్రమంటని ఆ సత్యసారాన్ని నేనే
నశింపులేని ఎరుకని, సమరసాన్ని, గగనసమానుణ్ణి.

20

జాగృతస్వప్నసుషుప్తుల్లేనప్పుడు నాలుగోది ఎక్కడ?
భూతభవిష్యద్వర్తమానాలు లేనప్పుడు దిక్కులెక్కడ?
అన్నీ అణగిపోయిన తావు, పరమసత్యానికే పరమసత్యాన్ని
నశింపులేని ఎరుకని, సమరసాన్ని, గగనసమానుణ్ణి.

21

పొట్టీ పొడవూ అనే కొలతల్లేవు నాకు
ఇరుకూ, విస్తారమూ అనే కొలతల్లేవునాకు
కోణమూ, వలయమూ అనే కొలతల్లేవునాకు
జ్ఞానామృతుణ్ణి, సమరసాన్ని, గగనసమానుణ్ణి.

22

తల్లీదండ్రీ బిడ్డలూమొదలైనవాళ్ళు నాకెన్నడూ లేరు
పుట్టుకా, మరణమూ, మనస్సూ లాంటివి నాకెప్పుడూ లేవు
ఎటువంటి వ్యాకులతాలేకుండా స్థిరంగా ఉండే సత్యాన్ని
నశింపులేని ఎరుకని, సమరసాన్ని, గగనసమానుణ్ణి.

23

శుద్ధుణ్ణి, విశుద్ధుణ్ణి, ఆలోచనకు అందనివాణ్ణి, అనంతుణ్ణి
అంటినవాణ్ణి, అంటనివాణ్ణి, ఆలోచనకు అందనివాణ్ణి, అనంతుణ్ణి
ముక్కలైనవాణ్ణి, అవనివాణ్ణి, ఆలోచనకు అందనివాణ్ణి, అనంతుణ్ణి
నశింపులేని ఎరుకని, సామరస్యాన్ని, అకాశంతో పోల్చదగ్గవాణ్ణి.

24

బ్రహ్మాదులూ, సురగణాలూ అక్కడెలా ఉండగలరు
స్వర్గాదిలోకాలూ, ప్రాంతాలూ అక్కడెలా ఉండగలవు
అది ఒకే ఒక్క రూపం, నిర్మలం, సత్యాల్లోకెల్లా సత్యాన్ని
నశింపులేని ఎరుకని, సమరసాన్ని, గగనసమానుణ్ణి.


సంస్కృతమూలం

5

అద్వైతరూపమఖిలం హి కధం వదామి
ద్వైతస్వరూప మఖిలం హి కధం వదామి
నిత్యంత్వనిత్యమఖిలం కధం వదామి
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

6

స్థూలం హి నో నహికృశం న గతాగతం హి
ఆద్యంతమధ్య రహితం న పరాపరం హి
సత్యం వదామి ఖలువై పరమార్థ తత్త్వం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

7

సంవిద్ధి సర్వకరణాని నభోనిభాని సంవిద్ధి
సర్వవిషయాశ్చ నభోనిభాశ్చ
సంవిద్ధి చైక మమలం నహిబందముక్తం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

8

దుర్బోధ బోధగహనో న భవామి తాత
దుర్లక్ష్య లక్ష్య గహనో న భవామి తాత
ఆసన్న రూప గహనో న భవామి తాత
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

9

నిష్కర్మ కర్మ దహనో జ్వలనో భవామి
నిర్దుఃఖ దుఃఖ దహనో జ్వలనో భవామి
నిర్దేహ దేహదహనో జ్వలనో భవామి
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

10

నిష్పాప పాప దహనో హి హుతాశనోహమ్
నిర్ధర్మధర్మ దహనోపి హుతాశనోహమ్
నిర్బంధ బంధ దహనోపి హుతాశనోహమ్
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

11

నిర్భావభావరహితో న భవామి వత్స
నిర్యోగ యోగరహితో న భవామి వత్స
నిశ్చిత్త చిత్తరహితో న భవామి వత్స
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

12

నిర్మోహమోహ పదవీతి న మే వికల్పో
నిశ్శోక శోక పదవీ న మే వికల్పః
నిర్లోభలోభపదవీతి న మే వికలో
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

13

సంసార సంతతిలతా న చ మే కదాచి
త్సంతోషంతతిసుఖే న చ మే కదాచిత్
అజ్ఞబంధనమిదం న చ మే కదాచిత్
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

14

సంసారసంతతిరజో న చ మే వికారః
సంతాపసంతతితమో న చ మే వికారః
సత్వం స్వధర్మజనకం న చ మే వికారో
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

15

సంతాపదుఃఖజనకో న విధిః కదాచిత్
సంతాపయోగజనితం న మనః కదాచిత్
యస్మాదహంకృతిరియం న చ మే కదాచిత్
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

16

నిష్కంపకంపనిధనం న వికల్పకల్పం
స్వప్నప్రబోధనిధనం న హితాహితం హి
నిః సార సారనిధనం న చరాచరం హి
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

17

నో వేద్యవేదకమిదం న చ హేతుతర్క్యం
వాచామగోచరమిదం న మనో న బుద్ధిః
ఏవం కథం హి భవతః కథయామి తత్త్వం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

18

నిర్భిన్నభిన్న రహితం పరమార్థతత్త్వ
మంతర్బహిర్నహి కథ పరమార్థ తత్త్వం
ప్రాక్సంభవం న చ రతం నహి వస్తు కించిత్
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

19

రాగాదిదోషరహితం త్వహమేవ తత్త్వం
దైవాదిదోషరహితం త్వహమేవ తత్త్వం
సంసారశోక రహితం త్వహమేవ తత్త్వం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

20

స్థానత్రయం యది చ నేతి కథం తురీయం
కాలత్రయం యది చ నేతి కథం దిశాశ్చ
సాంతం పదం హి పరమం పరమార్థ తత్త్వం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

21

దీర్ఘో లఘుః పునరితీహ న మే విభాగో
విస్తారసంకటమితీహ న మే విభాగః
కోణం హి వర్తులమితీహ న మే విభాగో
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

22

మాతాపితాది తనయాది న మే కదాచిజ్జాతం
మృతం న చ మనో న చ మే కదాచిత్
నిర్యాకులం స్థిరమిదం పరమార్థతత్త్వం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

23

శుద్ధం విశుద్ధం అవిచారం అనంతరూపం
నిర్లేపలేపం అవిచారం అనంతరూపం
నిఃఖండ కండం అవిచారం అనంతరూపం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

24

బ్రహ్మాదయః సురగణాః కథమత్ర సంతి
స్వర్గాదయో వసతయః కథమత్ర సంతి
యద్యేకరూపం అమలం పరమార్థ తత్త్వం
జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహమ్

3-11-2024

4 Replies to “అవధూత గీత-12”

  1. చాలా లోతైన తాత్విక విషయాలను సైతం సరళమైన తెలుగులో అందిస్తున్నందుకు ధన్యవాద నమస్సులు 🙏🙏❤️

  2. నశింపులేని ఎరుకని, సమరసాన్ని, గగనసమానుణ్ణి. నమస్సులు మాష్టారూ
    🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading