
41
ఈ ప్రపంచం మొత్తం నిరాకారమని తెలుసుకో
ఈ ప్రపంచం మొత్తం వికారహీనమని తెలుసుకో
ఈ ప్రపచం మొత్తం విశుద్ధదేహమని తెలుసుకో
ఈ ప్రపంచం మొత్తం శివైకరూపమని తెలుసుకో.
42
ఆ సత్యానివి నువ్వే, సందేహం లేదు
మళ్ళీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు?
నిన్ను నువ్వు తెలుసుకోగలవనిగాని,
తెలుసుకోలేవని గాని ఎలా భావిస్తున్నావు?
43
నాన్నా! మాయ, అమాయ- ఎక్కడున్నాయవి?
వెలుగు, నీడ ఎలా ఉంటాయో తెలియదు
మొత్తం ఉన్నదంతా ఒకటే సత్యం
ఆకాశంలాంటిదీ, కల్మషాలంటనిదీను.
44
మొదట్లోనూ, మధ్యలోనూ, చివరా కూడా నేను
ముక్తుణ్ణే, దేనికీ అంటిపెట్టుకున్నవాణ్ణి కాను
స్వభావసిద్ధంగానే నిర్మలుణ్ణి, పరిశుద్ధుణ్ణి
ఈ విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు.
45
అవ్యక్తస్థితినుంచి వ్యక్తస్థితిదాకా జగత్తు మొత్తం
నాకు కించిత్తు కూడా కనిపించడం లేదు
ఉన్నదంతా సమస్తం ఒకటే సత్యమైనప్పుడు
వర్ణాశ్రమస్థితులంటూ ఎక్కణ్ణుంచి వచ్చాయి?
46
నిరాలంబంగానూ, నిరంతరాయంగానూ
ఎల్లవేళలా ఉన్నది నేనొక్కణ్ణే అని నాకు తెలుసు
ఆ సత్యం శూన్యం. పృథ్వి, వాయువు, అగ్ని
జలం, గగనాల పాంచభౌతికం శూన్యం.
47
అత్మ నపుంసకం కాదు, పురుషుడుకాదు, స్త్రీ కాదు
అదొక ప్రతిపాదన కాదు లేదా ఊహాగానం కాదు
అటువంటిదాన్ని ఆనందంతో కూడుకుని ఉన్నదనిగాని
ఆనందరహితమని గాని ఎలా తలపోస్తున్నావు?
48
అది షడంగయోగం వల్ల శుద్ధపడింది కాదు
లేదా మనోనాశనం వల్ల పరిశుద్ధమైంది కాదు
లేదా గురూపదేశం వల్లనూ శుద్ధమైంది కాదు
ఆ సత్యం తనంత తానే శుద్ధమూ, బుద్ధమూ.
49
పంచభూతాలతో నిర్మించబడ్డ దేహమంటూ లేదు
పంచభూతాలకు అతీతమైన విదేహమూ కాదు
ఉన్నదంతా కేవలం ఆత్మనే అయినప్పుడు
జాగృతస్వప్నసుషుప్తులూ, నాలుగోదీ ఎక్కడ?
50
నేను బద్ధుణ్ణికాను, ముక్తుణ్ణీ కాను
ఆ పరమసత్యంకన్నా వేరైనవాణ్ణీ కాను
కర్తని గాను, కర్మఫలానికి భోక్తనీ కాను
వ్యాపిని కాను, వ్యాపింపచేసేవాణ్ణీ కాను.
51
నీళ్ళల్లో నీళ్ళు పోసినప్పుడు
తేడా తెలియకుండా పోయినట్టుగా
ప్రకృతికీ, పురుషుడికీ మధ్య
తేడా లేదని నాకు తెలుస్తున్నది.
52
ఎప్పటికీ నువ్వు ముక్తుడివీ కావు
అలాగని దేనికీ బద్ధుడివీ కావు
అటువంటప్పుడు నీకొక రూపముందనో
రూపంలేదనో ఎందుకనుకుంటున్నావు?
53
నీ పరమస్వరూపం ఆకాశంలాంటిది
ఆ సంగతి నేను ప్రత్యక్షంగా చూసాను
నువ్వుకాని మరొక రూపమేదన్నా ఉందంటే
అది ఎండమావిలో కనిపించే నీరు మాత్రమే.
54
నేను గురువుని కాను, ఉపదేశాలివ్వను
నాకొక ఉపాధిలేదు, చెయ్యవలసిన పనుల్లేవు
దేహంలేనివాణ్ణి, అకాశం లాంటివాణ్ణి
స్వభావసిద్ధంగానే నిర్మలుణ్ణని తెలుసుకో.
55
నువ్వు పరిశుద్ధుడివి, నీకంటూ దేహం లేదు
ఆ పరమసత్యంకన్నా వేరైన మనసు లేదు
కాబట్టి నేనే ఆ ఆత్మని, ఆ పరమోన్నత
సత్యాన్ని అని చెప్పుకోడానికి సిగ్గుపడకు.
56
మనసా! ఎందుకని రోదిస్తున్నావు
నువ్వు ఆత్మవే కాబట్టి ఆత్మగానే ఉండు
నాన్నా, తరుగులేని తత్త్వమిది
ఈ అద్వైతపరమామృతం కడుపారా తాగు
57
తెలియచెప్పడం లేదు, తెలియచెప్పకపోవడం లేదు
తెలియచెప్తూ తెలియచెప్పకుండా పోవడమూ లేదు
ఇటువంటి తెలివిడి ఎవరికి లభిస్తుందో
అతడికే నిజంగా తెలియవలసింది తెలుస్తుంది.
58
తర్కజ్ఞానాలేవు, సమాధియోగం లేదు
దేశకాలాల్లేవు, గురూపదేశమూ లేదు
స్వభావసిద్ధంగా తెలియవచ్చే జ్ఞానాన్ని
ఆకాశంలాగా సహజంగా బోధపడే సత్యాన్ని.
59
నాకు పుట్టుకలేదు, మరణమూ లేదు
నాకు శుభాశుభకర్మలంటూ లేవు
పరిశుద్ధుణ్ణి, నిర్గుణసత్యాన్ని, నాకు
బంధమెక్కడ? బయటపడటమెక్కడ?
60
స్థిరుడూ, పూర్ణుడూ, నిరంతరుడూ అయిన
ఆ దేవుడు అంతటా వ్యాపించి ఉండగా
అతడికీ నాకూ మధ్య దూరంలేనప్పుడు
లోపలా, బయటా అనే మాటలెలా మాట్లాడేది?
సంస్కృత మూలం
41
సర్వం జగద్విద్ధి నిరాకృతీదం
సర్వం జగద్విద్ధి వికారహీనమ్
సర్వం జగద్విద్ధి విశుద్ధదేహ
సర్వం జగద్విద్ధి శివైకరూపమ్
42
తత్త్వం త్వం న హి సన్దేహః కిం జానామ్యథవా పునః
అసంవేద్యం స్వసంవేద్యమాత్మానం మన్యసే కథమ్
43
మాయా మాయా కథం తాత్ చాయా చాయా న విద్యతే
తత్త్వమేకమిదం సర్వం వ్యోమాకారం నిరంజనమ్.
44
ఆదిమధ్యాన్తముక్తోహం న బద్ధోహం కదాచన
స్వభావనిర్మలః శుద్ధ ఇతి మే నిశ్చతా మతిః
45
మహదాది జగత్సర్వం న కించిత్ప్రతిభాతి మే
బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమస్థితిః
46
జానామి సర్వథా సర్వమహమేకో నిరన్తరమ్
నిరాలమ్బమశూన్యం చ శూన్యం వ్యోమాదిపఞ్చకమ్
47
న షణ్ఢో న పుమాన్న స్త్రీ న బోధో నైవ కల్పనా
సానన్దో వా నిరానన్దమాత్మానం మన్యసే కథమ్
48
షడంగయోగాన్న తు నైవ శుద్ధం
మనోవినాశాన్న తు నైవ శుద్ధమ్
గురుపదేశాన్న తు నైవ శుద్ధం
స్వయం చ తత్త్వం స్వయమేవ బుద్ధమ్
49
న హి పఞ్చాత్మకో దేహో విధేహో వర్తతే న హి
ఆత్మైవ కేవలం సర్వం తురీయం చ త్రయం కథమ్
50
న బద్ధో నైవ ముక్తోహం న చాహం బ్రహ్మణః పృథక్
న కర్తా న చ భోక్తాహం వ్యాప్యవ్యాపకవర్జితః
51
యథా జలం జలే న్యస్తం సలిలం భేదవర్జితమ్
ప్రకృతిం పురుషం తద్వాదభిన్నం ప్రతిభాతి మే
52
యది నామం న ముక్తోయసి న బద్దోసి కదాచన
సాకారం చ నిరాకారమాత్మానం మన్యసే కథమ్
53
జానామి తే పరం రూపం ప్రత్యక్షం గగనోపమమ్
యథా పరం హి రూపం యన్మరీచిజలసన్నిభమ్
54
న గురుర్నోపదేశశ్చ న చోపాధిర్న మే క్రియా
విధేహం గగనం విద్ధి విశుద్ధోద్యహం స్వభావతః
55
విశుద్ధోస్య శరీరోసి న తే చిత్తం పరాత్పరమ్
అహం చాత్మా పరం తత్త్వమితి వక్తుం న లజ్జసే
56
కథం రోదిషి రే చిత్త హ్యాత్మైవాత్మానా భవ
పిబ వత్స కలాతాతమద్వత పరమామృతమ్
57
నైవ బోధో న చాబోధో న బోధాబోధ ఏవ చ
యస్యేదృశః సదా బోధః స బోధో నాన్యథా భవేత్
58
జ్ఞానం న తర్కో న సమాధియోగో
న దేశకాలౌ న గురూపదేశః
స్వభావసంవిత్తరహం చ తత్త్వ-
మాకాశకల్పం సహజం ధ్రువం చ.
59
న జాతోహం మృతో వాపి న మే కర్మ శుభాశుభమ్
విశుద్ధం నిర్గుణం బ్రహ్మ బంధో ముక్తిః కథం మమ్
60
యది సర్వగతో దేవః స్థిరః పూర్ణో నిరన్తరః
అంతరం హి న పశ్యామి స బాహ్యాభ్యంతరః కథమ్
30-10-2024


నమస్తే
కొంత అష్టావక్రగీతలా ఉంది. అద్వైతమెంత సుందరం. నమోనమః
ధన్యవాదాలు మేడం
అవధూత గీత తరువాత నిజంగానే మీరు అష్టవక్రగీత కూడా చెప్పండి నాకోసం దయచేసి 🌺💐
ప్రయత్నిస్తాను సోమభూపాల్!
మనస్సు నిండిపోయింది.నమస్సులు మాష్టారూ 🙏
ధన్యవాదాలు
ఏక్ దం న చదివా. నిజ దీపావళి
ధన్యవాదాలు