
మొదటి అధ్యాయం
21
సాకారమేదీ సత్యం కాదని తెలుసుకో, నిరాకారమొకటే నిరంతరం,
ఈ తత్త్వం తెలుసుకున్నావా, నువ్వు మళ్ళా ప్రభవించడముండదు.
22
తత్త్వం ఒక్కటే, అన్నిటిపట్లా అది సమానమని పండితులు చెప్తారు,
ఇష్టాలు వదిలిపెట్టేక నీ మనసుకి ఒకటీ ఉండదు, పదీ ఉండవు.
23
ఆత్మకానిదానికి ధ్యానంతో పనేమిటి?
ఆత్మస్వరూపానికి ధ్యానంతో పనేమిటి?
అదిఏకం, విముక్తం. ఉందనిగాని లేదనిగాని
చెప్పలేనిదానికి ధ్యానంతో పనేమిటి?
24
నువ్వు పరిశుద్ధుడివి, పక్షపాతం లేనివాడివి
పుట్టుకలేనివాడివి, దేహం లేనివాడివి,
ఎన్నటికీ అంతరించనివాడివి కదా! ఆత్మ గురించి
తెలుసనిగాని, తెలియదనిగాని ఎలా చెప్పగలవు?
25
‘అది నువ్వే’ అని చెప్పే వాక్యంతో
నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు
‘ఇది కాదు, ఇది కాదు’ అని వేదాలు చెప్తున్నది
పంచభూతాలతో తయారైన ప్రపంచం గురించి.
26
ఎడతెగని నిన్నే నువ్వు నీలోపల నింపుకున్నావు
ఇంక ధ్యానించేదెవరు? దేన్ని ధ్యానించాలి?
నీకంటూ ఒక మనసే లేనప్పుడు
సిగ్గులేకుండా మరి దేన్ని ధ్యానిస్తావు?
27
శివుడంటే తెలియకుండా ఏమి చెప్పగలను?
శివుడంటే తెలియకుండా దేన్ని భజించగలను?
ఆ పరమార్థ తత్త్వమైన శివుణ్ణి నేనే
ఆకాశంలాంటివాణ్ణి, నాకన్నీ సమానమే.
28
ఆ సత్యం నేను కాదు, ఆ సమతత్వమూ నేను కాదు
కార్యకారణ సంబంధాల ఊహాగానాలూ నేను కాదు
తెలుసుకునేవాడూ, తెలుసుకునేదీ అని రెండుకానిది
తనంతతనే తెలియరావడమెట్లా?
29
అంతులేనిస్వరూపమైన వస్తువంటూ ఏదీ లేదు
తానే పరమసత్యమని చెప్పదగ్గ వస్తువూ లేదు
ఆ ఒకే ఒక్క సత్యం ఆత్మస్వరూపం మాత్రమే
అక్కడ సంఘర్షణలేదు, సంఘర్షణలేకపోడమూ లేదు.
30
అసలు సత్యం తెలుసుకుని పరిశుద్ధుడవయ్యావు
పుట్టుక, దేహం, మరణాలు లేనివాడివయ్యావు
అయినా ఆత్మ గురించి ఎందుకని భ్రమపడుతున్నావు?
అవును, ఎందుకని నేను పదేపదే భ్రమపడుతున్నాను?
31
ఘటం పగిలినప్పుడు ఘటాకాశమంటూ వేరేగా మిగలదు
శివునివల్ల మనసు శుద్ధపడ్డాక నాకే తేడా తెలియడం లేదు.
32
ఘటమూ లేదు, ఘటాకాశమూ లేదు, జీవుడూ లేడు, దేహుడూ లేడు
తెలుసుకునేవీ, తెలుసుకోనివీ ఏవీ లేవు, ఉన్నది కేవలసత్యమొక్కటే
33
అన్నిచోట్లా, అన్నివేళలా ఎప్పటికీ నిశ్చయంగా ఉన్నదొక్కటే
శూన్యం, అశూన్యం సమస్తం నేనేనని తెలుసుకో, సందేహించకు.
34
వేదాలు లేవు, లోకాలు లేవు, దేవతలు లేరు, యజ్ఞాలు లేవు
వర్ణాలు లేవు, ఆశ్రమాలు లేవు, కులం లేదు, జాతి లేదు
పొగచూరే దారులూ లేవు, దీపాలు వెలిగే తోవలూ లేవు
కోరుకోవలసిన పరమగమ్యంగా ఉన్నదొక్కటే పరమసత్యం.
35
వ్యాప్యవ్యాపక భేదం నుంచి బయటపడి
నీ ఆత్మసాఫల్యాన్ని అందుకున్నాక
ఎందుకని నిన్ను నువ్వింకా ప్రత్యక్షమనీ
పరోక్షమనీ తలపోస్తున్నావు?
36
కొందరు అద్వైతాన్ని ఇష్టపడతారు
మరికొందరు ద్వైతాన్ని కోరుకుంటారు
కాని ద్వైతాద్వైతాల్ని విడిచిపెట్టిన
సమతత్త్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
37
అది తెల్లనిదీ కాదు, నల్లనిదీకాదు
దానికే రంగులూ లేవు, గుణాలూ లేవు
మనసుకీ, మాటలకీ గోచరించని
ఆ తత్త్వం గురించి ఏమని చెప్పడం?
38
ఈ మొత్తం దేహాదికమంతా ఆకాశం లాంటిదనీ,
అబద్ధమనీ ఎప్పుడు తెలుసుకుంటావో
అప్పుడు నీకు ఆ పరమసత్యం బోధపడుతుంది
అప్పుడు నీకు పరాపరాలనే రెండు సంగతులుండవు.
39
నా సహజస్థితిలో ఉన్నప్పుడు, నేనూ
ఆ పరమసత్యమూ ఒకటే అయినప్పుడు,
ఇద్దరి రోదసీ ఒకటే అయినప్పుడు
ఇక ధ్యానించేదెవరు? ధ్యానమెక్కడ?
40
ఏ పని చేస్తున్నా, ఏది తింటున్నా,
ఏ హోమం చేస్తున్నా, ఏది సమర్పిస్తున్నా
ఈ సమస్తం కించిత్తు కూడా నాకేమీ కాదు
నేను పరిశుద్ధుణ్ణి, అవ్యయుణ్ణి.
సంస్కృత మూలం
21
సాకారమనృతం విద్ధి నిరాకారం నిరంతరమ్
ఏతత్తత్త్వోపదేశేన న పునర్భవ సమ్భవః
22
ఏకమేవ సమం తత్త్వం వదన్తి హి విపశ్చితః
రాగత్యాగాత్పునశ్చిత్తమేకానేకం న విద్యతే.
23
అనాత్మరూపం చ కథం సమాధి-
రాత్మస్వరూపం చ కథం సమాధిః
అస్తీతి నాస్తీతి కథం సమాధి-
ర్మోక్షస్వరూపం యది సర్వమేకమ్.
24
విశుద్ధోసి సమం తత్త్వం విదేహస్త్వమజోవ్యయః
జానామీహ న జానామీత్యాత్మానం మన్యసే కథమ్.
25
తత్త్వమస్యాదివాక్యేన స్వాత్మా హి ప్రతిపాదితః
నేతి నేతి శ్రుతిర్బ్రూయాదనృతం పాంచభౌతికమ్
26
ఆత్మన్యేవాత్మనా సర్వం త్వయా పూర్ణం నిరన్తరమ్
ధ్యాతా ధ్యానం న తే చిత్తం నిర్లజ్జం ధ్యాయతే కథమ్
27
శివం న జానామి కథం వదామి
శివం న జానామి కథం భజామి
అహం శివశ్చేత్పరమార్థతత్త్వం
సమస్వరూపం గగనోపమం చ.
28
నాహం తత్త్వం సమం తత్త్వం కల్పనాహేతువర్జితమ్
గ్రాహ్యగ్రాహక నిర్ముక్తం స్వసంవేద్యం కథం భవేత్
29
అనంతరూపం న హి వస్తు కించి-
త్తత్త్వస్వరూపం న హి వస్తు కించిత్
ఆత్మైకరూపం పరమార్థతత్త్వం
న హింసకో వాపి న చాప్యహింసా.
30
విశుద్ధోసి సమం తత్త్వం విదేహమజ మవ్యయమ్
విభ్రమం కథమార్థే విభ్రాన్తోహం కథం పునః
31
ఘటే భిన్నే ఘటాకాశం సులీనం భేదవర్జితమ్
శివేన మనసా శుద్ధో న భేదః ప్రతిభాతి మే.
32
న ఘటో న ఘటాకాశో న జీవో న జీవవిగ్రహః
కేవలం బ్రహ్మ సంవిద్ధి వేద్యావేదకవర్జితమ్
33
సర్వత్ర సర్వదా సర్వమాత్మానం సతతం ధ్రువమ్
సర్వం శూన్యమశూన్యం చ తన్మాం విద్ధి న సందేహః
34
వేదా న లోకా న సురా న యజ్ఞా
వర్ణాశ్రమో నైవ కులం న జాతిః
న ధూమమార్గో న చ దీప్తిమార్గో
బ్రహ్మైకరూపం పరమార్థతత్త్వం.
35
వ్యాప్యవ్యాపకనిర్ముక్తః త్వమేకః సఫలం యది
ప్రత్యక్షం చాపరోక్షం చ హ్యత్మానం మన్యసే కథమ్.
36
అద్వైతం కేచిదిచ్ఛన్తి ద్వైతమిచ్ఛన్తి చాపరే
సమం తత్త్వం న విన్దన్తి ద్వైతాద్వైతవివర్జితమ్.
37
శ్వేతాదివర్ణరహితం శబ్దాదిగుణవర్జితమ్
కథయంతి కథం తత్త్వం మనోవాచామగోచరమ్.
38
యదాయనృతమిదం సర్వం దేహాదిగగనోపమమ్
తదా హి బ్రహ్మ సంవేత్తి న తే ద్వైతపరమ్పరా
39
పరేణ సహజాత్మాపి హ్యభిన్నః ప్రతిభాతి మే
వ్యోమాకారం తథైవైకం ధ్యాతా ధ్యానం కథం భవేత్?
40
యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్
ఏతత్సర్వం న మే కించిద్విశుద్ధోహమజోవ్యయః
29-10-2024


🙏🙏🙏
శుద్దబ్రమ్మ పరాత్పర రూపా
ధన్యవాదాలు
అవధూత గీత సిరీస్ ద్వారా మీరు నాకు మంత్రోపదేశం చేస్తున్నట్టు ఉంది
ఎడతెగక ప్రవహించే నదిలా ఒకసారి
ఎక్కడికీ కదలని సముద్రమై ఒకసారి
అర్థమవుతాయి మీ మాటలు 🙇🏻♂️💐
ధన్యవాదాలు సోమ భూపాల్!