అవధూత గీత-3

దత్తాత్రేయులు శివుడిలానో, విష్ణువులానో ప్రధానదేవతగానో లేదా దత్త సంప్రదాయం బౌద్ధంలానో, జైనంలానో ఒక ప్రత్యేక మతం గానో, లేదా ఆ దర్శనం సాంఖ్యంలానో, మీమాంసలానో ప్రత్యేకదర్శనంగానో కనిపించదు. కానీ ప్రతి ఒక్క ప్రధానదేవతతోనూ, ప్రతి ఒక్క ముఖ్యపురాణంతోనూ, ప్రతి ఒక్క ప్రభావశీలమైన దర్శనంతోనూ దత్తాత్రేయుల పేరు ముడిపడి ఉంది. అది ఆశ్చర్యం. వివిధ సంప్రదాయాలూ, వివిధ మతశాఖలూ, వివిధ ఆరాధనా, అర్చా పద్ధతులూ దత్తాత్రేయులనుంచి ఎంతో కొంత తీసుకున్నాయి. అందుకు ప్రతిగా ఆయనకు ఊహించలేనంత ముఖ్యమైన స్థానాన్నే ఇచ్చుకున్నాయి. అలా వివిధ శాఖలు ఆయన్ని సొంతం చేసుకోడంలో, ఆయా శాఖలు పరస్పర విరుద్ధాలనే విషయం కూడా మర్చిపోయాయి. ఉదాహరణకి శైవ, వైష్ణవ సంప్రదాయాలు రెండూ దత్తాత్రేయుల్ని ఎంతగా తమలో పొదువుకోడానికి ప్రయత్నించేయంటే నెమ్మదిగా ఆ రెండు సంప్రదాయాలు ఆయనకు శివ, విష్ణుముఖాల్ని అమర్చకుండా ఉండలేకపోయాయి. ఒకవైపు వర్ణాశ్రమ ధర్మాల్ని నిలబెట్టాలకునే వారితో పాటు, వర్ణాశ్రమ ధర్మాలకు అతీతమైన జీవనవిధానాన్ని అనుసరించేవాళ్ళు కూడా దత్తాత్రేయుల్ని తమ స్ఫూర్తిగా చెప్పుకున్నారు. ఇలా వీలైనన్ని పక్షాలు తమ స్ఫూర్తిప్రదాతగా ఎవరిని పరిగణిస్తారో ఆ దేవత, ఆ గురువు, ఆ సంస్కర్త, ఆ ప్రవక్త- వాళ్ళనే నేను syncretic అంటూ ఉన్నాను.

భారతదేశంలో ఏ అతీతకాలంలోనో దత్తాత్రేయులు ప్రత్యక్షమయ్యారు. బహుశా వేదపూర్వకాలం కూడా అయి ఉండవచ్చు. అవైదిక మూలాలకు చెందిన ఒక అత్యంత ప్రాచీన యోగి అయి ఉండవచ్చును. యుగాలుగా ఆయన ప్రస్తావన ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉందో పరిశీలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. Antonio Rigopoulos తన  Dattatreya: The Immortal Guru, Yogin and Avatara పుస్తకంలోనూ, ఎస్.సి.ధేరే అనే ఆయన మరాఠీలో రాసిన ‘దత్తసంప్రదాయాచా ఇతిహాస్’ అనే పుస్తకం ఆధారంగా  శంకర్ మోకాషి పుణేకర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగానూ, దత్తాత్రేయపరిణామాన్ని ఇలా స్థూలంగా వివరించవచ్చు.

మహాభారతంలో దత్తాత్రేయులు ఒక ఋషిగా దర్శనమిస్తారు.  అత్రి వంశంలో జన్మించిన  ఋషిగా మహాభారతం అనుశాసనపర్వంలో ఆయన్ని పేర్కొంది.  దత్తాత్రేయులు సాధ్యులనే వారికి చేసిన బోధనలు ఉద్యోగపర్వంలో కనిపిస్తాయి. కార్త్యవీర్యార్జునుడికి దత్తాత్రేయులు వరాలు అనుగ్రహించిన కథ కూడా మహాభారతంలో మొదటిసారి కనిపిస్తుంది. కార్తవీర్యుడికి సంబంధించి దత్తాత్రేయుల ప్రస్తావన అగ్ని, బ్రహ్మ, మత్స్య, పద్మ, విష్ణు, విష్ణుధర్మోత్తర పురాణాల్లో కనిపిస్తుంది. అంటే పురాణకాలం నాటికి దత్తాత్రేయులు మరింత విస్తృతమైన presence గా మారారన్నమాట. పురాణాల్లో ఆయన ముఖ్యంగా యోగిగా దర్శనమిస్తాడు. బ్రహ్మపురాణం, భాగవత పురాణం, గరుడపురాణం, మార్కండేయ పురాణాల్లో దత్తాత్రేయుల గురించి మరింత విపులమైన కథలు కనిపిస్తాయి. ఆయన అలర్కుడనే రాజుకి అష్టాంగయోగం, అన్వీక్షికి, సుతర్క విద్యలు బోధించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. అర్థశాస్త్రం చెప్పినదాని ప్రకారం అన్వీక్షికి అంటే సాంఖ్యం, యోగం, లోకాయత సంప్రదాయాలకు సంబంధించిన విద్య. అంటే ప్రత్యేకంగా ఒక దర్శనానికి చెందిన ఋషిగా పేర్కోక పోయినప్పటికీ, దత్తాత్రేయుల్ని ప్రాచీన దర్శనాలకు చెందిన యోగిగా సంభావిస్తున్నారన్నమాట. అయితే మార్కండేయ పురాణం మనకి అందిస్తున్న సమాచారం ప్రకారం ఆయన్ని మనం ఒక జ్ఞానయోగిగా భావించవచ్చు అంటాడు రిగోపోలస్. అంతేకాక మార్కండేయ పురాణం 41 వ సర్గలో దత్తాత్రేయులు అలర్కుడికి చేసిన బోధలో ఒక యోగి ఎలా జీవించాలో వివరించినదాన్నిబట్టి చూస్తే తదనంతర కాలంలో అటువంటి యోగుల్నే అవధూతలుగా పేర్కొంటున్నారని  మనం గ్రహించవచ్చు. మార్కండేయ పురాణం సా.శ. ఏడవశతాబ్ది కన్నా ముందు రాసిన పురాణం అని పరిశోధకులు చెప్పేదాన్నిబట్టి, అప్పటికే దత్తాత్రేయులు ఒక ప్రత్యేక యోగ జ్ఞానాన్ని, ఒక అవధూత జీవనవిధానాన్ని ప్రతిపాదిస్తున్న యోగిగా గుర్తిస్తున్నారని అనుకోవచ్చు.

అయితే భాగవత పురాణంలో పదకొండవ స్కంధంలో  ఒక సంవాదం కనిపిస్తుంది. యదుమహారాజుకి, పన్నెండేళ్ళ వయసు కలిగిన ఒక బాలావధూతకీ  మధ్య జరిగిన ఆ సంవాదం (11.7.24- 11.9-24) యదుగీతగా, గురుగీతగా ప్రసిద్ధి పొందింది. దత్తాత్రేయుల బోధనల సారాంశం ఆ గీతలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ సంవాదంలో యదుమహారాజు ఆ అవధూతని ఇలా అడుగుతాడు:

మీరు ఎటువంటి కార్యకాలాపంలోనూ నిమగ్నులు కాకుండానే ఈ ప్రపంచం గురించి ఎంతో తెలిసినవారిలాగా కనిపిస్తున్నారు. మీరు ఒక బాలుడిలాగా కనిపిస్తూనే ఈ ప్రపంచమంతా స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. మీకు ఈ జ్ఞానం ఎలా పట్టుబడింది?. మామూలుగా మనుషులు ధర్మార్థ కామాల్ని పొందడానికీ, దీర్ఘకాలం జీవించడానికీ, గొప్ప పేరు తెచ్చుకోడానికీ, శ్రేయస్సుకోసం తపిస్తూ ఉంటారు, కానీ మీరేమిటి, ఇంత ఇంత అందంగా ఉండి, ఇంత చక్కగా మాట్లాడుతూ, గొప్ప శక్తిసామర్థ్యాలు ఉండికూడా ఏదీ కోరుకుండా, ఏ పనిలోనూ మునిగిపోకుండా, జడంగా, ఉన్మత్తంగా, పిశాచంలాగా తిరుగుతున్నారేమిటి? సాధారణంగా మనుషులు ఈ లోకంలో కోరికలతోటీ, ప్రలోభాలతోటీ రగిలిపోతూ ఉంటారు, కాని మీరేమిటి చుట్టూ అడవి తగలబడిపోతుంటే గంగానదిలో చల్లగా సేదదీరుతున్న ఏనుగులాగా కనిపిస్తున్నారు అని కూడా అడిగాడు.

అప్పుడు ఆ అవధూత తాను చాలామంది గురువుల్ని ఆశ్రయించాననీ, వాళ్ళ ఉపదేశం వల్ల తనకి అటువంటి జీవన్ముక్త స్థితి సాధ్యపడిందనీ చెప్తూ, మొత్తం ఇరవైనాలుగు మంది గురువుల్నీ, వారి నుంచి తానేమి నేర్చుకున్నాడో ఆ విద్యల్నీ వివరిస్తాడు.

ఆ గురువులు: భూమి, వాయువు, ఆకాశం, నీళ్ళు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఒక కపోతం, ఒక కొండచిలువ, సముద్రం, మిడత, తేనెటీగ, ఏనుగు, మధుచోరుడు, జింక, చేప, పింగళ అనే ఒక వేశ్య, కురరం అనే పక్షి, పిల్లవాడు, పిల్ల, బాణాలు తయారుచేసేవాడు, పాము, సాలీడు, కందిరీగలు.

వాటినుంచి తానేమి నేర్చుకున్నాడో ఇలా చెప్తున్నాడు: ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పక్కకి తొలగకుండా ఉండే ఓర్పు భూమినుంచి, మంచిచెడ్డలమీంచి ప్రసరిస్తున్నప్పటికీ వాటి గుణగణాలు తనకి అంటిపెట్టుకోకుండా ఉండగలిగే లక్షణం వాయువునుంచి, అన్నిటిలోనూ ఉన్నప్పటికీ దేనితోనూ కలవకుండానూ, దేనివల్లా విభజింపబడకుండానూ ఉండే ఆత్మలక్షణం ఆకాశం నుంచీ, అన్ని రకాల కాలుష్యాలనుంచీ విముక్తినీ, ప్రవాహశీలత్వాన్నీ నీళ్ళనుంచీ, కొన్ని సార్లు దాగి ఉండి, కొన్ని సార్లు బహిర్గతమవుతూ, ప్రతి ఒక్క పాపాన్నీ దహించగలిగే శక్తిని అగ్నినుంచి, వృద్ధిక్షీణతలు పొందుతున్నప్పటికీ వాటివల్ల చలించని లక్షణాన్ని చంద్రుడినుంచి, ఇవ్వడానికీ, తిరిగి వదులుకోడానికి ఎటువంటి సంకోచం లేకుండా, వివిధ వస్తువుల్లో ప్రతిబింబిస్తున్నప్పటికీ, ఏ ఒక్క ప్రతిబింబంలోనూ చిక్కుకుపోకుండా ఉండే స్వాతంత్య్రాన్ని సూర్యుడినుంచీ నేర్చుకున్నానని ఆ అవధూత చెప్పాడు.

అలానే మితిమీరిన అనురాగాల్లో, ఆందోళనల్లో తగులుకుంటే మూర్ఖకపోతంలాగా బాధని అనుభవించవలసి వస్తుందని కూడా తెలుసుకున్నానని చెప్పాడు. ఇక కొండచిలువ తన ఆహారం కోసం తానేమీ ప్రయత్నించదు. తన దగ్గరకి ఏది అందివస్తే దాన్నే స్వీకరిస్తుంది. దాన్ని చూసి అటువంటి అజగరవృత్తిని నేర్చుకున్నానని చెప్పాడు. అలాగే  ఇంద్రియాగ్ని జ్వాలల్లో తగలబడిపోకూడదని మిడతని చూసి గ్రహించానని చెప్పాడు. తేనెటీగనుంచి తాను నేర్చుకున్నవి రెండు సంగతులని చెప్పాడు. ఒకటి, తనకి ఎంత అవసరమో అంతే తాను స్వీకరించడం, రెండోది, చిన్నపువ్వులుగానీ, పెద్దపువ్వులు గానీ తేనెటీగ ప్రతి పువ్వునుంచీ తేనె స్వీకరించినట్టే, అన్ని రకాల శాస్త్రాలనుంచీ సారం గ్రహించడం. అలొగే, తేనెటీగలు కూడగట్టుకున్న తేనెని మధుచోరుడు సేకరించుకున్నట్టుగా, సన్యాసులకి తమ జీవిక కోసం గృహస్థుల పైన ఆధారపడవచ్చునని తెలుసుకున్నానని చెప్తాడు. ఇంద్రియసుఖాన్ని ఆశించి ఏనుగులూ, జింకలూ, చేపలూ వలలో చిక్కుకోడం చూసాననీ కాబట్టి తాను ఇంద్రియసుఖాలకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాననీ చెప్పాడు. ఇక ఒక రోజు విదేహ నగరంలో పింగళ అనే ఒక వేశ్య రాత్రంతా తన విటులకోసం ఎదురుచూస్తూ, ఆ నిరీక్షణలోనే నిర్లిప్తతకు చేరుకుని, క్రమంగా మనోవిముక్తి చెంది గొప్ప ఆనందం పొందడం తాను చూసానని కాబట్టి ఆమెని కూడా తన గురువుగా భావిస్తున్నాననీ చెప్పాడు. అలానే ఒక పక్షి తన నోటిలో  ఆహారం ఉండగా తన మీద మరొక పక్షి సమూహం దాడిచేసినప్పుడు ఆ ఆహారాన్ని విడిచిపెట్టేసింది. దాంతో ఆమెకి ఆ ముప్పు తప్పింది,  క్షోభ తప్పింది. తాను కూడా తన ఆశల్ని వదిలిపెట్టేసుకోగలిగితే అటువంటి భయాలనుంచి బయటపడగలనని తెలుసుకున్నానని చెప్పాడు. స్వేచ్ఛగా ఏ బాదరబందీలేకుండా ఉల్లాసంగా తిరగడమెలానో ఒక పసిబాలుణ్ణి చూసి నేర్చుకున్నానని చెప్పాడు. ఒక యువతినుంచి కూడా ఒక పాఠం నేర్చుకున్నానని చెప్పాడు. ఒక యువతిని చూడటానికి ఆమె ఇంటికి కొందరు బంధువులు వచ్చారు.అప్పుడామె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆమె వచ్చిన అతిథులకి అన్నం వంటిపెట్టడానికి ధాన్యం దంచడానికి లోపలకి వెళ్ళింది. కాని తాను ధాన్యం దంచుతున్న చప్పుడు బయటికి వినబడి ఆ అథిథులు లోపలకి వస్తే వాళ్ళకి తమ పేదరికం గురించి తెలుస్తుందని ఆమె తన చేతిగాజులు ఒక్కొక్కటీ తీసి పక్కన పెట్టేసింది. చివరికి ఒక్క గాజు మాత్రమే ఆమె చేతిన మిగిలింది. ఆ  సంగతి విన్నప్పుడు తనకి ఒకటి అర్థమయిందనీ, పదిమంది చేరినచోట కలహం తప్పదనీ, చివరికి ఇద్దరు మనుషులు ఒక్కచోట చేరినా కూడా పనికిమాలిన సంభాషణలు మొదలవుతాయనీ కాబట్టి తాను ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకున్నాననీ చెప్తాడు.

అలానే బాణాలు తయారు చేసేవాడొకడు తాను బాణాలు చెక్కుకుంటూ ఉండగా పక్కనుంచి రాజు వెళ్ళినా కూడా పట్టించుకోలేదట. అసలు అతనికి ఆ స్పృహనే లేదు. భగవంతుడిమీదనే దృష్టినిలిపినవాడికి మరొకదాని మీద ధ్యాస ఎలా ఉండదో అతణ్ణుంచి తెలుసుకున్నానని చెప్పాడు. ఇక మనుషులు ఎన్నో సమకూర్చుకుంటారు, కానీ ఏవీ శాశ్వతం కావు, అదే ఒక పాము చూడండి, వేరేవాళ్ళు కట్టుకున్న ఇంట్లోకి తాను పోయి సంతోషంగా నివసిస్తుంది. కాబట్టి వస్తుసంచయంలో సుఖం లేదని గ్రహించానని చెప్తాడు. ఇక సాలీడు ఎలాగైతే తననుంచి వెలికి లాగిన దారంతో గూడుకట్టుకుని తిరిగి ఆ దారాన్ని తనలోకే లాక్కుంటుందో భగవంతుడు కూడా ఈ విశ్వాన్ని తనలోంచి సృష్టించి తిరిగి తనలోకే ఉపసంహరించుకుంటాడని తెలుసుకున్నానని అని చెప్పాడు.

ఇక ఒక కందిరీగ తన గూట్లోకి ఒక చిన్న కీటకాన్ని లాగి బంధించింది. ఆ కీటకం బయటికి పోయేదారి లేక ఆ కందిరీగమీదనే దృష్టిపెట్టి దాన్నే ధ్యానిస్తూ చివరికి తాను కూడా ఆ కందిరీగగా మారిపోయింది. ఏకాగ్రత వల్ల తన పరిమితిని దాటవచ్చునని దాన్నుంచి తెలుసుకున్నానని చెప్పాడు.

ఈ విధంగా తాను ఇరవైనాలుగు మంది గురువుల నుంచి జ్ఞానం గ్రహించానని ఆ అవధూత యదుమహారాజుకి చెప్పాడు. ఇది చాలా అందమైన, భావస్ఫోరకమైన సంవాదం. దీనికదే ప్రత్యేకంగా అనువదించదగ్గది, వివరించదగ్గది, చర్చించదగ్గది. కానీ స్థూలంగా దీన్నిక్కడ ప్రస్తావించడంద్వారా దత్తాత్రేయులకి సంబంధించిన ఒక సారభూత విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

అదేమంటే, ఆయన ఏదో ఒక గురువునుంచి ఏదో ఒకే ఒక్క మంత్రోపదేశం పొంది ఒక దర్శనాన్నో, ఒక యోగాన్నో వివరించిన గురువు కాదు. ఆయన అనేక మంది నుంచి జ్ఞానాన్ని గ్రహించాడు. అందులో ప్రకృతి ఉంది, పంచభూతాలున్నాయి, మనుషులున్నారు, గొప్ప ప్రాణులున్నాయి, అల్పప్రాణులున్నాయి. వాటి నుంచి ఆయన నేర్చుకున్న వాటిలో కొన్ని గుణాత్మక పాఠాలు, కొన్ని ఋణాత్మక పాఠాలు.

అణుభ్యశ్చ, మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః
సర్వత్రః సారమాదధ్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః (11-8-10)

(ఎలాగైతే తేనెటీగ చిన్నవీ, పెద్దవీ అన్ని పూలనుంచీ తేనె స్వీకరిస్తుందో, నేర్పరి అయిన మానవుడు కూడా అన్నిచోట్లనుంచీ సారాన్ని సేకరించుకోవాలి.)

ఇది, ఈ మధుకరి విద్య, ఉపనిషత్తులు దీన్నే మధువిద్య అన్నాయి, ఇదే దత్తాత్రేయుల బోధలన్నిటి సారాంశమూనూ. దీన్నే నేను syncretism అని అంటున్నాను. ఇలా నలుదిక్కులనుంచీ నేర్చుకునే పాఠాలు, ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఇది ఒక meta-knowledge. అంటే నేర్చుకోవడమెలానో నేర్చుకోడం. భారతీయ దర్శనాలూ, మతాలూ, సంప్రదాయాలూ ఈ జ్ఞానానికే దత్తాత్రేయులకి ఋణపడి ఉన్నాయి. తామట్లా ఋణపడ్డట్టు చెప్పుకున్నాయి కూడా.

ఒక గురువునుంచో, ఒక మతం నుంచో, ఒక మతగ్రంథం నుంచో లేదా ఒక theory నుంచో, ఒక thinker  నుంచో లేదా ఒక treatise నుంచో మాత్రమే తాము ఏదో ఒకటి తెలుసుకుని, అదే సమస్త పరిజ్ఞానమని భావిస్తూ, అక్కడితో ఆగక, వేరే మతాలూ, పుస్తకాలూ, గురువులూ, సిద్ధాంతాలూ, ప్రతిపాదనలూ తప్పంటూ మాట్లాడేవాళ్ళని చూస్తే, నాకు అందుకనే, చెప్పలేని జాలి కలుగుతుంది. మీరు ప్రపంచాన్ని మార్చడం అలా ఉంచి, మీకై మీరే పాక్షిక అంధత్వంలో కూరుకుపోతున్నారని వాళ్ళకి ఎలా చెప్పడమా అనిపిస్తూంటుంది. ఎందుకంటే వారు మరొకరు చెప్తే వినే పరిస్థితిలో ఉండరు. మీరు చూసేదొక్కటే కాదు,  జీవితానికి మరెన్నో పార్శ్వాలున్నాయని చెప్పబోయే ఏ ప్రయత్నాన్నీ వారు హర్షించలేరుసరికదా, అలా చెప్పడానికి పూనుకునేవారిని క్షమించలేరు కూడా.

25-10-2024

11 Replies to “అవధూత గీత-3”

  1. అద్భుతం sir. పరిపూర్ణమైన జ్ఞానం. ఇంత సమగ్రం గా ఆలోచించ గలిగిన నాడు ఇన్ని విద్వేషాలు, కల్లోలాలు లేకుండా ప్రపంచం వసుధైక కుటుంబం గా శాంతి తో విరాజిల్లుతుంది కదా!

  2. ఒకే గురువు ఉంటాడు అని పరిమితి గల ఆలోచనలో ఉన్నవారు ఇది చదవాలి.ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే నువ్వున్న స్థితిలో నీకు ఏ జ్ఞానం కావాలో అది ఎలాగో ఒకలా నీకు అందుతుంది.అన్నీ గురువుగా భావించుకొని,అన్ని పూల నుండి ఒకే మకరందం గ్రహించినట్లు అన్నింటిలో ని జ్ఞానాన్ని తీసుకొని ఆత్మ స్థితి వైపు సాగాలి💐💐💐💐👌

  3. శుభోదయం సర్, మనో వికాసానికి కావలిసిన గురుబోధ అంతా ఒక్క చోట కూర్చారు. చివరన చెప్పిన మాటలు సమకాలీన సమాజం గుర్తించవలసిన సత్యం. నమస్సులు సర్

  4. మీ మాటలు అత్యద్భుతాలు. చక్కని దారి చూపించే సవ్య మార్గాలు. ఎదురుచూస్తూనే ఉంటాను. ఈ రోజు ఏమి చెప్తారా? అని. ఒక్కోసారి కామెంట్ పెట్టె అర్హత లేదని అనిపిస్తుంది. పదే పదే చదువుతాను. నమోనమః

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading