కొత్త యుగం రచయిత్రి-2

మనుషులు తోటిమనుషుల పట్ల చూపించగలిగే క్రూరత్వం ఒక్కటే కాదు హన్ కాంగ్ ని వెంటాడింది. కొన్ని సందర్భాల్లో మనుషులు ఒక సమూహంగా చూపించగల నిరుపమానమైన త్యాగం, సహానుభూతి, ఔదార్యం, తోటిమనుషులకోసం తమ ప్రాణాల్ని కూడా తృణప్రాయంగా ఎంచగల నిస్సంకోచం కూడా ఆమెని ఆశ్చర్యపరుస్తూ వచ్చాయి.

Human Acts నవల్లో ఆమె ఒక పుస్తకం గురించి ప్రస్తావిస్తుంది. అది క్రౌడ్ సైకాలజీ గురించిన ఒక పరిశోధన. ఆ పరిశోధకురాలు ఫ్రెంచి విప్లవం, స్పానిష్ సివిల్ వార్, రెండో ప్రపంచ యుద్ధాల్లో మనుషులు సమూహాలుగా ప్రవర్తించిన ఉదాహరణల్ని తీసుకుని తన ప్రతిపాదనలు చేస్తుంది. ఆ పుస్తకాన్ని అనువదించిన అనువాదకుడు ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ ఇలా రాసాడని రచయిత్రి మనకు చెప్తుంది:

గుంపు లేదా మంద లేదా సమూహం తాలుకు నైతికతని ప్రభావితం చేసే నిర్ణాయకశక్తి ఏమిటనేది మనకింకా పూర్తిగా బోధపడలేదు. కాని మనుషులు ఒక గుంపుగా మారకముందు వాళ్ళ వాళ్ళ నైతిక ప్రమాణాల కన్నా భిన్నమైన ఒక ప్రత్యేక నైతిక ప్రవర్తన మాత్రం ఆ సమూహంలోంచి తలెత్తడం చూస్తాం మనం. సాధారణంగా కొన్ని గుంపులు దోచుకోడానికీ, హత్యలు చెయ్యడానికీ, మానభంగాలు చెయ్యడానికీ వెనకాడని స్థితిలోనే మరోవేపు అదే సమూహం, దానిలోని వ్యక్తులు, వ్యక్తులుగా చూపించలేని ఒక మహౌదార్యాన్ని, మానవత్వాన్ని చూపిస్తుంటారు కూడా. ఈ పరిశోధకురాలు చెప్పేదేమంటే అటువంటి గుంపుల్లో వ్యక్తులు వ్యక్తులుగా ఏమీ మహోన్నతమానవులు కారనీ, ఆ క్షణాల్లో వాళ్ళు చూపించే ఆ ఆత్మౌన్నత్యం సాధారణ మానవలక్షణమేననీ దాన్ని వాళ్ళు ఆ క్షణాన ఆ సమూహం నుంచి అందిపుచ్చుకుంటారనీ. అలాగే మొదటి తరహా గుంపులో మనుషులు చూపించే అనాగరికత, అమానుషత్వం కూడా వ్యక్తులుగా వాళ్ళ లక్షణం కాదనీ, వాళ్ళు గుంపుగా మారగానే ఆ గుంపుతనంలోంచే వాళ్ళకి ఆ నీచత్వం సంక్రమిస్తుందనీ.

ఎందుకంటే, ఆ రోజు, మే 18 న గ్వాంగ్ జూ మీద సైనిక దళాలు విరుచుకుపడ్డరోజు, ఆ ప్రొవిన్షియల్ భవనం దగ్గర రక్షకవలయంగా నిలబడ్డ సివిలియన్ మిలిషియా తమ చేతుల్లో తుపాకులున్నప్పటికీ కాల్పులు జరపలేదు. వాళ్ళు గాని ఆ రాత్రి కాల్పులు జరిపి ఉండే ఆ సైనిక మూకలు గ్వాంగ్ జూ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసేసి ఉండేవనే రచయిత్రి అంటుంది.

ఇదే. ఇదే ఆమెని పదే పదే వెన్నాడుతూ వస్తున్న అంశం. మనుషులుగా రాక్షసులుగా ప్రవర్తించగల మనం, ప్రవర్తిస్తున్న మనం, ప్రవర్తించాలనుకుంటున్న మనం, అపారమైన మానవాతీత సంయమనాన్నీ, ఆత్మౌన్నత్యాన్నీ కూడా చూపగలం, చూపగలుగుతున్నాం కూడా. ఎక్కణ్ణుంచి వస్తున్నది ఈ శక్తి మనుషులకి? దీన్ని అన్వేషించడంకోసమే ఆమె రచనలు చెయ్యడం మొదలుపెట్టిందని మనకు తెలుస్తున్నది.

మార్చి 2016 లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా అంటున్నది:

మనుషులు ఒకరిపట్ల మరొకరు అటువంటి పనులకి ఎలా పాల్పడగలరు? కాని ఈ ప్రశ్న అడిగినవెంటనే మరొక ప్రశ్న కూడా తలెత్తకుండా ఉండదు: అటువంటి హింస ఎదట మనం ఏమన్నా చెయ్యగలమా? రక్తదాతల కోసం పిలుపునివ్వగానే హాస్పటళ్ళముందు అంతులేకుండా క్యూకట్టిన మనుషుల ఫొటో ఒకటి ఇప్పటికీ నా కళ్ళముందు కదలాడుతూనే ఉంది. హింసకు గురైన తోటిమనుషులకి రక్తదానం చెయ్యడంకోసం ఎందరో సాధారణపౌరులు తమ భద్రతనీ, తమ ఇళ్ళనీ పక్కనపెట్టి కూడా ముందుకొచ్చిన దృశ్యం. గ్వాంగ్ జూ కమ్యూన్ లో పదిరోజుల పౌరపాలనకి ముగింపు పలుకుతూ మార్షల్ లా సైన్యాలు ప్రొవిన్షియల్ ఆఫీసుని తిరిగి చుట్టుముట్టినప్పుడు- అంతకు ముందు కొన్నిదినాల కిందటిదాకా మామూలు పౌరులుగా ఉన్నవాళ్ళు- ఆ రోజు తమ ప్రాణాలకు కూడా తెగించి ఆ సైన్యాల్ని ధిక్కరిస్తూ నిలబడ్డారు. అది కూడా ఆ ఫోటో బుక్ లో రికార్డయ్యింది. అలా చూసినప్పుడు నేనొక రెండు చిక్కుప్రశ్నలముందు నిలబడ్డానని చెప్పవచ్చు. ఒకటి మానవహింసాప్రవృత్తి, మరొకటి ఏం చేసైనాసరే మనుషులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలన్న తెగువ. ఆ రెండు దృశ్యాలూ నా హృదయం మీద అచ్చొత్తినట్టుగా ముద్రపడిపోయాయి. జవాబు లేని ఈ రెండు చిక్కుప్రశ్నల్నీ ఎలా నిభాయించుకోవాలో తెలియని నా తొట్రుపాటునే Human Acts నవల.

(పూర్తిపాఠం చదవాలనుకున్నవాళ్ళు ఈ లింక్ చూడవచ్చు: https://www.thewhitereview.org/feature/interview-with-han-kang/)

4

గ్వాంగ్ జూ నరమేధం జరిగినప్పటికి హన్ కాంగ్ చిన్నపిల్ల. ఏడేళ్ళ పిల్ల అనుకుంటాను. కాని ఆ తర్వాత ఆమెకి ఆ సంఘటన గురించి చదివి, అర్థం చేసుకునే వయసు వచ్చినప్పణ్ణుంచీ, ఆమె హృదయం ఆ సంఘటనకి ఒక శాశ్వత రంగభూమిగా మారిపోయింది. ఆ trauma ఆమెని వదల్లేదు. అది కలలుగా, నాసియాగా, ఏమి చేసినా తప్పించుకోలేని ఒక అపరాధభావంగా మారిపోయింది. ఏం చేస్తే మనుషులు ఈ హింస నుంచి, ఈ హింసాప్రవృత్తినుంచి, ఈ రక్తదాహం నుంచి బయటపడతారు?

బహుశా మనం మనుషులుగా కాకుండా, ఉదాహరణకి చెట్లుగా మారిపోతే? మొక్కలుగా మారిపోతే? మరొక మనిషిని హింసించి లేదా మరొక ప్రాణిని వధించి ఆ తిండి తిని బతికే బదులు నేరుగా సూర్యకాంతినే స్వీకరిస్తూ బతగ్గలిగితే?

ఈ ఊహ ఆమెను వెన్నాడింది. ఆమె Human Acts నవల రాయకముందే, 1997 లో The Fruit of my Woman అనే ఒక కథ రాసింది. ఆ కథలో ఒక స్త్రీ తన దేహం మీద ఆకుపచ్చని మరకలు గమనిస్తుంది. ఆమె నెమ్మదిగా ఒక మొక్కగా మారిపోతుంది. ఆమె భర్త ఆమెని ఒక కుండీలో ఉంచి బాల్కనీలో పెట్టి రోజూ నీళ్ళు పోయడం మొదలుపెడతాడు. హేమంతకాలం రాగానే ఆ మొక్క ఒక ఫలాన్ని ప్రసవించి నెమ్మదిగా వాడిపోతుంది.

కాని ఈ కథతో ఆమె ఆలోచన ఆగిపోలేదు. పదేళ్ల తరువాత ఆమె ఈ ఆలోచననే మరింత విస్తరించి The Vegetarian అనే నవలగా రాసింది. ఈ నవల మూడు భాగాల ఒక ట్రిప్టిచ్. అందులో మొదటి భాగం The Vegetarian లో ఈ కథాంశమే మరింత వివరంగా చిత్రితమయ్యిందిగాని, మరొక కొత్త అంశం ఈ కథలో వచ్చి చేరింది. అదేమంటే, హింస. మనుషుల ఇష్టాయిష్టాలమీద జరిగే హింస. నా వరకూ నాకు, Human Acts చదివాక గానీ, ఈ నవలలోని కీలకపార్శ్వం అర్థం కాలేదు.

అదేమిటో నాకు నేను స్పష్టం చేసుకోడానికి నాకు కొంత సమయం పట్టింది. Human Acts నవలలో గ్వాంగ్ జూ పౌరులపైన, విద్యార్థుల పైన మార్షల్ లా సైన్యం చేసిన అత్యాచారాల గురించి, పెట్టిన చిత్రహింసల గురించీ రచయిత్రి రాసిందని చెప్పాను కదా. ఆ అత్యాచారాలకీ, ఆ నరమేధానికీ పాల్పడ్డ సైనికులూ, సైనికాధికారులూ కూడా దక్షిణా కొరియా ప్రజలే కదా, పౌరులే కదా. వారు తమ అక్కచెల్లెళ్ళ పట్ల, తమ అన్నదమ్ముల పట్లనే కదా అంత క్రూరత్వాన్ని చూపించింది. అదే సైనికులు లేదా ఆ పౌర, మిలటరీ అధికారులు తమ తమ కుటుంబాల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు?

ఆ ప్రశ్నకి జవాబు బహుశా ఈ నవలలో కనిపిస్తుంది. ఇందులో మాంసాహారాన్ని త్యజించి పూర్తి శాకాహారిగా మారాలనుకున్న యెవోంగ్-హ్యే తండ్రి ఒక సైనికాధికారి. వియత్నాం యుద్ధంలో ముప్ఫై మంది వియత్కాంగ్ గెరిల్లాల్ని ఒంటిచేత్తో మట్టుపెట్టానని చెప్పుకోవడం అతడికి తీరిక సమయపు వ్యాపకం. తన చిన్న కూతురుకి పద్ధెనిమిదేళ్ళ వయసు వచ్చేదాకా కూడా అతడు ఆమెని క్రమశిక్షణలో ఉంచడానికి కొడుతూనే ఉండేవాడు. తన చిన్న కూతురు శాకాహారిగా మారిందనీ, ఆమె భర్త చెప్పినా వినలేదనీ, తనే ఆమెకి హితవు చెప్పడానికి ఇంటికి వచ్చినవాడు, ఆమెని మాంసాహారం తినమనీ, తాను చెప్తున్నాడు కాబట్టి తినమనీ అడుగుతాడు. అయినా తన కూతురు వినకపోడంతో ఆమెని కొట్టి మరీ మాంసాహారం బలవంతంగా ఆమె నోట్లో కుక్కుతాడు. ఆ హింసని, ఆ దాడిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంది. ఆమెని హాస్పటల్లో చేర్చడంతో మొదటి భాగం ముగుస్తుంది.

కాని ఇక్కడ గమనించవలసింది మాంసాహారం, శాకాహారాల సంగతి కాదు. తోటిమనిషిని చిత్రహింసపెట్టే సైనికుడు తన కుటుంబం పట్ల కూడా అదే ప్రవృత్తిని చూపిస్తాడు. అంటే అతడిలో పితృస్వామ్యం కూతురి పట్ల ప్రేమని చూపించే క్రమంలో ఆమెని హింసిస్తుంది, రాజు పట్ల విధేయత చూపించే క్రమంలో తన పౌరుల్ని చిత్రవధకి గురిచేస్తుంది. రెండు సందర్భాల్లో కూడా తాను హింసకి పాల్పడుతున్నానని ఆ పితృస్వామ్యం అనుకోదు. తాను వాళ్ళ మంచికోరే చెప్తున్నప్పటికీ వాళ్ళెందుకు వినిపించుకోవట్లేదనే అనుకుంటుంది, ఆగ్రహిస్తుంది, నరకం చూపిస్తుంది. The Vegetarian నవలని సమీక్షించిన వారెవరూ ఈ అంశంలో ఈ నవల చదివినట్టుగా నాకు అనిపించలేదు.

The Vegetarian నవలలోని రెండవ భాగం Mongolian Mark చాలా చాలా సున్నితమైన రచన. మనుషులు తమ దేహాల్లోని జంతులక్షణం నుంచి బయటపడటానికి పువ్వులుగా, లతలుగా, సీతాకోక చిలుకలుగా మారాలనుకోడానికి సంబంధించిన కథ అది. అటువంటి ప్రయత్నం చేసే ఏ మనిషినైనా లేదా ఏ ఇద్దరు మనుషుల్నేనా ప్రపంచం పిచ్చివాళ్ళుగా జమకట్టడం సహజమే కాబట్టి, చివరి భాగం Flaming Trees మొత్తం పిచ్చాసుపత్రి చుట్టూ నడుస్తుంది.

కాని చివరి భాగానికి కూడా మరో పార్శ్వం ఉంది. ఆ భాగాన్ని రచయిత్రి హెవోంగ్-హ్యె అక్క ఇన్-హ్యే ద్వారా చెప్పిస్తుంది. ఈ ఇన్-హ్యే తన చెల్లెల్ని కాపాడుకోడం కోసం చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. కాని ఆమె ద్వారా హాన్ కాంగ్ తాను పుట్టక ముందే మరణించిన తన అక్కని మనముందుకు తీసుకొస్తున్నదా అనే అనుమానం కలక్కుండా ఉండదు. మరొక పార్శ్వం కూడా ఉంది. మనిషి జీవితం వదిలిపెట్టి, ఈ హింసాచక్రం నుంచి బయటపడి ఒక మొక్కగా మారిపోవాలనుకుంటున్న తన చెల్లెల్ని చూసి ఆ అక్క అనుకుంటుంది: తాను తన కుటుంబానికీ, తన తల్లిదండ్రులకీ, ముఖ్యంగా తండ్రికి ఎదురుచెప్పకుండా జీవించడం ఇన్నాళ్ళూ ఒక పరిణతి అనుకుందిగాని, అది నిజానికి పిరికితనం, వట్టి survival tactic మాత్రమేనని.

అంతిమంగా తనచుట్టూ జరిగే హింసని చూస్తూ, దాన్ని ఆపలేక, దాన్ని ఎదిరించలేక, మనిషి చేరుకోగల ఏకైక స్థితి తనని తాను హింసించుకోడమే. ఇదుగో ఇలా అనుకోవడం:

It’s your body, you can treat it however you please. The only area where you’re free to do just as you like.

దీన్నే బైరాగి ఆత్మహననం అన్నాడు. ఒకప్పుడు, నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు, సావిత్రిగారిలో ఈ ప్రవృత్తినే చూసాను. ఎదటిమనుషుల్ని చంపలేక, ఆమె అన్నం తినడం మానేసి, తనని తాను చంపుకోవడం కళ్లారా చూసాను. కాని కుటుంబం, ప్రభుత్వం, రాజ్యం, సమాజం దాన్ని కూడా పడనివ్వవు, కాబట్టే, తర్వాత వాక్యంలో ఇలా అంటున్నది రచయిత్రి:

And even that doesn’t turn out how you wanted.

హన్ కాంగ్ మీద నేను రాసిన వ్యాసం చదివి ఎం.ఎస్.నాయుడు నాకొక మెసేజి పెడుతూ హన్ కాంగ్ ని Kafka of Korea అంటారని రాసాడు. ఆశ్చర్యం లేదు. పలాయనం, కృతకశక్తుల పూజనం చెయ్యలేని నీతిమంతులైన మనుషులకి మిగిలేది ఆత్మహననం ఒక్కటే.

అలాగని హన్ కాంగ్ ని పూర్తి స్థాయిలో కాఫ్కాగా భావించలేం. ఆమె తనని వేధిస్తున్న ప్రశ్నల మీద విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. దీన్ని ఆమె రెండు విధాలుగా సాధించుకునే ప్రయత్నంలో ఉంది. మొదటిది, ఆత్మహననానికి పాల్పడకుండా ఉండటం. హింసనీ, హింస తనలో రేకెత్తిస్తున్న భయభీతినీ ముఖంలో ముఖం పెట్టి చూడటం. 2016లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా అంటున్నది:

Trauma అనేది మనం దాన్నుంచి బయటపడవలసిందో, లేదా నెమ్మదిమీద మాన్చుకోవలిసిందో కాదు. దాన్ని మనం వదులుకోకుండా ఎప్పటికీ హత్తుకుని ఉండవలసిందే.   మరణించినవాళ్ళకి శోకం వల్ల మాత్రమే బతుకు మధ్యలో చోటివ్వగలుగుతాం. అది మనలో ఒక చోటుగా మారిపోతుంది. మౌనంగానూ, భరించలేని బాధతోనూ పదే పదే ఆ చోటుని ఒక జీవితకాలం పాటు పునర్దర్శించడం ద్వారానూ, ఆ జ్ఞాపకాల్ని హత్తుకోవడం ద్వారానూ మాత్రమే మన బతుకుని నిలబెట్టుకోగలుగుతాం.

ఆమె రచనలు చెయ్యడానికీ, చేస్తూ ఉండటానికి ఇదే కారణం. యూరోప్ కి Auschwitz ఎలానో, ఆమెకి గ్వాంగ్-జూ అలా. ఆష్విజ్ తర్వాత కవిత్వాన్ని ఊహించలేమని ఒక భావుకుడు అన్నాడు. కాని అది నిస్సహాయత్వంలోంచి పలికిన మాట. హన్ కాంగ్ దృష్టిలో ఒక ఆష్విజ్, ఒక గ్వాంగ్ జూ సాహిత్యానికి ఒక అర్థాన్నీ, ప్రయోజనాన్నీ సంతరిస్తాయి. వాటిని పదేపదే తలచుకోడం ద్వారా మాత్రమే మరొక ఆష్విజ్, మరొక్ గ్వాంగ్ జూ లు తలెత్తకుండా మానవాళిని కాపాడుకోగలుగుతాం.

ఇక రెండో అంశం, మానవహింస ఎంత యథార్థమైనప్పటికీ, అదొక్కటే సత్యం కాదనే మెలకువ. ఒకవైపు హింసకు పాల్పడుతున్న మానవుడే మరొకవైపు మానవమర్యాదకీ, గౌరవానికీ భంగం వాటిల్లకుండా ఉండటానికి తన ప్రాణాలైనా త్యాగం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. ఇదుగో, ఈ పార్శ్వమే తనకు బతకడానికి స్ఫూర్తినిస్తున్నదని హన్ కాంగ్ అంటున్నది. అదే ఇంటర్వ్యూలో ఆమె చెప్తున్న ఈ మాటలు చూడండి:

నేను Human Acts రాస్తున్న క్రమంలో నాలో అనుభవానికి వచ్చిన మార్పు గురించి కూడా నేను చెప్పవలసి ఉంటుంది. డిసెంబరు 2012 తర్వాత మూడు నెలలపాటు రోజుకి ఎనిమిది తొమ్మిది గంటలపాటు నేను గ్వాంగ్-జూ కి సంబంధించిన అమానుష కృత్యాల పత్రాలు చదువుతూ గడిపేను. అక్కడితో ఆగకుండా ఇరవయ్యవశతాబ్దం పొడుగునా మానవాళి పట్ల జరుపుతూ వచ్చిన క్రూరకృత్యాల గురించి కూడా చదువుతూ వచ్చాను. అవన్నీ చదివే కొద్దీ మానవాళిపట్ల అంతదాకా నాకున్న నమ్మకం నశించిపోతూ వచ్చింది. నేను కుప్పకూలిపోయేను. రాయడం ఇంకెంతమాత్రం సాధ్యం అనిపించలేదు. దాదాపుగా నా రచన పక్కనపెట్టేసాను. అప్పుడు నా చేతికొక డైరీ దొరికింది. గ్వాంగ్ జూ లో ప్రొవిన్షియల్ ఆఫీసులో నిలబడ్డ సివిలియన్ మిలీషియా కి చెందిన ఒక కార్యకర్త రాసుకున్న డైరీ అది. 1980 మే 27 తెల్లవారు జామున అతను మరణించాడు. సున్నితమనస్కుడు, నిశ్శబ్దంగా తనపనేదో తాను చూసుకునే ఇరవై ఏడేళ్ళ పిల్లవాడు. రాత్రి పాఠశాలలో చదువుచెప్పేవాడు.అతడు తన డైరీలో రాసుకున్న వాక్యం ఒక ప్రార్థన లాగా ఉంది. ఆ ఎంట్రీ మొదటివాక్యం ఇలా మొదలవుతుంది. ‘భగవంతుడా! నా మనస్సాక్షి అనే నాలోపలి ఈ భాగమేమిటి నన్నిలా మెలిపెడుతోంది? నాకు బతకాలని ఉంది.’ ఆ వాక్యం చదవగానే నేనప్పటిదాకా చదువుతూ వచ్చిన పత్రాల్లో ఏది చదవలేకపోయానో నాకు అర్థమయింది. అప్పుడు అనుకున్నాను నేను, ఈ నా నవల మానవ దౌష్ట్యంతోనూ, దుర్మార్గంతోనూ, హింసతోనూ మొదలయ్యింది, కానీ ఇది మానవ గౌరవం వైపు సాగవలసి ఉంటుంది అని. అదొక్కటే దారి, ఆ దారిలో ఎంత దూరం వీలైతే అంత దూరం ముందుకు సాగవలసి ఉంటుందని.

ఈ ఒక్క సమాధానానికి ఆమెకి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వవచ్చు. గాంధీ గారు జీవితమంతా చేసింది ఇదే కదా. కానీ ఇప్పుడు మన దేశంలో ఇటువంటి వాక్యాలు రాయగల రచయిత ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే, ఎంతపాటి హింసగానీ, మన సోషల్ మీడియాకి ఒక్కరోజు కంటే ఎక్కువ కాలక్షేపవస్తువు కాదు.

5

ఇటువంటి రచయితల మాటలు చదివినప్పుడు, ఇటువంటి రచనలు చదివినప్పుడు అనివార్యంగా నన్ను నేను ఒక ప్రశ్న వేసుకుంటాను: వాళ్లనుంచి ఒక రచయితగా నువ్వేం నేర్చుకుంటావు అని. కాని హన్ కాంగ్ నుంచి మనిషిగా కూడా మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఎందుకంటే, నిన్న, ఆమె తండ్రి, తాను కూడా గొప్ప రచయిత అట, తన కుమార్తె ఈ పురస్కారాన్ని పండగ జరుపుకునే మనఃస్థితిలో లేదని చెప్పాడట. ఒకవైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో, మరొకవైపు ఇజ్రాయేలు-పాలస్తీనా యుద్ధంలో మనుషుల పట్ల క్రూరహత్యాకాండ నడుస్తూ ఉండగా తాను ఈ పురస్కారానికి తన సంతోషాన్ని చాటుకునే మనఃస్థితిలో లేదని అన్నాడట ఆయన. జీవితానికీ, సాహిత్యానికీ మధ్య గీతలు గీసుకోని మనుషులు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట కనీసం ఒక్కరేనా ఉన్నారన్నదే గొప్ప ఓదార్పు నాకు.

13-10-2024

12 Replies to “కొత్త యుగం రచయిత్రి-2”

  1. I got goosebumps reading this part. మీ గమనింపులు, మరీ ముఖ్యంగా అందుబాటులో ఉన్న అన్ని ఇంటర్వ్యూ లా నుండి ఆమె హృదయాన్ని పట్టి ఇచ్చే ఈ మాటలు…ఆమె కి ఈ రోజే మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాను.

    మీకు మనస్ఫూర్తిగా థాంక్స్.

  2. జీవితానికీ, సాహిత్యానికీ మధ్య గీతలు గీసుకోని మనుషులు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట కనీసం ఒక్కరేనా ఉన్నారన్నదే గొప్ప ఓదార్పు నాకు.

    💐🙇🏻‍♂️
    జీవితానికీ , సాహిత్యానికీ మధ్య గీతలు గీసుకోని మనిషిని నేను సశరీరంతో చూశాను
    కలిశాను మాట్లాడాను
    నాకు మీరు తప్ప అలా ఎవరూ ఎదురుపడలేదు

  3. ఇంత మంచి సాహిత్య నిధిని అందించినందుకు మీకు. 🙏ఏది చూసినా Two Faces of the coin అనిపిస్తుంది. ఉత్తమ విలన్ లాగా. British సైన్యంలొ ఉన్న మన భారతీయ సైనికులు తోటి భారతీయుల్నె చంపారు. బ్రిటిష్ వారి ఉప్పు తింటున్నామని.శాంతి స్థాపించాలన్నా యుద్దం చేయాల్సిందే!! Human psychology is very complicated. ‘Schindler’s List’ movie in Prime snd zee 5 లొ ఉంది. చూశారా. రెండవ ప్రపంచ యుద్దానికి సంబంధించినది. ధన్యవాదాలు మీకు 🙏.

  4. ‘జీవితానికీ, సాహిత్యానికీ మధ్య గీతలు గీసుకోని మనుషులు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట కనీసం ఒక్కరేనా ఉన్నారన్నదే గొప్ప ఓదార్పు’ thank you sir

  5. 1980 మే 27 న మరణించిన సివిలియన్ మిలీషియా కి చెందిన యువకుడు వ్రాసుకున్నట్లు, మీ సమీక్ష, చదువరుల మనస్సాక్షిని మెలిబెట్టేది. ఈ దారుణ మానవ హననం సమీప భవిష్యత్తులో సమాప్తమయేలా కనబడటంలేదు. నేతల రాజ్యకాంక్ష మాత్రమే కాదు-వారిలో, వారి ఆదేశాలు పాటించే అధికారుల్లో, పోలీసుల్లో, సైనికుల్లో నిగూఢంగా వుండే పైశాచిక, పాశవిక ప్రవృత్తి కూడా బహిర్గతమవుతుందని నేను అనుకుంటాను.

  6. బహుశా మనం మనుషులుగా కాకుండా, ఉదాహరణకి చెట్లుగా మారిపోతే? మొక్కలుగా మారిపోతే? మరొక మనిషిని హింసించి లేదా మరొక ప్రాణిని వధించి ఆ తిండి తిని బతికే బదులు నేరుగా సూర్యకాంతినే స్వీకరిస్తూ బతగ్గలిగితే?

    మరణించినవాళ్ళకి శోకం వల్ల మాత్రమే బతుకు మధ్యలో చోటివ్వగలుగుతాం. అది మనలో ఒక చోటుగా మారిపోతుంది. మౌనంగానూ, భరించలేని బాధతోనూ పదే పదే ఆ చోటుని ఒక జీవితకాలం పాటు పునర్దర్శించడం ద్వారానూ, ఆ జ్ఞాపకాల్ని హత్తుకోవడం ద్వారానూ మాత్రమే మన బతుకుని నిలబెట్టుకోగలుగుతాం.

    భగవంతుడా! నా మనస్సాక్షి అనే నాలోపలి ఈ భాగమేమిటి నన్నిలా మెలిపెడుతోంది? నాకు బతకాలని ఉంది.’ ఆ వాక్యం చదవగానే నేనప్పటిదాకా చదువుతూ వచ్చిన పత్రాల్లో ఏది చదవలేకపోయానో నాకు అర్థమయింది. అప్పుడు అనుకున్నాను నేను, ఈ నా నవల మానవ దౌష్ట్యంతోనూ, దుర్మార్గంతోనూ, హింసతోనూ మొదలయ్యింది, కానీ ఇది మానవ గౌరవం వైపు సాగవలసి ఉంటుంది అని. అదొక్కటే దారి, ఆ దారిలో ఎంత దూరం వీలైతే అంత దూరం ముందుకు సాగవలసి ఉంటుందని.
    ఈ ఒక్క సమాధానానికి ఆమెకి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వవచ్చు. గాంధీ గారు జీవితమంతా చేసింది ఇదే కదా. కానీ ఇప్పుడు మన దేశంలో ఇటువంటి వాక్యాలు రాయగల రచయిత ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే, ఎంతపాటి హింసగానీ, మన సోషల్ మీడియాకి ఒక్కరోజు కంటే ఎక్కువ కాలక్షేపవస్తువు కాదు.

    జీవితానికీ, సాహిత్యానికీ మధ్య గీతలు గీసుకోని మనుషులు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట కనీసం ఒక్కరేనా ఉన్నారన్నదే గొప్ప ఓదార్పు నాకు.

    ఎన్ని చెప్పినా నేను మీ ముగింపు వాక్యం కోసం ఎడారిలో అలమటిస్తున్న దాహార్తి కి ఒక్క నీటి చుక్కలా ఎదురుచూస్తాను.
    నమోనమః

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading