
మనుషులు ప్రాయికంగా క్రూరులనే మాట నిజమేనా? మనం ఒక జీవజాతిగా ఒకరితో ఒకరం పంచుకోగలిగేది క్రూరత్వం తాలూకు అనుభవమేనా? మానవ మర్యాదగా మనం పిలుచుకునేది కేవలం మనల్ని మనం మభ్యపెట్టుకోవడమేనా? మనలో ప్రతి ఒక్కరం ఒక క్రిమిస్థాయికి, ఆకలి అణచుకోలేని మృగాల స్థాయికి, వట్టి మాంసం ముద్దల స్థాయికి మనల్ని మనం దిగజార్చుకోగలమనే ఒకే ఒక్క సత్యానికి ఎదటపడకుండా ముఖం చాటేయడమేనా? అత్యంత హీనస్థాయికి దిగజారడం, పరస్పరం నాశనం చేసుకోడం, ఒకరినొకరు వధించుకోడం-ఇదేనా మానవాళికి దక్కిన విధి? ఇదేనా చరిత్ర అనివార్యమంటూ ఘోషిస్తున్నది?
Human Acts, పే.56
95 పేజీల నవల. నవల అనడానికి కూడా లేదు. కాని నాకైతే ఎంతకీ ముగియబోని వేలపేజీల ఒక విషాదగ్రంథాన్ని చదువుతున్నట్టుగా అనిపించింది. ఏదో ఒక జైలు రికార్డు లేదా ఒక అణుబాంబు పడి ఒక నగరమంతా తుడిచిపెట్టుకుపోయాక, ఆ ధూళిని తీసుకొచ్చి గంటల తరబడి, రోజుల తరబడి పరిశీలిస్తూ, అందులో మామూలు నేత్రాలకు కనిపించని ఒక కన్నీటి తడిని ఓపిగ్గా గుర్తుపట్టడం లాగా ఉంది. ఒక నవల చదవడం మానసికంగా ఇంత అలసట కలగచెయ్యగలదని నేను ఊహించలేదు. ఒక్కొక్కపేజీ చదువుకుంటూ పోతూ, ఇంకా ఎన్ని పేజీలు మిగిలి ఉన్నాయా అని చూస్తూ ఉంటే, నేను నా దుర్బల దేహంతో ఎక్కలేని ఒక కొండ, కాని ఎలాగేనా రోజు గడిచేలోపు ఎక్కి తీరాలని నాకై నేను విధించుకున్న ఒక బాధ్యతకొద్దీ, అతి కష్టం మీద ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ, ఆయాసపడుతూ, రొప్పుతూ, ఆగుతూ, కాని ఆగలేక, మళ్ళా ఎక్కడం మొదలుపెడుతూ- ఈ పుస్తకం చదవడం నాకు కలిగించిన అలసట ఒట్టి మానసికమే కాదు, శారీరికం కూడా అని అర్థమయ్యింది ఇప్పటికి.
Human Acts (2014) దక్షిణ కొరియా రచయిత్రి హన్ కాంగ్ రాసిన నవల. మొన్న ఆమెకి నోబెల్ కమిటీ 2024 సంవత్సరానికి గాను సాహిత్యానికి నోబెల్ బహుమతి ప్రకటించింది. ఆమె పేరు నిన్నటిదాకా నేను వినలేదు. కానీ, గత కొన్నేళ్ళుగా ప్రతి సారీ నోబెల్ కమిటీ ప్రపంచాన్ని నిర్ఘాంతపరుస్తూనే ఉందనీ, ప్రతి ఏడాదీ సాహిత్యానికీ నోబెల్ బహుమతి తప్పకుండా ఫలానా రచయితలకి రాబోతోందని బెట్టింగ్ చేసే వాళ్ళమీద తనదే పైచేయి అని నిరూపించుకుంటూనే ఉంది కాబట్టి, ఈసారి కూడా మరొక కొత్త రచయిత్రికి ప్రకటించారనే అనుకున్నాను నిన్న.
కానీ ఆమె రచనల్లో మూడు నవలలు Vegetarian (2007), The White Book (2017), Human Acts (2014) చదివేక అర్థమయింది నాకు, ఆమె మామూలు రచయిత్రి కాదనీ, ఆమె ఒక దేశానికీ, ఒక దేశచరిత్రకీ మాత్రమే ప్రతినిధి కాదనీ, ప్రపంచంలో ఏ మూల ఏ పాఠకుడు తన పుస్తకాలు చేతుల్లోకి తీసుకున్నా అతణ్ణి లోపలనుంచీ కుదిపెయ్యగల శక్తి ఏదో ఆమె అనుభవాలకీ, ఆలోచనలకీ, భావనలకీ, పర్యావలోకనానికీ ఉందని అర్థమయింది. తన తక్కిన వ్యాపకాలన్నిటినీ, భ్రమలన్నిటినీ పక్కనపెట్టి అతడు కొంతసేపేనా తన అంతరంగం ఎదట ముఖాముఖి నిలబడ్డేట్టు చేసే ఒక దివ్యనిర్బంధం ఏదో ఆమెకి చాతనవునని అనిపించింది.
2
గత కొన్నేళ్ళుగా మన ప్రభుత్వాలు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి పరుగులుపెడుతూ తరచూ ఉదాహరించే దేశాల్లో దక్షిణ కొరియా పేరు వినబడుతూ ఉంది. ఉత్తర కొరియా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అంటిపెట్టుకుని పాశవిక నియంతృత్వ రాజ్యంగా మారి అణ్వాయుధాలతో ప్రపంచాన్ని భయపెడుతూ ఉండగా, దక్షిణ కొరియా పెట్టుబడిదారీ విధానాల్ని అనుసరించి పెద్ద పెద్ద అంగల్తో అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించిందని చాలా సమావేశాల్లో ఎవరెవరో చెప్తూండగా విన్నాను. అది ఒక చరిత్ర. పెట్టుబడిదారులూ, వారి మీడియా రాసే చరిత్ర. కానీ ‘ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథల్ని’ తవ్వితీసి నిజమైన చరిత్రని చెప్పే బాధ్యత రచయితలది. కానీ అన్నిసార్లూ, అందరూ రచయితలూ ఆ పని చెయ్యలేరు. దానికి సాహసం, విషయపరిజ్ఞానం మాత్రమే కాదు, అన్నిటికన్నా ముందు, తన ప్రజలు నిశ్శబ్దంగా అనుభవించిన trauma ని తిరిగి తాను అనుభవించకుండా ఉండలేని సున్నిత హృదయం ఉండాలి. తనకి తెలిసిన సత్యాలు, వాస్తవాలు, విన్నవీ, కన్నవీ తనకు నిద్రపట్టకుండా nightmares గా తనని వేధిస్తుంటే నిలవలేకుండా అల్లల్లాడిపోయే మనసు ఉండాలి. పలికే ప్రతి ఒక్క మాటా తన గుండెని చీల్చుకు రావడమే కాదు, Human Acts నవల్లో డాంగ్-హో అనే పిల్లవాడి సోదరుడు రచయిత్రిని అడిగిన మాటలు, Please, write your book so that no one will ever be able to desecrate my brother’s memory again- ఒక్కటే తనని నడిపించే సూత్రం కాగలగాలి.
సుదీర్ఘ కాలం వలసపాలనలో చిక్కి శల్యమయి రాజకీయ స్వాతంత్య్రం పొందాక కూడా దక్షిణ కొరియా పూర్తి ప్రజాస్వామ్యంగా మారడానికి చాలా ఏళ్ళే పట్టింది. 1960-63 మధ్యకాలంలో కొరియాలో ఏర్పడ్డ రెండో రిపబ్లిక్ ని 1961 లో పార్క్ చుంగ్ హీ అనే సైనికాధికారి కూలదోసి అధికారం హస్తగతం చేసుకున్నాడు. అతను 1963-72 మధ్యకాలంలో మూడో రిపబ్లిక్ ని ఏర్పాటు చేసి దక్షిణ కొరియాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి పరుగులు పెట్టించాడు. అతడి పాలన మొదట్లో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టే కనిపించింది. ప్రజల జీవనప్రమాణాలు కూడా మెరుగయ్యాయి. అలా రెండు సార్లు అతడు దక్షిణా కొరియా అధ్యక్షుడిగా పనిచేసాడు. అయితే రాజ్యాంగ పరంగా ఏ ప్రభుత్వమేనా రెండు సార్లకు మించి అధికారంలో ఉండే అవకాశం లేకపోవడంతో తాను మళ్ళా మూడో సారి అధికారంలోకి రావడానికి వీలుగా 1969 లో రాజ్యాంగాన్ని సవరించి ఎన్నికలు జరిపి 1971 లో మళ్ళా అధ్యక్షుడయ్యాడు. కాని ఆ రాజ్యాంగ సవరణని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలిపారు. పాలమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలకి మెజారిటీ లభించింది. దాంతో పార్క్ హీ 1971 లో ఎమర్జన్సీ ప్రకటించాడు. 1972 లో కొత్త రాజ్యాంగానికి అనుగుణంగా నాలుగో రిపబ్లిక్ ఏర్పాటయ్యింది. కానీ ఒకవైపు పార్క్ హీ కి వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. మరోవేపు అభివృద్ధి కూడా ఆగలేదు. ఈ పరిస్థితుల్లో 1979 లో ఒక ఇంటలిజెన్స్ అధికారి పార్క్ హీని హత్యచేసాడు. ఆ ఆకస్మిక సంఘటనలమధ్య జున్ దువాన్ అనే సైనికాధికారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. 1988 లో అధికారాన్ని వదులుకునేదాకా అతడు దక్షిణా కొరియాకి నిజమైన నియంత అంటే ఎలా ఉంటాడో చూపించాడు. అతడికి ఒక విధంగా పార్క్ హీ గురువు. అధికారాన్ని హస్తగతం చేసుకోడానికీ, చేజిక్కించుకున్న అధికారాన్ని ఎలాగేనా నిలబెట్టుకోడానికీ ఒక రాజ్యాధినేత ఎంతకు తెగించవచ్చో పార్క్ హీ ఒక దారి చూపిస్తే, జున్ దువాన్ ఆ దారిలో కడదాకా ప్రయాణించాడు.
పార్క్ హీ కాలం నుంచే కొరియా అభివృద్ధి చెందుతూ వున్నప్పటికీ ఆ అభివృద్ధికి ప్రజలు రెండు రూపాల్లో మూల్యం చెల్లించుకుంటూ వచ్చారు. ఒకటి, తమ హక్కుల్ని పూర్తిగా రాజ్యాధినేతకి తాకట్టుపెట్టడం, రెండోది, చాలీచాలని కనీసవేతనాలమధ్యనే అమానుషమైన వర్కింగ కండిషన్స్ లో పనిచేయవలసి రావడం. ఈ రెండింటినీ ధిక్కరిస్తూ ప్రజలు చేస్తూ వచ్చిన పోరాటాలకి 1979 లోనే బూసాన్-మాసాన్ తిరుగుబాటు శ్రీకారం చుట్టింది. కాని పార్క్ హీ ఆ తిరుగుబాటుని అత్యంత కర్కశంగా అణచివేసాడు. ఆ తిరుగుబాటురోజుల్లో పార్క్ హీ పక్కనుండే ఒక ఇంటలిజెన్స్ అధికారి అన్నాడట: ‘పక్కనున్న కంబోడియా చూడండి, రెండు లక్షల మందిని చంపేసైనా సరే శాంతి నెలకొల్పింది. మనం కూడా అందుకు ఏ మాత్రం వెనకాడకూడదు’ అని.
పార్క్ హీ హత్య తర్వాత జున్ దువాన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1980 మే 17 న దేశమంతా మార్షల్ లా ప్రకటించాడు. ఆ మార్షల్ లా ని ధిక్కరిస్తూ దక్షిణ కొరియా కి దక్షిణభాగంలో ఉన్న గ్వాంగ్-జూ అనే పట్టణంలో ప్రజలు ప్రజాస్వామికీకరణ కోసం పెద్ద ఎత్తున నిరసన ప్రకటించారు. మార్షల్ లా ప్రకటించిన మర్నాడే అంటే మే 18 ననే గ్వాంగ్-జూ ప్రకటించిన నిరసనకు విద్యార్థులు నాయకత్వం వహించారు. వారిలో ముక్కుపచ్చలారని హైస్కూలు విద్యార్థులు కూడా ఉన్నారు. జున్ హువాన్ వెంటనే ఆ నిరసనని ఉక్కుపాదంతో అణచివెయ్యడానికి మిలటరీని పంపించాడు. ఒక లెక్క ప్రకారం, ఆ మిలటరీకి ఎనిమిది లక్షల తూటాలు అందించి మరీ పంపించాడట. ఇంతాచేస్తే ఆ రోజుకి ఆ పట్టణ జనాభా నాలుగు లక్షలు మాత్రమే! అంటే ప్రతి ఒక్క పౌరుణ్ణీ రెండుసార్లు చంపగలిగేటంత ఆయుధసామగ్రితో సైనికులు ఆ పట్టణంలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత అక్కడ ఏమి జరిగిందనేది 1987 దాకా బయటి ప్రపంచానికి తెలీదు. కానీ ఆ విషయాలు నెమ్మదిగా తెలియవస్తున్న కొద్దీ, మే 18 1980 న గ్వాంగ్- జూ పట్టణంలో చరిత్ర ఎరగని నరమేధం జరిగిందని తెలుస్తూ ఉంది. నరమేధం అంటే చంపుకుంటూ పోవడమే కాదు, ఊహించని తీరులో అత్యంత పాశవికంగా, క్రూరంగా, భయానకంగా, నిర్దయాత్మకంగా చిత్రహింసలు పెట్టడం. తిరిగి మళ్ళా మనిషన్నవాడు రాజ్యానికి వ్యతిరేకంగా గళం ఎత్తడం కాదు, పిడికిలి బిగించాలన్న తలపు కలగడానికి కూడా వణికిపొయ్యేటట్టు చెయ్యాలన్నది జున్ దువాన్ ఆలోచన. అందుకనే అతడీ రోజు దక్షిణ కొరియా చరిత్రలో The Butcher of Gwangju గా మిగిలిపోయాడు.
1980 మే 18 న అంటే, 5:18 న, ఏమి జరిగిందో చిత్రిస్తో హన్ కాంగ్ Human Acts నవల రాసింది. అంటే 1988 లో సియోల్ లో ఘనంగా ఒలింపిక్స్ నిర్వహించిన దేశంగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన దక్షిణ కొరియాలో 1980 నుంచి 2013 దాకా దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఏమి జరుగుతూ ఉందో హన్ కాంగ్ ఈ నవల్లో ప్రపంచానికి తెలియచెప్పింది. అంటే ఆమె సమకాలిక కొరియా చరిత్రను, ఒక ప్రత్యామ్నాయ చరిత్రకారిణిగా, మనముందు ఉంచిందన్నమాట.
అత్యంత హృదయవిదారకమైన ఈ కథనాన్ని చదువుతున్నంతసేపూ నేను మన చరిత్రలో కూడా ఇటువంటి సంఘటనలు తక్కువేమీ లేవు కదా అని అనుకుంటూనే ఉన్నాను. సీతారామరాజు తిరుగుబాటు చేసినప్పుడు బ్రిటిష్ సైన్యాలు విశాఖపట్టణం మన్యం గిరిజనుల్ని పెట్టిన చిత్రహింసలు, చిట్టగాంగ్ పోరాటం తర్వాత ఈశ్యాన్యప్రాంతపు గిరిజనుల్ని పెట్టిన చిత్రహింసలు, 1969-71 మధ్యకాలంలో శ్రీకాకుళంలో గిరిజనులు తిరుగుబాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు బలగాలు గిరిజనుల్నీ, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన విద్యార్థినాయకుల్నీ పెట్టిన చిత్రహింసలు, ఎమర్జన్సీ రోజుల్లో, చివరికి ఇప్పుడు కూడా కాశ్మీరులో, ఛతీస్ గఢ్ లో సైన్యాలు ప్రజల మీద సాగిస్తున్న దమనకాండ తక్కువేమీ కాదు కదా. కానీ ఒక హాన్ కాంగ్ రచనలో ప్రత్యేకత ఎక్కడ ఉంది?
Human Acts పుస్తకాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన దెబొరా స్మిత్ ఈ పుస్తకానికి ఎంతో విలువైన ముందుమాట కూడా రాసింది. అందులో ఆ ప్రజాస్వామిక ఉద్యమం తాలూకు సంక్లిష్ట నేపథ్యాన్ని చిత్రించడంలో కూడా ఈ నవల అసాధారణంగా ఉందని చెప్తూ తాను జరిగిందాన్ని సూటిగా చెప్పకుండా తన పాత్రల అనుభవాల ద్వారా మాట్లాడించడం ద్వారా హన్ కాంగ్ ఈ కథనం ఒక నిస్సారమైన చరిత్రకథనం కాకుండా చూసుకుంది అంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే రచయిత్రి శైలి, కథనం ఈ నవలను గొప్ప సాహిత్యకృతిగా మార్చేసాయి.
రాజ్యానికీ, రాజ్యహింసకీ వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలనుకున్నప్పుడు రెండు మార్గాలుంటాయి. ఒకటి ప్రత్యక్ష రాజకీయ పోరాటం. ప్రసంగాల ద్వారా, కరపత్రాల ద్వారా, నినాదాల ద్వారా, ఉద్యమాల ద్వారా, ప్రసార సంచాచార సాధనాల ద్వారా చేసేది. కాని సాహిత్యానిది పరోక్ష పోరాటం. అక్కడ వక్తృత్వం, సెంటిమెంటాలిటీ కన్నా కూడా తన వాక్యాల మీద అపారమైన అదుపు ముఖ్యం. బాణాన్ని సూటిగా చెక్కినట్టుగా, తాను పేల్చాలనుకున్న శతఘ్నిలో మందుదట్టంగా కూరినట్టుగా, రచయిత తన కవితలోనో, కథలోనో, నవలలోనో, నాటకంలోనో తన ఆవేదననీ, ఆగ్రహాన్నీ ఎంతో నేర్పుగా కూరిపెట్టాలి. లేకపోతే తన రచన వాచాలత్వంగా, దూషణగా, వట్టి ఊకదంపుడుగా మారిపోతుంది.
మన అంతరంగాన్ని, మనస్సాక్షిని నిలవనివ్వకుండా పట్టికుదిపేసే ఈ రచన వంద పేజీలు కూడా దాటలేదంటే, రచయిత్రి ఎంత ఆత్మసంయమనంతో ఈ రచన చేసిందో మనం గమనించాలి. రెండేళ్ళ కిందటనోబెల్ పురస్కారం పొందిన ఫ్రెంచి రచయిత్రి అన్నె ఎహ్నా లో కూడా ఈ సామర్థ్యమే గమనించాన్నేను. వీళ్ళు కొత్త యుగం రచయిత్రులు. కాబట్టే వీళ్ళకన్న రాశిలోనూ, వాసిలోనూ కూడా గొప్ప సాహిత్యం సృష్టించినప్పటికీ ఒక మార్గరెట్ అట్ వుడ్, ఒక సాల్మన్ రస్డి, ఒక హరూకి మురకామి వంటి వాళ్లింకా నోబెల్ పురస్కారానికి వేచి ఉండకతప్పడం లేదు.
నొబెల్ కమిటీ హన్ కాంగ్ ని ప్రస్తుతిస్తూ ఆమెది కావ్యశైలి అని కూడా అంది. అందులో చాలా నిజముంది. ఎందుకంటే ఈ Human Acts అన్న నవలనే తీసుకోండి, దీన్ని ఈమె ఎనిమిది భాగాలుగా రాసింది. మొదటి ఏడు భాగాలూ ఏడు వాజ్ఞ్మూలాలు. కాని వాటన్నిటినీ ఆమె 1980 నాటి సాక్ష్యాలుగానే చెప్పలేదు. అందులో మొదటి రెండు అనుభవాలు 1980 నాటివి, నాలుగోది 1985 నాటిది, అయిదోది 1990, ఆరోది 2002, ఏడోది 2010, ఇక చివరి వాజ్ఞ్మూలం రచయిత్రిది, 2013 నాటిది. ఈ నిర్మాణ శిల్పాన్ని మన కావ్యభాషలో చెప్పాలంటే ప్రబంధం అనాలి. ఎందుకంటే ఆమె చెప్పాలనుకున్నది 1980 నాటి నరమేధం గురించి మాత్రమే కాదు, ఆ నరమేధాన్ని తట్టుకుని బతికినవాళ్ళు, ఆ survivors తమ విశ్వాసాల్నీ, విలువల్నీ కాపాడుకుంటూ బతకడానికి ఎంత సంక్షోభానికి లోనవుతున్నారో అదంతా కూడా ఆమె చెప్పాలనుకుంది. ఉదాహరణకి మనం ఆటంబాంబు సర్వయివర్స్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ శరీరంలో, చివరికి వాళ్ళ పిల్లల శరీరాల్లో కూడా ఆ మారణకాండ అవశేషాలు తరం నుంచి తరానికి ప్రవహిస్తూనే ఉన్నాయని చెప్పుకుంటాం. హన్ కాంగ్ దృష్టిలో గ్వాంగ్-జూ నరమేధం ఆటంబాబు విధ్వంసానికేమీ తక్కువ కాదు. ఆ భయానక అనుభవం కొరియా చరిత్రనీ, జాతి స్మృతినీ చిరకాలం వెన్నాడుతూనే ఉండక తప్పదని తెలుసు ఆమెకి. నవల చివరి అధ్యాయంలో రచయిత్రి వాజ్ఞ్మూలంలో భాగంగా ఆమె ఇలా రాస్తున్నది:
చిత్రహింసకి గురైన ఒకాయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి చదివాన్నేను. అందులో అతడు ఆ చిత్రహింస అనంతర ప్రభావాలు రేడియోధార్మిక విషధూళికి బలైన వాళ్ళ అనుభవాలకన్నా ఏమీ ప్రత్యేకం కాదని అన్నాడు. రేడియోధార్మిక ధూళి దశాబ్దాల పాటు ఎముకల్లో, కండరాల్లో కొనసాగుతూ క్రొమోజోములమీద కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ రక్తకణాలు కేన్సర్ కణాలుగా మారిపోతాయి. అప్పుడు వాళ్ళ ప్రాణం తనను తనే తినేయడం మొదలుపెడుతుంది. ఆ అభాగ్యులు మరణించినా కూడా, వాళ్ళ మృతదేహాల్ని తగలబెట్టినా కూడా, చివరికి కాలిన మసిబొగ్గు తప్ప మరేమీ మిగలకపోయినా కూడా, ఆ రేడియో ధార్మిక పదార్థం నశించదు.
2009 లో జనవరిలో సెంట్రల్ సియోల్ లో నిరసన ప్రకటిస్తున్న పౌరులమీద పోలీసులు విరుచుకుపడి ఆరుగుర్ని కాల్చి చంపినప్పుడు, ఆ అర్థరాత్రి నేను టెలివిజన్ కి అతుక్కుపోయి మరీ ఆ మండుతున్న భవనాల్నే చూస్తో ఉండిపోయేను. ఆ క్షణాన ఆశ్చర్యంగా నా నోటివెంట ‘కాని అది గ్వాంగ్ జూ కదా’ అనే మాటలు వెలువడ్డాయి. మరో మాటలో చెప్పాలంటే ఎవర్నేనా బలవంతంగా ఖాళీచేసిన ప్రతి చోటా, మనుషుల్ని దారుణంగా హింసిస్తున్న ప్రతి స్థలానికీ, ఇక సరిదిద్దలేని విధంగా జీవితాన్ని చిదిమేసిన ప్రతి చోటుకీ గ్వాంగ్ జూ ఒక పర్యాయపదంగా మారిపోయింది. ఆ రేడియో ధార్మిక ధూళి వ్యాప్తి ఆగడం లేదు. మళ్ళా మరొక సారి వధించడానికే గ్వాంగ్ జూ తిరిగి పుట్టినట్లుగా కనిపిస్తున్నది. ఆ పట్టణాన్ని నేలమట్టం చేసేసారు. అయినా అది తిరిగి మళ్ళా నెత్తుటిమధ్యనే ప్రాణంపోసుకుంటున్నది.
3

హన్ కాంగ్ రాసిన మరొక పుస్తకం The White Book కూడా ఇటువంటి మరొక గ్వాంగ్ జూ గురించిన చిత్రణనే. (నాయుడూ! ఈ పుస్తకం నాకు వెంటనే పంపినందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే).
ఇందులో కథకురాలు ఒక యూరపియన్ దేశంలో ఒక పట్టణంలో కొన్నాళ్ళు ఉండటానికి వెళ్ళింది. ఆ దేశం పేరు మనకి ఆమె ఆ పుస్తకంలో చెప్పలేదు కానీ అది వార్సా నగరం అని మనం ఊహించవచ్చు. హిట్లర్ కాలంలో ఆ నగరం నాజీ సైన్యాల్ని తరిమేసి నాలుగురోజులు ప్రజాస్వామిక పాలన నడుపుకుంది. దాన్ని హిట్లర్ భరించలేకపోయాడు. ఆ నగరాన్ని నేలమట్టం చెయ్యమని తన సైన్యాల్ని పంపించాడు. వాళ్ళు ఆ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసారు. ఆ శిథిలాలమీద దట్టంగా పేరుకున్న తెల్లని మంచు చూడగానే రచయిత్రి తన జీవితంలో తనకి ఎక్కడెక్కడ తెల్లటి జ్ఞాపకాలున్నాయో అవన్నీ ఒక జాబితా రాసుకుంది. ఆ జాబితాలోని ప్రతి ఒక్క శ్వేతస్మృతినీ వివరించడం మొదలుపెట్టింది. అందులో పేర్కొన్నవన్నీ కల్పితమని రచయిత్రి మొదట్లో డిస్క్లెయిమ్ చేసిందిగానీ, సాహిత్యంలో సత్యం తప్ప అబద్ధం ఉండదు. ఒకవేళ అసత్యాన్నే చిత్రించినా అది అంతిమంగా ఏదో ఒక నిగూఢసత్యం పట్ల మన కళ్ళు తెరవడానికే అయి ఉంటుంది.
The White Book ని మనం ఫలానా ప్రక్రియ అని లేబుల్ తగిలించలేం. అది ఒక విధంగా కవిత్వ సంకలనం కూడా. లేదా ఒక ఫొటో ఆల్బం. లేదా ఒక memoir. లేదా కొంగలు, మంచు, ఉప్పు, చంద్రుడు, బియ్యం, కెరటాలు, తెల్లటి జుట్టు, శవ వస్త్రం, పొగ, శ్వేత రాత్రులు వంటి తెల్లటి దృశ్యాలతో కూర్చిన ఒక నిశ్శబ్ద చలన చిత్రం అనుకోవచ్చు.
లేదా ఒక పిన్ కుషన్. రచయిత్రి ముందు తన హృదయానికి గుచ్చుకున్న పిన్నులు మనం ఒక్కో పేజీ తిప్పుకుంటూ పోతున్నప్పుడు మన గుండెకి గుచ్చుకోడం మొదలుపెడతాయి.
ఇందులో కథకురాలు తాను పుట్టడం కన్నా ముందు తన తల్లికి ఒక బిడ్డ పుట్టిందనీ, సకాలంలో వైద్యం అందక ఆ పుట్టిన బిడ్డ పుట్టిన రెండు మూడు గంటల్లోనే మరణించిందనీ చెప్తుంది. ఇక ఆమెకి తెల్లటి వస్తువుల్ని వేటిని చూసినా తాను చూడని తన ఆ అక్కే గుర్తొస్తూ ఉంటుంది. ఆమె బతికి ఉంటే తాను పుట్టి ఉండేది కాదనే ఒక జ్ఞానం కూడా ఆమెని వెంటాడుతూ ఉంటుంది. (నిజానికి ఈ పుస్తకంలో ఆమె ఇదంతా కల్పితం రాసింది కానీ తన బ్లాగులో ఒక ఇంటర్వ్యూలో ఇది నిజమేనని చెప్పుకుంది. నాలుగైదేళ్ళ కిందట నోబెల్ పురస్కారం పొందిన అమెరికన్ కవయిత్రి లూయీ గ్లక్ కవిత్వంలో కూడా ఇదే ప్రధాన ఇతివృత్తం కావడం గమనార్హం.) ఇరవై రెండేళ్ళ వయసులో తన మొదటి బిడ్డను పుట్టిన రోజే పోగొట్టుకున్న తల్లి ఈ పుస్తకంలో మనకి పదే పదే కనిపిస్తూ ఉంటుంది. ఈ కథకీ, గ్వాంగ్-జూ మారణహోమానికీ ఏదో సంబంధం ఉంది. రెండు పుస్తకాల్లోనూ కూడా బిడ్డను పోగొట్టుకున్న తల్లులే ప్రధాన పాత్రలు. వాళ్ళ శోకానికి ప్రతి ఒక్కరూ జవాబుదారులే.
కథకురాలు ఎక్కడికి వెళ్ళనివ్వు, అకాలంగా మరణించిన చిన్నారులు ఆమెని నిద్రపోనివ్వరు. వాళ్ళు తెల్లని నీడలాగా ఆమెని వెంటాడుతూనే ఉంటారు. అదుగో ఆ అనుభవంలోంచి రాసిన రాత ఇలా ఉంటుంది:
మొత్తం తెల్లదనం
నీ కళ్ళతో నేను ఒక తెల్లకాబేజి లోపల్లోపల మిరుమిట్లు గొలిపే చోటు ఒకటి చూస్తాను. దాని హృదయంలో దాగి ఉన్న ఎంతో విలువైన లేతపొరల్ని దర్శిస్తాను.
నీ కళ్ళతో పట్టపగలే ఉదయించిన అర్థచంద్రుడి శీతలత్వాన్ని కనుగొంటాను.
కొంతసేపటికి ఆ కళ్ళు ఒక హిమప్రవాహాన్ని చూస్తాయి. ఆ అపార హిమరాశిని పరికిస్తూ అవి జీవితపు మరక అంటని పవిత్రతని దేన్నో గమనిస్తాయి.
తెల్లటి బిర్చ్ చెట్ల అడవిలోపలి నిశ్శబ్దాన్ని చూస్తాయవి. హేమంతకాలపు సూర్యరశ్మి ప్రసరిస్తున్న కిటికీలోని నిశ్చలత్వపు లోతుల్ని చూస్తాయి. గదిలోపల పైకప్పు మీద వచ్చి వాలుతున్న సూర్యకిరణాలమధ్య మెరుస్తున్న ధూళికణాల్లోకి తొంగిచూస్తాయి.
నువ్వు విడిచిపెట్టిన చివరి ఊపిరిని ఆ తెలుపులో, మొత్తం తెల్లటివాటన్నిటి తెలుపులోనూ, నేను ఆశ్వాసిస్తాను.
12-10-2024


సర్. రచయిత్రి పరిచయానికి ధన్యవాదములు. Intense read. Atrocities and havoc created by (in)humans are gut wrenching.
ధన్యవాదాలు మాధవీ!
అద్భుత పరిచయం సార్. నోబెల్ బహుమతి వచ్చింది అని మీడియా లో చడవటమే తప్ప, ఈ పుస్తకం గురించిన వివరాలు తెలీదు. మీరు బాగా పరిచయం చేసారు. ఈ హ్యూమన్ రైట్స్ పుస్తకాన్ని మీలాంటి వారు తెలుగు లోకి అనువదిస్తే చాలా బాగుంటుంది కదా.
అనువాదానికి అనుమతులు కావలసి ఉంటుంది. అది చాలా పెద్ద ప్రయత్నం.
ఈ రచనలు చదివించినందుకు ధన్యవాదాలు ఈ సాహిత్యం మాచేతికి అందడానికి చాలా సమయమే పట్టేది.
ధన్యవాదాలు
చాలా అద్భుతమైన పరిచయమండీ. నోబెల్ బహుమతి ప్రకటించిన రెండు రోజుల్లో రచయిత్రి Han Kang పుస్తకాలను చదివి, ఇంత చక్కని విశ్లేషణ అందించారు.
ధన్యవాదాలండీ.
కొత్త తరం రచయితలే కాదండీ ఇప్పుడు పిల్లలూ ఇవే చదువుతున్నారు.
సౌత్ కొరియా పాప్ సంగీతం, వాళ్ల భాష ఇప్పుడు వాళ్లకు ఎంతో క్రేజ్.
అవును గార్డియన్ పత్రిక కూడా అదే రాసింది: ప్రస్తుతం దక్షిణ కొరియా ప్రభావం నడుస్తోందని.
మీరు ఇలా ఒక గొప్ప రచయిత్రిని పరిచయం చేయడం నాకెంతో ఉపయోగకరంగా ఉంది గురువుగారు
మీ పాదాలకు నమస్సుమాంజలి 💐🙇🏻♂️
అసలు నేను ఈమె పేరు కూడా వినలేదు
నేనెంత ఆల్పుడో తెలుస్తుంది నాకు
ఈ రచనలు నేను కూడా చదువుతాను
అనువాదాలు ఉంటే మరింత బాగుండేది
ధన్యవాదాలు సోమ భూపాల్!
ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించిన నాటి నుంచి ఆమె రచనల గురించి కూడా నేను సెర్చ్ చేయలేదు. నేను ఊహించినట్టుగానే చిన్న వీరభద్రుడు గారు ఎంతో సమగ్రంగా అద్భుతంగా రాశారు. కావ్య శైలితో ఉండే రచనలను విశ్లేషించటం చాలా కష్టం. అవి ఎక్కువగా అనుభవైక వేద్యాలుగా ఉంటాయి. తెలుగులో ఆమె పుస్తకాలను అనువదించగలిగిన సామర్థ్యం మీకుంది మీ నుండి ఆ అనువాదాలను కూడా ఆశిస్తాము
ధన్యవాదాలు సార్
మంచి విశ్లేషణ సార్. పుస్తకం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్.
amazon.in
మీరేం రాస్తారా అని ఎదురు చూసాను
Thankyou sor
ధన్యవాదాలు సార్
ఒక గ్రంధాన్ని అసాంతం చదివి ఇంత చక్కగా అభిప్రాయ ఆవిష్కరణ చేయచ్చు అనేది అర్థం అవుతోంది. హ్యాట్సాఫ్ సార్ 🌹🌹🌹
ధన్యవాదాలు మేడం
నమస్తే. అప్పట్లో నోబుల్ ప్రైజ్ సాహిత్యనికి వచ్చింది అనగానే సదాశివారావు వైపు చూసే వాణ్ణి. అయన వ్యాసం ఎప్పుడొస్తుందా అని. ఇప్పుడు మీ వైపు చూస్తున్నారు ఎప్పుడు రాస్తారా అని. గొప్ప పరిచయం. అనేక ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
నమస్తే వీరభద్రుడు గారూ, ఎంత హృదయవిదారకమైన నవలలు నోబల్ ప్రశస్తి ని అందుకుంది. ఇది మానవాళి గురించిన చరిత్ర. ఉక్కుహస్తంలాంటి అధికారం ముందు ఏమీచేయలేక బలైపోతున్న మానవాళి చరిత్ర. ఇంత త్వరగ మాకు అందించిన మీకు ధన్యవాదాలు.🙏హృదయం ద్రవించింది.😭
ధన్యవాదాలు మేడం
🙏
అద్భుతమైన పరిచయం సర్🙏
ధన్యవాదాలు
బయట ప్రపంచానికి పెద్దగా తెలియని రచయిత్రి హాన్ కాంగ్, నోబెల్ బహుమతి వచ్చాక, ఎవరీమె అని వెతుకుతున్న సమయంలో మీరు వ్రాసిన పరిచయ వాక్యాలు; దక్షిణ కొరియాలో, జర్మనీలో జరిగిన మారణకాండను వివరించాక, మండు వేసవిలో వర్షం పడి, భూమినుండి ఆవిర్లు తన్నుకొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసినట్లు అనిపించింది. ప్రజల గొంతుక నొక్కటానికి, ఏ ప్రభుత్వమైనా దౌర్జన్యం సమాన స్థాయిలోనే చేస్తుంది. ముందు పేరాలు చదువుతూ, మన శ్రీకాకుళం, మన్యం, ఛత్తిస్గడ్ పోపోరాటాలగురించి వ్రాస్తారా లేదా అని చూసిన నాకు, మీరు నిర్భయంగా ఎత్తిచూపటం సంతోషాన్ని కలుగజేసింది. మొన్నటికి మొన్న సాయిబాబా మరణం కూడా ప్రభుత్వ హత్యే. అలాగే స్టాన్ స్వామి, ఇంకెందరో! ఈ నవలలను తప్పకుండా తెప్పించి చదువుతాను. ధన్యవాదాలు. 🙏🏼
ధన్యవాదాలు సార్
సాహిత్యానిది పరోక్ష పోరాటం. అక్కడ వక్తృత్వం, సెంటిమెంటాలిటీ కన్నా కూడా తన వాక్యాల మీద అపారమైన అదుపు ముఖ్యం. బాణాన్ని సూటిగా చెక్కినట్టుగా, తాను పేల్చాలనుకున్న శతఘ్నిలో మందుదట్టంగా కూరినట్టుగా, రచయిత తన కవితలోనో, కథలోనో, నవలలోనో, నాటకంలోనో తన ఆవేదననీ, ఆగ్రహాన్నీ ఎంతో నేర్పుగా కూరిపెట్టాలి. లేకపోతే తన రచన
నిర్మాణ శిల్పాన్ని మన కావ్యభాషలో చెప్పాలంటే ప్రబంధం అనాలి. ఎందుకంటే ఆమె చెప్పాలనుకున్నది 1980 నాటి నరమేధం గురించి మాత్రమే కాదు, ఆ నరమేధాన్ని తట్టుకుని బతికినవాళ్ళు, ఆ survivors తమ విశ్వాసాల్నీ, విలువల్నీ కాపాడుకుంటూ బతకడానికి ఎంత సంక్షోభానికి లోనవుతున్నారో అదంతా కూడా ఆమె చెప్పాలనుకుంది.
The White Book ని మనం ఫలానా ప్రక్రియ అని లేబుల్ తగిలించలేం. అది ఒక విధంగా కవిత్వ సంకలనం కూడా. లేదా ఒక ఫొటో ఆల్బం. లేదా ఒక memoir. లేదా కొంగలు, మంచు, ఉప్పు, చంద్రుడు, బియ్యం, కెరటాలు, తెల్లటి జుట్టు, శవ వస్త్రం, పొగ, శ్వేత రాత్రులు వంటి తెల్లటి దృశ్యాలతో కూర్చిన ఒక నిశ్శబ్ద చలన చిత్రం అనుకోవచ్చు.
నువ్వు విడిచిపెట్టిన చివరి ఊపిరిని ఆ తెలుపులో, మొత్తం తెల్లటివాటన్నిటి తెలుపులోనూ, నేను ఆశ్వాసిస్తాను.
ఇది చదవడానికి నాకు మూడు రోజులు పట్టింది.
తెలుపులో అశ్వాసిస్తాను అనే మాటల దగ్గర నా చూపు నిలిచిపోయింది.
ఇన్ని గొప్ప సంగతుల్ని మాకు చెప్తున్నందుకు ప్రతిగా మేమేమి ఇవ్వలేము. హృదయ పూర్వక అంజలులు తమకు.
ఇప్పటికైనా నాకు చదివే అదృష్టం లభించింది. జోహార్లు
ధన్యవాదాలు