
పాతనిబంధనలోని కీర్తనలు యూదులకీ, క్రైస్తవులకీ కూడా సమానంగా స్ఫూర్తి, ఆసరా, ఓదార్పు, స్వస్థత, ధన్యతను అందిస్తూ వచ్చాయి. ఆ కీర్తనల్లోంచి కొన్నింటిని ఎంపికచేసి కిందటేడాది జయగీతాలు పేరిట మీతో పంచుకున్నాను. అయితే, ఆ తర్వాత ఆ కీర్తనల గురించి మరింత తెలుసుకునేకొద్దీ, వాటిని మరింత శ్రద్ధగా అధ్యయనం చేసినకొద్దీ మరెన్నో విశేషాలు, మరెంతో ఉత్తేజం నాకు లభిస్తూ ఉన్నది. అందుకని, గతంలో అందించిన జయగీతాలకు కొనసాగింపుగా మరికొన్ని భావనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
సువార్తలు మొదటిసారి ఎప్పుడు చదివానో గుర్తులేదుగాని, అవి చదివినప్పుడల్లా మనసుకి కలిగే స్వస్థతతో పాటు, ఓదార్పుతో పాటు, ధైర్యంతో పాటు, ఒక ఘట్టం మాత్రం మనసుని కలచివేస్తూ ఉండేది. ఏసును శిలువవేసినప్పుడు, ఆ అపరాహ్ణవేళ ఆయన శిలువమీద నిలబడి, ‘దేవా, దేవా నా చేతిని ఎందుకు విడిచావు’ అని అన్నాడని చదివినప్పుడల్లా నా మనసుకి చెప్పలేని ఆవేదన కలిగేది. ఇదేమిటిది, జీవితకాలంపాటు సర్వేశ్వరుడి వార్తాహరుడిగా ఈ లోకంలో సంచరించిన ఏసు, తనని తాను దైవకుమారుడిగా సంభావించుకున్న ప్రవక్త, తన చిట్టచివరి క్షణాల్లో ఇంత విహ్వలంగా ఆక్రోశించాడేమిటి అనిపించేది. సువార్తలు మొత్తం ఏసు ఏ భగవత్సందేశాన్ని వినిపిస్తో వచ్చాడో, ఆ సందేశానికీ, ఆ అచంచలమైన ఆ విశ్వాసానికీ, ఈ చివరి మాటలకీ పొసగదని అనిపించేది.
కాని ఆ చివరి మాటలు ఏసువి కావనీ, ‘ఏలీ ఏలీ లామా సబ్బాచేతానీ’ అనే ఆ అరమాయిక్ పదాలు పాతనిబంధనలోని కీర్తనల్లో 22 వ కీర్తనలోని ప్రథమ పంక్తి అని తెలిసినప్పుడు నాకు గొప్ప కుతూహలం కలిగింది. ఆ కీర్తన మొత్తం చదివాను.
ఆ కీర్తనలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగం 1 నుంచి 18 పంక్తులు ‘ దేవా దేవా నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు’ నుంచి ‘వాళ్ళు నా అంగీకోసం చీట్లు వేసుకుంటారు’ దాకా ఒక భాగం. అది గీతకారుడు దేవుడు తనని నిస్సహాయంగా వదిలిపెట్టేసాడనీ, తన శత్రువులు తనని చుట్టుముట్టారనీ, తన దేహాంగాల్ని చీల్చేస్తున్నారనీ, అయినా దేవుడు తన మొర ఆలకించలేదనీ మొరపెట్టుకోవడం. ఆ గీతకారుడు దావీదే అనుకుంటే ఆయన ఈ భాగం రాయడం ద్వారా తనకి ఇరవై ఎనిమిది తరాల తర్వాత తన వంశంలో ప్రభవించబోయే ఏసు అనుభవించబోయే శారీరిక చిత్రహింసను ముందే ఊహించి అభివర్ణించాడని చెప్పాలి.
కాని ఆ గీతం అక్కడితో పూర్తి కాలేదు. అక్కణ్ణుంచి మరొక పదమూడు పాదాల్లో గీతకారుడు దైవమహిమని ఉగ్గడిరచకుండా ఉండలేకపోయాడు. దైవరాజ్యం రాబోతున్నదనీ, నేల నాలుగు చెరగులా ఆయన మహిమాతిశయం ప్రకటించడం తథ్యమనీ ఎలుగెత్తి చాటకుండా ఉండలేకపోయాడు. అంతేకాదు, రాబోయే కాలంలో బీదసాదలకి అన్నం దొరుకుతుందనీ, వారికి తృప్తి కలుగుతుందనీ కూడా చాటిచెప్తున్నాడు.
ఈ స్తుతిగీతంలోని మొదటి భాగం నిజమైతే రెండో భాగం కూడా నిజం కాకతప్పదు. యేసు ఆ కల్వరి కొండ మీద ఆ అపరాహ్ణవేళ ఈ గీతంలోని మొదటి భాగం పూర్తిగా నిజం కావడం చూసాడు. ఎంత పూర్తిగా అంటే, చివరకి తన శత్రువులు చీట్లు వేసుకుని తన అంగీ పంచుకునేదాకా. కాబట్టి, గీతంలోని రెండో భాగం కూడా నిజమయ్యే తీరుతుందని ఆయనకి నమ్మకం కలిగిందని చెప్పడానికే ఆయన ఆ తన చివరిక్షణాల్లో ఈ స్తుతిగీతాన్ని స్మరించుకున్నాడు. స్తుతిగీతంలోని మొదటిపాదాన్ని స్మరించడమంటే మొత్తం స్తుతిగీతాన్ని స్మరణకు తెచ్చుకోవడమే కదా, మొత్తం కీర్తనలన్నిటినీ స్మరించుకోవడమే కదా, తన పూర్వప్రవక్తలు తరతరాలుగా ఉగ్గడిస్తున్న ఈశ్వం మహిమాతిశయాన్ని మరింత అచంచలంగా ఎలుగెత్తి చాటుకోవడమే కదా.
ఈ మార్పు ఈ గీతంలోని 21 వ వచనంలో నువ్వు నాకు బదులు పలికావు నుంచి మనకు కనిపిస్తుంది. దేవుడు, తన ప్రభువు తన మొరాలకిస్తున్నాడని నమ్మడమే కాదు, ఆయన తనకు జవాబిచ్చాడని కూడా కీర్తనకారుడు చెప్పడం గమనించాలి. ఈ మొత్తం కీర్తన చదవకుండా కేవలం ‘దేవా దేవా నా చేతిని ఎందుకు విడిచావు అనే మొదటివాక్యం దగ్గరే ఆగిపోయి అవే క్రీస్తు చివరి మాటలని అనుకోవడం కన్నా పొరపాటు మరొకటి ఉండదు. ఆ కీర్తనని క్రీస్తు స్మరిస్తున్నాడంటేనే ‘నువ్వు నాకు బదులు పలికావు ‘అని ఆ కొండకొమ్ముమీంచి సమస్తలోకానికీ ఆయన చాటుతున్నాడు. ఎంత గొప్ప వాక్యం! ఎంత కరుణామయ వాక్యం! ఎంత ధైర్యాన్ని, ఓదార్పునిచ్చేవాక్యమిది!
ఈ సంగతి బోధపడ్డాక నాకు పాతనిబంధనలోని ఈ కీర్తనల పట్ల గౌరవం మరింత ఇనుమడిరచింది. కీర్తనల్లోని స్థలకాల విశేషాల్ని పక్కన పెట్టి చదువుకున్నట్లయితే, ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ఈశ్వరభక్తుల ఆత్మగానమిలానే కదా ఉంటుందనిపించింది. నా పసితనంలో మా బామ్మగారు ఏ ముహూర్తాన పోతన భాగవత పద్యాలు నాకు వినిపించి కొన్నేనా నాతో కంఠస్థం చేయించారోగాని అప్పణ్ణుంచీ ఈశ్వరస్తుతి గీతాలు వినడమన్నా, మననం చేసుకోవడమన్నా నాకు ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. వేరే భాషల్లో ఈశ్వరభక్తులు గానం చేసిన స్తుతి గీతాల్ని తెలుగులో తిరిగి రాసుకుంటే అవి పూర్తిగా నా రక్తాస్థిగతం అయిపోయాయనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఈ గీతాల్ని కూడా ఇలా తెలుగు చేయడానికి పూనుకున్నాను.
నా దేవా! నా దేవా!
నా దేవా, నా దేవా, నన్నెందుకు వదిలిపెట్టేసావు?నన్ను రక్షించడానికి ఎందుకు వెనకాడుతున్నావు? ఎందుకు నా మొరాలకించడం లేదు నువ్వు?
నా దేవా, ప్రది దినమూ విలపిస్తున్నాను, కాని నువ్వు జవాబివ్వడం లేదు, ప్రతి రాత్రీ విలపిస్తున్నాను, కాని విశ్రాంతి దొరకడం లేదు.
అత్యంత పరిశుద్ధుడిగా అభిషిక్తమయినవాడివి నువ్వు. సమస్త ఇస్రాయేలు స్తుతిస్తున్నది నిన్నే. మా పూర్వీకులు నీలోనే నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టే నువ్వు వాళ్ళ చెరవిడిపించావు.
నీకే వాళ్ళు మొరపెట్టుకున్నారు, బయటపడ్డారు, నిన్నే నమ్మారు, అవమానాలు తప్పించుకున్నారు.
ఇక నేనంటావా? మనిషిని కాను, ఒక క్రిమిని, ప్రతి ఒక్కరూ నన్ను తిరస్కరించేవారే, ప్రజల నిర్లక్ష్యానికి గురైనవాణ్ణి.
నన్ను చూసేవాళ్లంతా ఎగతాళి చేసేవాళ్ళే. తలలు అడ్డంగా ఊపుతూ, నా మీద నిందలు కురిపించేవాళ్ళే.
‘ప్రభువుని నమ్ముకున్నాడు వాడు, మరి ఆ ప్రభువెలా రక్షిస్తాడో చూదాం అంటారు వాళ్ళు. ఆ ప్రభువునే కదా స్తుతిస్తాడు, ఆ ప్రభువే వచ్చి వాణ్ణి బయటపడేయాలి’ అని అంటారు.
నా తల్లిగర్భం నుండి నన్ను వెలికి తీసింది నువ్వే. నా తల్లి స్తన్యమిస్తున్నప్పుడే నువ్వు నన్ను పూర్తిగా నమ్మావు.
పుట్టుకతోనే నేను నీ పాలపడ్డాను. తల్లిగర్భంలో ఉన్నప్పణ్ణుంచే నువ్వు నా దేవుడివని అనుకున్నాను.
నా నుంచి దూరంగా జరక్కు. విపత్తు మీద మీదకొస్తున్నది, నాకు సాయం చెయ్యడానికెవరూ లేరు.
ఎన్నో వృషభాలు నన్ను చుట్టు ముట్టాయి, బుషాన్ నగరపు వృషభాలు నన్ను చుట్టుముట్టాయి. మీద పడి చీల్చి చెండాడడానికి సింహాలు గర్జిస్తూ నా మీద నోరు తెరిచాయి.
నేను నీరుకారిపోతున్నాను, నా ఎముకల కీళ్ళు సడలిపోయాయి. నా హృదయం మైనంగా మారిపోయింది, అది నాలోపల్లోపలనే కరిగిపోయింది.
నా నోరు కుండపెంకులాగా ఎండిపోయింది, నా నాలుక అంగిట్లోనే అతుక్కుపోయింది, నువ్వు నన్ను మృత్యుధూళిలో పడుకోబెట్టావు.
కుక్కలు నన్ను చుట్టు ముట్టాయి, క్రూరాత్ముల గుంపు నన్ను చుట్టుముట్టింది, వాళ్ళు నా చేతుల్నీ, పాదాల్నీ చీరేస్తున్నారు.
నా ఎముకలన్నీ బయటికొచ్చేసాయి, మనుషులు నన్ను ఆకలిగొన్న చూపుల్తో పరికిస్తున్నారు.
వాళ్ళు నా వస్త్రాల్ని తమలో తాము పంచుకుంటారు, నా అంగీ కోసం చీట్లు వేసుకుంటారు.
కాని, ప్రభూ, నువ్వు నాకు దూరం కాకు, నువ్వే నా బలం, నన్ను రక్షించడానికి త్వరపడు.
నన్ను కత్తివేటు నుంచి తప్పించు, నా విలువైన జీవితం కుక్కలపాలు కాకుండా చూడు.
నన్ను సింహాల నోటినుంచి రక్షించు, మదించిన వృషభాల కొమ్ముల నుంచి కాపాడు. నువ్వు నాకు బదులుపలికావు.
నీ పేరు నా ప్రజలందరికీ వినిపిస్తాను, సమస్త ప్రజాసభలోనూ నిన్ను స్తుతిస్తాను.
ప్రభువుకి భయపడేమీరంతా ఆయన గుణగానం చెయ్యండి. యాకోబు వారసులారా, ఆయన్ని సమ్మానించండి, ఇస్రాయేలీలురా, ఆయన ముందు మోకరిల్లండి.
కుంగిపోతున్న వాళ్ళదుఃఖాన్ని ఆయన ఎన్నడూ అపహాస్యం చేయలేదు, దుఃఖితుల్ని ఆయన ఎన్నడూ తక్కువచెయ్యలేదు. వ్యాకుల మానవుడినుంచి ఆయన తన ముఖం ఎన్నడూ చాటుచెయ్యలేదు, పైగా రక్షణకోరుతున్న అతడి మొరాలకిస్తోనే ఉన్నాడు.
మహాజనసభముందు నీ స్తుతిగీతాలు ఆలపించడానికి స్ఫూర్తి నీనించే నాకు లభిస్తున్నది, నీకు భయపడేవారిముందు నేను నా శపథాలు చెల్లించుకుంటాను.
బీదసాదలకి అన్నం దొరుకుతుంది, వారికి తృప్తి కలుగుతుంది. ప్రభువుని అన్వేషిస్తున్నవారంతా ఆయన్ను స్తుతించండి, మీ హృదయాల్లో ఆయన కలకాలం వర్ధిల్లు గాక!
నేల నాలుగు చెరగులూ ఆయన వైపు తిరుగుగాక! ఆయన్నే స్మరించుగాక! అన్ని జాతుల కుటుంబాలన్నీ ఆయన ముందు మోకరిల్లుగాక!
రాజ్యభారం ఆయనది, అన్ని జాతుల పరిపాలకుడూ ఆయనే.
భూమ్మీది సంపన్నులంతా ఆరాధనలూ, సమారాధనలూ నిర్వహింతురు గాక! తమ ఆయువుముగిసి ప్రాణాలు దుమ్ములో కలవబోయేవారు మొత్తం ఆయన ముందు మోకరిల్లుదురుగాక!
మన సంతతి ఆయన్ను సేవింతురు గాక! భవిష్య తరాలకు ఆయన గురించి వివరింతురు గాక!
రేపు పుట్టనున్నవారికోసం ఆయన సత్యసంధతను ప్రకటింతురుగాక! ఇదంతా ఆయన మహిమాతిశయమే అని ఉగ్గడింతురు గాక!
6-10-2024


తెలియని విషయం తెలియదని చెప్పుకోవడమంత సుఖం మరోటి ఉండదు. మన పురాణేతిహాసాల మీదనే సరియైన అవగాహన లేని నా వంటి వారికి ఇవి కొంచెం కొత్తే . చదవవలసిన సమయంలో కాలక్షేపాల కథలూ నవలలూ చదివి పడేసి, ఇప్పుడు ఇవి చదవలేక అవి చదవలేక సతమతమౌతున్న సమయంలో మీ నుండి ఎప్పటి కప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం తప్ప మరో దారి లేదు. క్రైస్తవం గురించి కానీ యూదుల మతం గురించి కానీ తెలియక పోవడం వల్ల లోతుగా తెలియకపోయినా మీ వివరణతో గీతం లేని ఆర్తి తెలుస్తున్నది. ఇతరమతాల ఆనుపానులు స్థూలంగానైనా మీనుంచి తెలుసుకునే అవకాశం వస్తే మరింత తృప్తి లభిస్తుంది . మీ అనువాదం గుండెను తాకేట్లుగా ఉంది.
ధన్యవాదాలు సార్!